అభిప్రాయం
భారత్‌ను ‘కాంగ్రెస్ ముక్త్’ చేస్తానన్న మోదీ తన విధానాల ద్వారా అదే కాంగ్రెస్ పునరుద్ధరణకు తన వంతు కృషి చేశారు. ఫలితంగా బీజేపీ మెజారిటీ తగ్గింది. కేంద్రంలో సంకీర్ణం అనివార్యమైంది. ఎన్డీయే ప్రభుత్వ సుస్థిరతకు బలహీనపడిన మోదీ ఏం చేస్తారు? సంకీర్ణాల కంటే ఒకే పార్టీ మెజారిటీ ప్రభుత్వాలే మంచివనే అభిప్రాయం ఉంది. వాస్తవాలు దీనికి భిన్నంగా ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి, పేదరికం తగ్గింపు, ఉపాధి పెరుగుదల వంటి అంశాల పరంగా దేశానికి అత్యుత్తమ కాలం 1991 నుండి 2014 వరకు గల పావు శతాబ్దం. పీవీ నరసింహరావు, వాజ్‌పేయి, మన్మోహన్‌సింగ్ లాంటి పెద్దమనుషులు అప్పటి సంకీర్ణ ప్రభుత్వాలకు నాయకత్వం వహించారు. మోదీ వారిలా వ్యవహరించగలరా?
అమెరికా పౌరహక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌కు ఒక కల ఉండేది. చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్‌కు ఒక కల ఉంది. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి వెళుతున్నప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఒక కల ఉండింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 400కు పైగా సీట్లు వస్తాయని ఆయన ఊహించారు. ఈ వారం ఆ కల చెదిరిపోయింది. 2014లో బీజేపీని పునరుద్ధరించడం మోదీ చేసిన ప్రధాన రాజకీయ తోడ్పాటు. కాగా, 2024లో ఆయన చేసిన అతిపెద్ద రాజకీయ దోహదం భారత జాతీయ కాంగ్రెస్ పునరుద్ధరణ.
నిజానికి, రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’తో తన సొంత గుర్తింపులోకి వచ్చారు. మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీకి పరిణతి చెందిన, వివేకవంతమైన నాయకత్వాన్ని అందించారు. అయితే మోదీ తన రెండవ పాలనా కాలంలో చేపట్టిన విధానాలు, విభజన రాజకీయాలు, అథమ స్థాయి ఎన్నికల ప్రచార సరళి అనేవి టోకున కాంగ్రెస్ అదృష్టాన్ని పునరుద్ధరించడంలో తమ పాత్రను పోషించాయి. భారత్‌ను ‘కాంగ్రెస్ ముక్త్’గా మారుస్తానని మోదీ 2014 ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 2024 ఎన్నికల ముగింపులో, అదే కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరణలో తన వంతు కృషి చేసినందుకు మోదీకి ఆ పార్టీ కృతజ్ఞతలు చెప్పాలి. ఒక దశాబ్ద కాలంగా వెనుకబడి పోయిన దశ నుండి యవ్వన, శక్తిమంతమైన కాంగ్రెస్ ఉద్భవించింది.
మోదీ మూడోసారి ప్రధానిగా చరిత్ర సృష్టించబోతున్నారు. ప్రశ్న ఏమిటంటే, ఎన్డీయే ప్రభుత్వ సుస్థిరతకు బలహీనపడిన మోదీ ఏం చేస్తారు? మరీ ముఖ్యంగా, నారా చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ వంటి మిత్రపక్షాలపై ఆధారపడబోతున్న ఎన్డీయే ప్రభుత్వ విధానం ఎలా ఉండబోతోంది? మరోసారి ప్రభుత్వ స్థాపన కోసం మోదీ తన ‘హామీలు’ ఇచ్చారు. అధికారం కోసం మోదీ పక్షాన ఉన్నప్పటికీ చంద్రబాబు గానీ, నితీష్‌గానీ బీజేపీ ఎజెండా వైపు సైద్ధాంతికంగా మొగ్గు చూపడం లేదు. మరి ఈ కలయిక పనిచేస్తుందా?
2024 జూన్ చాలావరకు 2004 మే లాగా అనిపిస్తుంది. ప్రతి రాజకీయ విశ్లేషకుడు, ఎన్నికల నిపుణుడు నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో ఎన్డీయే విజయం సాధిస్తుందని అంచనా వేశారు. కానీ ఫలితాలు రాగానే స్టాక్ మార్కెట్ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. కొన్ని గంటల్లోనే, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్(యూపీఏ) అనే కొత్త కూటమికి శంకుస్థాపన జరిగింది. లెఫ్ట్ ఫ్రంట్ బయటి మద్దతుతో మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అమిత్ షా... ప్రమోద్ మహాజన్ కావచ్చు గానీ మోదీ మాత్రం వాజ్‌పేయి కాదు. వాజ్‌పేయి వెనక్కి తగ్గారు. కానీ మోదీ, షా వెనక్కి తగ్గుతారా? మొత్తానికి ఎన్నికల ప్రచారం ‘మోదీ కి గ్యారంటీ’ గురించే. ఆయన హామీలను నిలబెట్టడానికి ఎన్డీయే ప్రభుత్వం సుముఖంగా ఉంటుందా?
చంద్రబాబు, నితీష్‌లపై దేశం ఒక ముఖ్యమైన బాధ్యతను మోపింది. ఇద్దరూ చిత్తశుద్ధి లేదా దార్శనిక దృష్టి గల వ్యక్తులుగా నిరూపితం కాలేదు. ఇద్దరూ స్వప్రయోజనాలు, అధికారం కోసం తహతహలాడుతున్నారు. అయినప్పటికీ, సాధారణ వ్యక్తుల నుండి హీరోయిజాన్ని డిమాండ్ చేసే విచిత్రమైన మార్గం చరిత్రకు ఉంది. విధి, రాజకీయాలు పీవీ నరసింహారావుకు ఎలాంటి పాత్రను కేటాయించడం జరిగిందో గుర్తుంచుకోండి. రాజకీయ విరమణ అంచున, ఆధ్యాత్మిక మార్గం పట్టడానికి తన బ్యాగులను సర్దుకుంటూన్న పీవీ నరసింహారావును ప్రధానమంత్రిని చేయడమే కాకుండా, దేశ విధిని మార్చే నిర్ణయాలను తీసుకునే బాధ్యతను కూడా చేపట్టేలా చేశాయి.
మోదీ, షాల ఆధిపత్యంలో, నియంత్రణలో ఉన్న ప్రభుత్వానికి జూనియర్ భాగస్వాములుగా ఉన్న నితీష్, చంద్రబాబు అలాంటి పాత్ర పోషించగలరా? కష్టమే మరి. ఎందుకంటే ప్రధానమంత్రి ఆదేశం మేరకు అన్ని సంస్థలు ప్రతిరోజూ వారిని అదుపులో ఉంచుతాయి. మోదీ తన జీవిత పర్యంతం కఠినమైన రాజకీయ బేరసారాలను సాగిస్తూ వచ్చారు. సుష్మా స్వరాజ్‌ను పక్కన పెట్టి, అరుణ్ జైట్లీని తన విశ్వాసంలోకి తీసుకుని, లాల్ కృష్ణ అద్వానీ నుంచి బీజేపీని ఆయన ఎలా లాక్కున్నారో గుర్తు చేసుకోండి. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే...
చంద్రబాబు, నితీష్ అలాంటి బేరాలు చేసేంత గట్టిగా ఉండగలరా? సంకీర్ణ ప్రభుత్వాల కంటే ఒకే పార్టీ మెజారిటీ ప్రభుత్వాలే మంచివి అని ఒక సాధారణ అభిప్రాయం ఉంది. కానీ వాస్తవాలు దీనికి భిన్నంగా ఉన్నాయి. అనేక విధాలుగా, స్వాతంత్య్రానంతర మొదటి దశాబ్దం తర్వాత... ఆర్థికాభివృద్ధి, పేదరికం తగ్గింపు, ఉపాధి పెరుగుదల, ప్రపంచ ప్రొఫైల్ మరియు దేశీయ సామాజిక స్థిరత్వం వంటి అంశాల పరంగా దేశానికి అత్యుత్తమ కాలం 1991 నుండి 2014 వరకు గల పావు శతాబ్దం.
ముగ్గురు మేధావులు, అందరినీ కలుపుకొనిపోయే వివేకవంతులైన పెద్దమనుషులు భారతదేశ ప్రధానులు అయ్యారు. పీవీ నరసింహా రావు, అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ అప్పటి సంకీర్ణ ప్రభుత్వాలకు నాయకత్వం వహించారు. పీవీ విషయంలో కాంగ్రెస్ పార్టీయే స్వయంగా ఒక సంకీర్ణంలా పనిచేసింది. వాజ్‌పేయి, మన్మోహన్ స్పష్టమైన సంకీర్ణాలకు నాయకత్వం వహించారు. ఖర్గే వంటి మరో ప్రసన్నమైన పెద్దమనిషి నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే, అది సుస్థిరతతో పాటు వివేకవంతమైన విధానాలను అందించదని నమ్మడానికి ఎటువంటి కారణమూ లేదు.
మోదీ వ్యక్తిత్వం, భావజాలం, ఆకాంక్షల దృష్ట్యా ఆయన మూడవసారి తన అధికార అన్వేషణలో అన్ని ప్రయత్నాలూ చేస్తారు. సంకీర్ణానికి ఆయన ఎలాంటి ప్రధానమంత్రి అవుతారో చూడాలి. తాను ఎలా ప్రవర్తిస్తారు, ఎలా పని చేస్తారు అనేది తన మిత్రపక్షాలు, తన సీనియర్ సహోద్యోగులు, బ్యూరోక్రసీ, జ్ఞానం, ధైర్యంపై ఆధారపడి ఉంటుంది. బ్యూరోక్రసీని వంగమని అడిగినప్పుడు తరచుగా అది పొర్లుదండాలు పెడుతుంది. మోదీ, షా పాలన భారత ప్రజాస్వామ్యంలోని ప్రతి వ్యవస్థనూ నిర్వీర్యం చేసింది. చంద్రబాబు, నితీష్ వారిని అదుపు చేయగలరా?
కన్యాకుమారి నుంచి న్యూఢిల్లీకి వెళ్లే విమానంలో మోదీ మూడు కీలకాంశాలను పేర్కొంటూ ఒక వ్యాసం రాశారు. మొదటిది – ఇక మీదట ఇండియా... భారత్ మాత్రమే! అధికారికంగా ఈ మార్పు చేయాలంటే, దానికి రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. దీనిపై ఆయన ముందుకు సాగలేరు. రెండవది– ‘జీవితంలో ప్రతి అంశంలో’ దేశానికి సంస్కరణ అవసరమని సూచించడం ద్వారా మోదీ ‘సంస్కరణ’ అనే పదానికి కొత్త నిర్వచనాన్ని వివరించారు.
తాజాగా బలహీనపడిన మోదీ అటువంటి సంస్కరణకు నాయకత్వం వహించగలనని భావిస్తున్నారా? మూడవది– దేశం ‘కొత్త కల’ కనవలసిన అవసరాన్ని ప్రస్తావిస్తూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను మోదీ అనుకరించారు. ఒక దశాబ్దం క్రితం ‘అమెరికన్ డ్రీమ్’లోంచి జిన్‌పింగ్ ‘చైనా డ్రీమ్’ను ఎక్కువ భాగం అరువు తెచ్చుకున్నారు. కాకపోతే అమెరికన్ స్వప్నం, చైనా స్వప్నం రెండూ ‘మంచి జీవితాన్ని గడపడం’ గురించినవి. దేశ ప్రజలు ‘వికసిత్ భారత్’ కావాలని కల కనాలని మోదీ అంటున్నారు.
తదుపరి కేంద్ర ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహిస్తారనే దానితో సంబంధం లేకుండా భారతదేశం ‘వికసిత్’గా ఉంటుంది. కాబట్టి, లోక్‌సభలో 400కు పైగా స్థానాల మోదీ కల సాకారం కానప్పటికీ, అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే దేశ స్వప్నం మాత్రం కాలక్రమేణా సాకారం అవుతుంది. బీజేపీ, ఇంకా మోదీ విషయానికొస్తే, ఓటర్ల మేల్కొలుపు పిలుపుతో వారి కలలు చెదిరిపోయాయి.
సంజయ్ బారు
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment