‘విజయ’ విశ్వ‘తిరంగ’ | Freedom Fighters In Vizianagaram | Sakshi
Sakshi News home page

‘విజయ’ విశ్వ‘తిరంగ’

Published Wed, Aug 15 2018 11:43 AM | Last Updated on Wed, Aug 15 2018 11:43 AM

Freedom Fighters In Vizianagaram - Sakshi

పోరాట ఫలితంగా విజయనగరం జిల్లా ఏర్పాటైన సందర్భంగా సమావేశమైన ప్రముఖులు 

నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్య్ర సంబరాల వెనుక ఎంతో మంది ప్రాణ త్యాగముంది. నాటి సమరాంగణంలో ఉత్తుంగ తరంగాలై విజృంభించిన వీరులందరి కృషి ఉంది. స్వరాజ్యలక్ష్మిని కాంక్షించి అశువులు బాసిన త్యాగధనులు... బ్రిటీష్‌ పాలకుల వెన్నులో వణుకు పుట్టించిన మన్యం చిరుతలు... ఎంతోమంది ఈ విజయనగర గడ్డపై జన్మించారు. ఎక్కడ విప్లవ జ్యోతి వెలిగినా ఆ కాంతిలో జిల్లా యోధులు నడిచారు.

గాంధీజీ ఉప్పు సత్యాగ్రహ పిలుపునందుకుని ఇక్కడా దీక్షలు చేపట్టారు. అల్లూరి సీతారామరాజు స్పూ ర్తితో తెల్ల దొరల నిరంకుశత్వంపై గెరిల్లా యుద్ధం చేశారు. ఎన్నిసార్లు ఈ విషయాలు మననం చేసుకున్నా... నెమరువేసుకున్నా... శరీరమంతా రోమాంఛితమై... వారిపట్ల మనకున్న అచంచల గౌరవాన్ని మరింతగా పెంపొందింపజేస్తూనే ఉంటుంది. ఈ ఏడు స్వాతంత్య్ర వేడుక జరుపుకుంటున్న వేళ ఆ వివరాలు మరోసారి...

సాక్షి ప్రతినిధి, విజయనగరం : క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నాటికే కటక్‌ నుంచి పిఠాపురం వరకూ విస్తరించిన కళింగ రాజ్యంలో అంతర్భాగంగా ఉండే విజయనగర ప్రాంతం బలమైన నాగరికత పునాదులపై నిర్మితమైంది. 1565లో తళ్లికోట యుద్ధంతో గోల్కొండ నవాబుల ఏలుబడిలోకి వెళ్లింది. ఫౌజిదారుల కాలంలోనే విజయనగరం, బొబ్బిలి సంస్థానాలు పుట్టుకొచ్చాయి. నిజాం మరణం తర్వాత ఫ్రెంచ్‌ సేనాని బుస్సీ సాయంతో సలాబత్‌జంగ్‌ అధికారంలోకి వచ్చా డు.

దానికి ప్రతిగా శ్రీకాకుళం నుంచి కొండపల్లి సర్కారు వరకూ నాలుగు సర్కార్లను ఫ్రెంచ్‌ వారు రాయించుకున్నారు. కానీ తర్వాత ఈ ప్రాంతమంతా తూర్పు ఇండియా వర్తక సంఘం ద్వారా ఆంగ్లేయుల వశమైంది. 1757, జనవరి 24న జరిగిన బొబ్బిలి యుద్ధం చరిత్రలో నేటికీ ఓ సంచలనం.

ఈ యుద్ధం తర్వాత మొదలైన చిన విజయరామరాజు పాలనపై ఈస్ట్‌ ఇండియా కంపెనీ పెత్తనం చెలాయించింది. దానికి ఆయన ఎదురుతిరిగారు. 1794లో తిరుగుబావుటా ఎగురవేశారు. అదే పద్మనాభ యుద్ధం. ఈ యుద్ధంలో విజయనగర రాజులు ప్రాణాలు వదిలారు. కానీ మద్రాసు అప్పటి గవర్నర్‌ విజయనగరం కోటను చిన విజయరామరాజు తనయుడు గజపతికి అప్పగించారు. అప్పుడే విజయనగర సాంస్కృతిక శకం ఆరంభమైంది.

ఆది నుంచీ అటువైపే అడుగులు

బ్రిటీష్‌ పాలనపై తొలి స్వాతంత్య్ర సంగ్రామంగా పేరుగాంచిన 1830 సిపాయిల తిరుగుబాటు సందర్భంలో మన జిల్లాలోనూ విప్లవాగ్ని రాజు కుంది. ముఖ్యంగా గిరిజనుల్లో చైతన్యం వచ్చింది. గిరిజన ప్రాంత ప్రత్యేక పాలన (ఏజెన్సీ అడ్మినిస్ట్రేషన్‌) ఉద్యమం చెలరేగింది. సాలూరు ప్రాంతానికి చెందిన గిరిజన నాయకుడు కొర్రా మల్లయ్య 1900లో విప్లవ జెండా ఎగురవేశారు. ఈ విప్లవాన్ని బ్రిటిష్‌ పాలకులు దారుణంగా పోలీస్‌ చర్యతో అణచివేశారు.

ఎంతో మంది గిరిజనుల ప్రాణాలు తీశారు. కొర్రా మల్లయ్య, అతని కుమారుడిని అరెస్ట్‌ చేసి చనిపోయేంత వరకూ జైలు శిక్ష విధించారు. 1905లో బెంగాల్‌ విభజన, 1920లో సహాయ నిరాకరణోద్యమం, 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమాల్లో జిల్లా ప్రజలు కీలక భూమిక పోషించారు. మన జిల్లాలోని ధర్మవరం గ్రామానికి చెందిన భాట్టం శ్రీరామమూర్తి ఎంఆర్‌ కళాశాలలో విద్యార్ధి సంఘ నాయకుడిగా ప్రస్థానం మొదలుపెట్టి స్వాతంత్య్రోద్యమకారునిగా మారి రాజకీయ వేత్తగా ఎదిగారు.

గాంధీజీకి జిల్లా బాసట

1930, మార్చి 12న సబర్మతి ఆశ్రమం నుంచి 78 మంది అనుచరులతో మహాత్మా గాంధీ నేతృత్వంలో ప్రారంభమైన సత్యాగ్రహ యాత్ర 375 కిలో మీటర్లు సాగి ఏప్రిల్‌ 6న దండి గ్రామం చేరింది. 24 నాలుగు రోజుల పాటు సాగిన ఉప్పు సత్యాగ్రహంలో విజయనగరం పాలుపంచుకుంది. స్వాతంత్య్ర సమరయోధునిగా, 1952లో విజయనగరం నుంచి మొదటి లోక్‌సభ మెంబర్‌గా ఎన్నికై దేశానికి సేవలందించిన ఖండాల సుబ్రహ్మణ్య తిలక్‌ ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్నారు.

దండి యాత్రకు మద్దతుగా విజయనగరంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటైంది. అక్కడ గాంధీజీ సత్యాగ్రహం చేస్తున్న సమయంలోనే ఇక్కడా సత్యాగ్రహం జరిగేలా అప్పట్లో ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా అనేక అడ్డంకులను నాటి పాలకులు కల్పించారు. అయినప్పటికీ  మన జిల్లాలోని స్వతంత్ర సమరయోధులు తమ నిరసనను విజయవంతంగా వ్యక్తీకరించి గాంధీజీకి బాసటగా నిలిచారు.

అల్లూరి మదిలో మెదిలి

తెల్ల దొరల గుండెల్లో సింహ స్వప్నమై... గిరిజనం గుండెల్లో దేవుడై స్వాతంత్య్ర సంగ్రామంలో విప్లవ జ్యోతిగా వెలిగాడు మన్యం వీరుడు అల్లూరి సీతామరామరాజు. ఆ మహా వీరుడు ఆనాడు విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల మన్యం ప్రాంతంలో గిరిజనుల స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించాడు. అయితే ఆయన మదిలో విజయనగరం పేరు మెదలడం గొప్ప విశేషం. విద్యాభ్యాసం అనంతరం 1921లో చిట్టిగాంగ్‌ వెళ్లి బెంగాల్‌ విప్లవకారులతో చర్చలు జరిపి కె.డి.పేట సమీపంలో తాండవ నది ఒడ్డున నీలకంఠేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ‘శ్రీరామ విజయనగరం’ అనే ఆశ్రమాన్ని అల్లూరి ఏర్పాటు చేసుకున్నాడు. 

ఆ తర్వాతే ఆంగ్లేయుల ముత్తదారీ పద్ధతి, అటవీ నిబంధనలతో పాటు చింతపల్లి తహసీల్ధార్‌ సెబాస్టియన్, అతని కాంట్రాక్టర్‌ సంతానం పిళ్లైల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించాడు. జాతీయోద్యమ కాలంలోనే విజయనగరాన్ని ప్రత్యేక జిల్లాగా చేయాలనే డిమాండ్‌ ఉండేది. కానీ బ్రిటీష్‌ పాలకులు దానిని పట్టించుకోలేదు. దీంతో 1979 వరకూ విశాఖ జిల్లాలో అంతర్భాగంగానే ఉండిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement