
ఇండియా ఈ ఏడాది అక్టోబర్ 31నసర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 150వ జయంత్యుత్సవం జరుపుకోబోతోంది. జనం మర్చి పోయిన పటేల్ గుణగణాలు కొన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. తన సహోదరు లను ఆయన ఎంతో జాగ్రత్తగా చూసుకు న్నాడు. వల్లభ్‌కు నలుగురు సోదరులు. వారిలో ముగ్గురు తన కంటే పెద్ద వారు. ఆయన ఏకైక సోదరి దహిబా అందరికంటే చిన్నది. సంతానంలో మధ్యవాడు కాబట్టి వల్లభాయికి చిన్నతనంలో తగినంత మన్నన, ఆప్యాయత లభించలేదు. ఈ అనాదరణే ఆయనను ఒక వాస్తవవాదిగా, యోధుడిగా మార్చింది. తండ్రి ఝవేర్ భాయ్ ఎప్పుడూ ధనికుడు కాదు. పైగా కాలక్రమంలో ఉన్నది కూడా కరిగిపోయింది. వల్లభ్ తెలివైన వాడు, విశాల హృదయుడు. కాబట్టే, తోడబుట్టిన అయిదుగురి బాగోగులు, డబ్బు అవసరాలు తనే చూసుకున్నాడు.
వల్లభ్ దయాగుణం నుంచి ఆయన చిన్నన్న విఠల్ భాయ్ అత్యధికంగా ప్రయోజనం పొందాడు. మన స్వాతంత్య్రోద్యమ హీరో కూడా అయిన విఠల్ 1933లో యూరప్‌లో అనారోగ్యంతో చనిపోయాడు. ఆ సమయంలో సుభాష్ చంద్రబోస్ ఆయనకు సుశ్రూషలు చేశాడు. విఠల్ భాయ్ 1925–30 కాలంలో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రెసిడెంట్‌గా వ్యవహరించాడు. ఈ ఇద్దరు సోదరులూ బొర్సాద్ (గుజరాత్) టౌనులో లాయర్లు. ఆ సమయంలో, వల్లభ్ లండన్ వెళ్లి బారిష్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అవసరమైన డబ్బు పొదుపు చేసుకుని పాస్ పోర్టు, టికెట్ సంపాదించాడు.
అయితే వీజే పటేల్, ప్లీడర్, బొర్సాద్ పేరిట ఆయనకు వచ్చిన కవరును పోస్ట్‌మన్ అదే పేరుతో నమోదై ఉన్న సోదరుడు విఠల్ ఇంటికి బట్వాడా చేస్తాడు. దీంతో విఠల్‌కు తానూ ఇంగ్లాండు వెళ్లి బారిష్టరు కావాలన్న ఆలోచన వచ్చింది. ముందు నువ్వు వెళ్తే నీకంటే పెద్దవాడినైన నేను ఆ తర్వాత వెళ్లలేను. నీ పాస్ పోర్టు, టికెట్‌తో నేను లండన్ వెళ్తాను అని తమ్ముడిని కోరతాడు. వల్లభ్ సరే అనడమే కాకుండా విఠల్ లండన్ చదువుకు డబ్బు కూడా సమకూర్చాడు. ఆయన కుటుంబ భారాన్నీ మోశాడు. నాలుగేళ్ల తర్వాత 1910లో తనూ లండన్ వెళ్లి అద్భుత ప్రతిభ కనబరచి, 1912లో బారిష్టర్ పట్టాతో ఇండియా తిరిగి వస్తాడు.
జైల్లో ఉండి కూడా సర్దార్ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ తన సాటి సమర యోధులను ఎందరినో ఆర్థికంగా ఆదుకునేవాడని, వారి వైద్య ఖర్చులకు సాయం చేసేవాడని... పటేల్ జీవిత చరిత్ర కోసం 1987 ఏప్రిల్లో నేను ముంబాయిలో ఇంటర్వ్యూ చేసినప్పుడు మురార్జీ దేశాయ్ చెప్పారు. సాటి సమర యోధుల ఇక్కట్లను చూసి మన ఉక్కుమనిషి హృదయం ఇట్టే కరిగిపోయేది. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జీవితంలో ఆయన ఔన్నత్యాన్ని చాటిచెప్పే గొప్ప సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అవి నేడు ఎంతమందికి తెలుసు? 1927 జులైలో పెను తుపాను రావడంతో గుజరాత్ విలవిల్లాడి పోయింది. ఆ సమయంలో బాధితులను ఆదుకునేందుకు అహ్మదా బాద్, పరిసర ప్రాంతాల్లోని ఎందరో ఆయన స్ఫూర్తితో ముందు కొచ్చారు. అప్పట్లో పటేల్ గుజరాత్ కాంగ్రెస్ కమిటీ, అహ్మదాబాద్ మునిసిపల్ కౌన్సిల్ రెంటికీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
సహాయక చర్యలు చేపట్టడంలో కనబరచిన దక్షతను గుర్తించి బ్రిటిష్ రాజ్ అధికారులు ఆయనకు తగిన బిరుదు ఇవ్వజూపారు. సమాధానంగా ఆయన బిగ్గరగా ఒక నవ్వు నవ్వారు. ‘సర్ వల్లభ్ భాయ్’ అని పిలిపించుకుంటే చాలామందికి అప్పుడు ఇప్పుడు సంబరంగా ఉండేదేమో. కాని, ఖేదా జిల్లా వాసులైన ఝవేరీభాయ్, లద్భా దంపతుల ఈ బిడ్డ ఎంతో గట్టి మనిషిగా, ఎన్నో కీలక పర్యవసానాలకు కారకుడిగా భారత దేశ భావితరాలకు తన ముద్రను మిగిల్చి వెళ్లేవాడా?
దాదాపు ఒక శతాబ్దం క్రితం 1920లలో మునిసిపల్ కౌన్సిల్ సారథిగా పటేల్ అహ్మదాబాద్‌ను ‘నడిపించాడు’. అలాగే జవహర్ లాల్ నెహ్రూ అలహాబాద్ ను ‘నడిపిస్తున్నాడు’. 1920–22 సహాయ నిరాకరణ ఉద్యమానికి 1930–33 శాసనోల్లంఘన ఉద్యమానికి మధ్య కాలమది. దేశం ఇతర ప్రాంతాల్లో, కోల్‌కతా మునిసిపాలిటీకి చిత్తరంజన్ దాస్, పాట్నా టౌన్ కౌన్సిల్‌కు రాజేంద్ర ప్రసాద్, ముంబాయి మునిసిపాలిటీకి విఠల్ భాయ్ పటేల్ సారథులుగా ఉన్నారు. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అప్పుడు నేర్చుకున్న పాఠాలు ఎంతగానో ఉపకరించాయి.
1948లో, వల్లభ్ భాయ్ పటేల్ నగర పాలక పాత్రకు ముగింపు పలికి రెండు దశాబ్దాలు ముగిసిన సందర్భంగా, ముంబాయిలో ఆయనకు పుర ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. స్వతంత్ర భారత ఉప ప్రధాని ఆ సభలో మాట్లాడుతూ, ‘‘ మీరు ఎన్నో విజయాలు ప్రస్తావించారు. వాటిలో కొన్ని నేను సాధించినవి. కొన్ని నేను సాధించనివి. కాని అభ్యంతరం లేకుండా నేను అంగీకరించే ఒక విషయం: అహ్మదాబాద్ మునిసిపాలిటీకి నా శక్తివంచన లేకుండా సేవ చేశాను. స్వచ్ఛమైన ఆనందం పొందాను... నగరంలోని మురికిపై పోరాడితే మీకు రాత్రి చక్కగా నిద్ర పడుతుంది. రాజకీయాలతో వ్యవహరించేటప్పుడు మీకు రాత్రి కూడా ప్రశాంతత ఉండదు’’ అని వ్యాఖ్యానించారు.
నగర బాధ్యతల నుంచి వైదొలగిన తర్వాత పటేల్ అసాధారణ నాయకత్వ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. 1928లో గుజరాత్‌లోని బార్డోలీ ప్రాంత రైతాంగం మీద బ్రిటిష్ పాలకులు విధించిన పన్నులకు వ్యతిరేకంగా సత్యాగ్రహ ఉద్యమాన్ని ఆయన విజయవంతంగా నిర్వహించారు. అప్పుడే అక్కడి ప్రజలు పటేల్‌కు ‘సర్దార్’ బిరుదు ఇచ్చారు.1916 నుంచీ వల్లభ్ భాయ్ పటేల్– నెహ్రూలు స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా ఉన్నారు. అయితే, 1937లో ఇద్దరూ కలిసి గుజరాత్‌లో ఒక వారం రోజులు పర్యటించినప్పుడు వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.
ఇద్దరూ జట్టుగా పనిచేశారు. పటేల్‌కు మహాత్మా గాంధీ ఒక లేఖ రాస్తూ, ‘‘ మీరిద్దరూ కలిసినప్పుడు, మీలో ఎవరు గట్టివారో చెప్పడం కష్టం’’ అని వ్యాఖ్యానించారు. తర్వాతి సంవత్సరాల్లో పటేల్– నెహ్రూల నడుమ ఉద్రిక్తతలు, అపోహలు, అప్పుడప్పుడు పరుష భాషణలు తలెత్తాయి. ఏమైనప్పటికీ, స్నేహం, ఒకరి మీద మరొకరికి ప్రశంసా భావన, పరస్పర విధేయత, గాంధీ పట్ల ఉభయుల విధేయత, స్వాతంత్య్ర పోరాటం పెంచిన బంధం... వాటికంటే బలమైనవి.ఆ తర్వాత స్వాతంత్య్రం వచ్చింది. సంబరాలు తెచ్చింది. వాటితో పాటే విభజన విషాదాలు ప్రజలు చవిచూశారు.
తాము ఉభయులం ఒకరికొకరుగా ఉండటం ఎంత అదృష్టమో వల్లభ్ భాయ్ పటేల్– నెహ్రూలు గుర్తించారు. 1950 జనవరిలో గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి స్వతంత్ర భారత తొలి దేశాధిపతి పదవీకాలం ముగిసిన అనంతరం దేశానికి తొలి రాష్ట్రపతి అయిన రాజేంద్ర ప్రసాద్ వీరిరువురినీ ప్రస్తావిస్తూ, ‘‘ప్రధాన మంత్రి, ఆయన తొలి సహచరుడైన ఉప ప్రధాన మంత్రి కలిసి దేశాన్ని అన్ని విధాలాసుసంపన్నం చేసే గొప్ప ఆస్తి అయ్యారు. మొదటి వారు సార్వజనీన ప్రేమను, రెండో వారు సార్వజనీన విశ్వాసాన్ని చూరగొన్నారు’’ అని చెప్పారు.
కాలం మారుతుంది. గడచిన దశాబ్దాలు మర్చిపోతారు. ఎడతెగని తప్పుడు ప్రచారం జరుగుతుంది. అది ఎంత హాని చెయ్యాలో అంత హాని చేస్తుంది. నెహ్రూ అవమానం పాలయ్యాడు. పటేల్ విగ్రహం ఆకాశాన్ని తాకుతోంది... కానీ, ఆయన జీవితానికి, ఆలోచనకు, ఆయన చేసిన కృషికి సంబంధించిన వాస్తవాలు పాతాళంలోకి వెళుతున్నాయి. ఈ పరిస్థితుల్లో 1940లు, 1950లు ఇంకా గుర్తున్న, పటేల్– నెహ్రూలు ఉభయులనూ కలిసిన, పటేల్ జీవితాన్ని పరిశోధించి ఆయన జీవిత చరిత్ర రాసిన నాలాంటి వాడు తనకు తెలిసిన వాస్తవాలు ఏమిటో చెప్పితీరాలి.
కాబట్టి, వారిద్దరి మధ్య నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాల నుంచి కొన్ని వాక్యాలు ఉటంకించి ఈ వ్యాసం ముగిస్తాను. 1948 ఫిబ్రవరి 3న సర్దార్ పటేల్‌కు నెహ్రూ రాసిన లేఖ నుంచి: ‘‘మనం ఒకరికొకరం సన్నిహితంగా ఉంటూ, ఎన్నో తుపానులనూ, ఇక్కట్లనూ కలసి కట్టుగా ఎదుర్కొని పావు శతాబ్దం గడచిపోయింది. ఈ కాలంలో మీ పట్ల నా గౌరవాభిమానాలు పెరిగాయని పూర్తి నిజాయితీతో చెప్పగలను...’’
1948 ఫిబ్రవరి 5న నెహ్రూకు సర్దార్ పటేల్ రాసిన లేఖ నుంచి: ‘‘మనం ఇద్దరం ఒక ఉమ్మడి లక్ష్య సాధనలో జీవితకాల మిత్రులు (కామ్రేడ్స్)గా ఉంటున్నాం. దృక్పథాలు స్వభావాలు విభేదించినా, మన దేశ అత్యున్నత ప్రయోజనాలు, మనకు ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమాభిమానాలు వాటిని అధిగమించేలా చేస్తూ మనల్ని కలిపి ఉంచుతున్నాయి.’’
-వ్యాసకర్త సంపాదకుడు, ప్రముఖ రచయిత, ‘పటేల్ – ఎ లైఫ్’ గ్రంథకర్త
-రాజ్‌మోహన్ గాంధీ