సాక్షి, హైదరాబాద్: అప్పుడు చేయడంలో కూటమి సర్కార్ దూసుకెళ్తోందని ఎద్దేవా చేశారు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇప్పటి వరకు మొత్తం లక్షా 12వేల 750కోట్లు అప్పులు చేశారు.. ఇప్పుడు రాష్ట్రం ఏమవుతుందో చెప్పాలని బుగ్గన డిమాండ్ చేశారు. అలాగే, ఈ అప్పులు ఎవరు కడతారని ప్రశ్నించారు. ఇదే సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి నేతలు అమలు చేయడం లేదని తెలిపారు.
మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు 1998లో కూడా విజన్-2020 అన్నారు. చంద్రబాబు ఏం చేయాలనుకుంటున్నారు. ప్రజలు ఐదేళ్ల కోసం గెలిపించుకుంటారా? వచ్చే 20 ఏళ్ల కోసం గెలిపించుకుంటారా?. మన మేనిఫెస్టోనే మన విజన్. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి నీకు 15వేలు, నీకు 18వేలు అంటూ లెక్కలేసి హామీలు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కూటమి గెలవడానికి కారణం చంద్రబాబు మేనిఫెస్టోనే కదా. ఆరు నెలలు అయ్యింది. చంద్రబాబు మేనిఫెస్టో ఏమైంది?.
పథకాల అమలేదీ..
యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా.. నిరుద్యోగ భృతి అన్నారు.. ఇవ్వలేదు. తల్లికి వందనం అన్నారు.. అది కూడా ఇవ్వడం లేదు. ప్రతీ మహిళకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు. అదీ లేదు. మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు.. అది ఏమైంది?. తల్లికి వందనం అమలు చేయాలంటే రూ.12,450 కోట్లు అవసరం. కానీ, కేవలం రూ.5,386కోట్లు కేటాయించారు. అంటే, తల్లికి వందనం లేనట్టే. దీపం పథకానికి రూ.3,955 కోట్లు అవసరం ఉంటే.. కేవలం రూ.895 కోట్లు కేటాయించారు. అంటే ఈ ఏడాది దీపం పథకం కూడా లేనట్టే. ఆడబిడ్డ నిధికి రూ.37,313 కోట్లు అవసరం.. కానీ, కేటాయింపులు మాత్రం సున్నా. దీంతో, అది కూడా లేనట్టే.
ప్రశ్నిస్తానన్న నేత ఎక్కడ?
కూటమిలో ఒక వ్యక్తి ప్రశ్నిస్తా అన్నాడు.. కాన్నీ, ప్రశ్నించడం లేదు. కూటమి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు కూడా ఓ నేత పక్కకు వెళ్లిపోయారు. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన మహిళల బంగారం బయటకు తెస్తామన్నారు. అలాగే, బెల్టు షాపులు రద్దు అన్నారు.. ఇప్పుడు విచ్చలవిడిగా బెల్టు షాపులు పెట్టారు. ఇంటికో ఉద్యోగం అన్నారు.. ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా?. విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు ఇస్తామన్నారు.. ఒక్కరికైనా ఇచ్చారా?.
అప్పుల్లో బాబుదే రికార్డ్..
2014-19 మధ్యలో కాపులకు ఐదేళ్లలో 5వేల కోట్లు ఇస్తామన్నారు.. ఇవ్వలేదు. చేనేత రుణాలకు మాఫీ అన్నాడు. ఏమీ చేయలేదు. పుట్టిన ప్రతీ బిడ్డకు మహాలక్ష్మీ పథకం కింద డబ్బులు ఇస్తామన్నాడు.. ఇచ్చాడా?. హామీలు అమలు చేయకుండా ఇప్పుడు విజన్ డ్యాకుమెంట్ రిలీజ్ చేస్తున్నాడు. జూన్‌లో రూ.6వేల కోట్ల అప్పు. జూలైలో రూ.10వేల కోట్లు, ఆగస్టులో రూ.3వేల కోట్లు, సెప్టెంబర్‌లో రూ.4వేల కోట్లు, అక్టోబర్‌లో రూ.6వేల కోట్లు, నవంబర్‌లో రూ.4వేల కోట్లు, డిసెంబర్‌లో రూ.9వేల కోట్లు అప్పులు చేశారు. ఒకేసారి రూ.5వేల కోట్లు అప్పు చేసిన చరిత్ర టీడీపీదే. కేవలం అమరావతి పేరుతో రూ.31వేల కోట్లు అప్పులు చేశారు. ఇప్పటి వరకు మొత్తం లక్షా 12వేల 750కోట్లు అప్పులు చేశారు ఇప్పుడు రాష్ట్రం ఏమవుతుందో చెప్పాలి. అప్పులు ఎవరు కడతారు. వైఎస్సార్‌సీపీ హయాంలో కేవలం 13 శాతం మాత్రమే అప్పు.. మీరు ఏకంగా 22.6 శాతం అప్పులు చేశారు’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment