Sympathizers
-
Lok Sabha Election 2024: కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతిపరులు
బస్తీ/శ్రావస్తి: కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతిపరులు అని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయంటూ ఆ రెండు పార్టీలు మన దేశాన్ని బెదిరింపులకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ నాయకుడు అఖిలేష్ యాదవ్ కలిసి ప్రచారం చేసి బొక్కబోర్లా పడ్డారని ఎద్దేవా చేశారు. ఆ ఇద్దరు యువరాజుల ఫ్లాప్ సినిమా రీరిలీజ్ అవుతుండడం ఆశ్చర్యంగా ఉందన్నారు. బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ, శ్రావస్తిలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలపై విరుచుకుపడ్డారు. ఒకప్పుడు ఉగ్రవాదంతో మనల్ని భయపెట్టాలని చూసిన పాకిస్తాన్ ఇప్పుడు తిండి లేక అల్లాడుతోందని చెప్పారు. పాకిస్తాన్ పని అయిపోయిందని తేల్చిచెప్పారు. అయినప్పటికీ పాకిస్తాన్ సానుభూతిపరులైన కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు మనల్ని బెదిరించడంలో బిజీగా ఉన్నాయని ధ్వజమెత్తారు. పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉంటే, ఇండియాలో 56 అంగుళాల ఛాతీ ఉందని వ్యాఖ్యానించారు. పొరుగు దేశాలను చూసి బెదిరిపోవడానికి ఇక్కడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని, బలమైన మోదీ ప్రభుత్వమని స్పష్టంచేశారు. -
తిత్లీ పరిహారాన్ని గెద్దల్లా తన్నుకుపోయారు..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రెండేళ్ల క్రితం.. సరిగ్గా ఇదే రోజు. తిత్లీ తుఫాన్ జిల్లాలో విరుచుకుపడింది. మరో కోనసీమగా పిలిచే ఉద్దానంలో విధ్వంసం సృష్టించింది. భీకర గాలుల బీభత్సానికి పచ్చటి ఉద్దానం కకావికలమైంది. కొబ్బరి, జీడి రైతుల జీవితకాలపు కష్టాన్ని క్షణాల్లో ధ్వంసం చేసేసింది. టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల స్వరూపమే మార్చేసింది. తుఫాన్ విధ్వంసంతో రైతు కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. టీడీపీ నేతలకు మా త్రం తుఫాన్ కాసులు కురిపించింది. తిత్లీ తుఫాన్‌తో రైతులు రోడ్డు పాలు కాగా, టీడీపీ నేతలు ధనవంతులయ్యారు. బాధితుల ముసుగులో తుఫాన్ పరిహారమంతా తమ ఖాతాల్లో వేసుకున్నా రు. అండగా నిలవాల్సిన అప్పటి అధికార పార్టీ నేతలు.. రైతులకు అందాల్సిన నష్టపరిహారాన్ని గెద్దల్లా తన్నుకుపోయారు. నాడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కింజరాపు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్‌లు దగ్గరుండి అక్రమాల తంతునడిపారు. అనర్హులకు పెద్ద ఎత్తున పరిహారం కట్టబెట్టారు. తుఫాన్లో నష్టపోని వారి ఖాతాలకు లక్షలు జమ చేయించారు. వాస్తవంగా నష్టపోయిన వారికి మొండిచేయి చూపారు. నాడు లెక్క తేల్చిన నష్ట పరిహారం జాబితాలో 60 శాతం వరకు అనర్హులే ఉన్నారని అక్కడి వర్గాలు చెబుతున్నాయి. కోట్లాది రూపాయలు టీడీపీ నేతల జేబుల్లోకి వేశారు. వాస్తవానికైతే 52,164మంది కొబ్బరి రైతులు, 78,108 మంది జీడి రైతులు తిత్లీ బీభత్సానికి నష్టపోయినట్టుగా పరిహారం జాబితాల్లో చూపించారు. ఎన్నికలకు ముందు దాదాపు రూ.307 కోట్లు వరకు పరిహారం కింద అందించినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఈ లెక్కన అనర్హులకు ఎన్ని కోట్లు వెళ్లాయో అక్రమార్కులకే తెలియాలి. విచిత్రమేమిటంటే ఎన్నికలకు ముందు రోజుల్లో ఒక్క ఇచ్ఛాపురం నియోజకవర్గంలోనే రూ.50 కోట్ల వరకు అనుయాయుల ఖాతాల్లో వేశారు. అప్పట్లో ఇది ఎన్నికల ఫలితాల్లో తీవ్ర ప్రభావం చూపింది. పరిహారం.. పరిహాసం ♦భూముల్లేని టీడీపీ సానుభూతిపరులకు భూములున్నట్టుగా చూపించారు. తక్కువ భూమి ఉన్న టీడీపీ శ్రేణులకు ఎక్కువ భూమి ఉన్నట్టుగా నమోదు చేయించారు. ♦ పల్లం భూమిని మెట్ట భూమిగా నమోదు చేసి, పంచాయతీకి చెందని వ్యక్తులను స్థానికంగా చూపించి పరిహారం జాబితాలు సిద్ధం చేశారు. ♦ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని డమ్మీగా మార్చేశారు. ♦ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్ కుటుంబీకులు, బంధువులను సైతం నష్టపోయినట్టు పరిహారం జాబితాలో చేర్చినట్టుగా అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చాయి. ♦ పి.బంగారమ్మ, డి.వల్లభరావు, బి.సంహిత, డి.గీత తదితర వేలాది పేర్లతో తుఫాన్ పరిహారాన్ని స్వాహా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ♦ వైఎస్సార్సీపీ సానుభూతి పరులుగా ఉన్న కొంతమంది వాస్తవంగా నష్టపోయినప్పటికీ పరిహారం జాబితాలో వారి పేర్లను చేర్చలేదు. ♦ రాజకీయ కక్షతో పరిహారానికి దూరం చేశారు. కొందరికైతే జాబితాల్లో నష్టపోయినట్టుగా చూపించి కూడా పరిహారం ఇవ్వలేదు. పరిహారం వచ్చేసరికి వారి పేర్లు గల్లంతయ్యాయి. క్షేత్ర స్థాయిలో ఇదీ పరిస్థితి... అక్రమాల తంతుపై ఎన్నో ఫిర్యాదులు వెళ్లాయి. కలెక్టర్ జె.నివాస్ సైతం విచారణకు ఆదేశించారు. గ్రామసభలు పెట్టి వారు అర్హులా?అనర్హులా? తెలుసుకుని పరిహారం పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కానీ క్షేత్రస్థాయి అధికారులు అక్కడున్న అనర్హుల గుట్టు రట్టు తేల్చడం లేదు. ఏదో ఒకటి చెప్పి నాన్చుతూనే ఉన్నారు. తూతూమంత్రంగా గ్రామసభలు పెట్టి చేతులు దులుపుకున్నారు. ఈ క్రమంలో కొందరు అనర్హులను తమ రికార్డులను మారి్పంచుకున్నారు. వారసత్వంగా వచ్చే భూములను తమ రికార్డుల్లో చేరి్పంచుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రికార్డులు మారిపోయాయి. పెండింగ్‌లో పెంచిన పరిహారం... తిత్లీ బాధితుల నష్టాలను కళ్లారా చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రలో చలించిపోయారు. అధికారంలోకి రాగానే పరిహారం పెంచుతానని ప్రకటించారు. హామీ ఇచ్చినట్టుగానే అధికారంలోకి వచ్చాక పరిహారం పెంచారు. ఒక్కొక్క కొబ్బరి చెట్టుకు రూ.1500 నుంచి రూ.3వేలకు, జీడి తోట హెక్టార్‌కు రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పరిహారం పెంచడమే కాకుండా నిధులు కూడా విడుదల చేశా రు. ఈ లెక్కన దాదాపు రూ.290కోట్ల వరకు అదనంగా వచ్చినట్టు అయింది. ఇంతవరకు బాగానే ఉన్నా పరిహారం పంపిణీకొచ్చేసరికి చిక్కుముడి నెలకొంది. పాత జాబితా ప్రకారంగా పంపిణీ చేస్తే ఇది కూడా అనర్హుల జాబితాలోకి వెళ్లిపోతుందని ఫిర్యాదులు రావడంతో అధికారులు ఆగారు. -
పక్కా స్కెచ్‌తో.. సినీ ఫక్కీలో దాడి
సాక్షి, పమిడిముక్కల (పామర్రు): మేమంతా తెలుగుదేశం పార్టీలో ఉన్నాం.. మీరు వైఎస్సార్ సీపీలో చేరతారా అంటూ వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై రాళ్లు, కర్రలతో దాడిచేశారు. ఈ ఘటన తాడంకి గ్రామంలో జరిగింది. ఏం జరిగిందంటే .. మండలంలోని తాడంకి గ్రామంలో ఒక బుక్‌కీపర్ పోస్టు ఖాళీగా ఉంది. ఈ పోస్టును తనకు ఇవ్వాల్సిందిగా తాడంకి రెడ్డిపాలెంకు చెందిన పేద బీసీ మహిళ కాగితాల విజయ దరఖాస్తు చేసుకుంది. లాక్‌డౌన్‌కు పూర్వమే అధికారులు విజయను బుక్‌కీపర్‌గా నియమించారు. అయితే వెంటనే లాక్డౌన్ అమలులోకి రావడంతో సమావేశం నిర్వహించి అధికారికంగా ప్రకటించలేదు. బుక్‌కీపర్ పనులు వెలుగు సీసీ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ప్రభుత్వ పథకాలు మహిళలకు సమర్థంగా అందించేందుకు బుక్‌కీపర్‌ను నియమించి చర్యలు చేపట్టాలన్న ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ సూచనలతో వెలుగు అధికారులు ఈనెల 2వ తేదీన సమావేశం ఏర్పాటుచేశారు. సమావేశం నిర్వహణకు ముందుగానే ఈ నియామకాన్ని అడ్డుకోవాలనే భావనతో ఉన్న టీడీపీ నాయకులు రగడ మొదలెట్టారు. బీసీ కులానికి చెందిన తూర్పుల వద్దకు వెళ్లి పనులు చేయించుకునేది ఏంటంటూ ప్రచారం లేపి కులాల మధ్య చిచ్చు రాజేశారు. టీడీపీ నాయకుడు జక్కా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళల ఇళ్లకు వెళ్లి సంతకాల సేకరణ చేపట్టారు. 2వ తేదీన సమావేశం జరపనున్న అంగన్వాడీ కేంద్రం వద్దకు వచ్చి ప్రభుత్వ అధికారిక సమావేశానికి అడ్డుతగిలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌లపై దూషణలకు దిగారు. వైఎస్సార్ సీపీ నాయకులు టీడీపీ నాయకులను నిలువరించే యత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను అక్కడి నుంచి పంపివేశారు. దీంతో సమావేశం వాయిదా పడింది. అనుకూల వర్గాన్ని రెచ్చగొట్టి బంధువర్గంతోనే.. సమావేశం వాయిదా పడటంతో టీడీపీ వారు అనుకున్న పని నెరవేరలేదు. ఈనెల 4న రెడ్డిపాలెంలో తమ అనుకూల వర్గాన్ని రెచ్చగొట్టి బంధువర్గంతోనే విజయ కుటుంబంపై దాడికి తెగబడ్డారు. భవనం పై అంతస్తులో నివాసం ఉంటున్న విజయ, ఆమె భర్త పరమేశ్వరరావుతో విజయ మరిది వీరమహేష్ మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో విజయ తోటికోడలు కాగితాల రామలక్ష్మి, బంధువులు నీలాపు సంతోష్, నీలాపు కొండ, నీలాపు సూర్యకుమారిలు ఒక్కసారిగా విజయ, పరమేశ్వరరావులపై దాడి చేశారు. భవనం పై నుంచి రోడ్డుపైకి లాక్కొచ్చి రక్తం వచ్చేలా కర్రలు, రాళ్లతో చితకబాదారు. మేమంతా టీడీపీలో ఉంటే మీరు వైఎస్సార్ సీపీలోకి వెళ్లి తమ నాయకుడు జక్కా శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా పనిచేస్తారా? అంటూ విజయ, ఆమె భర్త పరమేశ్వరరావు, కుమారుడు అఖిల్, అత్త నర్సాయమ్మను కొట్టారు. తీవ్రంగా దూషించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ సత్యనారాయణ పోలీసు సిబ్బందిని పంపటంతో ఆ కుటుంబం పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాయపడ్డ విజయ కుటుంబాన్ని మెరుగైన వైద్యం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే కైలే పరామర్శ బాధిత కుటుంబానికి పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ ఫోన్లో పరామర్శించారు. వైఎస్సార్ సీపీ మండల కార్యదర్శి మారపాక మహేష్, ఎస్సీ విభాగం అధ్యక్షుడు పాతూరి చంద్రపాల్, బీసీ విభాగం నాయకులు కంభపు రాంబాబు, వైఎస్సార్ సీపీ నాయకులు బొర్రా చినబాబు, కూచిపూడి వెంకటేశ్వరరావు, నారగాని ప్రసాద్, కొల్లి రాములు మద్దతుగా నిలిచి న్యాయం చేయాలని పోలీసులను కోరారు. దాడికి పాల్పడిన రామలక్ష్మి, సంతోష్‌కుమార్, కొండబాబు, సూర్యకుమారి, జక్కా శ్రీనివాసరావులపై కేసు నమోదు చేశారు. -
ఇక లక్ష్యం సొంత గడ్డే!
సాక్షి నాలెడ్జ్ సెంటర్: దాదాపు తుడిచిపెట్టే దశకు చేరుకున్న ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్)తో కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాక్‌లో తమ ప్రధానకేంద్రం మోసుల్‌ను చేజార్చుకోవడం, తాజాగా సిరియాలోని రఖాలో ఓటమి అంచుల్లో నిలవడంతోనే ఐసిస్ కథ ముగిసిందని భావించే పరిస్థితి లేదు. ఐసిస్ తరఫున ఇరాక్, సిరియా, ఆఫ్గానిస్తాన్‌లలో పోరాడేందుకు వెళ్లిన వివిధ దేశాల్లోని సానుభూతిపరులు తమ దేశాలకు మరలడం మొదలుపెట్టారు. ఇక తమ యుద్ధాన్ని సొంత గడ్డపైనే కొనసాగించేందుకు తిరిగి వెళ్లాలంటూ వారిని ఐసిస్ ఆదేశించినట్లు వార్తలొచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సైద్ధాంతికంగా ఐసిస్ భావజాలంతో పాటు ఉగ్రశిక్షణ పొందిన వీరి వల్ల భారత్‌లోనూ దాడులు జరిగే ప్రమాదం పొంచి ఉందని నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి. కేరళ నుంచి ఐసిస్ సానుభూతిపరులను రిక్రూట్ చేస్తున్న ‘హమ్సా తాలిబన్’ హమ్జా థలసెర్రీ, ఉగ్రమూకలతో సంబంధాలున్న మహ్మద్ మనాఫ్‌ను గురువారం కేరళలోని కన్నూరులో పోలీసులు అరెస్ట్‌చేశారు. ఐసిస్ సానుభూతిపరులన్న అనుమానంతో బుధవారం అదే రాష్ట్రంలో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికలకు ముందు దాడులకు ప్రణాళికలు రచిస్తున్నారన్న ఆరోపణలతో గుజరాత్లో మరో ఇద్దరిని అరెస్ట్‌చేశారు. ఐసిస్ కోసం పనిచేసి తిరిగొస్తున్న సానుభూతిపరులపై పర్యవేక్షణ ఉండాలని ఇంటెలిజెన్స్బ్యూరో హెచ్చరిస్తోంది. విమానాశ్ర యాలు, పోర్టులతో పాటు సరిహద్దులపై గట్టి నిఘా ఉంచాలని సూచించింది. విదేశాల నుంచి నిధులు.... గతంలో తాలిబన్ నాయకుడికి వంటవాడిగా పనిచేసిన హమ్జా తరువాత ఐసిస్ వైపు ఆకర్షితుడయ్యాడు. అతను 40 మంది యువకులను ఐసిస్ కోసం నియమించుకుని సిరియా, యెమెన్, ఆఫ్గానిస్తాన్‌లకు పంపినట్లు తెలిసింది. సౌదీ అరేబియా, ఒమన్‌ల నుంచి నిధులు అందుతున్నట్లు పోలీసుల విచారణలో హమ్జా వెల్లడించాడు. హమ్జా భారత్‌కు తిరిగి వచ్చాక నిఘా సంస్థలు అతనిపై అయిదు నెలల పాటు నిఘా ఉంచి పట్టుకున్నాయి. రెండు పాస్‌పోర్టులు కలిగి ఉండటంతో పాటు, వివిధ దేశాలు చుట్టి వచ్చిన హమ్జా.. కేరళతో పాటు పశ్చిమ ఆసియా దేశాల నుంచి పలువురిని ఐసిస్ కోసం నియమించుకున్నట్లు భావిస్తున్నారు. దక్షిణాదిలో ఆపరేషన్ ? కేరళలో పట్టుబడినవారిని విచారిస్తున్న సందర్భంగా దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రసిద్ధ ప్రదేశాలు, ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్రణాళికలను రచిస్తున్నట్లు బయటపడింది. పేలుడు పదార్థాల సేకరణలో నిమగ్నమైనట్లు బుధవారం పట్టుకున్న ముగ్గురు వెల్లడించినట్లు పోలీసువర్గాలు వెల్లడించాయి. ఈ ముగ్గురు సిరియాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడటంతో టర్కీ అధికారులు భారత్‌కు పంపారు. ఎవరెవరు విదేశాలకు వెళుతున్నారు, వారక్కడ ఏమి చేస్తున్నారు, తిరిగి వచ్చాక ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే దానిపై పోలీసుల వద్ద సమాచారం కొరవడింది. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్న అమెరికా, బ్రిటన్,ఫ్రాన్స్, టర్కీ,యూఏఈ, ఇరాన్, సౌదీలతో కలసి పనిచేస్తూ, ఆయా దేశాల నుంచి భారత్ వస్తున్న అనుమానితుల వివరాలను సేకరించాల్సి ఉంది. -
మావోయిస్టు సానుభూతిపరుల అరెస్టు
మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై పోలీసులు ఆదివారం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యక్తులు విజయనగరం జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్న బోయినపల్లి గ్రామానికి చెందిన వారు. దీంతో గ్రామస్తులు విషయాన్ని మీడియా ప్రతినిధులకు తెలిపారు. కాగా.. గ్రామస్తులను అరెస్టు చేసిన విషయాన్ని పోలీసులు దృవీకరించడం లేదు. -
వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై టీడీపీ దాడి
వేటకొడవళ్లు, గొడ్డళ్లతో వెంటాడిన వైనం పొన్నూరు: పాతకక్షల నేపథ్యంలో చర్చలకు పిలిచి నిరాయుధులైన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులపై పాతకక్షల నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. వేటకొడవళ్లు, గొడ్డళ్లు, కర్రలతో వెంటాడారు. ఈ సంఘటనలో వైఎస్సాఆర్సీపీ సానుభూతిపరులు ఐదుగురికి తలలు పగలగా, మరికొందరికి గాయాలయ్యాయి. బాధితుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని బ్రాహ్మణకోడూరు గ్రామంలో టీడీపీ కార్యకర్తలు, వైఎస్సాఆర్సీపీ సానుభూతిపరుల మధ్య గత కొంత కాలంగా చిన్నచిన్న ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో గ్రామంలో శాంతిభద్రతలు నెలకొల్పాలని, ఈ మేరకు చర్చలకు రావాలని తెదేపా వర్గీయులు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులను ఆహ్వానించారు. తక్కువ కుటుంబాలు ఉన్న వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు సమస్యలను పరిష్కరించుకునేందుకు ఆదివారం చర్చలకు వెళ్లారు. చర్చలు ప్రారంభం కాకముందే టీడీపీకి చెందిన కూరపాటి శ్యామ్ తాను గతంలోనే హత్యలు చేశానని, పోలీసులు, జైళ్లు కొత్తేమీ కాదనీ, ఒక్కొక్కరిని లేపేస్తానంటూ రెచ్చగొట్టడంతో పాటు దాడికి దిగాడు. వ్యూహత్మకంగా జరిగిన ఈ దాడిలో టీడీపీ కార్యకర్తలు కూరపాటి పిచ్చయ్య, కూరపాటి సురేష్, కూరపాటి చిన్నబాబు, కూరపాటి నాగశేషు, కూరపాటి జయరాజు, కూరపాటి అశోక్‌రాజు, శ్రీరాం సుశీలరావు వేటకొడవళ్లు, గొడ్డళ్లు, కర్రలతో వెంటాడారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మన్నవ నాగార్జునను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మన్నవ నరసింహారావు, మన్నవ ఆదాం, దగ్గుమల్లి సుబ్బారావు, కనపర్తి సుబ్బారావుల తలలు పగిలాయి. దగ్గుమల్లి స్టాలిన్, జయదేవ్, సొంగా రాజు, ఉర్రా సుబ్బయ్య తదితరులకు స్వల్ప గాయాలైయ్యాయి. వీరందరూ నిడుబ్రోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యానగర్: టీడీపీ నాయకుల దాడిలో ఆదివారం తీవ్రంగా గాయపడిన వైఎస్సార్సీపీ సానుభూతిపరునికి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. బ్రాహ్మణకోడూరు గ్రామానికి చెందిన మన్నవ నాగార్జున ఆటో డ్రైవర్‌గా పనిచేసుకుని జీవిస్తుంటాడు. తెదేపా కార్యకర్తలు శ్యామ్, మరో నలుగురు తనపై ఇనుపరాడ్డులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని బాధితుడు చెప్పాడు. ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు బాధితుడిని పరీక్షించారు. పరిస్థితి విషమంగా ఉందనీ, అత్యావసర చికిత్సా విభాగంలో చికిత్సనందిస్తున్నామని అన్నారు. 24 గంటలు గడిస్తేగానీ ఏ విషయం చెప్పలేమని తెలిపారు. సంఘటనపై కేసు నమోదు చేసి సంబంధిత స్టేషన్‌కు తరలించనున్నామని ఔట్ పోష్టు సిబ్బంది తెలిపారు.