పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు హోదా కోసం ధర్నా చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ: తాము 13 సార్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చినా అనుమతించని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు లోపాయికారీ ఒప్పందంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన తీర్మానాన్ని అనుమతించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీలు ఆరోపించారు. బీజేపీ–టీడీపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బుధవారం ఢిల్లీలో శాసనమండలిలో విపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా బదులు సీఎం చంద్రబాబు అంగీకారంతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని శుక్రవారం అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చ సందర్భంగా కేంద్రం చేసే ప్రకటనపై టీడీపీ ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. చంద్రబాబు అంగీకారంతోనే రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని కేంద్రం ఇటీవల సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కూడా స్పష్టం చేసిందని గుర్తుచేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో కూడా కేంద్రం ఇదే విషయాన్ని చెబుతుందని అన్నారు.
హోదా ఇచ్చే దాకా పోరాటం ఆగదు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే వరకూ పోరాటం ఆపే ప్రసక్తే లేదని మేకపాటి రాజమోహన్‌రెడ్డి తేల్చిచెప్పారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసిన తాము సభలోకి వెళ్లలేం కనుక పార్లమెంట్ ఆవరణలోనే తమ నిరసన తెలుపుతామని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వంలో నాలుగేళ్లపాటు భాగస్వామిగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా మాటెత్తని టీడీపీ ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టేందుకు డ్రామాలాడుతోందని దుయ్యబట్టారు. వైఎస్సార్‌సీపీ వల్లే ప్రత్యేక హోదా పోరాటం ఈ స్థాయి దాకా వచ్చిందన్నారు. పార్లమెంట్ ఆవరణలో చేపట్టే నిరసనలో తమతోపాటు పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, అనంత వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొంటారని మేకపాటి తెలిపారు.
ఏం సమాధానం చెబుతారు?
చంద్రబాబు ఒప్పుకున్నారు కాబట్టే ప్రత్యేక హోదాకు బదులుగా ప్యాకేజీ ప్రకటించామని కేంద్రం చేయనున్న ప్రకటనపై టీడీపీ ఏం సమాధానం చెబుతుందని వైవీ సుబ్బారెడ్డి నిలదీశారు. ప్యాకేజీకి ఒప్పకుని కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఊరూరా తిప్పి సన్మానాలు చేసిన విషయం అందరికీ గుర్తుందన్నారు. రాష్ట్ర ప్రజలను వంచించేందుకు బీజేపీతో ఉన్న ఒప్పందం మేరకు ఇప్పుడు అవిశ్వాసం అంటూ టీడీపీ డ్రామాలాడుతోందని ధ్వజమెత్తారు.
కమీషన్ల కోసమే ప్యాకేజీ
కమీషన్లు కొల్లగొట్టవచ్చన్న ఉద్దేశంతోనే టీడీపీ ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుందని వరప్రసాదరావు విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో టీడీపీకి ఏమాత్రం చిత్తశుద్ది లేదన్నారు. ఎన్డీఏలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు సాధన కోసం ఎలాంటి ప్రయత్నం చేయని టీడీపీ నేతలు ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టేందుకు దొంగ దీక్షలు చేస్తున్నారని వరప్రసాదరావు మండిపడ్డారు.
బాబుకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం
ప్రత్యేక హోదా వద్దన్న సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని తట్టుకోలేక యూటర్న్ తీసుకున్నారని ఎంపీ వి.విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి చంద్రబాబే ప్రధాన కారణమని మండిపడ్డారు. ఆ రోజు ప్యాకేజీ వద్దు, హోదానే కావాలని కోరి ఉంటే ఈ పాటికి రాష్ట్రానికి హోదా వచ్చి ఉండేదన్నారు. బీజేపీతో లోపాయికారీ ఒప్పదం ప్రకారం ఇప్పుడు అవిశ్వాస తీర్మానం నోటీసును ఆమోదించారని, అఖిలపక్ష సమావేశానికి బుట్టా రేణుకను ఆహ్వానించడమే అందుకు నిదర్శనమని చెప్పారు. రాష్ట్రానికి చంద్రబాబు చేసిన దగాపై ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని, సమయం వచ్చినప్పుడు వారు బాబుకు బుద్ధి చెబుతారని విజయసాయిరెడ్డి హెచ్చరించారు.
గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ ఆందోళన
పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి బుధవారం ఉదయం 10 గంటలకు ఆందోళన చేపట్టారు. ప్రత్యేక హోదా కోసం ఇటీవలే తమ ఎంపీ పదవులకు రాజీనామా చేసిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. కాగా, మాజీ ఎంపీలు ఇక్కడ ధర్నా చేయరాదంటూ పార్లమెంట్ భద్రతా సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఏ నిబంధనల ప్రకారం వద్దంటున్నారో చెప్పాలని మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు ప్రశ్నించారు. తాము నిబంధనలన్నీ పాటిస్తున్నామంటూ నిరసన కొనసాగించారు.
Comments
Please login to add a commentAdd a comment