బొటాబొటిగా జాతీయం! | Sakshi Editorial On National politics | Sakshi
Sakshi News home page

బొటాబొటిగా జాతీయం!

Published Sun, May 26 2024 4:05 AM | Last Updated on Sun, May 26 2024 4:05 AM

Sakshi Editorial On National politics

జనతంత్రం

చండీగఢ్‌ టూ పట్నా. జాతీయ రాజకీయాలకు ఆయువుపట్టు. సారవంతమైన గంగా–యమునల మైదాన ప్రాంతం ఇదే. కొద్దిగా సింధూ బేసిన్‌ కూడా ఇందులో చేరి ఉండవచ్చు. కాస్త విస్తరిస్తే ‘కౌబెల్ట్‌’ అని కూడా పిలుస్తాము. మనం ఏ రకమైన మాంసం తినాలో, ఏ రకమైనది తినకూడదో తెలియజెప్పే కౌబాయ్స్‌కు ఇది పరమ పూజనీయమైన ప్రాంతం. అనాదిగా పిలుచుకుంటున్నట్టు ‘ఆర్యావర్తం’ కూడా ఇదే! ఈ ప్రాంతం మీద పట్టు సాధించకుండా దేశంలో రాజ్యాధికారాన్ని సంపాదించడం చాలా కష్టం.

మొదటి ఐదు సాధారణ ఎన్నికల్లో ఆర్యావర్తం, ద్రవిడదేశం అనే తేడాల్లేకుండా దేశంలోని అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్‌  పార్టీ ఆధిక్యత కనబరిచింది. ఆరోసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ జైత్రయాత్రకు కళ్లెం వేసిన జనతా పార్టీ మాత్రం అచ్చంగా ఉత్తరాది పార్టీయే! అప్పుడు జనతా పార్టీకి 295 లోక్‌సభ స్థానాలు దక్కాయి. ఇందులో వింధ్య పర్వతాలకు దిగువన గెలిచిన సీట్లు రెండు డజన్లు దాటలేదు. అవి కూడా ప్రధానంగా మహారాష్ట్రలో గెలిచినవే!

భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి గడచిన పదేళ్లుగా అధికారంలో ఉన్నది. అయినప్పటికీ ఒక్క కర్ణాటక మినహా మిగిలిన దక్షిణాదిలో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నది. ఈసారి అదనంగా తెలంగాణపై కూడా ఆశలు పెట్టుకున్నది. కానీ, మూడోసారి వరసగా అధికారాన్ని చేపట్టాలంటే కచ్చితంగా గోమాత ప్రాంతమే కాషాయ దళాన్ని కరుణించి కాపాడాలి. గత ఎన్నికల్లో భారీ సీట్లను ప్రసాదించిన ఈ ప్రాంతంలో బలమైన గండి పడితే మాత్రం ఇతర ప్రాంతాలు పూడ్చగలిగే పరిస్థితి కనిపించడం లేదు. మరి ఈసారి కూడా ఆర్యావర్తం బీజేపీని గట్టెక్కిస్తుందా లేదా అన్నదే ముఖ్యమైన ప్రశ్న.

చండీగఢ్‌ నుంచి హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ల మీదుగా బీహార్‌లోని పట్నా వరకు మొత్తం 157 స్థానాలను అప్పట్లో జనతా పార్టీ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఇప్పటికీ అదే రికార్డు. ఇందిరాగాంధీ హత్యానంతరం వెల్లువెత్తిన సానుభూతి ప్రభంజనం (1984)లో కూడా ఈ రికార్డు చెక్కుచెదరలేదు. అప్పుడు యూపీ, బీహార్‌లలో ఎనిమిదిమంది ఇతర  పార్టీల వారు గెలిచారు. కొత్త రాష్ట్రాలుగా అవతరించిన ఉత్తరాఖండ్, జార్ఖండ్‌లను కూడా కలుపుకొంటే ఇదే ప్రాంతంలో బీజేపీకి 2019లో 113 సీట్లు దక్కాయి. ఎన్డీఏ భాగస్వాములతో కలిసి 131 సీట్లలో గెలిచారు.

ఇప్పుడా సంఖ్యను బీజేపీ నిలబట్టుకోగలదా? రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్‌లను కూడా కలిపి చూస్తే కౌబెల్ట్‌ పూర్తవుతుంది. ఇందులో రాజస్థాన్‌ (25), గుజరాత్‌ (26), హిమాచల్‌ (4)లో అప్పుడు బీజేపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. మధ్యప్రదేశ్‌ (29)లో 28, ఛత్తీస్‌గఢ్‌ (11)లో 9 సీట్లను గెలుచుకున్నది. ఈ దూకుడును ఇప్పుడు కూడా ప్రదర్శించగలుగుతుందా? దాదాపు 90 శాతం స్ట్రయిక్‌ రేట్‌తో విజృంభిస్తేనే కౌబెల్ట్‌లో బీజేపీ తన బలాన్ని నిలబెట్టుకోగలుగుతుంది.

ఈ ప్రాంతంలో బలమైన సామాజిక వర్గాలుగా పేరున్న రాజ్‌పుత్, జాట్, యాదవ కులాలు బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఓబీసీ రిజర్వేషన్ల కోసం డిమాండ్‌ చేస్తున్న జాట్‌ నాయకులు రాజస్థాన్, హర్యానాల్లో ఇప్పటికే ‘ఇండియా’ కూటమికి మద్దతు ప్రకటించారు. పశ్చిమ యూపీలోని జాట్లు మాత్రం చరణ్‌సింగ్‌ పరివారానికి చెందిన ఆర్‌ఎల్‌డీతోనే ఉన్నట్టు కనిపిస్తున్నది. ఈ పార్టీ ఎన్డీఏలో చేరినందువల్ల యూపీ జాట్ల మద్దతు బీజేపీకి లభించవచ్చు.

ఉత్తరాదిలో తొలి నుంచీ బీజేపీకి వెన్నుదన్నుగా ఉన్న రాజ్‌పుత్‌ల తాజా వైఖరి ఆ పార్టీని కొంత కలవరపరుస్తున్నది. ఈ వర్గానికి ప్రాతినిధ్యం వహించే కర్ణిసేన సభ్యులు బహిరంగ సభలు పెట్టి మరీ బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని పిలుపునిస్తున్నారు. రాజ్‌పుత్‌ వర్గం మీద వీరి పిలుపు ప్రభావం చూపితే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలోని కనీసం 30 నియోజకవర్గాల్లో బీజేపీకి నష్టం జరిగే అవకాశం ఉన్నది. రాజ్‌పుత్‌ వర్గానికి చెందిన యోగీ బాబానే యూపీ సీఎంగా ఉన్నందువలన ఆ రాష్ట్రంలో పెద్దగా భయపడవలసిన అవసరం లేదని బీజేపీ భావిస్తున్నది.

యూపీ, బీహార్‌లలో గణనీయమైన సంఖ్యలో ఉన్న యాదవులు చాలాకాలంగా ఎస్పీ, ఆర్జేడీల వెనుకనే సమీకృతమై ఉన్నారు. ఇప్పుడీ సమీకరణ మరింత సంఘటితంగా ఉన్నట్టు సమాచారం. అఖిలేశ్, తేజస్వీ యాదవ్‌లను వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రులను చేయాలనే పట్టుదల యువతలో కనిపిస్తున్నది. యాదవ వర్గం వ్యతిరేకతకు విరుగుడుగా యాదవేతర ఓబీసీలను మచ్చిక చేసుకుంటూ బీజేపీ ఇన్నాళ్లుగా నెట్టుకొస్తున్నది. బీజేపీ అధికారంలోకి వస్తే ఈసారి రిజర్వేషన్లు ఎత్తివేస్తారని జరిగిన ప్రచారం వల్ల ఈ వర్గం మద్దతును కూడా ఎంతోకొంత బీజేపీ కోల్పోవచ్చనే అభిప్రాయం బలపడుతున్నది. రిజర్వేషన్లు ఎత్తివేసే ఆలోచన తమకు లేదని ప్రధాని సహా పలువురు నేతలు వివరణ ఇచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

వాజ్‌పేయి హయాంలోని ఎన్డీఏ సర్కార్‌ చేసుకున్న ‘షైనింగ్‌ ఇండియా’ ప్రచారం వికటించినట్టుగానే మోదీ సర్కార్‌ చేస్తున్న ‘వికసిత భారత్‌’ కూడా వికటిస్తున్నట్టుగానే కనిపిస్తున్నది. ఉపాధి రంగం దారుణంగా దెబ్బతిన్నది. పెద్దనోట్ల రద్దు, కోవిడ్‌ వరస దెబ్బలతో కుదేలైన చిన్న వర్తకులు ఇప్పటికీ కోలుకోలేదు. నిరుద్యోగిత రేటుపై నిన్ననే విడుదలైన పీరియాడిక్‌ లేబర్‌ శాంపుల్‌ సర్వే నివేదిక నిరాశాజనకంగానే ఉన్నది. ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో చదువుకున్న ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లలో 38 శాతం మందికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు లభించలేదని వచ్చిన తాజా వార్త పరిస్థితికి అద్దం పడుతున్నది.

ఉత్తరాది రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువతకు సైనిక బలగాల్లో చేరడం ఒక ప్రత్యామ్నాయం. అందులో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నివీర్‌’ పథకం ఈ యువతను తీవ్రంగా నిరాశపరిచింది. దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలపై ప్రపంచస్థాయి ఆర్థికవేత్తలందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్స్‌ఫామ్‌ వంటి సంస్థలు క్రమం తప్పకుండా ఇచ్చే నివేదికల్లో ఈ అన్యాయాన్ని ఎత్తిచూపుతున్నాయి. ఒకే దేశంలోని మనుషుల మధ్య వంద రెట్లు, వేయి రెట్లు కాదు లక్షల రెట్ల ఆర్థిక తారతమ్యాలు వెక్కిరిస్తున్నాయి.

2012 నుంచి 2021 మధ్యకాలంలో భారత జాతి సృష్టించిన సంపదలో నలభై శాతం సొత్తు జనాభాలోని ఒకే ఒక్క శాతం కుబేరుల జేబుల్లోకి వెళ్లింది. యాభై శాతం మంది అడుగు జనాభా దోసిళ్లలో ఎంగిలి మెతుకులు రాలిపడ్డట్టు ఒకే ఒక్క శాతం సొమ్ము ఉమ్మడిగా జారిపడింది. దీన్నే కొందరు ’ట్రికిల్‌ డౌన్‌ థియరీ’గా పిలుచుకుంటున్నారు. ఈ రకమైన ఆర్థిక విధానాలతో ఎన్డీఏ రాజ్యమేలుతున్నది.

ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే శామ్‌ పిట్రోడాతో సహా పలువురు ఆర్థికవేత్తలు కూడా దేశంలో వారసత్వ పన్ను విధించాలన్న ప్రతిపాదన చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి ఇటువంటి సూచనలపై విస్తృతమైన చర్చను ఆహ్వానించడం అవసరం. కానీ, పిట్రోడాకు ఉన్న కాంగ్రెస్‌ సంబంధాలను ఆసరా చేసుకొని స్వయంగా ప్రధానమంత్రే ఎదురుదాడికి పూనుకున్నారు. ‘ప్రతిపక్షం అధికారంలోకి వస్తే మీరు సంపాదించుకున్న సొమ్మును లాగేసుకుంటారట’ అంటూ రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశారు. ఈ ప్రచారం బీజేపీకి మేలు చేసిందా... కీడు చేసిందా అనే విషయం ఓట్ల లెక్కింపు తర్వాత తేలిపోనున్నది.

ఈ రకమైన సామాజిక – ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తన కంచుకోటలను ఏ మేరకు కాపాడుకోగలదన్న చర్చ జరుగుతున్నది. ప్రభుత్వానికి అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ ఎటువంటి గాలి లేదని అభిప్రాయపడిన పక్షంలో గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో కలిపి సుమారు 50 స్థానాలను బీజేపీ చేజార్చుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వీటితోపాటు మహారాష్ట్ర, కర్ణాటకల్లో కూడా గత ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలనే సాధించింది. ఈసారి రెండు రాష్ట్రాల్లో కనీసం 15 స్థానాల వరకు ఆ పార్టీ పోగొట్టుకోవచ్చనే అంచనాలున్నాయి.

శరద్‌ పవార్, బాల్‌ఠాక్రేలు స్థాపించిన పార్టీలను చీల్చడం బీజేపీకి కలిసివచ్చే అంశం కాదనే అభిప్రాయం మహారాష్ట్రలో ఉన్నది. ఎన్నికల హామీల అమలులో చతికిలబడ్డ కర్ణాటక కాంగ్రెస్‌కు బీజేపీ మిత్రపక్షం జేడీఎస్‌ మళ్లీ ఊపిరిపోసింది. దేవెగౌడ పౌత్రరత్నం చేసిన నిర్వాకంపై కన్నడిగులు మండిపడుతున్నారు. ఇక బెంగాల్, ఒడిషా, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఓ పదిహేను స్థానాలను  బీజేపీ అధికంగా సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కోల్పోయే అవకాశం ఉన్న సీట్లు 65 అనుకుంటే, అదనంగా తెచ్చుకునే సీట్లు పదిహేను వరకు ఉండవచ్చని అంచనా. అంటే కనీసం యాభై సీట్లను బీజేపీ నికరంగా కోల్పోతుంది.

వ్యతిరేక గాలి బలంగా లేకపోతేనే గత ఎన్నికలతో పోలిస్తే యాభై స్థానాలను బీజేపీ కోల్పోవచ్చు. కూటమిలోని మిత్రపక్షాలన్నీ ఉమ్మడిగా మరో పాతిక, ముప్పయ్‌ సీట్లను గెలవచ్చు. ఇది దాదాపు తొంభై శాతం స్థానాలకు పోలింగ్‌ పూర్తయిన తర్వాత పరిశీలకుల్లో నెలకొని ఉన్న అభిప్రాయం. అంటే బొటాబొటి మెజారిటీతో ఎన్డీఏ మూడోసారి గద్దెనెక్కడానికి అవకాశాలు ఉన్నాయనుకోవాలి. బీజేపీకి సొంతంగా 370 సీట్లు కావాలనీ, కూటమికి 400 సీట్లు కావాలని ప్రధానమంత్రి చేసిన అభ్యర్థనను జనం పట్టించుకోలేదు. మూడింట రెండొంతుల మెజారిటీ లభిస్తే ఈ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చడానికి వెనకాడదనే వాదనను జనం విశ్వసిస్తున్నారనే అనుకోవాలి.

విశ్వసనీయమైన ప్రత్యామ్నాయం, సమర్థవంతమైన నాయకత్వం అందుబాటులో ఉండి ఉంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రజలు కచ్చితంగా ఓడించేవారే. ప్రజల ఆకాంక్షలకు, ప్రభుత్వ విధానాలకు మధ్యన ఓ పెద్ద అగాధమే ఉన్నది. కానీ, ఇండియా కూటమిలో పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన పార్టీగా మిగిలిపోయింది. సాధారణ మెజారిటీకి అవసరమైన 272 స్థానాల్లో కనీసం సగం సీట్లను కూడా కాంగ్రెస్‌ గెలవగలదన్న నమ్మకం ఎవరికీ లేదు. 

ఈ పరిస్థితుల్లో అతుకుల బొంతతో అస్థిర ప్రభుత్వ ప్రయోగాలకు మెజారిటీ ప్రజలు సిద్ధపడకపోవచ్చు. పార్టీ అధ్యక్షుడు ఖర్గేను ప్రధాని పదవికి ప్రతిపాదించి ఉంటే కూటమి సభ్యుల ఆమోదం లభించేది. సాహసోపేతమైన ఈ ప్రయోగాన్ని దేశ ప్రజలు స్వాగతించేవారు. కానీ రాహుల్‌గాంధీ మాటల్లో కనిపించేంత ఔదార్యం, అభ్యుదయం చేతల్లో కనిపించవు. అదే విషాదం. ఎట్టకేలకు కాంగ్రెస్‌ పార్టీకి లోక్‌సభలో సెంచరీ కొట్టే ఒక మంచి అవకాశం దొరికింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిద్దాం.


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement