Motion of No Confidence
-
మేయర్..ఫిబ్రవరి ఫియర్?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్(BRS Party) నుంచి కార్పొరేటర్‌గా గెలిచి మేయర్‌గా ఎంపికైన (GadwalVijayalakshmi)గద్వాల్ విజయలక్ష్మిని.. అలాగే డిప్యూటీ మేయరైన శ్రీలతా శోభన్‌రెడ్డిని పదవుల నుంచి తప్పించేందుకు ఆ పార్టీ వ్యూహం పన్నుతోందా? అంటే కాదనలేని పరిస్థితి నెలకొంది. బల్దియాలో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన విజయలక్ష్మి, శ్రీలతలకు అప్పటి ప్రభుత్వ ఆశీస్సులతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు దక్కాయి. అప్పట్లో ఎంఐఎం బీఆర్ఎస్కు అండగా నిలిచింది. ఏడాది క్రితం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వీరిద్దరూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తమ పార్టీ వల్ల అధికారం దక్కించుకున్న వారు పార్టీపై విశ్వాసం చూపలేదనే తలంపుతో బీఆర్ఎస్ నాయకత్వం ఉంది. తమ పార్టీ వల్లే పదవులు పొందిన వారు, పార్టీ మారినా రాజీనామా చేయకుండా ఇంకా పదవుల్లో కొనసాగుతుండటాన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు.. కాంగ్రెస్ కార్పొరేటర్లు సైతం కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న తమకు దక్కని యోగం.. వారికి దక్కడంపై అంతర్గతంగా జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలోకి వారి రాకతో తమ ప్రాధాన్యం తగ్గిపోయిందనే తలంపులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంతో కాలంగా వారిని ఆ పదవుల నుంచి తప్పించాలనే యోచనలో పలువురు కార్పొరేటర్లున్నారు. జీహెచ్ఎంసీ యాక్ట్ మేరకు పదవీ బాధ్యతలు చేపట్టాక నాలుగేళ్ల వరకు వారిపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేదు. జీహెచ్ఎంసీ పాలకమండలి ఎన్నికలు 2020 డిసెంబర్లో జరిగినప్పటికీ, మేయర్, డిప్యూటీ మేయర్లు 2021 ఫిబ్రవరి 11వ తేదీన బాధ్యతలు చేపట్టారు. వచ్చే ఫిబ్రవరి 10వ తేదీతో వారి నాలుగేళ్ల కాలం పూర్తవుతున్నందున, అది ముగియగానే అవిశ్వాసం పెట్టేందుకు కార్పొరేటర్లు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే.. నిబంధనల మేరకు అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే మొత్తం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుల్లో (స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు) సగం మంది నిర్ణీత ప్రొఫార్మాలో తీర్మానం చేసి సంతకాలు పెట్టి జిల్లా కలెక్టర్‌కు అందజేయాలి. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు, 50 మంది ఎక్స్‌అఫీíÙయో సభ్యులు వెరసీ.. మొత్తం 196 మంది ఉన్నారు. వీరిలో సగం అంటే 98 మంది సభ్యుల సంతకాలు అవసరం. బీఆర్ఎస్కు ప్రస్తుతం 42 మంది కార్పొరేటర్లు, 29 మంది ఎక్స్అఫీషియో సభ్యులు వెరసీ.. 71 మంది సభ్యుల బలం ఉంది. అవిశ్వాసం పెట్టాలంటే మరో 27 మంది సభ్యులు అవసరం. గతంలోవలే ఎంఐఎం పొత్తు ఉంటే సాధ్యమయ్యేదే కానీ ప్రస్తుతం అది కాంగ్రెస్‌కు మద్దతుగా ఉండటం తెలిసిందే. ఎంఐఎం లేదా బీజేపీతో కలిస్తేనే అవిశ్వాసం పెట్టేందుకు వీలవుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహం ఆచరించనుందన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమని, ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందో, ఎప్పుడు ఉపసంహరించుకుంటుందో చెప్పలేమంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏం జరిగేందుకైనా ఆస్కారం ఉందంటున్నారు. అందుకు రాజకీయాల్లో గతంలో జరిగిన కొన్ని సంఘటనల్ని వారు ఉదహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మేయర్ కురీ్చకి గండం పొంచి ఉందని అంటున్నారు. డిప్యూటీ మేయర్‌కు సైతం అదే వర్తిస్తుందంటున్నారు. పార్టీలు మారారు ఇలా.. ⇒ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తొలుత రెండు సీట్లు మాత్రమే గెలిచినప్పటికీ, లింగోజిగూడ బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేశ్‌గౌడ్ మృతితో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచి ముగ్గురయ్యారు. తర్వాత పరిణామాలతో బీజేపీ నుంచి ముగ్గురు, బీఆర్ఎస్ నుంచి 18 మంది చేరడంతో ఆ పార్టీ బలం 24కు పెరిగింది. ⇒ ఎంఐఎం 44 స్థానాల్లో గెలవగా ఒకరు మరణించారు. ఇద్దరు రాజీనామాలు చేయడంతో ప్రస్తుతం 41 మంది ఉన్నారు. ⇒ బీజేపీ 48 స్థానాల్లో గెలవగా ఆదిలోనే ఒకరు మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో ఓటమితో 47 మంది అయ్యారు. అనంతరం గుడిమల్కాపూర్ కార్పొరేటర్ మృతి చెందడం, కొందరు పార్టీలు మారడంతో ప్రస్తుత బలం 39గా ఉంది. ⇒ బీఆర్ఎస్ వారు 56 సీట్లలో గెలిచారు. బీజేపీ నుంచి నలుగురు పార్టీలో చేరడంతో బలం 60కి పెరిగినప్పటికీ.. అనంతరం 18 మంది కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో ప్రస్తుతం 42 మంది ఉన్నారు. -
గట్టెక్కిన కెనడా ప్రధాని ట్రూడో
టొరంటో: అవిశ్వాస తీర్మానంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వం నెగ్గింది. దీంతో ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ పార్లమెంటులో బుధవారం ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. హౌస్ ఆఫ్ కామన్స్‌లో అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 211 మంది సభ్యులు ఓటేయడంతో తీర్మానం వీగిపోయింది. తీర్మానానికి మద్దతుగా కేవలం 120 మంది సభ్యులు ఓటేశారు. దీంతో విపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ట్రూడో గెలుపు సులువైంది. పెరుగుతున్న ధరలు, గృహ సంక్షోభంపై అసంతృప్తితో ప్రజాదరణ తగ్గిపోయింది. దీనికి తోడు మాంట్రియల్లో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ ఓటమి పాలైంది. న్యూ డెమొక్రటిక్ పార్టీ 2022లో చేసుకున్న ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ట్రూడో ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో ట్రూడో ప్రభుత్వం మైనారిటీలో పడింది. 2025 అక్టోబర్ చివరిదాకా ప్రభుత్వానికి కాలపరిమితి ఉన్నా మైనారిటీ సర్కార్ కావడంతో అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ పట్టుబట్టడం తెల్సిందే. ‘‘ఈ రోజు దేశానికి మంచి రోజు. కెనడా ప్రజలు ఎన్నికలను కోరుకుంటున్నారని నేను అనుకోవడం లేదు’’ అని ప్రభుత్వ వ్యవహారాల ఇంచార్జ్, సీనియర్ లిబరల్ పార్టీ నేత కరీనా గౌల్డ్ అన్నారు. వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతూ, సమస్య వారీగా చట్టం చేయబోతున్నామని ఆయన తెలిపారు. ముందున్న సవాళ్లు.. అవిశ్వాసం నుంచి గట్టెక్కినా ట్రూడోకు ఇతర సవాళ్లు ఎదురవుతున్నాయి. తమ డిమాండ్లకు అంగీకరించకపోతే ప్రభుత్వాన్ని కూలదోస్తామని బ్లాక్ నేతలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు లిబరల్స్ త్వరలో బడ్జెట్‌పై రెండో ఓటింగ్‌ను ఎదుర్కోనున్నారు. 2025 అక్టోబర్ నెలాఖరులో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఒపీనియన్ పోల్స్‌లో రైట్ ఆఫ్ సెంటర్ కన్జర్వేటివ్ పారీ్టకి భారీ ఆధిక్యం లభించింది. దీంతో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని తాము కోరుకుంటున్నామని కన్జర్వేటివ్‌లు చెబుతున్నారు. లిబరల్స్ పాలనలో ఫెడరల్ ఖర్చులు, నేరాలు పెరిగాయని విమర్శిస్తున్నారు. మరోవైపు సీనియర్లకు ఎక్కువ నిధులు ఇస్తే కనీసం డిసెంబర్ నెలాఖరు వరకు ట్రూడోను అధికారంలో ఉంచుతామని, లేదంటే గద్దె దించుతామని బ్లాక్ నాయకులు హెచ్చరిస్తున్నారు. క్యూబెక్‌లో నివసిస్తున్న పాడి రైతులను రక్షించే సుంకాలు, కోటాల వ్యవస్థను పరిరక్షిస్తామని బ్లాక్ నాయకుడు వైవ్స్ ఫ్రాంకోయిస్ బ్లాంచెట్ అన్నారు. అక్టోబర్ 29లోగా ప్రభుత్వం అధికారికంగా ఈ పని చేయకపోతే ట్రూడోను గద్దె దించేందుకు విపక్షాలతో చర్చిస్తామని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇందులోనూ ఆయన విజయం సాధించాలంటే అవిశ్వాస తీర్మానం సందర్భంగా ట్రూడోకు మద్దతిచ్చిన న్యూ డెమొక్రటిక్ పార్టీ మద్దతు అవసరం. -
అధ్యక్షుడు ముయిజ్జుపై అవిశ్వాసం
మాలె: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ (ఎండీపీ) సిద్ధమవుతోంది. ఎండీపీకి పార్లమెంట్లో మెజారిటీ ఉంది. చైనా అనుకూల అధ్యక్షుడు ముయిజ్జు కేబినెట్లోకి నలుగురు మంత్రులను చేర్చుకునే అంశంపై ఆదివారం పార్లమెంట్లో ఓటింగ్ జరిగింది. నలుగురిలో ఒక్కరికి మాత్రమే పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ముగ్గురిని తిరస్కరించింది. ఇందుకు ఆగ్రహిస్తూ అధికార పక్షం ఎండీపీకి చెందిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్లపై అవిశ్వాసం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రతిపక్ష ఎంపీలు బాహాబాహీకి దిగారు. ఇద్దరు గాయపడ్డారు. ఈ పరిణామాలతో ఎండీపీ, మిత్రపక్షం డెమోక్రాట్లతో కలిసి ముయిజ్జుపై అవిశ్వాసం పెట్టాలని సోమవారం నిర్ణయించింది. పార్లమెంట్లో మొత్తం 80 మంది సభ్యులకు గాను ఎండీపీకి 45 మంది, డెమోక్రాట్లకు 13 మంది ఉన్నారు. -
Liz Truss: 45 రోజుల్లో ఏం జరిగింది ?
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ పదవి మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. బ్రెగ్జిట్, కోవిడ్, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో అప్పుల కుప్పగా మారి దేశం ఆర్థికంగా పెనుసవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పదవిని చేపట్టిన లిజ్ ట్రస్ దేశాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టడంలో దారుణంగా విఫలమయ్యారు. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత లిజ్ ట్రస్ ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయం వివాదాస్పదమైంది. బ్రిటన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో ఏర్పడిన ఆర్థిక, మార్కెట్ ప్రకంపనలు సొంత పార్టీలోనూ ఆమెపై వ్యతిరేకతను పెంచాయి. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీలే ట్రస్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సిద్ధపడుతూ ఉండడంతో ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. కేవలం 45 రోజుల మాత్రమే పదవిలో కొనసాగి అత్యంత తక్కువ కాలం ప్రధానిగా ఉన్న వ్యక్తిగా బ్రిటన్ చరిత్రలో లిజ్ ట్రస్ మిగిలిపోయారు. 1827లో కన్జర్వేటివ్ ప్రధాని జార్జ్ కానింగ్ పదవి చేపట్టిన 119 రోజుల్లో న్యుమోనియాతో మరణించారు. ఇన్నాళ్లూ బ్రిటన్ చరిత్రలో తక్కువ కాలం కొనసాగిన ప్రధానిగా ఆయనే ఉన్నారు. విద్యుత్ బిల్లులు ఫ్రీజ్ ప్రజాసంక్షేమం పేరుతో లిజ్ ట్రస్ తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వ ఖజానాపై మోయలేని భారాన్ని వేశాయి. రష్యా గ్యాస్ కోతలతో బ్రిటన్‌లో విద్యుత్ బిల్లులు తడిసి మోపెడవతూ ఉండడంతో వాటిని కట్టలేక జనం హడలెత్తిపోతున్నారు. దీంతో లిజ్ ట్రస్ ప్రభుత్వం రెండేళ్ల పాటు విద్యుత్ బిల్లుల్ని ఫ్రీజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ ఖజానాపై 8,900 కోట్ల పౌండ్ల భారం పడింది. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వం మరింత సంక్షోభంలోకి కూరుకుపోయింది మినీ బడ్జెట్ ప్రకంపనలు బ్రిటన్ ఆర్థిక మంత్రి క్వాజీ క్వార్టెంగ్ సెప్టెంబర్ 23న పార్లమెంటులో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఈ మినీ బడ్జెట్లో ప్రవేశపెట్టిన పన్ను కోతలు కనీవినీ ఎరుగనివి. 1972 తర్వాత ఈ స్థాయిలో పన్ను రాయితీలు ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదు. సామాన్య ప్రజలతో పాటు సంపన్నులకి 4,500 కోట్ల పౌండ్ల పన్ను మినహాయింపులివ్వడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలను బడ్జెట్లో చూపించకుండా విద్యుత్ బిల్లుల రాయితీలకే కోట్లాది పౌండ్లు కేటాయించడం ఆర్థికంగా ప్రకంపనలు సృష్టించింది. డాలర్‌తో పోల్చి చూస్తే పౌండ్ విలువ భారీగా పడిపోయింది. ఈ సంక్షోభాన్ని గట్టెక్కించడానికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ 6,500 కోట్ల పౌండ్ల విలువైన బాండ్లను కొనుగోలు చేస్తామని చెప్పడం కొన్ని పెన్షన్ స్కీమ్స్‌ను ప్రమాదంలోకి నెట్టేశాయి. ఇది రాజకీయంగా లిజ్ ట్రస్‌కు ఎదురు దెబ్బగా మారింది. కొందరు ఎంపీలు ఆమె రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేయడం ప్రారంభించారు. అయినప్పటికీ కొద్ది రోజులు ఆమె తన చర్యల్ని సమర్థించుకుంటూ వచ్చారు. అయితే సొంత పార్టీలోనే ఆమెపై వ్యతిరేకత మరింతగా పెరిగిపోవడంతో మినీ బడ్జెట్‌పై యూ టర్న్ తీసుకున్నారు. తనకు అత్యంత సన్నిహితుడైన ఆర్థిక మంత్రి క్వాజీ క్వార్టెంగ్పై వేటు వేశారు. కొత్త ఆర్థిక మంత్రిగా జెరెమి హంట్‌ను నియమించారు. మినీబడ్జెట్లో ప్రతిపాదనల్ని వెనక్కి తీసుకున్నా అప్పటికే రాజకీయంగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హోంమంత్రి రాజీనామాతో రాజకీయ అనిశ్చితి బ్రిటన్ హోంమంత్రి సుయెల్లా బ్రేవర్మన్ చేసిన ఒక పొరపాటుతో బుధవారం ఆమె తన పదవికి రాజీనామా చేయడం కూడా లిజ్ ట్రస్‌కు ఎదురు దెబ్బగా మారింది. బ్రిటన్ వలస విధానాలకు సంబంధించిన ఒక డాక్యుమెంట్‌ను బ్రేవర్మన్ తన వ్యక్తిగత ఈ మెయిల్ నుంచి సహచర ఎంపీగా పంపడం తీవ్ర దుమారానికి దారి తీసింది. దీంతో ఆమె తన తప్పుని అంగీకరిస్తూ రాజీనామా చేశారు. మరోవైపు లిజ్‌ట్రస్‌పై కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 100 మంది సభ్యులు అక్టోబర్ 31లోగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి దింపాలన్న ప్రచారం జరిగింది. ఆర్థికంగా, రాజకీయంగా ఎదురవుతున్న సవాళ్లను తట్టుకోలేక దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పిన ఒక్క రోజులోనే ఆమె పదవిని వీడారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జమిలి జరగాలంటే...
సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ దేశ రాజకీయాల్లో మరోసారి జమిలి ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. దేశంలో తరచూ ఎన్నికల వల్ల అభి వృద్ధి పనులకు అవరోధం ఏర్పడుతోందని, వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఎన్నికల నిర్వహణ వల్ల ప్రజా ధనం వృథా అవుతోందన్న వాదన వినిపిస్తోంది. దీన్ని నివారించేందుకు రాష్ట్రాలు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందనే డిమాండ్ కొన్ని రాజకీయ పార్టీల నుంచి వ్యక్తమవుతోంది. అన్ని రాష్ట్రాలకూ కాకపోయినా అతితక్కువ గడువు మాత్రమే ఉన్న 12 రాష్ట్రాల అసెంబ్లీలతో కలిపి లోక్‌సభకూ ఈ ఏడాది చివర్లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం మొగ్గు చూపుతోందన్న వార్తలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. జమిలి ఎన్నికలు జరగాలంటే రాజ్యాంగంతోపాటు ప్రజా ప్రాతినిధ్య చట్టానికి, లోక్‌సభ నిబంధనలు, ఫిరాయింపుల నిరోధక చట్టం వంటి వాటికి కేంద్రం యుద్ధప్రాతిపదికన సవరణలు చేయాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ రాజ్యాంగంలో చేయాల్సిన మార్పులు... చట్టసభలు నిర్ణీత ఐదేళ్ల కాలపరిమితిని పూర్తి చేసుకుంటేనే జమిలి ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగుతుంది. అవిశ్వాస తీర్మానాలతో ప్రభుత్వాలు పడిపోయినప్పుడు, హంగ్ ఏర్పడి ఎవరూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి తలెత్తినప్పుడు, అసెంబ్లీని ముందస్తుగా రద్దు చేసినప్పుడు సాధారణ ఎన్నికలతో కాకుండా మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. ఇలాంటి వాటిని నివారించడానికి ఎన్నికల సంఘం కొన్ని సూచనలు చేసింది. ఇందుకు రాజ్యాంగ సవరణల ఆవశ్యకత ఏర్పడుతుంది. అవి ఏమిటంటే... - ఆర్టికల్ 83, 172 (1): లోక్‌సభ కాలావధి ఐదేళ్లు అని రాజ్యాంగంలోని 83 (2) క్లాజ్ చెబు తోంది. అసెంబ్లీల పదవీకాలం మొదటిసారి సమావేశమైనప్పటి నుంచి ఐదేళ్లు అని ఆర్టికల్ 172 (1) సూచిస్తోంది. ఈ రెండింటికీ కాలా వధి ఒకే రీతిలో ఉండేలా సవరణ చేయాలి. - ఆర్టికల్ 85, 174: లోక్‌సభ రద్దు, వాయిదా, సుప్తచేతనావస్థలో ఉంచే అధికారం రాష్ట్రపతికి కల్పించే రాజ్యాంగ నిబంధన ఆర్టికల్ 85. రాష్ట్రాల గవర్నర్లకు ఇవే హక్కులు ఇచ్చే నిబంధన ఆర్టికల్ 174. ఈ రెండింటిలోనూ మార్పులు చేయాల్సి ఉంటుంది. నిర్దిష్ట కాలావధి కంటే ముందే ఏదైనా సభ రద్దయితే మిగిలిన సమయానికి మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. ఉదాహరణకు 2019 ఎన్నికల్లో ఏర్పడిన సభ 2020లోనే రద్దు అయితే మిగిలిన కాలానికి అంటే 2024 వరకూ అసెంబ్లీ ఉండేలా ఎన్నికలు జరుగుతాయన్నమాట. సాధారణ ఎన్నికలకు చాలా సమయం ఉన్న పరిస్థితుల్లో పార్లమెంటుకు కూడా ఈ పద్ధతి వర్తిస్తుంది. - రాష్ట్ర అసెంబ్లీల పదవీకాలాన్ని కుదించాలన్నా, పొడిగించాలన్నా రాజ్యాంగ సవరణ తప్పనిసరి. కొత్త క్లాజులు చేర్చాలి. కుదింపు/పొడిగింపు ఎంతకాలం అనే దానిపై పరిమితి ఉండరాదు. - అవిశ్వాస తీర్మానంతోపాటు ప్రభుత్వ ఏర్పాటుకు ప్రత్యామ్నాయం చూపుతూ విశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టాలి. రెండింటికీ ఒకేసారి ఓటింగ్ జరగాలి. తద్వారా చట్ట సభలు ముందస్తుగా రద్దయ్యే అవకాశాలు తగ్గుతాయి. - సాధారణ ఎన్నికలకు కొంచెం సమయం మాత్రమే ఉన్నప్పుడు ఏవైనా చట్ట సభలు రద్దయితే రాష్ట్రపతి పాలన విధించాలి. తాను నియమించుకున్న మంత్రుల ద్వారా పాలన సాగించే అధికారం రాష్ట్రపతికి ఉండాలి. అసెంబ్లీలకు సంబంధించి ఈ పనిని గవర్నర్ చేసేలా చేయాలి. లేదంటే రాష్ట్రపతి పాలన విధించాలి. - హంగ్ ఏర్పడి ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాకపోయినా, ఏదైనా ప్రభుత్వం రాజీనామా చేసి కొత్త ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి లేకున్నా తిరిగి ఎన్నికలు నిర్వహించాలి. అయితే కాలపరిమితి ఐదేళ్లు ఉండదు. మిగిలిన సమయానికి మాత్రమే కొత్త సభ మనుగడలో ఉంటుంది. - ఆర్టికల్ 356: దీని ప్రకారం రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన ఆరు నెలల వరకూ మాత్రమే విధించ వచ్చు. పొడిగించాల్సి వస్తే మళ్లీ రాష్ట్రపతి ఆమో దం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి పార్లమెంటు ఆమోదంతో మూడేళ్లపాటు రాష్ట్రపతి పాలన కొనసాగించేందుకు కూడా అవకాశం ఉంది. ఐదేళ్ల అవధి మధ్యలో ఏదైనా అసెంబ్లీలో రాష్ట్రపతి పాలన విధించి మూడేళ్ల రాష్ట్రపతి పాలన ముగిశాక కూడా సాధారణ ఎన్నికలకు సమయం ఉన్నప్పుడు ఏం చేయాలన్న అంశాన్ని కూడా నిర్వచించి ఈ ఆర్టికల్‌లో చేర్చాల్సి ఉంటుంది. ఇదీ జమిలి చరిత్ర... 1952లో లోక్‌సభ తొలి సార్వత్రిక ఎన్నికలతోపాటు దాదాపు అన్ని రాష్ట్రాల (ఒకటి రెండు మినహాయింపులతో) అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 1967 దాకా ఈ పరిస్థితే కొనసాగింది. 1967లో వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్సేతర ప్రభుత్వాలు ఏర్పడగా అంతర్గత కుమ్ములాటలు లేదా కేంద్రమే రాష్ట్రపతి పాలన విధించడంతో ఆ తర్వాత కొన్ని అసెంబ్లీలు రద్దయ్యాయి. 1971లో ఏడాది ముందుగానే అప్పటి ప్రధా ని ఇందిరాగాంధీ లోక్‌సభ ఎన్నికలకు వెళ్లడంతో జమిలి ఎన్నికల శకం ముగిసింది. 1999లో జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి సారథ్యంలోని లా కమిషన్ తన నివేదికలో ఎన్నికల సం స్కరణలపై పలు సూచనలు చేసింది. జమిలి ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేసి ంది. 2014 సెప్టెంబర్‌లో సుదర్శన్ నాచియప్పన్ చైర్మన్‌గా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏర్పాటైంది. 2015 డిసెంబర్లో ఈ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ప్రధాని మోదీ 2016 సెప్టెంబర్‌లో తొలిసారిగా జమిలి ఎన్నికల ప్రస్తావన తెచ్చారు. వాస్తవ దృష్టితో చూస్తే పార్లమెంటుతోపాటు 29 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని నాచియప్పన్ కమిటీ, నీతి ఆయోగ్ అభిప్రాయపడ్డాయి. 2019లో ఒకేసారి ఎన్నికలకు వెళ్లాలంటే అస్సాం, కేరళ, తమిళనాడు అసెంబ్లీల కాలపరిమితిని రెండేళ్లు తగ్గించాలి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెం బ్లీల పదవీకాలాన్ని దాదాపు మూడేళ్లు కుదించాలి. ఈ త్యాగాలకు అక్కడి అధికార పార్టీలు అంగీ కరించే అవకాశం లేనందున మధ్యేమార్గాన్ని అనుసరించాలని నాచియప్పన్ కమిటీ, నీతి ఆయోగ్ సూచిం చాయి. కొన్ని రాష్ట్రాలను 2019 ఏప్రిల్–మేలలో (మొదటి దశ) జరిగే లోక్‌సభ సాధారణ ఎన్నికలతో కలిపితే... మిగతా వాటిని 2021 అక్టోబర్–నవంబర్లలో (రెండో దశ) కలిపి ఎన్నికలు నిర్వ హించాలనేది సూచన. ఈ విధంగా దేశంలో ఐదేళ్లలో రెండుసార్లే ఎన్నికలు జరుగుతాయి. 2019 మే తర్వాత రెండున్నర ఏళ్లకు 2021 నవంబర్‌లో మళ్లీ ఎన్నికలుంటాయి. ఫిరాయింపుల నిరోధక చట్టం.. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించిన ప్రజాప్రతినిధులపై తగిన చర్యలు తీసుకునేందుకు అవకాశం కల్పించే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోనూ కొన్ని సవరణలు చేస్తేగానీ జమిలి ఎన్నికలు సాధ్యం కాదన్నది న్యాయ కమిషన్ ముసాయిదా చెబుతున్న విషయం. పదవ షెడ్యూల్లోని ఈ అంశంలో పార్టీలు జారీ చేసే విప్‌లు సభ్యులు అతిక్రమించకూడదని ఈ షెడ్యూల్ చెబుతుంది. అయితే, హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు విప్‌లు జారీ చేయకుండా చేస్తే ప్రభుత్వ ఏర్పాటు సులభమవుతుంది. తద్వారా ఆ ప్రభుత్వం ఐదేళ్లు నడిచేందుకు అవకాశం ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే విప్ల జారీ విషయంలో ఉన్న కఠిన నిబంధనలను సడలించాల్సి ఉంటుంది. చట్ట సవరణ పద్ధతులు... జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చట్టాల్లో మార్పులు చేసేందుకు నిర్దిష్ట పద్ధతి ఉంటుంది. చేయాల్సిన మార్పులను అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. మార్పుల ముసాయిదాను కేంద్ర కేబినెట్ పరిశీలించి ఆమోదించాలి. చట్టాలు, నిబంధనల మార్పు కోరుతూ ఓ బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలి. ఆ తరువాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఈ మార్పులన్నీ చట్టరూపం దాల్చి అమల్లోకి వస్తాయి. ఇవన్నీ జరిగాయనుకున్నా మార్పులు, చేర్పుల కారణంగా రాజ్యాంగం తాలూకూ మౌలిక స్వభావానికి విఘాతం కలిగిందని ఎవరైనా సుప్రీంకోర్టు తలుపు తట్టే అవకాశం ఉండటం కొసమెరుపు! ప్రజాప్రాతినిధ్య చట్టం... జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణలతోపాటు ప్రజాప్రాతినిధ్య చట్టంలోనూ కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. దీంట్లోని సెక్షన్ 14 లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌కు సంబందించినది. ఇందులోని రెండవ క్లాజ్ ప్రకారం లోక్‌సభ కాలావధి ముగిసేందుకు 6 నెలలకంటే ఎక్కువ సమయం ఉన్నప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్‌కు అధికారం లేదు. లోక్‌సభ నిర్ణీత కాలావధి ముగిశాక లేదా రద్దయినప్పుడే నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు. అసెంబ్లీ, లోక్‌సభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలంటే ఈ క్లాజ్‌ను సరి చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు రాష్ట్రాల ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో ఏకకాల ఎన్నికలకు సంబంధించిన నిర్వచనాన్ని చేర్చాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అనుకూల వాదన... - ఏటా ఏదో ఒక ఎన్నికలు (పార్లమెంటుకు, రాష్ట్రాల అసెంబ్లీలకు) ఉండటం మంచిది కాదు. గత 30 ఏళ్లలో ఏ ఒక్క ఏడాదీ ఎన్నికలు లేకుండా గడవలేదు. సగటున తీసుకున్నా ఏటా 5 లేదా 6 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాలి. ఎన్నికల ప్రవర్తనా నియామవళి కారణంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏ పథకాలు, పనులను చేపట్టే పరిస్థితి లేదు. ఫలితంగా అభివృద్ధికి ఆటంకం కలుగుతోంది. గత మూడేళ్లలో చూస్తే 2014లో ఏడు నెలలు, 2015లో మూడు నెలలకుపైగా, 2016లో రెండు నెలలపాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంది. - జమిలి ఎన్నికల వల్ల ప్రజాధనం ఆదా అవుతుంది. 2014 లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు రూ. 3,780 కోట్లు ఖర్చయింది. జమిలి ఎన్నికలు పెడితే రూ. 4,500 కోట్లు సరిపోతాయని ఎన్నికల కమిషన్ అంచనా వేసింది. లోక్‌సభ, అసెంబ్లీలకు వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరిగితే దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా. - ఎన్నికల నిర్వహణ కోసం భారీగా పారామిలటరీ, పోలీసులమోహరింపుతో శాంతిభద్రతల పర్యవేక్షణలో లోపం ఏర్పడుతుంది. - తరచూ ఎన్నికలు జరిగితే కుల, మత, ప్రాంతీయ భావాలు కొనసాగుతూనే ఉంటాయి. ప్రతికూల వాదన... - ఏకకాలంలో ఎన్నికలు వస్తే భారత్‌లో 77 శాతం ఓటర్లు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీకి ఓటేస్తారని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. - లోక్‌సభ, అసెంబ్లీలకు ఎన్నికలు వేర్వేరు ఎజెండాలపై జరుగుతాయి. అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక సమస్యలపై ఓటరు తీర్పు ఉంటుంది. జమిలి ఎన్నికలైతే జాతీయాంశాలు ఎన్నికల ప్రచారంలో కీలకపాత్ర పోషించి రాష్ట్రాలకున్న ప్రత్యేక సమస్యలు మరుగునపడతాయి. రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుకే పరిమితమై ఓటరు తీర్పునిచ్చే అవకాశాన్ని జమిలి ఎన్నికలు తగ్గిస్తాయి. - మనది సమాఖ్య వ్యవస్థ. ‘ఒక దేశం–ఒకే ఎన్నిక’ నినాదంగా బాగానే ఉన్నా సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుంది. లోక్‌సభతోపాటే ఎన్నికలు జరిగేలా రాష్ట్రాలను బలవంతంగా ఒప్పించినట్లే అవుతుందని, ఇది రాష్ట్రాలపై కేంద్రం పెత్తనాన్ని మరింత పెంచినట్లవుతుందనేది నిపుణుల ఆందోళన. జమిలిపై పార్టీల వైఖరి ఏమిటి? ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తోపాటు, ఎన్సీపీ, డీఎంకే, ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, తదితర పార్టీలు జమిలి ఎన్నికల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. ఒకేసారి ఎన్నికలు జరపాలన్న కేంద్రంలోని అధికార బీజేపీ ఆలోచనతో ఏకీభవించడం లేదని ఇటీవల జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్, లా అండ్ జస్టిస్) సమావేశంలో విపక్ష పార్టీల సభ్యులు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదని వారు స్పష్టం చేశారు. మరోవైపు తాము జమిలి ఎన్నికలకు సిద్ధమేనంటూ టీఆర్ఎస్, అన్నాడీఎంకే ప్రకటించాయి. జమిలి ఎన్నికలకు జేడీ(యూ) పాక్షిక మద్దతు తెలిపినప్పటికీ ఆర్టికల్ 356 ఉన్నంత కాలం రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే అవకాశముందని అనుమానం వ్యక్తం చేసింది. -
‘ఫలవంతం’ అర్ధమేమిటి?
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 17 రోజులపాటు కొనసాగి శుక్రవారం ముగిశాయి. ఈసారి సమావేశాలు ఫలవంతమయ్యాయని అటు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ఇటు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారి వరకూ ఎజెండా ప్రకారం సమావేశాలు సాగితే, అవాంతరాల బారిన పడకపోతే అవి ఫలవంతమైనట్టే. సభాధ్యక్షులు గనుక వారికి ఆ దృష్టి ఉండటం సహజం. అయితే చట్టసభలకు ప్రతినిధులను ఎన్నుకున్న ప్రజలు దీంతోపాటు ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. తాము ఏ పార్టీ తరఫున గెలిపించామో అదే పార్టీలో తమ ప్రతినిధి కొనసాగుతున్నారా లేదా అన్నది అందులో కీలకమైనది. ఎందుకంటే ఒక పార్టీ విధానాలు నచ్చి ఆ పార్టీ తరఫున బరిలో నిల్చున్నవారిని ప్రజలు ఎన్నుకుంటారు. ఆ విధానాలనే ఆ ప్రతినిధులు పార్లమెంటులో ప్రతిబింబించాలని వారు కోరుకుంటారు. కనుక ఫిరాయించిన చట్టసభల సభ్యులు ఆ నియోజకవర్గ ప్రజలకు ప్రతినిధులయ్యే అర్హత కోల్పోతారు. అందువల్ల అలాంటివారు ఆ పార్టీ ద్వారా లభించిన పదవిని వదులుకుని ప్రజా తీర్పును కోరుతూ మళ్లీ బరిలో నిలబడవలసిందే. వారికి ఆ మాదిరి విలువలు లేని పక్షంలో సభాధ్యక్షులుగా ఉన్నవారు చట్టప్రకారం వ్యవహరించి వారిని బయటకు సాగనంపాలి. అనర్హత వేటు వేయాలి. అప్పుడు మాత్రమే చట్టసభల సమావేశాలు ఫలవంతమైనట్టు. ప్రజాభీష్టాన్ని ప్రతిబింబించినట్టు. అందుకు భిన్నంగా ఎవరైనా సభలో కూర్చుంటే ఆ సమావేశాలు అర్ధరహితమవుతాయి. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది. ఆ దుస్థితి ఏర్పడకుండా కాపాడాల్సినవారు సభాధ్యక్షులే. విపక్షాల ర్యాలీకి హాజరయ్యారన్న ఏకైక కారణంతో ఫిర్యాదు వచ్చిన వెంటనే రాజ్యసభలో శరద్‌యాదవ్, అలీ అన్వర్‌లపై వెంకయ్యనాయుడు అనర్హత వేటు వేశారు. అనర్హత విషయంలో రెండు సభల్లోనూ ఇలా వేర్వేరు ప్రమాణాలు పాటించడం ఆశ్చర్యకరం. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున తొమ్మిదిమంది ఎన్నికయ్యారు. వారిలో నలుగురు పార్టీ ఫిరాయించారు. ఇదంతా బహిరంగమే. ముగ్గురు టీడీపీ కండువాలు కప్పుకుంటే, ఒకరు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. చట్టాన్ని గౌరవించి వీరిపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికి 13 సార్లు వైఎస్సార్ కాంగ్రెస్ సుమిత్రా మహాజన్‌కు వినతి పత్రాలిచ్చింది. లోక్‌సభ పదవీకాలం మరి కొన్ని నెలల్లో ముగియబోతున్నా ఆ విషయం తేలలేదు. ఆ నలుగురు ఎంపీలు వేరే పార్టీల పంచన చేరారో లేదో తేల్చడమనేది అంత జటిలమైన విషయమా? ఆ నలుగురికీ నోటీసులు జారీ చేస్తే వచ్చి వారంతట వారే సంజాయిషీ ఇవ్వరా? ఇవ్వకపోతే ఏం చేయవచ్చునో ఆమెకు తెలియదా? గత బడ్జెట్ సమావేశాల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పలుమార్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసులిచ్చినా సభ సజావుగా సాగడం లేదన్న కారణంతో వాటిపై నిర్ణయం తీసుకోలేదు. చిత్రంగా వర్షాకాల సమావేశాలు ప్రారంభం రోజునే టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును ఆమె ఆమోదించటం, ఆ మర్నాడే ప్రభుత్వం చర్చకు సిద్ధపడటం జరిగిపోయాయి. ఇందులో మతలబు ఏమిటన్న సంగతలా ఉంచి ఆ అవిశ్వాసం నోటీసుపై జరిగిన చర్చలో ఫిరాయింపు ఎంపీ బుట్టా రేణుకకు మాట్లాడే అవకాశం ఎలా ఇచ్చారు? ఏదైనా అంశంపై చర్చ జరిగినప్పుడు దానిపై మాట్లాడేందుకు పార్టీలకు సమయం కేటాయిస్తారు. తమ పార్టీ తరఫున ఎవరెవరు, ఎన్ని నిమిషాల చొప్పున మాట్లాడాలో సంబంధిత పార్టీ విప్ నిర్ణయిస్తారు. వారి పేర్లను సభాధ్యక్షులకు అందజేస్తారు. దాని ప్రకారమే ఆ పార్టీ సభ్యులు మాట్లాడతారు. మరి బుట్టా రేణుక ఏ పార్టీ తరఫున అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడినట్టు? ఈ సమావేశాలకు ముందు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు తమ రాజీనామాలను ఆమోదించమని కోరడానికి సుమిత్రా మహాజన్‌ను కలిశారు. అప్పుడు మరోసారి ఫిరాయింపుల విషయం ఆమె దృష్టికి తీసుకొచ్చారు. సమావేశాల ప్రారంభం సందర్భంగా గత నెల 10న ఆమె వివిధ పార్టీలకు లేఖ రాస్తూ మన పార్లమెంటు, ప్రజాస్వామ్యం సజావుగా, ఆదర్శవంతంగా సాగాలంటే ఏం చేయాలో ఆత్మవిమర్శ చేసుకోవాలని హితోక్తులు పలికారు. మరి ఫిరాయింపుదార్లపై నిర్ణయం తీసుకోవటంలో జాప్యం చేయడమేకాక, వారిలో ఒకరికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం ఏ ఆదర్శాలకు దోహదపడుతుందో ఆమె ఆత్మవిమర్శ చేసుకున్నారా? ప్రజాస్వామ్యం సజావుగా సాగడానికి సమావేశాల ఎజెండా పూర్తికావడం ఒక్కటే గీటురాయా? ఇతరత్రా అంశాలేవీ పరిగణనలోకి రావా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూడా ఫిరాయింపుదార్ల సంగతి తేల్చకుండా తాత్సారం చేస్తున్నారు. పార్లమెంటు అత్యున్నతమైనది కనుక కనీసం అక్కడి నిర్ణయాలైనా రాష్ట్రాల చట్టసభలకు ఆదర్శనీయంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఈసారి సమావేశాల్లో 21 బిల్లులు, సవరణ బిల్లులు ఆమోదం పొందాయి. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ చట్టం సవరణ బిల్లు, మనుషుల అక్రమ తరలింపు నిరోధక బిల్లు, వెనకబడిన తరగతుల జాతీయ కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి బిల్లు వగైరాలు ఇందులో ఉన్నాయి. ప్రవాస భారతీయులు(ఎన్నారైలు) తమ ప్రతినిధి ద్వారా ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలు కల్పించే బిల్లు కూడా ముఖ్యమైనది. విదేశాల్లో మూడు కోట్లకుపైగా ఎన్నారైలు ఉన్నారు. ఈ సమావేశాల్లో ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్ర ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఎండగడతామని, దాన్ని సాధించుకొస్తామని చెప్పిన టీడీపీ దారుణంగా విఫలమైంది. హోదాపై తాము అందరినీ కూడగట్టామని చెప్పుకున్నా, చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీతో సహా ఏ ఒక్కరూ ఆ విషయమై మాట్లాడకపోవడం టీడీపీని నగుబాటుపాలు చేసింది. బహుశా ఆ పార్టీ పార్లమెంటు ముందు వేయించిన పగటి వేషాలతో హోదా అంశాన్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోకపోయి ఉండొచ్చు. ఏదేమైనా పార్లమెంటు సమావేశాలు మున్ముందు మరింత అర్ధవంతంగా సాగాలని అందరూ ఆశిస్తారు. -
టీఆర్ఎస్లో ఉత్కంఠ.. నేడే అవిశ్వాసం
సాక్షి, సిరిసిల్ల : అధికార టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా భావించే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేతల మధ్య అంతర్గత కలహాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సిరిసిల్ల రాజన్న జిల్లా మున్సిపల్ చైర్పర్సన్ నామల ఉమపై నేడు (మంగళవారం) అవిశ్వాస బలనిరుపణ పరీక్ష ప్రవేశపెట్టనున్నారు. గతకొంత కాలంగా సిరిసిల్ల జిల్లా నేతల్లో విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. మొత్తం 20 మంది కౌన్సిలర్లు ఉండగా తొమ్మిది సభ్యులకు బీజేపీ విప్ జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో దీనిపై కొంత ఉత్కఠం నెలకొంది. బల నిరుపణ నేపథ్యంలో మున్సిపల్ పరిధిలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. కాగా ఉమ్మడి కరీంనగర్‌లోనే మరికొందరి టీఆర్ఎస్ నేతలకు అవిశ్వాస సెగ తగులుతోంది. హుజూరాబాద్ ఎంపీపీ, ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతా రావు సతీమణి వొడితెల సరోజినిదేవిపై అవిశ్వాసం నోటీసు ఇవ్వడంతో ఒక్కసారిగా హుజూరా బాద్ రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే టీఆర్ఎస్ నాయకుడు, హుజూరాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్ (బ్రహ్మచారి)పై ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కలెక్టర్‌కు ఇచ్చిన అవిశ్వాసం నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. -
నెగ్గిన అవిశ్వాసం..
సాక్షి, పెద్దపల్లి: అధికార పార్టీకి చెందిన రామగుండం మేయర్ కొంకటి లక్ష్మినారాయణపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. గురువారం గోదావరిఖనిలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్‌లపై సొంత పార్టీ టీఆర్ఎస్ సహా కాంగ్రెస్, బీజేపీ సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఎక్స్అఫీషియో సభ్యుడు, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సహా 37 మంది సభ్యులు అవిశ్వాసానికి మద్దతు పలికారు. మరో ఎక్స్అఫీషియో సభ్యుడు, ఎంపీ బాల్క సుమన్, మేయర్ లక్ష్మీనారాయణ సహా 15 మంది సభ్యులు గైర్హాజరయ్యారు. 37 మంది సభ్యు లు మద్దతు తెలపడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు ఎన్నికల అధికారి, జేసీ వనజాదేవి ప్రకటించారు. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ తమ పదవులను కోల్పోయారు. కాంగ్రెస్ పార్టీ విప్‌ను ధిక్కరించిన 13 మంది కార్పొరేటర్లు అవిశ్వాసానికి మద్దతు పలకడం గమనార్హం. పంతం నెగ్గించుకున్న ఎమ్మెల్యే సోమారపు ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తన పంతం నెగ్గించుకున్నారు. అధిష్టానం దిగి వచ్చేటట్లు చేసి మేయర్‌ను పదవి నుంచి దించేశారు. సోమారపు, మేయర్ నడుమ గతేడాది నుంచి విభేదాలు తీవ్రమయ్యాయి. మేయర్‌కు ఎంపీ సుమన్ మద్దతు ఉందనే ప్రచారం జరిగింది. వర్గపోరు ముదురు పాకాన పడటంతో గత నెల 6న మేయర్, డిప్యూటీ మేయర్లపై ఎమ్మెల్యే వర్గం కార్పొరేటర్లు, కాంగ్రెస్, బీజేపీలతో కలసి అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ వ్యవహారంపై రాష్ట్రంలోని మేయర్లందరూ కలసి సీఎం కేసీఆర్‌కు మొర పెట్టుకొన్నారు. దీంతో అవిశ్వాసాన్ని ఆపేయాలని సత్యనారాయణకు మం త్రి కేటీఆర్ ఫోన్ చేశారు. అధిష్టానంపై కినుక వహించిన సోమారపు రాజకీయ సన్యాసాన్ని ప్రకటించి సం చలనం సృష్టించారు. అధిష్టానం దిగివచ్చి అవిశ్వాసంపై ఎమ్మెల్యేకే తుది అధికారాన్ని కట్టబెట్టడంతో అలకవీడి, మేయర్‌ను అవిశ్వాసంలో ఓడించి పంతం నెగ్గించుకొన్నారు. పార్టీ విప్‌ను ధిక్కరించిన కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎమ్మెల్యే వర్గానికి జై కొట్టడం చర్చనీయాంశమైంది. -
సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్
-
అవిశ్వాస తీర్మానంలో మరో మలుపు
కృష్ణా : గుడివాడ మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం మరో మలుపు తిరిగింది. గతనెల 28న జరగాల్సిన అవిశ్వాసం నాటకీయ పరిణామాల మధ్య వాయిదా పడింది. బలం లేదని గ్రహించి అవిశ్వాస తీర్మానం వాయిదాకు టీడీపీ ప్రయత్నించిందని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. వాయిదా వెయ్యటాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ హైకోర్టుకి వెళ్లింది. దీనిపై విచారణ చేసిన హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి తీర్పు వెలువడే వరకు వైస్ చైర్మన్ మీద ఎటువంటి బలనిరూపణ చేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు నుంచి గుడివాడ ఆర్డీఓకు ఉత్తర్వులు అందాయి. -
అవిశ్వాసానికి థాంక్యూ..!
న్యూఢిల్లీ: పార్లమెంట్లో తనపై అవిశ్వాస తీర్మానం పెట్టిన విపక్షాలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఆ తీర్మానం వల్ల ప్రతిపక్షాల అజ్ఞానాన్ని, అవగాహన లేమిని బట్టబయలు చేయగలిగామన్నారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో మంగళవారం ఆయన ప్రసంగించారు. ‘వారు (విపక్షాలు) తెచ్చిన తీర్మానం వారి రాజకీయ అపరిపక్వతను, అపరిణతిని, అవగాహన లేమి, విషయ పరిజ్ఞాన లేమి మొదలైనవాటినే బయటపెట్టింది’ అని మోదీ వ్యంగ్య బాణాలు విసిరారు. తీర్మానంపై చర్చలో హోంమంత్రి రాజ్‌నాథ్ చేసిన ప్రసంగాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన ప్రధాని.. ఆ ప్రసంగాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ నేతలను కోరారు. అవిశ్వాస తీర్మానం గురించి భేటీలో పాల్గొన్న బీజేపీ చీఫ్ అమిత్ షా, కేంద్రమంత్రులు గడ్కరీ, సుష్మా స్వరాజ్ తదితరులు కూడా మాట్లాడారని కేంద్రమంత్రి అనంత్‌కుమార్ మీడియాకు తెలిపారు. సాధారణంగా ప్రభుత్వ పక్షం మెజారిటీ కోల్పోయినప్పుడు అవిశ్వాస తీర్మానం పెడ్తారని, కానీ ఈ సందర్భంలో అలాంటి పరిస్థితేమీ లేదని వారు విమర్శించారన్నారు. ఐడియాలివ్వండి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావించాల్సిన అంశాలను సూచించాల్సిందిగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘నా ఆగస్ట్ 15 ప్రసంగంలో ఏ అంశాలుంటే బావుంటుంది? మీ ఆలోచనలు, ఐడియాలను నరేంద్ర మోదీ యాప్‌లో ప్రత్యేకంగా రూపొందించిన ఒక ఫోరమ్‌లో నాతో పంచుకోండి. మీ సూచ నల కోసం ఎదురు చూస్తుంటా’ అని మోదీ ట్వీట్ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం కోసం పౌరుల సూచనలు కోరే సంప్రదాయాన్ని మూడేళ్లుగా మోదీ పాటిస్తున్నారు. మైగవ్.ఇన్ వెబ్సైట్ ద్వారా కూడా సూచనలు పంపించవచ్చు. ఇప్పటికే ఆ వెబ్సైట్లో ఇందుకు సంబంధించిన పలు సూచలను ప్రజలు చేశారు. -
అసంబద్ధ వ్యాఖ్యల బాబుదే ‘యూటర్న్’
తెలుగుదేశం పార్టీ మోదీ ప్రభుత్వంపై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన పిదప ఆ మరుసటి రోజు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఢిల్లీలో జాతీయస్థాయి విలేకరుల సమావేశాన్ని నిర్వహించి తాము అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టవలసి వచ్చిందో తెలుపుతూ మాట్లాడిన సందర్భంలో కొన్ని అసందర్భ విషయాల గురించి అతిగా మాట్లాడటం తెలంగాణవాదులమైన మా బోటి వాళ్లను తీవ్ర మనస్తాపం కలి గించింది. బాబు వినిపించిన మాటలనే రాజ్యసభలో ఆ పార్టీ సభ్యులు తిరిగి వినిపించారు. అసహనం పేరుకుపోయిన వ్యక్తుల నుంచే ఇలాంటి అసందర్భ అనుచిత వాక్యాలు రావటం సహజం. అసలు మొత్తంగా వీళ్లు లేవనెత్తుతున్న ఆ అసందర్భ విషయాలు ఏమిటో పరిశీ లిద్దాం. 1.హైదరాబాద్ నా మానసిక పుత్రిక దానికి నేనే రూపమిచ్చా. 2. మోదీ, కేసీఆర్‌ల కన్నముందే నేను ముఖ్యమంత్రిని అయ్యాను. ఇద్దరు ప్రధాన మంత్రులను చేయడంలో నాదే కీలకపాత్ర. 3.మాది మెజారిటీ మైనార్టీలకు చెందిన విషయం కాదు మెజార్టీ మొరాలిటికి సంబంధించిన విషయం 4.యూటర్న్ తీసుకున్నది ఎవరు? ముందుగా హైదరాబాద్ నా మానసిక పుత్రిక, దానికి నేను రూపమిచ్చా అనే దాన్ని పరిశీలిద్దాం. హైదరాబాద్ అభివృద్ధి వెనుక కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. చంద్రబాబు అనే వ్యక్తి పుట్టక ముందే ఇక్కడ అన్ని వసతులు, కీలక సంస్థలు నిజాంల కాలంలోనే నెలకొల్పారు. ఇక హైదరాబాదును పారిశ్రామికంగా తానే అభివృద్ధి చేసినట్లు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ను ఒప్పించి ఇక్కడ ఐ.టి. అభివృద్ధికి కృషిచేసినట్లు చెప్పుకున్నారు. కానీ ఒక్క ఐటీ పరిశ్రమ ఇక్కడికి వస్తే పది నిజాంల కాలంలో వెలసిన పరిశ్రమలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయనే నెపంతో మూసివేసిన ఘనత మీ పాలనలోనిదే. ఆ విధంగా మూతబడ్డ పరిశ్రమలు ఒకటి రెండు కాదు పదుల సంఖ్యలోనే ఉన్నవి. హైదరాబాదుకు మీరిచ్చిన రూపం ఇదేనా? ‘‘మీ కంటే నేనే సీనియర్‌ను. మోదీ, కేసీఆర్లకన్న ముందే నేను సీఎంని అయ్యా’! అనే మాటల్లో వ్యక్తికి ఉండే అహంకారం, అసహనం తప్ప మరేమీ కనిపిం చటం లేదు. మీరు మోదీ, కేసీఆర్‌ల కన్న ముందే సీఎం అయిన్రు. కాని ఎట్ల అయిన్రు అన్నది ప్రశ్న. కుట్రజేసి మీ మామను గద్దెదించి గద్దెనెక్కిన వైనం ఎవరికి తెలువదని? రాజకీయాల్లో మీకున్న అనుభవమల్లా ఇదేనా? పైగా మీరు సీఎం అయినా, మోదీ ప్రధాని అయినా అది మీవల్ల కాదు, ప్రజల వల్ల. ప్రజలే మీ ఇద్దరి కన్న గొప్ప. ప్రజలు తలచుకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓడలు బండ్లయితవి. బండ్లు ఓడలయితవి అని మర్చిపోవద్దు. నైతిక విలువలను ఇతరులకు చెప్పేవాళ్లు కొంతలో కొంతైన తమ నిత్యజీవితంలో ఆచరించడం మంచిది. రాజకీయాలలో ఏ నైతిక నియమాలను పాటించి మీరు సీఎం అయ్యిన్రు. 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను మీ పార్టీలో చేర్చుకోవడమే కాక వారిలో నలుగురికి మంత్రి పదవులను కట్టబెట్టడం నైతికమా? మొదట స్పెషల్ హోదాను కాదని స్పెషల్ కేటగిరీకి ఒప్పుకున్నారు. మళ్లీ ఇప్పుడు స్పెషల్ హోదా కోరుతున్నది ఏ నైతిక విలువల ప్రకారం? తాను మొరాలిటి పక్షాన మెజారిటీపై పోరాడుతున్నానని తనది ధర్మపోరాటమని, ఈ పోరాటంలో తనతో అందరూ కలిసిరావాలని కోరడం జరిగింది. మొదటి నుంచి ప్రత్యేక హోదా గురించి పోరాడుతున్న వారిది ధర్మపోరాటం కాదట. కాని తన ఒక్కనిదే ధర్మపోరాటం అనడం ఆశ్చర్యకరం. తనతో కలసి వచ్చే వాళ్లు నీతిమంతులు, ధర్మకర్తలట. తనతో కలసిరాని వాళ్ళు అవినీతి పరులు, అధర్మకర్తలట. ఇక చివరగా వీరంటున్న యూటర్న్ గురించి చర్చిద్దాం. రాజకీయపార్టీలు తమ అవసరాన్ని ఇతర పార్టీలతో కలిసి జతకడుతూ ఉంటాయి. కానీ బాబులాగా యూటర్న్ మాత్రం తీసుకోవు. యూటర్న్ రాజకీయాలకు శ్రీకారం పడ్డది చంద్రబాబు ద్వారానే. గత ఎన్నికలలో ఎన్డీయేతో కలిసి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కూటమి కట్టి పోటీ చేసి గెలిచి కేంద్రంలో నాలుగేళ్లు అధికారంలో కొనసాగి తీరా ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు ఎన్డీయే కూటమి నుంచి వైదొలగి కాంగ్రెస్ మద్దతుతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం యూటర్న్ రాజ కీయం కాదా? నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు ప్రధాన కారకుడు బాబు, అతని యూటర్న్ అనైతిక రాజకీయాలు. తన తప్పుల్ని సరిదిద్దుకోకుండా తప్పులన్నింటిని ఇతరులపై నెట్టే ప్రయత్నంలో భాగంగానే అతను కేంద్రంపై పోరాటానికి పిలుపునిచ్చింది. ఓ రాష్ట్ర సీఎంగా ఉంటూ ప్రజలను పోరాటానికి రమ్మని పిలుపునివ్వటం బాధ్యతారాహిత్యమే. గత నాలుగేళ్లుగా ఏపీ సమస్యలపైనా దాని అభివృద్ధి పట్ల దృష్టి సారించక ఈ రోజు మేల్కొని పోరాటానికి పిలుపునివ్వటం, ప్రజ లను తనతో కలిసి రావాల్సిందిగా కోరటం విచారకరం. బాబు ఇప్పటికైనా అనవసరమైన రాద్ధాంతాల జోలికి పోకుండా రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారిస్తారని ఆశిద్దాం. ప్రొ‘‘ జి.లక్ష్మణ్, వ్యాసకర్త అధ్యాపకులు, ఉస్మానియా యూనివర్సిటీ మొబైల్ : 98491 36104 -
మరోసారి బయటపడ్డ టీడీపీ కుట్ర: నాని
సాక్షి, గుడివాడ(కృష్ణా జిల్లా): తెలుగుదేశం పార్టీ కుట్ర రాజకీయాలు మరోసారి బహిరంగంగా బట్టబయలయ్యాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుడివాడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పదవి దక్కించుకోవాలనుకున్న అధికారి పార్టీ కుటిల యత్నాలు విఫలమయ్యాయని ఎమ్మెల్యే విమర్శించారు. వైస్ చైర్మన్ పదవి కోసం టీడీపీ తవ్వుకున్న గోతిలో ఆపార్టీయే పడిందని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ సీపీకి చెందిన 12 మంది కౌన్సిలర్లను ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బలం పెరిగిందనుకొని వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. శనివారం అవిశ్వాసంపై చర్చ జరగాల్సివుండగా ఇద్దరు కౌన్సిలర్లు కనిపించడం లేదని కొత్త డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. అవిశ్వాసంపై చర్చలో టీడీపీని ఫిరాయింపులపై ఎండగట్టాలని అనుకున్నామని వివరించారు. అవిశ్వాసంపై చర్చ జరిగితే టీడీపీలోని గ్రూపులు బయటపడతాయనే ఉద్దేశంతో ఈ డ్రామాలు ఆడుతున్నారని కొడాలి నాని ఆరోపించారు. -
ఫలించిన టీడీపీ కుట్ర రాజకీయం
సాక్షి, కృష్ణా : గుడివాడ మున్సిపాలిటీలో టీడీపీ కుట్ర రాజకీయం ఫలించింది. మున్సిపల్ వైస్ ఛైర్మన్ అడపా బాబ్జీపై టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానం రేపటికి వాయిదా పడింది. శనివారం వైఎస్సార్ సీపీకి చెందిన మున్సిపల్ వైస్ ఛైర్మన్ అడపా బాబ్జీపై అవిశ్వాస తీర్మానం బెడిసికొట్టడంతో రేపటికి వాయిదా పడేలా టీడీపీ కుట్రలు రచించింది. కౌన్సిల్లో బలం లేకపోయిన ఇటీవల వైఎస్సార్ సీపీ నుంచి చేరిన ఛైర్మన్, కౌన్సిలర్లపై నమ్మకంతో టీడీపీ అడపా బాబ్జీపై అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఈ అవిశ్వాస తీర్మానాన్ని టీడీపీలో చేరిన కౌన్సిలర్లు వ్యతిరేకించారు. అవిశ్వాస తీర్మానానికి గైర్హాజరు కావాలని ఫిరాయింపు కౌన్సిలర్లు నిర్ణయించుకున్నారు. ఇద్దరు కౌన్సిలర్లు టీడీపీ నేతలకు అందుబాటులో లేకుండా ఫోన్లు స్విచ్చాఫ్ చేయగా కౌన్సిలర్లు కనిపించటం లేదని వారి కుటుంబసభ్యులతో గుడివాడ పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. ఇరువురు కౌన్సిలర్లు కనపడటం లేదనే ఫిర్యాదు రావటంతో ఈ రోజు జరగాల్సిన అవిశ్వాసం ఓటింగ్ సమావేశం ఆదివారానికి వాయిదా పడింది. -
మోదీనే ట్రాప్‌లో పడ్డారు.. చంద్రబాబు ఎదురుదాడి!
సాక్షి, కొవ్వూరు : అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ టీడీపీలో కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక టీడీపీ అధినాయకత్వం సతమతమవుతోంది. ప్రత్యేక హోదా వద్దంటూ తొలుత ప్యాకేజీకి అంగీకరించిన చంద్రబాబు.. ఆ తర్వాత మాట మార్చి యూటర్న్ తీసుకున్నారని, ఈ విషయంలో ఆయన వైఎస్సార్సీపీ ట్రాప్‌లో పడ్డారని ప్రధాని మోదీ ఘాటుగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక.. తాజాగా చంద్రబాబు ఎదురుదాడి మొదలుపెట్టారు. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్ సీపీ ట్రాప్‌లో తాను పడలేదని, ప్రధాని మోదీనే ట్రాప్‌లో పడ్డారని ఆయన చెప్పుకొచ్చారు. ఢిల్లీలో ఉండి తెలుగువాడి సత్తా చూపిస్తామని చెప్పిన చంద్రబాబు. టీడీపీ ఎంపీలు మాత్రం రాజీనామా చేయరని అన్నారు. అన్ని పార్టీలను కలుపుకొని కేంద్రంపై పోరాటం చేస్తామని చెప్పారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించిన సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. విభజనతో నష్టపోయిన ఏపీకి అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు మొదటినుంచి అవకతవక వైఖరిని అవలంబించారు. ఆయన హోదా కాదని ప్యాకేజీకి స్వాగతించడమే కాక.. ఈ విషయంలో ప్రధాని మోదీని, అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలకు అభినందనలు తెలిపారు. చంద్రబాబు ఒకవైపు ప్రత్యేక హోదాను ఖూనీ చేసేవిధంగా ప్రవర్తించినా.. వైఎస్సార్సీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం మొక్కవోని పట్టుదలతో, నిరంతర పోరాటాలతో హోదా ఆకాంక్షను ఆయన సజీవంగా నిలిపారు. అలుపెరగని పోరాటాలతో ఇటు చంద్రబాబు ప్రభుత్వంపై, అటు కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో మొదట ప్యాకేజీ కోసం పాకులాడిన చంద్రబాబును.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తన యూటర్న్ రాజకీయాలను తెరపైకి తెచ్చి.. ఇటీవల హోదా నినాదం ఎత్తుకొని ఆర్భాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ ట్రాప్‌లో తాను పడ్డానని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక.. కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ఏకంగా మోదీని ట్రాప్‌లో పడ్డారని ఆయన ఎదురుదాడి చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
విశ్వసనీయత లేని అవిశ్వాసం
ఆ ముచ్చట కూడా తీరిపోయింది. కేంద్ర ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం అనుకున్నట్లుగానే వీగిపోయింది. ఇంతకూ ఏమి ఆశించి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్లు అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఉన్నది. అవిశ్వాస తీర్మానం వల్ల ప్రభుత్వంలో మార్పు వచ్చే అవకాశం లేదు అనేది ముందే తెలిసిన విషయం. ఇక విభజన అంశాలలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని అన్ని అంశాల మీద నిర్ద్వంద్వంగా చెప్పకనే చెప్పింది. అవిశ్వాసం వల్ల భయపడి వారి విధానంలో మార్పు వస్తుందని ఆశించే అవకాశం లేదు. ఇక ఎటు వచ్చి అవిశ్వాస తీర్మానం ద్వారా సాధించగలిగిన ఒకే ఒక్క లక్ష్యం ప్రజల ముందు విభజన హామీలు అమలు చేయనందుకు బీజేపీ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టటం. ఈ అంశం మిగిలిన రాష్ట్రాలకు ప్రధానమైన అంశం కాదు కనుక దీనిపై చర్చ కనుగుణంగా ఆయా రాష్ట్రాల ప్రజలు స్పందించే అవకాశం ఎటు లేదు. ఇక మన రాష్ట్రంలో ప్రజలు స్పందించడానికి ఈ అవిశ్వాసం ఒక్కటే మార్గం కానక్కర్లేదు. పైపెచ్చు కేంద్రాన్ని అవిశ్వాస తీర్మానం ద్వారా నిలదీయటానికి తెలుగుదేశం పార్టీకి కొన్ని సహజమైన పరిమితులు ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం ఇంతకుముందే ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీని అంగీకరించడం, దానికి చట్టబద్ధత కావాలని కోరడం, కేంద్ర క్యాబినెట్ ఆమోదించడం ఇవన్నీ జరిగిపోయాయి. ఆ ప్యాకేజీ కింద నిధులు పొందే సమయంలో తీసుకోవాల్సిన తదనంతర చర్యలు ఆపేసి రాష్ట్ర ప్రభుత్వం హోదా బాటపట్టింది. ఈ అంశంపై జరిగే చర్చలో కేంద్రాన్ని టీడీపీ నిలదీసే బదులు తెలుగుదేశాన్ని కేంద్ర ప్రభుత్వం నిలదీసే అవకాశాలు జాస్తి. అటువంటి పరిస్థితుల్లో అత్యుత్సాహంతో పోయి అవిశ్వాస తీర్మానం పెట్టడం సమస్యలు కొనితెచ్చుకున్నట్టే అవుతుంది. రెండో ముఖ్యాంశం తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. కేంద్రంతో కొంతలో కొంత సఖ్యత నిలుపుకుంటూ నిధులు రాబట్టుకోవాల్సిన బాధ్యత వారి పైన ఉన్నది. ప్రతిపక్షాల లాగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే వెసులుబాటు అధికారంలో ఉన్న పక్షానికి ఉండకపోవచ్చు. ప్యాకేజి ద్వారా ఎస్పీవీ పెట్టుకుంటే నిధులు వస్తాయంటే మేముపెట్టుకోము మాకు హోదా కావాలని భీష్మించే అవకాశం ప్రభుత్వంలో ఉన్న ఏ పార్టీకి ఉండదు. ఇక అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చను పరిశీలిస్తే.. టీడీపీ ఎంపీలు తప్ప మిగిలిన పార్టీల తరఫున మాట్లాడిన సభ్యులెవరికీ విభజన సమస్యలు, ప్రత్యేకహోదా ప్రధానాంశాలు కాకుండా పోయాయి. అందువలన చాలావరకు అవిశ్వాస తీర్మానం సాధారణ రాజకీయ పరిస్థితులపై చర్చకే పరిమితం కావడం జరిగింది. మరి అవిశ్వాస తీర్మానానికి ఇతర పార్టీల మద్దతు అడిగినప్పుడు టీడీపీ ఎంపీలు తమ తీర్మానానికి మద్దతు మాత్రమే అడిగారా లేక వారు ప్రసంగించేటప్పుడు విభజన అంశాల గురించి మాట్లాడవలసిందిగా అభ్యర్థించారా? ఆవిధంగా అభ్యర్థించి ఉంటే తప్పకుండా విభజన అంశాల ప్రస్తావన మిగిలిన పార్టీల సభ్యుల ప్రసంగాల్లో కూడా ప్రధానంగా వినిపించి ఉండేది. ఏపీ విభజన చట్టం చర్చించే సమయంలో దానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడిన టీఎంసీ పార్లమెంటు సభ్యులు సౌమిత్రి రాయ్ ఈసారి మాత్రం పెద్దగా స్పందించలేదు. ఈ అంశాన్ని వ్యూహాత్మకంగా తీసుకు పోవటంలో టీపీపీ పూర్తిగా విఫలమైందని చెప్పటానికి ఈ ఒక్క నిదర్శన చాలు. ఈ అవిశ్వాస తీర్మానం మోదీకి రాజకీయంగా విస్తృత అంశాలపై స్పందించటానికి ఒక చక్కని అవకాశాన్ని ఇచ్చిందే కానీ రాష్ట్ర విభజన అంశాలు కానీ ప్రత్యేకహోదా అంశం కాని కేంద్ర బిందువుగా చర్చజరిగే అవకాశం కల్పించలేదు. చర్చ ముగించే ముందు వచ్చిన అవకాశాన్ని కేశినేని సరిగా వినియోగించుకోలేదు. ప్రభుత్వం నుంచి వివరణ హామీ కోసం నిర్దిష్ట అంశాలను లేవనెత్తి ఉండాల్సింది. మొత్తం అవిశ్వాస తీర్మానం పై జరిగిన చర్చలో ఒక ప్రధానాంశాన్ని టిఆర్ఎస్ ఎంపీ వినోద్ లేవనెత్తారు. అసలు ప్రత్యేక హోదా అంటే ఏంటి? పరిశ్రమ రాయితీలు హోదాలో భాగమా? అన్నారు. నా దృష్టిలో దీనిమీద ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. అది గమనించలేకపోవడం మన అవగాహనా రాహిత్యంగా కనిపిస్తూ ఉన్నది. - ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com -
‘లోఫర్లే అలా చేస్తారు’
పనాజి : అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రవర్తించిన తీరుపై విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. ప్రధాని మోదీని కౌగిలించుకోవడం, అనంతరం తన సీట్లో కూర్చుని కన్నుగీటడం వంటి చర్యల ద్వారా రాహుల్ సభా మర్యాదను మంటగలిపారని బీజేపీ నేతలు విరుచుకు పడిన విషయం తెలిసిందే. తాజాగా గోవా బీజేపీ అధికార ప్రతినిధి దత్తప్రసాద్ నాయక్ రాహుల్ గాంధీ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. భారత ప్రజల సమస్యలను, కష్టాలను అర్థం చేసుకోలేని వ్యక్తే ఇలా ప్రవర్తిస్తారంటూ రాహుల్ గాంధీపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కొలువుదీరిన పవిత్రమైన ఆలయం(పార్లమెంటు)లో రాహుల్ చేసిన పనులు చాలా అవమానకర రీతిలో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీల్లో, రోడ్లపై అమ్మాయిలను ఏడిపించే లోఫర్లే ఇలా కన్నుగీటుతారని, రాహుల్ కూడా సభలో ఓ లోఫర్ లాగే వ్యవహరించారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గాంధీ కుటుంబం చేతుల్లో తోలుబొమ్మల్లా మారిన కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్లు చెప్పినట్టల్లా ఆడుతున్నారని విమర్శించారు. కాగా గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్.. బీజేపీ, మిత్ర పక్షాల చేతిలో తోలుబొమ్మగా మారడం వల్లే రాష్ట్రంలో ఫిష్ మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయంటూ కాంగ్రెస్ నేత చోదంకర్ విమర్శించారు. ఈ నేపథ్యంలోనే దత్తప్రసాద్ నాయక్ రాహుల్ గాంధీపై, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. -
రక్తికట్టని ‘అవిశ్వాస’ నాటకం
నిజానికి చంద్రబాబు లోక్‌సభలో ప్రవేశపెట్టించింది ‘విశ్వాస’ ప్రకటనేగాని ‘అవిశ్వాస’ తీర్మానం కాదని మెడమీద తలలున్న ప్రతి ఒక్కరికీ తెలుసు! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల ఏపీ ప్రజల భవిష్యత్తు దృష్ట్యా ప్రత్యేక ప్రతిపత్తి హోదా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది. బీజేపీ సైతం కాంగ్రెస్ బాటలో పయనించింది. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని, దానితో సరిపెట్టుకోవాలని చంద్రబాబు అప్పట్లో సరేనన్నారు. ‘దొరారి అభిప్రాయమే నా అభిప్రాయం’ అనే రీతిలో ఆయన సరిపెట్టుకుని రకరకాల వంకలూ, డొంకలూ పట్టుకుని తిరుగుతున్నారు. ఈ కుమ్మక్కు రాజకీయంలో భాగంగానే బీజేపీ సర్కారుపై ఎదురుదాడి చేసినట్టు ఆయన కొత్త నాటకం మొదలెట్టారు. (గత వారం జమిలి ఎన్ని కలపై కుదేలైన బీజేపీ భ్రమలు వ్యాసానికి కొనసాగింపే ఈ గ్రంథ సమీక్షా వ్యాసం. గత నాలుగేళ్ల ఎన్డీఏ పాలనలో ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఘటిల్లిన పరిణామాలను సమీక్షిస్తూ మీడియా హౌస్ ప్రచురించిన బృహత్ గ్రంథం ‘‘డిస్ట్రాయింగ్ ఇండి యా’’ను ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఇటీవల ఆవి ష్కరించారు. మోదీ ప్రభుత్వంపై తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వాస్తవానికి ‘విశ్వాస ప్రకటన’ మాత్రమే. ఈ పూర్వరం గంలో ఈ పుస్తకంపై సమీక్షా రచన ఇది.) 2014 పార్లమెంటు ఎన్నికల్లో దేశప్రజలు బీజేపీకి అనుకూలంగా ఇచ్చిన తీర్పును దేశంలోని ప్రతిపక్షాలు బేఖాతరు చేస్తున్నాయి. నాకు వ్యతిరేకంగా ఎన్ని ప్రతి పక్షాలు ఏకమైనా ఆ మేరకు బీజేపీ ‘కమలం’ వికసి స్తూనే ఉంటుంది. నేను అవినీతిని, ఆశ్రితపక్షపాతాన్ని ఎదుర్కొంటున్నందునే బీజేపీ సంకీర్ణానికి వ్యతిరే కంగా ప్రతిపక్షాలు ఐక్యం కాలేకపోతున్నాయి. ఈ పరి స్థితుల్లో కాంగ్రెస్ కేంద్రంగా ఐక్యసంఘటన ఏర్పడడం ఏపీ సీఎం చంద్రబాబుకు ఇష్టంలేదు. అందుకే ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేయడానికి ఆ ప్రభు త్వానికి వ్యతిరేకంగా లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం పెట్టారు. అయినా ప్రజలు నాపైన విశ్వాసం ఉంచారు. కాబట్టి ప్రతిపక్షాల ప్రయత్నం వృధా అయింది. – అవిశ్వాస తీర్మానం వీగిపోయిన మరుసటి రోజు యూపీలోని సహారన్పూర్ సభలో ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన నిజానికి తెలుగుదేశం నేత చంద్రబాబు లోక్‌సభలో ప్రవేశపెట్టించింది ‘విశ్వాస’ ప్రకటనేగాని ‘అవిశ్వాస’ తీర్మానం కాదని ప్రతి ఒక్కరికీ తెలుసు! ఎన్డీఏ సర్కా రుకు ఏ రూపంలోనూ మద్దతు తెలపకుండా ఏపీలో బలమైన ప్రతిపక్ష నేతగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్య క్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శరవేగాన ముందుకు దూసుకు వస్తున్నారు. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ పాలనలో జగన్‌పై బనాయించిన కేసులను బీజేపీ హయాంలోనూ తేల్చకుండా సాగదీస్తున్నారు. అప్పుడూ ఇప్పుడూ బాబు మాటే ఈ విషయంలో చెలామణి అవుతున్నట్టు కనిపిస్తోంది. చివరికి, సీబీఐ ప్రత్యేక కోర్టులు సైతం, ‘మీ ఆరోపణలకు, కేసుల విచారణకు ఆదీ, అంతాలు లేకుండా పోయిన సాక్ష్యా లకు ముగింపు ఎప్పుడు?’ అని సీబీఐని ప్రశ్నిం చాల్సి వచ్చింది. కాంగ్రెస్, టీడీపీ కుట్రలను జగన్ బహిర్గతం చేయడమే ఈ పార్టీలను ఏకం చేస్తోంది. ఈ రెండు పార్టీల కుట్ర ఫలితంగానే కాంగ్రెస్ నుంచి జగన్ బయటికొచ్చి ప్రభంజనమై అవతరించారు. ఈ పరిణామాన్ని కాంగ్రెస్ అధిష్టానం సహించలేక పోయింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ పెట్టిన కేసులు ముందుకు సాగకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారు. మరో వైపు అలాంటి కేసులే తనపై హైకోర్టు, సుప్రీంకోర్టులో ప్రస్తావనకు వచ్చినా ఆయన అన్యమార్గాల ద్వారా తప్పించుకుంటు న్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన వల్ల ఏపీ ప్రజల భవి ష్యత్తు దృష్ట్యా ప్రత్యేక ప్రతిపత్తి హోదా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది. బీజేపీ సైతం కాంగ్రెస్ బాటలో పయనించింది. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని, దానితో సరిపెట్టుకోవాలని అంటే చంద్రబాబు అప్పట్లో సరేనన్నారు. ‘దొరారి అభిప్రా యమే నా అభిప్రాయం’ అనే రీతిలో రకరకాల వంకలూ, డొంకలూ పట్టుకుని తిరుగుతున్నారు. ఈ కుమ్మక్కు రాజకీయంలో భాగంగానే బీజేపీ సర్కా రుపై ఎదురుదాడి చేసినట్టు ఆయన కొత్త నాటకం మొదలెట్టారు. అందుకు ప్రతిగా, ‘బాబు కోరిందే (ప్యాకేజీ) ఇవ్వడానికి మేం అంగీకరించాం,’ అని మోదీ చెప్పారు. ఎన్డీఏ సర్కారు నుంచి బయటి కొచ్చాక కూడా కేంద్ర ప్రభుత్వ కమిటీల్లో తెలుగు దేశం ప్రాతినిధ్యం కొనసాగుతోంది. ‘మాతో చంద్ర బాబు స్నేహం అలాగే ఉంది. ఇంకా కొనసాగు తుంది’ అని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటించడం బీజేపీ, టీడీపీ మధ్య ఓ కొత్త మ్యాచ్ ఫిక్సింగ్ క్రీడగా మారింది. భ్రష్టుపట్టించిన బీజేపీ పాలనపై కొత్త పుస్తకం! సరిగ్గా ఈ వాతావరణం మధ్యనే గత నాలుగేళ్ల పాలనా కాలంలో జరిగిన ప్రజావ్యతిరేక, విషాదకర పరిణామాలను ఏకరువు పెడుతూ ‘భారతదేశాన్ని భ్రష్టుపట్టించిన నాలుగేళ్ల బీజేపీ పాలన’ అనే మకు టంతో దిల్లీకి చెందిన మీడియా హౌస్ సంస్థ ప్రచు రించిన పుస్తకాన్ని ‘మోదీ రిపోర్ట్‌కార్డ్ డాట్‌కామ్’ అనే వెబ్సైట్లో ఓ రిపోర్ట్‌గా వెల్లడించింది. నేడు దేశంలో మత ప్రాతిపదికపై సాగుతున్న అరాచకాలు, హత్యలు, పెరుగుతున్న నిరుద్యోగం, పెట్రోలు, డీజిల్ ధరలు, ఇంకా పెద్ద నోట్ల రద్దు వల్ల చిన్న వ్యాపారులు, రైతులు సహా సాధారణ ప్రజలు పడిన పాట్లు వంటి అనేక సమస్యలపై ‘డిస్మాంట్లింగ్ ఇండియా ఇన్ ఫోర్ ఇయర్స్’ అనే ఈ పుస్తకంలో వివరించారు. ఈ గ్రంథ రచనలో పాతిక మందికి పైగా ప్రసిద్ధ పరిశోధకులు, చరిత్రకారులు, ఆర్థిక వేత్తలు, జర్నలిస్టులు సహా వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులు పాల్గొన్నారు. మోదీ రిపోర్ట్ కార్డ్ (2018) లోని కొన్ని అంశాలు క్లుప్తంగా ఇక్కడ ప్రస్తావిస్తు న్నాను. దేశంలో 2014లో 3.41 శాతం ఉన్న నిరు ద్యోగం 2018కి 6.23 శాతానికి పెరిగింది. నాలు గేళ్లలో 4 కోట్ల ఉద్యోగాలన్న హామీ 2017దాకా 8.23 లక్షలకే పరిమితమైంది. పెట్రోల్, డీజిల్ ధరలు 2018లో ఎప్పుడూ లేనంతగా పెరిగాయి. 2014లో లీటర్ పెట్రోల్ ధర రూ.68.86 ఉండగా, తర్వాత క్రూడాయిల్ ధర తగ్గినాగాని 2018 కల్లా రూ.81. 92కి చేరింది. నోట్ల రద్దు ఫలితంగా 2017 జన వరి–ఏప్రిల్ మధ్య 15 లక్షల ఉద్యోగాలు పోయాయి. పెద్ద నోట్ల రద్దు, కొత్త నోట్లకైన ఖర్చు ఫలితంగా దేశ స్థూల జాతీయోత్పత్తుల విలువ 7.93 నుంచి 6.50 శాతానికి పడిపోయింది. అవినీతి విషయానికి వస్తే, బ్యాంకుల మోసాల సంఖ్య రూ. 12,787 నుంచి అదే కాలంలో రూ. 17,789 కోట్లకు చేరింది. అదే సమ యంలో ఇండియాను మొత్తం ఆసియాలోనే అత్యంత అవినీతి దేశంగా అమెరికాకు చెందిన ఫోర్బ్స్ సంస్థ ప్రకటించింది. ఎన్నో రాష్ట్రాల్లో అవినీతిపై విచారణకు అవసరమైన లోక్‌పాల్‌ను ఇంతవరకు నియమించ లేదు. దళితులపై ఎన్నో రెట్లు పెరిగిన దాడులు దళితులపై దేశవ్యాప్తంగా జరిగిన దాడులకు సంబం ధించి 2008లో 33 వేల కేసులు నమోదుకాగా, బీజేపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో 746 శాతం, గత పదేళ్లలో 1,160 శాతం పెరిగిపోయాయని జాతీయ నేర రికార్డుల బ్యూరో ప్రకటించింది. ఇక రైతాంగ సంక్షోభం వల్ల వ్యవసాయరంగ అభివృద్ధి రేటు 2010–2014 మధ్య 5.2 శాతం నమోదు కాగా 2014–18 మధ్య అది 2.4 శాతానికి దిగజారిపో యింది. 2014–2016 మధ్య ఆత్మహత్య చేసుకున్న రైతులు 36,420 మంది కాగా, 2017–18 మధ్య అంచనాలు ప్రభుత్వం నుంచి ఇంకా రావాల్సి ఉంది. గత నాలుగేళ్లలో బీజేపీ ప్రభుత్వం మూసేసిన ప్రభుత్వ పాఠశాలలు 2 లక్షలు. పాఠశాల పాఠ్య పుస్తకాల్లో చరిత్ర పాఠాల్ని, చరిత్రను తిరిగి రాసే పనికి శ్రీకారం చుట్టారు. ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాల మెరుగుదల విషయంలోను, పరిస్థితి లోనూ మార్పేమీ లేదు. ఇక మోదీ హయాంలో దేశ న్యాయ వ్యవస్థ నిర్వహణలో భారీ సంక్షోభం నెల కొంది. ఎన్కౌంటర్ మరణాల్లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పాత్రపై విచారణ జరుపుతున్న క్రమంలో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీహెచ్ లోయా ఆకస్మిక మరణంపై విచారణ ఆకస్మికంగా నిలిచిపో యింది. చివరికి ఈ పరిణామం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను పార్లమెంట్ అభిశం సించాలన్న డిమాండ్‌కు దారితీసింది. ఆధార్ కార్డు ఉనికి కాస్తా జాతీయ స్థాయిలో చర్చకు, అభిశంస నకూ పాత్రమైంది. ఈ నాలుగేళ్లలోనూ దేశంలో ఆరోగ్య సంరక్షణ, ఇతర సంక్షేమ వ్యవస్థల నిర్వహ ణకు నిధులు తరిగిపోయాయి. ప్రజల సంక్షేమంపై ఏదీ శ్రద్ధ? గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులు తగ్గిపోయాయి లేదా పక్కదారులు పట్టాయని రిపోర్టు కార్డు వివరించింది. ఆరోగ్య సంరక్షణ విష యంలో ఇరుగుపొరుగు దేశాలైన చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్లతో పోల్చితే ఇండియా స్థానం ఈ నాలుగేళ్లలోనే 195 దేశాల్లో 145వ స్థానానికి పడి పోయింది. మోదీ ప్రారంభించి, ఆచరణలో అసలు అమలు కాకుండా ఉన్న పెక్కు పథకాలు కాంగ్రెస్ ప్రారంభించినవే కాగా, వాటికే కేవలం పేర్లు మార్చ డమే జరిగిందని రిపోర్ట్ కార్డు వివరించింది. పర్యా వరణ రక్షణ పథకాల అమలులోనూ ప్రపంచంలోని 180 దేశాల్లో మనం 177వ అథమ స్థానంలోకి ఈ నాలుగేళ్లలోనే చేరుకున్నాం. అలాగే గత నాలుగేళ్ల లోనే దేశంలో జరిగిన మత ఘర్షణలు 2020. అందులో (2014 నుంచి 2018 దాకా) హతులైన వారి సంఖ్య 389 కాగా, గాయ పడినవారు 8,890 మంది. ఇవన్నీ ఈ నాలుగేళ్లలోనే ఏడు రాష్ట్రాలకు వ్యాపించాయి. అంతేగాదు, ఈ నాలుగేళ్లలోనే బీజేపీ హయాంలో జరిగిన మత ఘర్షణల్లో, విద్వేష ప్రచార ఘట్టాలలో జరిగిన వేధింపులు, హత్యాకాండ నేరా లకు సంబంధించిన కేసుల్లో శిక్షలు పడిన పార్టీ నేర గాళ్లకు మద్దతుగా పరామర్శించడానికి వెళ్లినందుకు బీజేపీ మంత్రి జయంత్ సిన్హాను కేబినెట్ నుంచి తొలగించాలని కోరుతూ పలు రాష్ట్రాలకు చెందిన సుమారు 50 మందికి పైగా మాజీ సివిల్ సర్వెంట్స్ (ఐఏఎస్/ఐపీఎస్/దౌత్యాధికారులు/ప్రధాన కార్యద ర్శులు ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది చివరి మాసాల్లో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఎన్ని కల్లో హిందువులను భయ భ్రాంతుల్ని చేసే అనేక పద్ధతుల్లో అబద్ధపు వార్తలతో ‘నకిలీ వార్తల కర్మా గారం’ (ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ) నడుస్తోందని కూడా వార్తలు పొక్కుతున్నట్టు కూడా ‘వైర్’ లాంటి మాధ్య మాలు హెచ్చరిస్తున్నాయి. ఏది ఏమైనా అటు పాల కులు, ఇటు ప్రసార మాధ్యమాలు, రాజకీయ పక్షాలు, వాటి అనుయాయులూ జాగరూకులై ఉండా లన్నది మాధ్యమాల ఆరోగ్యకరమైన సందేశం! - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@ahoo.co.in -
ప్రహసనంగా ముగిసిన అవిశ్వాసం!
పార్లమెంటులో ఏమీ సాధించే అవకాశం లేకపోయినా గొప్పలకు పోయిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి తన వేలితో తన కన్నే పొడుచుకున్నట్లయింది. దేశం ముందు, రాష్ట్ర ప్రజల ముందు బీజేపీని అభాసుపాలు చేయాలనుకున్న టీడీపీకీ, చంద్రబాబుకీ ఎదురుదెబ్బలు మిగిలాయనడంలో సందేహం లేదు. తమ వెంట కొత్తగా వచ్చేవారెవరూ లేరని దేశప్రజలకు పార్లమెంట్ సాక్షిగా తెలియజేసినట్లయిందనడానికి నిదర్శనం అవిశ్వాసానికి అనుకూలంగా వచ్చిన కేవలం 126 మంది మద్దతే. అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి ముందు, పార్లమెంటులో స్పీకర్ సుమిత్రా మహాజన్ అవి శ్వాసంపై చర్చకు అనుమతించిన తర్వాత తెలుగుదేశం, కాంగ్రెస్ తదితర వారి మిత్రపక్షాల పెద్దలు మాట్లాడిన మాటలు కోటలు దాటాయి. కానీ వారిమాటలకు తగినట్లుగా కూడా వారు సిద్ధం కాకపోవడం స్పష్టంగా తెలిసిపోయింది. అందుకే ప్రధాని నరేంద్రమోదీ కూడా తన ప్రసంగంలో వారి తీరును ఎద్దేవా చేశారు. భూకంపం సృష్టిస్తాం అన్నారు.. ఏదీ భూకంపం? అవిశ్వా సంపై చర్చలో మాట్లాడడానికి కనీసం ముందస్తుగా సిద్ధమై రాలేదు అని మోదీ ఎత్తిపొడిచారు. ఇక టీడీపీ తరఫున అవిశ్వాస తీర్మానంపై ప్రసంగించిన గల్లా జయదేవ్ మాటల్లో కూడా కొత్తదనం కనిపించలేదు. ముందుగా నిర్ణయించిన సమ యం కన్నా రెట్టింపుకుపైగా సమయాన్ని స్పీకర్ అనుమతించినా ప్రయోజనం లేకపోయింది. మోదీని వ్యక్తిగతంగానూ, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికే పార్లమెంటులో టీడీపీ అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టినట్లయింద. కేంద్రంపై టీడీపీ విమర్శలన్నీ తెలుగు ప్రజలు నిత్యం అరిగిపోయిన రికార్డుల్లా వింటున్నవే కావడం గమనార్హం. అందుకే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ వైఖరిని ట్వీట్లతో తూర్పారబట్టారు. స్వార్థ ప్రయోజనాల కోసమే టీడీపీ నేతలు ప్రత్యేక హోదా విషయంలో రాజీపడ్డారని విమర్శించారు. ఇక రాష్ట్రానికే చెందిన బీజేపీ సభ్యుడు హరిబాబు తెలుగుదేశం వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. నిబంధనల ప్రకారం టీడీపీ ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్–ఎస్పీవీ–ని ఇప్పటికీ ఏర్పాటు చేయలేదన్నారు. అందుకే కేంద్రం ఏపీకి మరింత సహాయం చేయలేకపోతోందని ఎత్తిచూపారు. చర్చను కొనసాగిస్తూ జయదేవ్ మాట్లాడిన తీరు తెలంగాణ ప్రజల విషయంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఇప్పటికీ టీడీపీ సహించలేకపోతున్నట్లు అనిపించింది. అందుకే పార్లమెంటులో టీఆరెస్ సభ్యులు గల్లా జయదేవ్ మాట్లాడే సమయంలో తీవ్ర నిరసన తెలిపారు. కేంద్రం తెలంగాణకు పూర్తిగా న్యాయం చేస్తూ, ఆంధ్రకు అన్యాయం చేస్తోందనటం సబబు కాదు. తమకు కావలసింది అడగడంలో తప్పు లేదు కానీ, తెలం గాణ విషయంలో టీడీపీ అక్కసు వెళ్లగక్కడం సమంజసం కాదు. తెలంగాణ విషయాన్ని లేవనెత్తడం ద్వారా టీడీపీ తెలంగాణలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదముందన్న విషయాన్ని కూడా సుదీర్ఘ అనుభవం ఉందని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఎలా మరిచిపోయారు. అందుకే ప్రతి విషయంలోనూ తెలంగాణతో తెలుగుదేశం పార్టీ పేచీ పెట్టుకుంటూ సమస్యల్లో చిక్కుకుంటోందని ప్రధాని మోదీయే పార్లమెంటులో వ్యాఖ్యానించారు. ప్రధాని వ్యాఖ్యతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరింత దిగజారినట్లయింది. మొత్తం మీద పార్లమెంటులో తెలుగుదేశం, కాంగ్రెస్ మిత్రపార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కోగా, కొండను తవ్వినా ఏమీ సాధించలేకపోయినట్లుగా విపక్షాల పరిస్థితి మారింది. సభలో తగిన సంఖ్యా బలం లేకుండా, సరైన ముందస్తు సంసిద్ధత లేకుండా ఏ పార్టీ ఇలాంటి సాహసం చేసినా నవ్వులపాలవుతాయని అవిశ్వాసం తీర్మానం సందర్భంగా రుజువయ్యింది. ఇప్పటికైనా తెలుగుదేశం, కాంగ్రెస్ మిత్రపక్షాలు బీజేపీ ప్రభుత్వంతో తలపడటంలో గుణపాఠం నేర్చుకోవలిసిన అవసరం ఎంతయినా ఉంది వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, ఫౌండర్, మేనేజింగ్ ట్రస్టీ, రాఘవ ఫౌండేషన్, హైదరాబాద్ ఎస్.ఎస్. వరయోగి -
మీరలా ఎలా..? ట్విటర్లో మోదీకి ప్రశ్న
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రధాని మోదీ.. ట్విటర్లో అభిమానులు, కార్యకర్తలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో వైవిధ్యం ప్రదర్శిస్తారు. దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం వీగిపోయిన సంగతి తెలిసిందే. అవిశ్వాస తీర్మానం అంటే ఒకింత ఆందోళనకు గురి కావాల్సిందిపోయి మోదీ లోక్‌సభలో దర్జాగా నవ్వులు చిందిస్తూ కనిపించారు. మెజారిటీ ఉంది కాబట్టి అలా చేశారని అందరికీ తెలుసు. అదే అంశంపై ఒక అభిమాని ట్విటర్లో మోదీని ప్రశ్నించారు. ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా మీరెప్పుడూ నవ్వుతూ కనిపిస్తారెలా..? అని అడిగారు. దానికి మోదీ.. ‘పాయింట్ పట్టేశావ్’అంటూ సరదా సమాధానం ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన మరో వ్యక్తి.. అవిశ్వాస తీర్మానంపై అర్ధరాత్రి 12 దాకా చర్చ కొనసాగింది కదా..! మళ్లీ ఉదయమే షాజహాన్‌పూర్ ర్యాలీలో పాల్గొనడానికి ఎలా రాగలిగారు. 67 ఏళ్ల వయసులో ఇలా ఉండడం నిజంగా అద్భుతం అంటూ ప్రశంసించారు. ‘125 కోట్ల మీ ఆశిస్సులు ఉన్నాయి కాబట్టే ఇంత హుషారుగా ఉన్నాన’ని ప్రధాని రీట్వీట్ చేశారు. కాగా, అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 126 మంది సభ్యులు మద్దతు ప్రకటించగా, తీర్మానానికి వ్యతిరేకంగా 325 మంది సభ్యుల మద్దతు లభించిన సంగతి తెలిసిందే. Point taken. :) https://t.co/xtFMxxO8M6 — Narendra Modi (@narendramodi) 22 July 2018 The blessings of 125 crore Indians give me great strength. All my time is for the nation. https://t.co/NRHuduHyuw — Narendra Modi (@narendramodi) 22 July 2018 -
‘బాబు అవినీతి కాంగ్రెస్‌కు కనిపించదా’
సాక్షి, విజయవాడ : కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వం సోకులు చేస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం విజయవాడలో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ఇచ్చిన నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నిధులుగా ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు తన అవినీతిని, తప్పులను కప్పిపుచ్చుకోవటానికే కేంద్రంపై అవిశ్వాసం పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు పెట్టిన అవిశ్వాసానికి కాంగ్రెస్ ఎందుకు సహకరించిందో అర్థం కాలేదన్నారు. చంద్రబాబు చేస్తున్న అవినీతి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనిపించటం లేదా అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి అని, మోదీ బలమైన నాయకుడు కాబట్టే ఆయనకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతున్నాయని పేర్కొన్నారు. టీడీపీ అవినీతి బయట పెట్టినందుకే బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పలేదన్నారు. చంద్రబాబు కోరిక మేరకే ప్యాకేజీ ఇచ్చారని, చంద్రబాబు ప్రత్యేకహోదా అడగలేదని తెలిపారు. ప్యాకేజీ కింద చంద్రబాబు మోదీని 5 వేల కోట్లు అడిగారని, మోదీ మాత్రం 16,500కోట్లు ఇవ్వడానికి అంగీకరించారని అన్నారు. రాష్ట్రంలో జన్మభూమి బ్రోకర్ల పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు అసెంబ్లీలో ప్రత్యేక హోదా వద్దని మాట్లాడిన క్లిప్పింగ్స్‌ను బీజేపీ నేతలు స్ర్కీన్ మీద ప్రదర్శించారు. ప్యాకేజీ ఇచ్చినందుకు వెంకయ్యనాయుడిని రాష్ట్రమంతా తిప్పి టీడీపీ నాయకులు సన్మానాలు చేశారని గుర్తుచేశారు. ప్యాకేజీ ఇచ్చినందుకే అసెంబ్లీలో మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ చంద్రబాబు తీర్మానం చేశారని తెలిపారు. ప్యాకేజీపై అరుణ్ జైట్లీ ప్రకటనను అర్ధరాత్రి మీడియా సమావేశం నిర్వహించి స్వాగతించిన విషయాలను కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తావించారు. -
‘టీడీపీ డ్రామాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు’
సాక్షి, వైఎస్సార్: హోదాపై బాబు మోసం, ఎన్డీఏ తీరుకు నిరసనగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 24న (మంగళవారం) రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రజలందరూ స్వచ్చందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అంజద్ బాషా కోరారు. పార్టీ నేత సురేష్ బాబుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ది జరుగుతదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వైఎస్ జగన్ పోరాటాల వల్లే హోదా అంశం సజీవంగా ఉందని అభిప్రాయపడ్డారు. నాలుగేళ్లుగా హోదా కోసం పోరాడుతున్నది కేవలం వైఎస్ఆర్సీపీ మాత్రమేనని స్పష్టంచేశారు. పార్లమెంట్లో టీడీపీ ఆడిన డ్రామాలన్నీ ప్రజలు గమనించారని వివరించారు. నిన్నటి వరకు ప్యాకేజీ అన్న బాబు నేడు హోదా అంటూ బోర్డు తిప్పేశారని ఎద్దేవ చేశారు. చంద్రబాబుకు ప్రజలను మోసం చేయడం మాత్రమే తెలుసని అంజద్ బాషా మండిపడ్డారు. -
‘బాబు అసమర్థతే కారణం’
సాక్షి, తిరుపతి: ప్రత్యేక హోదాపై పూటకో మాట మార్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. అదివారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో అవిశ్వాసం, తదితర అంశాలపై స్పందిచారు. వైఎస్ఆర్సీపీ ఒత్తిడి వల్లే పార్లమెంట్లో అవిశ్వాసం పెట్టారని, నాలుగేళ్లుగా టీడీపీ డ్రామాలు ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు ఇప్పటివరకు 30 దేశాలు తిరిగాడని.. కానీ అమరావతిలో ఒక్క ఇటుక కూడా పడలేదని ఎద్దేవ చేశారు. బీజేపీతో టీడీపీ లాలూచీ నిజం కాదా? బీజేపీ తప్పులను గతంలో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. బాబు అసమర్థత వల్లే రాష్ట్రానికి నిధులు రాలేదని ఆరోపించారు. చంద్రబాబు కేవలం కమీషన్ల కక్కుర్తి కోసమే పోలవరం ప్రాజెక్టును చేపట్టారే తప్పా ఎలాంటి మంచి ఉద్దేశంతో కాదని వరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఎన్టీఆర్కే కాదు.. ఆంధ్రులకూ బాబు వెన్నుపోటు!
సాక్షి, హైదరాబాద్ : పత్ర్యేక హోదా రావాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబును ఓడించాలని ఏపీ ప్రజలకు టీడీపీ బహిష్కృత నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సూచించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఓటమిని చూడాలని వెంకన్నకు మొక్కానని, చంద్రబాబు పతనం కోసం కాలినడకన తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నానని తెలిపారు. మెట్టు మెట్టుకి చంద్రబాబు ఓడిపోవాలని వేడుకున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు జీవితమంతా కపటం, నాటకం, దగా మోసాలేనని మండిపడ్డారు. అవిశ్వాసంపై చర్చలో ఏపీకీ హోదా ఇవ్వాలని ఎవరైనా మాట్లాడారా అని, టీడీపీ పెట్టిన అవిశ్వాసంపై ఎవరైనా కలిసొచ్చారా అని ప్రశ్నించారు. దివంగత నేత ఎన్టీఆర్ జెండాను చంద్రబాబు దొంగతనం చేశాడని మండిపడ్డారు. ప్యాకేజీకి ఒప్పుకున్నామని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబే చెప్పారని మోత్కుపల్లి గుర్తు చేశారు. బాబు ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని, ఆయన ఎన్టీఆర్కే కాదు.. ఆంధ్రులకు వెన్నుపోటు పోడిచారని దుయ్యబట్టారు. అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ చాలా సార్లు హోదాపై బాబును ప్రశ్నించారని, హోదా రాకుండా అడ్డుపడింది చంద్రబాబే అని స్పష్టం చేశారు. అవినీతి కప్పిపుచ్చుకోవడానికే.. చంద్రబాబు 29 సార్లు ఢిల్లీ వెళ్లింది తన అవినీతిని, దొంగతనాలను కప్పిపుచ్చుకోవడానికేనని విమర్శించారు. బాబు మోసాలపై అందరూ తిరగబడాలని, ప్రజల కోసం రాజకీయాలు చేయడం లేదని, తన కోసం, తన కుటుంబం కోసం రాజకీయాలు చేస్తున్నారని మోత్కుపల్లి ఫైర్ అయ్యారు. మోసగాడు, అబద్దాల కోరు చంద్రబాబును అడుగడుగునా నిలదీయాలన్నారు. దళితుల్లో ఎవరైనా పుడతారా అని ఆ జాతినే అవమానించారని, అంబేడ్కర్ ఆలోచనా విధానాలకు చంద్రబాబు తూట్లు పొడిచారని మండిపడ్డారు. కేంద్రం ప్యాకేజీ ఇస్తే అసెంబ్లీ సాక్షిగా బాబు ధన్యవాదాలు చెప్పారని గుర్తు చేశారు. అధికారం కోసం ఎంతవరకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు అని, వెన్నపోటు పొడవడంలో, మోసాలు చేయడంలో ఆయనను మించిన సీనియర్ లేరని తెలిపారు. కులాలరహితంగా ఏకమై చంద్రబాబుపై పోరాటం చేయాలని, తగిన గుణపాఠం చెప్పాలని మోత్కుపల్లి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీకి ఆయన విజ్ఞప్తి చేశారు. -
వంచనపై తిరుగుబాటే 24న బంద్: భూమన
సాక్షి, హైదరాబాద్ : వంచనపై తిరుగుబాటులో భాగమే మంగళవారం బంద్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ సారైనా బంద్‌లో పాల్గొంటున్న ప్రజలను భయపెట్టకుండా వారికి ఆటంకం కలిగించొద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్లో ఏపీ విభజన చట్టం హామీలను ఎవరూ ప్రస్తావించలేదన్నారు. ఎవరికి వారు వారి ప్రయోజనాల గురించే మాట్లాడారు తప్పా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఎవరైనా ప్రస్తావించారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఢిల్లీ ఎందుకెళ్లారు? అవిశ్వాసం వీగిపోయిన తర్వాత సీఎం చంద్రబాబు ఢిల్లీ ఎందుకెళ్లారని, బీజేపీకి కృతజ్ఞతలు చెప్పడానికా? లేక కొత్త పొత్తుల కోసమా? అని ఎద్దేవా చేశారు. గతంలో కేంద్రం ప్యాకేజీ ఇచ్చినందుకు ధన్యవాద తీర్మానం చేయలేదా అని నిలదీశారు. హోదాపై చంద్రబాబు తీసుకున్నది యూటర్నా? లేక రైట్ టర్నా? ఏ టర్న్ అని ప్రజలు ప్రశిస్తున్నారని చెప్పారు. గతంలోప్యాకేజీనే మంచిదని సీఎంవో పుస్తకాలు కూడా ప్రచురించిందని గుర్తు చేశారు. తమ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వాదననే టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో చదివారన్నారు. టీడీపీ-బీజేపీ మధ్య సంబంధాలను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ బయట పెట్టారని తెలిపారు. సాక్షాత్తు ప్రధానే టీడీపీ వైఎస్సార్ సీపీ ట్రాప్‌లో పండిందన్నారంటే అర్థం ఏంటనీ, చంద్రబాబు బీజేపీ మిత్రుడు కాబట్టే ప్రధాని అలా చెప్పారని భూమన పేర్కొన్నారు. ‘క’ గుణితమని కేకేను కలిస్తే ఎలా? అవిశ్వాసంలో పక్క రాష్ట్రాలను చంద్రబాబు మేనేజ్ చేయలేకపోయారన్నారు. మద్దతు కోసం తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను కాకుండా ‘క’ గుణితమని కేకేను కలిస్తే ఇలానే ఉంటుందని సెటైర్ వేశారు. కేవలం ప్రచారం కోసమే చంద్రబాబు అవిశ్వాసం పెట్టారన్నారు. గతంలో వైఎస్సార్ సీపీ పిలుపునిస్తే పట్టించుకోలేదని, ఇప్పుడు కంటి తుడుపు చర్యగా అవిశ్వాసం పెట్టి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. మీ పాలనపై మీరే అవిశ్వాసం పెట్టుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. చంద్రబాబు నైజాన్ని ఖండిస్తూ 24న వైఎస్ జగన్ పిలుపునిచ్చిన బంద్‌ను విజయవంతం చేయాలని భూమన ప్రజలను కోరారు. చదవండి: 24న ఏపీ బంద్