
సాక్షి, కృష్ణాజిల్లా: ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో జనసేన నేతల కక్ష సాధింపు చర్యలకు దిగారు. వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులపై ఘంటసాల మండలం పార్టీ జనసేన అధ్యక్షుడు పవన్ కుమార్ దాష్టీకానికి పాల్పడ్డాడు. మహిళల పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన పవన్ కుమార్.. అధికారులను ఉపయోగించి వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుల దుకాణాలు తొలగించారు. సామాన్లు తీసుకుంటామన్నా వినకుండా జేసీబీలు తెచ్చి దుకాణాలను కూల్చివేయించారు. కరకట్ట రహదారికి ఆనుకుని దుకాణాలు ఏర్పాటు చేసుకుని ఎన్నో ఏళ్లుగా నిరుపేదలు జీవనం సాగిస్తున్నారు.

కేవలం వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులు అనే కారణంతో రెండు దుకాణాలను మాత్రమే తొలగించిన అధికారులు.. విలువైన సామాగ్రి ధ్వంసం చేశారు. దుకాణాలను కూల్చిన ప్రదేశాన్ని ఫెన్సింగ్ వేసి జనసేన నాయకులు ఆక్రమించుకున్నారు. జనసేన నాయకులపై బాధిత మహిళలు మండిపడ్డారు. ఐదేళ్లుగా ఇక్కడే పాక ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నామని.. డ్వాక్రా రుణాలతో చిరు వ్యాపారం చేసుకుంటున్నామని.. సామాన్లు తీసుకుంటామన్నా అధికారులు ఒప్పుకోలేదని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళలమని కూడా చూడకుండా మాపై జనసేన నాయకుడు పవన్ కుమార్ దౌర్జన్యం చేశారని.. కాళ్లమీద పడి వేడుకున్నా కనికరించలేదని బాధితులు వాపోయారు. లక్షల విలువైన మా సామాన్లను ధ్వంసం చేసేశారు. వైఎస్సార్‌సీపీ వాళ్లను బతకనివ్వమని బెదిరిస్తున్నారు. ఆడవాళ్ల మీదకు వెళ్లమని జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ చెబుతున్నాడా? అంటూ బాధిత మహిళలు ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment