
సాక్షి, విజయవాడ: రాష్ట్రాలకు పన్నుల వాటాలో 50 శాతం ఇవ్వాలని 16వ ఆర్థిక సంఘానికి వైఎస్సార్‌సీపీ విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర పర్యటనలో ఆ సంఘ ప్రతినిధులను కలిసిన మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన అక్కడే మీడియాతో మాట్లాడారు. పన్నుల వాటా లెక్కకు 2011 జనాభా లెక్కల పరిగణన 1971 తర్వాత పలు రాష్ట్రాలలో జనాభా తగ్గింది. ఇప్పుడు ఆయా రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. కాబట్టి పన్నుల వాటాలో ప్రత్యేక బోనస్ కూడా ఇవ్వాలని ఆర్థిక సంఘానికి బుగ్గన నివేదించారు.
పన్నుల వాటాలో 50 శాతం ఇవ్వాలి:
16వ ఆర్థిక సంఘానికి పార్టీ తరపున విజ్ఞప్తి చేశాం. కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటా గురించి ప్రస్తావించాం. 14వ ఆర్థిక సంఘంలో డాక్టర్ వైవీ రెడ్డి ఉన్నప్పుడు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పన్నుల వాటాను తొలిసారిగా 32 శాతం నుంచి 42 శాతం వరకు పెంచుతూ సిఫార్సు చేశారు. ఆ తర్వాత 15వ ఆర్థిక సంఘం డాక్టర్ ఎన్‌కె సింగ్ ఉన్నప్పుడు 41 శాతం ఇచ్చారు.
అయితే 42 శాతం సిఫార్సు చేసినా, వాస్తవంగా నిధులు వచ్చే సరికి అందులో 10 శాతం తగ్గుతుంది. అంటే మనకు నికరంగా వచ్చేది 32 శాతమే. ఎందుకంటే కేంద్రం సెస్సులు, సర్‌ఛార్జ్‌ల పేరుతో ఆ వాటాలో కోత పెడుతుంది. అందుకే మా పార్టీ నుంచి ఏం కోరామంటే, పన్నుల వాటాలో 50 శాతం ఇవ్వమని కోరాము. ఎందుకంటే, రాష్ట్రాలకు అవసరాలు, ఖర్చులు ఉంటాయి అని చెప్పాం. అందుకే కనీసం 50 శాతం ఇస్తే, 40 శాతం నిధులు వస్తాయి కాబట్టి.
ఆ రాష్ట్రాలకు ప్రత్యేక బోనస్ ఇవ్వాలి:
రాష్ట్రాలకు పన్నుల వాటా నిర్ధారణకు గతంలో 1971 జనాభా లెక్కలు తీసుకునే వారు. కానీ, ఇప్పుడు 2011 జనాభా లెక్కలు పరిగణలోకి తీసుకుంటున్నారు. అయితే పలు రాష్ట్రాలు అనేక విధానాల ద్వారా జనాభా తగ్గించాయి. దీంతో ఆయా రాష్ట్రాలకు ఇప్పుడు నష్టం జరుగుతోంది. కాబట్టి, కుటుంబ నియంత్రణ బాగా అమలు చేసి, జనాభా తగ్గించుకున్న రాష్ట్రాలకు ప్రత్యేకంగా బోనస్ ఇవ్వాలని కోరాం.
2014–19 మధ్యలోనే రాష్ట్ర అప్పులు ఎక్కువ:
రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ తర్వాత 14,15 ఆర్థిక సంఘాలు వచ్చాయి. 14వ ఆర్థిక సంఘం సమయంలో టీడీపీ, 15వ ఆర్థిక సంఘం ఉన్నప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉంది. ఒక కఠోర వాస్తవం ఏమిటంటే.. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 2014–19 మధ్యలోనే రాష్ట్ర అప్పులు దారుణంగా పెరిగాయి. కానీ, గత కొన్నేళ్లుగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, వైయస్సార్‌సీపీ ప్రభుత్వంపై దారుణంగా దుష్ప్రచారం చేసింది. ఇంకా చేస్తోంది.
రాష్ట్ర విభజన తర్వాత, టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 2014–19 మధ్యలోనే ఎక్కువ అప్పు చేశారు. అప్పుడే అప్పు శాతం ఎక్కువ. 2019–24 మధ్య కోవిడ్ ఉన్నా, వైఎస్పార్‌సీపీ ప్రభుత్వంలో చేసిన అప్పు శాతం తక్కువ. ఆ లెక్కలు కేంద్ర ప్రభుత్వ విభాగాలే తేల్చి చెబుతున్నాయి. అన్నింటికీ పక్కాగా గణాంకాలు ఉన్నాయి. అయినా ఇష్టానుసారం అప్పుల లెక్కలు చెప్పారు. రూ.14 లక్షల కోట్లు అని, రూ.12 లక్షల కోట్లు అని నోటికొచ్చిన అంకెలు చెప్పారు.
ఇప్పుడు వారంతా ఏమయ్యారు?:
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి మంగళవారం అప్పు చేస్తున్నారని, రాష్ట్రం మరో శ్రీలంక అవుతోందని విషం చిమ్మారు. అదే పనిగా దుష్ప్రచారం చేశారు. మరి ఇప్పుడు వారంతా ఏమయ్యారు?. ఇప్పుడు ఈ ప్రభుత్వం అంత కంటే దారుణంగా ఎక్కువ అప్పు చేస్తోంది. పైగా, ఒక్క పథకం కూడా అమలు చేయడం లేదు. అదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కోవిడ్ ఉన్నా, ఒక్క పథకం కూడా ఆపలేదు.
5 ఏళ్లలో ఏం కడతారు?:
మనకు అధికారం ఇచ్చింది 5 ఏళ్లకా? అంత కంటే ఎక్కువా?. ఆ సమయంలో ఒక రాజధాని కడతారా? లేక ఒక నగరం కడతారా?. అసలు మనకున్న శక్తి ఎంత?. మన దగ్గర ఒక బైక్, ఒక కారు కొనే డబ్బులు ఉన్నప్పుడు విమానం కొంటానంటే ఎలా? ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తోంది అదే. మరి ఆ అప్పు తిరిగి ఎవరు చెల్లించాలి. మా పార్టీ విధానం అప్పుడైనా, ఇప్పుడైనా ఒక్కటే. సామాన్యులు బాగుండాలి. వారు అభివృద్ధి చెందాలి. వారికి ప్రభుత్వ పథకాలు పక్కాగా అమలు కావాలి అని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు.