తిత్లీ పరిహారాన్ని గెద్దల్లా తన్నుకుపోయారు.. | Corruption Of TDP Sympathizers In Titli Cyclone compensation | Sakshi
Sakshi News home page

అంతులేని అవినీ‘తిత్లీ’ 

Published Sun, Oct 11 2020 10:34 AM | Last Updated on Sun, Oct 11 2020 10:34 AM

Corruption Of TDP Sympathizers In Titli Cyclone compensation - Sakshi

విలయం మిగిల్చిన విషాదానికి ఆనవాళ్లు ఈ చిత్రాలు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:  రెండేళ్ల క్రితం.. సరిగ్గా ఇదే రోజు. తిత్లీ తుఫాన్‌ జిల్లాలో విరుచుకుపడింది. మరో కోనసీమగా పిలిచే ఉద్దానంలో విధ్వంసం సృష్టించింది. భీకర గాలుల బీభత్సానికి పచ్చటి ఉద్దానం కకావికలమైంది. కొబ్బరి, జీడి రైతుల జీవితకాలపు కష్టాన్ని క్షణాల్లో ధ్వంసం చేసేసింది. టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల స్వరూపమే మార్చేసింది. తుఫాన్‌ విధ్వంసంతో రైతు కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. టీడీపీ నేతలకు మా త్రం తుఫాన్‌ కాసులు కురిపించింది. తిత్లీ తుఫాన్‌తో రైతులు రోడ్డు పాలు కాగా, టీడీపీ నేతలు ధనవంతులయ్యారు. బాధితుల ముసుగులో తుఫాన్‌ పరిహారమంతా తమ ఖాతాల్లో వేసుకున్నా రు. అండగా నిలవాల్సిన అప్పటి అధికార పార్టీ నేతలు.. రైతులకు అందాల్సిన నష్టపరిహారాన్ని గెద్దల్లా తన్నుకుపోయారు. 

నాడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కింజరాపు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్‌లు దగ్గరుండి అక్రమాల తంతునడిపారు. అనర్హులకు పెద్ద ఎత్తున పరిహారం కట్టబెట్టారు. తుఫాన్‌లో నష్టపోని వారి ఖాతాలకు లక్షలు జమ చేయించారు. వాస్తవంగా నష్టపోయిన వారికి మొండిచేయి చూపారు. నాడు లెక్క తేల్చిన నష్ట పరిహారం జాబితాలో 60 శాతం వరకు అనర్హులే ఉన్నారని అక్కడి వర్గాలు చెబుతున్నాయి. కోట్లాది రూపాయలు టీడీపీ నేతల జేబుల్లోకి వేశారు. వాస్తవానికైతే 52,164మంది కొబ్బరి రైతులు, 78,108 మంది జీడి రైతులు తిత్లీ బీభత్సానికి నష్టపోయినట్టుగా పరిహారం జాబితాల్లో చూపించారు. ఎన్నికలకు ముందు దాదాపు రూ.307 కోట్లు వరకు పరిహారం కింద అందించినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఈ లెక్కన అనర్హులకు ఎన్ని కోట్లు వెళ్లాయో అక్రమార్కులకే తెలియాలి. విచిత్రమేమిటంటే ఎన్నికలకు ముందు రోజుల్లో ఒక్క ఇచ్ఛాపురం నియోజకవర్గంలోనే రూ.50 కోట్ల వరకు అనుయాయుల ఖాతాల్లో వేశారు. అప్పట్లో ఇది ఎన్నికల ఫలితాల్లో తీవ్ర ప్రభావం చూపింది.  

పరిహారం.. పరిహాసం 
 ♦భూముల్లేని టీడీపీ సానుభూతిపరులకు భూములున్నట్టుగా చూపించారు. తక్కువ భూమి ఉన్న టీడీపీ శ్రేణులకు ఎక్కువ భూమి ఉన్నట్టుగా నమోదు చేయించారు.  
 పల్లం భూమిని మెట్ట భూమిగా నమోదు చేసి, పంచాయతీకి చెందని వ్యక్తులను స్థానికంగా చూపించి పరిహారం జాబితాలు సిద్ధం చేశారు.   
  అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని డమ్మీగా మార్చేశారు.  
  ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్‌ కుటుంబీకులు, బంధువులను సైతం నష్టపోయినట్టు పరిహారం జాబితాలో చేర్చినట్టుగా అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చాయి.  
  పి.బంగారమ్మ, డి.వల్లభరావు, బి.సంహిత, డి.గీత తదితర వేలాది పేర్లతో తుఫాన్‌ పరిహారాన్ని స్వాహా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.  
  వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులుగా ఉన్న కొంతమంది వాస్తవంగా నష్టపోయినప్పటికీ పరిహారం జాబితాలో వారి పేర్లను చేర్చలేదు.  
  రాజకీయ కక్షతో పరిహారానికి దూరం చేశారు. కొందరికైతే జాబితాల్లో నష్టపోయినట్టుగా చూపించి కూడా పరిహారం ఇవ్వలేదు. పరిహారం వచ్చేసరికి వారి పేర్లు గల్లంతయ్యాయి.  

క్షేత్ర స్థాయిలో ఇదీ పరిస్థితి...  
అక్రమాల తంతుపై ఎన్నో ఫిర్యాదులు వెళ్లాయి. కలెక్టర్‌ జె.నివాస్‌ సైతం విచారణకు ఆదేశించారు. గ్రామసభలు పెట్టి వారు అర్హులా?అనర్హులా? తెలుసుకుని పరిహారం పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కానీ క్షేత్రస్థాయి అధికారులు అక్కడున్న అనర్హుల గుట్టు రట్టు తేల్చడం లేదు. ఏదో ఒకటి చెప్పి నాన్చుతూనే ఉన్నారు. తూతూమంత్రంగా గ్రామసభలు పెట్టి చేతులు దులుపుకున్నారు. ఈ క్రమంలో కొందరు అనర్హులను తమ రికార్డులను మారి్పంచుకున్నారు. వారసత్వంగా వచ్చే భూములను తమ రికార్డుల్లో చేరి్పంచుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రికార్డులు మారిపోయాయి.    

పెండింగ్‌లో పెంచిన పరిహారం...  
తిత్లీ బాధితుల నష్టాలను కళ్లారా చూసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో చలించిపోయారు. అధికారంలోకి రాగానే పరిహారం పెంచుతానని ప్రకటించారు. హామీ ఇచ్చినట్టుగానే అధికారంలోకి వచ్చాక పరిహారం పెంచారు. ఒక్కొక్క కొబ్బరి చెట్టుకు రూ.1500 నుంచి రూ.3వేలకు, జీడి తోట హెక్టార్‌కు రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పరిహారం పెంచడమే కాకుండా నిధులు కూడా విడుదల చేశా రు. ఈ లెక్కన దాదాపు రూ.290కోట్ల వరకు అదనంగా వచ్చినట్టు అయింది. ఇంతవరకు బాగానే ఉన్నా పరిహారం పంపిణీకొచ్చేసరికి చిక్కుముడి నెలకొంది. పాత జాబితా ప్రకారంగా పంపిణీ చేస్తే ఇది కూడా అనర్హుల జాబితాలోకి వెళ్లిపోతుందని ఫిర్యాదులు రావడంతో అధికారులు ఆగారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement