విజయనగరం, కర్నూలు జిల్లాల్లో ఘటనలు.. మహిళను బలాత్కరించబోయిన టీడీపీ నేత
పూసపాటిరేగ/బేతంచర్ల/సాక్షి టాస్క్‌ఫోర్స్: అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులపై, వివాహితపై మానవ మృగాలు అత్యాచారానికి యతి్నంచాయి. ఈ ఘటనలు విజయనగరం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా, పూసపాటిరేగ మండలం, పతివాడ గ్రామానికి చెందిన మైనపు హరీశ్ (19) గ్రామ పాఠశాల వెనుకభాగంలో సోమవారం పశువులను మేపుతున్నాడు. అటుగా వెళ్తున్న ఇద్దరు బాలికలను పిలిచి మంచినీళ్లు తీసుకురావాలని కోరాడు.
వారిద్దరు సమీపంలోని నిందితుడి ఇంటికెళ్లి మంచినీళ్లు తీసుకొచ్చారు. వారిలో ఓ చిన్నారి (5)ని ఉండమని లైంగిక దాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో భయపడిన అతడు, చిన్నారిని ఇంట్లో అప్పగించాడు. విషయాన్ని చిన్నారి తన తల్లికి చెప్పడంతో గ్రామపెద్దల సహాయంతో పూసపాటిరేగ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
నంద్యాల జిల్లాలో..
నంద్యాల జిల్లా, డోన్ నియోజకవర్గంలోని కొలుములపల్లెకు చెందిన ఏడేళ్ల బాలిక ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. ఆ చిన్నారికి తండ్రి లేడు. తల్లి కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈనెల 7న బాలిక స్కూల్‌కు వెళ్లలేదు. ఇంటి దగ్గర ఆడుకుంటుండగా గ్రామానికి చెందిన దండగాల్ల ఎల్లయ్య అనే వ్యక్తి మద్యం మత్తులో చిన్నారిపై అత్యాచారయత్నం చేశాడు. బాలిక కేకలకు చుట్టుపక్కల వారు రావడంతో ఎల్లయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
వివాహితపై టీడీపీ నేత అత్యాచారయత్నం
కర్నూలు జిల్లా, గూడూరు మండలం ఆర్.ఖానాపురం గ్రామంలో మంగళవారం పొలం పనులకు వెళ్లిన ఓ వివాహితపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత బోయ గోపాల్ అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. అయితే ఆ మహిళ పెద్దగా కేకలు వేస్తూ తప్పించుకుని ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని భర్తకు చెప్పింది. అనంతరం భర్తతో కలిసి ఆమె గూడూరు ఎస్‌ఐ తిమ్మయ్యకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడికోసం గాలింపు చర్యలు చేపట్టారు.
గతంలోనూ ఇలాంటి దుశ్చర్యలు..
కాగా టీడీపీ నేత గోపాల్ గతంలో కూడా ఇదే గ్రామానికి చెందిన ఐదుగురు మహిళలపై అత్యాచారాయత్నానికి పాల్పడినట్లు గ్రామస్తులు చెప్పారు. వారంతా నిందితుడు గోపాల్‌కు భయపడి కేసులు పెట్టేందుకు ముందుకు రాలేదని పేర్కొన్నారు. గోపాల్ టీడీపీకి చెందిన గ్రామ సర్పంచ్ మునిస్వామికి స్వయాన మేనల్లుడు.
Comments
Please login to add a commentAdd a comment