నేడు బతఖ్ మియా అన్సారీ జయంతి
జాతిపిత మహాత్ము ప్రాణాలు కాపాడిన ఓ త్యాగశీలి జన్మదినం నేడు. ఆయన పేరు బతఖ్ మియా అన్సారీ. 1869 జూన్ 25న బిహార్‌లోని మోతీహార్ గ్రామంలో జన్మించారు. బిహార్ లోని చంపారణ్ జిల్లాలో ఆహార పంటలు వదలి, నీలిమందు లాంటి వాణిజ్య పంటలు పండించమని బ్రిటిష్ వలస పాలకులు రైతులను నిర్బంధించేవారు, హింసించేవారు. ఈ అకృత్యాలను వివరించి అక్కడి రైతులను పరామర్శించమని ఆ ప్రాంతంవారు కొందరు గాంధీజీని అభ్యర్థించారు.
దీంతో 1917 ఏప్రిల్‌లో ఆయన అక్కడికి వెళ్లారు. దీంతో ఇర్విన్ అనే బ్రిటిష్ ఇండిగో ఎస్టేట్ మేనేజర్ గాంధీజీని భోజనానికి ఆహ్వానించి అంతం చేయాలని పథకం పన్నాడు. తన వంటమనిషి బతఖ్ మియా అన్సారీని పిలిచి, గాంధీజీకి పాలలో విషం కలిపి ఇచ్చి చంపాలని ఆదేశించాడు.
ఈ పని చేస్తే జీతం పదింతలు పెంచుతాననీ, విలువైన భూములు ఇస్తాననీ చెప్పాడు. బాబూ రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి గాంధీజీ భోజనానికి వచ్చారు. ఇర్విన్ ఆజ్ఞను ధిక్కరిస్తే గతి ఏమవుతుందో తెలిసినప్పటికీ, పాలు అందిస్తూనే అందులో విషం కలిపిన విషయాన్ని ఆయన గాంధీజీకి చెప్పి ఆయన ప్రాణాలు రక్షించారు. అగ్గిమీద గుగ్గిలమైన ఇర్విన్ ఆ తరువాత అన్సారీ ఇంటినీ, ఆయనకున్న కొద్దిపాటి భూమినీ జప్తుచేయించి ఊరి నుండి వెళ్ళగొట్టాడు.
1950లో మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ మోతీహార్ వెళ్ళి ఒక సభలో ప్రసంగిస్తుండగా తనను కలవడానికి ప్రయత్నిస్తున్న అన్సారీని వేదికపైకి పిలిచి ఆప్యాయంగా గుండెలకు హత్తుకున్నారు. ఇర్విన్ అకృత్యాలు విని విచలితుడై అప్పటికప్పుడు 50 ఎకరాల భూమిని అన్సారీ, ఆయన ముగ్గురు కుమారుల కుటుంబాలకూ కేటాయించాల్సిందిగా ఆదేశించారు. అన్సారీ ఏడేళ్ళపాటు కార్యాలయాల చుట్టూ తిరిగినా రాష్ట్రపతి ప్రకటించిన భూమి ఆయనకు దక్కలేదు.
చివరికి 1957 డిసెంబర్ 4న కన్నుమూశారు. మొత్తంమీద ఒక ఆరు ఎకరాల భూమిని ఓ నది ఒడ్డున జిల్లా కలెక్టర్ కేటాయించారు. ప్రస్తుతం నది కోతకు గురై ఐదెకరాల భూమి మాయమై ఎకరం మిగిలింది. ఇప్పటికీ తమకు రావలసిన భూమికోసం అన్సారీ కుటుంబీకులు అర్జీలు పట్టుకుని తిరుగుతూనే ఉన్నారు. – ఎమ్.డి. ఉస్మాన్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment