సంకీర్ణంతో సామరస్యం నెలకొనేనా? | Sakshi Guest Column On NDA Alliance | Sakshi
Sakshi News home page

సంకీర్ణంతో సామరస్యం నెలకొనేనా?

Published Thu, Jun 6 2024 12:40 AM | Last Updated on Thu, Jun 6 2024 12:42 AM

Sakshi Guest Column On NDA Alliance

అభిప్రాయం

‘ఇండియా’ కూటమి కుల జనగణనను అంగీకరిస్తూ, బీజేపీ 400 సీట్లతో గెలిచి ఏకంగా రాజ్యాంగాన్ని మార్చెయ్యాలని చూస్తున్నదనీ, మొత్తం రిజర్వేషన్లను రద్దు చెయ్యాలనుకుంటోందనీ పెద్దఎత్తున ప్రచారం చేసింది. ఇది కచ్చితంగా ఓటర్ల మీద ప్రభావాన్ని చూపించింది. దాంతో ఫలితాలు బీజేపీని 
సంకీర్ణంలోకి నెట్టాయి. మోదీ సంకీర్ణ ప్రభుత్వాన్ని వారి సిద్ధాంతంతోనైనా వాజ్‌పేయిలా నడిపే వ్యక్తి కాదు. మోదీని ముస్లిం దేశాలు బద్దశత్రువుగా చూసే అవకాశముంది. ఆరెస్సెస్‌/బీజేపీ ఆయనను కాక మరో వ్యక్తిని ప్రధానిగా ప్రతిపాదించి కాస్త సామరస్య వాతావరణంలో దేశాన్ని నడవనిచ్చే అవకాశమున్నది. కానీ మోదీ తప్పుకొనే అవకాశం కనబడటం లేదు. అందుకు ప్రత్యర్థి కూటమి ప్రత్యామ్నాయంగా బలపడటం తప్ప మార్గం లేదు.

2024 ఎన్నికలు దేశ చరిత్రలో చాలా విచిత్రమైనవి. దేశస్థాయిలో మోదీ నాయకత్వంలోని బీజేపీని సంకీర్ణంలోకి నెట్టాయి. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాల్లో పరిపాలిస్తున్న రెండు పార్టీలూ ఓడిపోయాయి. ముఖ్యంగా వైసీపీ ఓటమి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే దేశం ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డ ఎన్నిక కూడా ఇది. బీజేపీ 240కి పడిపోవడం ఒక రక్షణ కవచం.

ఈ ఎన్నికతో చాలా ఘోరంగా పతనమైపోతుందనుకున్న కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు దేశాన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడాయి. ఉత్తరప్రదేశ్‌లో బుల్‌డోజర్‌ వ్యవస్థకు చెక్‌ పడింది. మొత్తం బీజేపీ శక్తులు ‘పప్పు, పప్పు’ అని ఎద్దేవా చేసిన రాహుల్‌ గాంధీ... ఒక దళిత మల్లిఖార్జున్‌ ఖర్గే నేతృత్వంలో ఎవరూ ఊహించనట్టు మ్యానిఫెస్టోను దేశం ముందు పెట్టి మోదీ, అమిత్‌షాల 400 సీట్లు తెస్తారన్న బీజేపీని 240 సీట్లకు పడేసి దేశాన్ని చాలా పెద్ద ప్రమాదం నుంచి కాపాడారు.

‘ఇండియా’ కూటమి కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను సొంతం చేసుకొని దేశమంతటా ప్రచారం చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను ఈ ఎన్నికల ‘హీరో’ అన్నారు. ‘ఇండియా’ కూటమి కుల జనగణనను అంగీకరిస్తూ, బీజేపీ 400 సీట్లతో గెలిచి ఏకంగా రాజ్యాంగాన్ని మార్చెయ్యాలని చూస్తున్నదనీ, మొత్తం రిజర్వేషన్లను రద్దు చెయ్యాలనుకుంటోందనీ పెద్దఎత్తున ప్రచారం చేసింది. ఈ ప్రచారం కచ్చితంగా చాలామంది ఓటర్ల మీద ప్రభావాన్ని చూపించింది. నరేంద్ర మోదీ దీన్ని తట్టుకోవడానికి ముస్లింల రిజర్వేషన్లు ఎత్తేసి బీసీలకు ఇస్తామని పదేపదే మాట్లాడారు. 

కానీ చంద్రబాబు, నితీష్‌ కుమార్‌ వంటివారు దాన్ని అంగీకరించలేదు. ఇప్పుడు ఈ ఇద్దరు లేకుండా బీజేపీ ప్రభుత్వం నిలబడదు. అయితే అటు నితీష్‌ గానీ, ఇటు చంద్రబాబు గానీ మోదీకి మంచి మిత్రులు కారు. ఇద్దరూ మోదీని, షాని వ్యతిరేకించి శత్రుస్థానంలో పెట్టి, వారితో పోరాడినవాళ్లే. అయితే ఆ ఇద్దరు ఇప్పుడు ‘ఇండియా’ కూటమి దేశానికి, రాజ్యాంగానికి ప్రమాదకరమైనదని ప్రచారం చేస్తున్న మోదీని ప్రధానమంత్రిని, షాను మళ్లీ హోంమంత్రిని చేసి దేశ అభద్రతకు బాధ్యులవుతారా? లేక బీజేపీలోని మరో వ్యక్తిని ప్రధానమంత్రిని చెయ్యమని సలహా ఇస్తారా? చూడాలి.

మోదీ ప్రభుత్వం చంద్రబాబుకు దూరమైన గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నో తీవ్ర నష్టాలను చేసింది. ఆంధ్ర పెట్టుబడిదారులనెవ్వరినీ నిర్మాణం రంగంలో గానీ, పెద్ద బిజినెస్‌లలో గానీ నిలువనివ్వలేదు. బ్యాంకుల విలీనం చేసినప్పుడు బరోడా బ్యాంక్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, కెనరా బ్యాంక్‌ వంటి వాటిని ఆ పేర్లతోనే ఉంచి ఆంధ్రా బ్యాంక్‌ను మాత్రం యూనియన్‌ బ్యాంక్‌లో విలీనం చేశారు. మొదటి నుండి ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ అన్నింటి రీత్యా ఇప్పుడు చంద్రబాబుపై ఆధారపడే కేంద్ర ప్రభుత్వానికి బాబు ఎటువంటి కండిషన్లు పెడతారు?

అటు కాంగ్రెస్‌తో 2019లో తెలంగాణలో పొత్తులో పోటీ చేసింది టీడీపీ. కాంగ్రెస్‌ తమ ప్రభుత్వం వస్తే ప్రత్యేక హోదా తప్పకుండా ఇస్తామంటోంది. చంద్రబాబు, నితీష్‌కుమార్‌ ఒక నిర్ణయం తీసుకుంటే, మోదీ, అమిత్‌ షాలను ఇంటికి పంపగలరు. అయితే చంద్రబాబుకు ఇప్పుడున్న స్థితిలో అది చిన్న నిర్ణయం కాదు. మోదీ సంకీర్ణ ప్రభుత్వాన్ని వారి సిద్ధాంతంతోనైనా వాజ్‌పేయిలా నడిపే వ్యక్తి కాదు. ఎన్నికల ప్రచారంలో ఆయన దేశంలోని మొత్తం ముస్లింల మీద అక్కసు కక్కారు.

గుజరాత్‌లోని 2002 మత కల్లోలం తరువాత జరిగిన ఈ ముస్లింల వ్యతిరేక ప్రచారం ఆయన్ని ఇంకా పెద్ద ముస్లిం వ్యతిరేకిగా నిలబెడుతుంది. ప్రపంచ పత్రికలన్నీ ఆయన్ని ‘గ్రేట్‌ డివైడర్‌’ అని రాశాయి. ముస్లిం దేశాలు ఈ ఎన్నికల తరువాత ఆయన్ని బద్ధశత్రువుగా చూసే అవకాశముంది. ఆరెస్సెస్‌/బీజేపీ ఆయన్ని కాక మరో వ్యక్తిని ప్రధానిగా ప్రతిపాదించి కాస్త సామరస్య వాతావరణంలో దేశాన్ని నడవనిచ్చే అవకాశమున్నది. కానీ ఆరెస్సెస్‌/బీజేపీ క్యాడర్‌ మోదీ, అమిత్‌ షాల పరిపాలనలో సుఖాలను అనుభవించడం నేర్చుకున్నారు. వారికి ఈ భోగం మరో నాయకుల నేతృత్వంలో దొరకదు. అందువల్ల ఆరెస్సెస్‌లో కూడా వారు చెప్పిందే నడుస్తుంది.

గుజరాత్‌ పెట్టుబడి దేశాన్ని మొత్తం తన గుతా«్తధిపత్యంలోకి తీసుకుంది. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రం నుండి కూడా గుజరాత్‌ పెట్టుబడిదారులకు ధీటుగా పోటీపడే పరిస్థితి లేదు. తెలుగు రాష్ట్రాల నుండి నిర్మాణ రంగంలో గుజరాతీ పెట్టుబడిదారులకు ధీటుగా ఎదిగిన జీవీకే కంపెనీని బొంబాయి ఎయిర్‌పోర్ట్‌ నుండి తప్పించి మోదీ, షాలు అదానీకి అప్పజెప్పారు. తమకు ఎదురు తిరిగిన రాజకీయ నాయకులపై సీబీఐ, ఈడీలను ప్రయోగించి జైలుపాలు చేశారు. 

ఈ పరిస్థితి నుండి దేశం బయట పడాలంటే మోదీ, షాలు అధికారం నుండి పోవడమొక్కటే మార్గం. అందుకు ప్రత్యర్థి కూటమి ప్రత్యామ్నాయంగా బలపడటం తప్ప మరో మార్గం లేదు. అందుకు ‘ఇండియా’ కాస్త దారి చూపింది. ఈ స్థితిలో ‘ఏ కూటమితోనూ ఉండను’ లాంటి నిర్ణయాలు నష్టం చేస్తాయి. ఎప్పుడైనా ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయి వ్యవస్థల్ని శాసించలేవు. నిజానికి, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేనతో – బీజేపీ చేరి ఎన్నికల కమిషన్‌ను అటు తిప్పింది అనేది స్పష్టంగా కనిపిస్తోంది. కీలక స్థలాల్లో వైసీపీ కీళ్లు విరిచే ప్రయత్నం చేసింది.

రాహుల్‌ గాంధీ దేశంలో అన్ని సభల్లో ఎన్నికల సంఘం నిష్పక్షపాత్రను ప్రశ్నిస్తూ వచ్చారు. సీబీఐ, ఈడీ, ఎలెక్టోరల్‌ బాండ్స్, ఇతర పార్టీల ఆదాయాలను అడ్డుకోవడం, ఉన్న పార్టీ డబ్బును ఎన్నికల్లో వాడకుండా చూడటం, ఇన్‌కమ్‌టాక్స్‌ వంటి సంస్థల ద్వారా బంధించడం... ఈ స్థితిలో అన్ని ప్రాంతీయ పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవాలంటే ఒక జాతీయ కూటమిలో చేరి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే నిర్ణయాల్లో, పోరాటాల్లో భాగం కాకపోతే ముందు ముందు బీజేపీ ప్రాంతీయ పార్టీలను తమ బందీలను చేస్తుంది.

కాంగ్రెస్‌ ముఖ్యంగా రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర, భారత్‌ జోడో న్యాయ యాత్ర తరువాత ఆరెస్సెస్‌/బీజేపీలను నిలువరించే ప్రయత్నం చేశారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలు డీఎంకే లాగ ఒక ప్రత్యామ్నాయ తాత్విక పునాదితో నిర్మించినవి కావు. అందుకే డీఎంకేని బీజేపీ సనాతన ధర్మం చుట్టూ రాద్దాంతం చేసి ఓడించాలని చూసింది. కానీ దాని ద్రావిడ, శూద్ర సిద్ధాంతరంగం కాపాడింది. బీజేపీ అక్కడ ఒక్క సీటు కూడా గెలవలేదు. 

ఇప్పుడు పార్లమెంట్‌ పోరాటం... రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రిజర్వేషన్లను కాపాడాలనే ‘ఇండియా’ కూటమికీ, ఆరెస్సెస్‌ సిద్ధాంతాన్ని దేశంలో నాటి, మత సమస్యను ముందు పెట్టి దేశంలో ఉత్పత్తి కులాలను అణగదొక్కే ఎన్డీఏలోని ఆధిపత్య బీజేపీకీ మధ్య జరుగుతుంది. 

ఎన్డీయే కూటమిలోని నితీష్‌ కుమార్, చంద్రబాబుకు బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలకు చెక్‌ పెట్టే అవకాశమొచ్చింది. ఈ ఇద్దరు నాయకులు ఏం చేస్తారనేది చూడాలి. చంద్రబాబు 2002లో మోదీని ముఖ్యమంత్రి పదవి నుండి దింపే స్థితిలో ఉండి కూడా ఆయన్ని కొనసాగించే బీజేపీ నిర్ణయానికి మద్దతిచ్చారు. మళ్లీ ఈ కీలకదశలో ఆయనకు ఒక అవకాశమొచ్చింది. ‘ఇండియా’ కూటమి దేశంలోని మొత్తం ప్రతిపక్ష పార్టీలను తమ పక్కన చేర్చుకోవాల్సిన అవసరముంది. 


ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌ 
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement