విశ్లేషణ
ఢిల్లీ బాద్‌షా ఎవరు? కేంద్ర సర్కార్ బడానేతలు మోదీ–షా ద్వయానికి అతిపెద్ద రాజకీయ సవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక. దశాబ్దంగా దేశ ఎన్నికల రాజకీయాలను దాదాపు శాసిస్తున్న బీజేపీ నాయకత్వానికి మింగుడు పడని గరళ గుళిక ‘ఢిల్లీ’! పదేళ్లలో, వరుసగా 2014, 2019, 2024 మూడు ఎన్నికల్లో ఏడుకు ఏడు లోక్‌సభ స్థానాలు అలవోకగా గెలుస్తూ వస్తున్న బీజేపీ... ఢిల్లీ రాష్ట్రాధికార పీఠాన్ని ఎడబాసి పాతికేళ్లు! దేశ రాజధానిలో పునర్వైభవం కోసం రెండున్నర దశాబ్దాలుగా అది చేయని యత్నం, వేయని ఎత్తు లేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే ఆధిపత్యానికి కొంత గండిపడ్డా.... హరియాణా, మహారాష్ట్ర ప్రభుత్వాలను తిరిగి నిలబెట్టుకున్న ఆత్మవిశ్వాసంతో పార్టీ నాయకత్వం ఢిల్లీ అసెంబ్లీ పోరుకు సిద్ధమౌతోంది.
భూమ్మీద రెండో అతిపెద్ద జనాభా (3.4 కోట్లు) నగరం మన రాజధాని ఢిల్లీ. 3.7 కోట్ల జనాభా కలిగిన టోక్యో (జపాన్) తర్వాత మనదే ఎక్కువ జనాభా నగరం. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను వేర్వేరుగా చూస్తూ ఓటేసే తెలివిపరుల బరి ఇది. అదే, ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీకి చిక్కులు తెచ్చిపెడ్తోంది. ఏకులా వచ్చి మేకులా, స్థానిక రాజకీయ శక్తిగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) స్థిరపడిపోవడం బీజేపీకి మింగుడుపడట్లేదు.
దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్, పదకొండేళ్లుగా ఢిల్లీని ఏలుతున్న ఆప్‌లకు ఒక లోక్‌సభ సీటు కూడా దక్కనీకుండా బీజేపీ, దశాబ్దకాలంగా సున్నాకే పరిమితం చేసింది. కానీ, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్ని వరసగా మూడు పర్యాయాలు కాంగ్రెస్, మరో మూడుమార్లు ఆప్ గెలవటంతో 26 ఏళ్లుగా బీజేపీ ప్రతిపక్ష పాత్రకే పరిమితమౌతోంది. రాజకీయ ఆటుపోట్ల నడుమ కూడా, 70లో 11 స్థానాలకు ఆప్ అప్పుడే అభ్యర్థులను ప్రకటించి బరిలో దూకింది.
ఫిబ్రవరిలో ఢిల్లీ కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. మోదీ నాయకత్వంలోని బీజేపీని ఎదుర్కునేందుకు ఆప్ అస్త్రశస్త్రాలు సన్నద్దం చేసుకుంటోంది. ఎన్నికలవేళ ఓటర్లను ఆకట్టుకునే ‘ఉచితాల మీద (‘రేవడీ పే’) చర్చ’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విషయంలో బీజేపీది రెండు నాల్కల ధోరణి అని విమర్శించే ఆప్, మహారాష్ట్ర హామీల ఉదాహరణలతో వారిని ఎండగట్టాలని ఎత్తుగడ. మరో పక్క కాంగ్రెస్ ‘ఢిల్లీ న్యాయయాత్ర’ ప్రారంభించింది. ఆప్ పాలన బాగోలేదనే విమర్శతో...‘ఢిల్లీ ఇక సహించదు’ అనే నినాదాన్ని ప్రచారం చేస్తోంది.
పొత్తుతో ‘ఆప్’కి మేలా, కీడా?
ఢిల్లీలో 70 సీట్లకు ఒంటరిగానే పోటీచేస్తామని అటు కాంగ్రెస్, ఇటు ‘ఆప్’ ప్రకటించాయి. ఇక రాబోయేది మూడు ముక్కలాటే! సహజంగానే ‘ఇండియా’ కూటమి మిత్రులుగా ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీచేస్తాయనుకుంటారు. లోక్‌సభ ఎన్నికల్లో అలాగే చేశాయి. కానీ, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరుగా బరిలోకి దిగాయి. 2013 నుంచి ఢిల్లీ రాజకీయాల్లో సమీకరణాలు మారుతూ వస్తున్నాయి. షీలా దీక్షిత్ సీఎంగా మూడు పర్యాయాలు ఢిల్లీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పతనం 2013 నుంచే మొదలైంది.
ఆ ఎన్నికల్లో 24.7 శాతం ఓట్లు పొందిన కాంగ్రెస్‌కు 2015లో 9.7%, 2020లో 4.3% ఓట్లే దక్కాయి. 2013లోనే 29.7% ఓట్లతో ఆధిక్యత ప్రారంభించిన ఆప్, 2015లో 54.5% ఓట్లు సాధిస్తే, 2020లో 53.8% ఓట్లు దక్కించుకుంది. మూడు మార్లూ గెలిచింది. పదేళ్లుగా పాలకపక్షం ‘ఆప్’ మీద ప్రభుత్వ వ్యతిరేకత ఉందనీ, దాన్ని సొమ్ము చేసుకుంటూ తాను పూర్వవైభవం సాధించాలనీ కాంగ్రెస్ భావిస్తోంది. ఇదే ఆలోచన బీజేపీది.
కాంగ్రెస్ – బీజేపీ మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే... అది ‘ఆప్’కే లాభం! కాంగ్రెస్‌తో కలిసి ఆప్ పోటీ చేస్తే, లాభం ఉంటుందనే గ్యారెంటీ లేకపోగా ప్రభుత్వ వ్యతిరేక ఓటులో కాంగ్రెస్ అంటే గిట్టని వారి ఓటు... బీజేపీకి అనుకూలంగా కేంద్రీకృతమయ్యే ఆస్కారాన్ని శంకిస్తున్నారు. మూడు పార్టీల వ్యూహకర్తలు ఎలా ఆలోచిస్తారో చూడాలి. 2013లో 70 చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ 8 స్థానాల్లో నెగ్గితే, 69 పోటీ చేసిన ఆప్ 28 సీట్లు. 66 పోటీ చేసిన బీజేపీ 31 సీట్లు గెలిచాయి.
2015లో ఫలితాల సునామీ సృష్టించిన ఆప్ 70 చోట్ల పోటీ చేసి 67 గెలిచి, ప్రత్యర్థుల్ని ‘చీపురు’ పెట్టి ఊడ్చింది. 69 చోట్ల పోటీ చేసిన బీజేపీకి 3 సీట్లు లభిస్తే, మొత్తం 70 స్థానాలకూ పోటీ చేసిన కాంగ్రెస్ ఒకచోట కూడా గెలువలేకపోయింది. 2020 లోనూ సుమారు అటువంటి పరిస్థితే! కాంగ్రెస్ (0), బీజేపీ (8) లపై మళ్లీ ఆప్ (62) ఏకపక్ష ఆధిక్యత సాధించింది.
ఓటరు పరిణతి వేరు
పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్ని ఢిల్లీ ఓటర్లెప్పుడూ వేర్వేరు వేదికలుగానే చూస్తారు. జాతీయాంశాల పరంగా లోక్‌సభ ఎన్నికల్లో తీర్పిస్తే, దైనందినాంశాలు, పౌర సదుపాయాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలను, వాటి పనితీరును కొలుస్తుంటారు. అక్కడే ‘ఆప్’ క్లిక్ అయింది. తాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్యం, రవాణా వంటి అంశాల్లో శ్రద్ధ వహిస్తూ, ఢిల్లీ ఓటర్లతో తన నిబద్ధత చాటుకుంది. అర్బన్ ఓటర్లను ఆకట్టుకోగలిగింది.
సర్కారు బడుల్ని మెరుగుపరచడం, మొహల్లా ఆస్పత్రుల్ని బాగుచేయడం, ఉచితంగా 400 లీటర్ల వరకు తాగునీరు, 200 యూనిట్ల వరకు విద్యుత్తు, మహిళలకు బస్సులో ప్రయాణ సదుపాయం వంటివి కల్పించడం సంక్షేమపరంగా పెద్ద ముందడుగు. పన్ను చెల్లింపుదారలకు న్యాయం చేసే సర్కారు జవాబుదారీతనం, అవినీతి రహిత పాలననూ ఆప్ ప్రచారం చేసుకుంది.
కానీ, ఢిల్లీ మద్యం పాలసీ కేసు వల్ల ఆప్ ప్రభుత్వం అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయిందంటూ ప్రత్యర్థులు ప్రచారం చేసే ఆస్కారం వచ్చింది. దీన్ని బీజేపీ ఎలా వాడుకుంటుందో చూడాలి. ఆ కేసులో, ముఖ్యమంత్రి హోదాలో అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఉపముఖ్య మంత్రి మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్ తదితర ఆప్ ముఖ్యులు అరెస్టయ్యారు. కేజ్రీవాల్ సీఎం పదవికే రాజీనామా చేశారు.
అది కేవలం బీజేపీ కక్ష సాధింపేనని తిప్పికొట్టిన ఆప్ నాయకత్వం, నిర్దోషులుగానే నేతలు బయటపడతారని చెబుతోంది. ‘పాక్షిక రాష్ట్ర హోదా కల్గిన ఢిల్లీపై, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ద్వారా దొడ్డిదారి అధికారం చలాయిస్తూ, ఆప్ ప్రతిష్ఠ్ మసకబారేలా బీజేపీ నాయకత్వం కుయుక్తులు పన్నుతోందని ఆప్ విమర్శిస్తోంది.
నాడి పట్టడంలో బీజేపీ విఫలం
ఎక్కువ నగర, తక్కువ గ్రామీణ జనాభాతో ఉండే ఢిల్లీ ఒకప్పుడు బీజేపీకి ఓటు బ్యాంకు. కానీ, 1998 తర్వాత సీన్ మారింది. ప్రస్తుత సమీకరణాల్లో ఢిల్లీ వాసుల నాడి పట్టలేకపోతోంది. పాతతరం – కొత్తతరం, సంపన్నులు–పేదలు, స్థానికులు–వలసజీవులు... ఇలా వైవిధ్యంగా ఉన్న సమూహాల్లో బీజేపీకి ఆధిపత్యం దొరకటం లేదు. ఒకప్పుడు తిరుగులేని పట్టున్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎమ్సీడీ) ఎన్నికల్లోనూ బీజేపీకి క్రమంగా పట్టు జారుతోంది. 98 శాతం ఢిల్లీ అర్బన్ జనాభా 75 శాతం విస్తీర్ణంలో నివాసముంటుంది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో 7 పార్లమెంటు స్థానాలూ గెలిచిన బీజేపీకి, 52 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిక్యత దక్కింది. ఆప్ (10), కాంగ్రెస్ (8) కు నాలుగోవంతు సీట్లలోనే ఆధిక్యత వచ్చింది. కలిసి పోటీ చేసిన ఆప్ (24.17%), కాంగ్రెస్ (18.19%)ల ఉమ్మడి ఓటు వాటా (42.36%) కన్నా బీజేపీ వాటా (54.35%) ఎక్కువ! 2008 నుంచీ బీజేపీ గెలవని అసెంబ్లీ స్థానాలు 23 ఉంటే, కాంగ్రెస్ గెలవని స్థానాలు 25 ఉన్నాయి. 2013 నుంచి ఆప్ గెలవని స్థానం ఒకటే! 2013, 2015, 2020 అన్ని ఎన్నికల్లోనూ వారు గెలుస్తూ వస్తున్న స్థానాలు 26 ఉన్నాయి.
ఆప్ ఓ నాలుగు లోక్‌సభ స్థానాలు పంజాబ్‌లోనైనా గెలిచింది తప్ప ఢిల్లీలో ఖాతాయే తెరవలేదు. ఢిల్లీ మహానగరంలో సామాజిక వర్గాల సమీకరణం కూడా ఈ వైవిధ్య ఫలితాలకు కారణమే! ఢిల్లీ 70 అసెంబ్లీ సీట్లలో... బిహార్, యూపీ రాష్ట్రాల వలసదారుల ఆధిపత్యమున్నవి 17 స్థానాలయితే, అంతే సంఖ్య స్థానాల్లో పంజాబీలు (14 శాతం జనాభా) నిర్ణాయకశక్తిగా ఉంటారు. స్థానికంగా పట్టు కలిగిన గుజ్జర్లు, జాట్లవి ఓ 10 స్థానాలు.
ఢిల్లీ మొత్తంలో 12% జనాభా కలిగిన ముస్లింలు 30% మించిన ఓటర్లతో, నిర్ణాయకంగా ఉన్నవి 6 నియోజకవర్గాలు. అన్ని వర్గాలు మిళితమై నిర్దిష్టంగా ఎవరికీ ఆధిక్యత లేని నియోజకవర్గాలు 20 వరకుంటాయి. ఇన్ని వైవిధ్యాల మధ్యనున్న దేశ రాజధాని అసెంబ్లీ పీఠం గురించి ఎన్ని ఎత్తుగడలేసినా... బీజేపీకి, ఇంకా ఢిల్లీ బహుదూరమే (అభీ ఢిల్లీ బహుత్ దూర్ హై)!
దిలీప్ రెడ్డి
వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,
పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment