మాజీ మేయర్ హల్ చల్
హైదరాబాద్: అత్యంత కట్టుదిట్టమైన భద్రత వలయంలో ఉండే పార్లమెంట్ ఆవరణలో హైదరాబాద్ నగర పాలక సంస్థ మాజీ మేయర్, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బండా కార్తీక రెడ్డి హడావిడి చేశారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ఈ తరుణంలో వీవీఐపీలు ఉన్న ప్రాంతంలో బండా కార్తీక రెడ్డి ఏఐసీసీ రాహుల్ గాంధీ పక్కన దర్శనమీయడం వివాదాస్పదంగా మారింది.
బుధవారం లోక్ సభ వాయిదా పడిన అనంతరం రాహుల్ గాంధీ పార్లమెంట్ మొదటి అంతస్తులోని రూమ్ నంబర్ 53 లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. అయితే ఈ మీడియా సమావేశం జరిగే హాలులోకి కార్తీకరెడ్డి రావడం, వీవీఐపీలకు మాత్రమే ప్రవేశమున్న ఆ ప్రాంతంలోకి రావడమే కాకుండా రాహుల్ వెనుక అనేక మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీల పక్కనే ఆమె నిలబడి ఉండటం అంతా విస్మయం చెందారు.
ఎస్పీజీ నేతృత్వంలో అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాటు ఉండే ఆ ప్రాంతంలోని మహిళా నాయకురాలు ఎలా ప్రవేశించడమే కాకుండా రాహుల్ గాంధీ వెంట సమావేశమందిరానికి రావడం, అక్కడే ఆమె రాహుల్ ను శాలువా కప్పి అభినందించడం వంటివన్నీ చకచకా జరిగిపోయాయి. పార్టమెంట్ అధికారులు ఆ విషయంపై ఆరా తీయగా, రాష్ట్రానికే చెందిన ఒక పార్లమెంట్ సభ్యుడు జారీ చేసిన పాస్ తో ఆమె లోనికి ప్రవేశించినట్టు తెలిసింది. అయితే వీవీఐపీలు ఉండే ప్రాంతానికి చేరుకోవడం, ప్రొటోకాల్ ఉల్లంఘనపై ఎక్కడ పొరపాటు జరిగిందన్న అంశంపై అధికారులు అంతర్గతంగా విచారణ జరుపుతున్నట్టు తెలిసింది.