ఎంపీ వినోద్‌కుమార్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం పనితీరును తెలంగాణ ప్రజలు మెచ్చడం లేదని, తమ రాష్ట్రానికి సంబంధించిన తొలి ఆర్డినెన్స్‌నే రాజ్యాంగ విరుద్ధంగా జారీ చేశారని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ కుమార్ పేర్కొన్నారు. లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణంపై ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నరేంద్ర మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదు. రాజ్యాంగ విరుద్ధంగా తొలి ఆర్డినెన్స్ జారీ చేశారు. ఖమ్మం జిల్లా నుంచి 7 మండలాలను తీసేసుకున్నారు. 1952లో ఖమ్మం అనేది వరంగల్ జిల్లాలో భాగం అని తెలుసుకోవాలి. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ నుంచి 7 మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపేశారు. మా మండలాలను తిరిగి మాకు ఇచ్చేయాలి. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హనీమూన్‌లో ఉన్న సమయంలో తెలంగాణను అన్యాయం చేశారని’ ఆయన వ్యాఖ్యానించారు.
‘తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నటికీ క్షమించరు. సీలేరు జలవిద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ నుంచి బలవంతంగా లాక్కున్నారు. ప్రాజెక్ట్‌లకు ఆర్థిక పరమైన వనరులు ఏర్పాటు చేయడంలో యూపీఏ విఫలమైందన్నారు. విద్యుత్ సరఫరాలో ఏపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి విద్యుత్ కొనుగోలు చేసిన మా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే తొలిసారిగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించారు. పోలవరం విషయంలో మేం అడుగుతున్నది కేవలం నీటి పంపకం గురించి మాత్రమే. ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్‌కోచ్ ఫ్యాక్టరీ, తెలంగాన గిరిజన యూనివర్సిటీ అంశాల్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
తెలంగాణ గురించి కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదు. కోర్టుల్లో కేసుల ద్వారా ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకుంటోంది. తెలంగాణ ప్రాజెక్ట్‌లను పోలవరం తరహాలోనే జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానిని కోరుతున్నాం. తెలంగాణకు 19వేల కోట్ల నిధులను ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా.. ఇంతవరకు నిధులు విడుదల చేయలేదు. ఏపీలో సచివాలయం, అసెంబ్లీ కట్టినా.. హైకోర్టు విభజనకు ఎందుకు ముందుకు రావడం లేదని’ ఎంపీ వినోద్ఈ సందర్భంగా ప్రశ్నించారు. తాను లేవనెత్తిన అంశాలపై ప్రధాని మోదీతో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా సమాధానం చెప్పాలని టీఆర్‌ఎస్ ఎంపీ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment