మాట తప్పిన మోదీ.. మోసగాడు చంద్రబాబు | YSR Congress Party leaders fires on CM Chandrababu | Sakshi
Sakshi News home page

మాట తప్పిన మోదీ.. మోసగాడు చంద్రబాబు

Published Fri, Aug 10 2018 2:35 AM | Last Updated on Mon, Aug 20 2018 6:10 PM

YSR Congress Party leaders fires on CM Chandrababu - Sakshi

గురువారం గుంటూరులో జరిగిన వంచనపై గర్జన దీక్షలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నేతలు.

‘వంచనపై గర్జన’ప్రాంగణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రజల న్యాయమైన హక్కు అయిన ప్రత్యేక హోదాను సాధించి తీరుతాం. ఈ పోరాటంలో ఎన్ని సవాళ్లనైనా ఎదుర్కోవడానికి మా పార్టీ, మేము సిద్ధంగా ఉన్నాం. హోదా కోసం మా పార్టీ లోక్‌సభ సభ్యులు పదవీ త్యాగం చేసి చరిత్రలో నిలిచి పోయారు. అవసరమైతే మరిన్ని త్యాగాలకూ మేం వెనుకాడం. ప్రత్యేక హోదాను సాధించుకుని, రాష్ట్రంలోని యువకులు, నిరుద్యోగుల భవితను కాపాడుకోవడమే మా ముందున్న కర్తవ్యం’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నినదించారు. పౌరుషాల పురిటిగడ్డ అయిన గుంటూరు నగరంలో గురువారం జరిగిన ‘వంచనపై గర్జన’ ఒక రోజు నిరాహార దీక్షలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు.

ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైఫల్యం, రాష్ట్రం పట్ల నరేంద్ర మోదీ ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వీఏఆర్‌ గార్డెన్స్‌లో నాలుగో విడత వంచనపై గర్జన కార్యక్రమం జరిగింది. ఈ గర్జనకు జిల్లా నలుమూలల నుంచి భారీగా జనం తరలివచ్చారు. పార్టీ నేతల ఆవేశపూరిత ప్రసంగాలతో ఈ దీక్ష ఆద్యంతమూ ఉత్తేజ భరిత వాతావారణంలో సాగింది. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌ దారుణంగా నష్టపోతున్న తీరును, నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసి ఏనాడూ హోదా, విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకుండా సీఎం చంద్రబాబు చేసిన మోసాన్ని, పూటకో మాట మాట్లాడే ఆయన నైజాన్ని, ప్రధాని నరేంద్ర మోదీ మాట తప్పిన తీరునూ పార్టీ నేతలు తమ ప్రసంగాల్లో ఎండగడుతున్నపుడు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతించారు. గుంటూరు పార్టీ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు రావి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ గర్జనలో ప్రసంగించిన వక్తలు విభజన తరువాత అన్ని విధాలా నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత అవసరమో వివరించారు. ఉదయం 9 గంటలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలతో నివాళులర్పించడంతో ప్రారంభమైన కార్యక్రమం సాయంత్రం 4.30 గంటలకు విజయవంతంగా ముగిసింది.

చంద్రబాబు పెద్ద మాయావి
బంగారంలాంటి రాష్ట్రాన్ని అన్యాయంగా అడ్డగోలుగా విభజించి కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేస్తే.. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హోదా హామీని అమలు చేయకుండా బీజేపీ నేడు విద్రోహానికి పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ నేతలు దుయ్యబట్టారు. నాలుగేళ్లుగా ఏ హామీ నెరవేర్చకపోయినా బీజేపీతో స్నేహం చేసిన చంద్రబాబు.. నేడు విభజన ద్వారా రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్‌తో స్నేహం కోసం అర్రులు చాస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అంతటి పచ్చి అవకాశవాది రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఉండరని, ఆయన ఓ పెద్ద మాయావి అని నేతలన్నప్పుడు దీక్షా స్థలిలో హర్షధ్వానాలు చెలరేగాయి.
 
అన్యాయమంతా చేసి ధర్మపోరాటమా!
హోదా విషయంలో అన్యాయమంతా చేసేసి.. ఇప్పుడు ధర్మపోరాట దీక్షలంటూ చంద్రబాబు బయలు దేరారని, ఆయన ఓ పెద్ద మోసగాడని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు తానేమి చెబితే అది నమ్ముతారని చంద్రబాబు భావిస్తున్నారని, కానీ ఆయనకు ప్రజలు గుణపాఠం చెప్పే రోజు ఎంతో దూరంలో లేదని హెచ్చరించారు. బీజేపీకి ద్రోహం చేసినందుకు చంద్రబాబుపై మోదీకి కోపం ఉంటే.. ఆయనపై చూపించుకోవాలే తప్ప రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయరాదని, హోదా హామీని అమలు చేయాలని పలువురు నేతలు డిమాండ్‌ చేశారు. తిరుపతి వెంకన్న సాక్షిగా మోదీ ఇచ్చిన మాట తప్పకూడదన్నారు. కాగా, గుంటూరులో జరిగిన గర్జన కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఈ ఏడాది మార్చి–ఏప్రిల్‌ నెలల్లో గుంటూరు జిల్లాలో జరిగిన జగన్‌ ప్రజాసంకల్ప యాత్రతో పార్టీ శ్రేణుల్లో మంచి కదలిక తెచ్చిన దరిమిలా పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్న ఈ గర్జన కార్యక్రమం మరింత ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ శాసనసభాపక్షం ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పీఏసీ మెంబర్‌ ఘట్టమనేని ఆదిశేషగిరిరావులతోపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పదవులు వదులుకున్న మాజీ ఎంపీలు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు, రాష్ట్రంలోని శాసనసభ, లోక్‌సభ పార్టీ సమన్వయకర్తలు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. 

హోదాపై జగన్‌ది ఎప్పుడూ ఒకే మాట
ప్రత్యేక హోదా సాధనపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తొలి నుంచీ ఒకే మాటపై నిలబడ్డారని వక్తలు గుర్తు చేశారు. హోదా వస్తే రాష్ట్రం ఎలా సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందో, వందలాది పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చి లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు ఎలా లభిస్తాయో అనేక సందర్భాల్లో ఆయన విడమర్చి చెప్పారని పేర్కొన్నారు. హోదా కన్నా ప్యాకేజీయే ఉత్తమమని స్వాగతించడమే కాక ఎక్కువ ప్రయోజనాలు వస్తాయని చెప్పుకున్న చంద్రబాబు.. బీజేపీతో సంబంధాలు తెగదెంపులు చేసుకున్న తరువాత ‘యూటర్న్‌’ తీసుకున్నారని వక్తలు దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా ఊసెత్తడమే పాపం అన్నట్లుగా చంద్రబాబు ఉక్కు పాదంతో ఉద్యమాలను అణచి వేయాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు, విద్యార్థులు, యువకులపై అక్రమ కేసులు పెట్టించారని మండిపడ్డారు. నేడు ప్రత్యేక హోదా కావాలంటూ తానే యూటర్న్‌ తీసుకున్నపుడు ఉద్యమ కేసులను ఎందుకు ఎత్తి వేయలేదని నాయకులు సూటిగా ప్రశ్నించారు. కేంద్రం జీఎస్టీ విధానం అమలులోకి తెచ్చినపుడు, పెద్ద నోట్ల రద్దు చేసినపుడు ఆ సలహాలు తానే ఇచ్చానని గొప్పలు చెప్పుకుని.. తీరా వాటి అమలులో దుష్ఫలితాలు వచ్చిన తరువాత విమర్శించిన ఆపర మేధావి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యక్తి తాను అనుభవజ్ఞుడనని చెప్పుకోవడమే సిగ్గు చేటని, నలభై ఏళ్ల అనుభవం ఎందులో వచ్చిందో జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

యూటర్న్‌ తీసుకున్నందుకు ఏ కేసు పెట్టాలి..
ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తూ యువభేరీలు జరిపితే మద్ధతు తెలిపిన విద్యార్థులపై పీడీ కేసులు పెడతానని తల్లిదండ్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు బెదిరించారు. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్న ఆయనపై ఎలాంటి కేసు పెట్టాలి? రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు, 2014 ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచార సభల్లో ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చకుండా 5 కోట్ల మందిæ రాష్ట్ర ప్రజలను ప్రధాని మోదీ, చంద్రబాబు వంచించారు. విభజన సమయంలో పార్లమెంటు సాక్షిగా మాజీ ప్రధాని మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని చెప్పారు. ఆ సమయంలో బీజేపీ ఎంపీగా ఉన్న వెంకయ్యనాయుడు 10ఏళ్లు హోదా కావాలంటే.. ఆ తర్వాత తిరుపతి సభలో చంద్రబాబు 15 ఏళ్లు కావాలని కోరారు. అలాంటి వ్యక్తి అర్ధరాత్రి జైట్లీ ప్యాకేజీ ప్రకటిస్తే స్వీకరించారు. అంతే కాకుండా ఆయనకు సన్మానాలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన వంచనపై రాష్ట్ర ప్రజానీకం గర్జిస్తోంది. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి.    
    – ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, శాసనమండలి ప్రతిపక్ష నేత

ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు తెస్తున్నారు..
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు కొనుగోలు చేశారు. పార్లమెంటు నేతగా ఫిరాయింపుల నిరోధక చట్టంలోని అవకతవకలను సరిదిద్దమని పలుమార్లు ప్రధాని మోదీని నేను కోరాను. అయినా ఆయన స్పందించలేదు. చంద్రబాబు, ప్రధాని మోదీలు ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు తెస్తున్నారు. విభజన సమయంలో ఏపీ నష్టపోయింది. ఆ నష్టాన్ని పూడ్చడంలో భాగంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చి దాన్ని పూర్తి చేయడం, విశాఖ రైల్వే జోన్, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్‌ ప్లాంట్‌ వంటి ముఖ్యమైన అంశాలు ఏపీకి చేకూర్చాలని చట్టంలో ఉంది. విభజన జరిగి నాలుగేళ్లు అవుతున్నా వాటిని కేటాయించలేదు. దోచుకోవడానికే చంద్రబాబు పోలవరం బాధ్యతలు తీసుకున్నారు. కేంద్రంలో నాలుగేళ్లు నాలుగేళ్లు భాగస్వామిగా ఉండి కూడా వాగ్ధానాలను నెరవేర్చలేకపోయారు. అలాంటి వ్యక్తికి ప్రజలకు ముందుకు వచ్చి ఓట్లు అడిగే అర్హత లేదు.
    – మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ

ఆ మూడు పార్టీలూ మోసం చేశాయి.. 
రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్‌ ఎంత మోసం చేసిందో, అప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బీజేపీ అంతే మోసం చేసింది. అందుకు నిరసనగానే వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ నిర్ణయం మేరకు రాజ్యసభలో జరిగిన డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా ఎన్నికలను బహిష్కరించాం. నాలుగేళ్లుగా మాయమాటలు చెబుతూ.. హామీల సాధనకు కృషి చేయకుండా టీడీపీ దగా చేసింది. విభజన చట్టంలోని అంశాల సాధన కోసం ప్ర«ధాన ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీ గత నాలుగేళ్లుగా పోరాటం చేస్తోంది. ఎన్డీయే ప్రభుత్వంపై మొదటిసారిగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీదే. అయితే ఆ తీర్మానాన్ని చర్చకు రానివ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పైరవీలు చేశాయి. ఆ తర్వాత వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఐదుగురు ఎంపీలం రాజీనామాలు చేశాం. ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నాం. అప్పుడే వైఎస్సార్‌సీపీ ఎంపీలతో కలిసి టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి దీక్షకు కూర్చుని ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉండేది.    
– వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్‌ సీపీ మాజీ ఎంపీ

బాబు ఇంటి పేరు మోసం, గోత్రం ద్రోహం...
600 అబద్ధపు హామీలను ఇచ్చి ఒక్కదానిని కూడా నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజల జీవితాలను సీఎం చంద్రబాబు చిన్నాభిన్నం చేశారు. చంద్రబాబు కుల దైవం వంచన, గోత్రం ద్రోహం, ఇంటి పేరు మోసం. ప్రజలను మనుషులుగా కాకుండా కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా ఆయన చూస్తున్నారు. ఎన్నికల ముందర హోదా కావాలని కోరిన చంద్రబాబు.. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన మోదీకి అభినందనలు తెలిపిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఎలా మరచిపోతారు. ప్రజాభిమానం వైఎస్సార్‌సీపీకి వస్తుందని గ్రహించిన చంద్రబాబు మళ్లీ యూటర్న్‌ తీసుకున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై «నిరసిస్తూ ధర్మ పోరాటం చేస్తున్న వైఎస్‌ జగన్‌కు రాష్ట్ర ప్రజల ఆశీస్సులు నిండుగా వుండాయి.    
    – భూమన కరుణాకర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత

త్యాగం చేశానన్న తృప్తి జీవితాంతం ఉంటుంది..
ప్రత్యేక హోదా సాధన, 5 కోట్ల మంది ప్రజల కోసం ఎంపీ పదవికి రాజీనామా చేశానన్న తృప్తి నాకు జీవితాంతం ఉంటుంది. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేని అసమర్థుడు చంద్రబాబు. బడుగు బలహీన వర్గాలు, బీసీ, దళితులు అంటే ఆయనకు ఏమాత్రం గౌరవం లేదు. ఏపీని నంబర్‌–1 చేస్తానని చెప్పి నాలుగేళ్లలో అవినీతిలో నెంబర్‌–1 చేశారు. రెండు ఎకరాల నుంచి దేశంలోనే అత్యంత ధనవంతునిగా నిలిచిన ఘనత చంద్రబాబుకే దక్కింది.
    – వెలగపూడి వరప్రసాద్, వైఎస్సార్‌ సీపీ మాజీ ఎంపీ

టీడీపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదు..
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల సాధన విషయంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదు. విభజన చట్టంలోని అంశాల గురించి వారు ఎంత అపహాస్యంగా మాట్లాడుకున్నారో సోషల్‌ మీడియా వేదికగా ప్రజలందరూ చూశారు. టీడీపీ కార్యకర్త నుంచి నాయకుల వరకూ ప్రతి ఒక్కరూ జన్మభూమి కమిటీల పేరుతో సంక్షేమ పథకాలకు రేట్లు పెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు. నాలుగేళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం గ్రామదర్శిని, ధర్మ పోరాట దీక్షల పేరుతో చంద్రబాబు మోసపూరిత కార్యక్రమాలు చేపడుతున్నారు.
    – వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ

హోదా ఉద్యమాన్ని సజీవంగా ఉంచిన జగన్‌
నాలుగేళ్లుగా పోరాటాలు చేస్తూ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సజీవంగా ఉంచారు. హోదా వల్ల ఉపయోగం లేదంటూ రకరకాలుగా మాటలు మార్చి ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన చంద్రబాబును.. హోదా స్టాండ్‌ తీసుకునేలా వైఎస్సార్‌సీపీ చేసింది. హోదా కోసం తృణప్రాయంగా ఎంపీ పదవులకు రాజీనామా చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు ఏం సాధించారంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు.. మరి రాజీనామాలు చేయకుండా పార్లమెంటులో ఉండి టీడీపీ ఎంపీలు ఏం సాధించారో ఆయన సమాధానం చెప్పాలి.
    – అంబటి రాంబాబు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 

జగన్‌ చెప్పిందే.. గల్లా పార్లమెంటులో చెప్పారు
హోదా వల్ల పారిశ్రామిక రాయితీలు వస్తాయని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ చెబుతుంటే.. ముఖ్యమంత్రి విమర్శిస్తూ వచ్చారు. హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలు పెట్టి రాయితీలు పొందుతున్న గల్లా జయదేవ్, సుజనా చౌదరి వంటి వారిని అడిగి చంద్రబాబు తెలుసుకోవాలి. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని చెప్పలేదనే విషయాన్ని మూడేళ్ల కిందటే అసెంబ్లీ సాక్షిగా జగన్‌ వివరించారు. అదే విషయాన్ని మొన్న పార్లమెంటులో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ ఇంగ్లీషులో చెప్పారు.    
    – కొలుసు పార్థసారథి, మాజీ మంత్రి

స్వార్థం కోసం చంద్రబాబు లాలూచీ
స్వార్థ రాజకీయాల కోసం ఎవ్వరితోనైనా లాలూచీపడే వ్యక్తి చంద్రబాబు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఐదుగురు వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామా చేసి ప్రజల మధ్యకు వస్తే దానిని కూడా వక్రబుద్ధితో చూసే చంద్రబాబుకు ప్రజలు తొందరలోనే గుణపాఠం చెబుతారు. విభజనతో కాంగ్రెస్, ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ దారుణంగా మోసం చేస్తే జనసేన అధినేత పవన్‌ వారికి వంతపాడారు. 2019 ఎన్నికల కోసం చంద్రబాబు కొత్త నాటకం మొదలెట్టి మళ్లీ మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే పిల్లల భవిష్యత్తు అంధకారమైపోతుంది.
    – వాసిరెడ్డి పద్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి

టీడీపీ తెలుగు ప్రజల ద్రోహుల పార్టీ 
టీడీపీ అంటే.. తెలుగు ప్రజల ద్రోహుల పార్టీ. ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పలు మార్లు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టారు. విభజన హామీల అమలు కోసం వైఎస్సార్‌సీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామా చేసి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడారు. టీడీపీ ఎంపీలకు రాజీనామా చేసే దమ్ము, ధైర్యం లేదు. చంద్రబాబు పచ్చి దగాకోరు రాజకీయాలు నడుపుతున్నారు.
    – రెహమాన్, మాజీ ఎమ్మెల్సీ 

హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టిన చంద్రబాబు
చంద్రబాబు జీవితమంతా మోసమే. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారు. ఓటుకు కోట్లు కుమ్మరించి అడ్డంగా బుక్కయ్యారు. ఇప్పుడు ప్రత్యేక హోదాను కేంద్ర కాళ్ల వద్ద తాకట్టు పెట్టి కపటనాటకాలు ఆడుతున్నారు. ఆయన రాష్ట్రానికి పట్టిన శనిలా ప్రజలు భావిస్తున్నారు. త్వరలోనే ప్రజలు శనిని సాగనంపుతారు.
– మేరుగ నాగార్జున, వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు

కులాల మధ్య చంద్రబాబు చిచ్చు
40సంవత్సరాల అనుభవమని రాష్ట్రాన్ని చంద్రబాబు నిలువునా ముంచాడు. కులాల మధ్య చిచ్చుపెట్టి ఆమంటతో చలికాచుకునే ఆయన.. కాపు రిజర్వేషన్‌ విషయంలో జగన్‌ అన్న మాటలు వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసి చేతులు కాల్చుకున్నాడు. జగన్‌ ప్రజల తరఫున పోరాటం చేస్తుంటే, చంద్రబాబు పదవి కోసం ఆరాటపడుతున్నాడు. టీడీపీ ఇస్తామన్న ఎంపీ పదవికి ఆశపడి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం జగన్‌పై విమర్శలు చేయడం మానుకోవాలి. నిత్యం ప్రజల కోసం పరితపించే జగన్‌ను ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.
    – పృధ్వీరాజ్, సినీ నటుడు

బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అవమానాలు
అనైతిక పాలనతో రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు అవమానాలు మిగిల్చిన వ్యక్తిగా చంద్రబాబు చరిత్రలో మిగిలిపోతాడు. రాష్ట్ర విభజన తరువాత ప్రతీ ఒక్కరూ హోదా కావాలని ఆశిస్తుంటే ప్యాకేజీలు కావాలంటూ రాష్ట్ర అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు దెబ్బతీశాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలన్నా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీనవర్గాలకు సరైన న్యాయం జరగాలన్నా వైఎస్‌ జగన్‌తోనే సాధ్యపడుతుందని ప్రజలు ప్రగాఢంగా విశ్వశిస్తున్నారు.
–  జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్‌సీపీ బీసి సంక్షేమ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement