‘ఇండియా’ కూటమి సమావేశం
అభిప్రాయం
ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో మొదటిసారిగా ఒక అధికార ప్రతిపక్ష నాయకుని హోదా పొందిన విపక్ష నాయకుడు పార్లమెంట్‌లో కనిపించబోతున్నారు. 2024 ఎన్నికల ఫలితాలు మోదీకి ఇవ్వబోతున్న కొత్త అనుభవం ఇది. గత పది ఏండ్ల పాలనలో అధికారికంగా అసలు విపక్షమే లేకుండా ఏక పక్షంగా సభను నడిపించారు. ఇప్పుడు ప్రధానిగా నరేంద్ర మోదీ మూడో సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్డీఏ కూటమిలోని చంద్రబాబు, నితీష్ కుమార్ తదితరుల సపోర్ట్‌తో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అదే తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ‘ఇండియా’ కూటమి రూపంలో ప్రతిపక్షం... పదేండ్ల తర్వాత అధికార పక్ష వ్యవహారశైలిని సమర్థవంతంగా నియంత్రించే స్థాయికి చేరడం గమనార్హం.
కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రవేశించనున్నారు. మోదీకి ఈ విషయం మింగుడు పడనిదే. రాహుల్ విపక్ష నేతగా రావడం లౌకిక, ప్రజాస్వామ్య భారతదేశానికి ఒక మంచి పరిణామంగా పేర్కొనక తప్పదు. రాహుల్ వయసు ఉన్నన్ని సీట్లు కూడా కాంగ్రెస్‌కూ, ‘ఇండియా’ కూటమికీ రావని ఎద్దేవా చేసిన మోదీకి ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కనువిప్పు కలిగించాయి. కాంగ్రెస్ సొంతంగా 99 సీట్లు, దాని నాయకత్వంలోని ఇండియా కూటమి మొత్తం 234 సీట్లు గెలవడం లౌకికవాదానికి తిరిగి ఊపిరులూదినట్లయ్యింది. ఇద్దరు ఇండిపెండెట్లూ ‘ఇండియా’కు మద్దతు ప్రకటించడంతో ఈ కూటమి బలం 236కు చేరడం గమనార్హం.
2024 ఎన్నికల ఫలితంగా మొట్టమొదటిసారిగా మోదీ ముందు అధికార హోదా కలిగిన ప్రతిపక్ష నాయకుడు కూర్చోబోతున్నారు. ఆయన రాహుల్ గాంధీయే అని రాజకీయ విశ్లేషకుల మాట. సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయించిన అనంతరం నిర్వహించే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రాహుల్‌ను పార్టీ సభానాయకునిగా ఎన్నుకోవడం కేవలం లాంఛనప్రాయం అనే భావిస్తున్నారు.
కాబట్టి మోదీ, ఆయన పార్టీవారు గేలిచేసిన రాహుల్ గాంధీయే ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా మోదీకి లోక్ సభలో సవాల్ విసరబోతున్నారు. గత పదేళ్లుగా లోక్ సభ సీట్లలో పదిశాతం సీట్లు కూడా గెలవలేదనే నెపంతో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా స్పీకర్ ఇవ్వలేదు. నిజానికి విపక్షంలో అత్యధిక సీట్లు వచ్చిన పార్టీకి పది శాతం సీట్లతో సంబంధం లేకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఇప్పుడు కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం స్పీకర్‌కు అనివార్యం.
బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే వచ్చాయి. అందువల్ల ఇప్పుడు తన భాగస్వామ్య పక్షాలపై ప్రభుత్వ ఏర్పాటుకు తప్పనిసరిగా ఆధారపడవలసి వచ్చింది. ఫలితంగా మోదీ ఇప్పుడు ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అవకాశమే లేదు. ప్రతిపక్ష హోదా కూడా లేని ప్రతిపక్షాలను ఉత్సవ విగ్రహాలను చేసి ఆడిన ఆటలు ఇక సాగకపోవచ్చు.
మోదీ ఈ ఎన్నికల్లో గెలవడానికి అత్యంత ప్రమాదకరమైన ఉపన్యాసాలు ఇచ్చారు. ‘టైమ్స్’ లాంటి విదేశీ పత్రికలు మోదీని ‘డివైడర్ ఇన్ చీఫ్’ అని అభివర్ణించాయి. మోదీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ ఉపన్యాసం ఒక నేరం అనీ, ప్రతిదానికీ, చట్ట ప్రకారం శిక్ష పడే పరిస్థితి ఉందనీ ప్రముఖ న్యాయ కోవిదుడు ఆశోక్ అరోరా అంటారు.
హిందూ, ముస్లింల మధ్య విద్వేషాలు రేపే ఉపన్యాసాలు (తాళిబొట్లు గుంజుకు పోతారనీ, బర్రెలను తీసుకెళతారనీ), వ్యాఖ్యలూ చేసిన వ్యక్తికి ప్రధాని అయ్యే అర్హత లేదని ఆయన అంటారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతికి లేఖ రాసినట్లు, ఒక వీడియో విడుదల అయ్యింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతిపక్ష కూటమి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రజల ఆశలను, ఆకాంక్షలను వారు వమ్ము చేయబోరని ఆశిద్దాం! ఆకలి, అసమానతలు, నిరుద్యోగం లేని; కుల, మతాలకు అతీతమైన భారతదేశ నిర్మాణం కోసం వీరంతా కృషి చేస్తారని, చేయాలని ఆశిద్దాం!
ఎమ్.డి. మునీర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
‘ 99518 65223
Comments
Please login to add a commentAdd a comment