రాహుల్‌ను ఓడించిన స్మృతి ఇరానీని మట్టికరిపించిన శర్మ
అమేథీ: అమేథీ నియోజకవర్గంలో 2019లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీనే ఓడించిన బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీని ఈయన ఢీకొట్టగలరా? అన్న విశ్లేషకుల అనుమానాలను పటాపంచలు చేస్తూ కిశోరీ లాల్ శర్మ జయకేతనం ఎగరేశారు. మంగళవారం అమేథీ నియోజవర్గంలో çస్మృతి ఇరానీపై 1,67,196 ఓట్ల మెజారిటీతో కిశోరీ లాల్ శర్మ ఘన విజయం సాధించారు. తొలి ప్రయత్నంలోనే లక్షకుపైగా మెజారిటీ సాధించి అమేథీ కాంగ్రెస్‌కు కంచుకోట అని కిశోరీలాల్ మరోసారి నిరూపించారు.
రాహుల్‌ను ఇరానీ గతంలో 55వేల ఓట్ల తేడాతో ఓడిస్తే ఈసారి ఆమెను శర్మ అంతకు మూడురెట్లకు మించి మెజారిటీతో ఓడించడం విశేషం. ‘‘ ఈ విజయం నా ఒక్కరిది కాదు. మొత్తం నియోజకవర్గ కుటుంబాలది. ఇంతటి విజయం అందించిన అమేథీ ప్రజలకు నా కృతజ్ఞతలు. ఈ విజయం అమేథీ ప్రజలు, గాంధీల కుటుంబానికే చెందుతుంది. మనది బలీయ, ప్రజాస్వామ్య భారతం అని అమేథీ చాటింది’ అని ఫలితం వెలువడ్డాక కిశోరీలాల్ వ్యాఖ్యానించారు.
విజయం సాధించిన విధేయత: గాంధీల కుటుంబానికి అత్యంత విధేయుడిగా కిశోరీ లాల్ శర్మకు మంచి పేరుంది. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. శర్మ సొంత రాష్ట్రం పంజాబ్. లూథియానాకు చెందిన శర్మ మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీకి సన్నిహితుడు కూడా. 1983లో రాజీవ్‌తోపాటు యూపీ రాజకీయాల్లో అడుగుపెట్టారు. నాటి నుంచి స్థానిక వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. 1991లో రాజీవ్ మరణానంతరం గాంధీల కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. 1999లో తొలిసారిగా సోనియాగాంధీ అమేథీ నియోజవర్గంలో ఘన విజయం సాధించడంలో శర్మ కృషి దాగిఉందని అమేథీ రాజకీయ వర్గాలు చెబుతాయి.
అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల్లో దశాబ్దాలుగా క్షేత్రస్థాయిలో పార్టీ తరఫున అన్ని పనులు శర్మనే చూసుకునేవారు. అమేథీ, రాయ్‌బరేలీల్లో రాహుల్, సోనియా అందుబాటులో లేనపుడు నియోజకవర్గ సమస్యలపై పార్టీ అగ్రనాయకత్వానికి తెలియ జేయడం వంటి పనులనూ చక్క బెట్టేవారు. రాయ్‌బరేలీ ప్రజలతో ఈయన మంచి పరిచయం ఉంది. గత ఎన్నికల్లో అమేథీలో రాహుల్ ఓడిపోయాక నియోజకవర్గంలో కాంగ్రెస్ వ్యవహారాలను శర్మనే చూసుకున్నారు.
కొంతకాలం బిహార్, పంజాబ్ రాష్ట్రాల వ్యవహారాలనూ చూశారు. అమేథీ రాజకీయాల్లో తెరవెనుకే ఉండిపోయిన కిశోరీ లాల్.. రాహుల్ ఓటమితో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అయినా తొలి ప్రయత్నంలోనే ఘన విజయం సాధించడం విశేషం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీలో రాహుల్‌పై స్మృతి ఇరానీ 55,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అదే ఊపులో బరిలో దిగిన స్మృతి ఇరానీని శర్మ ఈసారి ఇంటిబాట పట్టించారు. నియోజవర్గ సమస్యలపై పోరాటం చేసినందుకు ఫలితంగానే కిశోరీలాల్‌కు విజయకిరీటాన్ని ఓటర్లు కట్టబెట్టారని విశ్లేషకులు చెబుతున్నారు.
కిశోరీ భాయ్.. ముందే చెప్పా: ప్రియాంకా గాంధీ
కిశోరీ లాల్ గెలుపుపై పార్టీ నేత ప్రియాంక గాంధీ స్పందించారు. ‘‘ కిశోరీ భాయ్.. మొదట్నుంచీ మీ గెలుపు మీద నాకు ఏమాత్రం సందేహం లేదు. మీరు గెలుస్తారని తొలినుంచీ బలంగా నమ్ముతున్నా. మీకు, నియోజకవర్గ సోదర, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని ‘ఎక్స్’లో హిందీలో ట్వీట్‌చేశారు.
Comments
Please login to add a commentAdd a comment