Parliament of India
-
రాజ్యసభ సభ్యులను ఎలా ఎన్నుకుంటారు?
భారత పార్లమెంట్ లోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. దీనినే పెద్దలసభ అని కూడా పిలుస్తారు. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల సభ్యులు ఎన్నుకుంటారు కాబట్టి దీన్ని రాష్ట్రాల సభ అని కూడా అంటారు. రాష్ట్రాల నుంచి , కేంద్రపాలిత ప్రాంతాల నుంచి , వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని రాష్ట్రపతి ఎంపిక చెయ్యడం ద్వారానూ, రాజ్యసభ సభ్యులు నియామకం అవుతారు.వీరి పదవీకాలం 6 సంవత్సరాలు ఉంటుంది.ప్రతి రెండేళ్లకొకసారి మూడో వంతు సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో, ఎన్నికలు నిర్వహించి సభ్యులనుఎన్నుకుంటారు. ఇదీ, రాజ్యసభ సభ్యులను ఎంపికచేసుకొనే విధానం. లోక్‌సభ సర్వశక్తివంతమైనది.రాజ్యసభతో పోల్చుకుంటే,ఎక్కువ హక్కులు లోక్ సభ కలిగి ఉంటుంది.ప్రజల నుంచి నేరుగా ఎన్నిక ద్వారానే లోక్ సభ సభ్యుల ఎంపిక జరుగుతుంది. ప్రజాప్రతినిధులుగా వీరు,వివిధ పార్టీల నుంచి ఎంపికవుతారు. ఇలా ఈ రెండు సభల నిర్మాణం వెనుకప్రజాహితమే ప్రధాన ఉద్దేశ్యంగా రాజ్యాంగ నిర్మాతలు రూపకల్పన చేశారు.రాజ్యసభను సెకండ్ ఛాంబర్ అనికూడా అంటారు.అంటే,సెకండ్ చెక్ అన్నమాట. రాజ్యసభకు కూడా శాసనాధికారం ఉంటుంది. వివిధ శాసనాలను తీర్మానం చేసే క్రమంలో రాజకీయాలకు,పార్టీలకు అతీతంగా దేశభక్తితో నిర్ణయాలు జరగాలనే గొప్ప ఉద్దేశ్యంతో,సమాంతర వ్యవస్థగా రాజ్యసభను ఏర్పాటుచేశారు.విజ్ఞాన ఖనులు, మేధావులు,సాంస్కృతిక ప్రేమికులు, గొప్ప ప్రజానాయకులు , పరమ దేశభక్తులు,సత్ శీలురు ఈ పెద్దల సభలో సభ్యులుగా ఎంపికవుతారు. లోక్ సభసభ్యులు పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా బిల్లులు ఆమోదించినప్పటికీ,వీటికి అతీతంగా,వీరు ప్రజాహితం కోరుకుంటూ,అవసరమైతే వీటిని అడ్డుకుంటారు. కొన్ని బిల్లుల విషయంలో,లోక్ సభ సభ్యులు ప్రజలకు ప్రయోజనకారిగా ఉన్నాయని భావించినా, సుదూర భవిష్యత్తు అలోచించి, రాజ్యసభ సభ్యులు వాటిని ఆమోదించకుండా తిప్పికొట్టే పరిస్థితులు వస్తూ ఉంటాయి. పెద్దలసభ,అని పేరు పెట్టుకున్నందుకు,నిజంగా పెద్దమనుషులతో ఈ సభలు శోభాయమానంగా ఉండేవి. దురదృష్టవశాత్తు,విలువలు తగ్గుముఖం పడుతూ,అధికారమే పరమావధిగా సాగుతున్న రాజకీయ వ్యవస్థల మధ్య పెద్దలసభలో పెద్దమనుషులు తగ్గుతూ వస్తున్నారు. రాజకీయ పునరావాస కేంద్రంగా,స్వప్రయోజనాల లక్ష్యంగా, ఇచ్చిపుచ్చుకొనే ధోరణుల మధ్య పెద్దలసభకు కొందరి నియామకాలు జరుగుతూ ఉన్నాయనేది, జారిటీ మేధావులు అభిప్రాయం. ఉభయసభల్లో బిల్లులు ఆమోదం పొందాలంటే,రాజ్యసభలోనూ అధికార పార్టీకి మెజారిటీ ఉండాలి. ఈ విషయంలో,చాలావరకూ, ప్రతిపక్ష పార్టీలకే మెజారిటీ ఎక్కువగా ఉండే పరిస్థితులను అధికారంలో ఉన్న పార్టీలు ఎదుర్కొంటూ ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో, రాజ్యసభలో మెజారిటీ కోసం,ప్రతిపక్ష సభ్యులకు ఎరవేసి, లాక్కొనే ప్రయత్నాలు అధికారంలో ఉన్న పార్టీలు చేస్తూ ఉంటాయి. రాజకీయక్షేత్రంలో,ఇది యుద్ధనీతిగా అభివర్ణించుకుంటున్నారు.ఈ అభ్యాసం కొన్నేళ్ల నుంచి పెరుగుతూ వస్తోంది. పెద్దలసభల్లోనూ బడా పారిశ్రామక వేత్తలు,వ్యాపారులు,స్వపక్షీయులు వచ్చి చేరుతున్నారు. ఈ క్రీడలో యుద్ధనీతి ఎలా ఉన్నా రాజనీతికి తూట్లు పడుతున్నాయి.లోక్ సభలో ఆమోదం పొందినప్పటికీ, రాజ్యసభలో ఆమోదం పొందక, సెలెక్ట్ కమిటీకి వెళ్లి,కాలయాపన జరిగి,ఏళ్ళు పూళ్ళు సాగి, త్రిశంకు స్వర్గంలో నిలిచిపోయిన బిల్లులు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు: మహిళాబిల్లు.ఈ విధంగా అధికారపార్టీలను ఇరకాటంలో పెట్టి,నైతికంగా గెలిచామనే ఆనందంతో ప్రతిపక్ష పార్టీలు తాండవం చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో,ఎన్నో సంస్కరణలకు నోచుకోవాల్సినవి,మెజారిటీ ప్రజలకుఎన్నో ప్రయోజనాలు చేకూర్చేవి, చారిత్రకమైన బిల్లులు కూడా ఉంటాయి.ఇదొక రాజకీయ చదరంగం.రాష్ట్ర పాలనకు సంబంధించి,రాష్ట్రాలలో ఉండే, శాసనమండలిని కూడా ఎగువసభ అంటారు. ఇక్కడ,అధికార పార్టీకి మెజారిటీ లేక,ప్రతిపక్షాలు బిల్లుల ఆమోదం విషయంలో ఇబ్బంది పెడితే, అధికారంలో ఉన్న పార్టీకి శాసనమండలిని రద్దు చేసుకొనే అధికారం ఉంది. కానీ,రాజ్యసభను రద్దు చేసే అధికారం కేంద్రంలో లేదు. అలా రాజ్యాంగం నిర్మాణం చేశారు. తమకు మెజారిటీ వచ్చిన దాకా ఆగి తీరాల్సిందే. రాష్ట్రాలకు సంబంధించిన పెద్దల సభల్లోనూ ఒకప్పుడు మహనీయులు ఉండేవారు.రాజకీయ సంస్కృతి మారుతున్న నేపథ్యంలో,ఇక్కడా పెద్దమనుషులు కరువవుతున్నారు. ప్రస్తుతం,దేశంలోని ఎక్కువ రాష్ట్రాలలో శాసనమండలి వ్యవస్థలు రద్దయ్యే ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ రాజ్యసభ ప్రస్థానాన్ని గమనిస్తే, నిత్యస్మరణీయులైన మహనీయులు సభ్యులుగా పనిచేశారు.శాసనాల రూపకల్పనలో అచంచలమైన దేశభక్తితో, నిస్వార్ధంగా వ్యవహరించారు. అటు ఎంపికచేసిన పార్టీకి,ఇటు రాజ్యసభకు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టారు.నిజంగా దేశ ప్రయోజనాల గురించి ఆలోచించేవారికి ఇది గొప్ప అవకాశం.నియోజకవర్గాల్లోకి వెళ్ళి రాజకీయాలు చేసుకోనక్కర్లేదు.ఓట్ల భయం లేదు.ఖాళీ సమయాల్లో,అద్భుతమైన గ్రంథాలయాల్లో ఉన్న అపార జ్ఞాన సంపదను అక్కున చేర్చుకొని,దేశ ప్రతిష్ఠ పెంచే,సకల జనుల శ్రేయస్సు ప్రసాదించే అద్భుతమైన సలహాలు,సూచనలు పాలకులకు ఇవ్వవచ్చు.ఒకప్పుడు అలాగే సాగేది.నిన్న మొన్నటి వరకూ కూడా,ఎందరో పెద్దలు ఈ పెద్దలసభలకు ఎంపికయ్యారు. వాజ్ పెయి,పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్,ప్రణబ్ ముఖర్జీ, భూపేష్ గుప్తా,అల్లాడి కృష్ణస్వామి అయ్యర్,ఎన్. జి. రంగా, నీలం సంజీవరెడ్డి,బెజవాడ గోపాల్ రెడ్డి,బూర్గుల రామకృష్ణరావు,వల్లూరి బసవరాజు, కాసు వెంగళరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి,నార్ల వెంకటేశ్వరరావు,దేవులపల్లి రామానుజరావు, పి. కె. కుమరన్ మొదలైన పెద్దలెందరో ఈ పెద్దల సభలో ఉండేవారు. రాష్ట్రపతి ఎంపిక చేసినవారిలోనూ ఎందరో పెద్దలు ఉండేవారు.రాజా రామన్న, జాకీర్ హుస్సేన్,అబు అబ్రహాం, శంకర్ కురూప్,ఆర్.కె.నారాయణ్, పండిట్ రవిశంకర్,పృథ్వి రాజ్ కపూర్,లతా మంగేష్కర్,కులదీప్ నయ్యర్. సి.నారాయణరెడ్డి మొదలైన వాళ్ళు పెద్దల సభకు ఎంతో గౌరవాన్ని, వైభవాన్ని తెచ్చిన గొప్పవాళ్ళు. టెండూల్కర్,జయభాదురీ,రేఖ, హేమామాలిని మొదలైన వాళ్ళు కూడా ఎంపికయ్యారు.కళాకారులు, కవులు,శాస్త్రవేత్తలు,క్రీడాకారులకు గౌరవపూర్వకంగా రాజ్యసభకు ఎంపిక చెయ్యడం ఒక ఆనవాయితీ, ఒక మర్యాద.ఇందులో కొందరు అలంకారప్రాయంగా పదవికి పరిమితమైనవారు,కనీస హాజరు కూడా లేనివారు ఉన్నారు. జయభాదురీ,డాక్టర్ సి.నారాయణరెడ్డి వంటివారు తమ పదవిని,సమయాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకున్నారు.కొందరు పార్టీలకు, ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీలకు వివిధ రూపాల్లో ప్రయోజనాలు చేకూర్చి, తత్ఫలితంగా పదవులు దక్కించుకుంటున్నారనే విమర్శలు ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వస్తున్నాయి.చట్ట సభల్లో హుందాగా ప్రవర్తించడం,సర్వ ప్రజాహితంగా నిర్ణయాలు తీసుకోవడం,పదవీకాలాన్ని సద్వినియోగం చెయ్యడం, ప్రజాధనాన్ని వృధా కాకుండా చూడడం ఈ సభ్యుల బాధ్యత. రాజ్యాంగం అమలు అనేది,అమలు చేసే పాలకులమీదనే ఆధారపడుతుందని అంబేద్కర్ ఏనాడో చెప్పారు.ఆచరణలో, పెద్దలసభ రాజకీయాలకు అతీతంగా, సర్వ స్వతంత్య్రమైన వ్యవస్థగా నిలబడాలి. ఉభయ సభలు ఆదర్శవంతంగా సాగాలన్నది,నేటి కాలంలో అత్యాశే అయినప్పటికీ, అలా సాగాలని అభిలషిద్దాం. - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
Old Parliament: ఏకైక ప్రత్యక్ష సాక్షి అదొక్కటే!
పార్లమెంట్ పాతదైపోయింది. హాల్స్ నుంచి ప్రతీది.. ప్రజాప్రతినిధుల అవసరాలకు అనుగణంగా సరిపోవడం లేదు. పైగా సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భవిష్యత్ కోసం కొత్తది కావాల్సిందే.. నరంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట ఇలాంటి ప్రకటనే చేసింది. ఆ ప్రకటనకు కట్టుబడి.. భారీ వ్యయంతో పార్లమెంట్ నూతన భవనాన్ని నిర్మించింది కూడా. రేపు(ఆదివారం) పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ తరుణంలో ఆధునిక భారత దేశ చరిత్రలో కీలక ఘట్టాలకు ఏకైక ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన పార్లమెంట్ ప్రస్థానాన్ని తిరగేద్దాం.. కౌన్సిల్ హౌజ్ నుంచి పార్లమెంట్ అనే గుర్తింపు దాకా.. బ్రిటిషర్ల కాలంలో చట్ట సభల ద్వారా మొదలై.. 76 ఏళ్ల ప్రజాసామ్య దేశానికి సంబంధించి మొదటి మీటింగ్ జరిగింది ఈ భవనంలోనే!. ఉభయ సభల్లోని సభ్యుల మధ్య వాదప్రతివాదనలు, చర్చలు, నేతల కీలక ప్రసంగాలు, ప్రభుత్వాల పని తీరుపై ఓటింగ్‌లు.. ఇలాంటి ఎన్నో ఘట్టాల ద్వారా అనుబంధాన్ని అల్లేసుకుంది. దాని చరిత్రను పరిశీలిస్తే.. 👉 1911లో కోల్‌కతా నుంచి రాజధానిని ఢిల్లీకి తరలించాలని నిర్ణయించింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. అందుకోసం న్యూఢిల్లీని నిర్మించాలనుకుంది. రెండేళ్ల తర్వాత న్యూఢిల్లీ ప్రణాళికా దశకి చేరింది. ఆ సమయంలో తక్కువ సభ్యులున్న లెజిస్టేటివ్ కౌన్సిల్ కోసం గవర్నర్ జనరల్ నివాసం (ఇప్పుడున్న రాష్ట్రపతి భవన్) సరిపోతుంది కదా అని బ్రిటిష్ అధికారులు భావించారు. వేసవిలో సిమ్లాలోని వైస్రాయ్ లాడ్జ్‌లో, శీతాకాలంలో అప్పటి ఢిల్లీ సెక్రటేరియెట్ బిల్డింగ్‌లో (ఇప్పుడది ఢిల్లీ అసెంబ్లీగా ఉంది) భేటీ అయ్యేవాళ్లు. అయితే.. 👉 1918లో మాంటెగ్ ఛేమ్స్‌ఫర్డ్ సంస్కరణలు తెర మీదకు వచ్చాయి. దాని ప్రకారం.. చట్టసభల ప్రాధాన్యంతో పాటు... సభ్యుల సంఖ్యా పెరిగింది. ఎగువ, దిగువ సభలనేవి అమల్లోకి వచ్చాయి. వీటితో పాటు సిబ్బంది సంఖ్యా పెరిగింది. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం రెండు ప్రతిపాదనలు చేసింది. ఒకటి.. టెంట్ల కింద సభను నిర్వహించటం. రెండవది.. శాశ్వత భవంతిని నిర్మించడం. అలా.. 1921లో పార్లమెంట్ భవనానికి తొలి అడుగు పడింది. అదే సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (దిగువ సభ) తొలి భవంతి. 👉 న్యూ ఢిల్లీ నగర రూపశిల్పులు.. బ్రిటిష్ ఆర్కిటెక్టులు ఎడ్విన్ ల్యూటెన్, హెర్బర్ట్ బేకర్లు ఎగువ, దిగువ చట్టసభలకు శాశ్వత భవన నిర్మాణాలను ప్రతిపాదించారు. ల్యూటన్ గుండ్రంగా, బేకర్ త్రికోణాకారంలో ప్రణాళికలు తయారు చేశారు. చివరకు ల్యూటన్ దానికే బ్రిటిష్ సర్కారు మొగ్గు చూపింది. 👉 1921 ఫిబ్రవరి 12న.. డ్యూక్ ఆఫ్ కానాట్ ‘ప్రిన్స్ ఆర్థర్’ కొత్త పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేశారు. ఆరేళ్లలో నిర్మితమైన ఈ భవనాన్ని 1927 జనవరి 19న అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు. ఆరు ఎకరాల విస్తీర్ణంలో.. 27 అడుగుల ఎత్తైన పిల్లర్లు 144 ను ఉపయోగించి.. ఈ అందమైన భవంతి నిర్మించారు. ప్రకృతి వైపరిత్యాలను తట్టుకునేలా పక్కా ప్లాన్‌తో చాలా బలంగా ఈ నిర్మాణం జరిగింది. బహుశా అందుకేనేమో ఈ 96 ఏళ్ల కాలంలో.. పార్లమెంట్ భవనానికి జరిగిన రిపేర్ సందర్భాలు చాలా తక్కువగానే ఉన్నాయి. 👉 మధ్యలో సెంట్రల్ హాల్, దాని పక్కనే మూడు అర్ధవృత్తాకార ఛాంబర్లు... చుట్టూ ఉద్యానవనంతో ఆకట్టుకునేలా నిర్మించారు. సెంట్రల్ హాల్ చుట్టూ ఉండే ఒక ఛాంబర్లో సంస్థానాధీశుల సభ (ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్), మరోదాంట్లో స్టేట్ కౌన్సిల్ (ఎగువ సభ, ప్రస్తుత రాజ్యసభ), మూడోదాంట్లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (దిగువ సభ, ప్రస్తుత లోక్‌సభ) ఉండేవి. 👉 మధ్యప్రదేశ్‌లోని చౌసత్ యోగిని దేవాలయాకృతి స్ఫూర్తితో పార్లమెంట్ భవనం నిర్మించారనే ఒక ప్రచారం కూడా నడుస్తుంటుంది. అలా మన పార్లమెంటు భవనం ప్రారంభం కాగా.. ప్రపంచవ్యాప్తంగా కూడా అందరి దృష్టినీ ఆకర్షించింది. 👉 బ్రిటిషర్ల కాలంలో చట్టసభగా కొనసాగిన ఈ భవనం.. అధికార మార్పిడికి వేదికైంది. అంతేకాదు.. కొత్త ఏర్పాట్లు జరిగేదాకా మొదట్లో సుప్రీంకోర్టు కూడా ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ నుంచే కార్యకలాపాలు నిర్వహించింది. యూపీఎస్సీ కార్యాలయం కూడా పార్లమెంటు కాంప్లెక్స్‌లోనే ఉండేది. 👉 స్థలాభావాన్ని అధిగమించటం కోసం 1956లో పాత పార్లమెంటులో మరో రెండు అంతస్థులు నిర్మించారు. అయినా స్థలం సరిపోయేది కాదు. 👉 సెంట్రల్ హాల్లో మూడోదైన లెజిస్లేటివ్ అసెంబ్లీలోనే 1929లో విప్లవకారుడు భగత్‌సింగ్, ఆయన సహచరుడు బతుకేశ్వర్ దత్‌లు బాంబు విసిరారు. 👉 2001లో లష్కరే తోయిబా తీవ్రవాదుల దాడి జరిగింది పార్లమెంట్ భవనంపై. స్వతంత్ర భారతంలోని అత్యంత కీలక చట్టాలకు ఈ పార్లమెంట్ భవనమే ప్రత్యక్ష సాక్షి. ఎమర్జెన్సీలాంటి చీకట్లతో పాటు స్వాత్రంత్య దినోత్సవ వేడుకల వెలుగుల్ని వీక్షించింది ఈ భవంతి. మహ మహా మేధావుల నేతృత్వంలో ఆధునిక భారత ప్రస్థానానికి దారితీసిన సంస్కరణలకే కాదు.. వివాదాలకు, నేతల వ్యక్తిగత విమర్శలకూ ఈ ప్రజాస్వామ్య సౌధం వేదికగా మారింది. 👉 నూతన భవన నిర్మాణంలో సుమారు 60,000 మంది కార్మికులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాల పాటు నిర్మాణ పనులు సాగాయి. సెంట్రల్ విస్టా వెబ్సైట్ ప్రకారం.. పాత పార్లమెంటు భవన నిర్మాణానికి అవసరమైన రాళ్లు, మార్బుల్స్ కోసమే రాళ్లు కొట్టేవాళ్లను, మేస్త్రీలను కలిపి 2,500 మందిదాకా అప్పట్లో నియమించారట. 👉 కార్యకలాపాలకు కొత్త పార్లమెంట్ భవనం ఉపయోగించినప్పటికీ.. పాత పార్లమెంట్ భవనాన్ని కూల్చబోమని కేంద్రం ఇప్పటికే తెలిపింది. దానికి మరమత్తులు చేసి ప్రత్యామ్నాయ వినియోగానికి అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. పాత పార్లమెంటు భవనాన్ని దేశ పురావస్తు సంపదగా పరిరక్షిస్తామని తెలిపారు. ఆ అవసరం ఉంది కూడా. 👉 మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న టైంలో.. పార్లమెంట్ మ్యూజియంను ఏర్పాటు చేశారు. 2500 ఏళ్ల నాటి భారతీయ విశిష్ట నాగరికత సంస్కృతులు ఇందులో అద్దంపట్టేలా ఏర్పాటు చేశారు. -
భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం: సుస్థిరత నుంచి సుస్థిరతకు!
లోక్ సభకు 18వ ఎన్నికలు ఏడాది దూరంలో ఉండడంతో భారత పార్లమెంటు దిగువసభకు ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికలను జనం గుర్తుచేసుకుంటున్నారు. 1952 నుంచి జరిగిన 17 ఎన్నికల్లో మొదటి మూడు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి మూడింట రెండు వంతులకు పైగా మెజారిటీ వచ్చింది. భారత తొలి ప్రధాని పండిత జవహర్లాల్ నెహ్రూ పాలనలో జరిగిన ఈ ఎలెక్షన్లలో కాంగ్రెస్ ఆధిపత్యానికి ఎదురులేని పరిస్థితి నెలకొంది. 1964 మేలో నెహ్రూ జీ మరణానంతరం ముగ్గురు కాంగ్రెస్ ప్రధానులు (జీఎల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రీ, ఇందిరాగాంధీ) మూడేళ్లు రాజ్యమేలారు. ఇందిరమ్మ పాలనలో 1967లో జరిగిన నాలుగో లోక్ సభ ఎన్నికల్లో భారత ఓటర్లు ఆశ్చర్యకర తీర్పు ఇచ్చారు. మొదటి మూడు ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యం పొందిన కాంగ్రెస్ ఈసారి సాధారణ మెజారిటీ సాధించింది. మొత్తం 523 సీట్లలో కనీస మెజారిటీకి అవసరమైన 262 సీట్లకు గాను కాంగ్రెస్ 283 స్థానాలు సంపాదింది. 1962 ఎన్నికలతో పోల్చితే కాంగ్రెస్ 78 సీట్లు కోల్పోయింది. ఎన్నికల తర్వాత ఇందిరాగాంధీ రెండోసారి ప్రధాని అయ్యారు. 1969 నవంబర్‌లో కాంగ్రెస్ చీలికతో ఆమె మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుతూ ఏడాది ముందే 1971లో మధ్యంతర ఎన్నికలు జరిపించారు. ఆమె హయాంలో మొదటిసారి కాంగ్రెస్ కు మూడింట రెండొంతుల మెజారిటీ (352 సీట్లు) లభించింది. ఇలా కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఐదుసార్లు మెజారిటీకి అవసరమైన స్థానాలు లభించాయి. ఎమర్జెన్సీ కారణంగా ఐదో లోక్ సభ ఆరేళ్లు కొనసాగింది. ఆరో పార్లమెంటు ఎన్నికల్లో (1977) కాంగ్రెస్ తొలిసారి ఓడిపోయింది. నాలుగైదు పార్టీల విలీనంతో ఏర్పడిన జనతాపార్టీ సంపూర ్ణ మెజారిటీ (295) సాధించింది. జనతా చీలిక అనంతరం మొరార్జీ దేశాయి, చరణ్ సింగ్ ప్రభుత్వాలు కూలిపోవడంతో ఆరో లోక్ సభ మూడేళ్లలోపే రద్దయింది. 1980 జనవరిలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఇందిరమ్మ నేతృత్వంలోని కాంగ్రెస్ మూడింట రెండొంతుల మెజారిటీతో (353 సీట్లు) అధికారంలోకి వచ్చింది. 1984 చివర్లో ఇందిర హత్యానంతరం ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ హయాంలో 533 సీట్లకు జరిగిన 8వ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 414 సీట్లతో ఐదింట నాలుగొంతుల మెజారిటీ సంపాదించి రికార్డు సృష్టించింది. 1989 నుంచి 2009 వరకూ జరిగిన 7 ఎన్నికల్లో హంగ్ పార్లమెంటు! 1989లో జరిగిన 9వ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. అయితే, ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో హంగ్ లోక్ సభతోనే రెండు మైనారిటీ ప్రభుత్వాలు (వీపీ సింగ్, చంద్రశేఖర్ ప్రధానులుగా) నడిచాయి. ఏడాదిన్నర లోపే సభ రద్దవడంతో 1991 మేలో జరిగిన పదో లోక్ సభ ఎన్నికల్లో కూడా ఏ పార్టీకీ సాధారణ మెజారిటీ రాలేదు. పీవీ నరసింహారావు గారి నాయకత్వంలోని కాంగ్రెస్ మెజారిటీ సాధించలేకపోయినా 244 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బయట నుంచి కొన్ని మిత్రపక్షాల మద్దతుతో పీవీ ప్రధాని పదవి చేపట్టి ఐదేళ్లు అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత పూర్తి పదవీకాలం కొనసాగలేకపోయిన 11, 12, 13వ లోక్ సభలు (1996, 98, 99లో) ఏ పార్టీకి మెజారిటీ లేని త్రిశంకు సభలు. 1999లో ఏర్పాటైన 13వ లోక్ సభ ఐదేళ్లు పూర్తికావడానికి 8 నెలల ముందు రద్దయింది. వరుసగా 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో ఏర్పడిన 14, 15వ లోక్ సభలు కూడా ఏ పార్టీకి మెజారిటీలేని త్రిశంకు సభలేకాని కేంద్ర ప్రభుత్వాలు పూర్తి పదవీకాలం నడిచాయి. 1984 తర్వాత అంటే 30 ఏళ్లకు 2014లో 16వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ తొలిసారి మెజారిటీ సీట్లు (282) సాధించింది. మళ్లీ ఐదేళ్లకు 2019లో జరిగిన 17వ లోక్ సభ ఎన్నికల్లో కూడా పాలకపక్షం 303 సీట్లతో బలం పెంచుకుంది. పైన వివరించినట్టు 1989 నుంచి 2014 వరకూ లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. వరుసగా ఏడు త్రిశంకు సభల తర్వాత గత రెండు పార్లమెంటు ఎన్నికల్లో పాలకపక్షానికి సాధారణ మెజారిటీ వచ్చింది. 2024 ఎన్నికల్లో కూడా రాజకీయ సుస్థిరతకు దారితీసే ఫలితాలు ఉంటాయని ఎన్నికల విశ్లేషకులు అంచనావేస్తున్నారు -విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్ సీపీ -
భారత్ పార్లమెంట్లో మైకుల మూగనోము
లండన్: భారత పార్లమెంట్ దిగువ సభ అయిన లోక్‌సభలో మైక్రోఫోన్లు ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా తరచుగా మూగబోతుంటాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన ప్రతిపక్ష లేబర్ పార్టీ ఎంపీ వీరేంద్ర శర్మ సోమవారం లండన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బ్రిటిష్ ఎంపీలను ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. తాను నిర్వహించిన భారత్ జోడో యాత్ర గురించి ప్రస్తావించారు. ప్రజలను కూడగట్టడానికి ఇదొక రాజకీయ కార్యాచరణగా ఉపయోగపడిందని అన్నారు. భారత లోక్‌సభలో మైకులు పని చేస్తుంటాయి గానీ తరచుగా మొరాయిస్తుంటాయని వ్యా ఖ్యానించారు. మాట్లాడేటప్పుడు మధ్యలోనే ఆగిపోతుంటాయని, తనకు చాలాసార్లు ఇలాంటి అనుభవం ఎదురైందని స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ గురించి పార్లమెంట్లో మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. చైనా సైన్యంలో భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిందని, దానిపైనా ప్రశ్నించే అవకాశం ఇవ్వలేదన్నారు. పార్లమెంట్లో గతంలో జరిగిన అర్థవంతమైన చర్చలు, సంవాదాలు ఇప్పుడు లేకుండాపోయాయని ఆక్షేపించారు. -
పార్లమెంట్లో ప్రసంగించనున్న అనంత విద్యార్థి
అనంతపురం కల్చరల్: యువతలో దేశభక్తి, నైతికతను పెంపొందించే దిశగా పార్లమెంటు ఆఫ్ ఇండియా, నెహ్రూ యువకేంద్ర సంయుక్తంగా ఏటా నిర్వహించే వేడుకలకు దేశవ్యాప్తంగా 25 మంది యువతీ యువకులను ఎంపిక చేశారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ తరఫున ఈనెల 14న పార్లమెంటు ప్రాంగణంలో ప్రసంగించే అరుదైన అవకాశం జిల్లాకు చెందిన మెగాజోష్కి దక్కింది. ఈ మేరకు నెహ్రూ యువకేంద్ర జిల్లా సమన్వయకర్త సందీప్‌కుమార్, డీడీవో శ్రీనివాసులు తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీలో చదువుకుంటున్న ఆమె గతంలో అనేక వక్తృత్వ పోటీల్లో పాల్గొని జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేశారన్నారు. (చదవండి: జేసీ మనుషులమంటూ దౌర్జన్యం) -
29 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలను ఈ నెల 29 నుంచి డిసెంబర్ 23 దాకా నిర్వహించాలని పార్లమెంట్ వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ(సీసీపీఏ) ప్రతిపాదించినట్లు అధికార వర్గాలు సోమవారం తెలిపాయి. గత ఏడాదిన్నరగా నిర్వహిస్తున్నట్లుగానే శీతాకాల సమావేశాలను కూడా కోవిడ్–19 నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ నిర్వహించనున్నట్లు వెల్లడించాయి. ఈ సమావేశాల్లో 20 సిట్టింగ్స్ ఉండే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి. కరోనా మహమ్మారి ఉధృతి కారణంగా గత ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించలేదు. బడ్జెట్, వర్షాకాల సమావేశాలను కుదించాల్సి వచ్చింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు కీలక రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ద్రవ్యోల్బణం, చమురు ధరల పెరుగుదల, జమ్మూకశ్మీర్‌లో పౌరులపై ఉగ్రవాదుల దాడులు, లఖీంపూర్ ఖేరిలో హింస, కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పోరాటం తదితర అంశాలపై పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. -
ఆమె నిరీక్షణకు పాతికేళ్లు!
భారత పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి పాతికేళ్లయింది. పార్లమెంటులో, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు మూడింట ఒకవంతు లేక 33 శాతం సీట్లను ప్రత్యేకించడానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును మొట్టమొదటగా 1996 సెప్టెంబర్ 12న ప్రవేశపెట్టారు. కానీ దాని భవిష్యత్తు మాత్రం ఇప్పటికీ ఊగిసలాటతోనే ఉంది. ఎప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చకు వచ్చినా, మళ్లీ ప్రవేశపెట్టినా సరే, పార్లమెంటులో అది రభసకు, నాటకీయ పరిణామాలకు దారితీస్తూ వచ్చింది. ప్రస్తుతం చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం కాస్త మెరుగుపడింది కానీ, రాజకీయ నేతలతో పోలిస్తే భారత మహిళా నేతల సంఖ్య ఇప్పటికీ తక్కువగానే ఉంది. చట్టసభల్లో మహిళల సంఖ్యను పెంచే విషయంలో చేయవలసింది ఎంతో ఉందని గుర్తించాలి. చాలా దేశాలు జెండర్ ఆధారిత కోటాను పూరించడంలో ఏదోరకమైన పురోగతి సాధించాయి కానీ భారత పార్లమెంటు మాత్రం మహిళా రిజర్వేషన్ బిల్లును రెండు దశాబ్దాలకు పైగా పదే పదే అడ్డుకోవడం అత్యంత శోచనీయమైన విషయం. పార్లమెంటులో చాలా బిల్లులు శాసన రూపం దాల్చకుండా ఆగి పోయి ఉండవచ్చు కానీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు పట్టిన గతి మరే బిల్లుకూ పట్టలేదంటే అతిశయోక్తి కాదు. ఆ బిల్లును ప్రవేశపెట్టి పాతికేళ్లయింది, ఎన్నో ప్రభుత్వాలు వచ్చి పోయాయి కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు మాత్రం సభ ఆమోదానికి వేచి చూస్తూనే ఉంది. పార్లమెం టులో, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు మూడింట ఒకవంతు లేక 33 శాతం సీట్లను ప్రత్యేకించడానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును మొట్టమొదటగా 1996 సెప్టెంబర్ 12న ప్రవేశపెట్టారు. ఇటీవలి సంవత్సరాల్లో చట్టసభల్లో, అధికార పీఠాల్లో మహిళల ప్రాతి నిధ్యం కాస్త మెరుగుపడింది కానీ ఎన్నికైన రాజకీయ నాయకులతో పోలిస్తే భారతీయ మహిళానేతల సంఖ్య ఇప్పటికీ తక్కువగానే ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 1996 తర్వాత ఎప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చకు వచ్చినా, మళ్లీ ప్రవేశపెట్టినా సరే, పార్లమెంటులో అది రభసకు, నాటకీయ పరిణామాలకు, బిల్లు కాగి తాలను విసిరేయడానికి దారితీస్తూ వచ్చింది. ఇంకా ముఖ్యంగా దానికి వ్యతిరేకంగా అన్ని రకాల అడ్డంకులను సృష్టిస్తూ వచ్చారు. ఒక్కమాటలో చెప్పాలంటే మహిళా రిజర్వేషన్ బిల్లును ఎప్పుడు చట్టసభలో చర్చకు పెట్టినా అది పేలడానికి సిద్ధంగా ఉన్న కాలాతీత బాంబును తలపిస్తూ వచ్చింది. కాలంతో పనిలేని బాంబు అని ఎందుకనాల్సి వచ్చిందంటే అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టినా సరే, మహిళా రిజర్వేషన్ బిల్లు రాజకీయ కల్లోలాన్ని సృష్టించింది. రాజ్యసభను దాటని బిల్లు పాతికేళ్లుగా మహిళా బిల్లును ఏదోవిధంగా రాజకీయ పార్టీలు అడ్డుకుని, పార్లమెంటులో దానికి ఆమోదం లభించకుండా తమదైన పాత్ర పోషిస్తూ వచ్చాయి. 1998, 1999లలో చివరకు 2008లో కూడా ఆ బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ అప్పటి కేంద్ర ప్రభుత్వాలు రద్దయిన రోజున మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా వీగిపోతూ వచ్చింది. షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన మహిళలకు ‘కోటాలో కోటా’ను కల్పించాలని కొత్త సవరణను చేర్చిన తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు 2010లో రాజ్యసభలో ఆమోదం పొందింది కానీ ఈరోజుకీ అది పార్లమెంటులో పెండింగులో ఉంటూ వస్తోంది. ఈ పాతికేళ్లలో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవాలనే ఆకాంక్ష విషయంలో, రాజకీయ నాయకులను పార్టీలకు అతీతంగా ఐక్యపరిచిన ఘటన మరే బిల్లు విషయంలోనూ జరగలేదు. ఈ బిల్లుకు సంబంధించి సాంకేతిక సమస్యలను ఇప్పటికీ పరిష్కరించాల్సిన అవసరముందని చట్టసభలపై నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రిజర్వేషన్ ప్రాతిపదిక హేతుబద్ధతను నిర్ణయించే విధానాలపై నిశితంగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్న అంశాన్ని కాదనలేం. వరుసగా మూడు సాధారణ ఎన్నికల తర్వాత ఒక సీటును మహిళలకు రిజర్వు చేయాలని మొదటిసారిగా బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపాదించారు. ఇది కూడా చర్చనీయాంశమైంది. కానీ ఇవేవీ బిల్లు ఉనికినే తోసిపుచ్చేటంత స్థాయిలో లేవు. బిల్లుకు ఆమోదం లభించినప్పుడు ఇలాంటి అంశాలను సులభంగా పరిష్కరించవచ్చు. లైంగిక సమానత్వం సాధ్యమేనా? చట్టసభల్లో లింగ వైవిధ్యతను మెరుగుపర్చడం గురించి ప్రపంచవ్యాప్తంగా అరుపులు, పెడబొబ్బలు వినపడుతూనే ఉన్నాయి. కానీ అంతర్జాతీయంగా చూస్తే ఇంతవరకు 14 దేశాల్లో మాత్రమే మహిళలు మంత్రివర్గాల్లో 50 శాతం సీట్లను కైవసం చేసుకున్నారు. యూఎన్ విమెన్ సంస్థ చెప్పినదాని ప్రకారం ప్రస్తుతం 24 దేశాల్లో దేశాధినేతలుగా లేక ప్రభుత్వాధినేతలుగా 26 మంది మహిళలు మాత్రమే అధికారంలో ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుత వేగంతోనే సాగితే ప్రపంచంలో లైంగిక సమానత్వం ఏర్పడాలంటే మరొక 130 సంవత్సరాల సమయం పట్టేటట్లుంది. ఆయా దేశాల పార్లమెంట్లలో మహిళలు 25 శాతం మాత్రమే చోటు సంపాదించుకున్నారు. నాలుగు దేశాల పార్లమెంట్లలో మాత్రమే 50 శాతం మహిళలు కనబడుతున్నారు. ఇక 19 దేశాల్లో మాత్రమే 40 శాతం మంది మహిళలు పార్లమెంటుకు వెళ్లగలిగారు. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలోని మూడింట రెండొంతుల కంటే ఎక్కువ దేశాలు లింగపరమైన కోటాను పూరించడంలో ఏదోరకమైన పురోగతి సాధించాయి కానీ భారత పార్లమెంటు మాత్రం మహిళా రిజర్వేషన్ బిల్లును పదే పదే అడ్డుకోవడం అత్యంత శోచనీయమైన విషయం. నిజంగానే ప్రస్తుతం భారత పార్లమెంటులో మహిళల ప్రాతి నిధ్యం మెరుగైంది. మొట్టమొదటి లోక్‌సభలో 24 మంది మహిళా ఎంపీలు మాత్రమే ఉండగా, ఇప్పుడు పార్లమెంటులో 78 మంది మహిళా ఎంపీలు ఉండటం విశేషమని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ పేర్కొంది. 1996లో లోక్‌సభలో మహిళలు 7.7 శాతం మంది, రాష్ట్రాల శాసనసభల్లో 4 శాతం మంది మహిళా ప్రతినిధులు ఉండగా, వీరితో పోలిస్తే ఇప్పుడు పార్లమెంటులో 14.4 శాతం మంది, రాష్ట్రాల శాసనసభల్లో 8 శాతం మంది మహిళా ప్రతినిధులు ఉన్నారు. అయితే మహిళా ప్రాతినిధ్యం విషయంలో రాజకీయ పార్టీలు తగినంత కృషి చేస్తున్నాయా అనేది ప్రశ్న. దేశం మొత్తంలో ఒక తృణమూల్ కాంగ్రెస్ మాత్రమే 40 శాతం మహిళలను ఎంపీలుగా గెలిపించుకుంది. అలాగే గత 17 సంవత్సరాల్లో ఎన్నడూ లేనివిధంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 11 మంది మహిళలకు మంత్రి పదవులిచ్చింది. అయితే 2021 జూన్ వరకు ఎన్నికైన మహిళా నేతల విషయంలో మొత్తం 193 దేశాల్లో భారత్ 148వ స్థానంలో ఉంటూ కనిష్ట స్థాయిలో ఉండటం విచారకరం. ఎన్నికైన రాజకీయ ప్రతినిధులుగా మహిళల సంఖ్యను పెంచడానికి సంబంధించి ఇంకా చేయవలసింది ఎంతో ఉందని గుర్తించాలి. బిల్లుపై వ్యతిరేకతకు కారణాలు ఇవా? మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తే తోలుబొమ్మ అభ్యర్థులు, నకిలీ అభ్యర్థులు గెలవడానికి దారితీస్తుందంటూ మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్న వారు వాదిస్తున్నారు. భారతీయ జనాభాలో దాదాపు సగంమంది మహిళలే ఉంటున్నారు. కానీ మన కోసం మాట్లాడే మహిళా నేతలు ఇప్పటికీ తగినంతమంది లేరు. ఈరోజుల్లో ఇది ఎంతవరకు న్యాయం? ఇది సమర్థనీయమేనా, కనీసం ఆచరణాత్మకమైనదేనా? పైగా ఇప్పుడు చట్టసభల్లోనూ, అధికార స్థానాల్లో ఉన్న మహిళలు తమ సమర్థతను ఎంతగానో మెరుగుపర్చుకుంటున్నట్లు బలమైన ఆధారాలు కూడా ఉంటున్నాయి. యూఎన్ విమెన్ సంస్థ దీనికి సమర్థనగా రెండు ఉదాహరణలు చూపించింది. భారత్‌లో, మహిళ నాయకత్వంలోని పంచాయతీల్లో నిర్వహిస్తున్న తాగునీటి ప్రాజెక్టులు, పురుషుల నాయకత్వంలోని పంచాయతీల్లో కంటే 62 శాతం అధికంగా ఉంటున్నాయి. దేశంలోని 20 రాష్ట్రాలు పంచాయతీ రాజ్ సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ని మహిళలకు కేటాయించడమే దీనికి కారణమని గుర్తించాలి. మరొక ఉదాహరణను నార్వేలో చూడవచ్చు. మునిసిపల్ కౌన్సిళ్లలో మహిళల ఉనికికి, శిశు సంరక్షణ కవరేజీకి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ఆ దేశంలో కనుగొన్నారు. మహిళలు నిజంగానే పాలనను, నాయకత్వాన్ని పరివర్తన చెందించగలరు. ఒక మహిళగా నాకు ఈ విషయం ముందుగానే తెలుసు కానీ, మహిళలంటే ద్వేషించే, బద్ధవ్యతిరేకత ప్రదర్శించే వారికోసమే ఈ రెండు ఉదాహరణలను ఇక్కడ చూపిస్తున్నాను. – సుథపా పాల్ రచయిత్రి, మీడియా ఎంట్రప్రెన్యూర్ (మిలీనియం సౌజన్యంతో) -
ఇదేం పద్ధతి.. కాంగ్రెస్ ధోరణిని ఎండగట్టాలి
న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్, రైతు సమస్యల అంశాల్లో పార్లమెంటు సమావేశాలు జరగనివ్వకుండా అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వర్షాకాల సమావేశాలకు అడుగుడగునా ఆటంకం కల్పిస్తున్న కాంగ్రెస్ అనుచిత వైఖరిని మీడియాలోనూ, ప్రజల్లోనూ ఎండగట్టాలని బీజేపీ ఎంపీలకు పిలుపునిచ్చారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీని నిందిస్తూ ప్రసంగించినట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఉభయ సభల్ని అడ్డుకుంటోందని మోదీ మండిపడ్డారు. దేశంలో కరోనా పరిస్థితిపై గత వారంలో జరిగిన అఖిలపక్ష సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించడమే కాకుండా, ఇతర పార్టీలు హాజరవకుండా అడ్డుకుందని, ఇదేం పద్ధతంటూ మోదీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఆ వర్గాలు తెలిపాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆరంభమైన దగ్గర్నుంచి వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. కాగా, దేశ 75వ స్వాతంత్య్రదిన వేడుకల్లో ప్రజల్ని కూడా భాగస్వామ్యుల్ని చేయాలని ప్రధాని మోదీ బీజేపీ ఎంపీలకు చెప్పారు. ఎంపీలందరూ నియోజకవర్గంలోని ప్రతీ పల్లెలో ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. వచ్చే 25 ఏళ్లలో దేశాభివృద్ధి కోసం ఆజాదీ కా అమృతోత్సవ్‌లో భాగంగా ఒక ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇందుకోసం కూడా ప్రజల దగ్గర నుంచి కొత్త ఆలోచనలు స్వీకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి మేఘ్వాల్ చెప్పారు. -
ప్రజాకాంక్షల వర్షం కురుస్తుందా?
ప్రజలెన్నుకున్న ప్రతినిధులు పార్లమెంట్ సాక్షిగా తమ గళం విప్పి, స్వరం వినిపించే అవకాశం మరోసారి వచ్చింది. సోమవారం నుంచి మొదలయ్యే 17వ లోక్‌సభ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈ 19 నుంచి ఆగస్టు 13 దాకా జరగనున్న ఈ సమావేశాలలో కొత్త బిల్లులను ప్రవేశపెట్టడానికి సర్కారు సిద్ధమవుతుంటే, ప్రజా సమస్యలపై నిలదీయడానికి ప్రతిపక్షం ఆయుధాలకు పదును పెట్టుకుంటోంది. కరోనా సెకండ్‌వేవ్‌ను ఎదుర్కోవడంలో, వ్యాక్సిన్ల విధానంలో పలు విమర్శలెదుర్కొన్న ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాలు తయారవుతున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, సరుకుల ధరలు, సెంచరీ మార్కు దాటేసిన పెట్రోల్ ధరలు, కోవిడ్‌ను సమర్థంగా ఎదుర్కోవడంలో ప్రభుత్వ వైఫల్యం, ప్రజారోగ్య సమస్యలు, అలాగే దేశ సరిహద్దు భద్రత అంశం- ఇలా ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలు చాలా ఉన్నాయి. మరోపక్క అధికార పక్షం సైతం రకరకాల బిల్లులతో ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో సమావేశాలు వేడిగా, వాడిగా జరిగేలా ఉన్నాయి. కరోనా థర్డ్‌వేవ్ భయాల నేపథ్యంలో జరగనున్న ఈ సమావేశాలకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. కేంద్ర మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ తరువాత వచ్చిన తొలి సమావేశాలు ఇవే. అలా పలువురు కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించాక సభలో ప్రతిపక్షాలను తొలిసారి ఎదుర్కోవాల్సి వస్తోంది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన ప్రాంతీయ పార్టీల చేతిలో బీజేపీ ఓటమి పాలయ్యాక జరుగుతున్న తొలి పార్లమెంట్ సమావేశాలూ ఇవే. అలా వీటికి ప్రాధాన్యం ఉంది. ప్రభుత్వం తన అజెండాను ముందుకు తీసుకురావాలనీ, ప్రతిపక్షాలు తమ వాణిని వినిపించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనీ ప్రయత్నించే వేళ... మొత్తం 19 రోజులు పార్లమెంట్ సమావేశం కానుంది. నిజానికి, గత ఏడాది కరోనా మహమ్మారి దేశం మీద పడినప్పటి నుంచి పార్లమెంట్ సమావేశాలపై ఆ ప్రభావం గణనీయంగా పడింది. గత ఏడాది బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాల మొదలు ఈ ఏటి బడ్జెట్ సమావేశాల దాకా మూడింటినీ నిర్ణీత వ్యవధి కన్నా ముందుగానే ముగించాల్సి వచ్చింది. నిరుటి శీతకాల సమావేశాలనైతే ప్రజారోగ్య సంక్షోభం రీత్యా అసలు జరపనే లేదు. అయితే, టీకాలు అందుబాటులోకి రావడం, ఎంపీలు, పార్లమెంట్ ఉభయసభల సిబ్బందిలో ఎక్కువ మంది టీకాలు వేయించుకోవడంతో ఈ తాజా వానాకాల సమావేశాలు మునుపటి కన్నా కాస్తంత దీర్ఘంగానే జరగవచ్చు. పని కొంత ముందుకూ సాగవచ్చు. ఈసారి అనేక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఇప్పటికే 38 దాకా బిల్లులు, 5 ఆర్డినెన్స్‌లు పార్లమెంట్ ముందు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బిల్లుల్లో 17 కొత్తవి. వీటిని సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం సిద్ధమవుతోంది. దివాళా నియమావళిలో కొన్ని మార్పులు, డిపాజిట్ బీమా బిల్లు లాంటివి అనేకం వాటిలో ఉన్నాయి. 2008 నాటి ‘లిమిటెడ్ లయబులిటీ పార్టనర్షిప్’ (ఎల్ఎల్పీ) చట్టానికి కీలక సవరణను సైతం ప్రభుత్వం చేపట్టనుంది. విద్యుచ్ఛక్తి బిల్లు కూడా చర్చకు రానుంది. అయితే, క్రిప్టో కరెన్సీ - అధికారిక డిజిటల్ కరెన్సీకి సంబంధించిన మరో కీలక బిల్లు మాత్రం ఈ సమావేశాల్లో కూడా సభ ముందుకు రావడం లేదన్నది గమనార్హం. ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలన్నిటినీ నిషేధించి, అధికారిక డిజిటల్ కరెన్సీ ఆరంభానికి సంబంధించిన విధివిధానాలను అందించడం ఆ బిల్లు లక్ష్యం. నిజానికి ఈ ఏటి బడ్జెట్ సమావేశాలకే ఆ బిల్లును లిస్టులో పెట్టారు. కరోనాతో సమావేశాలను కుదించడంతో అది రాకుండానే సమావేశాలు ముగిశాయి. ఆ బిల్లు పరిధినీ, పరిమితులనూ ప్రభుత్వం ఇంకా ఖరారు చేయాల్సి ఉండడంతో ఈసారీ అది ఆగినట్టు వార్త. ఇక, సెన్సార్ వివాదాల విషయంలో సినీవర్గం ఆశ్రయించే సెన్సార్ అప్పిలేట్ ట్రిబ్యునల్ సహా అనేక ట్రిబ్యు నళ్ళను ప్రభుత్వం కొద్ది నెలల క్రితం ఆర్డినెన్స్ ద్వారా రద్దు చేసిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి ట్రిబ్యునల్ సంస్కరణల బిల్లు కూడా ఈసారి సభలో రానుంది. తల్లితండ్రుల, వృద్ధుల జీవనభృతి - సంక్షేమానికి సంబంధించిన సవరణ కూడా సర్కారు సభ ముందుకు తేనుంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ సహా నాలుగు రాష్ట్రాలలో, కేంద్ర పాలిత ప్రాంతం పుదు చ్చేరీలో ఎన్నికల తర్వాత జరుగుతున్న ఈ తొలి సమావేశాల్లో ప్రతిపక్షాలు ప్రజల్లో పెరిగిన బలంతో, నైతికంగా రెట్టించిన ఉత్సాహంతో, ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు. అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబం ధించి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ, కృష్ణా జలాల పంపిణీ వ్యవహారం, ఇప్పటికీ అమలు కాని రాష్ట్ర విభజన హామీల లాంటివి పార్లమెంటులో ప్రస్తావనకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. వాటికి ప్రభుత్వం ఎలాంటి సమాధానం, సంజాయిషీ ఇస్తుందో చూడాలి. ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి, సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే ఏ చట్టసభ సమావేశాలకైనా అర్థం, పరమార్థం. ప్రభుత్వం తాము చేపడుతున్న చర్యలను వివరించాల్సిందే. అదే సమయంలో క్షేత్రస్థాయిలోని లోటుపాట్లను ప్రతి పక్షాలు ఎత్తిచూపాల్సిందే. పరస్పరం సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ప్రజాకాంక్షలు నెరవేర్చే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా వట్టి రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య విలువైన సభాసమయం వృథా అయితేనే సమస్య. ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కేవలం పాలకపక్షం మెరుపులకూ, ప్రతిపక్షాల ఉరుములకే పరిమితం కాకుండా ప్రజాసమస్యల పరిష్కార వేదిక కావాలన్నదే ఆకాంక్ష. సభ అలా సాగితే, ప్రజాస్వామ్యంలో అంతకన్నా కావాల్సింది ఏముంది! -
ఆసక్తికరంగా నిర్మల ప్రసంగం..
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా బడ్జెట్‌పై ఆమె ప్రసంగం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. తన ప్రసంగం ప్రారంభంలో మాజీ ఆర్థిక మంత్రి దివంగత అరుణ్ జైట్లీని నిర్మల గుర్తుచేసుకున్నారు. జీఎస్టీ తీసుకురావడానికి ఆయన ఎంతగానో కృషి చేశారని తెలిపారు. జీఎస్టీని తీసుకురావడం చారిత్రత్మకమైన నిర్ణయమని పేర్కొన్న నిర్మల.. శ్లాబుల తగ్గింపుతో సామాన్యులకు మేలు జరిగిందన్నారు. న్యూ ఇండియా, సబ్కా సాత్.. సబ్కా వికాస్, ప్రజా సంక్షేమం.. లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. (మరింత ఈజీగా జీఎస్టీ: నిర్మలా సీతారామన్) (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇలా కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలను వివరిస్తూ సాగుతున్న నిర్మల ప్రసంగం.. ఆకట్టుకునేలా ఉంది. మధ్యలో ఆమె ఓ కవితను కూడా చదివి వినిపించారు. ‘నా దేశం దాల్ సరస్సులో విరబూసిన కమలం లాంటిది మానవత్వం, దయతో కూడిన సమాజం అవసరం నా దేశం సైనికుల నరాల్లో ప్రవహిస్తున్న ఉడుకు రక్తం మా దేశం వికసిస్తున్న షాలిమార్ తోటలాంటిది’ అని పేర్కొన్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మల ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్ ఇది. గతంలో మాదిరిగానే నిర్మల ఈసారి కూడా ఎర్రనీ వస్త్రంతో కూడిన సంచిలో బడ్జెట్ ప్రతులును తీసుకునివచ్చారు. నిర్మల బడ్జెట్ ప్రసంగం వినేందుకు ఆమె కుమార్తె వాఙ్మయి, ఇతర కుటుంబభ్యులు పార్లమెంట్‌కు వచ్చారు. (జీఎస్టీ : అరుణ్ జైట్లీ ముందు చూపు) -
పార్లమెంటు వద్ద ఫొటోలు.. బుక్కైన ఎంపీలు..!
న్యూఢిల్లీ : లోక్‌సభ తాజా ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తరపున పోటీచేసి గెలిచిన బెంగాల్ నటీమణులు మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్ అత్యుత్సాహం ప్రదర్శించి విమర్శలపాలయ్యారు. ఎంపీలుగా ఎన్నికైన ఈ ఇద్దరు సోమవారం పార్లమెంట్‌ను సందర్శించారు. అనంతరం మోడ్రన్ డ్రెస్సుల్లో అక్కడ ఫొటోలకు పోజిచ్చారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో నెటిజన్ల ట్రోలింగ్‌కు గురయ్యారు. ఫొటోలు దిగేందుకే పార్లమెంటుకు వెళ్లారా..? అని నెటిజన్లు వారిని ప్రశ్నిస్తున్నారు. టీఎంసీ మీకు ఏ ప్రాతిపదికన టికెట్లు ఇచ్చిందని, కుర్ర చేష్టలతో బెంగాల్ పరువు తీస్తున్నారని మండిపడుతున్నారు. ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. వారి హక్కుల్ని కాపాడేందుకు ఎన్నుకుంటే.. అక్కడ ఫొటోల పేరుతో డ్రామాలాడుతున్నారని ఓ నెటిజన్ చురకలంటించారు. ఓ ప్రజాప్రతినిధిగా హుందాగా ఉండాల్సింది పోయి.. సినిమా షూటింగ్లో మాదిరిగా ఈ ట్రెండీ లుక్ అవసరమా అని మరో నెటిజన్ విమర్శించారు. ఇక మిమి.. జాదవ్‌పూర్ నుంచి నుస్రత్.. బసిర్హాత్ నుంచి ఎంపీలుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. -
‘అయోధ్యలో భూసేకరణ’పై సుప్రీంలో పిటిషన్
న్యూఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదాస్పద ప్రాంతంతోపాటు చుట్టుపక్కల ఉన్న 67 ఎకరాల భూమిని కేంద్రం సేకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. అయోధ్య అంశంపై ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనానికి తాజాగా దాఖలైన ఈ పిటిషన్‌ను బదలాయిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రానికి చెందిన మత సంబంధ స్థలాన్ని సేకరిస్తూ చట్టం చేసే అధికారం పార్లమెంట్‌కు లేదని రామ్‌లల్లా సంస్థకు చెందిన న్యాయవాదులు శిశిర్ చతుర్వేది, సంజయ్ మిశ్రా పేర్కొన్నారు. ‘పార్లమెంట్ చర్య హిందువుల మత స్వేచ్ఛకు భంగం కలిగించడమే. తమ పరిధిలోని మత సంస్థల వ్యవహారాల నిర్వహణలో జోక్యం చేసుకునే ప్రత్యేక అధికారాలు రాష్ట్రానికి మాత్రమే ఉన్నాయి. కేంద్రం సేకరించిన భూమిని తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలి’అని వారు కోరారు. వివాదాస్పదం కాని 67 ఎకరాల భూమిని యజమానులకే తిరిగి ఇచ్చి వేసేందుకు వీలుగా 2003లో ఇచ్చిన ఉత్తర్వుల సవరణకు అనుమతించాలంటూ కేంద్రం సుప్రీంను ఆశ్రయించిన నేపథ్యంలో తాజాగా ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. 1992లో బాబ్రీ మసీదు కట్టడాన్ని కరసేవకులు ధ్వంసం చేయడంతో 1993లో కేంద్రం ప్రత్యేక చట్టం ద్వారా వివాదాస్పద ప్రాంతం2.77 ఎకరాలతోపాటు చుట్టుపక్కల ఉన్న మొత్తం 67.703 ఎకరాలను సేకరించింది. -
హాజరు అంతంతే..
సాక్షి, వరంగల్ రూరల్ : లోక్‌సభ సమావేశాల్లో మన ఎంపీల హాజరు శాతం అంతంతమాత్రంగానే ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం 2014 మే 26న కేంద్రంలో పాలనా పగ్గాలు చేపట్టగా.. 16వ లోక్‌సభ మొదటి సమావేశం జూన్ నాలుగో తేదీన జరిగింది. అప్పటినుంచి 17 సెషన్లలో 331 రోజుల పాటు సమావేశాలు జరిగాయి. ఉమ్మడి వరంగల్ నుంచి ముగ్గురు ఎంపీలు పసునూరి దయాకర్ (వరంగల్), అజ్మీర సీతారాం నాయక్ (మహబూబాబాద్), డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ (భువనగిరి) ప్రాతినిథ్యం వహిస్తుండగా.. ఈ ఐదేళ్లలో వారు పలు సమస్యలపై గళమెత్తారు. అయితే కొన్ని సమస్యలు పరిష్కారం కాగా.. మరి కొన్ని అలానే ఉన్నాయి. మొత్తానికీ లోక్‌సభ సమావేశాలకు మన ప్రజాప్రతినిధులు కనీసం 80 శాతం హాజరుకాకపోవడం గమనార్హం. 16వ లోక్‌సభ సమావేశాలు బుధవారంతో ముగిసిన నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. వరంగల్ : ‘పసునూరి’ ఇలా.. 2015 నవంబర్ 24న వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన పసునూరి దయాకర్ గెలుపొందారు. అంతకంటే ముందు 2014లో వరంగల్ ఎంపీగా కడియం శ్రీహరి గెలుపొందారు. ఆ తర్వాత కాలంలో సీఎం కేసీఆర్ ఆయనకు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను అప్పగించడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. గడిచిన నాలుగేళ్లలో దయాకర్ 112 రోజులు లోక్‌సభ సమావేశాలకు హాజరయ్యారు. ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి చివరి సమావేశం వరకు ఐదు ప్రశ్నలు మాత్రమే లేవనెత్తారు. బాలికల అక్రమ రవాణా, పసుపు బోర్డు ఏర్పాటు, వాటర్ పొల్యూషన్, ట్రేడ్ ఇన్ బిట్కాన్, రూరల్ డెవలప్మెంట్ల్పై ప్రశ్నలు సంధించారు. 2015 డిసెంబర్ 18, నుంచి లెబర్ డిపార్ట్మెంట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పసునూరి కొనసాగారు. మహబూబాబాద్ : సీతారాంనాయక్.. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మహబూబాబాద్ ఎంపీగా డాక్టర్ అజ్మీరా సీతారాంనాయక్ గెలుపొందారు. ఐదేళ్లలో 331 రోజులు సభ జరుగగా.. 227 రోజులు హాజరయ్యారు. 44 డిపార్ట్మెంట్లపై 118 ప్రశ్నలు అడిగారు. 2014 సెప్టెంబర్ ఒకటి నుంచి ఇప్పటివరకు పార్లమెంట్ నిబద్ధత కమిటీ సభ్యుడు, కమ్యూనికేషన్ ఇన్ఫర్మమేషన్ టెక్నాలజీ కమిటీ సభ్యుడిగా.. 2017 నవంబర్ 3 నుంచి కెమికల్ ఫర్టిలైజర్స్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2017 సెప్టెంబర్ ఒకటి నుంచి నవంబర్ 2 వరకు సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ సభ్యుడిగా కొనసాగారు. భువనగిరి : బూర నర్సయ్యగౌడ్.. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో భువనగిరి లోక్‌సభ సభ్యుడిగా డాక్టర్ బూర నర్సయ్యగౌడ్గెలుపొందారు. 16వ లోక్‌సభ సమావేశాలు ముగిసేసరికి ఆయన 184 రోజులు హాజరయ్యారు. సమావేశాల్లో 59 డిపార్ట్మెంట్లపై 216 ప్రశ్నలు సంధించారు. 2014 సెప్టెంబర్ ఒకటి నుంచి లేబర్ డిపార్ట్మెంట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా కొనసాగారు. 2014 సెప్టెంబర్ 12 నుంచి 2018 జనవరి 8 వరకు పార్లమెంటరీ వెనుకబడిన తరగతుల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, స్కిల్ డెవలప్మెంట్ సభ్యుడిగా కొనసాగారు. పాస్‌పోర్ట్ కార్యాలయం తెచ్చా.. వరంగల్‌కు పాస్‌పోర్ట్ కేంద్రాన్ని మంజూరు చేయించి తీసుకొచ్చాను. సీఎం కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేశాను. నా వంతు అభివృద్ధికి పాటుపడ్డా. తక్కువ సమయంలో సీనియర్ల దగ్గర చాలా నేర్చుకున్నా. వరంగల్‌లో నేషనల్ హైవేలు తీసుకొచ్చాను. కొడకండ్లకు ఏకలవ్య స్కూల్ మంజూరు చేయించాను. దీనికి దాదాపు రూ.200 కోట్ల వ్యయమవుతోంది. ప్రభుత్వం కేటాయించిన నిధుల ద్వారా రోడ్లు, కమ్యూనిటీహాళ్లు తదితర అభివృద్ధి పనులకు కేటాయించాను. – పసునూరి దయాకర్, వరంగల్ ఎంపీ గొప్ప అనుభూతి.. మారుమూల గ్రామం నుంచి వచ్చి ప్రొఫెసర్‌గా, సోషల్ వర్కర్‌గా కొనసాగుతూనే సీఎం కేసీఆర్ ఆకాంక్షకు అనుగుణంగా ఉద్యమంలో పాల్గొన్నాను. కేసీఆర్ నన్ను గుర్తించి లోక్‌సభ టికెట్ ఇచ్చి గెలిపించి పార్లమెంట్‌కు పంపించారు. గిరిజన బిడ్డగా అదృష్టంగా భావిస్తున్నా. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధి, దేశ గిరిజన సమస్యలపై పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లా. కొన్నింటిని సాధించాను. జిల్లాకు పాస్‌పోర్ట్, నేషనల్ హైవేలు, రెండు ఆర్వోబీలు, కొత్త రైళ్లను మంజూరు చేయించాను. – డాక్టర్ అజ్మీర సీతారాంనాయక్, మానుకోట ఎంపీ -
‘కడప స్టీల్ ఫ్యాక్టరీ సీఎం రమేష్‌దే’
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా’ అంశంపై గత నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు పునరుద్ఘాటించారు. శుక్రవారం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు ప్రదర్శించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిరసన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కడప స్టీల్ ప్లాంట్ వ్యయం రూ.18 వేల కోట్లుగా చెప్తున్నారు. అది కేంద్ర ప్రభుత్వం నిర్మించాలనుకున్న ప్రాజెక్టు.. దాంతో మీకేం పని అని ప్రశ్నించారు. అది చంద్రబాబు బినామీ అయిన సీఎం రమేష్ స్టీల్ ఫ్యాక్టరీ అని వ్యాఖ్యానించారు. ‘ఏం చేశాడు బాబు ఏపీకి. ప్రపంచంలో ఉన్న అందమైన బిల్డింగ్‌ల ఫొటోలు తెచ్చి గ్రాఫిక్స్ ప్రజెంటేషన్ ఇస్తాడు. వాటికి డీపీఆర్ రిపోర్టులు ఉండవు. ఎంత ఖర్చో ఉండదు. రాజధాని నిర్మాణానికి 48 వేల కోట్లు ఖర్చు అని అంచనా వేశారు. అభివృద్ధిని గ్రాఫిక్స్‌లో చూపిస్తున్నారు. ప్రణాళిక వ్యయంలో బీసీలు, ఎస్సీ, ఎస్టీల సబ్‌ప్లాన్ నిధులు ఖర్చు చేయడం లేదు. పేద ప్రజల నోళ్లు కొట్టి కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నాడు. లంచాలు దండుకుంటున్నాడు. ఇలాంటి దుర్మార్గపు ముఖ్యమంత్రిని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. తీరని ద్రోహం.. ఏపీకి ద్రోహం చేసింది బాబు మాత్రమేనని మాజీ ఎంపీ వరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 ఏళ్లు ప్రత్యేక హోదా సాధిద్దామని ఓట్లు వేయించుకొన్న బాబు తర్వాత ప్లేటు ఫిరాయించాడని మండిపడ్డారు. ‘హోదా సంజీవని కాదని చెప్పి ప్యాకేజీకి సై అన్నారు. హదా కోసం పోరాడుతుంటే వైఎస్సార్సీపీ నేతల్నిహేళన చేశారు. ఏపీకి తీరని ద్రోహం చేశారు. విభజన హామీలను సాధించలేదు. ఎన్నికల వేళ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు’ అని నిప్పులు చెరిగారు. నిరసన కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. -
మూడు పార్టీలు : ఎన్ని‘కల’ అవిశ్వాసం..
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పేరుతో శుక్రవారం లోక్ సభ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలతో చర్చను రక్తి కట్టించారు. అయితే, అవిశ్వాస తీర్మానంపై జరిగిన మొత్తం చర్చను లోతుగా విశ్లేషిస్తే... అంతిమంగా సాధించిందేమిటి? రాష్ట్రానికి ఒరిగిందేమిటి? అన్న ప్రశ్నకు మాత్రం ఎక్కడా సమాధానం దొరకదు. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు రాజకీయ కోణంలో తమదైన డ్రామాను కొనసాగించాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల 10 నిమిషాల వరకూ(ఆఖరి పది నిమిషాల్లో ఓటింగ్ జరిగింది) రోజంతా సాగిన ఈ తతంగం వల్ల సాధించిందేంటో అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. ప్రధాని మోదీ మాట్లాడుతూ చంద్రబాబే ప్రత్యేక హోదా వద్దని అన్నారని, ప్రత్యేక ప్యాకేజీ కావాలన్నారని లోక్‌సభలో పేర్కొనడంతో టీడీపీ ఇరకాటంలో పడింది. అవిశ్వాస తీర్మానం చర్చను ప్రారంభిస్తూ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ బీజేపీ సర్కారును విమర్శించారు. దానికి ప్రతిగా ప్రభుత్వం పక్షాన హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ, చంద్రబాబు మాకు మిత్రుడేనని, ఇప్పటికీ, ఎప్పటికీ మిత్రుడే, విడిపోయే బంధం కాదన్నారు. ఆ మాటలకు టీడీపీ సభ్యులు ఖండించకపోగా మౌనం పాటించడం గమనార్హం, అలాగే, రాష్ట్రానికి ఏఏ రంగాలకు ఎన్నెన్ని నిధులు కేటాయించారో హోం మంత్రి చెప్పినప్పుడు కూడా టీడీపీ సభ్యులు మౌనంగా వింటూపోయారు. ఇదిలావుండగా, చంద్రబాబు మా స్నేహితుడే అని రాజ్ నాధ్ చెప్పగా బీజేపీకే చెందిన ఎంపీలు రాకేష్ సింగ్, కంభంపాటి హరిబాబులు మాత్రం, టీడీపీ కాంగ్రెస్ తో దోస్తీ కట్టిందని విమర్శలు గుప్పించారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే చర్చలో టీడీపీ లేవనెత్తిన డిమాండ్లను ప్రస్తావిస్తూ మద్దతు పలికారు. టీడీపీని ఉద్దేశించి ఇటు కాంగ్రెస్ నేతలు, అటు రాజ్ నాధ్ సింగ్ మాట్లాడిన అంశాలపై సభలోనే ఉన్న ఆ పార్టీ సభ్యులు స్పందించకపోవడం గమనార్హం. చర్చను ప్రారంభించినప్పుడు టీడీపీ నేతలు బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పించగా, సర్కారు తరఫున మంత్రి టీడీపీ మిత్రపక్షమనే చెప్పడం, పార్టీ తరఫున బీజేపీ ఎంపీలు మాత్రం టీడీపీపై ప్రతివిమర్శలు చేయడం, కాంగ్రెస్- టీడీపీలు కలిసిపోయాయంటూ ఎద్దేవా చేయడం వంటి మాటలతో ఆ మూడు పార్టీల నేతలు పరస్పరం ఒక పథకం ప్రకారం డ్రామాను నడిపించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలోకి వస్తే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే ఫైలుమీదే చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అవిశ్వాస చర్చ సందర్భంగా అసలు ఆ ప్రస్తావనే చేయలేదు. మరోవైపు అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభమైన సందర్భంలో టీఆర్ఎస్ ఎంపీ జోక్యం చేసుకుని రాష్ట్ర విభజన బిల్లును అప్రజాస్వామిక చర్యగా చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. గడిచిన ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ మిత్రపక్షాలుగా ఎన్నికల్లో విజయం సాధించడం, ఆ తర్వాత అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఇరు పార్టీలు పరస్పరం భాగస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం అందరికీ తెలిసిందే. నాలుగు సంవత్సరాల పాటు ఈ రెండు పార్టీలు చెట్టాపట్టాలేసుకుని సాగాయి. మరికొన్ని లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన తరుణంలో రెండు చోట్లా ప్రభుత్వాల నుంచి కేంద్రంలో టీడీపీ, రాష్ట్రంలో బీజేపీ వైదొలగింది. ఈరోజు లోక్‌సభలో టీడీపీ లేవనెత్తిన అంశాలన్నీ గడిచిన నాలుగు సంవత్సరాలుగా అనేక రూపాల్లో చర్చ జరగడం, ప్రజాందోళనలు జరగడం, అసెంబ్లీలో చర్చకు రావడం, సమావేశాలు, నిరసన దీక్షలు ఎన్నో జరిగిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా వంటి అంశంపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో అనేక ఆందోళనలు జరిగాయి. కీలకమైన ఆ అంశం జీవంతో ఉండటానికి జగన్ మోహన్ రెడ్డి మాత్రమే కారణమన్నది అందరూ అంగీకరించే విషయమే. విభజన చట్టంలో ఇచ్చిన హామీలతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఇచ్చిన అనేక హామీలు నెరవేరడం లేదని గడిచిన నాలుగేళ్ల పాటు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పుడు అధికార టీడీపీ వాటిని తీవ్రంగా వ్యతిరేకించింది. పైపెచ్చు బీజేపీ నిర్ణయాలను అభినందిస్తూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర్మానం ఆమోదించారు. నాలుగేళ్ల పాటు అధికారంలో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉంటూ అత్యంత సులభంగా సాధించాల్సిన అంశాలపై విషయాలను కూడా టీడీపీ పట్టించుకోలేదు. పైగా ప్రత్యేక హోదా అవసరమే లేదని చెప్పిన చంద్రబాబే మళ్లీ యూ టర్న్ తీసుకోవడం వంటి చర్యలతో ప్రజల్లో తీవ్ర విమర్శలపాలయ్యారు కూడా. నాలుగేళ్లుగా ప్రజలను మోసపుచ్చిన టీడీపీ ప్రభుత్వం ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి ఎత్తుగడలతో ముందుకొచ్చినప్పటికీ అందులోనైనా చిత్తశుద్ధితో వ్యవహరించిందా అంటే అదీ లేదు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడమే కాకుండా దేశవ్యాప్తంగా అనేక పార్టీల మద్దతు కూడగడుతామన్న టీడీపీ తీరా సమయానికి చేతులెత్తేసింది. ఏ రాజకీయ పార్టీ కూడా టీడీపీ అవిశ్వాసానికి అనుగుణంగా కాకుండా ఎవరి ప్రాధాన్యతల మేరకు వారన్నట్టు తమ వైఖరులను మాత్రమే ప్రస్తావించారే తప్ప టీడీపీ ప్రతిపాదించిన తీర్మానానికి మద్దతునివ్వలేకపోవడం ఆ పార్టీ వైఫల్యమే అవుతుంది. మరోవైపు నాలుగేళ్ల పాటు చెప్పిన మాటలకు, చేసిన పనులకు విరుద్ధంగా సభలో భిన్నంగా మాట్లాడి బొర్లా పడింది. పైపెచ్చు రాష్ట్రానికి అన్యాయం చేసిందని ప్రభుత్వం అవిశ్వాసం పెట్టిన టీడీపీ తీరా చర్చ సందర్భంగా ఆ విషయాన్ని మరిచి వ్యవహరించింది. పార్లమెంట్ సాధారణ సమావేశాల్లో వివిధ అంశాలపై చర్చ సందర్భంగా కోరినట్టుగా తాము లేవనెత్తిన అంశాలపై ప్రధానమంత్రి సమాధానం చెప్పాలని మాత్రమే టీడీపీ సభ్యులు గల్లా జయదేవ్, రామ్మోహన్ లు కోరిందే తప్ప ఏ రకంగా ఆ డిమాండ్లను సాధించవచ్చో, ఏ విధంగా సాధిస్తామో చెప్పడంలో విఫలమయ్యారన్న మాట సొంత పార్టీ నుంచే వినిపించింది. మొత్తంమీద అవిశ్వాస తీర్మానంపై టీడీపీ ఎంత ఆర్భాటం చేసిందో చివరకు ఏమీ సాధించలేక అంతే స్థాయిలో చతికిలపడిందన్న విమర్శను మూటగట్టుకుంది. మాజీ మంత్రి ఎందుకు మౌనం వహించారు లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చర్చలో టీడీపీకి చెందిన మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు నోరు మూయించినట్టు పార్టీ వర్గాల సమాచారం. నాలుగేళ్ల పాటు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు అశోక గజపతి రాజు ద్వారా చంద్రబాబు అనేక పనులు చేయించుకున్నారని, చర్చకు సమాధానం సందర్భంగా అవెక్కడ తెరమీదకు తెస్తారో అన్న అనుమానంతో ఆ మాజీ మంత్రిని మౌనంగా ఉండమని ఆదేశించినట్టు తెలిసింది. బాబు ఆదేశాలతో ఏం చేయలేక అశోకగజపతిరాజు చర్చ ఆసాంతం మౌనముద్ర దాల్చారు. -
ఎంతైనా లేట్ లేటే అవుతుందీ రాహుల్!
సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం జరిగిన చర్చలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆద్యంతం ఆవేశంతోనే మాట్లాడారు. ఎక్కడా వేడి తగ్గకుండా రాఫెల్ విమానాల రాకెట్ దగ్గరి నుంచి దేశంలో దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, మహిళలపై జరుగుతున్న దాడుల వరకు మోదీని నిలదీశారు. హిందీ భాషలో అనర్గళంగా మాట్లాడడంలో అక్కడక్కడా మాటలు తడబడినా, తలకిందులైనా, సర్దుకొని ముందుకు సాగారు. చివరలో ‘నేనంటే మీకు ద్వేషం. మీ దృష్టిలో నేనొక పప్పూను. కానీ మీరంటే నాకు ద్వేషం లేదు. నేను కాంగ్రెస్‌ను, నేను అందరినీ ప్రేమిస్తాను’ అంటూ ప్రసంగాన్ని ముగించిన రాహుల్ సరాసరి మోదీ వద్దకు వెళ్లి ఆయన్ని ఆలింగనం చేసుకున్నారు. దీనికి ఆశ్చర్యచకితుడైన మోదీ, రాహుల్ గాంధీని వెనక్కి పిలిచి అభినందన పూర్వకంగా కరచాలనం చేశారు. ఈ సంఘటనతో అప్పటి వరకు వేడిగా ఉన్న సభా వాతావరణం ఒక్కసారిగా చల్లబడినట్లు అయింది. రాత్రి సభా చర్చకు సమాధానం ఇవ్వనున్న నరేంద్ర మోదీ రాహుల్ విమర్శలను ఎలా తిప్పి కొడతారో చూడాలి! ఈ రోజున తనకు చిక్కిన అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకొన్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అని తానన్నట్లు విరుచుకుపడిన మోదీ, నిర్మలా సీతారామన్, ఇతర నాయకుల విమర్శలకు సరైన సమాధానం ఇవ్వడంలో మాత్రం చాలా తాత్సారం చేశారు. ‘నేను వరుసలో చివర నిల్చున్న వాడికి అండగా నిలబడతాను. సమాజంలో వెనకబడిన వాడికి, దోపిడీకి, దగాకు, అన్యాయానికి గురైన వాడి పక్కనుంటాను. వారి కులం, మతం, విశ్వాసాలతో నాకు సంబంధం లేదు. బాధ పడుతున్నవాడిని హత్తుకుంటాను, భయాన్ని, ద్వేషాన్ని పారద్రోలుతాను. ప్రాణం ఉన్న వాటన్నింటిని నేను ప్రేమిస్తాను. నేను కాంగ్రెస్‌ను’ అని ఈ నెల 17వ తేదీన రాహుల్ గాంధీ తనపై వచ్చిన విమర్శలకు బదులుగా ట్వీట్ చేశారు. ‘ది గుడ్ మేన్ ఈజ్ ది ఫ్రెండ్ ఆఫ్ ఆల్ లివింగ్ థింగ్స్’ అన్న జాతిపిత మహాత్మాగాంధీ సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ వ్యాఖ్యాలను ఎవరో సలహాదారులు రాహుల్‌కు రాసినట్లున్నారు. ఎవరు రాసినా సరే రాహుల్ సకాలంలో స్పందించలేకపోయారు. రాహుల్ గాంధీ, ముస్లిం మేధావులతో ఈ నెల 11వ తేదీన సమావేశమయ్యారు. ‘కాంగ్రెస్ ముస్లింల పార్టీ’ అన్నట్లు 12వ తేదీన ‘ఇంక్విలాబ్’ ఉర్దూ పత్రిక వార్తను ప్రచురించింది. దేశంలో జరిగే అల్లర్లకు ఇక నుంచి రాహుల్ గాంధీయే బాధ్యత వహించాలంటూ 13వ తేదీన సీతారామన్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ముస్లిం పురుషుల పక్షమా, ముస్లింల మహిళల పక్షమా? అంటూ 14వ తేదీ నుంచి వరుసగా మోదీ విమర్శిస్తూ వస్తున్నారు. 17వ తేదీన రాహుల్ తాపీగా స్పందించారు. ‘లేట్ బెటర్ ద్యాన్ నెవర్’ అనుకొని ఉండవచ్చేమో. కానీ రాజకీయాల్లో లేట్ చేస్తే ‘లేట్’గానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. -
నోరు మెదపని టీడీపీ ఎంపీలు!
సాక్షి, న్యూఢిల్లీ : ఏపీకి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను ఇచ్చేది లేదని కేంద్రం మరోసారి కుండబద్దలు కొట్టింది. అవిశ్వాస తీర్మాణంపై లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతున్న క్రమంలో ఏపీకి హోదా ఇవ్వలేమని ఆయన పేర్కొన్నారు. అయితే నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి నేడు ఏపీ ప్రయోజనాల కోసం ఎన్నో చేస్తున్నట్లు డ్రామాలాడుతున్న టీడీపీ ఎంపీలు మాత్రం రాజ్‌నాథ్ ప్రకటనపై స్పందించడం లేదు. గత నాలుగేళ్లు ప్రత్యేక ప్యాకేజీ కోసం ఆశపడి ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టిన టీడీపీ ఎంపీలు యూటర్న్ తీసుకున్నా తమ స్వభావాన్ని పార్లమెంట్ సాక్షిగా మరోసారి నిరూపించుకున్నారు. నిధులిచ్చామని రాజ్‌నాథ్ చెబుతుంటే టీడీపీ ఎంపీలు ఎందుకు ప్రశ్నించడం లేదన్న అనుమానాలు ఏపీ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. టీడీపీ-బీజేపీల బంధం నిజమైనదే కనుక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లలేదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థకు తామే కారణమని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందని, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పిన మాటల్ని రాజ్‌నాథ్ గుర్తుచేశారు. చరిత్రలో కర్ణాటక అనుభవ్ మండపం, తంజావూరు చోళుల వ్యవస్థ నుంచి కూడా బ్రహ్మాండమైన ప్రజాస్వామ్య వ్యవస్థ నడుస్తోందన్నారు. ప్రజాస్వామ్యం విషయంలో ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శమని, ప్రజాస్వామ్య పునాదులు భారత్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు. ‘దేశంలో నాలుగేళ్లుగా ఉగ్రదాడులు జరగకుండా అణచివేశాం. చరిత్రలో అతిపెద్ద మూక దాడులు 1984లో జరిగాయి. కొందరు నేతలు హిందూ పాకిస్తాన్, హిందూ తాలిబన్ అంటూ ప్రకటనలు చేస్తున్నారు. గతంలో పార్లమెంట్‌పై దాడి జరిగినప్పుడు తాలిబన్ గుర్తుకురాలేదా..? కౌరవులను చంపిన పాండవులే వారి కర్మకాండలు నిర్వహించారు. అంతటి గొప్ప సంప్రదాయం ఉన్న దేశ మనది. పాకిస్తాన్ ఒక దేశం కాదు.. ఒక దరిద్రం. ప్రధాని నరేంద్ర మోదీ నిజాయితీ, నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరు. నిరుపేద తల్లిగర్భం నుంచి పుట్టిన మోదీలాంటి వ్యక్తే రైతుల నిజమైన బాధను అర్థం చేసుకోగలరని’రాజ్‌నాథ్ అన్నారు. డైలమాలో కాంగ్రెస్!! మరోవైపు అవిశ్వాసంలో ఓటు వేయాలా.. వద్దా.. అనే దానిపై కాంగ్రెస్ సందిగ్దంలో పడిపోయినట్లు కనిపిస్తోంది. టీడీపీ ఇచ్చిన అవిశ్వాసానికి ఓటేయడంపై కాంగ్రెస్‌లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు నేతలు టీడీపీకి మద్దతివ్వాల్సిన అవసరం లేదంటుండగా.. మరికొందరు ఓటింగ్‌కు దూరంగా ఉండాలని యోచిస్తున్నట్లు సమాచారం. -
చంద్రబాబు ఎప్పటికీ మాకు మిత్రుడే : రాజ్‌నాథ్
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఉందని, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వాళ్ల దగ్గర సంఖ్యా బలం కూడా లేదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అనైతికంగా కొన్ని పార్టీలు కలిసి అవిశ్వాసం పెట్టాయని, కానీ తాము మాత్రం ఇద్దరి ఎంపీల నుంచి దేశంలో అధికారంలోకి వచ్చే స్థాయికి ఎదిగామని గుర్తు చేశారు. గతంలో కౌన్సిలర్లు కూడా లేని లడఖ్, కశ్మీర్ లాంటి ప్రాంతాలతో పాటు మేం అడుగు కూడా పెట్టలేమని భావించిన త్రిపురలో విజయకేతనం ఎగురవేశామన్నారు. టీడీపీతో తమ బంధాన్ని రాజ్‌నాథ్ చెప్పకనే చెప్పారు. ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ వైదొలిగినప్పటికీ.. చంద్రబాబు మాకు మిత్రుడేనని వెల్లడించారు. ఇప్పటికీ చంద్రబాబుతో మాకు మితృత్వం ఉందని, భవిష్యత్తులో కూడా తమ స్నేహం కొనసాగుతుందని స్పష్టం చేశారు. వెనకబడిన జిల్లాల అభివృద్ధి కోసం 1,050 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం ఇప్పటివరకూ రెవెన్యూ లోటు కింద 15,959 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు మేం ఎప్పుడు అవిశ్వాసం ప్రవేశపెట్టలేదని చెపన్పారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా దేశ ప్రతిష్టను పెంచారని రాజ్‌నాథ్ కొనియాడారు. పెద్ద నోట్లరద్దు వల్ల నష్టం జరిగిందని విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. తాత్కాలికంగా ఇబ్బందిపడ్డా దేశ ప్రజలు నోట్లరద్దుకు మద్దతు పలికారని తెలిపారు. యూపీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. అవిశ్వాసం పెట్టిన పార్టీల మధ్యే సఖ్యత లేదని, నేతృత్వం అనే అంశం చర్చకు వస్తే ఏ పార్టీ ఉండదని ఎద్దేవా చేశారు. ఆర్థిక వృద్ధిలో గణనీయమైన ప్రగతిని సాధించామని రాజ్‌నాథ్ అన్నారు. -
‘వాళ్ల హనీమూన్ సమయంలో మాకు అన్యాయం’
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం పనితీరును తెలంగాణ ప్రజలు మెచ్చడం లేదని, తమ రాష్ట్రానికి సంబంధించిన తొలి ఆర్డినెన్స్‌నే రాజ్యాంగ విరుద్ధంగా జారీ చేశారని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ పేర్కొన్నారు. లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణంపై ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నరేంద్ర మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదు. రాజ్యాంగ విరుద్ధంగా తొలి ఆర్డినెన్స్ జారీ చేశారు. ఖమ్మం జిల్లా నుంచి 7 మండలాలను తీసేసుకున్నారు. 1952లో ఖమ్మం అనేది వరంగల్ జిల్లాలో భాగం అని తెలుసుకోవాలి. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ నుంచి 7 మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపేశారు. మా మండలాలను తిరిగి మాకు ఇచ్చేయాలి. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హనీమూన్‌లో ఉన్న సమయంలో తెలంగాణను అన్యాయం చేశారని’ ఆయన వ్యాఖ్యానించారు. ‘తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నటికీ క్షమించరు. సీలేరు జలవిద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ నుంచి బలవంతంగా లాక్కున్నారు. ప్రాజెక్ట్‌లకు ఆర్థిక పరమైన వనరులు ఏర్పాటు చేయడంలో యూపీఏ విఫలమైందన్నారు. విద్యుత్ సరఫరాలో ఏపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి విద్యుత్ కొనుగోలు చేసిన మా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే తొలిసారిగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించారు. పోలవరం విషయంలో మేం అడుగుతున్నది కేవలం నీటి పంపకం గురించి మాత్రమే. ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్‌కోచ్ ఫ్యాక్టరీ, తెలంగాన గిరిజన యూనివర్సిటీ అంశాల్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తెలంగాణ గురించి కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదు. కోర్టుల్లో కేసుల ద్వారా ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకుంటోంది. తెలంగాణ ప్రాజెక్ట్‌లను పోలవరం తరహాలోనే జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానిని కోరుతున్నాం. తెలంగాణకు 19వేల కోట్ల నిధులను ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా.. ఇంతవరకు నిధులు విడుదల చేయలేదు. ఏపీలో సచివాలయం, అసెంబ్లీ కట్టినా.. హైకోర్టు విభజనకు ఎందుకు ముందుకు రావడం లేదని’ ఎంపీ వినోద్ఈ సందర్భంగా ప్రశ్నించారు. తాను లేవనెత్తిన అంశాలపై ప్రధాని మోదీతో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా సమాధానం చెప్పాలని టీఆర్ఎస్ ఎంపీ డిమాండ్ చేశారు. -
126 : 325 : వీగిన అవిశ్వాసం
సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం లోక్‌సభలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు చర్చ సాగింది. సుదీర్ఘ చర్చ, సమాధానం అనంతరం రాత్రి 11 గంటలకు స్పీకర్ సుమిత్రా మహాజన్ ఓటింగ్ నిర్వహించారు. అవిశ్వీస తీర్మానానికి అనుకూలంగా 126 మంది సభ్యులు మద్దతు ప్రకటించగా, తీర్మానానికి వ్యతిరేకంగా 325 మంది సభ్యుల మద్దతు లభించింది. దాంతో స్పీకర్ అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని ప్రకటించి సభను సోమవారానికి వాయిదా వేశారు. విశ్వాస తీర్మానాన్ని మనమంతా వ్యతిరేకించాలని అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సమాధానంలో పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో అవిశ్వాసం ఒక భాగమని చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం జరిగిన సుదీర్ఘ చర్చకు నరేంద్ర మోదీ సమాధానమిచ్చారు. దాదాపు గంటన్నరకు పైగా మోదీ సమాధానమిచ్చారు. ఒకవైపు ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను ఒక్కొక్కటిగా వివరిస్తూ ఆయన మరోవైపు విపక్షాలపై విమర్శనాస్త్రాలను సంధిస్తూ ప్రసంగం కొనసాగించారు. ప్రధాని ప్రసంగం తర్వాత రైట్ టు రిప్లీ కింద టీడీపీ ఎంపీ కేశినేని నాని మాట్లాడారు. అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. ఆటోమేటిక్ విధానంలో ఓటింగ్ నిర్వహించారు. వాయిస్ ఓటును పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో బటన్స్ నొక్కడం ద్వారా తెలియజేసే విధానంలో ఓటింగ్ నిర్వహించారు. దశాబ్దన్నర తర్వాత లోక్‌సభలో చేపట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 126 సభ్యులు మద్దతు పలకగా, 325 మంది ఎంపీలు వ్యతిరేకంగా నిలవడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అంతకు ముందు మోదీ మాట్లాడుతూ, తక్కువ ఖర్చుతో అందరికి బీమా, రైతుల్లో భరోసా నింపడానికి కిసాన్ భరోసా వంటి పథకాలను వివరిస్తూ త్వరలోనే ఆయుష్మాన్ భారత్ ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. అంతకు ముందు చర్చలో పాల్గొన్న సభ్యులు లేవనెత్తిన పలు అంశాలను ప్రస్తావిస్తూ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి సమాధానం ప్రారంభం కాగానే టీడీపీ ఎంపీలు కొత్త డ్రామా మొదలు పెట్టారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగ సమయంలో చంద్రబాబు తమకు మిత్రుడని అన్నప్పుడు కిమ్మనకుండా ఉండిపోయిన టీడీపీ ఎంపీలు ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో చంద్రబాబు డైరెక్షన్లో మరో డ్రామాకు తెరలేపారు. ప్రధాని మోదీ ప్రసంగం చేస్తుండగా పోడియం వద్ద కొద్దిసేపు నిరసన నినాదాలు చేశారు. మోదీ తన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన తెస్తూ టీడీపీ నేతల లాలూచీ వ్యవహారాలను బయటపెట్టారు. ప్యాకేజీ ఒప్పుకున్న టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకన్నా ప్యాకేజీ మంచిదని టీడీపీ అంగీకరించిన తర్వాతే ప్యాకేజీ ప్రకటించినట్టు నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అవిశ్వాస తీర్మానం చర్చకు సమాధానంగా మాట్లాడుతూ, ఆయన విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీల అంశాలను ప్రస్తావించారు. ప్యాకేజీకి ఒప్పుకున్న తర్వాత ప్రకటించామని, ఇప్పుడు టీడీపీయే యూటర్న్ తీసుకుందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్ సీపీ ఉచ్చులో పడొద్దని తాను చంద్రబాబునాయుడుకు సూచించినట్టు వెల్లడించారు. ఈ విషయంలో కొద్ది రోజుల కిందట తాను చంద్రబాబుతోమాట్లాడినట్టు చెప్పారు. మోదీ తన సుదీర్ఘప్రసంగంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోవడానికి కారణాలను వివరించారు. 14 వ ఆర్థిక సంఘం సూచనల కారణంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయామన్నారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన చేసినప్పుడు టీడీపీ దాన్ని స్వాగతించిన విషయాన్ని మోదీ గుర్తుచేశారు. ప్రత్యేక హోదాకన్నా ప్యాకేజీ మంచిదని చంద్రబాబు అంగీకరించిన తర్వాత ఆ రాష్ట్రానికి ప్యాకేజీ ప్రకటించినట్టు వెల్లడించడంతో టీడీపీ ఎంపీలు ఇరకాటంలో పడ్డారు. ఏం చేయాలో అర్థంకాక న్యాయం చేయాలంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. నాలుగేళ్లలో తమ ప్రభుత్వం చేసిన పనులను అందరూ సమర్థించారని ప్రధాని మోదీ అన్నారు. ప్రజాస్వామ్యంలో అవిశ్వాసం ఒక భాగమని, విశ్వాస తీర్మానాన్ని మనమంతా వ్యతిరేకించాలని ఆయన కోరారు. ఈ తీర్మానం ద్వారా అందరి నిజస్వరూపాలు బయటపడ్డాయన్నారు. సంఖ్యా బలం లేనప్పుడు అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టారన్న ప్రశ్న అందరినీ తొలుస్తోందన్నారు. నావికుడు లేని పడవలా ప్రతిపక్షాల పయనం సాగుతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులకు దేశంలోని ఏ వ్యవస్థపైనా నమ్మం లేదని, ఆఖరికి ఈవీఎం, రిజర్వ్ బ్యాంక్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై కూడా నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. అవినీతిపై బాణం ఎక్కువ పెట్టిన వెంటనే వారికి ఇబ్బంది మొదలైందని ధ్వజమెత్తారు. 2024లో కూడా వారికి అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఇవ్వాలని దేవుడిని ప్రార్ధిస్తున్నానని తెలిపారు. రాఫెల్ ఒప్పందాన్ని రాజకీయం చేస్తున్నారు..సర్జికల్ స్ట్రైక్స్ కూడా రాజకీయం చేశారు.. చైనా రాయబారిని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కలవడం నిజం కాదా? అని ప్రశ్నించారు. విద్యుత్‌ను ఆదాచేసేందుకు దేశవ్యాప్తంగా ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేశాం..ఇంకా చేస్తున్నామని వివరించారు. అంతకుముందు జరిగిన చర్చలో అన్ని పార్టీల నేతలు ప్రసంగించారు. ఉత్తర, దక్షిణ కొరియాలే చర్చలు జరిపినప్పుడు కశ్మీర్ విషయంలో ఎందుకు చర్చలు జరపకూడదని కేంద్రాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా ప్రశ్నించారు. మూక దాడులు ఇప్పటివి కావని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రానికి ఆయన ఏడు ప్రశ్నలు సంధించారు. ప్రత్యేక హోదాపై టీడీపీకి చిత్తశుద్ధి లేదని, అందుకే నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంలా తాము కూడా వ్యవహరిస్తే దేశంలో ప్రజాస్వామ్యం మిగిలేది కాదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రాచీనకాలంలోనే భారత్‌లో ప్రజాస్వామ్యం ఉందని, కాంగ్రెస్ ఆ విషయాన్ని తమ క్రెడిట్‌గా చెప్పుకుంటోందన్న రాజ్‌నాథ్ వ్యాఖ్యలను ఖర్గే ఖండించారు. అంతకు ముందు రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. భారత్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థకు తామే కారణమని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందని, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పిన మాటల్ని గుర్తుచేశారు. అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో శుక్రవారం ఉదయం ప్రారంభమైన చర్చ కొనసాగుతోంది. లోక్ సభలో రాహుల్ ప్రవర్తించిన తీరును లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తప్పుపట్టారు. ప్రధానిని కౌగిలించుకోవడం, మళ్లీ వచ్చి కన్ను కొట్టడం హుందాగా లేదన్నారు. మోదీ సర్కారుపై రాహుల్ గాంధీ తన విమర్శనాస్త్రాలను కొనసాగించారు. తన ప్రసంగం పూర్తయిన తర్వాత రాహుల్ గాంధీ నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దకెళ్లి ఆయనతో కరచాలనం చేసి ఆలింగనం చేసుకోవడం కొసమెరుపు. నేటి ఉదయం తీర్మానంపై మొదట చర్చను టీడీపీ తరఫున గల్లా జయదేవ్ ప్రారంభించారు. ఆయన దాదాపు గంటసేపు ప్రసంగించగా.. అనంతరం బీజేపీ తరపున జబల్పూర్ ఎంపీ రాకేష్ సింగ్ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ విభజన చేసిన కాంగ్రెస్ తో టీడీపీ చేతులు కలిపి శాపగ్రస్థమైందన్నారు. అనంతరం కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ చర్చను కొనసాగిస్తూ, బీజేపీ, మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చర్చలు ఎందుకు జరపరు? కశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. ఉత్తర, దక్షిణ కొరియాలే చర్చలు జరిపినప్పుడు కశ్మీర్ విషయంలో ఎందుకు చర్చలు జరపకూడదని ఆయన ప్రశ్నించారు. హిందు, ముస్లిం గొడవలతో మనల్ని మనమే ధ్వంసం చేసుకుంటున్నామన్నారు. ‘నేను భారతీయుడిని. ఇదే గడ్డపై పుట్టా. ఇక్కడే చనిపోతా’ అని చెప్పారు. కశ్మీర్‌పై కేంద్రం వైఖరి ఏంటి? ముస్లింలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో సరైన ప్రాతినిథ్యం లేదని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. కశ్మీర్‌పై కేంద్రం వైఖరి తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. మూక దాడులు ఇప్పటివి కావని చెప్పారు. కశ్మీర్లో తీవ్రవాదులే కాదు సైనికులు చనిపోతున్నారని తెలిపారు. ఈ మేరకు కేంద్రానికి ఆయన ఏడు ప్రశ్నలు సంధించారు. టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేసిన హరిబాబు.. ‘కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ తన జీవితమంతా ఆ పార్టీకి వ్యతిరేకండా పోరాడారు. కానీ నిస్సిగ్గుగా నేడు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు. ప్రత్యేక హోదాపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు’అని చెప్పిన బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు అవిశ్వాసంపై టీడీపీని తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ఉండేది కాదు... కేంద్ర ప్రభుత్వంలా తాము కూడా వ్యవహరిస్తే దేశంలో ప్రజాస్వామ్యం మిగిలేది కాదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రాచీనకాలంలోనే భారత్‌లో ప్రజాస్వామ్యం ఉందని, కాంగ్రెస్ ఆ విషయాన్ని తమ క్రెడిట్‌గా చెప్పుకుంటోందన్న రాజ్‌నాథ్ వ్యాఖ్యలను ఖర్గే ఖండించారు. ప్రజల సమస్యల గురించి అడిగితే పురాణాలు చెప్పారని ఎద్దేవా చేశారు. బీజేపీ భావజాలం అంబేడ్కర్ ఆలోచనలకు వ్యతిరకమన్నారు. బీజేపీ, ప్రధాని మోదీ విభజించి పాలించు సూత్రాలను పాటిస్తున్నారని మండిపడ్డారు. నోరు మెదపని టీడీపీ ఎంపీలు!.. ఏపీకి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను ఇచ్చేది లేదని కేంద్రం మరోసారి కుండబద్దలు కొట్టింది. అవిశ్వాస తీర్మాణంపై లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతున్న క్రమంలో ఏపీకి హోదా ఇవ్వలేమని ఆయన పేర్కొన్నారు. అయితే నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి నేడు ఏపీ ప్రయోజనాల కోసం ఎన్నో చేస్తున్నట్లు డ్రామాలాడుతున్న టీడీపీ ఎంపీలు మాత్రం రాజ్‌నాథ్ ప్రకటనపై స్పందించడం లేదు. గత నాలుగేళ్లు ప్రత్యేక ప్యాకేజీ కోసం ఆశపడి ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టిన టీడీపీ ఎంపీలు యూటర్న్ తీసుకున్నా తమ స్వభావాన్ని పార్లమెంట్ సాక్షిగా మరోసారి నిరూపించుకున్నారు. టీడీపీ-బీజేపీల బంధం నిజమైనదే కనుక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లలేదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఉంది.. లోక్‌సభలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఉందని, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వాళ్ల దగ్గర సంఖ్యా బలం కూడా లేదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అనైతికంగా కొన్ని పార్టీలు కలిసి అవిశ్వాసం పెట్టాయని, కానీ తాము మాత్రం ఇద్దరి ఎంపీల నుంచి దేశంలో అధికారంలోకి వచ్చే స్థాయికి ఎదిగామని గుర్తు చేశారు. గతంలో కౌన్సిలర్లు కూడా లేని లడఖ్, కశ్మీర్ లాంటి ప్రాంతాలతో పాటు మేం అడుగు కూడా పెట్టలేమని భావించిన త్రిపురలో విజయకేతనం ఎగురవేశామన్నారు. లోక్‌సభ మళ్లీ ప్రారంభం దేశంలో దళితులపై జరుగుతున్న దాడులకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారని, విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో సభలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో సభను సాయంత్రం 4:30 గంటల వరకు స్పీకర్ సుమిత్రా మహాజన్ వాయిదా వేశారు. అనంతం సభ మళ్లీ ప్రారంభమైంది. 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి..? - నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా మర్చిపోయిందని, ఎన్డీఏ ప్రభుత్వం కేవలం ధనవంతులకే కొమ్ము కాస్తోందని సమాద్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఆరోపించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలని ఇచ్చిన హామీ ఏమైందని మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మోదీ పాలనపై రైతులు, యువత తీవ్ర నిరాశలో ఉన్నారు. కేంద్రంతో పాటు యూపీ ప్రభుత్వమూ అన్ని ప్రజా వ్యతిరేఖ నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు. రాజ్యాంగ విరుద్ధంగా తొలి ఆర్డినెన్స్.. కేంద్ర ప్రభుత్వం పనితీరును తెలంగాణ ప్రజలు మెచ్చడం లేదని, మోదీ ప్రభుత్వం తీసుకున్న తొలి నిర్ణయమే తమకు నచ్చలేదని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. ‘తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నరేంద్ర మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదు. రాజ్యాంగ విరుద్ధంగా తొలి ఆర్డినెన్స్ జారీ చేశారు. ఖమ్మం జిల్లా నుంచి 7 మండలాలను తీసేసుకున్నారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌తో సరైన సమాచారం లేదన్నారు. 1952లో ఖమ్మం అనేది వరంగల్ జిల్లాలో భాగం అని తెలుసుకోవాలి. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ నుంచి 7 మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపేశారు. మా మండలాలను తిరిగి మాకు ఇచ్చేయాలి. కాగా, ఛత్తీస్‌గఢ్, ఇతర రాష్ట్రాలతో తమ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పందాలు చేసుకుని 24 గంటల విద్యుత్ సరఫరా అందిస్తూ ముందుకు సాగుతున్నారని’ఎంపీ వినోద్ వివరించారు. ‘రఫెల్’పై వివరణ... కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన రఫెల్ డీల్ ఆరోపణలపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ‘రఫెల్ ఒప్పందం యూపీఏ హయాంలోనే జరిగింది. ఆ సమయంలో ఏకే ఆంటోనీ రక్షణ మంత్రిగా ఉన్నారు. ఒప్పంద వివరాలు బయటపెట్టొద్దనే సంప్రదాయం ఉంది. అందుకే వెల్లడించటం లేదు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి’ అని నిర్మలా సీతారామన్ తెలిపారు ప్రధాని మాటకు విలువ ఉండాలి... ‘గల్లా స్పీచ్ విన్నాను. 21వ శతాబ్ధంలో అతిపెద్ద రాజకీయ బాధితురాలు ఆంధ్ర ప్రదేశ్. జీఎస్టీ మేం తెస్తామంటే వద్దన్నారు. ఐదు శ్లాబ్‌ల్లో వాళ్లు(బీజేపీ ప్రభుత్వం) తీసుకొచ్చారు. దేశానికి సేవకుడిగా ఉంటానని మోదీ.. పేదల పట్ల చిన్నచూపు ప్రదర్శిస్తున్నారు. ఆయన కళ్లకు వ్యాపారవేత్తలే కనిపిస్తారు. వారికి లబ్ధి చేకూరేలానే నిర్ణయాలు తీసుకుంటారు. అందులో భాగమే నోట్ల రద్దు. కనీసం నా కళ్లలోకి చూసి కూడా మాట్లాడే స్థితిలో మోదీ లేరు(వెంటనే ప్రధాని చిరునవ్వులు చిందించారు)’ అంటూ రాహుల్ ఏకిపడేశారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ.. అమిత్ షా తనయుడిని టార్గెట్ చేసి రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో సభలో ఒక్కసారిగా అలజడి చెలరేగగా.. సభ పది నిమిషాలు వాయిదా పడింది. టీడీపీ శాపగ్రస్థురాలైంది... అవిశ్వాసానికి వ్యతిరేకంగా అధికార పక్షం తరపున ఎంపీ రాకేష్ సింగ్ చర్చ ప్రారంభించారు. ‘గతంలోనూ చాలాసార్లు అవిశ్వాసం పెట్టారు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలిపింది. కాంగ్రెస్‌తో కలిసి టీడీపీ అవిశ్వాసాన్ని తీసుకొచ్చింది. శాపగ్రస్థురాలైన కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలిపింది. కాంగ్రెస్‌తో చేతులు కలపడం వల్ల టీడీపీ కూడా శాపగ్రస్థురాలైంది. టీడీపీ మాకు శాపనార్థాలు పెడుతోందా?.. అసలు గల్లా జయదేవ్ పూర్తి ప్రసంగం వింటే అవిశ్వాస తీర్మానం అవసరం లేదనిపిస్తోంది. మోదీ పాలనలో ప్రతీ పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది. పేద ప్రజల అభ్యున్నతికి బీజేపీ పాటు పడుతోంది.’ అని రాకేష్ సింగ్ ప్రసంగించారు. అంతర్జాతీయంగా భారత్‌కు విశేష స్పందన లభిస్తోంది. ప్రపంచ దేశాలు భారత్‌ను కొత్త శక్తిగా గుర్తిస్తున్నాయి. ఉజ్వల పథకంతో 8 కోట్ల మంది మహిళలకు లబ్ధి. నెలకు ఒక్క రూపాయితో 2 లక్షల బీమా కవరేజ్. రోజుకు 90 పైసలతో జీవన్ జ్యోతి యోజన పథకం. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టలేదు. మోదీని ఎలాగోలా అడ్డుకోవాలనే తపనతోనే అవిశ్వాసం. కొందరి లబ్ధి కోసం అభివృద్ధిని అడ్డుకోవద్దు... గల్లాపై సీతారామన్ ఆగ్రహం.. ప్రసంగం కొనసాగించిన వేళ ప్రధానిని ఉద్దేశించి మోసగాడు అని గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. ఆ ఆరోపణలపై బీజేపీ మండిపడింది. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సీటులోంచి లేచి టీడీపీ ఎంపీల వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలని స్పీకర్‌ను ఆమె కోరారు. మరోవైపు అప్రజాస్వామికంగా తెలుగు రాష్ట్రాలను విభజించారన్న గల్లా వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపి జితేందర్ రెడ్డి మండిపడ్డారు. ఆ వ్యాఖ్యపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ పదాన్ని తొలగించాలని కోరగా.. పరిశీలిస్తామని మేడమ్ స్పీకర్ చెప్పటంతో జితేందర్ రెడ్డి శాంతించారు. గల్లా జయదేవ్ ప్రసంగం... సుమారు గంటపాటు ప్రసంగించిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పాత విషయాలనే చెప్పుకురావటం గమనార్హం. గతంలో కాంగ్రెస్‌పై చేసిన కామెంట్లనే.. ఇప్పుడు ఆయన బీజేపీపై చేశారు. అయితే రాష్ట్రాన్ని అప్రజాస్వామిక్యంగా విభజించారన్న వ్యాఖ్యపై టీఆర్ఎస్ భగ్గుమంది. ఒకానోక దశలో టీఆర్ఎస్ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లే యత్నం చేయగా.. స్పీకర్ వారించటంతో సభ సర్దుమణిగింది. ఆ తర్వాత ప్రధాని మోదీపై గల్లా సంచలన ఆరోపణలు చేశారు. ‘అవినీతి పరులకు ప్రధాని కొమ్ము కాస్తున్నారు. ఏపీ ప్రజలకు తీరని ద్రోహం చేశారు. హోదాపై మాట మార్చారన్న విషయం ప్రజలకు అర్థమైంది. హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందనటం వాస్తవ విరుద్ధం. ప్రణాళిక సంఘం సాకుతో హోదా ఇవ్వకపోవటం సరికాదు. స్పెషల్ ప్యాకేజీ పేరుతో మోసం చేశారు. ఒక్క పైసా ఏపీకి విదల్చలేదు. ఇప్పటికైనా హోదా ఇవ్వాలి’ అని గల్లా వ్యాఖ్యానించటంతో సభలో ఒక్కసారిగా కలకలం రేగింది. కాంగ్రెస్ అభ్యంతరాలు.. ప్రతిపక్షాలకు తక్కువ సమయం ఇవ్వటంపై కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ‘కాంగ్రెస్‌కు 38 నిమిషాలే ఇచ్చారు. సభలో ఏం జరగబోతుందోనని దేశం మొత్తం ఎదురు చూస్తోంది. అవసరమైతే అవిశ్వాసంపై చర్చ మూడురోజులపాటు సాగాలి’ అని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. అనంతకుమార్ సెటైర్లు.. వన్డే మ్యాచ్‌ల కాలంలో టెస్ట్ మ్యాచ్‌లు ఆడతామనటం సరికాదు అంటూ విపక్షాల అవిశ్వాస చర్చపై బీజేపీ నేత అనంతకుమార్ హెగ్డే సెటైర్లు పేల్చారు. అవిశ్వాసం వీగిపోతుందన్న ధీమా ఆయన వ్యక్తం చేశారు. బీజేడీ వాకౌట్... లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం కావడానికి కంటే ముందే బిజూ జనతాదళ్(బీజేడీ) సభ నుంచి వాకౌట్ చేసింది.ఒడిశాకు జరిగే అన్యాయంపై ఏ ప్రభుత్వంపై పట్టించుకోవడం లేదని, అందుకే సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని తెలిపారు. తమ రాష్ట్రానికి కేంద్రం చాలా అన్యాయం చేసిందని, కేంద్రం వైఖరికి నిరసనగానే తాము వాకౌట్ చేస్తున్నామని, రెండు మాటలు చెప్పి బయటకు వెళ్లిపోయారు. కాగ, అవిశ్వాసంపై చర్చలో మాట్లాడేందుకు బీజేడీకి స్పీకర్ 15 నిమిషాల సమయం కేటాయించిన సంగతి తెలిసిందే. మొత్తం లోక్‌సభలో బీజేడీ తరుఫున 20 మంది ఎంపీలున్నారు. ప్రారంభమైన లోక్‌సభ... సభ ప్రారంభం కాగానే అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు స్వీకరిస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. సాయంత్రం 6గంటల వరకు చర్చ కొనసాగుతుందని ఆమె ప్రకటించారు. -
మాజీ మేయర్ హల్ చల్
హైదరాబాద్: అత్యంత కట్టుదిట్టమైన భద్రత వలయంలో ఉండే పార్లమెంట్ ఆవరణలో హైదరాబాద్ నగర పాలక సంస్థ మాజీ మేయర్, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బండా కార్తీక రెడ్డి హడావిడి చేశారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ఈ తరుణంలో వీవీఐపీలు ఉన్న ప్రాంతంలో బండా కార్తీక రెడ్డి ఏఐసీసీ రాహుల్ గాంధీ పక్కన దర్శనమీయడం వివాదాస్పదంగా మారింది. బుధవారం లోక్ సభ వాయిదా పడిన అనంతరం రాహుల్ గాంధీ పార్లమెంట్ మొదటి అంతస్తులోని రూమ్ నంబర్ 53 లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. అయితే ఈ మీడియా సమావేశం జరిగే హాలులోకి కార్తీకరెడ్డి రావడం, వీవీఐపీలకు మాత్రమే ప్రవేశమున్న ఆ ప్రాంతంలోకి రావడమే కాకుండా రాహుల్ వెనుక అనేక మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీల పక్కనే ఆమె నిలబడి ఉండటం అంతా విస్మయం చెందారు. ఎస్పీజీ నేతృత్వంలో అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాటు ఉండే ఆ ప్రాంతంలోని మహిళా నాయకురాలు ఎలా ప్రవేశించడమే కాకుండా రాహుల్ గాంధీ వెంట సమావేశమందిరానికి రావడం, అక్కడే ఆమె రాహుల్ ను శాలువా కప్పి అభినందించడం వంటివన్నీ చకచకా జరిగిపోయాయి. పార్టమెంట్ అధికారులు ఆ విషయంపై ఆరా తీయగా, రాష్ట్రానికే చెందిన ఒక పార్లమెంట్ సభ్యుడు జారీ చేసిన పాస్ తో ఆమె లోనికి ప్రవేశించినట్టు తెలిసింది. అయితే వీవీఐపీలు ఉండే ప్రాంతానికి చేరుకోవడం, ప్రొటోకాల్ ఉల్లంఘనపై ఎక్కడ పొరపాటు జరిగిందన్న అంశంపై అధికారులు అంతర్గతంగా విచారణ జరుపుతున్నట్టు తెలిసింది. -
భిన్నాభిప్రాయాలే పార్లమెంటుకు జీవం
న్యూజిలాండ్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ఆక్లాండ్: భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాకుంటే పార్లమెంటు వ్యవస్థే పనిచేయదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. చట్టసభలో తీవ్రస్థాయిలో జరిగే వాదోపవాదాలు, చర్చల వల్ల ఆర్థిక వ్యవస్థ వంటి అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతామన్నారు. ‘భారత్-న్యూజిలాండ్ బిజినెస్ కౌన్సిల్’ ప్రతినిధులనుద్దేశించి ఆదివారమిక్కడ ప్రణబ్ ప్రసంగించారు. ‘భారత పార్లమెంటు సభ్యులు భిన్న పార్టీలవారు. ఇది నిజమైన బహుళ పార్టీల ప్రజాస్వామ్య వ్యవస్థ. తీవ్రస్థాయిలో జరిగే వాడి వేడి చర్చల అనంతరం నిర్ణయాలు తీసుకొంటాం. గోల చేస్తున్నారని అప్పుడప్పుడూ సహచరులను నవ్వుతూ అంటుంటా. కానీ, సంభాషణ, వాదన, చర్చ.. క్రమంలో అసమ్మతి అన్నది పార్లమెంటులో తప్పనిసరి’ అని అన్నారు. విమాన సర్వీసుల ఒప్పందం అంతకముందు రాష్ట్రపతి సమక్షంలో భారత్-న్యూజిలాండ్‌ల మధ్య నేరుగా తిరిగే విమాన సర్వీసులకు సంబంధించిన ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. -
కలాంకు పార్లమెంటు ఘన నివాళి
ఉభయ సభల్లో మౌనం పాటించిన సభ్యులు గొప్ప దార్శనికుడిని దేశం కోల్పోయిందన్న లోక్‌సభ స్పీకర్ అంతరిక్ష, క్షిపణి కార్యక్రమాల మార్గదర్శి కలాం: ఉపరాష్ట్రపతి న్యూఢిల్లీ: తీవ్ర గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ప్రఖ్యాత క్షిపణి శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు భారత పార్లమెంటు మంగళవారం ఘన నివాళులర్పించింది. కలాం భారతదేశపు గొప్ప పుత్రుడని అభివర్ణించింది. నిజమైన మేధావి అని, ఆయన సేవలను దేశం తరతరాలు స్మరించుకుంటుందని శ్లాఘించింది. ఉభయ సభల సభ్యులు తమతమ స్థానాల్లో నిల్చుని కలాం మృతికి నివాళిగా కొద్దిసేపు మౌనం పాటించారు. ఆ వెంటనే, పార్లమెంటు సభలు గురువారానికి వాయిదా పడ్డాయి. దివికేగిన ఈ ప్రజా రాష్ట్రపతికి గౌరవ సూచకంగా, అలాగే, కలాం అంత్యక్రియలకు సభ్యులు హాజరయ్యేందుకు వీలుగా బుధవారం కూడా పార్లమెంటు సమావేశాలు జరపకూడదని నిర్ణయించారు. అయితే, కలాం అంత్యక్రియలను తమిళనాడులోని ఆయన స్వస్థలం రామేశ్వరంలో గురువారం జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. లోక్‌సభలో..‘డాక్టర్ కలాం మృతితో దేశం ఒక అద్భుత దార్శనికుడిని, గొప్ప శాస్త్రవేత్తను, అణగారిన వర్గాల స్నేహితుడిని, మానవతావాదిని కోల్పోయింది’ అని సంతాప తీర్మానంలో లోక్‌సభ ప్రశంసించింది. తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ చదివి వినిపించారు. ‘దేశ యువతను కలసి మాట్లాడుతూ, వారిలో విజ్ఞాన తృష్ణను రగల్చడాన్ని ఎంతో ప్రేమించే కలాం.. చివరి క్షణం వరకు అదే విధిలో నిమగ్నమయ్యార’ని స్పీకర్ కొనియాడారు. ‘8 ఏళ్ల చిన్నారి చిరునవ్వును.. 38 ఏళ్ల యువకుడి శక్తి, ఉత్సాహాలను.. కలిగిన 83 ఏళ్ల మహోన్నతుడు డాక్టర్ కలాం’ అని అభివర్ణించారు. ఆయన మృతి ఒక శూన్యాన్ని ఏర్పరిచిందని, అయినా, ఆయన స్ఫూర్తి మనలో కలకాలం నిలుస్తుందన్నారు. అలుపెరగని విజ్ఞాన తృష్ణ కలిగిన కలాం.. భారత దేశ అంతరిక్ష, క్షిపణి కార్యక్రమాల వెనుక కీలక చోదక శక్తిగా నిలిచారన్నారు. అందుకే ఆయన ‘మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా ప్రఖ్యాతిగాంచారన్నారు. నిర్వహణాసామర్థ్యంతోనూ 1998 నాటి పోఖ్రాన్ అణు పరీక్షల విజయంలో ఆయన కీలక పాత్ర పోషించారని స్పీకర్ గుర్తుచేశారు. రాజ్యసభలో.. కలాం మరణం దేశానికి పూడ్చలేని లోటని రాజ్యసభ పేర్కొంది. శాస్త్రవేత్తగా, ఉపాధ్యాయుడిగా, నాయకుడిగా దేశానికి ఆయన చేసిన సేవలు తరతరాలు గుర్తుండిపోతాయని రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ కొనియాడారు. కలాం భారతదేశ అంతరిక్ష, క్షిపణి కార్యక్రమాలకు మార్గదర్శి అని, ఆయన కృషి వల్లే ఈ రంగాల్లో భారత్ కీలక శక్తిగా ఎదిగిందని అన్నారు. 2020 నాటికి స్పందనగల, పారదర్శక, అవినీతిరహిత ప్రభుత్వం నేతృత్వంలోని భవిష్యత్ భారతాన్ని ఆయన ఆకాంక్షించారని సంతాప తీర్మానంలో పేర్కొన్నారు. రాష్ట్రపతిగా ఆయన వ్యవహారశైలి ఆయనను ప్రజా రాష్ట్రపతిగా నిలిపిందన్నారు. ఉగ్రదాడి మృతులకు కేబినెట్ నివాళి పంజాబ్‌లోని దీనానగర్‌లో సోమవారం నాటి ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన పోలీసులు, పౌరులకు కేంద్ర కేబినెట్ మంగళవారం నివాళులర్పించింది. ఒక సంతాప తీర్మానాన్ని కూడా ప్రధాని నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీ ఆమోదించింది.