త్యాగం తప్పట..వంచనే ఒప్పట!! | CM Chandrababu Comments on YSR Congress Party MPs Sacrifice | Sakshi
Sakshi News home page

త్యాగం తప్పట..వంచనే ఒప్పట!!

Published Tue, Jul 17 2018 3:08 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

CM Chandrababu Comments on YSR Congress Party MPs Sacrifice - Sakshi

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా అలుపెరగని పోరాటాన్ని కొనసాగిస్తున్న వైఎస్సార్‌సీపీని, మరో ఏడాది పదవీ కాలాన్ని సైతం తృణప్రాయంగా త్యజించిన పార్టీ ఎంపీల త్యాగాన్నీ విమర్శిస్తూ బురద జల్లడానికి ప్రయత్నిస్తున్న టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరును అన్ని వర్గాలు తప్పుపడుతున్నాయి. నాలుగేళ్ల పాటు కేంద్రంలో బీజేపీ సర్కారుతో అంటకాగి పదవులను అనుభవించిన టీడీపీ ఓవైపు వారితో లోపాయికారీగా సంబంధాలను కొనసాగిస్తూ మరోవైపు కొత్త రాజకీయ బంధుత్వాల కోసం అర్రులు చాస్తూ కేంద్రంపై తామే పోరాటం చేయబోతున్నట్లు బిల్డప్‌లు ఇవ్వడం పట్ల రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ లోక్‌సభ సభ్యులు రాజీనామా చేయడమే తప్పు అన్నట్లు, తాజా పరిస్థితుల్లో బీజేపీకి పరోక్షంగా సహకరించడానికే వారు రాజీనామాలు చేశారని చంద్రబాబు నిందలు ఆపాదించడం పట్ల ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారు. 

హోదా ఉద్యమంపై బాబు ఉక్కుపాదం
ఎన్డీఏ ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నామని, ఇప్పుడు వైఎస్సార్‌ సీపీ ఎంపీలు కూడా లోక్‌సభలో ఉండి ఉంటే ప్రయోజనం ఉండేదని చంద్రబాబు, ఆయన కోటరీ కొత్త పల్లవి అందుకుంది. కానీ గత పార్లమెంటు సమావేశాల్లోనే వైఎస్సార్‌సీపీ ఎంపీలు సభ జరిగినన్ని రోజులూ ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. ప్రత్యేక హోదా కోసం చర్చ జరగాలని తీవ్రస్థాయిలో పట్టుపట్టారు. తాము చివరి రోజువరకు ప్రయత్నిస్తామని, అప్పటికీ కేంద్రం తమ డిమాండ్‌కు అంగీకరించకపోతే రాజీనామాలు చేస్తామని ముందుగానే ప్రకటించిన ఎంపీలు ఏప్రిల్‌ 6వ తేదీన ఎంపీ పదవులను త్యాగం చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంత గట్టిగా కట్టుబడి ఉందో స్పష్టం చేశారు.

రాష్ట్ర హితాన్ని కోరే అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు కూడా వారిని అభినందిస్తూ టీడీపీ ఎంపీల రాజీనామాల కోసం  డిమాండ్‌ చేశాయి. తమతో పాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి దేశవ్యాప్తంగా అందరి మద్దతు కూడగట్టడానికి వీలవుతుందని వైఎస్సార్‌ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదేపదే సూచించినా అధికార పార్టీ చెవికెక్కించుకోలేదు. అదే సమయంలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని, డిమాండ్లను నీరుగార్చే ప్రయత్నాలను చంద్రబాబు సర్కారు ఎప్పటికప్పుడు చేస్తూనే వచ్చింది.

ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా? అది ఉన్న రాష్ట్రాలు ఏమైనా బాగుపడ్డాయా? అలాంటివి ఉంటే చూపించండి అని ఎద్దేవా చేయడంతో పాటు కమీషన్ల కోసం ప్రత్యేక ప్యాకేజి ఉత్తమమంటూ దాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించిన రోజే అర్ధరాత్రి అప్పటికప్పుడు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేసి చంద్రబాబు శ్లాఘించారు. జాతీయ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు పనులను చేజిక్కించుకోవడం ద్వారా  పెద్ద ఎత్తున కమీషన్లను మింగేయడానికి ప్రత్యేక హోదాకు పాతరేశారనే విమర్శలను చంద్రబాబు మూటకట్టుకున్నారు. ఓటుకు కోట్లు కేసు నుంచి  తప్పించుకోవడానికి కూడా ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమయ్యాయి.

అంతా కలిసి రాజీనామాలు చేసి ఉంటే కేంద్రంపై ఒత్తిడి
యూటర్న్‌లు తీసుకోవడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన చంద్రబాబునాయుడు ఇవాళ వైఎస్సార్‌ సీపీ ఎంపీల త్యాగాన్ని తక్కువచేసి మాట్లాడుతుండటం పట్ల రాజకీయ వర్గాలు నవ్వుకుంటున్నాయి. రాష్ట్రానికి చెందిన ఎంపీలు అందరూ కలిసికట్టుగా రాజీనామాలు చేస్తే తప్పకుండా ప్రయోజనం ఉంటుందని, కేంద్రంపై ఒత్తిడి అనివార్యంగా పెరుగుతుందని ప్రతిపక్ష నేత జగన్‌ పదే పదే సూచించినా చంద్రబాబు ఆలకించలేదు. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనాలకన్నా తన స్వప్రయోజనాలే మిన్నగా వ్యవహరిస్తున్న విషయం తేటతెల్లం కావడం, అన్నివైపుల నుంచి విమర్శలు పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు.

అయినప్పటికీ ఆ తరువాత కూడా ప్రత్యేక ప్యాకేజీ నిధులు రాష్ట్రానికి ఇచ్చే విషయంలో ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్‌ కమిషనర్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం గమనార్హం. మరోవైపు బీజేపీతో బం«ధాన్ని పునరుద్ధరించుకునేందుకు టీటీడీ బోర్డు సభ్యతాన్ని మహారాష్ట్ర ఆర్థికమంత్రి భార్య సప్న మునగంటివార్‌కు ఇవ్వడం, ఇటీవల పోలవరం సందర్శనకు వచ్చిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కారీతో సన్నిహితంగా మసలుకోవడం, నీతి ఆయోగ్‌ సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ ఎదుల వంగిపోయి వినయంగా వందనం చేయడం చంద్రబాబు తీరును తేటతెల్లం చేస్తోందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.

కాంగ్రెస్‌తో కుమ్మక్కు రాజకీయాలు
మరోవైపు పూర్వం నుంచే కాంగ్రెస్‌తో తనకు ఉన్న రాజకీయ చెలిమిని బలోపేతం చేసుకునే ప్రయత్నాల్లో చంద్రబాబు తలమునకలయ్యారని చెప్పేందుకు ఇటీవల పరిణామాలే నిదర్శనాలని విశ్లేషకులు అంటున్నారు. కర్నాటక సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరైన సమయంలో రాహుల్‌గాంధీతో వేదికపై చనువుగా వ్యవహరించిన చంద్రబాబు దాన్ని పటిష్ట పరుచుకునే ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే రాహుల్‌గాంధీతో సన్నిహితంగా వ్యవహరించే రాష్ట్రానికి చెందిన మాజీ ఐఎఎస్‌ అధికారి కొప్పుల రాజు ఓ  ప్రముఖ పత్రికాధిపతిని ఇటీవల కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొప్పుల రాజు చంద్రబాబుకు సన్నిహితుడనే గుర్తింపు ఉన్నతాధికార వర్గాల్లో ఉంది.

ఇంకోవైపు తన అప్రకటిత స్నేహితుడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి పునరాగమనం చేయించడంలోనూ చంద్రబాబు ఎత్తుగడ ఉందనే చర్చ జరుగుతోంది. కొద్ది నెలల కిందట కిరణ్‌ సొంత తమ్ముడిని టీడీపీలో చేర్చుకోవడం గమనార్హం. రానున్న రోజుల్లో పొత్తులు అనివార్యమని తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు తాజాగా వ్యాఖ్యానించడం కూడా కాంగ్రెస్‌తో దోస్తీ ఖాయమనే అంశాన్ని తెలియచేస్తోంది. వీటన్నింటి నేపథ్యంలోనే వైఎస్సార్‌ సీపీ ఎంపీలు రాజీనామా చేయడం తప్పు అన్నట్లుగా కాంగ్రెస్‌ నేతలు కూడా చంద్రబాబు పల్లవినే అందుకోవడం తాజా రాజకీయ ఎత్తుగడలను సూచిస్తోందని పేర్కొంటున్నారు. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా టీడీపీ వైఖరి ఎలా ఉండాలనే అంశంపై సూచనలు చేసేందుకు సోమవారం రాత్రి చంద్రబాబును కలిసినట్లు చెబుతున్న మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగిన ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వైఎస్సార్‌ సీపీ లోక్‌సభ సభ్యులు రాజీనామా చేయకపోయి ఉంటే బాగుండేదని తనదైన శైలిలో ముక్తాయించడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement