అవిశ్వాసంలోనూ అదే బంధం | Lok Sabha Speaker given Permission to the TDP No-confidence | Sakshi
Sakshi News home page

అవిశ్వాసంలోనూ అదే బంధం

Published Thu, Jul 19 2018 2:54 AM | Last Updated on Wed, Oct 17 2018 6:22 PM

Lok Sabha Speaker given Permission to the TDP No-confidence - Sakshi

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ, బీజేపీల మధ్య కొనసాగుతున్న స్నేహబంధం ఎంతటి దృఢమైందో మరోసారి తేటతెల్లమైంది. రెండు పార్టీల మధ్య సాగుతున్న లాలూచీ రాజకీయం పార్లమెంట్‌ సాక్షిగా బట్టబయలైంది. విడిపోయామని పైకి చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ–బీజేపీ అంతర్గతంగా సయోధ్య సాగిస్తున్నాయి. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 13 సార్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చినా దానిపై చర్చించేందుకు బీజేపీ ముందుకు రాలేదు.

సభ ఆర్డర్‌లో లేదంటూ తప్పించుకుంది. తాజాగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో తొలిరోజే కేంద్రంపై టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అనుమతించారు. శుక్రవారమే దానిపై చర్చ, ఓటింగ్‌ చేపడతామని ప్రకటించారు. కేంద్రంపై 8 పార్టీలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వగా, టీడీపీ నోటీసునే స్పీకర్‌ స్వీకరించడం గమనార్హం. టీడీపీ, బీజేపీలు పైకి ప్రత్యర్థుల్లా నటిస్తూ, లోపల పరస్పర అవగాహనతో పని చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

వివిధ పార్టీల సభ్యులు కేంద్రంపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు ఇచ్చిన నోటీసులను బుధవారం లోక్‌సభలో స్పీకర్‌ ప్రస్తావించారు. ‘‘కేశినేని శ్రీనివాస్, కొనకళ్ల నారాయణరావు, తోట నర్సింహం, తారిఖ్‌ అన్వర్, మహ్మద్‌ సలీం, మల్లికార్జున ఖర్గే, ఎన్‌.కె.ప్రేమ్‌చంద్రన్, కేసీ వేణుగోపాల్‌ నుంచి కేంద్ర మంత్రి మండలిపై అవిశ్వాస వ్యక్తపరుస్తూ నోటీసులు అందాయి. వీటిని సభ ముందుంచడం నా విధి. వీటిలో కేశినేని శ్రీనివాస్‌ నోటీసు ముందుగా వచ్చింది. ఆయన సభ అనుమతి కోరాలని అడుగుతున్నాను’’ అని పేర్కొన్నారు. వెంటనే కేశినేని లేచి ‘‘ఈ సభ కేంద్ర మంత్రి మండలిపై అవిశ్వాసం వ్యక్తపరుస్తోందనే తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ఈ సభ అనుమతిని కోరుతున్నాను’’ అని పేర్కొన్నారు.

తీర్మానం ప్రవేశపెట్టడానికి అనుమతి ఇచ్చేందుకు మద్దతు ఇచ్చే సభ్యులు లేచి వారి స్థానాల్లో నిలుచోవాలని సభాపతి కోరారు. దీంతో కాంగ్రెస్, సీపీఎం, ఎస్పీ, ఎన్సీపీ, ఆప్, తృణమూల్‌ కాంగ్రెస్, టీడీపీ, ఐయూఎంఎల్, ఆర్జేడీ, ఆర్‌ఎస్పీ తదితర పార్టీల సభ్యులు లేచి నిలుచున్నారు. ఫిరాయింపు ఎంపీలు కొత్తపల్లి గీత, బుట్టా రేణుక లేచి నిలుచున్నారు. నిబంధనల ప్రకారం అవసరమైన 50 మందికి పైగా సభ్యుల మద్దతు ఉన్నందున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతిస్తున్నానని స్పీకర్‌ ప్రకటించారు. 

బీజేపీతో చంద్రబాబు లాలూచీ   
భారతీయ జనతా పార్టీతో తెగతెంపులు చేసుకున్నామంటూ ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి టీడీపీ వైదొలగినప్పటికీ లోపాయికారీ ఒప్పందాలతో పూర్వపు బంధాన్ని యథాతథంగా కొనసాగిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వంగి వంగి నమస్కారాలు పెట్టారు. ప్రధాని ముందు అతి వినయం ప్రదర్శించారు. పైకి మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్నానంటూ నమ్మబలుకుతున్నారు. మహారాష్ట్ర బీజేపీ మంత్రి భార్యను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలిలో సభ్యురాలిగా నియమించారు.

బీజేపీ సీనియర్‌ నేత, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ భర్త పరకాల ప్రభాకర్‌ను చంద్రబాబు మీడియా సలహాదారుగా నియమించుకున్నారు. అలాగే ఇటీవల పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో చంద్రబాబు అత్యంత సన్నిహితంగా మెలిగారు. తర్వాత విశాఖపట్నంలో జరిగిన సదస్సులో ఇరువురూ ఒకరిపై ఒకరు పొగడ్తల వర్షం కురిపించుకున్నారు. హైదరాబాద్‌లో ఒకరోజు పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా చంద్రబాబుకు రాజగురువు అయిన ఓ పత్రికాధిపతితో ఏకాంతంగా భేటీ కావడం గమనార్హం. టీడీపీ–బీజేపీ మధ్య అనుబంధానికి ఇవన్నీ నిదర్శనాలేనని పరిశీలకులు చెబుతున్నారు. 

ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఉద్దేశం లేదట! 
వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌పై గెలిచి, టీడీపీలోకి ఫిరాయించిన ఎంపీ బుట్టా రేణుకను మంగళవారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్‌సీపీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హోదాలో అధికార పక్షం ఆహ్వానించడం, అక్కడ నేమ్‌ప్లేట్‌ పెట్టడం దేనికి సంకేతమని పరిశీలకులు అంటున్నారు. దీనిపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి గట్టిగా నిలదీయడంతో చివరకు ఆమె నేమ్‌ప్లేట్‌ను తొలగించక తప్పలేదు. కాగా, తమ పార్టీ నుంచి ఫిరాయించిన ఎంపీలు ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బుట్టా రేణుకలను అనర్హులుగా ప్రకటించాలని వైఎస్సార్‌సీపీ పదేపదే కోరుతున్నా స్పీకర్‌ పట్టించుకోవడం లేదు.

కానీ, ఫిరాయింపు ఎంపీ బుట్టా రేణుకను వైఎస్సార్‌సీపీ ప్రతినిధిగా అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించడం చంద్రబాబు ఆడిస్తున్న డ్రామాలో భాగమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి బు«ధవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని పడకొట్టాలనేది తమ ఉద్దేశం కాదని చెప్పడం మరో కొసమెరుపు. నాలుగేళ్లు కేంద్ర ప్రభుత్వంతో అంటకాగి, అధికార అనుభవించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పేరుతో డ్రామాలాడుతోందని రాజకీయ విశ్లేకులు చెబుతున్నారు. ఇరు పార్టీల మధ్య లాలూచీలో భాగంగానే ఈ అవిశ్వాసం అనే నాటకం మొదలైందని అంటున్నారు. 

స్వలాభం కోసం కేంద్రంతో బాబు కుమ్మక్కు 
రాష్ట్రానికి ఐదేళ్లు కాదు, పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని గత ఎన్నికల ప్రచారంలో డిమాండ్‌ చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తలేదు. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలో చేరి, అధికారం పంచుకున్నారు. ప్రత్యేక హోదాతో ప్రయోజనం లేదు, ప్రత్యేక ప్యాకేజీయే మేలని ప్రకటించారు. ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ఏకంగా అసెంబ్లీలోనే ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం సైతం చేశారు. కేంద్ర మంత్రులను ఆహ్వానించి, ఘనంగా సన్మానించారు. ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో మళ్లీ హోదా రాగం అందుకున్నారు. ప్రత్యేక హోదా కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న వైఎస్సార్‌సీపీ బాటలోనే చంద్రబాబు నడవక తప్పలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చామని చెబుతున్న చంద్రబాబు ఇప్పుడు స్వలాభం కోసం అదే కేంద్రంతో కుమ్మక్కయ్యారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  

వైఎస్సార్‌సీపీ పోరుబాట 
ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు విభజన చట్టంలోని హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాలుగేళ్లుగా అలుపెరగని పోరాటం కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే గత బడ్జెట్‌ సమావేశాల్లో ఎన్‌డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు 13 సార్లు నోటీసులు ఇచ్చింది. ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలను కలిసి 50 మందికి పైగా సభ్యుల మద్దతును కూడగట్టింది. వైఎస్సార్‌సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో గొంతెత్తి నినదించారు. వివిధ రూపాల్లో నిరసన వ్యక్తంచేశారు. హోదా కోసం కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతామని వైఎస్సార్‌సీపీ ప్రకటించగా తాము మద్దతు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.

ఆ మరుసటి రోజే తామే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామంటూ యూటర్న్‌ తీసుకున్నారు. వైఎస్సార్‌సీపీ 13 సార్లు నోటీసులు ఇచ్చినా లోక్‌సభ స్పీకర్‌ అనుమతించలేదు. ప్రత్యేక హోదా సాధనే తమ లక్ష్యమంటూ పార్లమెంట్‌ సమావేశాల చివరి రోజైన ఏప్రిల్‌ 6న ఐదుగురు వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామాలు చేసి, ఢిల్లీలోనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అనంతరం స్పీకర్‌ వద్ద పట్టుపట్టి తమ రాజీనామాలను ఆమోదింపజేసుకున్నారు. బడ్జెట్‌ సమావేశాలు జరిగినన్ని రోజులు ఢిల్లీలో టీడీపీ ఎంపీలు చేసిన విన్యాసాలకు లెక్కే లేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement