freedom fight
-
లాంగ్ లివ్ ద రిపబ్లిక్
డెబ్బయ్ ఐదు సంవత్సరాలు. కాలగమనంలో ఇదొక కీలకమైన మైలురాయి. ఆనాడు భారత ప్రజలు ప్రకటించుకున్న ప్రజా స్వామ్య రిపబ్లిక్ నేడు ఈ మజిలీకి చేరుకున్నది. ఈ ప్రయాణ మంతా సాఫీగానే జరిగిందని చెప్పలేము. ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఎటుచూస్తే అటు చీకటి ముసిరిన చేటు కాలాన్ని కూడా దాటవలసి వచ్చింది. దారి పొడుగునా ఎగుడు దిగుళ్లూ, ఎత్తుపల్లాలూ ఇబ్బందులు పెట్టాయి. అయినా మన రిపబ్లిక్ రథం వెనుదిరగలేదు. వెన్ను చూపలేదు. రాజ్యాంగ దీపం దారి చూపగా మున్ముందుకే నడిచింది.సుదీర్ఘ ప్రయాణం ఫలితంగా మన రిపబ్లిక్ ఎంతో పరిణతి సాధించి ఉండాలి. అందువల్ల ఇకముందు సాగే ప్రయాణం నల్లేరుపై బండిలా సాగుతుందని ఆశించాలి. ప్రతిష్ఠాత్మకమైన శతాబ్ది మైలురాయిని తాకేందుకు ఉరకలెత్తే ఉత్సాహంతో సాగిపోతామనే ధీమా మనకు ఏర్పడి ఉండాలి. కానీ, అటువంటి మనో నిబ్బరం నిజంగా మనకున్నదా? మన రిపబ్లిక్కు ఆయువు పట్టయిన రాజ్యాంగం ఇకముందు కూడా నిక్షేపంగా ఉండగలదనే భరోసా మనకు ఉన్నట్టేనా? రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలన్నీ ఆశించిన విధంగానే పనిచేస్తున్నాయని గుండెల మీద చేయి వేసుకొని చెప్పుకోగలమా?మన స్వాతంత్య్రం ఎందరో వీరుల త్యాగఫలం. ఆ స్వాతంత్య్రానికి సాధికార కేతనమే మన గణతంత్రం. స్వాతంత్య్ర పోరాటంలో భారత జాతీయ కాంగ్రెస్ ఒక ప్రధాన స్రవంతి మాత్రమే! ఇంకా అటువంటి స్రవంతులు చాలా ఉన్నాయి. ఆ పార్టీ పుట్టకముందు కూడా ఉన్నాయి. మహాత్మాగాంధీ ఆ పోరాటాన్ని ఫైనల్స్‌కు చేర్చిన టీమ్ క్యాప్టెన్ మాత్రమే. రెండొందల యేళ్లలో అటువంటి క్యాప్టెన్లు చాలామంది కనిపిస్తారు. ఈస్టిండియా కంపెనీ రోజుల్లోనే బ్రిటీషర్ల దాష్టీకంపై తిరగబడిన వీర పాండ్య కట్టబ్రహ్మన, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి పాలె గాళ్ల వీరగాథలు మనం విన్నవే.ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందుగా, ఆ తర్వాత కూడా బ్రిటీష్ పాలనపై ఎందరో గిరిజన యోధులు తిరగ బడ్డారు. బిర్సాముండా, తిల్కా మాఝీ, సిద్ధూ–కన్హూ ముర్ములు, అల్లూరి దళంలోని సభ్యులు వగైరా అటవీ హక్కుల రక్షణ కోసం, స్వేచ్ఛ కోసం ప్రాణాలు ధారపోశారు. తొలి స్వాతంత్య్ర పోరుకు నాయకత్వం వహించిన చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వేలాదిమంది ముస్లిం స్వరాజ్య యోధుల దిక్సూచి. బ్రిటీషర్ల ఆగ్రహానికి గురై బర్మాలో ప్రవాస జీవితం గడిపిన జాఫర్ కనీసం తాను చనిపోయిన తర్వాతైనా తన మాతృదేశంలో ఖననం చేయాలని పాలకులను అభ్యర్థించారు.స్వాతంత్య్ర పోరాటంలో అంతర్భాగంగా, సమాంతరంగా దేశవ్యాప్తంగా ఎన్నో రైతాంగ పోరాటాలు జరిగాయి. అందులో కొన్ని సాయుధ పోరు రూపాన్ని తీసుకున్నాయి. జమీందారీ, జాగీర్దారీ దోపిడీ పీడనకు వ్యతిరేకంగా రైతులు తిరగబడ్డారు. ఈ విధంగా భిన్నవర్గాల, విభిన్న తెగల ఆకాంక్షలు, ఆశలూ ఈ పోరాటంలో ఇమిడి ఉన్నాయి. వేరువేరు భాషలు, విభిన్నమైన సంస్కృతులు, ఆచార వ్యవహారాలతో కూడిన సువిశాల భారత దేశ ప్రజల మధ్య భిన్నత్వంలో ఏకత్వాన్ని స్వాతంత్య్రోద్యమం సాధించగలిగింది. ఆ ఉద్యమాన్ని నడిపిన జాతీయ నాయకత్వా నికి ఈ భిన్నత్వంపై అవగాహనా, గౌరవం ఉన్నాయి.స్వతంత్ర దేశంగా అవతరించడానికి కొన్ని గంటల ముందు పండిత్ నెహ్రూ దేశ ప్రజలనుద్దేశించి చేసిన ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ ప్రసంగం చరిత్రాత్మకమైనది. ఆ రోజునే ఆయన దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం అందవలసి ఉన్నదనీ, సమాన అవకాశాలు కల్పించవలసి ఉన్నదనీ స్పష్టం చేశారు. మత తత్వాన్ని, సంకుచిత మనస్తత్వాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించరాదని ఆనాడే ఆయన నొక్కిచెప్పారు. ఆ తర్వాత మూడేళ్లపాటు జరిగిన రాజ్యాంగ సభ చర్చల్లోనూ ఇదే విచారధార ప్రధాన భూమికను పోషించింది. స్వేచ్ఛ, సమా నత్వం, సౌభ్రాతృత్వం పునాదులుగా డాక్టర్ అంబేడ్కర్ నేతృత్వంలో రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది.ప్రపంచంలోని లిఖిత రాజ్యాంగాలన్నింటిలో విపుల మైనది, పటిష్ఠమైనది భారత రాజ్యాంగమే. భవిష్యత్తులో దేశం నియంతృత్వంలోకి జారిపోకుండా చెక్స్అండ్ బ్యాలెన్సెస్లతో కూడిన రాజ్యాంగ వ్యవస్థలకు రూప కల్పన చేశారు. భారత్‌తోపాటు అదే కాలంలో స్వాతంత్య్రం సంపాదించుకున్న అనేక దేశాలు అనంతరం స్వల్పకాలంలోనే సైనిక పాలనల్లోకి, నిరంకుశ కూపాల్లోకి దిగజారిపోయాయి. వాటన్నింటి కంటే పెద్ద దేశమైన భారత్ మాత్రం కాలపరీక్షలను తట్టుకొని ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టుకోగలిగింది.ఇందుకు మనం మన అద్భుతమైన రాజ్యాంగానికీ, దాని రూప కర్తలకూ ధన్యవాదాలు సమర్పించుకోవలసిందే! మన పాలకుడు ఎంత గొప్ప మహానుభావుడైనప్పటికీ సర్వాధికారాలను అతనికే అప్పగిస్తే చివరికి మిగిలేది విధ్వంసమేనని జాన్ స్టూవర్ట్ మిల్ చేసిన హెచ్చరికను రాజ్యాంగ సభలో డాక్టర్ అంబేడ్కర్ ప్రస్తావించారు. ఇందిరాగాంధీపై మొదలైన వ్యక్తి పూజ ‘ఇందిరే ఇండియా’ అనే స్థాయికి చేరి పోయిన తర్వాత ఏం జరిగిందనేది మనకు తెలిసిందే! మన ప్రజాస్వామ్యానికి ఎమర్జెన్సీ అనేది ఒక మచ్చగా ఎప్పటికీ మిగిలే ఉంటుంది. ఇందిర తర్వాత ఆ స్థాయిలో ప్రస్తుత నరేంద్ర మోదీ వ్యక్తి పూజ కనిపిస్తున్నది. ఒక సందర్భంలో ఆయనే స్వయంగా ‘అయామ్ ది కాన్స్టిట్యూషన్’ (నేనే రాజ్యాంగం) అని ప్రకటించుకోవడం ఈ వీరపూజ ఫలితమే! ఫ్రెంచి నియంత పధ్నాలుగో లూయీ చేసిన ‘అయామ్ ది స్టేట్’ ప్రకటనకు ఇది తీసిపోయేదేమీ కాదు.ఈ దేశంలో ప్రజాస్వామ్యం చిరకాలం వర్ధిల్లడం కోసం రాజ్యాంగ నిర్మాతలు ఏర్పాటు చేసిన కొన్ని వ్యవస్థలు బీటలు వారుతున్న సూచనలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అధినాయకుని వీరపూజల ముందు వ్యవస్థలు నీరుగారుతున్న వైనాన్ని మనం చూడవచ్చు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్నీ, ఫెడరల్ తరహా పాలననూ రాజ్యాంగం ఆకాంక్షించింది. ఫెడరల్ అనే మాటను వాడకపోయినా ‘యూనియన్ ఆఫ్ ది స్టేట్స్’ అనే మాటను వాడారు. ఈ మాటలో రాష్ట్రాలకే ప్రాదేశిక స్వరూపం ఉన్నది తప్ప కేంద్రానికి కాదు.కేంద్ర ప్రభుత్వం కూడా బలంగానే ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించిన మాట నిజమే. దేశ విభజన అనంతర పరిస్థితుల నేపథ్యంలో బలహీన కేంద్రం వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నదని వారు అభిప్రాయపడ్డారు.అందువల్ల కేంద్రానికి కొన్ని అత్యవసర అధికారాలను కట్ట బెట్టారు. సాధారణ పరిస్థితుల్లో కూడా ఈ అధికారాలను చలా యించడానికి కాంగ్రెస్, బీజేపీ కేంద్ర ప్రభుత్వాలు అలవాటు పడ్డాయి. కేంద్రం పెత్తనం ఇప్పుడు మరీ పరాకాష్ఠకు చేరు కున్నది. అసమంజసమైన ద్రవ్య విధానాలతో రాష్ట్రాలను బల హీనపరిచే ఎత్తుగడలు ఎక్కువయ్యాయి.మొత్తం జీఎస్టీ వసూళ్లలో అన్ని రాష్ట్రాలకూ కలిపి మూడో వంతు లభిస్తుంటే, కేంద్రం మాత్రం రెండొంతులు తీసుకుంటున్నది. మోయాల్సిన భారాలు మాత్రం రాష్ట్రాల మీదే ఎక్కువ. రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన అవసరం లేని సుంకాలు, సర్ ఛార్జీల వసూళ్లు ఏటేటా పెరుగుతున్నాయి. పార్లమెంటరీ ప్రజా స్వామ్యం మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని సర్వోన్నత న్యాయస్థానం వివిధ సందర్భాల్లో ప్రకటించింది. కానీ పార్లమెంట్ చర్చలు పలు సందర్భాల్లో ఒక ప్రహసనంగా మారుతున్న వైనం ఇప్పుడు కనిపిస్తున్నది. అసలు చర్చలే లేకుండా కీలక బిల్లుల్ని ఆమోదింపజేసుకున్న ఉదాహరణ లున్నాయి.స్వతంత్ర వ్యవస్థగా ఉండాలని రాజ్యాంగం ఆకాంక్షించిన ఎన్నికల సంఘం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ వ్యవస్థ ప్రతిష్ఠ నానాటికీ దిగజారుతున్నది. మొన్నటి సాధారణ ఎన్నికల్లో అది పాతాళానికి పడిపోయింది. పోలయిన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎందుకు ఎక్కువ ఉన్నాయో తెలియదు. తొలుత ప్రకటించిన పోలయిన ఓట్ల శాతాన్ని నాలుగైదు రోజుల తర్వాత సవరించి అసాధారణంగా పెరిగినట్టు చెప్పడం ఎందువల్లనో తెలియదు. వాటిపై ప్రశ్నించిన స్వతంత్ర సంస్థలకూ, రాజకీయ పక్షాలకూ ఇప్పటి దాకా ఎన్నికల సంఘం సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయింది. ఎన్నికల సంఘం స్వతంత్రతను కోల్పోవడమంటే ప్రజాస్వామ్యం శిథిలమవుతున్నట్లే లెక్క.రిజర్వు బ్యాంకు స్వతంత్రంగా వ్యవహరించవలసిన సంస్థ. కరెన్సీకి సంబంధించిన నిర్ణయాలన్నీ తీసుకోవలసిన బాధ్యత దానిదే. కానీ, పెద్ద నోట్ల రద్దు వంటి అసాధారణ నిర్ణయాన్ని కొన్ని గంటల ముందు మాత్రమే ఆర్బీఐకి తెలియజేసి, బహి రంగ ప్రకటన చేశారు. ఆర్బీఐ పాలక మండలిని కనుసన్నల్లో పెట్టుకొని, దాన్ని అనుబంధ సంస్థగా మార్చేసుకున్నారనే విమ ర్శలు వస్తున్నాయి. ఇక సీబీఐ, ఆర్టీఐ, సీవీసీ వంటి ‘స్వతంత్ర’ సంస్థలు పంజరంలో చిలకలుగా మారిపోయాయనే విమర్శ సర్వత్రా వినబడుతూనే ఉన్నది.తమకు గిట్టని రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడానికి గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు గవర్నర్ వ్యవస్థను వాడుకున్నాయి. అయితే కొందరు గవర్నర్ల విపరీత ప్రవర్తన గతంతో పోల్చితే ఎక్కువైంది. విపక్ష ముఖ్యమంత్రులున్న రాష్ట్రాలకు ‘ట్రోజన్ హార్స్’ను పంపించినట్టే ఇప్పుడు గవర్న ర్లను పంపిస్తున్నారు. ఇప్పుడు ముందుకు తెచ్చిన ‘ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్’ (ఓఎన్ఓఈ) విధానానికి పార్లమెంటరీ ప్రజా స్వామ్యాన్ని మరింత బలహీనపరిచే స్వభావమున్నది.ప్రాంతీయ రాజకీయ పార్టీలనూ, రాజ్యాంగ ఫెడరల్ స్వభా వాన్నీ ధ్వంసం చేయడానికే దీన్ని తీసుకొస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ బిల్లు చట్టరూపం దాల్చాలంటే చేయవలసిన రాజ్యాంగ సవరణల ఫలితంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మరింత బలహీనపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, భిన్నత్వంలో ఏకత్వ భావన అనేవి మన రాజ్యాంగానికి పునాది వంటివి. పార్లమెంట్లో ఎంత మెజారిటీ ఉన్నప్పటికీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం మాత్రం లేదని కేశవానంద భారతి (1973) కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులన్నీ అధ్యక్ష తరహా పాలనకు దారితీస్తున్నా యనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ లక్ష్యసాధనకు ప్రస్తుత రాజ్యాంగం ఉపయోగపడదు.ఇక నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని ఆధారం చేసుకొని తమకు పట్టున్న ఉత్తరాదిలో సీట్లు పెరిగేలా, బలహీనంగా ఉన్న దక్షిణాదిలో సీట్లు తగ్గేవిధంగా బీజేపీ ప్రయత్నిస్తున్నదనే అనుమానాలు కూడా విపక్షాలకు ఉన్నాయి. ఇదే నిజమైతే అంతకంటే దారుణం మరొకటి ఉండదు. ఇదంతా రాజకీయ భాగం మాత్రమే! అంబేడ్కర్ చెప్పినట్టు రాజ్యాంగం అభిలషించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలు కేవలం రాజకీయపరమైనవే కాదు. సామాజిక ఆర్థికపరమైనవి కూడా! ఈ రంగాల్లో ఇంకా ఆశించిన లక్ష్యం సుదూరంగానే ఉన్నది. ఇప్పుడు రాజకీయ అంశాల్లోనే మన రిపబ్లిక్ సవాళ్లను ఎదుర్కో వలసి వస్తున్నది. ఈ సవాళ్లను అధిగమించి ఆర్థిక, సామాజిక రంగాల్లో కూడా నిజమైన స్వాతంత్య్రం సిద్ధించాలంటే మన రాజ్యాంగం, మన రిపబ్లిక్ చిరకాలం వర్ధిల్లాలి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
జనం కోసం...
అంబేద్కర్‌గారి గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కరలేదు. దేశంలో పీడితవర్గాలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి నిరంతరం పరిశ్రమించినవాడు. స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగాన్ని అనుష్టించి, అనుసరించి, పరిపాలన చేసుకోగలుగుతున్నాం అంటే దానికి ఆయన ప్రధాన కారకులు. రాజ్యాంగ నిర్మాతలలో ఆయన కూడా ఒకరు. ఆయన చెప్పిన ఒక మంచి మాట – ’నీకోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు, జనం కోసం జీవిస్తే చరిత్రలో నిలుస్తావు’ అని! సర్వసాధారణంగా ఏ వ్యక్తి అయినా మొట్టమొదట తన గురించే ఆలోచిస్తాడు. ‘నాకోసం నేను బతకాలి. నేను బాగుండాలి, నా భార్యాబిడ్డలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి’ అని ఆశిస్తాడు. కేవలం నాకోసం నేను జీవించాలనుకోవడం తప్పుకాకపోవచ్చు. పరిధి పెరిగి తనకన్నా సమాజం గొప్పదనీ, తన ఇంటికన్నా దేశం గొప్పదనీ ఆలోచించాలి. అందరికోసం జీవించినవారు ధర్మాత్ములు. అటువంటి వారు కొన్ని కోట్లమందికి స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని పొంది ఉంటారు. అటువంటి మహాపురుషులు ఈ దేశంలో ఎందరో ప్రభవించారు. స్వాతంత్య్ర సమర సమయంలో తమ ప్రాణాలను గడ్డిపోచకింద భావించి జీవితాంతం జైలుజీవితం అనుభవించినవారున్నారు. ఏకాంతవాసం చేసినవారు, ప్రవాస జీవితం గడిపిన వారు, ద్వీపాంతర జీవితం గడిపినవారు, లాఠీదెబ్బలు తిన్నవారు, తుపాకీ గుళ్ళకు ఒరిగిపోయినవారు, అంగవైకల్యం పొందినవారు, కుటుంబాలు పోగొట్టుకున్నవారు, ఆర్థికంగా చితికినవారు, .. ఇటువంటి మహాత్ములు ఎందరో... ఎవరికోసం అదంతా... ఈ దేశంకోసం.. ఈ దేశ ప్రజల కోసం.. ఈ ఉదాత్త భావన ఆనాడు దేశ ప్రజలందరిలో ఎంతగా పొంగిపొర్లుతూ ఉండేదంటే... వినోబా భావే భూదానోద్యమం ప్రచారానికి దేశమంతటా తిరుగుతూ తమ తమ ప్రాంతాలకు వస్తే... చిన్నకమతాల దగ్గరనుండీ వందల, వేల ఎకరాల భూమిని నీళ్ళలా దానం చేసేసారు.. దాదాపు 42 లక్షల ఎకరాల భూమి పంచిపెట్టడానికిగాను ప్రజలు ఆయనకు ఇచ్చారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఒక గ్రామానికి గ్రామం ఆయనకు దానమిచ్చేసారు. సంపద ఉంటే సంపద దానం లేకుంటే దేశంకోసం శ్రమదానం చేసారు. ఇదీ నలుగురికోసం బతకడం అంటే... అంబేద్కర్ చెప్పినది ఇదే...ఇలాంటి త్యాగబుద్ధి ప్రతి ఒక్కరిలో ఉండాలి. దేశంమంటే నేను, నా కుటుంబం అనే కాదు, దేశమున్నది నాకోసం, నా కుటుంబం కోసం మాత్రమే కాదు...పరిధి దాటాలి, కుటుంబం పరిధి, ఊరు పరిధి... ఈ దేశం మనది అన్న భావన, మన దేశం బాగుపడడం కోసం మనం ఏ చేద్దామనే భావన ప్రతి ఒక్కరిలో రగులుతూ ఉండాలి. ఒకరిన చూసి మరొకరు స్ఫూర్తి పొందాలి... అప్పడు మనం మహాత్మాగాంధీలను, అంబేద్కర్లను... రోజూ చూస్తూనే ఉండవచ్చు. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఉద్యమానికి అక్షర చుక్కాని
సమాజంలో పత్రికలది ప్రధాన పాత్ర. ఒక్క పత్రిక చాలు వెయ్యిమంది సైన్యంతో సమానం అని పెద్దలు పేర్కొంటారు. పత్రికలు సమాజాన్ని ఎంత గొప్పగా ప్రభావితం చేస్తాయో స్వాతంత్య్ర ఉద్యమాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. ఎందరో దేశభక్తులు తమ చదువు, విజ్ఞానం కలబోసి ఉన్నంతలో పత్రికలను వెలువరించారు. సమాజం పట్ల తమ ధోరణి, నిరసనను తీవ్ర స్థాయిలో వ్యక్తం చేశారు. భరతమాతను బానిస సంకెళ్ల నుంచి విడిపించడానికి జరిగిన పోరాటంలో జిల్లా పత్రికలు కీలకపాత్ర పోషించాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా జిల్లాలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన పత్రికలు, సంపాదకులు, నిర్వాహకుల గురించి సాక్షి ప్రత్యేక కథనం.. కడప కల్చరల్: 1835లో బళ్లారి నుంచి వెలువడిన సత్యదూతను తొలి తెలుగు పత్రికగా చెప్పాల్సి వస్తుంది. తెలుగు జర్నలిజానికి మాతృభూమి రాయలసీమేనని పలువురు పేర్కొంటారు.మరికొందరు తొలి పత్రిక వృత్తాంతిని అని కూడా చెబుతారు. ఈ పత్రిక సంపాదకులు కడపజిల్లాకు చెందిన మండిగల వెంకటరామశాస్త్రి. వృత్తాంతిని పత్రికను ఆయన మద్రాసు నుంచి వెలువరించేవారు. అప్పట్లో దానికి ఫ్రముఖ దినపత్రికగా పేరుండేది. ఆంధ్రపత్రిక తొలి సంపాదకుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు స్వరాజ్య పత్రికలో రాసిన సంపాదకీయానికి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అలా స్వాతంత్య్ర పోరాటంలో తొలిసారిగా జైలుకు వెళ్లిన ఈ ప్రాంతం వ్యక్తిగా గాడిచర్ల పేరొందారు. ఎడిటర్ అన్న పదానికి సంపాదకుడని అనువాదం చేసింది కూడా ఆయనే అంటారు. భారత స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో పత్రికలు ఉద్యమానికి అండగా నిలిచి ప్రజల్లో జాతీయ భావాలను రగిలించాయి. ఎన్నో పత్రికలు ఎన్నెన్నో రకాల వ్యాసాలు, కథనాలతో తెలుగు నేలను ప్రభావితం చేశాయి. కడప నుంచి కూడా.. జిల్లా స్వాతంత్య్ర ఉద్యమకాలంలో ప్రధానంగా పత్రికా రంగ వికాస దశలో జిల్లాలో తొలి పత్రిక వెలువడినట్లు తెలుస్తోంది. 1897–98 ప్రాంతంలో ప్రభావతి పేరిట కడప నగరం నుంచి తొలి పత్రిక వెలువడింది. దీనిని టి.గోపాలనాయుడు కంపెనీ వారు తమ కల్యాణ కుమార్ విలాస్ ముద్రణాలయం నుంచి ప్రచురించారు. 1899లో ఆ సంస్థ నుంచి పూర్ణిమ అనే మరోమాస పత్రిక కూడా వెలువడింది 1910లో ఆంధ్ర చంద్రిక అనే వారపత్రిక ప్రొద్దుటూరు నుంచి బీఎన్ స్వామి సంపాదకత్వంలో వచ్చింది. ఇది రాజకీయ, సాంఘిక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది. 1920లో కడప నుంచి క్రైస్తవ సమాజం పక్షాన గెయిల్స్ మెయిల్ అనే ఆంద్ల మాసపత్రిక వెలువడేది. ఇంకా.... 1924లో రాజంపేట నుంచి పద్మశాలీయ సంఘం పక్షాన పద్మశాలి అనే పత్రిక వెలువడింది. 1925లో అవధానం కృష్ణముని ఆధ్వర్యంలో బ్రహ్మనందిని పత్రికను ప్రొద్టుటూరు నుంచి వెలువరించారు. గాంధేయవాది ఏకే మునికి తోడుగా ప్రముఖ సాహితీవేత్త కైక శేషశాస్త్రి, దుర్బాక రాజశేఖర శతావధాని లాంటి కవులు ఈ పత్రికలో సాహిత్య ప్రచారానికి దోహదం చేశారు. 1926లో ప్రొద్దుటూరు నుంచి దాదాపు పదేళ్లపాటు భారత కథానిధి పేరిట మాసపత్రిక వెలువడింది. 1927లో కడప నుంచి గుళ్లపల్లి వెంకట పున్నయ్య సంపాదకత్వంలో ప్రజాశక్తి వారపత్రిక వచ్చింది. 1928లో పచ్చిమాంధ్ర అనే వారపత్రిక కడప నుంచి జీవీ పున్నయ్యశాస్త్రి సంపాదకత్వంలో వచ్చింది. 1929–31 మధ్యకాలంలో ఆర్య ప్రణాళిక పేరిట గడియారం చిదంబరయ్య సంపాదకత్వంలో జమ్మలమడుగు నుంచి పత్రిక వెలువడింది. 1929లో భక్త సంజీవిని పేరిట వావిలికొలను సుబ్బారావు సంపాదకత్వంలో ఒంటిమిట్ట నుంచి మాస పత్రిక వెలువడింది. 1940లో కడపజిల్లా ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు కందుల బాలనారాయణరెడ్డి ప్రధాన సంపాదకుడిగా వెల్లాల మైసూరయ్య సహాయకునిగా ప్రొద్దుటూరు నుంచి రేనాడు వారపత్రక వెలువడేది. ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తూ 1940లో మాజీ శాసనసభ్యులు వై.ఆదినారాయణరెడ్డి సంపాదకునిగా మాజీ ఎమ్మెల్యే శంభురెడ్డి ఉప సంపాదకునిగా కడప నుంచి ఆజాద్ హింద్ పత్రిక వెలువడింది. ఇది జిల్లాలో రాజకీయ చైతన్యానికి దోహదం చేసింది. 1945లో రహస్యం పత్రిక పి.కృష్ణారెడ్డి సంపాదకునిగా, వైసీవీ రెడ్డి ఉప సంపాదకునిగా వెలువడేది. ఇందులో సమాజంలోని అవినీతి, లంచగొండితనాన్ని బహిర్గతం చేసేవారు. 1946లో రెడ్డి పేరిట పక్షపత్రికను కడప నుంచి బి.సుబ్బారెడ్డి సంపాదకత్వంలో వెలువరించారు. ఇలా కడప జిల్లా నుంచి పలు దిన, వార, మాసపత్రికలు స్వాతంత్రోద్యమ పోరాటస్ఫూర్తిని రగిలిస్తూ తమ బాధ్యతను నిర్వర్తించాయి. -
మహోజ్వల భారతి: ‘సైమన్ గో బ్యాక్’ అన్నది ఈయనే!
యూసుఫ్ మెహర్ అలీ స్వాతంత్య్ర సమరయోధులు. సోషలిస్టు నాయకుడు. 1942లో బాంబే మేయర్‌గా ఎన్నికయ్యారు. నేషనల్ మిలీషియా, బాంబే యూత్ లీగ్, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ.. ఈ మూడూ మెహర్ అలీ స్థాపించినవే. అలీ అనేక ఉద్యమాలను నడిపించారు. రైతులు, కార్మికులు ఆయన సారథ్యంలో బ్రిటిష్ సామ్రాజ్యంపై ఉద్యమించారు. ‘సైమన్ గో బ్యాక్’ అనే నినాదం ఆయనదే. అంతేకాదు, భారత్ నుంచి బ్రిటిష్ పాలనకు చరమగీతం పాడిన ఉద్యమ గర్జన ‘క్విట్ ఇండియా’ అనే మాట ఆయన ఆలోచన నుంచి ఉద్భవించినదే. అలీ గాంధీజీకి అత్యంత సన్నిహితులు. ఈ క్విట్ ఇండియా ఉద్యమానికి నినాదం ఇవ్వడంతో పాటు, ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించింది కూడా అలీనే. ఆయన ముంబైలో 1903 సెప్టెంబర్ 23న జన్మించారు. 1950లో మరణించారు. నేడు ఆయన వర్ధంతి (జూలై 2). బోస్ అరెస్ట్ అయిన రోజు రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. బ్రిటన్.. ‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్’తో కనీస సంప్రదింపులైనా లేకుండానే భారతీయులు బ్రిటన్ తరఫున యుద్ధానికి దిగుతున్నట్లు ప్రకటించింది. ఆ నిర్ణయం తీసుకుంది వైశ్రాయ్ లార్డ్ లిన్లిత్గో. బోస్ ఉగ్రుడయ్యారు. మీ యుద్ధంలోకి మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు అని ప్రశ్నించారు. ఈ యుద్ధం మనం చేయొద్దు అని గాంధీజీకి చెబితే ఆయన స్పందించలేదు! చివరికి బోస్ కలకత్తాలో కలకలం రేపారు. లిన్లిత్గో నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజా సమీకరణలు, ప్రసంగాలు చేశారు. ఆ రోజు జూలై 2, 1940. పోలీసులు బోన్ ను చుట్టు ముట్టారు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. జైల్లో వారం రోజులు నిరాహారదీక్ష చేశారు బోస్. దాంతో అతడిని విడుదల చేశారు. కానీ కలకత్తాలోని బోస్ ఇంటి చుట్టూ సి.ఐ.డి. పోలీసులను కాపలాగా పెట్టారు. అయినప్పటికీ మారువేషంలో తప్పించుకుని మద్ధతు కోసం హిట్లర్‌ను కలిసేందుకు బోస్ జర్మనీ వెళ్లారు. సిరాజ్ గెలిచి ఉంటేనా! సిరాజ్ ఉద్దౌలా బెంగాల్ చిట్ట చివరి నవాబు. ప్లాసీ యుద్ధంలో అతడి ఓటమి, భారత ఉపఖండంలో ఈస్టిండియా కంపెనీ పాలనకు ద్వారాలు తెరచింది. క్రమంగా ఉపఖండమంతటా వ్యాపించింది. సిరాజ్ యువకుడు. తన సైన్యంలో కమాండర్‌గా ఉన్న మీర్ జాఫర్ నమ్మకద్రోహం వల్ల యుద్ధంలో పట్టుబడి 24 ఏళ్లకే మరణించాడు. 1757 జూలై 2న ఈస్టిండియా సైన్యం అతడిని ఉరి తీసింది. (చదవండి: మహోజ్వల భారతి: వైద్యుడు, యోధుడు) -
‘జై హింద్’ నినాదకర్త మనోడే!
‘జై హింద్’ నినాదాన్ని ప్రతిపాదించింది హైదరాబాద్ నివాసి సయ్యద్ ఆబిద్ హసన్ సఫ్రాని అని విన్నప్పుడు ఆశ్చర్యం కలగక మానదు. 1911 ఏప్రిల్ 11న ఫఖ్రుల్ హాజియా బేగం, అమీర్ హసన్ దంపతులకు జన్మించారు ఆబిద్. ఆయన తల్లి స్వాతంత్య్ర సమర యోధురాలు కావడంతో ఆమె బాటలో నడుస్తూ జాతీయ పతాకాన్ని చేతబట్టారు. మహాత్ముని పిలుపు మేరకు చదువుకు స్వస్తి పలికి 1931లో సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ తరువాత నాసిక్ జైలుకు చెందిన రిఫైనరీని నాశనం చేయ తలపెట్టిన విప్లవకారులతో పనిచేసి కారాగార శిక్షకు గురైనారు. ‘గాంధీ–ఇర్విన్ ఒడంబడిక’ ఫలితంగా జైలు నుండి విడుదలయ్యారు. ఆ తర్వాత జాతీయ కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటూ... ఇంజినీరింగ్ కోసం జర్మనీ వెళ్ళారు. అక్కడ సుభాష్ చంద్రబోస్‌తో పరిచయం ఏర్పడింది. 1942 నుండి రెండేళ్ళ పాటు బోస్‌కు వ్యక్తిగత కార్యదర్శిగా, అనువాదకుడిగా పని చేశారు. ఆ క్రమంలో అనేక దేశాలు తిరిగి వచ్చారు. జర్మనీలో ఉన్న సమయంలో సైనికులు పరస్పరం పలకరించుకోవడానికి ‘నమస్తే’, ‘సలాం అలైకువ్‌ు’ ఇత్యాది మాటలు వాడేవారు. వీటికి బదులుగా దేశభక్తిని చాటే ఏదైనా ఒక నినాదాన్ని సూచించమని నేతాజీ ఆబిద్ హసన్‌ను కోరగా ‘జై హింద్’ నినాదాన్ని సూచించారు. నాటి నుండి జైహింద్ భారత విప్లవ నినాదంగా మారింది. జైహింద్ నినాదానికి నేతాజీనే రూపకల్పన చేశారని చాలా మంది భావిస్తారు. ఆబిద్ హసన్ ప్రతిపాదించిన ఈ నినాదం నేతాజీ కారణంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్ళింది. ఆబిద్ హసన్ 1984లో 73 సంవత్సరాల వయస్సులో స్వస్థలమైన హైదరాబాదులోనే తుది శ్వాస విడిచారు. – షేక్ అబ్దుల్ హకీం జానీ, తెనాలి (భారత స్వాతంత్య్రఅమృతోత్సవాల సందర్భంగా...) -
జలియన్‌వాలాబాగ్ దురంతం: ఒక జాతి ఆత్మను తాకిన తూటా..
1919 ఏప్రిల్ 13: ఆ రోజు జరిగిన నెత్తుటికాండను అంచనా వేయడంలో నాటి ప్రపంచం, విఖ్యాత మేధావులు అవమానకరంగా విఫలమయ్యారు. కాలమే చెప్పింది, మానవాళి చరిత్రలో అదెంత బీభత్సమో! అదే జలియన్‌వాలాబాగ్ దురంతం. అది భారతీయ ఆత్మ మీద దాడి. ఆ కాల్పులలో 379 మంది చనిపోయారని ప్రభుత్వం చెప్పింది. మృతుల సంఖ్య 1500 వరకు ఉంటుందని నాటి భారతీయుల వాదన. ఈ ఘటన మీద విచారణకు నియమించినదే విలియం హంటర్ కమిషన్. సాక్షులను ఢిల్లీ, అహ్మదాబాద్, బొంబాయి, లాహోర్లకు పిలిచారు. లాహోర్‌లోని అనార్కలీ బజార్లో ఉన్న టౌన్‌హాలు అందుకు వేదిక. 1919 నవంబర్ 19న అక్కడికే వచ్చి వాంగ్మూలం ఇచ్చాడు జనరల్ రెజినాల్డ్ ఎడ్వర్డ్ హ్యారీ డయ్యర్. నిరాయుధుల మీద 90 మంది సైనికుల చేత కాల్పులు జరిపించినవాడు ఇతడే. చాలా ఆలస్యంగా ఘటన వివరాలు బయటకు వచ్చాయి. జాతీయ కాంగ్రెస్ కూడా విచారించింది. తుపాకీ గుళ్లకు బలైన వాళ్లలో ఏడుమాసాల పసిగుడ్డు సహా 42 మంది చిన్నారులూ ఉన్నారని మదన్మోహన్ మాలవీయ చెప్పారు. ప్రభుత్వం లెక్క కూడా దీనికి దగ్గరగానే ఉంది. ఇక వెలుగు చూడని అంశాలూ ఎన్నో! 1919 ఆఖర్లో ఓ రోజు నెహ్రూ అమృత్సర్ నుంచి ఢిల్లీ వరకు ప్రయాణించారు. రాత్రి బండి. ఆయన ఎక్కిన బోగీ దాదాపు నిండిపోయి ఉంది. ఒక్క బెర్త్, అదీ అప్పర్ బెర్త్, ఖాళీగా ఉంది. ఎక్కి నిద్రపోయారు. తెల్లవారుతుంటే తెలిసింది, ఆ బోగీలో ఉన్నవారంతా సైనికాధికారులని. అప్పటికే వాళ్లంతా పెద్ద పెద్ద గొంతులతో మాట్లాడుకుంటున్నారు. ఒకడు మరీ పెద్ద గొంతుతో, కటువుగా మాట్లాడుతున్నాడు. అతడు అంత బిగ్గరగా చెబుతున్నవి, అప్పటికి దేశాన్ని కుదిపేస్తున్న అమృత్సర్, జలియన్‌వాలాబాగ్ అనుభవాలే. అసలు ఆ పట్టణమంతా తనకి ఎలా దాసోహమైందో చెబుతున్నాడు. తిరుగుబాట్లూ, ఉద్యమాలూ అంటూ అట్టుడికినట్టుండే పంజాబ్ తన ప్రతాపంతో ఎలా మోకరిల్లిందో వర్ణిస్తున్నాడు. ముదురు ఊదారంగు చారల దుస్తులలో ఉన్నాడతడు. మొదటి ప్రపంచ యుద్ధంలో పదిలక్షల మంది భారతీయులు పోరాడారు. 60వేల మంది చనిపోయారు. యుద్ధం తరువాతైనా ఏదో ఒరుగుతుందని ఎదురుచూశారు. ఏం లేకపోగా, అణచివేత ఎక్కువయింది. అందుకే ఒక తిరుగుబాటు మనస్తత్వం వచ్చింది. రాజ్యాంగ సంస్కరణలు జరుగుతాయన్న ఆశ మధ్య తరగతిలో ఉంది. అంటే స్వయంపాలనకు అవకాశం. దీని గురించి ప్రజలు మాట్లాడుకోవడం ఆరంభించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఇది బాగా ఉండేది. ఇక పంజాబ్‌లో అయితే మొదటి ప్రపంచ యుద్ధం కోసం రకరకాల పేర్లతో తమ యువకులను సైన్యంలో చేర్చుకున్న సంగతి గుర్తు చేసుకుంటున్నారు. అదే కాకుండా కామగాటమారు నౌక ఉదంతం, అనంతర పరిణామాలు వారిని బాధిస్తున్నాయి. ప్రపంచ యుద్ధం నుంచి తిరిగి వచ్చిన సైనికులు గతంలో మాదిరిగా లేరు. దేశదేశాల సైనికులతో కలసి పనిచేసి ప్రపంచ జ్ఞానంతో వచ్చారు. దశాబ్దాలుగా భారతీయ సైనికులకు జరుగుతున్న అన్యాయం పట్ల గుండె మండిపోతోంది. అలాంటి సందర్భంలో రౌలట్ చట్టం వచ్చింది. ఎలాంటి విచారణ, ఆరోపణ లేకుండానే ఎవరినైనా అరెస్టు చేసే అధికారం ఈ చట్టంతో అధికారులకు వచ్చింది. దేశమంతా ఆగ్రహోదగ్రమైంది. మితవాద కాంగ్రెస్ నాయకులకు కూడా ఆవేశం వచ్చింది. రౌలట్ చట్టాన్ని తీసుకురావద్దని గాంధీజీ కోరారు. ఆ చట్టానికి వ్యతిరేకత తెలియచేయడానికి సత్యాగ్రహ సభ పేరుతో ఉద్యమం ప్రారంభించారు. పంజాబ్ మరీ ఉద్రేకపడింది. ఫలితం జలియన్‌వాలాబాగ్. పంజాబ్‌కూ మిగిలిన దేశానికీ మధ్య బంధం తెగిపోయింది. సైనిక శాసనం నడుమ చిన్న వార్త కూడా రావడం లేదు. ఆ దురంతం జరిగిందని తెలుసు. అది ఎంత ఘోరంగా ఉందోనని దేశంలో గుబులు. సైనిక శాసనం ఎత్తేశారు. దీనితో కాంగ్రెస్ నాయకులు వెల్లువెత్తారు. పండిట్ మదన్మోహన్ మాలవీయ, స్వామి శ్రద్ధానంద నాయకత్వంలో పునరావాస కార్యక్రమం ప్రారంభించారు. వాస్తవాల సేకరణ పనిలో మోతీలాల్, చిత్తరంజన్‌దాస్ ఉన్నారు. దాస్‌కు సహాయకుడు నెహ్రూ (నెహ్రూ స్వీయచరిత్ర, 1936 నుంచి). పది నుంచి పదకొండు నిమిషాలు సాగిన కాల్పులే. కానీ ఆ తుపాకుల నెత్తుటి చరిత్ర అంతటా ప్రతిధ్వనిస్తూనే ఉంది. దీనితో పాటు ఆనాటి ఆర్తనాదాలు కూడా. కాల్పులు జరపకుండా జనం అక్కడ నుంచి వెళ్లిపోవడానికి అవకాశం ఉన్నా అలా చేయని సంగతిని హంటర్ కమిషన్ ముందు జనరల్ డయ్యర్ ఒప్పుకున్నాడు. ఎందుకు? అలా చేస్తే వాళ్లు తనను చూసి నవ్వుతారన్న అనుమానం. ఇంకా ఎక్కువ మందిని చంపాలంటే మిషన్ గన్లే ఉపయోగించేవాడినని అన్నాడు. గాయపడిన వాళ్ల సంగతి పట్టించుకోవడం తన పని కాదనీ అన్నాడు. ఆ ఘట్టం గురించి చెబుతున్నప్పుడు ‘బీభత్సమైనది’ అనేవాడు. ‘ది బుచర్ ఆఫ్ అమృత్సర్: జనరల్ రెజినాల్డ్ డయ్యర్’ పేరుతో నీజెల్ కోలెట్ రాసిన జీవితకథలో విస్తుపోయే విషయాలు ఉన్నాయి. తాను ఎంత చట్టవిరుద్ధంగా ప్రవర్తించాడో డయ్యర్కూ తెలుసు. అందుకే ఘటన జరిగిన రెండుమూడు రోజులు కథనాలు మార్చి వినిపించాడు. కానీ పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఓడ్వయ్యర్ నుంచి మద్దతు లభించింది. తరువాత చాలామంది బ్రిటిష్ ప్రముఖులు గొప్ప పని చేశాడని పొగడ్తలతో ముంచెత్తారు. స్వర్ణదేవాలయం పెద్దలు జనరల్ డయ్యర్‌ను ‘గౌరవ సిక్కు’ను చేశారు (రిచర్డ్ కావెండిష్, హిస్టరీ టుడే వాల్యూమ్ 59, ఇష్యూ 4, ఏప్రిల్ 2009). 1920 జూలై 8న బ్రిటిష్ పార్లమెంట్ ప్రభువుల సభలో చర్చ జరిగింది. ఎక్కువమంది డయ్యర్‌ను సమర్థించారు. యుద్ధ వ్యవహారాల కార్యదర్శి విన్స్టన్ చర్చిల్ మాత్రం అది బ్రిటిష్ విధానం కాదని అన్నాడు. హంటర్ కమిషన్ తీవ్ర విమర్శలతో డయ్యర్‌ని ఆ ఏడాదే ఉద్యోగం నుంచి తొలగించి ఇంగ్లండ్ పంపేశారు. అయినా ‘బాగ్ హీరో’గా ‘మార్నింగ్ పోస్ట్’ అనే బ్రిటిష్ పత్రిక తన నిధితో డయ్యర్‌ను సత్కరించదలిచింది. ఇంగ్లండ్ పత్రికలు సరే, బ్రిటిష్ ఇండియా నుంచి ‘కలకత్తా స్టేట్స్‌మన్’, ‘మద్రాస్ మెయిల్’ వంటి పత్రికలూ నిధి సేకరించాయి. మొత్తం 28,000 పౌండ్లు. కానీ అది తీసుకోవడానికి డయ్యర్ నిరాకరించాడు. అప్పటికే అతనిలో అభద్రతాభావం పేరుకుపోయింది. పైగా ఆర్టియోసెరిలోసిస్ వ్యాధి. చిన్నపాటి ఉద్వేగానికి గురైనా చావు తప్పదు. అంతేకాదు, బాగ్ ఘటన పేరుతో తాను మళ్లీ ప్రపంచానికి గుర్తుకు రావడం ఇష్టం లేదన్నాడు. బ్రిస్టల్ పట్టణం శివార్లలో ఎవరికీ పట్టనట్టు ఉండే సోమర్సెట్ కుగ్రామంలోని చిన్న కొండ మీద కట్టిన కాటేజ్‌లో భార్య అనీతో కలసి రహస్యంగా జీవించాడు. అక్కడే 1927 జూలై 23న చనిపోయాడు. మొదట గుండెపోటు వచ్చింది. అప్పుడు కూడా అతడు బాగ్ గురించే ప్రస్తావించాడంటారు జీవితకథ రాసిన కోలెట్. డయ్యర్‌కు రెండుసార్లు అంత్యక్రియలు జరిగాయట. మొదట అతని స్వగ్రామంలో, మళ్లీ సైనిక లాంఛనాలతో. అలా ముగిసింది అతని జీవితం. ఆరోజు రైలు ప్రయాణంలో నెహ్రూ చూసిన ఆ ఊదారంగు చారల దుస్తులలో ఉన్న వ్యక్తి ఢిల్లీలో దిగిపోయాడు. లాహోర్‌లో ఏర్పాటు చేసిన విచారణ సంఘం ముందు హాజరై వస్తున్నాడు. అతడే జనరల్ డయ్యర్. - డా. గోపరాజు నారాయణరావు -
‘వందేమాతరం’.. స్వాతంత్య్ర సంగ్రామపు అరుదైన ఫొటోలు
Independence Day 2021: రెండు వందల ఏళ్లకు పైగా పరాయి పాలనలో మగ్గిన, అణచివేతకు గురైన భారత్.. తొంభై ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో స్వాతంత్య్రం సాధించుకుంది. మహా మహా నాయకుల సారధ్యంలో ప్రజా పోరాటం.. ప్రాణ త్యాగాలతో స్వేచ్ఛను పొందింది. ఆ పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే 75వ స్వాతంత్య్ర దినోత్సవం 75th Independence Dayసందర్భంగా ఆ మహా సంగ్రామం తాలుకా చిత్రాలు కొన్ని మచ్చుకు మీ కోసం.. ►1857 సిపాయిల తిరుగుబాటును స్వాతంత్య్ర పోరాటంలో కీలక ఘట్టంగా అభివర్ణిస్తుంటారు చరిత్రకారులు. ఆ పోరాటంలో ఓడినప్పటికీ.. ఆంగ్లేయులకు మాత్రం మన తొలి దెబ్బ ఎలా ఉంటుందో తెలిసొచ్చింది. కావ్న్పోర్(కాన్పూర్) దగ్గర 1858లో జరిగిన పోరాటానికి సంబంధించిన ప్రతీకాత్మక చిత్రం ఇది. ►స్వరాజ్య లక్క్ష్యంతో మహాత్మా గాంధీ మొదలుపెట్టిన సహాయ నిరాకరణోద్యమం హింసాత్మకంగా మారింది. 1922 ఫిబ్రవరి 4న ఉద్యమకారుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చౌరీ చౌరా పోలీస్ స్టేషన్‌కు నిప్పటించి.. 20 మందికిపైగా పోలీసాఫీసర్లను సజీవంగా దహనం చేశారు. ►1930 ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా.. దండి మార్చ్‌లో పాల్గొన్న గాంధీ, పక్కన సరోజినీ నాయుడు ►విదేశీ వస్తువుల బహిష్కరణ ఉద్యమంలో భాగంగా.. వస్తువులతో వస్తున్న ఎడ్ల బండికి అడ్డుగా పడుకుని శాంతియుత నిరసన వ్యక్తం చేస్తున్న నిరసనకారుడు ►క్విట్ ఇండియా ఉద్యమం.. సైమన్ గో బ్యాక్ నినాదంతో ర్యాలీ చేపట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు ►గాంధీ, కాంగ్రెస్ నేతల అరెస్ట్‌కు నిరసనగా చేపట్టిన ప్రదర్శనలో ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు బ్రిటిష్ సైన్యం టియర్ గ్యాస్ ప్రయోగం ►ఫిబ్రవరి 20, 1947న స్వాతంత్య్ర ప్రకటన చేసిన బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ ► సంబురంగా ప్రజల మధ్య శాంతి కపోతాన్ని ఎగరేసిన నెహ్రూ ►ఎర్రకోట సంబురాల్లో ప్రధాని హోదాలో నెహ్రూ ►ఆగష్టు 16, 1947.. ఎర్రకోట నుంచి రెపరెపలాడుతూ కనిపించిన మువ్వన్నెల జెండా ►దేశ విభజన తర్వాత సెప్టెంబర్, 1947లో భారత్ నుంచి పాక్‌కు పయనమైన వందలాది మంది -
‘విజయ’ విశ్వ‘తిరంగ’
నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్య్ర సంబరాల వెనుక ఎంతో మంది ప్రాణ త్యాగముంది. నాటి సమరాంగణంలో ఉత్తుంగ తరంగాలై విజృంభించిన వీరులందరి కృషి ఉంది. స్వరాజ్యలక్ష్మిని కాంక్షించి అశువులు బాసిన త్యాగధనులు... బ్రిటీష్ పాలకుల వెన్నులో వణుకు పుట్టించిన మన్యం చిరుతలు... ఎంతోమంది ఈ విజయనగర గడ్డపై జన్మించారు. ఎక్కడ విప్లవ జ్యోతి వెలిగినా ఆ కాంతిలో జిల్లా యోధులు నడిచారు. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహ పిలుపునందుకుని ఇక్కడా దీక్షలు చేపట్టారు. అల్లూరి సీతారామరాజు స్పూ ర్తితో తెల్ల దొరల నిరంకుశత్వంపై గెరిల్లా యుద్ధం చేశారు. ఎన్నిసార్లు ఈ విషయాలు మననం చేసుకున్నా... నెమరువేసుకున్నా... శరీరమంతా రోమాంఛితమై... వారిపట్ల మనకున్న అచంచల గౌరవాన్ని మరింతగా పెంపొందింపజేస్తూనే ఉంటుంది. ఈ ఏడు స్వాతంత్య్ర వేడుక జరుపుకుంటున్న వేళ ఆ వివరాలు మరోసారి... సాక్షి ప్రతినిధి, విజయనగరం : క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నాటికే కటక్ నుంచి పిఠాపురం వరకూ విస్తరించిన కళింగ రాజ్యంలో అంతర్భాగంగా ఉండే విజయనగర ప్రాంతం బలమైన నాగరికత పునాదులపై నిర్మితమైంది. 1565లో తళ్లికోట యుద్ధంతో గోల్కొండ నవాబుల ఏలుబడిలోకి వెళ్లింది. ఫౌజిదారుల కాలంలోనే విజయనగరం, బొబ్బిలి సంస్థానాలు పుట్టుకొచ్చాయి. నిజాం మరణం తర్వాత ఫ్రెంచ్ సేనాని బుస్సీ సాయంతో సలాబత్‌జంగ్ అధికారంలోకి వచ్చా డు. దానికి ప్రతిగా శ్రీకాకుళం నుంచి కొండపల్లి సర్కారు వరకూ నాలుగు సర్కార్లను ఫ్రెంచ్ వారు రాయించుకున్నారు. కానీ తర్వాత ఈ ప్రాంతమంతా తూర్పు ఇండియా వర్తక సంఘం ద్వారా ఆంగ్లేయుల వశమైంది. 1757, జనవరి 24న జరిగిన బొబ్బిలి యుద్ధం చరిత్రలో నేటికీ ఓ సంచలనం. ఈ యుద్ధం తర్వాత మొదలైన చిన విజయరామరాజు పాలనపై ఈస్ట్ ఇండియా కంపెనీ పెత్తనం చెలాయించింది. దానికి ఆయన ఎదురుతిరిగారు. 1794లో తిరుగుబావుటా ఎగురవేశారు. అదే పద్మనాభ యుద్ధం. ఈ యుద్ధంలో విజయనగర రాజులు ప్రాణాలు వదిలారు. కానీ మద్రాసు అప్పటి గవర్నర్ విజయనగరం కోటను చిన విజయరామరాజు తనయుడు గజపతికి అప్పగించారు. అప్పుడే విజయనగర సాంస్కృతిక శకం ఆరంభమైంది. ఆది నుంచీ అటువైపే అడుగులు బ్రిటీష్ పాలనపై తొలి స్వాతంత్య్ర సంగ్రామంగా పేరుగాంచిన 1830 సిపాయిల తిరుగుబాటు సందర్భంలో మన జిల్లాలోనూ విప్లవాగ్ని రాజు కుంది. ముఖ్యంగా గిరిజనుల్లో చైతన్యం వచ్చింది. గిరిజన ప్రాంత ప్రత్యేక పాలన (ఏజెన్సీ అడ్మినిస్ట్రేషన్) ఉద్యమం చెలరేగింది. సాలూరు ప్రాంతానికి చెందిన గిరిజన నాయకుడు కొర్రా మల్లయ్య 1900లో విప్లవ జెండా ఎగురవేశారు. ఈ విప్లవాన్ని బ్రిటిష్ పాలకులు దారుణంగా పోలీస్ చర్యతో అణచివేశారు. ఎంతో మంది గిరిజనుల ప్రాణాలు తీశారు. కొర్రా మల్లయ్య, అతని కుమారుడిని అరెస్ట్ చేసి చనిపోయేంత వరకూ జైలు శిక్ష విధించారు. 1905లో బెంగాల్ విభజన, 1920లో సహాయ నిరాకరణోద్యమం, 1942లో క్విట్ ఇండియా ఉద్యమాల్లో జిల్లా ప్రజలు కీలక భూమిక పోషించారు. మన జిల్లాలోని ధర్మవరం గ్రామానికి చెందిన భాట్టం శ్రీరామమూర్తి ఎంఆర్ కళాశాలలో విద్యార్ధి సంఘ నాయకుడిగా ప్రస్థానం మొదలుపెట్టి స్వాతంత్య్రోద్యమకారునిగా మారి రాజకీయ వేత్తగా ఎదిగారు. గాంధీజీకి జిల్లా బాసట 1930, మార్చి 12న సబర్మతి ఆశ్రమం నుంచి 78 మంది అనుచరులతో మహాత్మా గాంధీ నేతృత్వంలో ప్రారంభమైన సత్యాగ్రహ యాత్ర 375 కిలో మీటర్లు సాగి ఏప్రిల్ 6న దండి గ్రామం చేరింది. 24 నాలుగు రోజుల పాటు సాగిన ఉప్పు సత్యాగ్రహంలో విజయనగరం పాలుపంచుకుంది. స్వాతంత్య్ర సమరయోధునిగా, 1952లో విజయనగరం నుంచి మొదటి లోక్‌సభ మెంబర్‌గా ఎన్నికై దేశానికి సేవలందించిన ఖండాల సుబ్రహ్మణ్య తిలక్ ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్నారు. దండి యాత్రకు మద్దతుగా విజయనగరంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటైంది. అక్కడ గాంధీజీ సత్యాగ్రహం చేస్తున్న సమయంలోనే ఇక్కడా సత్యాగ్రహం జరిగేలా అప్పట్లో ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా అనేక అడ్డంకులను నాటి పాలకులు కల్పించారు. అయినప్పటికీ మన జిల్లాలోని స్వతంత్ర సమరయోధులు తమ నిరసనను విజయవంతంగా వ్యక్తీకరించి గాంధీజీకి బాసటగా నిలిచారు. అల్లూరి మదిలో మెదిలి తెల్ల దొరల గుండెల్లో సింహ స్వప్నమై... గిరిజనం గుండెల్లో దేవుడై స్వాతంత్య్ర సంగ్రామంలో విప్లవ జ్యోతిగా వెలిగాడు మన్యం వీరుడు అల్లూరి సీతామరామరాజు. ఆ మహా వీరుడు ఆనాడు విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల మన్యం ప్రాంతంలో గిరిజనుల స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించాడు. అయితే ఆయన మదిలో విజయనగరం పేరు మెదలడం గొప్ప విశేషం. విద్యాభ్యాసం అనంతరం 1921లో చిట్టిగాంగ్ వెళ్లి బెంగాల్ విప్లవకారులతో చర్చలు జరిపి కె.డి.పేట సమీపంలో తాండవ నది ఒడ్డున నీలకంఠేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ‘శ్రీరామ విజయనగరం’ అనే ఆశ్రమాన్ని అల్లూరి ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాతే ఆంగ్లేయుల ముత్తదారీ పద్ధతి, అటవీ నిబంధనలతో పాటు చింతపల్లి తహసీల్ధార్ సెబాస్టియన్, అతని కాంట్రాక్టర్ సంతానం పిళ్లైల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించాడు. జాతీయోద్యమ కాలంలోనే విజయనగరాన్ని ప్రత్యేక జిల్లాగా చేయాలనే డిమాండ్ ఉండేది. కానీ బ్రిటీష్ పాలకులు దానిని పట్టించుకోలేదు. దీంతో 1979 వరకూ విశాఖ జిల్లాలో అంతర్భాగంగానే ఉండిపోయింది. -
‘క్విట్ ఇండియా’ నినాదం ఎవరిది?
న్యూఢిల్లీ: ‘క్విట్ ఇండియా’ నినాదం భారతీయుల హదయాల్లో ఎంతగా నాటుకుపోయిందో బ్రిటిష్ పాలకుల గుండెల్లో కూడా అంతగా నాటుకుపోయి వారిని భయకంపితుల్ని చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశ స్వాతంత్య్రోద్యమాన్నే ఆ నినాదం ఓ మలుపుతిప్పింది. ఆ క్విట్ ఇండియా (1942, ఆగస్టు 8) ఉద్యమానికి నేటికి సరిగ్గా 75 ఏళ్లు. అలాంటి నినాదాన్ని కాయిన్ చేసిందెవరని ఎవరైనా అడిగితే ఇంకెవరు! జాతిపితి మహాత్మా గాంధీ అనేవారు నేటికి కూడా ఉన్నారు. కానీ దాన్ని ఆయన కాయిన్ చేయలేదు. ‘క్విట్ ఇండియా’ను కాయిన్ చేసిందీ ఆ ఉద్యమం నాటికి ముంబై మేయర్‌గా పనిచేస్తున్న 39 ఏళ్ల యూసుఫ్ మెహరల్లీ. మేయర్ పదవికి ఎన్నికైన తొలి సోషలిస్ట్ మెహరల్లీ. ఆయన దేశ స్వాతంత్య్రోద్యమంలో ఎనిమిది సార్లు జైలుకెళ్లారు. స్వాతంత్య్రోద్యమానికి ఊపునిచ్చిన ‘క్విట్ ఇండియా’ అనే పదం ఎలా పుట్టుకొచ్చిందో కే. గోపాలస్వామి రాసిన ‘గాంధీ అండ్ బాంబే’ పుస్తకంలో వివరించారు. దేశ స్వాతంత్య్రోద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వ్యూహ రచన చేస్తున్న మహాత్మాగాంధీ తన సహచరులతో ముంబైలో సమావేశమైనప్పుడు స్వాతంత్య్ర పోరాటానికి పనికొచ్చి మంచి నినాదాలను సూచించాల్సిందిగా వారిని కోరారు. అందుకు ‘గెటవుట్’ అని ఎవరో సూచించారు. అదంత మర్యాదగ లేదని గాంధీ తిరస్కరించారు. ‘రిట్రీట్ ఆర్ విత్‌డ్రా’ అన్న పదాన్ని రాజగోపాలచారి సూచించారు. అక్కడే ఉన్న యూసుఫ్ మెహరల్లీ ‘క్విట్ ఇండియా’ పదాన్ని సూచించారు. యే! మేన్ అంటూ గాంధీ వెంటనే ఆ పదాన్ని ఆమోదించారు. అప్పుడు ఆ సమావేశంలో పాల్గొన్న శాంతికుమార్ మొరార్జీ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న కే. గోపాలస్వామి తన పుస్తకంలో వివరించారు. ఇక ఈ నినాదాన్ని, స్వాతంత్య్రోద్యమ ఆవశ్యకతను ప్రజలకు వివరించేందుకు ‘క్విట్ ఇండియా’ అంటూ విరివిగా బుక్లెట్లను ప్రచురించారు. అవి కొన్ని రోజుల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయని మెహరల్లీ జీవిత చరిత్రను రాసిన మధు దండావతే పేర్కొన్నారు. ఆగస్టు 7, 1942లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశమయ్యే నాటికి ‘క్విట్ ఇండియా’ పేరిట వెయ్యి బ్యాడ్జీలను కూడా తయారు చేశారు. ఆగస్టు 8, 1942లో ముంబైలోని గొవాలియా ట్యాంక్ మైదాన్ బహిరంగ సభ నుంచి ఉద్యమం ప్రారంభమైంది. ఆ నాడు ఈ నినాదం ప్రజల్లో ‘డూ ఆర్ డై’ అనే స్ఫూర్తినిప్పింది. గాంధీతోపాటు ఎంతో మంది నేతలు అరెస్టయినా ఉద్యమం ఆగలేదు. ఆకర్షణీయమైన నినాదాలను కాయిన్ చేయడంలో యూసుఫ్ మెహరల్లీ ఆయనకు ఆయనే సాటి. ఆయన 1928లో కాయిన్ చేసిన ‘సైమన్ గో బ్యాక్’ నినాదం కూడా జనంలోకి చొచ్చుకు పోయింది. నాటి బ్రిటీష్ ఇండియా ప్రభుత్వ పాలన మెరగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించడం కోసం బ్రిటిష్ పాలకులు సైమన్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. అందులో ఒక్క భారతీయుడికి కూడా స్థానం కల్పించలేదు. అందరూ బ్రిటిష్ అధికారులే ఉన్నారు. 1928లో సైమన్ కమిషన్ ముంబై రేవులో దిగినప్పుడు ‘సైమన్ గో బ్యాక్’ నినాదాలలో యూసుఫ్ మెహరల్లీ నాయకత్వాన కొంత మంది నిరసన ప్రదర్శన జరిపారు. రేవుకు చేరుకునేందుకు మెహరల్లీ, ఆయన మిత్రులు కూలీల వేశంలో వెళ్లారని మెహరల్లీ ఫౌండేషన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన జీజీ పారిక్ తెలిపారు. మెహరల్లీ ఆకర్షణీయమైన నినాదాలను కాయిన్ చేయడానికే పరిమితం కాకుండా క్విట్ ఇండియా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర నిర్వహించారు. ఆయన తన సహచర మిత్రులైన రామ్ మనోహర్ లోహియా, అరుణా అసఫ్ అలీ, అచ్యుత్ పట్వర్దన్ లాంటి నేతలను కూడా ఉద్యమంలోకి తీసుకొచ్చారని మధుదండావతే ‘యూసుఫ్ మెహరల్లీ: క్వెస్ట్ ఫర్ న్యూ హారిజాన్స్’లో వివరించారు. -
రేపు తమిళనాడు బృందం రాక
– ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి నివాళులర్పించేందుకు పర్యటన కోవెలకుంట్ల: విప్లవవీరుడు, తెల్లదొరలపాలిట సింహాస్వప్నం ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి నివాళులర్పించేందుకు చెన్నై నుంచి ఉయ్యాలవాడకు ప్రత్యేక బృందం బుధవారం రానుంది. ఈ సందర్భంగా సోమవారం తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, తెలుగుభాష పరిరక్షణ వేదిక కన్వీనర్, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఫోన్‌ద్వారా మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో తెల్లదొరలపై తిరుగుబాటు బావుట ఎగురవేసిన మొట్టమొదటి వీరున్ని స్మరించుకునేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు పేర్కొన్నారు. చెన్నై నుంచి తమ కార్యవర్గంతో ఉయ్యాలవాడకు చేరుకుని నరసింహారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తామన్నారు. అనంతరం నరసింహారెడ్డి కుటుంబ సభ్యులతో సమావేశమవుతామనా్నరు. రాబోయే రోజుల్లో ఉయ్యాలవాడ చరిత్ర, ఆయన వీరత్వాన్ని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు. -
బాపు మాట.. అదే మా బాట
* మంతెనవారిపాలెంలో గాంధీజీ అడుగుజాడలు * స్వాతంత్య్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్న మంతెనవారిపాలెం గ్రామస్తులు మంతెనవారిపాలెం (పిట్టలవానిపాలెం): బ్రిటీష్ సామ్రాజ్య కబంద హస్తాల నుంచి దేశానికి విముక్తి కల్పించడంలో జరిగిన స్వాతంత్య్రోద్యమంలో ఉవ్వెత్తున ఎగిసి పడిన తెలుగు తేజం మంతెన వెంకట్రాజు. మహాత్ముని శాంతి మంత్రమే బ్రహ్మోపదేశంగా ఆయన అడుగుజాడల్లో నడిచిన మహనీయుడు ఆయన. నేడు గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయులను ఒక్కసారి స్మరించుకుందాం. 1927లో మంతెనవారిపాలెంలో గాంధీజీ బస.. స్వాతంత్య్ర సమరంలో జాతిపిత మహాత్మాగాంధీని మంతెనవారిపాలెం గ్రామానికి తీసుకొచ్చిన ఘనత మంతెనకే దక్కింది. ఈ గ్రామంలో కనుమూరి వెంకట్రాజు ఇంట్లో రెండు రోజులపాటు బస చేసిన గాంధీజీ గుర్తుగా పాఠశాల ఆవరణలో సమారు 20 అడుగుల ఎత్తులో గాంధీజీ స్థూపాన్ని ఏర్పాటు చేశారు. నాడు గాంధీజీ బస చేసిన కనుమూరి ఇల్లు గ్రామంలో నేటికీ దర్శనమిస్తుంది. అప్పటి నుంచి ఆ ఇంటిని అందుకు చిహ్నంగా నూతన రంగులతో అలంకరించుకుంటున్నారు. గ్రామంలో మంతెన వెంకట్రాజు విగ్రహాన్ని ఏర్పాటు చేసి కాంస్య, తామ్ర పత్రాలు పొందిన స్వాతంత్య్ర సమరయోధుల పేర్లను అక్కడ చిత్రీకరించారు. అవి నేటికీ దర్శనమిస్తాయి. రాజకీయ పాఠశాల జాతీయస్థాయిలో ప్రప్రథమంగారాజకీయ పాఠశాల నిర్వహించిన ఘనత మంతెనకే దక్కుతుంది. 1938లో ఏర్పాటైన రాజకీయ పాఠశాలను మహాత్మాగాంధీ ప్రారంభించారు. అక్కడ ప్రసంగించిన ఆయన రెండు రోజులపాటు బస చేయడం విశేషం. రాజకీయ పాఠశాలలో నేడు రాజకీయాల్లో ఉద్దండులుగా వెలుగొందిన పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు శిక్షణ పొందారు. వీరిలో అఖిల భారత కమ్యూనిస్ట్ నాయకుడు ఎస్.ఎ. డాండే, రాష్ట్ర స్థాయిలో పేరుగాంచిన కమ్యూనిస్ట్ నేతలు పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, కొల్లా వెంకయ్య, మోటూరి హనుమంతరావు, కొండపల్లి సీతారామయ్య, మాకినేని బసవపున్నయ్య, దత్తు మజుందర్, జాతీయ నాయకుడు జయప్రకాష్‌నారాయణ తో పాటు సీనియర్ పార్లమెంటేరియన్‌గా పేరుగాంచిన ఆచార్య ఎన్జీ రంగా వంటి ప్రముఖులు ఉన్నారు. -
ఆ పోరాటమే గాంధీకి స్ఫూర్తి
పల్లిపాడు(ఇందుకూరుపేట) : దక్షిణాఫ్రికాలో అహింసాయుత మార్గంలో గాంధీ చేసిన పోరాటం ఆయనకు దేశంలో మరెన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసెందుకు స్ఫూర్తినిచ్చిందని తెలుగు భాషోద్యమ సమితి అధ్యక్షురాలు గంగవరం శ్రీదేవి అన్నారు. మండలంలోని పల్లిపాడు పినాకినీ సత్యగ్రహ గాంధీ ఆశ్రమంలో ఆదివారం జరిగిన గాంధీ అధ్యయన తరగతుల్లో ఆమె పాల్గొన్నారు. స్వాతంత్రోద్యమంలో గాంధీ పాత్ర అనే అంశంపై మాట్లాడారు. ఉద్యమాల్లో గాంధీ ఎప్పుడు రాజకీయ ప్రయోజనాలను ఆశించలేదన్నారు. స్వాతంత్ర పోరాట సమయంలో హిందూ, ముస్లింల మధ్య వివాదాలు తొలగించి వారి ఐకత్యకు పాటుపడ్డారన్నారు. తొలుత ఆశ్రమ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మోహన్ముని సిద్దారెడ్డి, ఆశ్రమ కమిటీ కన్వీనర్ గణేశం కష్ణారెడ్డి, సభ్యులు నారాయణ, రవీంద్రరెడ్డి పాల్గొన్నారు. -
స్వాంతంత్రోద్యమంలో జిల్లా పాత్ర ఘనం
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం గుంటూరు ఎడ్యుకేషన్: స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన గుంటూరు జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సోమవారం జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పుల్లారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాయుధ పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ కన్నెగంటు రక్త తర్పణంతో పల్నాడులో జరిగిన పుల్లరి పోరాటం, సహాయ నిరాకరణ ఉద్యమం, సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా గుంటూరు, తెనాలి పట్టణాల్లో జరిగిన ఆందోళనలు, క్విట్ ఇండియా ఉద్యమకాలంలో తెనాలి ప్రజలు చేసిన త్యాగాలను నిరంతరం స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు నడిచిన బాటలో జిల్లా సమగ్రాభివృద్ధికి పాటు పడాలని పిలుపునిచ్చారు. స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు, 7 మిషన్లు, 5 గ్రిడ్లు, 5 ప్రచారాల ద్వారా రెండంకెల వృద్ధి సాధించేందుకు కార్యోన్ముఖులు కావాలని అన్నారు. 2015–16 ఆర్థిక సంవత్సరంలో జిల్లా రూ. 55,871 కోట్ల స్థూల ఆదాయాన్ని సమకూర్చి, రాష్ట్రస్థాయిలో 4వ స్థానంలో నిలిచిందని చెప్పారు. తలసరి ఆదాయం 1,09,556 రూపాయలతో 5వ స్థానంలో నిలిచి 11.39 శాతం వృద్ధి రేటు సాధించిందని వివరించారు. వ్యవసాయ రంగానికి పెద్ద పీట.. వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసి 8,700 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను 50 శాతం రాయితీపై అందించామని చెప్పారు. వివిధ యంత్ర పరికరాలను రైతులకు సబ్సిడీపై జిల్లాకు కేటాయించినట్లు తెలిపారు. వేట నిషేధ సమయంలో 5,200 మంది మత్స్యకారుల కుటుంబాల్లో ఒక్కో కుటుంబానికి రూ. నాలుగు వేలు చొప్పున 2.08 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమచేశామని చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా జిల్లాలోని 63 వసతి గృహాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 2.52 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ కాంతిలాల్ దండే, మాజీ ఎంపీ యలమచిలి శివాజీ, జేసీ ఎం.వెంకటేశ్వరరావు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్. నాగలక్ష్మి, డీఆర్వో కె. నాగబాబు, రూరల్ ఎస్పీ నారాయణనాయక్, అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి, వివిధ శాఖల అధికారులు, స్వాతంత్య్ర సమరయోధులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
స్వాతంత్య్ర సమర దృశ్య సదనం కూల్చివేత
సాక్షి, విజయవాడ : కృష్ణానదీ తీరంలోని దేవాలయాలను, విగ్రహాలనే కాదు... స్వాతంత్య్ర సమర సంగ్రామం నాటి గుర్తులను కూడా జిల్లా అధికారులు తుడిచేస్తున్నారు. ఘాట్ల నిర్మాణం పేరుతో నదీతీరంలో ఉన్న స్వాతంత్య్ర సమర దృశ్య సదనాన్ని మంగళవారం నేలమట్టం చేశారు. ఈ ఘటన పలువురు స్వాతంత్య్ర సమరయోధుల్ని కలిచివేస్తోంది. విజయవాడ తొలి మేయర్ టి.వెంకటేశ్వరరావు, పూర్వ కమిషనర్ గుల్జార్‌లు భావి పౌరులకు స్వాతంత్య్రోద్యమం గురించి తెలిపేలా కృష్ణాతీరాన 2006లో ఈ భవనాన్ని నిర్మించారు. ఇందులో స్వాతంత్య్రోద్యమ నాటి ఘట్టాలు కళ్లకు కట్టినట్లు చూపే పెయింటింగ్స్ ఉంచారు. ఈ చిత్రాల్లో మహాత్మాగాంధీ, జవహార్‌లాల్ నెహ్రూ, భగత్‌సింగ్, సుభాస్ చంద్రబోస్, సర్దార్ పటేల్ వంటి అనేక మంది ప్రముఖులు అప్పట్లో పాల్గొన్న ఘట్టాలను అద్భుతంగా చిత్రీకరించారు. 2007 ఆగస్టు 15న దీన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి నగరానికి వచ్చిన వారంతా ఈ భవనాన్ని సందర్శించేవారు. పుష్కరాల ఆ నేపథ్యంలో అధికారులు ఈ భవనాన్ని కూల్చివేశారు. దీనిపక్కనే ఉన్న శ్రీ కృష్ణదేవరాయ విగ్రహాన్ని మాత్రం యథావిధిగా ఉంచారు. భవనం కూల్చివేయడం చాలా ఘోరం : టీవీ, చిత్రకారులు స్వాతంత్య్రోద్యమం నాటి ఘట్టాలను వివరిస్తూ వేసిన మేం వేసిన పెయింటింగ్‌లు ఉంచిన భవనాన్ని కూల్చివేయడం చాలా ఘోరం. ప్రతి రోజు రాత్రిపూట స్వాతంత్రోద్యమం నాటి చరిత్ర పుస్తకాలను క్షుణ్ణంగా చదువుకుని తెల్లవారిన తరువాత పెయింటింగ్ వేసేవాళ్లం. అప్పట్లో నెహ్రూ, గాంధీ వంటి వారు ఏ విధంగా ఉండేవారో ఊహించుకుని, అప్పట్లో అందుబాటులో ఉన్న కొన్ని చిత్రాలను పరిశీలించి ఈ పెయింటింగ్స్ వేశాం. ఆదాయం కంటే భావితరాలకు స్వాతంత్య్రం గురించి తెలియాలనే తపనతోనే ఈ చిత్రాలను వేశాం. అందులో చిత్రాలను ప్రస్తుతం ఎక్కడ పెట్టారో కూడా చెప్పలేదు. కూల్చివేస్తున్న విషయం మాకు తెలియదు. -
సమైక్య పోరాటం.. మరో స్వాతంత్య్రోద్యమం
డోన్, న్యూస్‌లైన్: భారతదేశం కోసం స్వాతంత్రోద్యం చేస్తే సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం మరో పోరాటం చేయాల్సి వచ్చిందని రెడ్ల సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు ధర్మవరం సుబ్బారెడ్డి, లక్కసాగరం లక్షీ్ష్మరెడ్డి అన్నారు. ఆదివారం డోన్ పట్టణంలో 5వేల మందితో రెడ్డి సమైక్య గళం కార్యాక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే దీక్షలకు సంఘీభావం తెలిపారు. దీక్ష శిబిరంలో వారు మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా చేస్తున్న ఉద్యమంతో కేంద్రపెద్దలు కళ్లు తెరవాలన్నారు. తమ హక్కులు సాధన కోసం ప్రజలు, యువకులు, సమైక్యవాదులు ఉద్యమ బాట పట్టారన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఉద్యమంలో భాగస్వాములై పోరాడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజిస్తే వచ్చే సమస్యలను పట్టించుకోకుండా తెలంగాణ ఇస్తామంటూ ప్రకటనలు చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో రెడ్డి సంఘం నాయకులు డాక్టర్ పోచా ప్రభాకర్‌రెడ్డి, కోట్ల హరిచంద్రారెడ్డి, శివరాంగారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, కృష్ణారెడ్డి, విక్రమసేనారెడ్డి, ప్రకాష్‌రెడ్డి ఉన్నారు.