టీడీపీ నేతల జేబుల్లోకే ‘సంపద’  | TDP Leaders Irregularities In Srikakulam District | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల జేబుల్లోకే ‘సంపద’ 

Published Sun, Dec 22 2019 8:59 AM | Last Updated on Sun, Dec 22 2019 1:27 PM

TDP Leaders Irregularities In Srikakulam District - Sakshi

అరసవల్లి రోడ్డులో నిరుపయోగంగా సంపద సృష్టి కేంద్రం

అరసవల్లి: ఒకరు మంత్రి అచ్చెన్న అనుచరుడు.. మరొకరు టీడీపీ మద్దతుదారైన ఓ సర్పంచ్‌ భర్త.. ఇంకొకరు జిల్లా కేంద్రంలో ఎంపీ రామ్మోహన్‌ నాయుడి అనుచరుడు.. ఇలా అన్ని చోట్ల నాటి అధికార టీడీపీ ఎమ్మెల్యేల బినామీదారులు నామినేషన్‌ విధానంలో ‘చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల‘ను చేజిక్కించుకున్నారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌ నిధులతో ఇష్టానుసారంగా చెత్త నుంచి సంపద ఉత్పత్తి చేసే షెడ్లు నిర్మించి... దిష్టిబొమ్మల్లా వదిలేశారు. దీంతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా చేశారు. ఇప్పుడు ఈ అక్రమాల నిగ్గు తేల్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ విషయం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జిల్లాలో దాదాపుగా సంపద సృష్టి కేంద్రాలన్నీ టీడీపీ నేతలే నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుని, ఎంచక్కా నిధులను బొక్కేశారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఒక్కో కేంద్రం నుంచి లక్షల్లో దోచుకున్నట్లు తెలుస్తోంది. బడా నేతల ప్రోత్సాహంతో కొన్ని చోట్ల నిర్మించకుండానే నిధులు మింగేసిన ఘటనలున్నాయి. ఈలెక్కన జిల్లాలో సుమారు 8 కోట్ల వరకు నిధులు తెలుగు తమ్ముళ్ల జేబుల్లోకి వెళ్లిపోయినట్లు స్పష్టమవుతోంది.

జిల్లాలో పరిస్థితి ఇదీ.. 
స్వచ్ఛభారత్‌ మిషన్‌ ద్వారా ‘చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల’ను జిల్లాలోని 1024 పంచాయతీల్లో నిర్మించాలని ప్రతిపాదించగా, వీటిలో 1013 కేంద్రాలను ఉన్నతాధికారులు మంజూరు చేశారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం 40.89 కోట్ల వరకు నిధులు మంజూరు చేసింది. ఇందులో కేవలం 575 కేంద్రాలు నిర్మాణాలు పూర్తి చేసుకోగా, 371 కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. మిగిలిన చోట్ల స్థల సమస్యలతో కొన్ని, రాజకీయ  కారణాలతో మరికొన్ని ఇప్పటికీ నిర్మాణాలకు నోచుకోలేదు. ఈ పథకంలో భాగంగా వర్మీ కంపోస్ట్‌ తయారు చేసే కుండీలు, చెత్తను వేరు చేసి వేసేందుకు నాడెప్‌లు ఉంటాయి.

2 వేల కంటే తక్కువ జనాభా ఉండే పంచాయతీల్లో 20 అడుగుల వెడల్పు, 30 అడుగులు పొడవుతో షెడ్, 6 వర్మీ కంపోస్టు కుండీలు నిర్మించడానికి సుమారు రూ.3 లక్షల నిధులు కేటాయించారు. అలాగే 2 వేల నుంచి 5 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీ కేంద్రాల్లో 20 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవుతో షెడ్, 12 వర్మీ కంపోస్టు కుండీలు నిర్మించడానికి రూ.4.30 లక్షలు కేటాయించారు.  5వేల కంటే అధిక జనాభా ఉన్న ప్రాంతాల్లో 40 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవుతో షెడ్, 24 వర్మీ కంపోస్టు కుండీలను నిర్మించేందుకు రూ.7.50 లక్షలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. వీటితో పాటు నాడెప్‌ల నిర్మాణాలకు అంచనాలను వేరుగా నిర్ణయించి నిర్మాణాలు చేపట్టారు.

అక్రమ లెక్కలు తేల్చనున్న కేంద్రం..! 
కేంద్ర నిధులతో జిల్లాలో మొత్తం 1013 కేంద్రాలను నిర్మించేందుకు జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. నామినేషన్‌ విధానం ద్వారా గత ప్రభుత్వంలో టీడీపీ నేతలకు కట్టబెట్టారు. దీంతో పలు చోట్ల నిర్మాణాలు చేపట్టకుండా నిధులను బొక్కేస్తే.. చాలా చోట్ల నాణ్యతకు దూరంగా నిర్మాణాలు చేపట్టారు. అయితే జిల్లాకు మోడల్‌గా ఉండేందుకు పోలాకి, పొగిరి, లావేరు, జి.సిగడాం తదితర చోట్ల మాత్రం పూర్తి స్థాయిలో నిర్మాణాలు జరిపించి, గ్రీనరీ కలరింగ్‌ ఇచ్చారు. ఇక గ్రీన్‌ అంబాసిడర్లు అంటూ చెత్తను సేకరించి, ఆయా కేంద్రాలకు తరలించేందుకు నియామకాలను చేపట్టారు. ఈమేరకు గ్రీన్‌ అంబాసిడర్‌ అనే ఉద్యోగాన్ని సృష్టించారు. ప్రతి రోజూ వీరు గ్రామాల్లో చెత్తను సేకరించి, తడి, పొడి చెత్తలను వేర్వేరుగా ఈ కేంద్రాలకు తరలించడం వీరి విధి. ఇందుకోసం వీరికి నెలకు రూ.6 వేలు జీతంగా కేటాయించారు. అయితే జిల్లాలో ఏ ఒక్క గ్రామంలోనూ గ్రీన్‌ అంబాసిడర్‌లను నియమించలేదు.

నామ్‌కే వాస్తేలా కొన్ని పంచాయతీల్లోనూ, మేజర్‌ పట్టణాల్లో ఉన్న పారిశుద్ధ్య  కార్మికులను ఈ ఉద్యోగులుగానే చూపిస్తూ నెట్టుకొచ్చారు. మొత్తం జిల్లాలో 1013 గ్రీన్‌ అంబాసిడర్లకు ప్రతి నెల రూ.60.78 లక్షలు వరకు జీతాలుగా ఇచ్చేందుకు నిధులను కేటాయించారు. ఈ గ్రీన్‌ అంబాసిడర్ల పేరు చెప్పి కూడా జీతాలను కూడా స్థానికంగా ఉన్న టీడీపీ నేతలే మింగేసారని కథనాలు విన్పిస్తున్నాయి. అలాగే ఈ కేంద్రాలకు వాచ్‌మన్లుగా కూడా కొందరిని నియమించినట్లు చూపించి వారి జీతాలను కూడా మింగేశారని ఆరోపణలున్నాయి. క్షేత్ర స్థాయిలో ఈ అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఉపాధి నిధులతో స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద చేడట్టిన నిర్మాణాల్లో అక్రమాలకు పాల్పడిన స్థానిక నేతలపై విచారణ చేపట్టాలంటూ గ్రామాల్లో ప్రజలంతా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కేంద్రం విచారిస్తే కోట్లాది రూపాయల అక్రమాలు బయటపడే అవకాశముంది. 

నిధులు తినేశారు.. షెడ్డు వదిలేశారు 
చెత్త నుంచి సంపద ఉత్పత్తి చేయడం కాదు.. షెడ్లు వేసి నిధులు తినేశారు. ఎంపీ రామ్మోహన్‌ నాయుడి అనుచరుడొకరు కేంద్ర ప్రభుత్వ నిధులతో రోడ్లు మీద రోడ్లు వేశాడు. షెడ్లు వేసి నిధులు తినేశారు. దీనిపై విచారణ చేస్తే ఇంకా అక్రమాలు బయటపడతాయి. 
– గొలివి వెంకటరమణ, కాజీపేట (అరసవల్లి) 

అందుబాటులోకి తెచ్చే యత్నం 
జిల్లాలో 1013 పంచాయతీల్లో స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద జాతీయ ఉపాధి హామీ నిధులతో షెడ్లు నిర్మించారు. చాలా చోట్ల ఇవి నిరుపయోగంగా ఉన్న మాట వాస్తవమే. అయితే వీటిని త్వరలో వినియోగంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తాం. అప్పటి ప్రభుత్వం ఆదేశాల మేరకు పంచాయతీ పెద్దలు ఈ నిర్మాణాలు చేశారు. ఇంకా కొందరికి బిల్లులు అందలేదని నా దృష్టికి వచ్చింది. 
– వి.రవికుమార్, జిల్లా పంచాయతీ అధికారి 

నాటి సర్పంచ్‌ భర్తే నిర్మించాడు 
నాటి మంత్రి అచ్చెన్నాయుడు హవాతో టెక్కలి సర్పంచ్‌ భర్త కాళీ బెహ రా ఈ షెడ్డును నిర్మించాడు. అంతా హడావుడి చేసి.. చెత్త షెడ్‌ అంటూ నిధులను మింగేశారు. అచ్చెన్న అనుచరుడు కావడంతో నాణ్యత లేని పనులైనప్పటికీ అధికారులు ఏమీ చేయలేదు. రూ.7.50 లక్షలతో ఈ షెడ్డు వేసినట్లు చెప్పినా సగం కూడా ఖర్చు పెట్టలేదు. ఇలాగే నియోజకవర్గంలో చాలా షెడ్లు నిరుపయోగంగా ఉన్నాయి.  
– బెండి గౌరీపతి, టెక్కలి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement