సమీక్ష
గడచిన సార్వత్రిక ఎన్నికలు అన్ని పక్షాలనూ సమంగా ఆశ్చర్యపరిచాయి. మునుపటికన్నా ఎక్కువ మెజారిటీ సీట్లు సాధిస్తామని ఆశించిన బీజేపీ కలలు కల్లలుకాగా, అందలం అందుకోవటమే ఆలస్యమన్నట్టు పొంగిపోయిన ఇండియా కూటమికి భంగపాటు తప్పలేదు. ఈ ఫలితాల ఆంతర్యమేమిటి... ఎవరెవరు ఎలా, ఎందుకు దెబ్బతిన్నారన్న అంశాలపై సీనియర్ పాత్రికేయుడు, టీవీ న్యూస్ ప్రెజెంటర్ రాజ్‌దీప్ సర్దేశాయి వెలువరించిన తాజా పుస్తకం ‘2024 ది ఎలక్షన్ దట్ సర్‌ప్రైజ్‌డ్ ఇండియా’. ఈ అసమ సమాజంలో నిత్యం దగా పడుతున్న సగటు మనిషి మౌనంగా, ప్రశాంతంగా ఉన్నట్టు కనబడుతూనే నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా ఇచ్చిన తీర్పు ఇది అంటారు రాజ్‌దీప్. అందుకే ఈ ఎన్నికల అసలు విజేత సగటు వోటరేనని చెబుతారు.
పార్లమెంటరీ రాజకీయాలపై ఎంతో ఆసక్తి ఉన్నవారికి సైతం వెగటుపుట్టించే విధంగా మన ఎన్నికల తంతు తయారైంది. ఇంతటి రణగొణ ధ్వనులమధ్య కూడా నాయకులతో చర్చించటం, సాధారణ పౌరులను కలవటం, ఎవరివైపు మొగ్గు ఉందో అంచనావేయటం వివిధ చానెళ్లు చేస్తున్న పని. దీన్ని ఎంతో నిష్ఠగా, దీక్షగా నెరవేర్చే కొద్దిమంది పాత్రికేయుల్లో రాజ్‌దీప్ సర్దేశాయ్ ఒకరు.
ఉత్తేజాన్నివ్వని హ్యాట్రిక్!
రాజ్‌దీప్ తాజా పుస్తకం ‘2024 ది ఎలక్షన్ దట్ సర్‌ప్రైజ్‌డ్ ఇండియా’ 528 పేజీల సమగ్ర గ్రంథం. ఇప్పుడే కాదు... ‘2014 ది ఎలక్షన్ దట్ ఛేంజ్‌డ్ ఇండియా’ మొదటి పుస్తకంగా, 2019 ‘హౌ మోదీ వన్ ఇండియా’ రెండో పుస్తకంగా వచ్చాయి. తాజా పుస్తకం మూడోది. దీనికి ‘హ్యాట్రిక్ 2024’ అన్న శీర్షిక పెడదామనుకున్నారట. కానీ ఫలితాలు విశ్లేషించాక పునరాలోచనలో పడ్డారట. రచయిత దృక్ప థమేమిటో పుస్తకం శీర్షికే వెల్లడిస్తుంది.
స్వతంత్ర భారతంలో నెహ్రూ తర్వాత వరసగా మూడోసారి అందలం అందుకున్నది మోదీ మాత్రమే! ఆ రకంగా ఆయనకైనా, బీజేపీకైనా ఇది ఘనవిజయం కిందే లెక్క. కానీ 272 అనే ‘మేజిక్ మార్క్’ ఎక్కడ? కనీసం దాని దరిదాపుల్లోకి కూడా రాలేక 240 దగ్గరే బీజేపీ ఆగిపోయింది. అందుకే ‘హ్యాట్రిక్’ విజయోత్సవ హోరు లేదు. 2024 ఎన్నికలు అందరినీ సమంగా ఆశ్చర్యపరిచాయి. ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ అని ప్రధాని నరేంద్ర మోదీ నినాదమిచ్చి తమ శ్రేణుల్ని ముందుకురికించారు.
అందరం కలిశాం గనుక, ‘ఇండియా’ అన్న సంక్షిప్తీకరణ పదం దొరి కింది గనుక విజయం ఖాయమన్న భ్రమలో ప్రతిపక్ష కూటమి నాయ కులున్నారు. లాక్‌డౌన్‌తో జనం ఆర్థిక అగచాట్లు, వేలాది కిలోమీటర్ల నడక, ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం, పీఎమ్ కేర్స్ ఫండ్, సాగుచట్టాల వ్యతిరేక ఉద్యమం, సీఏఏ, విపక్ష సర్కార్ల కూల్చివేతలు, విద్వేష పూరిత ప్రసంగాలు... ఇవన్నీ ఎన్డీయే ప్రభుత్వంపై ఏవగింపు కలిగించాయని ‘ఇండియా’ కూటమి నమ్మింది.
విపక్ష నేతలపై ఈడీ, ఐటీ దాడులు, అరెస్టులు విపక్ష వ్యూహాన్ని ఏదో మేర దెబ్బతీసిన మాట వాస్తవమే. కానీ ఇందుకే మెజారిటీ సాధనలో ‘ఇండియా’ విఫలమైందని చెప్పటం కష్టమంటారు రాజ్‌దీప్. బిహార్ సీఎం నితీష్‌కుమార్‌ను చేజార్చుకోవటం, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ విషయంలో తప్ప టడుగుల వంటివి దెబ్బతీశాయన్నది ఆయన విశ్లేషణ.
ఇలాంటివి చోటుచేసుకోనట్టయితే బీజేపీకి ఇప్పుడొచ్చిన 240 స్థానాల్లో మరో 40 వరకూ కోతపడేవని రాజ్‌దీప్ అభిప్రాయం. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఎన్డీయేగా బరిలోకి దిగినా బీజేపీ సొంతంగానే మెజా రిటీ సాధించుకుంది. కేవలం మిత్ర ధర్మాన్ని పాటించి మాత్రమే భాగ స్వామ్య పక్షాలకు పదవులిచ్చింది. ఇప్పుడలా కాదు... నిలకడలేని టీడీపీ, జేడీ(యూ) వంటి పార్టీల దయాదాక్షిణ్యాలపై నెట్టుకురాక తప్పదు.
ఒక్కటైన దళిత, ముస్లిం వర్గాలు
గతంలో ఇతర వర్గాలతోపాటు వెన్నుదన్నుగా నిలిచిన దళిత ఓటుబ్యాంకు 2024 ఎన్నికల్లో బీజేపీకి దూరమైందని రాజ్‌దీప్ చెబు తారు. బీజేపీకి భారీ మెజారిటీ వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని ఆ వర్గాలు భయపడ్డాయి. కంచుకోట అనదగ్గ యూపీలో 2022లో ‘బుల్డోజర్ మ్యాండేట్’ వస్తే రెండేళ్లు గడిచేసరికల్లా ‘మండలైజ్డ్ కుల స్పృహ’ పెరిగి దళిత ఓటుబ్యాంకుకు అక్కడ 10 శాతం కోతపడిందని ఆయన విశ్లేషణ.
వీరికి ముస్లింల ఓటు బ్యాంకు తోడైందంటారు. 2015–16 నుంచి 2022–23 మధ్య సంఘటిత రంగంలో 63 లక్షలు, అసంఘటిత రంగంలో కోటీ 60 లక్షల ఉద్యోగాలు ఆవిరయ్యాయన్న ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఐఆర్‌ఆర్) సంస్థ గణాంకాలను రాజ్‌దీప్ ఉటంకిస్తారు. రాజ్‌దీప్ పుస్తకం కళ్ల ముందు జరిగిన అనేక పరిణామాల వెనకున్న కారణాలేమిటో, నాయకుల అతి విశ్వాసంలోని అంతరార్థమేమిటో విప్పిజెబుతుంది.
మనమంతా చూస్తున్నట్టు ఇప్పుడేలుతున్నది నిజంగా బీజేపీ యేనా? రాజ్‌దీప్ లెక్కలు చూస్తే క్షణకాలమైనా ఆ ప్రశ్న రాకమానదు. ఈసారి ఎన్నికల్లో ఏకంగా 114 మంది కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన నేతలకు బీజేపీ టిక్కెట్లు వచ్చాయట. బీజేపీ ‘కాంగ్రెస్ ముక్త భారత్’ నినాదం కాస్తా ‘కాంగ్రెస్ యుక్త బీజేపీ’ అయిందంటారాయన.
అసలు జాతీయ రాజకీయాల్లో మోదీ ఆగమనానికి ముందే ఒక పార్టీగా కాంగ్రెస్ మతాన్ని పులుముకోవడం, వ్యవస్థల్ని దుర్వినియోగం చేయడం, నిలదీసిన సొంత పార్టీ నేతలపై సైతం అక్రమ కేసులు మోపి జైళ్లపాలు చేయడం వగైరాలు పెంచింది. ఆ రకంగా మోదీ రాకకు ముందే ‘మోదీయిజాన్ని’ పరిచయం చేసింది. ఆ నొప్పి ఎలా ఉంటుందో దశాబ్దకాలం నుంచి చవిచూస్తోంది.
ఫలిస్తున్న ‘ప్రచారయావ’
ప్రచారం విషయంలో మోదీ తీసుకునే శ్రద్ధను రాజ్‌దీప్ వివరి స్తారు. గుజరాత్‌లో బీజేపీ కార్యక్రమాలపై సింగిల్ కాలమ్ వార్త ఇవ్వ టానికి కూడా మీడియా సిద్ధపడని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల సంద ర్భంగా రాష్ట్రంలోని 182 నియోజకవర్గాల నుంచీ ప్రచార రథాలను తరలించి అహ్మదాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించాలని ఆయన ప్రతి పాదించారట.
ఇందువల్ల డబ్బు ఖర్చుతప్ప ఒరిగేదేమీ లేదని పార్టీ నాయకులు గుసగుసలు పోగా, ర్యాలీ జరిగిన మర్నాడు ఎప్పుడూ లేనట్టు మీడియాలో అది ప్రముఖంగా వచ్చిందట. ప్రచారం భారీ స్థాయిలో చేయటం అప్పటినుంచీ మోదీకి అలవాటు. ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ వెనకా ఈ వ్యూహమే ఉంది.
‘గోదీ మీడియా’ ప్రస్తావన
అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, రాహుల్ గాంధీ, శరద్ పవార్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ తదితరుల తీరుతెన్నులపై రాజ్ దీప్ వివరంగానే ప్రస్తావించారు. సద్విమర్శలను వ్యక్తిగతంగా తీసు కుని బెదిరించటంలో, అమర్యాదగా ప్రవర్తించటంలో అమిత్ మాల వీయ వంటి కొందరు బీజేపీ నేతల ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పారు. మరోపక్క మీడియా మొత్తాన్ని చాలామంది ఒకే గాటనకట్టి ‘గోదీ మీడియా’గా ముద్రేయటంపై విచారిస్తూనే కొన్ని ప్రధాన చానెళ్ల, పత్రికల తీరుపై ఈ గ్రంథంలో నిశితమైన విమర్శ వుంది.
తాను ఈసారి ఎన్డీయే ఓడుతుందని భావించకపోయినా ‘మేజిక్ ఫిగర్’ దాటుతుందని గుడ్డిగా నమ్మిన వైనాన్ని వివరిస్తారు. అదే సమ యంలో ఎప్పుడూ అంచనాలు తప్పని ప్రదీప్ గుప్తా వంటి ప్రఖ్యాత సెఫాల జిస్టు సైతం ఎన్డీయేలో ఒక్క బీజేపీకే 322–340 మధ్య వస్తాయని చెప్పడాన్ని వెల్లడిస్తారు. సుదీర్ఘకాలం ఢిల్లీలో పాత్రికేయు డిగా పని చేసిన అనుభవం, ఉన్నత స్థానాల్లోని వారితో కలిగిన పరి చయాలు పుస్తక రచనలో రాజ్‌దీప్‌కు బాగా అక్కరకొచ్చాయి.
‘ఈవీఎంల గారడీ’ ఎక్కడ?
అయితే ఒక విమర్శ – ఈవీఎంల వ్యవహారంపై అసోసియేషన్ ఆఫ్ డెమాక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) ఏకరువు పెట్టిన అంశాల గురించి ప్రస్తావించినా ఆ ఎపిసోడ్‌ను లోతుగా చర్చించకపోవటం లోటనే చెప్పాలి. వాస్తవానికి దానిపై విడిగా పుస్తకమే రావాలి. మొత్తం 543 నియోజకవర్గాలకుగాను 537 చోట్ల ఈవీఎంలలో పోలైన ఓట్లకూ, లెక్కించిన ఓట్లకూ పొంతన లేదని ఏడీఆర్ బయటపెట్టింది.
‘ఇది కేవలం సాంకేతిక లోపమే... దీనివల్ల అంతిమ ఫలితం తారుమారు కాబోద’ని వాదించటానికి ముందు కనీసం అందుకు హేతుబద్ధమైన సంజాయిషీ ఇవ్వాల్సిన బాధ్యతని ఎన్నికల సంఘం గుర్తించక పోవటం విచారించదగ్గది. మొదలుపెడితే చివరి వరకూ చదివించే శైలితో, ఆశ్చర్యపరిచే సమాచారంతో ఈ పుస్తకం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇలాంటి గ్రంథం ఇంగ్లిష్‌లో మాత్రమే సరి పోదు. ప్రాంతీయ భాషల్లో సైతం వస్తేనే ప్రజల అవగాహన పెరుగుతుంది.
తెంపల్లె వేణుగోపాలరావు
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడు
venujourno@gmail.com
Comments
Please login to add a commentAdd a comment