మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్‌ గాంధీ | Congress Leader Rahul Gandhi Comments At Election Campaign | Sakshi
Sakshi News home page

మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్‌ గాంధీ

Published Mon, May 6 2024 5:19 AM | Last Updated on Mon, May 6 2024 5:19 AM

జోగులాంబ  గద్వాల జిల్లా  ఎర్రవల్లి చౌరస్తా  సభలో రాజ్యాంగ  ప్రతిని చూపిస్తున్న రాహుల్‌ గాంధీ

జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా సభలో రాజ్యాంగ ప్రతిని చూపిస్తున్న రాహుల్‌ గాంధీ

తెలంగాణ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వమిచ్చే రూ.2,500 అదనంగా వస్తాయి 

నిరుద్యోగుల కోసం ‘పహలే నౌకరీ పక్కీ’స్కీమ్‌ అమలు

ఏడాది పాటు ఇంటర్న్‌షిప్‌.. ప్రతినెలా రూ.8,500 సాయం 

దేశవ్యాప్తంగా 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ 

ఉపాధి హామీ కూలి రూ.400కు పెంచుతాం 

బీజేపీ కేవలం ధనికవర్గాల కోసమే పనిచేస్తోంది 

మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లు రద్దు చేస్తుంది..  మేమువస్తే రిజర్వేషన్లు పెంచుతాం

ప్రతి ఇంటి నుంచి ఓ మహిళను ఎంపిక చేసి నెలకు రూ. 8,500 చొప్పున జమ చేస్తాం

నిర్మల్‌/ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తే.. మహిళలకు ఏటా రూ.లక్ష ఇస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రకటించారు. ప్రతి ఇంట్లో నుంచి ఓ మహిళను ఎన్నుకుని, ఆమె ఖాతాలో నెలకు రూ.8,500 చొప్పున జమ చేస్తామని తెలిపారు. తెలంగాణలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనంగా మరో రూ.30 వేలు అందుతాయని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేస్తోందని.. కేంద్రంలోనూ కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే గ్యారంటీలను దేశమంతా అమలు చేస్తామని తెలిపారు. 

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్‌ జిల్లా కేంద్రంలో, జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో ఆదివారం నిర్వహించిన జన జాతర సభల్లో రాహుల్‌ గాంధీ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసి చూపించాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో హామీలను అమలు చేస్తాం. ప్రస్తుతం మహిళలు, పురుషులు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. పురుషులు ఎనిమిది గంటలపాటు ఉద్యోగం చేస్తారు. మహిళలు ఇంట్లో అదనంగా మరో ఎనిమిది గంటలు పనిచేస్తారు. 

ఆ అదనపు పనికి ఎలాంటి చెల్లింపు ఉండదు. అందుకే వారికోసం విప్లవాత్మక పథకాన్ని తీసుకొస్తాం. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ఆర్థిక సర్వే చేపడతాం. ప్రతి పేద కుటుంబం నుంచి ఓ మహిళను ఎన్నుకుని.. ఆమె ఖాతాలో ప్రతీనెలా రూ.8,500 చొప్పున ఏడాదికి రూ.లక్ష జమ చేస్తాం. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ మేరకు నెలకు రూ.2,500 చొప్పున ఏడాదికి రూ.30 వేలు అదనంగా జమ అవుతాయి. అంటే రాష్ట్ర మహిళలు ఏడాదికి రూ.1.30 లక్షలు అందుకుంటారు. 

యువతకు పక్కాగా ఉద్యోగాలు 
కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు నాలుగువేల కిలోమీటర్లు నడిచా. ఆ సమయంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నా. తమ భవిష్యత్‌ను మోదీ నాశనం చేశారని నిరుద్యోగ యువత నా దృష్టికి తీసుకొచ్చారు. కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిగ్రీ, పీజీ చదివిన నిరుద్యోగ యువత కోసం.. ‘పహలే నౌకరీ పక్కీ (మొదట ఉద్యోగం గ్యారంటీ)’స్కీమ్‌ తీసుకువస్తాం. నిరుద్యోగ యువతకు ఒక ఏడాది ఇంటర్న్‌షిప్‌తోపాటు నెలకు రూ.8,500 చొప్పున రూ.లక్ష అందజేస్తాం. స్కిల్‌ ఉన్నవారికి ప్రైవేటు రంగంలో రెగ్యులర్‌ ఉద్యోగాలు వచ్చేలా చేస్తాం. దేశంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తాం. 

కులగణనతో.. దేశ ముఖచిత్రం మారుతుంది 
దేశంలో 50శాతం కంటే ఎక్కువగా వెనుకబడిన కులాలవారు, 15 శాతం దళితులు, 7–8 శాతం గిరిజనులు, 15 శాతం మైనారిటీలు, 5–6 శాతం అగ్రకుల పేదలు ఉన్నారు. వారి గురించి ఎక్కడా, ఏ ప్రభుత్వం కూడా ఆలోచించదు. అన్ని రంగాల్లో అగ్రకులాలదే ఆధిపత్యం. మేం అధికారంలోకి రాగానే దేశంలో కులగణన చేపడతాం. దానితో ఎవరు ఎంత శాతం ఉన్నారో బయటికి వస్తుంది. దేశ ముఖచిత్రమే మారిపోతుంది..’’అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. తాము తెలంగాణలో ‘నఫ్రత్‌ కే బజార్‌ మే.. మొహబ్బత్‌ కీ దుకాణ్‌ (విద్వేషంతో కూడిన మార్కెట్‌లో.. ప్రేమ దుకాణం)’తెరిచామని.. రేపు ఢిల్లీలో కూడా తెరుస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 

రిజర్వేషన్లను తొలగించేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర 
‘‘ఈసారి ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య సాగుతున్నాయి. కాంగెస్‌ పార్టీ రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తుంటే.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు రాజ్యాంగాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నాయి. దేశంలో పేదలు, దళితులు, ఎస్టీలకు ఏవైనా ఫలాలు అందాయంటే.. అవి ఈ రాజ్యాంగం వల్లనే. గాం«దీజీ, అంబేడ్కర్‌ లేకుంటే ఈ రాజ్యాంగం వచ్చేది కాదు. అంబేడ్కర్, గాందీజీ దేశానికి చేసిన సేవలు, పనులను బీజేపీ తుడిచిపెట్టాలని చూస్తోంది. రాజ్యాంగాన్ని చించివేయాలని చూస్తోంది. 

బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని ఆ పార్టీ నేతలు నేరుగానే చెప్తున్నారు. రాజ్యాంగాన్ని మారిస్తే.. రిజర్వేషన్లు కూడా రద్దు అవుతాయి. పేదలు, దళితులు, గిరిజనుల హక్కులను లాక్కోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ప్రధాని మోదీ రిజర్వేషన్లకు వ్యతిరేకం. ఎక్కడా ఆయన ప్రసంగాలలో రిజర్వేషన్‌ పెంచుతామని చెప్పలేదు. రిజర్వేషన్లను తొలగించడానికే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారు. దేశంలో రిజర్వేషన్లను 50 శాతంకన్నా ఎక్కువకు పెంచాల్సిన అవసరం ఉంది. మేం అధికారంలోకి రాగానే రిజర్వేషన్లను పెంచుతాం..’’అని రాహుల్‌ గాంధీ తెలిపారు. 

పక్కాగా రుణమాఫీ చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి 
నిర్మల్, గద్వాల సభల్లో రాహుల్‌ గాంధీతోపాటు టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో పక్కాగా రుణమాఫీ చేస్తామని, రైతులందరికీ రైతు భరోసా సొమ్ము అందజేస్తామని స్పష్టం చేశారు. ‘‘రైతు భరోసా పడటం లేదని కేసీఆర్‌ అంటున్నారు. ఈనెల 9 తేదీలోపు రైతులందరి ఖాతాల్లో రైతుభరోసా నిధులు వేసే బాధ్యత మాది. రుణమాఫీ గురించి హరీశ్‌రావు మాట్లాడుతున్నారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి చూపిస్తాం. ఆరు గ్యారంటీల అమలెక్కడా? అని కేటీఆర్‌ అడుగుతున్నరు. దీనిపై కేటీఆర్‌కు ఓ సూచన చేస్తున్నా.. మంచిగా చీర కట్టుకుని, ఆడపిల్లలా తయారై ఆర్టీసీ బస్సు ఎక్కు. 

ఇంద్రవెల్లి, నాగోబా జాతర, భద్రాచలం, యాదగిరిగుట్ట ఎక్కడికి వెళ్లు.. ఒకవేళ నిన్ను టికెట్‌ అడిగితే ఆరు గ్యారంటీలు అమలు చేయనట్లే’’అని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు గాడిద గుడ్డు తప్ప ఏమీ ఇవ్వలేదని విమర్శించారు. 70ఏళ్ల చరిత్రలో ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి తొలిసారిగా గోండు ఆడబిడ్డ ఆత్రం సుగుణకు పోటీ అవకాశం వచ్చిందని.. కొమురం భీం, రాంజీ గోండు స్ఫూర్తిగా ఆమెను గెలిపించుకోవాలని కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ను తాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కోసం కాంగ్రెస్‌ పోరాటం చేసిందని.. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు పోరాటం చేస్తోందని చెప్పారు. 

రుణమాఫీ.. పంటలకు మద్దతు ధర.. 
బీజేపీ కేవలం 2, 3 శాతమున్న ధనిక వర్గాల కోసమే పనిచేస్తోంది. గత పదేళ్లలో మోదీ 2–3  కుటుంబాల కోసమే పనిచేశారు. అదానీ, అంబానీ వంటి వ్యక్తులకు సంబంధించి రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారు. దేశంలో విమానాశ్రయాలు, రక్షణ, ఓడలు, మౌలిక వసతుల కల్పన పరిశ్రమలను అమ్మి వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రైతులకు మాత్రం ఎప్పుడూ ఏమీ ఇవ్వలేదు. రుణాలు మాఫీ చేయలేదు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా రైతులందరికీ రుణమాఫీ చేస్తాం. రైతుల పంటలకు చట్టబద్ధతతో కనీస మద్దతు ధర అందేలా చూస్తాం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement