వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై టీడీపీ దాడి
వేటకొడవళ్లు, గొడ్డళ్లతో వెంటాడిన వైనం
పొన్నూరు: పాతకక్షల నేపథ్యంలో చర్చలకు పిలిచి నిరాయుధులైన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులపై పాతకక్షల నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. వేటకొడవళ్లు, గొడ్డళ్లు, కర్రలతో వెంటాడారు. ఈ సంఘటనలో వైఎస్సాఆర్‌సీపీ సానుభూతిపరులు ఐదుగురికి తలలు పగలగా, మరికొందరికి గాయాలయ్యాయి. బాధితుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని బ్రాహ్మణకోడూరు గ్రామంలో టీడీపీ కార్యకర్తలు, వైఎస్సాఆర్‌సీపీ సానుభూతిపరుల మధ్య గత కొంత కాలంగా చిన్నచిన్న ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో గ్రామంలో శాంతిభద్రతలు నెలకొల్పాలని, ఈ మేరకు చర్చలకు రావాలని తెదేపా వర్గీయులు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులను ఆహ్వానించారు.
తక్కువ కుటుంబాలు ఉన్న వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు సమస్యలను పరిష్కరించుకునేందుకు ఆదివారం చర్చలకు వెళ్లారు. చర్చలు ప్రారంభం కాకముందే టీడీపీకి చెందిన కూరపాటి శ్యామ్ తాను గతంలోనే హత్యలు చేశానని, పోలీసులు, జైళ్లు కొత్తేమీ కాదనీ, ఒక్కొక్కరిని లేపేస్తానంటూ రెచ్చగొట్టడంతో పాటు దాడికి దిగాడు. వ్యూహత్మకంగా జరిగిన ఈ దాడిలో టీడీపీ కార్యకర్తలు కూరపాటి పిచ్చయ్య, కూరపాటి సురేష్, కూరపాటి చిన్నబాబు, కూరపాటి నాగశేషు, కూరపాటి జయరాజు, కూరపాటి అశోక్‌రాజు, శ్రీరాం సుశీలరావు వేటకొడవళ్లు, గొడ్డళ్లు, కర్రలతో వెంటాడారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మన్నవ నాగార్జునను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మన్నవ నరసింహారావు, మన్నవ ఆదాం, దగ్గుమల్లి సుబ్బారావు, కనపర్తి సుబ్బారావుల తలలు పగిలాయి. దగ్గుమల్లి స్టాలిన్, జయదేవ్, సొంగా రాజు, ఉర్రా సుబ్బయ్య తదితరులకు స్వల్ప గాయాలైయ్యాయి. వీరందరూ నిడుబ్రోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
విద్యానగర్: టీడీపీ నాయకుల దాడిలో ఆదివారం తీవ్రంగా గాయపడిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరునికి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. బ్రాహ్మణకోడూరు గ్రామానికి చెందిన మన్నవ నాగార్జున ఆటో డ్రైవర్‌గా పనిచేసుకుని జీవిస్తుంటాడు. తెదేపా కార్యకర్తలు శ్యామ్, మరో నలుగురు తనపై ఇనుపరాడ్డులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని బాధితుడు చెప్పాడు. ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు బాధితుడిని పరీక్షించారు. పరిస్థితి విషమంగా ఉందనీ, అత్యావసర చికిత్సా విభాగంలో చికిత్సనందిస్తున్నామని అన్నారు. 24 గంటలు గడిస్తేగానీ ఏ విషయం చెప్పలేమని తెలిపారు. సంఘటనపై కేసు నమోదు చేసి సంబంధిత స్టేషన్‌కు తరలించనున్నామని ఔట్ పోష్టు సిబ్బంది తెలిపారు.