శనివారం తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర బహిరంగ సభకు హాజరైన జనం, తుక్కుగూడ సభలో మాట్లాడుతున్న రాహుల్‌గాంధీ
మోదీ దగ్గర ఈడీ, సీబీఐ, సంపద ఉంటే..మా దగ్గర నిజాయతీ, ప్రజల ప్రేమ ఉన్నాయి
తుక్కుగూడ జనజాతర సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ
చివరికి గెలిచేది నిజాయతీ, ప్రజల ప్రేమ మాత్రమే..
బీజేపీ దేశంలో విద్వేషాలు నింపుతోంది.. హింసను ప్రోత్సహిస్తోంది
ఆ పార్టీ బలవంతపు వసూళ్ల కోసం ఓ విభాగమే పనిచేస్తోంది
ఎలక్టోరల్ బాండ్లు ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం
అసెంబ్లీ ఎన్నికల్లో బీ టీంను ఓడించాం.. లోక్‌సభ ఎన్నికల్లో ఏ టీంను
ఓడించబోతున్నాం... మేం అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన
తెలంగాణతో మాది రాజకీయ బంధం కాదు.. కుటుంబ బంధం
రాష్ట్ర ప్రజలు ఎప్పుడు పిలిచినా మీ ముందుంటా
మేడిన్ తెలంగాణ.. మేడిన్ చైనాతో తలపడేలా చేద్దామని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బీటీంగా ఉన్న బీఆర్‌ఎస్‌ను ఓడించామని.. లోక్‌సభ ఎన్నికల్లో ఏ టీం బీజేపీని ఓడిస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మోదీ దగ్గర ఈడీ, సీబీఐ, సంపద ఉన్నాయని.. తమ దగ్గర నిజాయతీ, ప్రజల ప్రేమ ఉన్నాయని చెప్పారు. అంతిమ విజయం నిజాయతీది, ప్రజల ప్రేమదేనన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించామని.. న్యాయపత్రం పేరిట విడుదల చేసిన ఈ మేనిఫెస్టోకు ఐదు గ్యారంటీలు ఆత్మలాంటివని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని, ఇప్పటివరకు 20వేల ఉద్యోగాలిచ్చామని, త్వరలోనే మరో 50వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని ప్రకటించారు. తెలంగాణ దేశానికి మోడల్ కావాలని ఆకాంక్షించారు. శనివారం రాత్రి హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ జన జాతర సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ ప్రసంగం ఆయన మాటల్లోనే..
‘‘దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులందరికీ ఏడాదికి రూ.లక్ష వేతనంతో అప్రెంటిస్‌షిప్ పథకాన్ని ప్రారంభించబోతున్నాం. నారీ న్యాయ్ పేరుతో ఏటా రూ.లక్షను ప్రతి కుటుంబంలోని ఒక మహిళకు ఇస్తాం. ఇది విప్లవాత్మక మార్పు. దీనిద్వారా దేశ ముఖచిత్రం మారబోతోంది. కిసాన్ న్యాయ్ పథకం ద్వారా రుణమాఫీ చేస్తాం. పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించబోతున్నాం. స్వామినాథన్ సిఫారసులను అమలు చేస్తాం. శ్రామిక్ న్యాయ్ పథకం ద్వారా కార్మికులు, కూలీలకు కనీస వేతనాలు అమలు చేస్తాం. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారితో పాటు ఇతర రంగాల్లోని కారి్మకులకు రోజుకు రూ.400 కనీస వేతనం ఇస్తాం.
ఎవరెంతో.. వారికంత..
మేం మరో చరిత్రాత్మకమైన గ్యారంటీ ఇస్తున్నాం. దేశంలో 50శాతం మంది ప్రజలు బలహీనవర్గాలకు చెందినవారే. 15శాతం దళితులు, 8 శాతం గిరిజనులు, ఆదివాసీలు, 15 శాతం మంది మైనార్టీలు, 5 శాతం మంది పేద అగ్రవర్ణాల ప్రజలున్నారు. 90శాతం వీరే ఉన్నారు. కానీ దేశంలోని ప్రభుత్వ సంస్థలు, పెద్ద కంపెనీల్లో వీరు కనిపించరు. దేశంలోని పెద్ద 200 కంపెనీల యజమానులను చూస్తే ఈ వర్గాలకు చెందిన వారుండరు.
దేశాన్ని పాలించే ముఖ్యమైన 90 మంది ఏఐఎస్ అధికారుల్లో ముగ్గురు మాత్రమే ఓబీసీలు ఉన్నారు. జనాభా 50శాతం అయితే పాలనలో భాగస్వామ్యం ఐదుగురిదే. ఒక గిరిజనుడు, ముగ్గురు దళితులు ఉన్నారు. ఇక బడ్జెట్ ఖర్చులో వెనుకబడిన వర్గాలు, అణగారిన వర్గాలకు 6 శాతమే వస్తోంది. మా ప్రభుత్వం వస్తే.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి మాట నిలబెట్టుకున్నట్టుగానే.. జనాభా కులగణన చేస్తాం. దేశాన్ని ఎక్స్‌రే చేసి పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేటతెల్లం చేస్తాం. ఆయా వర్గాల ఆర్థిక, వ్యవస్థీకృత సర్వే కూడా చేయించి.. ఎవరి హక్కులు వారికి కల్పిస్తాం.
మావి గ్యారంటీలు కాదు.. ప్రజల గొంతుక..
జాతీయ స్థాయి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను ఇప్పుడు ఆవిష్కరించుకున్నాం. మేమిచ్చింది ఐదు గ్యారంటీలు కాదు. అది ప్రజల గొంతుక. తెలంగాణలో అమల్లోకి తెచ్చిన రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి గ్యారంటీలన్నీ ప్రజల గొంతుకలే. తెలంగాణలో హామీలను నిలబెట్టుకున్నాం. దేశంలో భారీగా నిరుద్యోగం ఉన్న సమయంలో తెలంగాణలోని 20వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. 50వేల మందికి త్వరలోనే ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. ఇక్కడ మాట నిలబెట్టుకున్నట్టుగానే.. జాతీయ స్థాయి మేనిఫెస్టోను అమలు చేస్తాం.
కేసీఆర్, మోదీలవి బలవంతపు వసూళ్లు
గతంలో తెలంగాణ సీఎం ప్రభుత్వాన్ని ఎలా నడిపించారో తెలుసు. వేల మంది ఫోన్లు ట్యాప్ చేశారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, పోలీసు వ్యవస్థలను దుర్వినియోగం చేశారు. ప్రభుత్వం మారగానే డేటా మొత్తం ధ్వంసం చేసి నదిలో పడేశారు. భయపెట్టి, బలవంతం చేసి మీ సంపద దోచుకున్నారు. తెలంగాణలో అదంతా వెలికితీసే పని ప్రారంభమైంది. ఇక్కడ కేసీఆర్ చేసినట్టుగానే ఢిల్లీలోని మోదీ ప్రభుత్వం చేస్తోంది.
ఆ పార్టీ పక్షాన ఓ బలవంతపు వసూళ్ల విభాగం (ఎక్స్‌టార్షన్ డైరెక్టరేట్) పనిచేస్తోంది. దేశంలోని అత్యంత అవినీతిపరులంతా మోదీ వెనుక నిలబడ్డారు. ఎన్నికల కమిషన్‌లో కూడా మోదీ తన మనుషులను పెట్టుకున్నారు. ఎలక్టోరల్ బాండ్లు ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం. ఆ బాండ్లను పరిశీలిస్తే వాస్తవాలేంటో తెలుస్తాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన మొత్తం బ్యాంకు ఖాతాలను నిలిపివేశారు. కానీ మేం భయపడేది లేదు. తెలంగాణలో బీజేపీకి బీటీంను ఓడించాం. ఇప్పుడు దేశంలో ఏ టీంను ఓడించబోతున్నాం.
మనది కుటుంబ బంధం
తెలంగాణ ప్రజలతో నాకున్నది రాజకీయ బంధం కాదు. కుటుంబ బంధం. సోనియాగాంధీ ఎలాగూ మీ వైపే ఉంటారు. ఢిల్లీలో నేను కూడా మీ సిపాయినే. తెలంగాణ ప్రజలు, యువకులు ఎప్పుడు పిలిచినా వస్తాను. చిన్న పిల్లాడు పిలిచినా మీ ముందుంటా. మీ కోసం వస్తా. దేశంలో తెలంగాణ కొత్త రాష్ట్రం. ఈ రాష్ట్రం దేశానికి మార్గం చూపించాలి. మేడిన్ తెలంగాణ.. మేడిన్ చైనాతో తలపడేలా చేద్దాం.
బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకుంటోంది
దేశంలోని పౌరులందరికీ రక్షణ కల్పించే రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ భావిస్తోంది. కానీ మేం ఆ పని చేయనీయం. బీజేపీ హింసను ప్రోత్సహిస్తోంది. మత విద్వేషాలు రేపుతోంది. అదే మా పోరాటం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే. మా విప్లవాత్మక మేనిఫెస్టో దేశ ముఖచిత్రాన్ని మార్చబోతోంది. అది దేశ ఆత్మ. పేదలు, రైతులు, మహిళలు, యువకుల జీవితాలను మార్చగలదు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేరుస్తుంది. జైహింద్... జై తెలంగాణ’’ అంటూ రాహల్ గాంధీ తన ప్రసంగాన్ని ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment