
విజయవాడ, సాక్షి: ముంబై నటి జత్వానీ కాదంబరి కేసుతో తనకేం సంబంధం లేకపోయినా ఇబ్బంది పెడుతున్నారని సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులు(PSR Anjaneyulu) అన్నారు. బుధవారం ఉదయం ఆయన్ని సీఐడీ పోలీసు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. రిమాండ్ కోసం వాదనలు జరగ్గా.. తన కేసులో తానే పీఎస్‌ఆర్ వాదనలు వినిపించారు.
ముంబయి నటి జెత్వానీ కాదంబరిని వేధించారంటూ ఏపీ సీఐడీ అధికారులు పీఎస్‌ఆర్ ఆంజనేయులును మంగళవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ బేగంపేటలోని నివాసం నుంచి ఆయన్ని అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. ఈ ఉదయం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు.
జత్వానీ కేసులో ఏం జరిగిందనేది జడ్జి ముందు స్వయంగా వాదనలు వినిపించారు. తన పాత్ర లేకపోయినా కేసు పెట్టారని వాదించారు. అసలు ఈ కేసులో ఏం జరిగిందనే అంశాలను జడ్జికి వివరించారు. మాజీ డీసీపీ విశాల్ గున్నీని ప్రొటెక్ట్ చేస్తామని ప్రభుత్వం నుంచి హామీ రావడంతో అప్రూవర్‌గా మారారు. 164 స్టేట్ మెంట్ ఇవ్వమని విశాల్ గున్నీని అడిగినా.. ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. ఈ కేసులో తనకు సంబంధం లేని విషయాలను చెప్పించారు అని జడ్జి ముందు పీఎస్‌ఆర్ వాపోయారు.
అయితే వాదనలు ముగిసిన అనంతరం పీఎస్‌ఆర్‌కు సీఐడీ కోర్టు వచ్చే నెల 7వ తేదీదాకా రిమాండ్ విధించారు. దీంతో విజయవాడ సబ్ జైలుకు ఆయన్ని తరలించనున్నారు.
ఇదీ చదవండి: పీఎస్‌ఆర్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ ఏమన్నారంటే..