finance commission
-
ఆర్థికాభివృద్ధిని దాయడం సరికాదు!
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రాన్ని ఆర్థికంగా దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దింది. అయితే ఆ పరిస్థితిని కాంగ్రెస్ మసిపూసి మారేడుకాయ చేస్తూ దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత కూడా బీఆర్ఎస్ పాలనపై అబద్ధపు ప్రచారం మానలేదు. తాజాగా 16వ ఆర్థిక సంఘం ముందు తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఉంచిన వివరాలు ఇందుకు అద్దం పడుతున్నాయి. కాంగ్రెస్ తమ ప్రభుత్వ వైఫల్యాలను, ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయలేని దుఃస్థితిని కప్పిపుచ్చుకునేందుకు, తమ అసమర్థ పాలన నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి ప్రచారానికి దిగింది. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త!తెలంగాణ ఉద్యమంలో ప్రజానీకం లేవ నెత్తిన అంశాల్లో ప్రధానమైంది ఆర్థికాభివృద్ధిలో ఈ ప్రాంతం వివక్షతకు గురికావడం. తెలంగాణలో విశేషమైన వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా అన్ని రంగాలలో ఈ ప్రాంతం వెనుకబడింది. సాగునీటి వనరులు, ఉపాధి అవకాశాలు లేకుండా ప్రజలు పేదరికంలోకి నెట్టివేయబడ్డారు. తెలంగాణ వివక్షపై ఉద్యమించిన బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రాన్ని ఆర్థికంగా దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దింది.ఎన్నికల ముందు, ఆ తరవాత కూడా బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను అప్పులకుప్పగా మార్చివేశారని, ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాళా తీయించారని ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారు. నిరాధారమైన ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకులు, ఎప్పటికప్పుడు గణాంకాలతో సహా స్పష్టమైన వివర ణలు ఇస్తున్నప్పటికీ... వారు దుష్ప్రచారాన్ని మానడం లేదు. చివరకు ఇటీవల 16వ ఆర్థిక సంఘం ముందు కూడా తెలంగాణ ఆర్థిక పరి స్థితిపై పచ్చి అబద్దాలను ఉంచారు.ఈ విధంగా అవాస్తవాలతో మన ఆర్థిక సామర్థ్యాన్ని కించ పరుస్తూ ఉంటే, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనుకునే వారిని భయ పెట్టడం మినహా ప్రజలకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా?కాంగ్రెస్ తమ ప్రభుత్వ వైఫల్యాలను, ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయలేని దుఃస్థితిని కప్పిపుచ్చుకునేందుకు, తమ అసమర్థ పాలన నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై దారుణంగా ప్రచారం చేయడం... తమది ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే వారికి తగునా?ఇటీవల ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) విడుదల చేసిన నివేదికలో ఆర్థికంగా అన్ని కీలక కొలమానాలలోనూ తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి కొట్టొచ్చినట్టు స్పష్టమౌతోంది. తలసరి ఆదాయం, స్థూల ఉత్పత్తులను దేశ లేదా రాష్ట్రాభివృద్ధికి కొల మానంగా తీసుకుంటాము. ఈ రెండింటిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే తెలంగాణ 94 శాతం ఎక్కువ నమోదు చేసింది. కర్ణాటక 81 శాతం మాత్రమే అధికంగా ఉంది.తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా కర్ణాటక, తమిళ నాడు, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. ఆర్థిక సంస్కరణల తర్వాత తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు దేశంలోనే ప్రధాన ఆర్థిక శక్తి కేంద్రాలుగా మారాయి. జాతీయ సగటుతో పోల్చితే తలసరి ఆదాయంలో తెలంగాణ 193.6 శాతం, కర్ణాటక 181 శాతం, తమిళనాడు 171 శాతం, కేరళ 152.5, ఆంధ్రప్రదేశ్ 131.6 శాతం అధికంగా ఉన్నాయి.జీఎస్డీపీలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి, సుసంపన్నమైన రాష్ట్రంగా తెలంగాణ కొత్త రికార్డు సృష్టించింది. జాతీయ స్థూల ఉత్పత్తిలో 2010–11లో ఆంధ్రప్రదేశ్ ప్రాంతం వాటా 4.6 శాతంఉండగా, తెలంగాణ ప్రాంతపు వాటా 3.8 శాతం మాత్రమే ఉండింది. అయితే, 2023–24 నాటికి ఏపీ వాటా 4.7 శాతంకు పెరగగా, తెలంగాణ వాటా 4.9 శాతానికి పెరగడం గమనార్హం.మరోవైపు జీడీపీలో తెలంగాణ వాటా కూడా అంతకంతకూ పెరుగుతున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. 2010–11లో దేశ జీడీపీలో తెలంగాణ వాటా 3.8 శాతంగా ఉంటే... 2023–24 నాటికి ఇది 4.9 శాతానికి ఎగబాకింది. 13 ఏండ్ల వ్యవధిలో ఈ స్థాయిలో పెరుగుదల నమోదు చేసిన అతికొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నట్టు నివేదిక వివరించింది. 2014–15లో అప్పటి ధరలను బట్టి రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) రూ. 5.05 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 2023–24 నాటికి తెలంగాణ జీఎస్డీపీ రూ. 14.64 లక్షల కోట్లకుచేరింది. పదేండ్ల వ్యవధిలో తెలంగాణ జీఎస్డీపీ రూ. 9.59 లక్షల కోట్ల మేర పెరిగింది. దేశం మొత్తం మీద ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ ప్రశంసనీయమైన ప్రగతి గత పదేళ్లలో సాధించినట్లు అన్ని నివేదికలు, ప్రమాణాలు స్పష్టం చేస్తుంటే... 16వ ఆర్థిక సంఘం ముందు కాంగ్రెస్ ప్రభుత్వం గగ్గోలు పెట్టడం రాష్ట్రాభివృద్ధిని కించపరచడమే కాగలదు. తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన ఎంఎస్ఎంఈ పాలసీ పత్రంలో, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వృద్ధిరేటు ఎంతో మెరుగ్గా ఉందని తెలిపింది. ఎంఎస్ఎంఈల సగటు పెట్టుబడి రూ. 2.15 కోట్లకు పెరిగినట్టు పేర్కొంది. తరచూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్నినిందించే రాష్ట్ర సర్కారు, పరిశ్రమల అభివృద్ధిలో కేసీఆర్ ప్రభుత్వం సాధించిన విజయాలను ఒప్పుకోక తప్పలేదు. టీజీ–ఐపాస్ పోర్టల్‌లో నమోదైన కొత్త ఎంఎస్ఎంఈ యూనిట్లను పరిశీలిస్తే, గడిచిన పదేండ్లలో వరుసగా వృద్ధి నమోదయ్యింది. పదేండ్లలో 11.15 శాతంనుంచి 15 శాతం వరకు వృద్ధి నమోదైనట్లు ప్రభుత్వం వివరించింది. నేడు తెలంగాణలో ఎంఎస్ఎంఈల సంఖ్య 26 లక్షలుగా ఉన్నదని వెల్లడించింది. సగటు పెట్టుబడులు కూడా 115 శాతం పెరిగినట్లు తెలి పింది. ఎంఎస్ఎంఈలో ఉపాధి అవకాశాలు 20 శాతం పెరిగినట్టు, ఎస్సీ, ఎస్టీలు 30 శాతం ఎంఎస్ఎంఈల్లో ఉపాధి పొందినట్టు స్పష్టం చేసింది. కోవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా పరిశ్రమలు పెద్ద ఎత్తున మూతపడినా తెలంగాణలో మాత్రం అటువంటి పరిశ్రమల సంఖ్య నామమాత్రంగా ఉండడం విశేషం. తెలంగాణ, పదేండ్లలో పారిశ్రా మిక రంగంలో ఇతర రాష్ట్రాల కన్నా వేగంగా వృద్ధి సాధించినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రకటనే స్పష్టం చేస్తోంది. పరిశ్రమల కోసం జరిపే భూముల కొనుగోలులో స్టాంప్ డ్యూటీ మినహాయింపును యథావిధిగా కొనసాగించడంతో పాటు టీ–ప్రైడ్, టీ–ఐడియా పథ కాల రాయితీలను స్వల్పంగా పెంచారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన టీఎస్ ఐపాస్ వంటి సింగిల్ విండో విధానం, స్నేహపూర్వక పారిశ్రామిక పంథా, నిరంతర విద్యుత్తు సరఫరా తదితరమైన పలు కారణాలతో తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక రంగంలో ప్రముఖంగా ఎదిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పకనే చెప్పింది.మరోవంక బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిందంటూ విషప్రచారం చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రికార్డు స్థాయిలో అడ్డగోలుగా అప్పులు చేస్తున్నది. నిరుడు డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 285 రోజుల్లో రూ. 71,495 కోట్లు అప్పు చేసింది. అంటే ప్రతి రోజూ రాష్ట్ర ప్రజలపై రూ. 250 కోట్ల అప్పుల భారం మోపుతోంది. ఆగస్టు 13వ తేదీ వరకే, ఒక్క ఆర్బీఐ నుంచి రూ.42,118 కోట్ల రుణం సేకరించింది. వివిధ కార్పొరేషన్లకు రూ. 24,877 కోట్ల అప్పులకు గ్యారంటీలు ఇచ్చింది. మొత్తంగా రాష్ట్రంలోని నాలుగు కోట్ల జనాభాలో ప్రతి ఒక్కరిపై గత తొమ్మిది నెలల్లోనే రూ. 17,873 భారం మోపింది. బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఏడాది రూ. 52,576 కోట్ల రుణం సమీకరించనున్నట్టు 2023–24 బడ్జెట్లో ప్రతిపా దించింది. ఈ ఏడాది అప్పుల లక్ష్యాన్ని రూ. 62,012 కోట్లకుపెంచింది. ఇందులో బహిరంగ మార్కెట్ నుంచి రూ. 57,112 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 3,900 కోట్లు, ఇతర రుణాల రూపంలో రూ. 1000 కోట్లు సమీకరించనున్నట్టు పేర్కొన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి లెక్కించినా... ఆగస్టు 13వ తేదీ నాటికి బహిరంగ మార్కెట్ నుంచి రూ. 27 వేల కోట్ల రుణాలు సమీకరించింది. అంటే ఏడాది లక్ష్యంలో దాదాపు సగాన్ని కేవలం నాలుగున్నర నెలల్లోనే చేరుకుంది. గ్యారెంటీలు కూడా కలుపుకుంటే ఈ ఏడాది లక్ష్యాన్ని ఇప్పటికే దాటిపోయింది. గత ప్రభుత్వం సాధించిన అసాధారణ ఆర్థిక ప్రగతిని గుర్తించ లేని, గుర్తించినా అంగీకరించలేని, అంగీకరించినా... కావాలని తప్పుడు ప్రచారాలు చేసే కాంగ్రెస్వారా నీతులు వల్లించేది? ప్రజలు గమనిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త!- వ్యాసకర్త ఎమ్మెల్యే, మాజీ మంత్రి- టి. హరీశ్ రావు -
రాష్ట్రానికి సవాలుగా రుణ భారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి సవాలుగా మారిన భారీ రుణాలను రీస్ట్రక్చర్ చేసేందుకు అవకాశం కల్పించాలని, లేనిపక్షంలో రాష్ట్రానికి అదనపు ఆర్థి క సహాయం అందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి 16వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.6.85 లక్షల కోట్లకు చేరిన రుణ భారం రాష్ట్రానికి సవాలుగా మారిందని చెప్పారు. మంగళవారం ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియా, ఇతర సభ్యుల బృందంతో సీఎం సమావేశమయ్యారు.రా ష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ ప్రాథమ్యాలు, అభివృద్ధి ప్రణాళికలు, నిధుల అవసరాలను బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లా డుతూ.. బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ రాష్ట్రం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు. గత పదేళ్లలో ప్రభుత్వం (గత) భారీగా అప్పులు చేసిందని, రాష్ట్ర ఆదాయంలో అధిక భాగం రుణాలు, వడ్డీ చెల్లించేందుకే వెచ్చించాల్సిన పరిస్థితిని తీసు కొచ్చిందని అన్నారు. రుణాలు, వడ్డీలను సక్రమంగా చెల్లించని పక్షంలో రాష్ట్ర పురోగతిపై భారం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రుణాల సమస్యను పరిష్క రించేందుకు సహాయం చేయాలని కోరారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 50 శాతానికి పెంచండిదేశంలోనే తెలంగాణ చిన్న రాష్ట్రమని, రాష్ట్రాన్ని ది ఫ్యూచర్ స్టేట్‌గా పిలుస్తున్నామని రేవంత్‌రెడ్డి ఆర్థిక సంఘానికి తెలిపారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతా మని, రాష్ట్రాని కి తగిన సహాయం అందించాలని కోరారు. రాష్ట్రం దేశాభివృద్ధిలో కీలకపా త్ర పోషిస్తోందని చెప్పారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ను నెరవేర్చితే దేశా న్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్య సాధనకు తాము సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పారు. దేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో తమ వంతు బాధ్యతను నెరవే రుస్తామన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్ రావు, సీఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. నిధులు మళ్లించాల్సి వస్తోంది: డిప్యూటీ సీఎం భట్టితెలంగాణ తీవ్ర సంధికాలంలో ఉందని, రూ.6.85 లక్షల కోట్లకు పైగా అప్పులకు అసలు, వడ్డీలు చెల్లించేందుకు గాను అభివృద్ధి పనులకు కేటాయించాల్సిన నిధులు మళ్లించాల్సి వస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 16వ ఆర్థిక సంఘానికి తెలిపారు. ప్రభుత్వానికి ఉన్న రుణాలను రీస్ట్రక్చర్ చేసేందుకు సాయమందించాలని కోరారు. మంగళవారం ప్రజాభవన్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లు, సూచనలను ఆయన ఆర్థిక సంఘం ముందుంచారు. కేంద్ర ప్రాయో జిత పథకాల (సీఎస్ఎస్) కోసం ఇచ్చే గ్రాంట్లను మూసపద్ధతిలో కాకుండా, ఆంక్షలు, కోత లు లేకుండా ఇవ్వాలని కోరారు. తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో సంపదను సృష్టించే రంగాలు కొద్ది మంది చేతుల్లోనే ఉండిపోయాయని చెప్పారు. ఆర్థిక సంఘంతో భేటీ తర్వాత ప్రజాభవన్‌లో విలేకరులతో మాట్లాడు తూ.. రాష్ట్రంలోని సామాజిక అసమానతలు, భౌగోళిక పరిస్థితులను ఆర్థిక సంఘానికి వివరించినట్టు భట్టి తెలిపారు. రూ.10 వేల కోట్లు అడిగాంరైతు భరోసా, రుణమాఫీ లాంటి కార్యక్రమా ల కు ఆర్థిక సాయం చేయాలని ఆర్థిక సంఘాన్ని కోరామని, అమ్మ ఆదర్శ పాఠశాలలు, ఇంటిగ్రే టెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు రూ.10 వేల కోట్లు ఇవ్వాల్సిందిగా అడిగామని చెప్పారు. స్కి ల్స్ వర్సిటీ, ఐఐటీల అప్‌గ్రెడేషన్, మూసీ ప్రక్షా ళన, ట్రిపుల్ ఆర్, ఫ్యూచర్ సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏర్పాటు, స్పోర్ట్స్ వర్సిటీ లాంటి కార్యక్రమాల కోసం కూడా ఆర్థిక సా యం చేయాలని, రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల అ భివృద్ధికి చేయూతనందించాలని కోరినట్లు తెలి పారు.ఆర్థిక సంఘం సభ్యులు సానుకూలంగా స్పందించారని, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇచ్చిన ప్రజెంటేషన్ల విషయంలో వారు సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. రుణాల రీస్ట్ర క్చర్ అంశం తమ పరిధిలోకి రాదని ఆర్థిక సంఘం సభ్యులు అంటున్నారు కదా అని ప్రశ్నిం చగా, తమ అభిప్రాయాన్ని తెలియజేశామని, ప్రధాని, ఆర్థిక మంత్రికి కూడా ఇప్పటికే విన్న వించామని తెలిపారు. ఆర్థిక సంఘం కూడా ఈ విషయంలో తమకు సాయం చేయాలని కోరా మని, అవకాశమున్న ప్రతి చోటా తమ విజ్ఞప్తిని తెలియజేస్తామని భట్టి చెప్పారు. విలేకరుల సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఉన్నతాధికారు లు సందీప్‌కుమార్ సుల్తానియా, కృష్ణభాస్కర్, హరిత పాల్గొన్నారు. -
సాయం చేయండి.. రాష్ట్ర ప్రభుత్వం వినతి
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రం అనేక సామాజిక సూచికల్లో వెనుకబడి ఉంది. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, ఉద్యోగాల కల్పన తదితర రంగాల్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వెనుకంజలో ఉన్నాం. తలసరి ఆదాయం విషయంలో కూడా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చాలా తేడా కనిపిస్తోంది. అప్పుల భారం భరించలేని స్థాయికి చేరింది. ప్రభుత్వం నేరుగా తీసుకున్న రుణాలు, గ్యారంటీలు కలిపి ప్రస్తుతం రాష్ట్ర నికర అప్పు రూ.7.27 లక్షల కోట్లకు చేరింది. ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసమే బడ్జెట్లో 36% వరకు అనివార్యంగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇది దీర్ఘకాలిక భారంగా పరిణమిస్తోంది. నెలకు రూ.5,200 కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులకు గాను అసలు, వడ్డీలు చెల్లించేందుకే అవసరమవుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ ఖర్చు తడిసి మోపెడవుతోంది. తక్షణ అవసరాల కోసం స్వల్ప కాలిక రుణాలకు వెళ్లాల్సి రావడం బడ్జెట్‌పై ఒత్తిడిని కలుగజేస్తోంది. తెలంగాణ అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రమనే కారణంతో కేంద్రం నుంచి రావాల్సిన సాయాన్ని తగ్గించొద్దు. రాష్ట్రంలోని క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం నుంచి వీలున్నంత ఎక్కువ సాయం అందేలా సిఫారసులు చేయండి..’అని రాష్ట్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేసింది. మంగళవారం ప్రజాభవన్‌లో జరిగిన సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆర్థిక సంఘం సభ్యులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఐదు కీలక విజ్ఞప్తులను 16వ ఆర్థిక సంఘం ముందుంచారు. ఐదు కీలక విజ్ఞప్తులు: 1.కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్) అమలు కోసం ఇచ్చే గ్రాంట్లను వినియోగించుకునే విషయంలో రాష్ట్రాలకు స్వతంత్రత ఇవ్వాలని, స్థానిక అవసరాలకు అనుగుణంగా రూపొందించుకునే పథకాల కోసం ఈ నిధులను వినియోగించుకునే వెసులుబాటు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 2.రాష్ట్ర ప్రభుత్వ అప్పులను రీస్ట్రక్చర్ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఆర్ఈసీ (రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్), పీఎఫ్సీ (పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్)ల ద్వారా తీసుకున్న వాటికి, ఇతర రుణాలకు 10 నుంచి 12 శాతం వరకు వడ్డీలు కట్టాల్సి వస్తోందని తెలిపింది. ఈ వడ్డీల భారం కారణంగా అభివృద్ధికి నిధులు వెచ్చించే పరిస్థితి లేదని, తక్కువ వడ్డీకి రుణాలిప్పిస్తే ప్రస్తుతమున్న రుణాలను చెల్లించి భారం తగ్గించుకుంటామని విజ్ఞప్తి చేసింది. లేదంటే అభివృద్ధి వనరులను పెంపొందించుకునేలా అదనపు సాయాన్ని కేంద్రం నుంచి ఇప్పించాలని కోరింది. 3. కేంద్ర పన్నుల్లో వాటాను 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని కోరింది. 4. కేంద్ర పన్నుల్లో వాటాకు తలసరి ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం ద్వారా తెలంగాణ లాంటి రాష్ట్రానికి నష్టం కలుగుతోందని, జీఎస్డీపీ ప్రాతిపదికన ఈ వాటాను నిర్ధారించాలని కోరింది. 5. కేంద్రం వసూలు చేసుకుంటున్న సెస్‌లు, సర్‌చార్జీల్లో వాటా ఇవ్వకపోవడంతో రాష్ట్రాల పన్ను ఆదాయం తగ్గిపోతోందని తెలిపింది. కేంద్ర పన్నుల్లో వాటా పెంపు ద్వారా రాష్ట్రాల్లో సంక్షేమ కార్యక్రమాల అమలు, మౌలిక సదుపాయాల కల్పన, రాష్ట్రాల అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూరుతాయని సూచించింది. ఈ ప్రతిపాదన దేశంలోని అన్ని రాష్ట్రాలకు లబ్ధి కలిగిస్తుందని, సమాఖ్య స్ఫూర్తికి ఊతమిస్తుందని అభిప్రాయపడింది. సంక్షేమ పథకాలు అనివార్యం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రెజెంటేషన్‌లోని మరికొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. – తలసరి ఆదాయంలో తెలంగాణ ముందంజలో ఉంది. కానీ సంపద సృష్టి, ఆదాయ పంపిణీ విషయంలో ప్రాంతాల వారీగా భారీ వైరుధ్యాలున్నాయి. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత కూడా ఈ వ్యత్యాసాన్ని తగ్గించే క్రమంలో వెనుకబడ్డాం. కేంద్ర పన్నుల్లో వాటా నిర్ణయించేందుకు తలసరి ఆదాయాన్ని కాకుండా జీఎస్డీపీలో 50 శాతాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. – ఉచితాలుగా పరిగణించే కొన్ని సంక్షేమ పథకాలు అనివార్యంగా అమలు చేయాల్సి ఉంది. రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఆహార సబ్సిడీలు ఆర్థిక స్థిరత్వాన్ని కలిగించడంతో పాటు వెనుకబడిన వర్గాలకు ఆర్థిక భరోసాను కల్పిస్తాయి. ఈ నేపథ్యంలో సదరు సంక్షేమ పథకాలను పెట్టుబడిగా పరిగణించాలి. – కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు అంచనాల పెంపు, ప్రాజెక్టుల నిర్వహణ భారంగా మారుతున్నాయి. – మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల కోసం ఆఫ్ బడ్జెట్ అప్పులకు వెళ్లాల్సి వస్తోంది. – హైదరాబాద్ లాంటి నగర ప్రాంతాల్లో అభివృద్ధి ఎక్కువగా ఉంటోంది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉంటోంది. పోస్టు గ్రాడ్యుయేట్ మహిళల్లో 100% నిరుద్యోగం – గ్రామీణ ప్రాంతాల్లోని చదువుకున్న యువత, మహిళల్లో నిరుద్యోగం ఎక్కువగా కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పోస్టు గ్రాడ్యుయేట్ మహిళల్లో 100 శాతం నిరుద్యోగం ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కంటే ఇక్కడ నిరుద్యోగం ఎక్కువ ఉంది. – ఆరోగ్య, పౌష్టికాహార అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మహిళలు, చిన్నారుల్లో ఎనీమియా (రక్తహీనత) పెరుగుతోంది. బరువు తక్కువ ఉండే చిన్నారులు, పౌష్టికాహార లోపం లాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. – ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో రాష్ట్ర అవసరాలు తీరేలా 16వ ఆర్థిక సంఘం సిఫారసులు ఉండాలని కోరుతున్నాం. -
పెను సంక్షోభంలో ‘పట్టుగొమ్మలు’!
ఈ ఫొటోలో కనిపిస్తున్నది జనగామ జిల్లా యశ్వంతాపూర్ గ్రామ పంచాయతీ భవనం.గ్రామంలో 10 వార్డులు, 428 ఇళ్లు, 1,779 జనాభా ఉంది.జనాభా ప్రాతిపదికన ఏటా రాష్ట్ర ఆర్థిక సంస్థ (ఎస్ఎఫ్సీ) గ్రాంట్ రూ.15 లక్షలు,15వ ఆర్థిక సంఘం (కేంద్రం) నిధులు రూ.15 లక్షలు వస్తాయి.కానీ గత ఏడాది నుంచి ఈ రెండు నిధులూ రావడం లేదు.గతంలో పంచాయతీ పరిధిలో జరిగే రిజిస్ట్రేషన్ల ద్వారా స్టాంపు డ్యూటీ, వృత్తిపన్ను, ఇంటి అనుమతుల లైసెన్స్ జారీ సమయంలో పన్నుల కమీషన్లు నేరుగా పంచాయతీ ఖాతాలో జమయ్యేవి. మీసేవ కేంద్రాలు ప్రారంభమయ్యాక అవి కాస్తా ప్రభుత్వ ఖజానాకు వెళ్లిపోతున్నాయి. దీంతో చిన్న చిన్న పనులకు పంచాయతీ కార్యదర్శులే సొంత డబ్బులు ఖర్చు చేస్తూ నెట్టుకొస్తున్నారు. ఇలాంటి సమయంలో రూపాయి ఇవ్వకుండా స్వచ్ఛదనం–పచ్చదనం కార్యక్రమం విజయవంతం చేయాలంటూ.. అధికారుల మెడపై కత్తి పెట్టే విధంగా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ కార్యక్రమానికి అవసరమైన బ్లీచింగ్ పౌడర్, దోమల నివారణ మందు, పారిశుధ్య నిర్వహణ, నీటి సరఫరా తదితరాల కోసం అధికారులు జేబులో నుంచి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.సాక్షి ప్రతినిధి, వరంగల్: గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలంటూ చెప్పుకోవడమే కానీ ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నిధులు నిలిచిపోవడంతో సమస్యలు పరిష్కారం కాక పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తుంది కదా అన్న ఉద్దేశంతో పారిశుధ్యం, డ్రైనేజీల నిర్వహణ, అవసరమైన భవన నిర్మాణాల కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టిన సర్పంచ్‌లు.. బిల్లులు రాక అప్పుల ఊబిలో కూరుకుపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,769 గ్రామ పంచాయతీలకు సర్పంచ్‌లుగా పనిచేసిన వారిలో సగం మందికిపైగా అప్పులు, వడ్డీల భారం మోస్తూ బిల్లుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఒక్కో తాజా మాజీ సర్పంచ్‌కు రూ.8 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉన్నట్టు సమాచారం. వీరిలో కొందరు ఒత్తిళ్లు భరించలేక ఆస్తులు అమ్ముకుని అప్పులు తీరుస్తున్నారు. మరోవైపు.. పంచాయతీలకు నిధులు మంజూరు చేయని ప్రభుత్వం.. ఎప్పటికప్పుడు వివిధ కార్యక్రమాల అమలుకోసం మాత్రం ఆదేశాలు జారీ చేస్తోంది. ప్రస్తుతం పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో పంచాయతీల కార్యదర్శులు తమ జేబులోంచి ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఏ నిధులూ లేవు గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్లను పంపిణీ చేయాలన్న 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు 2021–22 నుంచి వరుసగా గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్‌లు, జిల్లా ప్రజా పరిషత్‌లకు 85 శాతం, 10 శాతం, 5 శాతం నిష్పత్తిలో నిధులు కేటాయిస్తున్నారు. ఈ గ్రాంట్ల వినియోగానికి మార్గదర్శకాలు సూచించి ప్రతి సంవత్సరం జూన్, అక్టోబర్‌లో రెండు విడతలుగా నిధులు విడుదల చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం (ఎస్ఎఫ్సీ) ఒక్కో ఓటరుకు రూ.65 నుంచి రూ.115 చొప్పున ఇస్తోంది. అయితే గత 20 నెలలుగా ఎస్ఎఫ్సీ నిధులు రావడం లేదని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. ఇంకోవైపు పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో.. ఈ ఏడాది జనవరి నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు సైతం నిలిచిపోయాయి. ముగిసిన సర్పంచ్ల పదవీకాలం ఇసుక సెస్, సీనరేజ్, రిజిస్ట్రేషన్ చార్జీలు తదితరాలు జమ చేసుకుంటూ రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల కింద ప్రభుత్వం తలసరి రూ.800 వరకు గ్రామ పంచాయతీలకు గతంలో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 2019 జనవరి 21, 25, 30 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 2024 ఫిబ్రవరి 1న గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగియగా.. జనవరి 31నే ప్రభుత్వం స్పెషలాఫీసర్లను నియమించి వారికి ఫిబ్రవరి 15న మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే సర్పంచ్ల పదవీ కాలం ముగిసే ఆరు నెలల ముందే నిధులు నిలిచిపోగా.. పదవీ కాలం ముగిసి ఆరు నెలలు కావస్తుండగా పంచాయతీలకు వివిధ గ్రాంట్ల రూపేణా రావాల్సిన సుమారు రూ.1,514 కోట్లు మంజూరు కాకుండా నిలిచిపోయాయి. దీంతో అభివృద్ధి పనులు ఆగిపోగా, విద్యుత్ బకాయిలు ఇప్పటికే రూ.4,305 కోట్లకు చేరుకోవడంతో పంచాయతీలు పెను సంక్షోభంలో చిక్కుకుపోయే పరిస్థితి ఏర్పడింది. మూడు ఖాతాలు ఖాళీ..! గ్రామ పంచాయతీలకు ఉండే మూడు రకాల బ్యాంకు ఖాతాలు పూర్తిగా ఖాళీ అయ్యాయి. ఆస్తి పన్ను అరకొరగా వసూలు అవుతున్నా ఖర్చు నాలుగింతలు ఉండడంతో ఆ ఖాతా ఎప్పుడూ ఖాళీ అవుతోంది. రెండోదైన ఎస్ఎఫ్సీ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమ చేస్తుంది. వీటిని ట్రెజరీ ద్వారా డ్రా చేయాల్సి ఉంటుంది. అయితే 20 నెలలుగా నిధులు నిలిచిపోయాయి. మూడోది 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించినది. కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ జనాభా, ఓటర్ల ఆధారంగా నిధులు అందజేస్తుంది. వీటిని ప్రత్యేక సూచనల మేరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా నిలిచిపోయాయి. బిల్లులు చెల్లించకపోతే ఆత్మహత్యలే శరణ్యం పంచాయతీలకు ఎస్ఎఫ్సీ, 15వ ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు. తాజా మాజీ సర్పంచ్‌లకు రూ.కోట్లల్లో పెండింగ్ బిల్లులు రావాల్సి ఉంది. నేను గ్రామంలో íసీసీ రోడ్లు, మొరం పనులు, వాగు దాటేందుకు వీలుగా నిర్మాణ పనులు చేసిన. స్మశాన వాటికలో విద్యుత్ సౌకర్యం కల్పించా. ఈ మేరకు రూ.25 లక్షలు బిల్లు రావాల్సి ఉంది. మా జిల్లాలో రూ.50 కోట్లకు పైనే ఉన్న బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యం. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్‌లకు రూ.680 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. – దూసరి గణపతి, సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు, జనగామ అప్పులు కట్టడానికి ప్లాటు అమ్మా గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనులు చేశా. గ్రామ పంచాయతీ భవనం, ప్రభుత్వ పాఠశాలలో కిచెన్ షెడ్, సీసీ రోడ్లు, డ్రైనేజీ, సబ్ సెంటర్ నిర్మాణం చేపట్టా. పనులు పూర్తికాగానే బిల్లులు వస్తాయనే ధీమాతో చాలావరకు అప్పులు చేసి పనులు పూర్తి చేశా. వీటికి సంబంధించి రూ.30 లక్షలు రావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు రాకపోవడంతో సిద్దిపేటలో ఉన్న ప్లాటును తక్కువ ధరకు అమ్మి కొంతమేర అప్పులు చెల్లించా. – దమ్మ రవీందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్, రామలక్ష్మణపల్లె, ముస్తాబాద్, సిరిసిల్ల జిల్లా పదవీకాలం అయిపోయింది..అప్పు మిగిలింది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాద్వార్ గ్రామంలో రెండేళ్ల కిందట రూ.40 లక్షలతో డ్రైనేజీ, సీసీ రోడ్లు, గ్రామపంచాయతీ భవన నిర్మాణాలు చేపట్టారు. కానీ వీటికి సంబంధించిన బిల్లులు ఇప్పటివరకు రాలేదు. అభివద్ది పనులతో ఊరు బాగైందని, తాము మాత్రం అప్పులపాలయ్యామంటూ మాజీ సర్పంచ్ ఈడ్గి లక్ష్మమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
Fact Check: పరిమితికి లోబడ్డా పైశాచిక రాతలే!
సాక్షి, అమరావతి : ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రామోజీలో ఆవేశం శృతిమించుతోంది. సీఎం వైఎస్ జగన్ ‘సిద్ధం’ సభలు కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమవుతుండడంతో ఆయనలో కడుపుమంట తారాస్థాయికి చేరుతోంది. ఫలితంగా తన క్షుద్రపత్రిక ఈనాడులో రాతలు అదుపు తప్పడమే కాదు పట్టాలూ తప్పుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం అదే పనిగా అశుద్ధ కథనాలు వండివారుస్తున్న రామోజీ అప్పులపై అదే పనిగా కొట్టిన డప్పే మళ్లీ మళ్లీ కొడుతూ తన కడుపు ఉబ్బరాన్ని తీర్చుకునేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. నిజానికి.. అప్పులపై నానా చెత్త పోగేసి విషం కక్కుతున్న ఆయన ఒకసారి కాగ్ వెబ్‌సైట్‌కు వెళ్లి చూస్తే బాబు హయాంలో ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు మించి ఎంత అప్పుచేశారో తెలుస్తుంది. అలాగే, వైఎస్సార్సీపీ హయాంలో కూడా ఆర్థిక సంఘం సిఫార్సులు ఏమిటి? ఎంత అప్పు చేశారనేది అర్థమైపోతుంది. కానీ, రామోజీ అలా చేయరు. ఎందుకంటే.. తన ఆత్మబంధువు చంద్రబాబు బండారం బయటపడిపోతుంది కాబట్టి. రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై రామోజీ ప్రచారం చేస్తున్న అబద్ధాల కుప్పలోని ‘ఫ్యాక్ట్‌చెక్’ఏమిటంటే.. బాబుకు, జగన్‌కు తేడా ఇదీ.. వైఎస్ జగన్ సర్కారు అప్పులపై నిత్యం అక్కసును రంగరించి తప్పుడు గణాంకాలతో డప్పు వాయించడంవల్ల నీ పత్రిక, నీ పరువు దిగజార్చుకోవడం తప్ప మరొకటి ఉండదు రామోజీ. వాస్తవానికి.. అప్పు చేయడం తప్పని ప్రతిపక్ష నేతగా జగన్ ఏనాడూ అనలేదు. పరిమితికి మించి అప్పు చేయడాన్నే ఆయన తప్పుబట్టారు. అయినా, చేసిన అప్పులతో ఒక శాశ్వత కట్టడం కూడా కట్టకుండా కేవలం హంగులు, ఆర్భాటాలు, విలాసాలకు వృధా వ్యయం చేయడాన్నే ఆయన తప్పుబట్టారు. పరిమితికి మంచి అప్పులు చేసినా మేనిఫెస్టోలో రైతులకు.. మహిళా సంఘాలకు, యువత తదితర రంగాలకు ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడాన్ని జగన్ తప్పుబట్టారు. అసలు చంద్రబాబు తన ఐదేళ్లు ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు మించి అప్పులు చేశారని కాగ్ గణాంకాలే స్పష్టంచేస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కోవిడ్ రెండేళ్లు తప్ప మిగతా సంవత్సరాలు ఆర్థిక సంఘం సిఫార్సుల కన్నా తక్కువగానే అప్పులుచేసింది. కోవిడ్ సంక్షోభం కారణంగా రాష్ట్ర ఆదాయంతో పాటు కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో రావాల్సిన రాబడి తగ్గిపోవడంతో వ్యయం పెరిగినా పరిమితికి లోబడే అప్పులు చేస్తూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలుచేసింది. మీ చంద్రబాబు మాదిరిగా రైతులకు, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చిన హామీలను జగన్ సర్కారు గాలికొదిలేయకుండా నవరత్నాలతో నేరుగా నగదు బదిలీ ద్వారా హామీలను నెరవేర్చింది. నిబంధనలకు లోబడి అప్పులు చేస్తున్నా ఏడుపేనా? మరోవైపు.. 2021–22 ఆర్థిక సంవత్సరంలో పరిమితి ఉన్నప్పటికీ ఏకంగా రూ.26,668.46 కోట్లు తక్కువగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పుచేసింది. రాష్ట్ర విభజనానంతరం 2021–22 ఆర్థిక సంవత్సరంలో జగన్ సర్కారు అతి తక్కువగా 2.18 శాతం ద్రవ్యలోటు రికార్డు చేసింది. కోవిడ్ లాంటి సంక్షోభం లేకపోయినా చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో ఏ ఏడాది కూడా ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడి అప్పులు చేయలేదు. ఇలా చంద్రబాబు ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసినా ఈనాడు రామోజీకి అది కనిపించలేదు. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పుడు నిబంధనలకు లోబడి అప్పులు చేస్తున్నా నిత్యం అప్పులపై తప్పుడు గణాంకాలతో ఈనాడు రామోజీ విషం కక్కుతున్నారు. నిజానికి.. అప్పులుచేసి రాజధానిలో ఒక్క శాశ్వత భవనం కట్టకుండా, ఎన్నికల హామీలు అమలుచేయకుండా కన్సల్టెన్సీల పేరుతో, గ్రాఫిక్స్ పేరుతో, పోలవరం, తాత్కాలిక రాజధానికి బస్సుల్లో జనాన్ని పంపించి భజనలు చేయించుకోవడానికి చేసిన వృధా వ్యయాన్నే విపక్ష నేతగా జగన్ అప్పట్లో తప్పుబట్టారు ఇప్పుడు రెండేళ్ల పాటు కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొంటూ మరోపక్క పరిమితికి లోబడే అప్పులు చేస్తూ ఎన్నికల హామీలను తూచా తప్పకుండా అమలుచేస్తూ లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ ద్వారా రూ.2.55 లక్షల కోట్లను వారి ఖాతాల్లో జమచేశారు. అప్పుల గణాంకాలన్నీ కాగ్, ఆర్బీఐ నివేదికల్లో ఉన్నాయి. కళ్లు కనిపిస్తుంటే ఒకసారి చూడు రామోజీ యనమల మాటలు మర్చిపోతే ఎలా? ఇక ఆర్థిక సంఘం సిఫార్సులకు మించి మీ బాబు ఐదేళ్లతో పాటు ఎన్నికల ముందు ఏప్రిల్, మే నెలలో కలిసి మొత్తం రూ.37,354 కోట్లు ఎక్కువగా అప్పుచేశారు. బాబు హయాంలో చేసిన ఎక్కువ అప్పుల కారణంగా ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేయాల్సిన అప్పుల్లో కేంద్రం కోత విధించింది. అయితే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో పరిమితి ఉన్నప్పటికీ ఇప్పటివరకు రూ.366.06 కోట్లు తక్కువ అప్పుచేసింది. వచ్చే ప్రభుత్వానికి అప్పు కూడా పుట్టకుండా మేమే అప్పులు చేశామని అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్న మాటలు మర్చిపోతే ఎలా రామోజీ? గుర్తున్నాసరే జగన్ సర్కారును తప్పుపట్టడమే పని కాబట్టి నిత్యం అప్పులపై తప్పుడు గణాంకాలతో డప్పు వాయిస్తున్నావా రామోజీ? అలాగే, చంద్రబాబు హయాంలో అప్పుల్లో సగటు వార్షిక వృద్ధి 21.87 శాతం ఉండగా.. ఇప్పుడు వైఎస్సార్సీపీ హయాంలో అది 12.13 శాతమే ఉంది. అప్పులు, ఆదాయ, వ్యయాల గణాంకాలన్నీ ప్రతీనెలా కాగ్ తన వెబ్సైట్లో ఉంచుతోంది. ఇది ఒక్క ఏపీవే కాకుండా అన్ని రాష్ట్రాల గణాంకాలు ఉంచుతోంది. ఇందులో దాపరికం ఎక్కడిది? నీవన్నీ తప్పుడు రాతలు తప్ప అందులో ఒక్కటీ వాస్తవంలేదు రామోజీ.. బాబుకు, జగన్‌కు తేడా ఇదీ.. వైఎస్ జగన్ సర్కారు అప్పులపై నిత్యం అక్కసును రంగరించి తప్పుడు గణాంకాలతో డప్పు వాయించంవల్ల నీ పత్రిక, నీ పరువు దిగజార్చుకోవడం తప్ప మరొకటి ఉండదు రామోజీ. వాస్తవానికి.. అప్పు చేయడం తప్పని ప్రతిపక్ష నేతగా జగన్ ఏనాడూ అనలేదు. పరిమితికి మించి అప్పు చేయడాన్నే ఆయన తప్పుబట్టారు. అయినా, చేసిన అప్పులతో ఒక శాశ్వత కట్టడం కూడా కట్టకుండా కేవలం హంగులు, ఆర్భాటాలు, విలాసాలకు వృధా వ్యయం చేయడాన్నే ఆయన తప్పుబట్టారు. పరిమితికి మంచి అప్పులు చేసినా మేనిఫెస్టోలో రైతులకు.. మహిళా సంఘాలకు, యువత తదితర రంగాలకు ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడాన్ని జగన్ తప్పుబట్టారు. అసలు చంద్రబాబు తన ఐదేళ్లు ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు మించి అప్పులు చేశారని కాగ్ గణాంకాలే స్పష్టంచేస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కోవిడ్ రెండేళ్లు తప్ప మిగతా సంవత్సరాలు ఆర్థిక సంఘం సిఫార్సుల కన్నా తక్కువగానే అప్పులుచేసింది. కోవిడ్ సంక్షోభం కారణంగా రాష్ట్ర ఆదాయంతో పాటు కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో రావాల్సిన రాబడి తగ్గిపోవడంతో వ్యయం పెరిగినా పరిమితికి లోబడే అప్పులు చేస్తూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలుచేసింది. మీ చంద్రబాబు మాదిరిగా రైతులకు, పొదుపు సంఘాల అక్కచెల్లమ్మలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చిన హమీలను జగన్ సర్కారు గాలికొదిలేయకుండా నవరత్నాలతో నేరుగా నగదు బదిలీ ద్వారా హామీలను నెరవేర్చింది. ఇదీ మీ బాబుకు వైఎస్ జగన్‌కు ఉన్న తేడా రామోజీ. -
తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా ఎం.రమేష్, సంకేపల్లి సుధీర్‌రెడ్డి, నెహ్రూ నాయక్ మాలోత్‌ను నియమించారు. వీరంతా ఈ పదవుల్లో రెండేళ్ల పాటు ఉండనున్నారు.ఇప్పటికే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా సీఎంవో మాజీ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌ను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరింది వీరే -
ఆర్థిక సంఘం నూతన చైర్మన్‌గా అరవింద్ పనగరియా
న్యూఢిల్లీ: నీతీ ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియాను 16వ ఆర్థిక సంఘం నూతన చైర్మన్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థికశాఖలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న రితి్వక్ రంజనం పాండేను ఆర్థికసంఘం కార్యదర్శిగా నియమించారు. పనగరియా గతంలో కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా సేవలందించారు. నూతన ఆర్థిక సంఘం 2026–27 నుంచి 2030–31 కాలానికి సంబంధించిన ఐదేళ్ల నివేదికను 2025 అక్టోబర్ 31వ తేదీకల్లా రాష్ట్రపతికి నివేదించనుంది. 16వ ఆర్థిక సంఘం ఏర్పాటు, విధి విధానాలు, కార్యచరణను నవంబర్ నెలలో ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రిమండలి ఆమోదించింది. కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల పంపకం, రెవిన్యూ వాటా తదితరాలపై ఆర్థిక సంఘం సూచనలు, సలహాలు ఇవ్వనుంది. విపత్తు నిర్వహణ చట్టం,2005 కింద మంజూరైన నిధులు కేంద్ర, రాష్ట్రాల్లో ఏ మేరకు సది్వనియోగం అవుతున్నాయనే అంశాలపై సంఘం సమీక్ష చేపట్టనుంది. 14వ ఆర్థిక సంఘం సలహా మాదిరే 2021–22 నుంచి 2025–26 ఐదేళ్లకాలానికి కేంద్రం పన్ను రాబడుల్లో 41 శాతం వాటా రాష్ట్రాలకు దక్కాలని ఎన్కే సింగ్ నేతృత్వంలోని 15వ ఆర్థిక సంఘం సిఫార్సుచేయడం తెల్సిందే. ఫైనాన్స్ కమిషన్ కేంద్ర,రాష్ట్ర ఆర్థిక సంబంధాలపై సూచనలు ఇచ్చే రాజ్యాంగబద్ధ సంస్థ. -
రాష్ట్రాల అసమానతలు తొలగాలంటే...
16వ ఆర్థిక సంఘం (ఫైనాన్స్ కమిషన్స్) నియామకం త్వరలో జరగనుందని భావిస్తున్నారు. 15వ కమిషన్స్ ఏర్పాటైన 2017తో పోలిస్తే ఇప్పుడు ప్రపంచ, దేశీయ సవాళ్లు భిన్నంగా ఉన్నాయి. కోవిడ్–19 ప్రేరేపించిన ఆర్థిక షాక్‌లు, భౌగోళిక రాజకీయ సవాళ్లతో సహా ప్రపంచ స్థూల ఆర్థిక అనిశ్చితిని 16వ కమిషన్స్ పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. ఫైనాన్స్ ్స కమిషన్స్ మినహా మరే ఇతర ప్రభుత్వ సంస్థ కూడా రాష్ట్రాల మధ్య అసమానతలపై దృష్టి సారించలేదని ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి అన్నారు. కొన్ని రాష్ట్రాలు అఖిల భారత పేదరిక నిష్పత్తిలో చాలా వెనుకబడి ఉన్నాయి. 16వ ఆర్థిక సంఘం ఈ అసమానతలను పరిశీలించి, ఆర్థిక పరిష్కారాలను అందించాలి. 2022–23లో కేంద్రం, రాష్ట్రాల సంయుక్త లోటు, అప్పులు వరుసగా 10 శాతం, 89 శాతంగా ఉన్నాయి. కేంద్ర పన్ను రాబడిలో రాష్ట్రాలకు ఎంత ఇవ్వాలి అనే క్షితిజ లంబ(వెర్టికల్) వాటాలనూ, దాన్ని రాష్ట్రాల మధ్య ఎలా పంపిణీ చేయాలి అనే క్షితిజ సమాంతర(హారిజాంటల్) వాటాలనూ ఆర్థిక సంఘం నిర్ణయిస్తుంది. కేంద్ర పన్నుల భాగస్వామ్య పూల్‌లో రాష్ట్రాల వాటాలను 14వ ఆర్థిక కమిషన్స్ 32 నుండి 42 శాతానికి పెంచింది. అయితే రాష్ట్రాల సంఖ్యను 28కి తగ్గించినప్పుడు, రాష్ట్రాల వాటాను 41 శాతంగా 15వ కమిషన్స్ సిఫార్సు చేసింది. 2022–23లో 6.5 శాతం ఆర్థిక లోటు, 58 శాతం అప్పుతో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక అసమతుల్యతతో ఉన్నందున ఈ వాటాను పెంచే అవకాశం లేనట్లు కనిపిస్తోంది. అయితే, 16వ ఆర్థిక కమిషన్స్ సెస్సులు, సర్‌ఛార్జీల అంశాన్ని పరిశీలించాలి. 2011–12లో ఉన్న 10 శాతం నికర పన్ను రాబడి (జీటీఅర్) నుండి 2019–20కి 20 శాతానికి పెరిగింది. వాస్తవానికి, కేంద్ర జీటీఅర్‌లో రాష్ట్రాల నిష్పత్తి 2018–19లో ఉన్న 36.6 శాతం నుండి 2022–23లో 30.2 శాతానికి తగ్గింది. సెస్సులు, సర్‌చార్జ్‌ల కోసం 10 శాతం జీటీఅర్ గరిష్ఠ పరిమితిగా ఉండాలని రంగరాజన్, శ్రీవాస్తవ సూచించారు. కమిషన్స్ దీనిని సిఫారసు చేయవచ్చు. అది 10 శాతాన్ని దాటితే, కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటాను పెంచవచ్చు. మరో మాటలో చెప్పాలంటే– సెస్సులు, సర్ఛార్జ్ల వాటాపై ఆధార పడి క్షితిజ లంబ వాటాను మార్పు చేయవచ్చు. పెరుగుతున్న అంతరాలు ఫైనాన్స్ ్స కమిషన్స్ అమలు చేస్తున్న క్షితిజ సమాంతర పంపిణీ ఫార్ములా అనేది, రాష్ట్రాల అసమానతలను పరిష్కరించడానికి ఒక ముఖ్యమైన పరికరం. ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి అసమాన తలపై రాసిన ఒక కథనంలో, ఫైనాన్స్ ్స కమిషన్స్ మినహా మరే ఇతర ప్రభుత్వ సంస్థ కూడా రాష్ట్రాల మధ్య అసమానతలపై దృష్టి సారించలేదని సూచించారు. అంతకుముందు ప్రణాళికా సంఘం తలసరి ఖర్చులు కూడా ధనిక రాష్ట్రాలకే ఎక్కువగా ఉండేవి. కేంద్ర ప్రాయో జిత పథకాలకు తగిన వాటా రాష్ట్రాలు చెల్లించగలగాలి. కానీ దేశీయ మార్కెట్ రుణాలు, బాహ్య రుణాల నిబంధనలు, షరతులు ధనిక రాష్ట్రాలకు అనుకూలంగా ఉంటాయి. అభివృద్ధి చెందిన రాష్ట్రాలలోనే పరిశ్రమ, వ్యాపారం కేంద్రీకృతమై ఉన్నందున బ్యాంక్ రుణ పరపతి తిరోగమనంగా ఉంటుంది. కేంద్ర పన్ను రాయితీలు కూడా తిరోగ మనంగానే ఉంటాయి. 12వ ఆర్థిక సంఘం నుండి 15వ ఆర్థిక సంఘం వరకు తలసరి స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ)పై పోల్చదగిన డేటాను పరిగణనలోకి తీసుకున్నప్పుడు రాష్ట్రాల్లో అసమా నతలు విస్తృతమవుతున్నాయి. రాష్ట్రాల వ్యాప్తంగా ‘కోఎఫిషియెంట్ ఆఫ్ వేరియేషన్స్’ 0.46 నుండి 0.67కి పెరిగింది. తలసరి జీఎస్డీపీలో అసమానతలు 15వ కమిషన్స్ నివేదికలో ఇచ్చిన డేటాలో అత్యధికంగా ఉన్నాయి. కాబట్టి, రాష్ట్ర స్థాయిలో ఆదాయంలో విస్తరిస్తున్న అసమాన తలను 16వ కమిషన్స్ పరిగణనలోకి తీసుకోవాలి. రాష్ట్రాలన్నింటిలోనూ, క్షితిజ సమాంతర పంపిణీ అనేది జనాభా, ప్రాంతం, తలసరి ఆదాయం వంటి సూచికలపైనా, జనాభా మార్పు, అటవీ విస్తీర్ణం వంటి ప్రోత్సాహక సంబంధిత సూచికలపైనా ఆధారపడి ఉంటుంది. రాష్ట్రాలన్నింటిలోనూ ఆదాయ అసమానత లను పరిష్కరించడానికి తలసరి ఆదాయంలో అంతరం అత్యంత ముఖ్యమైన సూచిక. 15వ కమిషన్స్లో ఆదాయ అంతరం 45 శాతం. ఆదాయ అంతరం వెనుక ఉన్న ముఖ్యమైన ఆలోచన ఏమిటంటే, రాష్ట్రాల మధ్య ఆర్థిక సామర్థ్య వ్యత్యాసాలు అనేవి పౌరులకు ఆరోగ్యం, విద్య, నీరు, పారిశుధ్యం వంటి ప్రాథమిక సేవలను పొందడానికి ఆటంకం కాకూడదు. ఇప్పటికీ దిగువే... ఫైనాన్స్ కమిషన్స్ నివేదికల్లోని పోల్చదగిన గణాంకాలను బట్టి, బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం వంటి రాష్ట్రాలు తక్కువ ర్యాంకులో ఉన్నాయి. గత రెండు దశాబ్దాలుగా వీటిలో పెద్ద మార్పు లేదు. కనిష్ఠ తలసరి జీఎస్డీపీ (బిహార్‌కి చెందినది) మరియు గరిష్ఠ తలసరి జీఎస్డీపీ నిష్పత్తి (ఇది గోవాను మినహాయించిన తర్వాత, పంజాబ్ లేదా హరియాణాను సూచిస్తుంది) 1999–2002 లోని త్రైవార్షిక సగటు 23.3 శాతం నుండి 2016–2019లో 17.7 శాతానికి తగ్గింది. బహుమితీయ పేదరికంపై నీతి అయోగ్ ఇటీవలి నివేదిక ప్రకారం చూసినప్పుడు, అఖిల భారత పేదరికం నిష్పత్తి అయిన 15 శాతంతో పోలిస్తే బిహార్‌లో అత్యధిక పేదరికం (33.76 శాతం) ఉంది. తర్వాతి స్థానాల్లో జార్ఖండ్ (28.81), యూపీ (22.93), మధ్యప్రదేశ్ (20.63), అస్సాం (19.35) ఉన్నాయి. ఈ నేపథ్యంలో, 16వ కమిషన్స్ సిఫార్సులు అసమానతలను తగ్గించడంలో, ప్రత్యేకించి ఆదాయం విషయంలో ముఖ్యమైనవి. క్షితిజ సమాంతర పంపిణీ అనేది రాజకీయంగా అత్యంత సున్నితమైన అంశం. అధిక పనితీరు కనబరుస్తున్న దక్షిణాది రాష్ట్రాలు, కాలక్రమేణా తమ వాటా తగ్గుముఖం పట్టిందనీ, ఆదాయం, జనాభా స్థిరీకరణ, మానవాభివృద్ధిలో మెరుగైన పనితీరు కారణంగా తమను దండి స్తున్నారనీ ఫిర్యాదు చేస్తున్నాయి. పన్నుల పంపిణీకి సమాంతర పంపిణీ సూత్రంతో ముడిపెట్టకూడదని ఒక సూచన. తక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు గ్రాంట్లు అందించవచ్చు. కానీ పన్నుల పంపిణీ అనేది మొత్తం బదిలీలలో 80 శాతంగా ఉన్నట్లయితే ప్రగతిశీలంగా ఉంటుందనీ, గ్రాంట్లు (మొత్తం బదిలీలలో 20 శాతం)గా ఉన్నట్ల యితే తిరోగమన శీలంగా ఉంటుందనీ అనుభవం సూచిస్తోంది. అందువల్ల, తక్కువ తలసరి ఆదాయ రాష్ట్రాలకు సహాయం చేయడా నికి గ్రాంట్లు మరింత ప్రగతిశీలంగా ఉండాలి. సాధారణంగా, అంత ర్రాష్ట్ర అసమానతలను పరిష్కరించే ఏకైక సంస్థ అయినందున, ఫైనాన్స్ ్స కమిషన్స్ పన్నుల పంపిణీ, గ్రాంట్లు రెండింటిలోనూ సమధర్మ సూత్రానికి మరింత సున్నితంగా ఉండాలి. రాష్ట్రాలే ప్రగతికి కీలకం 16వ ఆర్థిక సంఘం పరిశీలించాల్సిన ఇతర అంశాలు: సంక్షో భాన్ని ఎదుర్కోవడానికి మరిన్ని ప్రోత్సాహకాలు, మానవాభివృద్ధిని మెరుగుపరచడం, రెవెన్యూ లోటు గ్రాంట్ల పరిశీలన, స్థానిక సంస్థలకు నిధుల బదిలీ, కేంద్రం, రాష్ట్రాలు రెండూ అందిస్తున్న ఉచితాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్) పునరుద్ధరణ. సీఎస్ఎస్ విషయానికొస్తే, రాష్ట్రాలు మరింత సరళతతో పథకాల రూపకల్పనలో పాల్గొనవచ్చు. ఆదాయ వ్యయాల శాతంగా ఉచితాలపై కొంత పరి మితి ఉండాలి. ఉచితాలపై సిఫార్సులు కేంద్రం, రాష్ట్రాలు రెండింటికీ వర్తిస్తాయి. ఆర్థిక నియమాల ఆధారంగా రుణాన్ని, ఆర్థిక స్థిరత్వ విశ్లేష ణను అందించడానికి స్వతంత్ర ఆర్థిక మండలిని ఏర్పాటు చేయాలనే సూచనలు కూడా ఉన్నాయి. చివరగా, సమ్మిళిత అభివృద్ధితో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశ హోదాను సాధించాలని భారతదేశం ఆకాంక్షిస్తోంది. ఈ లక్ష్యా లను సాధించడంలో రాష్ట్రాల పాత్ర సమానంగా లేదా అంతకంటే ముఖ్యమైనది. రాష్ట్రాలు మొత్తం ప్రభుత్వ వ్యయంలో 60 శాతం ఖర్చు చేస్తాయి. విద్య, ఆరోగ్య వ్యయంలో 70 శాతం, మూలధన వ్యయంలో మూడింట రెండు వంతులు ఖర్చు చేస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులలో 79 శాతం మందిని రాష్ట్రాలు నియమిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, అంతర్రాష్ట్ర అసమానతలను తగ్గించడంలో 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు ముఖ్యమైనవి. ఎస్. మహేంద్ర దేవ్ వ్యాసకర్త హైదరాబాద్ ‘ఇక్ఫాయ్’లో విశిష్ట ప్రొఫెసర్ (‘ది హిందుస్థాన్స్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఎకానమీ 7 శాతం వృద్ధి సాధ్యమే
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా అభిప్రాయపడ్డారు. రానున్న బడ్జెట్లో ఆశ్చర్యకమైన ప్రతికూల అంశాలు ఏవీ లేకపోతే వచ్చే ఆర్థిక సంవత్సరానికి సైతం జీడీపీ ఇదే స్థాయిలో వృద్ధి చెందే అవకాశాలున్నట్టు చెప్పారు. మాంద్యానికి సంబంధించిన భయాలు కొంత కాలంగా వినిపిస్తున్నప్పటికీ.. ఇప్పటి వరకు అమెరికా కానీ, యూరప్ కానీ మాంద్యంలోకి జారలేదన్నారు. భారత్‌కు సంబంధించి గడ్డు పరిస్థితులు ముగిసినట్టేనన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను ఇటీవలి సమీక్షలో ఆర్బీఐ 7 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గించడం తెలిసిందే. ప్రపంచబ్యాంకు కూడా భారత్ జీడీపీ 6.9% వృద్ధిని సాధిస్తుందన్న అంచనాలను వ్యక్తం చేసింది. రూపాయిపై ఒత్తిడి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ 7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని తాను ఇప్పటికీ భావిస్తున్నట్టు పనగరియా స్పష్టం చేశారు. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు కారణంగా విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళుతుండడం రూపాయిపై ఒత్తిడికి దారితీసినట్టు వివరించారు. నవంబర్ నెల నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ ఆగి, నికర పెట్టుబడులకు దారితీసిన విషయాన్ని పనగరియా గుర్తు చేశారు. దీనికితోడు అమెరికాలో ద్రవ్యోల్బణం దిగొస్తుండడంతో అక్కడ కూడా గడ్డు పరిస్థితులు ముగిసినట్టేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు రూపాయి ఇదే కాలంలో యూరో, యెన్ తదితర కరెన్సీలతో బలపడిన విషయాన్ని ప్రస్తావించారు. దీనికంటే ముందు నాటికే రూపాయి అధిక వ్యాల్యూషన్లో ఉన్నట్టు చెప్పారు. కనుక సమీప కాలంలో డాలర్‌తో రూపాయి విలువ మరింత తగ్గడం పట్ల తాను సానుకూలంగా ఉన్న ట్టు తెలిపారు. లేబర్ ఫోర్స్ సర్వే గణాంకాలను గమనిస్తే దేశంలో నిరుద్యోగం ఏమంత అధికంగా లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. -
ఉచితాలకు అడ్డుకట్ట వేద్దాం.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు చేసే ఉచిత వాగ్దానాలు తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ‘‘వీటిని వ్యతిరేకించడానికి, పార్లమెంటులో చర్చించడానికి ఏ పార్టీ కూడా ఇష్టపడదు. ఇవి కొనసాగాలనే కోరుకుంటుంది. కాబట్టి ఈ పోకడకు అడ్డుకట్ట వేయడానికి ఏం చేయాలో కేంద్ర ప్రభుత్వంతో పాటు నీతి ఆయోగ్, ఫైనాన్స్ కమిషన్, ఆర్బీఐ వంటి సంస్థలు మేధోమథనం చేసి నిర్మాణాత్మక సూచనలివ్వాలి. విపక్షాలను కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలి’’ అని సూచించింది. ఉచిత పథకాలను ప్రకటించే పార్టీల గుర్తింపును, వాటి ఎన్నికల గుర్తును రద్దు చేసేందుకు ఎన్నికల సంఘానికి అధికారాలు కల్పించాలంటూ అశ్వినీ ఉపాధ్యాయ్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మానసం బుధవారం విచారణ జరిపింది. ఈ విషయంలో ఏమీ చేయలేమని మాత్రం కేంద్రం, ఎన్నికల సంఘం చెప్పొద్దని, కూలంకషంగా పరిశీలించి సలహాలివ్వాలని స్పష్టం చేసింది. పిల్లో లేవనెత్తిన అంశాలకు కేంద్రం కూడా మద్దతిస్తోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. ‘‘ప్రజాకర్షక పథకాలతో ఇష్టారీతిన ఉచితాల పంపకం మున్ముందు ఆర్థిక వినాశనానికి దారి తీస్తుంది. ఉచితాల ద్వారా తన కుడి జేబులోకి కొంత వస్తున్నా తర్వాత్తర్వాత ఎడమ జేబుకు ఎంత కోత పడుతుందో సగటు పౌరుడు ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. కనుక ఓటర్లు తమ ఓటు హక్కును తెలివిడితో ఉపయోగించుకునే వీల్లేకుండా పోతుంది’’ అంటూ ఆందోళన వెలిబుచ్చారు. ఈ అంశం ఈసీ పరిధిలోనిదని ఇప్పటిదాకా కేంద్రం చెబుతూ వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ అంశమై కేంద్రానికి సలహాలిచ్చేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలిస్తామని ధర్మాసనం సంకేతాలిచ్చింది. దీనిపై గురువారం కూడా విచారణ కొనసాగనుంది. -
తెలంగాణపై ఆర్థిక వివక్ష తగదు
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం ఆర్థిక వివక్ష చూపుతోందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా రుణాల సమీకరణకు అవకాశం ఇవ్వకపోవడం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి అడ్డుపడడమేనని ధ్వజమెత్తింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో సోమ వారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. మూలధన వ్యయం కోసం 2022–23 సంవత్సరానికి రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సాయం, రుణాలు తీసుకునే మార్గదర్శకాలు, కేంద్ర ప్రాయోజిత పథ కాలకు నిధుల కోసం ఒకే నోడల్ ఏజెన్సీ నమూనా వంటి అంశాలు ప్రధాన ఎజెండాగా ఇది కొనసాగింది. అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ అధికారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ టీవీ సోమనాథన్ మాట్లాడుతూ.. రాష్ట్రాలు జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) పరిమితులకు అదనంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా నిధులను సమకూర్చుకుని, ఆ అప్పులను రాష్ట్రాల నిధుల నుండి చెల్లిస్తున్నాయని చెప్పారు. అందువల్ల ఆ అప్పులను కూడా రాష్ట్రాల అప్పులుగానే భావిస్తామని తెలిపారు. ఈ ప్రతిపాదనను రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ ప్రభుత్వ వాదనను గట్టిగా వినిపించారు. ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాదని కేంద్రమే చెప్పింది.. మూలధన వ్యయం కింద 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.12 వేల కోట్లు , 2021–22లో రూ.15 వేల కోట్లు , 2022–23లో లక్ష కోట్లను రుణాల రూపేణా రాష్ట్రాలకు ఇస్తూ.. వాటిని మూలధన వ్యయం కింద ఖర్చు చేస్తే ఎఫ్ఆర్బీఎం పరిధిలోనికి రాదని గతంలో కేంద్రమే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా మూలధన వ్యయానికి సంబంధించినవేనని తెలిపారు. ప్రధానంగా కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్ లిమిటెడ్ , తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లకు చెందిన వివిధ దశల్లో ఉన్న ఈ ప్రాజెక్టులు పూర్తయితేనే ఆయా కార్పొరేషన్లు ప్రభుత్వ గ్యారంటీలపై పొందిన రుణాలను తిరిగి చెల్లించగల స్థితికి వస్తాయని వెల్లడించారు. కార్పొరేషన్ల ద్వారా సేకరించే అప్పులను రాష్ట్ర అప్పులుగా ఎలా పరిగణిస్తారని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన హడ్కో, ఎన్‌సీడీసీలు ఇచ్చే రుణాల చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వమే చేస్తున్నప్పటికీ వాటిని రాష్ట్రాల అప్పుల పరిధిలోకి తీసుకురాలేదని చెప్పారు. కానీ వాటిలో కొన్ని అప్పులను ఎఫ్ఆర్బీఎం పరిధిలో చూపడం, మరికొన్నింటిని చూపకపోవడం వివక్షే అవుతుందని స్పష్టం చేశారు. ఇలాంటి వివక్షపూరిత చర్యలు సరికావని పేర్కొన్నారు. మూలధన వ్యయంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇది అత్యంత కక్షపూరిత చర్య 15వ ఆర్థిక సంఘం ఎలాంటి సిఫారసులు చేయకపోయినా కేంద్రం పనిగట్టుకుని అకస్మాత్తుగా ’ఆఫ్ బడ్జెట్’ (ప్రభుత్వం నేరుగా తీసుకోని అప్పులు) అప్పులను రాష్ట్రాల అప్పులుగా పరిగణిస్తామని చెప్పడం అత్యంత కక్షపూరిత చర్య అని రామకృష్ణా రావు పేర్కొన్నారు. రాష్ట్రాల అప్పుల సమీకరణకు నిబంధనల పేరుతో బంధనాలు వేయడం తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం చూపే వివక్షగానే భావించాల్సి వస్తుందని చెప్పారు. ఒకవేళ నూతన నిబంధనలను అమలుపరచదలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుండి అమలు చేయాలి కానీ గత సంవత్సరం నుంచి అమలు చేస్తామని చెప్పడం ఏ మాత్రం తగదన్నారు. రాజ్యాంగం ప్రకారం అప్పు తీసుకునేందుకు అవసరమైన అనుమతులను వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఏ నిబం ధనలు పాటిస్తుందో అవే నిబంధనలు తెలంగాణ ప్రభుత్వం కూడా పాటిస్తుందని చెప్పారు. -
ఆంధ్రప్రదేశ్‌కు మరో రూ.879 కోట్లు విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సహా 14 రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక శాఖ 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రెండో నెల వాయిదాగా రూ.7,183.42 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల మొత్తం రెవెన్యూ లోటు గ్రాంట్ రూ.86,201 కోట్లుండగా.. అందులో 14 రాష్ట్రాలకు పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ లోటు(పీడీఆర్డీ) గ్రాంట్ రెండో నెలవారీ వాయిదాను శుక్రవారం కేంద్రం విడుదల చేసింది. 2022ృ23కి ఆంధ్రప్రదేశ్‌కు సిఫార్సు చేసిన పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ లోటు గ్రాంట్ రూ.10,549 కోట్లు కాగా, రెండో నెల విడతగా రూ.879.08 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం అందించింది. -
ద్రవ్యలోటు కట్టడికి చర్యలు అవశ్యం
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును కట్టడిలోకి తీసుకోడానికి విశ్వసనీయ చర్యలు అవసరమని 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ పిలుపునిచ్చారు. కోవిడ్ మహమ్మారి సవాళ్లు తొలగిన వెంటనే ఈ బాటలో చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశ రుణ భారం ఇప్పటికి అటు ఆందోళనకరంగాకానీ లేదా ఇటు తగిన స్థాయిలో కానీ లేదని ఆయన విశ్లేíÙస్తూ, ఆర్థిక ఉద్దీపన చర్యలను కోరడానికి ముందు ఆయా వర్గాలన్నీ దేశ రుణ భారం అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహమ్మారి నేపథ్యంలో ఎదుర్కొంటున్న సవాళ్ల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెకించడానికి కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దాదాపు రూ.30 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజ్‌లను ప్రకటించిన సంగతి తెలిసిందే. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఇది 15 శాతం. ద్రవ్యలోటు పెరుగుదలపై విభిన్న వాదనల నేపథ్యంలో ఎన్కే సింగ్ ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. 2019– 20లో ద్రవ్యలోటు 4.6 శాతం (స్థూల దేశీయోత్పత్తి– జీడీపీతో పోల్చి). అప్పటికే ఇది ఏడేళ్ల గరిష్టం. గత ఆర్థిక సంవత్సరం (2020–21) ద్రవ్యలోటు జీడీపీలో 3.5 శాతానికి (రూ.7.96 లక్షల కోట్లు) కట్టడి చేయాలన్నది లక్ష్యమయితే, కరోనా ఈ లక్ష్యానికి గండి కొట్టింది. భారీ వ్యయాలు, ఉద్దీపనల నేపథ్యంలో ద్రవ్యలోటు ఏకంగా 9.3 శాతానికి (రూ.18,21,461 కోట్లు) ఎగసింది. 2021–22లో జీడీపీలో 6.8 శాతం (రూ.15,06,812 కోట్లు)ఉండాలన్నది బడ్జెట్ లక్ష్యం. అయితే 8 శాతం దాటిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూలై ముగిసే సరికి రూ.3.21 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 2021–22 వార్షిక బడ్జెట్ అంచనాలతో పోలి్చతే ఇది 21.3 శాతం. 15వ ఫైనాన్స్ కమిషన్ సూచనలు.. ప్రభుత్వం కొంత ధైర్యం చేసి ద్రవ్యలోటు లక్ష్యాలను పెంచవచ్చని ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ వంటి పలువురు సూచిస్తున్నారు. అయితే ఇలాంటి ప్రతిపాదనల అమలును రేటింగ్, బహుళజాతి ఆర్థిక సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆయా పరిస్థితుల నేపథ్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం– 2021–22 నాటికి ద్రవ్యలోటు 6 శాతానికి తగ్గాలి. 2022–23 నాటికి 5.5 శాతానికి దిగిరావాల్సి ఉంటుంది. 2023–24 నాటికి 5 శాతానికి, 2024–25 నాటికి 4.5 శాతానికి, 2025–26 నాటికి 4 శాతానికి తగ్గించాల్సి ఉంటుంది. ద్రవ్యలోటును పూడ్చుకోవడంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) ప్రభుత్వ రంగ కంపెనీలు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి వాటాల విక్రయం ద్వారా (పెట్టుబడుల ఉపసంహరణల) కేంద్రం రూ.1.75 లక్షలు సమకూర్చుకోవాలని నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఆయా అంశాల నేపథ్యంలో సామాజిక ఆర్థిక పురోగతి వ్యవహారాల కేంద్రం (పీఎస్‌ఈపీ)– ప్రపంచబ్యాంక్ నిర్వహించిన సెమినార్లో 15 ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ చేసిన ప్రసంగంలో ద్రవ్యలోటుపై ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఆరోగ్య రంగంపై వ్యయాలు పెరగాలి
న్యూఢిల్లీ: ఆరోగ్య రంగంపై ప్రభుత్వ వ్యయాలు పెరగాల్సిన అవసరం ఉందని 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ బుధవారం స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఈ విలువ కేవలం 0.95 శాతం ఉందని పేర్కొన్న ఆయన, 2024నాటికి ఇది 2.5 శాతానికి చేరాలని సూచించారు. దురదృష్టవశాత్తూ, ఆరోగ్య రంగానికి సంబంధించి దేశంలో మౌలిక సదుపాయాలు దారుణంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఆసియా హెల్త్ 2020 అనే అంశంపై పారిశ్రామిక వేదిక సీఐఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో సింగ్ మాట్లాడారు. ఆరోగ్య రంగంలో సవాళ్లను ఏ ఒక్కరో ఎదుర్కొనలేరనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ... ఈ రంగంపై కేటాయింపులను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ మేరకు ప్రభుత్వాల నుంచి చర్యలు ఉంటాయని తాను విశ్వసిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఎంబీబీఎస్ కోర్సు పరిధి పెంచడం వంటి రెగ్యులేటరీ మార్పులను కూడా పరిశీలనలోకి తీసుకున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం... ఆరోగ్య సేవల రంగంలో ప్రైవేటు రంగం భాగస్వామ్యం కూడా కీలకమని సింగ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. వినూత్న నైపుణ్యలతో ప్రైవేటు రంగం చక్కటి సేవలను అందించగలుగుతుందన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో మంచి ఫలితాలను సాధించవచ్చని అన్నారు. కోవిడ్–19ను ఎదుర్కొనడంలో ఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్స్ కీలకపాత్ర పోషించారని పేర్కొన్న సింగ్, ఆరోగ్య సేవల విషయంలో మరింత గుర్తింపు లభించడానికి వారు అర్హులని అన్నారు. ‘ఆల్ ఇండియా మెడికల్ సర్వీస్’ ప్రస్తావన ‘‘ఆల్ ఇండియా మెడికల్ సర్వీస్ ఏర్పాటవుతుందని 1951 సివిల్ సర్వీసెస్ యాక్ట్ పేర్కొంది. ఆశ్చర్యకమైన విషయం ఏమిటంటే, అప్పటి నుంచీ ఈ తరహా సర్వీస్ ఏదీ ఏర్పాటు కాలేదు’’ అని సందర్భంగా పేర్కొన్న సింగ్, అంతర్జాతీయ ప్రమాణాలు, ఇప్పటికే చోటుచేసుకున్న పరిణా మాలు, ఉదాహరణల ప్రాతిపదికన ఈ సర్వీసు ఏర్పాటుకావాల్సిన అవసరం ఉందని సూచించారు. ఆరోగ్యం రంగం పలు సమస్యలు, సవాళ్ల వలయంలో చిక్కుకుందనీ వ్యాఖ్యానించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తరహాలో ఇండియన్ మెడికల్ సర్వీస్ (ఐఎంఎస్)ను ఏర్పాటు చేయాలని ఇండియన్ మెడికన్ అసోసియేషన్ (ఐఎంఏ) గత కొంత కాలంలో డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 2021–22 నుంచి 2025–26 మధ్య దేశ ఆర్థిక రంగంలో తీసుకోవాల్సిన చర్యలపై సింగ్ నేతృత్వంలోని 15వ ఫైనాన్స్ కమిషన్ ఇప్పటికే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీలకు తన సిఫారసులను సమర్పించిన సంగతి తెలిసిందే. పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత నివేదికాంశాలు వెల్లడవుతాయి. -
ప్రధానికి 15వ ఫైనాన్స్ కమిషన్ నివేదిక
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీకి సోమవారం 15వ ఫైనాన్స్ కమిషన్ తన నివేదికను సమర్పించింది. రానున్న ఐదు సంవత్సరాల్లో (2021–22 నుంచి 2025–26) కేంద్రం–రాష్ట్రాల మధ్య పన్ను విభజనసహా పలు ఫైనాన్షియల్ సంబంధాలపై 15వ ఫైనాన్స్ కమిషన్ తన సిఫారసులను చేసింది. ‘ఫైనాన్స్ కమిషన్ ఇన్ కోవిడ్ టైమ్స్’ శీర్షికన రూపొందించిన ఈ నివేదికను మంగళవారం కమిషన్ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు కూడా సమర్పించనుంది. నవంబర్ 9న కమిషన్ తన నివేదికను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సమర్పించిన సంగతి తెలిసిందే. 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్, సభ్యులు అజయ్ నారాయన్ ఝా, అనూప్ సింగ్, అశోక్ లాహిరి, రమేశ్ చంద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యాంగం నిర్దేశిస్తున్న ప్రకారం, చర్యల నివేదికతో పాటు కమిషన్ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఉన్నత స్థాయి వర్గాల సమాచారం ప్రకారం– కోవిడ్–19 నేపథ్యంలో కమిషన్ ప్రత్యేకంగా 2020–21కి సంబంధించి ఒక నివేదికను సమర్పించింది. ఐదేళ్ల కాలానికి కమిషన్ తన సిఫారసులను 2020 అక్టోబర్ 30 నాటికి సమర్పించడం తప్పనిసరి. పలు కీలక ఫైనాన్షియల్ అంశాలకు సంబంధించి సిఫారసులను ఇవ్వాలని 15వ ఫైనాన్స్ కమిషన్‌ను కేంద్రం కోరింది. కిందిస్థాయి వరకు పన్ను పంపిణీ, స్థానిక ప్రభుత్వ నిధులు, విపత్తు నిర్వహణ గ్రాంట్‌తో పాటు విద్యుత్, నగదు బదిలీ అమలు, వ్యర్థాల నిర్వహణ వంటి అనేక రంగాలలో రాష్ట్రాలకు పనితీరు ప్రోత్సాహకాలను పరిశీలించి సిఫారసు చేయాలని కమిషన్‌ను కోరింది. -
15వ ఆర్థిక సంఘం నివేదిక రాష్ట్రపతి ముందుకు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని పన్నులు ఆదాయాలలో కేంద్ర, రాష్ట్రాల వాటాలను నిర్ణయించే 15వ ఆర్థిక కమిషన్ తన తుది వేదికను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అందించింది. ఎన్కే సింగ్ నేతృత్వంలోని కమిషన్ 2022-26 వరకు సంబంధించిన సిఫారసులను సోమవారం సమర్పించింది. కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే నిధుల్లో భారీగా కోత విధించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 42 శాతం నిధుల బదలాయింపును తగ్గిస్తూ సిఫారసులు చేసింది. కోవిడ్-19 సంక్షోభం, భారీగా క్షీణించిన ఆదాయాలు నేపథ్యంలో సంఘం సిఫారసులను ప్రభావితం చేసినట్టు అంచనా. ప్రతి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను లోతుగా కమిషన్ విశ్లేషించిందనీ, అలాగే ప్రధానంగా ఆఆయార రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ముఖ్య సవాళ్లను పరిష్కరించేందుకు నిర్దిష్ట పరిశీలన చేసినట్టు సమాచారం. 'ఫైనాన్స్ కమిషన్ ఇన్ కోవిడ్ టైమ్స్' పేరుతో ఈ నివేదికను సమర్పించింది. అంతకుముందు 10శాతం పెంపుతో కేంద్ర పన్ను వసూళ్లలో 42 శాతం రాష్ట్రాలకు ఇవ్వాలని 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. అయితే 15వ ఆర్ధిక సంఘం దీనికి భిన్నంగా 2020-21సంవత్సరానికి 41 శాతం రాష్ట్రాలకు బదిలీ చేయాలని సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. అలాగే దీనికి ఒక శాతం తగ్గింపు (41 శాతం)తో కొత్తగా ఏర్పడిన జమ్మూ కాశ్మీర్, లడాఖ్‌కు చెల్లించాలని చెప్పింది. దీంతో నిధుల్లో తగ్గుదల వల్ల అనేక రాష్ట్రాలు చేపడుతున్న సంక్షేమ పథకాలకు గట్టి దెబ్బ పడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాంప్రదాయ నిధుల కేటాయింపు సిఫారసులతోపాటు వచ్చే ఐదేళ్ళలో కేంద్రానికి ఆర్థిక ఏకీకరణ దిశగా ఒక మార్గాన్ని రూపొందించాలని కూడా కేంద్రానికి సిఫారసు చేసింది. రక్షణ, అంతర్గత భద్రతకు నిధులు సమకూర్చడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని అలాంటి, యంత్రాంగాన్ని ఎలా అమలు చేయవచ్చో కూడా పరిశీలించాలని కేంద్రాన్ని కోరింది. 2019-20లో కేంద్రం రూ .21.6 ట్రిలియన్లు వసూలు చేస్తుందని అంచనా వేయగా, (సవరించిన అంచనాలు) కాని రాష్ట్రాల వాటా కేవలం రూ .6.6 ట్రిలియన్లుగా ఉంది. ఇది మొత్తం పన్ను మొత్తంలో కేవలం 30.3 శాతం మాత్రమే. 14 వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం ఇది 42 శాతంగా ఉండాలి. కేంద్రం రాష్ట్రాలు కలిపి దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) లో 2.5 శాతం ఆరోగ్య రంగానికి ఖర్చు చేయాలని కమిషన్ సిఫారసు చేసినట్టు తెలేస్తోంది. ప్రస్తుతం, వారు 0.9 శాతం మాత్రమే. 0.3 శాతం కేంద్రం నుండి 0.6 రాష్ట్రాల నుండి వెచ్చిస్తున్నాయి. అనేక ప్రత్యేకమైన, విస్తృత సమస్యలపై కమిషన్ తన సిఫారసులను ఇవ్వమని కమిషన్ కోరింది. వివిధ పన్నుల పంపిణీ, స్థానిక ప్రభుత్వ నిధులు, విపత్తు నిర్వహణ నిధులు కాకుండా, విద్యుత్ రంగం, డీబీటీ స్వీకరణ వంటి అనేక రంగాలలో రాష్ట్రాలకు పనితీరు ప్రోత్సాహకాలను పరిశీలించి సిఫారసు చేయాలని కమిషన్ కోరినట్టు తెలుస్తోంది. ఈ నివేదిక కాపీని ఈ నెలాఖరుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అందజేస్తారు. రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి సమర్పించే కేంద్ర బడ్జెట్‌తోపాటు, ఈ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టేవరకు పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదు. -
మరో ఉద్దీపనకు చాన్స్
న్యూఢిల్లీ: కరోనా ప్రేరిత సమస్యల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి మరో ఉద్దీపన ప్రకటన అవకాశం ఉందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఒక సూచనప్రాయ ప్రకటన చేశారు. అధికార బాధ్యతల్లో తన అనుభవాలకు సంబంధించి 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ రాసిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించిన నిర్మలాసీతారామన్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి ప్రభావాలపై కేంద్రం మదింపు ప్రక్రియను అక్టోబర్ నుంచీ ప్రారంభించినట్లు ఆమె పేర్కొన్నారు. మదింపు ఫలితాలకు సంబంధించి ఆర్థికశాఖ ప్రకటన చేస్తుందనీ తెలిపారు. ‘మరో ఉద్దీపన అవకాశాన్ని తోసిపుచ్చడం లేదు. లోతైన సంప్రదింపుల అనంతరం మేము ఇప్పటివరకూ 2 ఉద్దీపనలను ప్రకటించాము’ అని ఆమె ఈ సందర్భంగా అన్నారు. వ్యూహాత్మక, వ్యూహాత్మకేతర రంగాలను వర్గీకరించడానికి ఆర్థికశాఖ త్వరలో క్యాబినెట్‌ను సంప్రదిస్తుందని కూడా ఆర్థికమంత్రి తెలిపారు. వ్యయాలపై సీపీఎస్ఈలకు నిర్మలాసీతారామన్ సూచన ఇదిలావుండగా, బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు శాఖల కార్యదర్శులతోపాటు.. 14 భారీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ) సీఎండీలతో ఆర్థిక మంత్రి సోమవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీపీఎస్ఈలు 2020–21లో నిర్దేశించుకున్న మూలధన వ్యయ లక్ష్యాల్లో 75% డిసెంబర్‌కి చేరుకోవాలని.. తద్వారా ఆర్థిక వృద్ధికి మద్దతుగా నిలవాలని కోరారు. కరోనా కారణంగా కుంటుపడిన ఆర్థిక వృద్ధిని తేజోవంతం చేసేందుకు గాను ఆర్థిక మంత్రి వివిధ భాగస్వాములతో భేటీ కావడం ఇది నాలుగోది. మూలధన వ్యయాలను 2020–21, 2021–22లో వేగవం తం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. 2019–20కి 14 సీపీఎస్ఈలు రూ.1,11,672 కోట్లను మూలధన వ్యయాల రూపంలో ఖర్చు చేయాలని నిర్దేశించుకోగా.. రూ.1,16,323 కోట్లు (104%) ఖర్చు చేసినట్టు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.1,15,934 కోట్ల వ్యయాలను అవి లక్ష్యంగా పెట్టుకోగా.. తొలి 6 నెలల్లో (సెప్టెంబర్ నాటికి) కేవలం రూ.37,423 కోట్లనే వ్యయం చేశాయి. తయారీపై దృష్టి పెట్టాలి: ముకేశ్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ మాట్లాడుతూ, భారత్ మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 70% వాటా ఉన్న తయారీ రంగంలో పెట్టుబడులపై భారత్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. తీసుకుంటున్న చర్యల ఫలితాలు, భవిష్యత్తులో పరిశ్రమలు, సేవా రంగాల పనితీరుపై సమగ్ర మదింపు జరపాలని సూచించారు. దేశ స్వయం సమృద్ధి విషయంలో ఇది కీలకమన్నారు. ‘ఒక పాఠశాల ఉపాధ్యాయుని కుమారుడైన మా తండ్రి 1960లో ముంబైలో అడుగుపెట్టారు. అప్పుడు ఆయన దగ్గర ఉంది కేవలం రూ.1,000. భవిష్యత్ వ్యాపారాలు, ప్రావీణ్యతల్లో పెట్టుబడి పెడితే మనం కలలుగన్న భారతాన్ని మనమే నిర్మించుకోగలమన్న విశ్వాసం ఆయనది. ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థలను, కంపెనీలను సృష్టించగలమన్న నమ్మకం ఆయన సొంతం’ అని ముకేశ్ పేర్కొన్నారు. -
స్థానిక సంస్థలకు నిధులొస్తున్నాయ్..!
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ స్థానిక సంస్థలకు శుభవార్త. నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న మండల, జిల్లా పరిషత్‌లకు ఈ ఏడాది నుంచి మనుగడలోకి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధుల్లో కొంత మేర వాటా దక్కనుంది. 2015–20 వరకు అమల్లో ఉన్న 14వ ఆర్థిక సంఘం గ్రామ పంచాయతీలకే నేరుగా నిధులు బదలాయించేది. వాస్తవానికి 13వ ఆర్థిక సంఘం వరకు మూడంచెల వ్యవస్థలకు పంచాయతీ, మండల, జెడ్పీలకు నిర్దేశిత నిష్పత్తిలో నిధులను కేంద్రం విడుదల చేసింది. కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి రాగానే ఈ విధానానికి మంగళం పాడింది. ఆర్థిక సంఘం నిధుల నుంచి మండల, జిల్లా పరిషత్‌లకు కోత విధించి.. 100 శాతం నిధులను పంచాయతీలకే బదలాయించింది. మధ్యంతర నివేదిక ఆధారంగా.. 15వ ఆర్థిక సంఘం ఇటీవల కేంద్రానికి మధ్యంతర నివేదిక అందజేసింది. ఈ సిఫార్సులకు అనుగుణంగా దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలకు ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.60,750 కోట్లు మంజూరు చేసిన కేంద్రం.. తెలంగాణకు రూ.1,847కోట్లు కేటాయించింది. ఈ నిధులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మ్యాచింగ్ గ్రాంట్ సర్దుబాటు చేయనుంది. ఆర్థిక సంఘం నిధులకు సమానం గా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను ఇస్తుందని సీఎం కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరో రూ.1,847 కోట్లను రాష్ట్రం సర్దుబాటు చేస్తుం దని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతి నెలా రూ.339 కోట్లను గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తోంది. గతేడాది కంటే ఎక్కువే... వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్రం గతేడాది కన్నా రూ.396 కోట్లు అధికంగా ఇవ్వనుంది. రూ.1874 కోట్లను రెండు విభాగాలుగా ఖర్చు పెట్టాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రటరీ సంజీవ్ పత్‌జోషి.. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖకు ఇటీవల రాసిన లేఖలో సూచించారు. గ్రామీణ స్థానిక సంస్థల్లోని తక్షణ అవసరాలకు ఖర్చు చేసేందుకు ఇందులో సగం నిధులను ఉపయోగించుకోవచ్చని, అయితే సిబ్బంది జీతభత్యాలకు మాత్రం ఈ నిధులు వెచ్చించొద్దని స్పష్టం చేశారు. మిగిలిన సగం నిధులు గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సరఫరా, వాననీటి సంరక్షణ లాంటి పనుల కోసం ఉపయోగించాలని వెల్లడించారు. ఇక, గ్రామపంచాయతీలు, మండలపరిషత్‌లు, జిల్లా పరిషత్‌ల వారీగా పరిశీలిస్తే మొత్తం నిధుల్లో కనిష్టంగా 70 శాతం, గరిష్టంగా 85 శాతం నిధులు గ్రామ పంచాయతీలకే కేటాయిస్తారు. మండల పరిషత్‌లకు అదే తరహాలో 10–25 శాతం, జిల్లా పరిషత్‌లకు 5–15 శాతం నిధులివ్వనున్నారు. నిధుల్లేక.. నీరసపడి వాస్తవానికి, గతంలో గ్రామపంచాయతీలతో పాటు మండల, జిల్లా పరిషత్‌లకు కూడా తలసరి గ్రాంటు కేటాయింపులు ఉండేవి. అయితే, 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి తలసరి నిధులను నేరుగా గ్రామపంచాయతీలకే కేటాయించారు. దీంతో సీనరేజ్ సెస్, స్టాంపు డ్యూటీ వాటా, అరకొర సాధారణ నిధులు తప్ప జిల్లా, మండల పరిషత్‌లకు నిధుల్లేక నీరసపడ్డాయి. కనీసం సిబ్బంది జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లోకి కొన్ని జిల్లా పరిషత్‌లు వెళ్లిపోయాయి. ఇప్పుడు కేంద్రం నేరుగా గ్రామాలతో పాటు మండల, జిల్లా పరిషత్‌లకు నిధులు మంజూరు చేయనుండటంతో ఈ ఏడాది జూన్ నుంచి మళ్లీ ఆ రెండు వ్యవస్థలు కళకళలాడనున్నాయి. -
'ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే తెలంగాణకు నిధులు'
-
త్వరలోనే తెలంగాణకు ఆ నిధులు ఇస్తాం: నిర్మల
సాక్షి, హైదరాబాద్ : 2020-21కు సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాదాపూర్‌లోని హోటల్ ట్రైడెంట్ లో బడ్జెట్ పై ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారామన్ మాట్లాడుతూ.. 'బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగుళూరుతో పాటు అన్ని నగరాల్లో కాన్ఫరెన్స్ లు ఏర్పాటు చేసి వ్యాపార రంగాలకు చెందిన వ్యక్తుల్ని కలవడం మొదలుపెట్టాం. 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల ప్రకారమే తెలంగాణకు నిధులు కేటాయించాం. ఏ ఒక్క రాష్ట్రాన్ని తగ్గించి చూడాలన్నది మా ఉద్దేశం కాదు. మనం సమాఖ్య వ్యవస్థలో ఉన్నాం.. మోదీ ప్రభుత్వం కూడా అదే దారిలో పయనిస్తోంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లానే తెలంగాణతో కూడా కేంద్ర ప్రభుత్వానికి భాగస్వామ్యం ఉంది. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిధులు తగ్గించాలా, పెంచాలా అనేది రాష్ట్రాల పనితీరుపై ఆధారపడి ఉంటుంది. (రుణాల ఫిర్యాదులకు ప్రత్యేక సెంటర్: నిర్మలా సీతారామన్) జీఎస్టీ ద్వారా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాను సరిగా ఇవ్వలేకపోయాం. దీనికి కారణం అనుకున్న స్థాయిలో జీఎస్టీ వసూలు కాకపోవడమే. డిసెంబర్ లో జీఎస్టీ మీటింగ్ కు ముందు రెండు నెలల వాటాను ఇచ్చాము. ఇప్పటి వరకు ఇవ్వాల్సిన వాటాలను ఖచ్చితంగా రెండు విడతల్లో అందిస్తాం. ఇది ఇప్పుడు చెప్పడం కాదు జీఎస్టీ కౌన్సిల్ లోనే చెప్పాము. నేను కూడా రాష్ట్ర నేతలు మాట్లాడిన వాటిని విన్నాను. ఈసారి రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఎక్కువయ్యాయి కాబట్టే 42 నుంచి ఒక శాతం తగ్గించి 41 శాతం నిధులు కేటాయించాము. అదనంగా ఒక శాతాన్ని యూటీలకు కేటాయించాము. కేంద్రం నుంచి వచ్చే ఎలాంటి నిధులను మేం తగ్గించలేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించడం లేదు అనేది సరికాదు. ఏ ఒక్క రాష్ట్రాన్ని చిన్న చూపు చూడాలి అని మాకు లేదు. తెలంగాణకి 4 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందన్న మాట అవాస్తవం. తెలంగాణ నుంచి కేంద్రానికి మంచి కాంట్రిబ్యూషన్ ఉంది. సెస్ కలెక్షన్ తక్కువ కావడం వల్ల రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ నిధులు ఇవ్వలేకపోయము. తెలంగాణ రాష్ట్రానికే కాదు.. ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వలేదు. త్వరలోనే ఈ నిధులు ఇస్తాం. సెస్ వచ్చే కొద్దీ ఇస్తూనే ఉంటామని' తెలిపారు. (బడ్జెట్లో తగినన్ని ప్రోత్సాహకాలు కల్పించాం) -
ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది కేంద్రమే
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశం తమ పరిధిలో లేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని 15వ ఆర్థిక సంఘం స్పష్టం చేసినందున రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ఈ బడ్జెట్లో కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ ప్రధానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ప్రజల బాధను మీ దృష్టికి తెస్తున్నానని, ప్రత్యేక హోదా కల్పించే విషయం పూర్తిగా కేంద్రం పరిధిలోనే ఉన్నందున అన్ని విధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని కోరారు. సీఎం జగన్ లేఖ సారాంశం ఇలా ఉంది. ప్రజల ఆవేదనను మీ దృష్టికి తెస్తున్నా ‘‘ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న సంక్లిష్ట తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2020–21 బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేదిగా, వృద్ధి రేటును పెంచేదిగా విశ్వాసాన్ని కలిగించి,నూతనోత్సాహాన్ని ఇచ్చింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక మంత్రికి అభినందనలు తెలియజేస్తున్నాను. కానీ, ఏపీ ప్రజలలో మాత్రం అసంతృప్తి కలిగించిందని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఏపీని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి బడ్జెట్లో ప్రస్తావించలేదు. దాంతో ఏపీ ప్రజలు అసంతృప్తికి గురయ్యారు. ఏపీ ప్రజల్లో తీవ్రంగా ఉన్న ఆవేదన, బాధను గతంలో కూడా పలు పర్యాయాలు మీ దృష్టికి తీసుకొచ్చాను. తాజాగా కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 15వ ఆర్థిక సంఘం నివేదికలో పేర్కొన్న అంశాల నేపథ్యంలో మీ సహకారం, మార్గ నిర్దేశం కోరుతూ ఈ లేఖ రాస్తున్నాను. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. విభజన అనంతరం అత్యధిక ఆదాయం ఇచ్చే వనరుల ప్రయోజనాలు తెలంగాణకు దక్కాయి. అవశేష ఆంధ్రప్రదేశ్ ఈ ఆదాయ వనరులను కోల్పోయింది. దేశంలో ఏ ఒక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించ కూడదని 14వ ఆర్థిక సంఘం నివేదిక ఇచ్చిందని లోక్ సభలో ఆర్థిక శాఖ చెప్పింది. 15వ ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులు మా రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని మేము కోరాము. దీనిపై వారు స్పందిస్తూ ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ ప్రకారం ప్రత్యేక హోదా అంశం 15వ ఆర్థిక సంఘం మార్గదర్శకాల్లో లేదని స్పష్టం చేశారు. ఆర్థిక సంఘానికి, ప్రత్యేక హోదా కల్పించే అంశానికి ఏ మాత్రం సంబంధం లేదని చెప్పారు. కానీ మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న ప్రతిపాదన పట్ల 15వ ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులు సానుకూలంగా స్పందించారు. ప్రత్యేక హోదా కల్పించడం అనేది జాతీయ అభివృద్ధి మండలి తుది నిర్ణయం అని చెప్పారు. 2020–21కి సంబంధించి 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నివేదికలో కూడా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. పలు రాష్ట్రాలు ప్రత్యేక హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశాయని, కానీ ఆ అంశం తమ పరిధిలో లేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వమే సముచిత నిర్ణయం తీసుకోవాలని స్పష్టీకరించారు. 2018 అక్టోబర్‌లో మీడియా 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ను ప్రశ్నించిన సందర్భంలోనూ ప్రత్యేక హోదా అనేది ఆర్థిక సంఘం పరిధిలో లేదని కుండబద్ధలు కొట్టారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ప్రత్యేక హోదాపై 15వ ఆర్థిక సంఘం వెల్లడిస్తున్న దానికి, ఆర్థిక మంత్రిత్వ శాఖ చెబుతున్న దానికీ పొంతన లేదనేది స్పష్టమవుతోంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది. దయచేసి ఈ అంశంపై మీరు జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల మేరకు నిర్ణయం తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని సీఎం వైఎస్ జగన్ కోరారు. -
కేంద్ర పన్నుల కేటాయింపుల్లో కోత!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా మదింపునకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్దేశించిన 15వ ఆర్థిక సంఘం విధివిధానాలు ఏపీతోపాటు పలు దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపాయి. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 42 శాతం వాటా పంచారు. దీని నుంచి ఏపీకి ఏటా 4.305 శాతం మేర పంచుతూ వస్తున్నారు. కానీ, ఇప్పుడు అది 4.11 శాతానికి తగ్గిపోయింది. ఇదేకాక.. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంచాల్సిన వాటాను సైతం 42 శాతం నుంచి 41 శాతానికి తగ్గించారు. ఏడో ఆర్థిక సంఘం నుంచి 14వ ఆర్థిక సంఘం వరకు 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని వాటాలను నిర్దేశించి కేంద్రం పన్నులను పంచింది. కానీ, ఇప్పుడు 2011 జనాభా లెక్కల ఆధారంగా పన్నుల వాటాను కేటాయిస్తోంది. మరోవైపు.. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఏప్రిల్ 1, 2020 నుంచి అమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ.. పూర్తిస్థాయి నివేదిక సిద్ధం కానందున కేవలం 2020–21కు వర్తించేలా మధ్యంతర నివేదిక ఇచ్చింది. దానిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దీని ఆధారంగానే 2020–21 ఆర్థిక సంవత్సరానికి పన్నుల వాటాలను నిర్దేశిస్తూ ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలో బడ్జెట్లో పొందుపరిచారు. ఒకవేళ పదిహేనో ఆర్థిక సంఘం రాష్ట్రాలకు పంచాల్సిన వాటాను 41 శాతం నుంచి ఇంకా తగ్గిస్తే అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు నిధుల లేమిని ఎదుర్కోవలసి వస్తుంది. జనాభాను పటిష్టంగా నియంత్రించిన ఫలితం.. కాగా, 15వ ఆర్థిక సంఘం విధివిధానాల్లో పన్నుల వాటాలు తేల్చేందుకు జనాభాకు 15 శాతం వెయిటేజీ ఇచ్చారు. జనాభా వృద్ధి రేటు విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక తదితర రాష్ట్రాలు పకడ్బందీగా వ్యవహరించి మంచి ఫలితాలు సాధించాయి. కానీ, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు జనాభాను నియంత్రించలేకపోయాయి. దీని ఫలితంగా 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకోవడంవల్ల దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటా తగ్గింది. 2020–21కి కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా (అంచనాలు) ఇలా.. కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా 4.305 శాతం నుంచి 4.11కి తగ్గింది. కొత్త వాటా ప్రకారం కేంద్ర పన్నుల వాటా నుంచి ఏపీకి రూ.32,237.68 కోట్లు రానున్నట్లు కేంద్ర బడ్జెట్లో అంచనా వేశారు. ఇందులో కార్పొరేషన్ టాక్స్ రూ. 9,916.22 కోట్లు, ఆదాయ పన్ను రూ.9,220.31 కోట్లు, సెంట్రల్ జీఎస్టీ రూ.9,757.50 కోట్లు, కస్టమ్స్ టాక్స్ రూ.2,012.13 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ రూ.1,314.66 కోట్లు, సర్వీస్ టాక్స్ రూ.17.19 కోట్లుగా ఉంది. అయితే, గడిచిన రెండు మూడేళ్ల కాలంలో బడ్జెట్లో పొందుపరిచిన అంచనాల మేరకు నిధులు రాలేదు. పొందుపరిచిన అంచనాల కంటే వెయ్యి కోట్ల నుంచి రెండు వేల కోట్ల వరకు తక్కువే వచ్చాయి. ఏపీకి రూ.1,521 కోట్ల నష్టం కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా 4.305 శాతం నుంచి 4.11కి తగ్గడంవల్ల 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1,521 కోట్ల మేర ఆదాయాన్ని రాష్ట్రం కోల్పోతుంది. 4.305 శాతం వాటా ఉంటే రూ.33,758.98 కోట్లు రావాల్సి ఉండగా.. ఇప్పుడు రూ.32,237.68 కోట్లు మాత్రమే రానుంది. -
రెవెన్యూ లోటు భర్తీకి రూ.5,897 కోట్లు ఇవ్వండి
సాక్షి, అమరావతి : 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.5,987 కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిందిగా 15వ ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 14వ ఆర్థిక సంఘం కాలంతో పాటు 15వ ఆర్థిక సంఘం కాలంలో కూడా రాష్ట్రం రెవెన్యూ లోటును ఎదుర్కొంటోంది కనుక.. 15వ ఆర్థిక సంఘం కాల వ్యవధిలో కూడా రెవెన్యూ లోటు భర్తీకి సిఫార్సు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన వినతిపై 15వ ఆర్థిక సంఘం ఈ మేరకు స్పందించింది. కాగా, 2020–21 ఆర్థిక ఏడాదికి మాత్రమే సిఫార్సులు చేయగా మిగిలిన నాలుగు ఆర్థిక సంవత్సరాలకు పూర్తిస్థాయి నివేదికను తరువాత ఇస్తామని వెల్లడించింది. అలాగే.. రంగాల వారీగా, రాష్ట్ర నిర్ధిష్ట అవసరాలు, వ్యవసాయ రంగంలో సంస్కరణలు, విద్య.. వైద్య రంగాలకు సంబంధించిన అన్ని గ్రాంట్లపైన పూర్తిస్థాయి నివేదికలో చర్చించి తగు సిఫార్సులు చేస్తామని నివేదికలో స్పష్టంచేసింది. అంతేకాక, తాజా నివేదికలో రాష్ట్ర విభజన అంశాలను, రాజధాని, వెనుకబడిన జిల్లాలతో పాటు రాష్ట్ర ప్రత్యేక అవసరాల గురించి ఆర్థిక సంఘం ఎక్కడా చర్చించలేదు. పూర్తిస్థాయి నివేదికలో చర్చిస్తుందేమో చూడాలి. 2020–21 ఏడాదికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో రాష్ట్రానికి చెందిన ప్రధాన అంశాలు.. - 2020–21 ఆర్థిక సంవత్సరంలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో వాటా తేల్చకముందు ఏపీ రెవెన్యూ లోటు రూ.41,054 కోట్లు. పన్నుల వాటాగా రూ.35,156 కోట్లను బదిలీ చేసిన తరువాత రాష్ట్ర రెవెన్యూ లోటు రూ.5,897 కోట్లుగా ఉంది. దీన్ని భర్తీచేయాలి. - ఇదే కాలంలో గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్ల రూపంలో రూ.2,625 కోట్లను, పట్టణ స్థానిక సంస్థలకు రూ.1,264 కోట్లను ఇవ్వాలి. - పౌష్టికాహార గ్రాంటు కింద రూ.263 కోట్ల మంజూరు. - స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద మొత్తం రూ.1,491 కోట్లను సిఫార్సు చేయగా ఇందులో కేంద్రం వాటా రూ.1,119 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.372 కోట్లు. 2020–21లో రాష్ట్ర రెవెన్యూ రాబడి, వ్యయంపై 15వ ఆర్థిక సంఘం అంచనాలు.. -
15వ ఫైనాన్స్ కమిషన్ పదవీ కాలం పొడిగింపు
న్యూఢిల్లీ: 15వ ఫైనాన్స్ కమిషన్ పదవీ కాలాన్ని కేంద్ర కేబినెట్ పొడిగించింది. కమిషన్ పదవీ కాలాన్ని 2020 అక్టోబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు బుధవారం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. 2019 అక్టోబర్ వరకు ఉన్న కమిషన్ పదవీ కాలాన్ని తొలుత 2019 నవంబర్ 30 వరకు పొడిగించారు. అనంతరం దీనిని మరోమారు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్నులు, ఇతర వనరుల విభజనపై ఫైనాన్స్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి నివేదికను అందించేందుకు విధించిన గడువును 2020 అక్టోబర్ 30 వరకు పొడిగించింది. ఇక 2021–22 నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన అంశాలను సైతం తుది నివేదికలో పొందుపరచాలని పేర్కొంది. -
ఏపీ పర్యటనకు రండి: విజయసాయిరెడ్డి
ఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి శుక్రవారం 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్‌ను ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫున ఆహ్వానించారు. అదే విధంగా ఆహ్వాన లేఖను ఆయనకు అందజేశారు. కాగా ముఖ్యమంత్రి జగన్ ఆహ్వానంపై ఎన్కే సింగ్ సానుకూలంగా స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తానని పేర్కొనట్లు విజయసాయరెడ్డి మీడియాకు తెలిపారు. అంతకు ముందు కేంద్ర ఆహారశుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి హరి సిమ్రత్ కౌర్‌ను విజయసాయి రెడ్డి కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఆహారశుద్ధి పరిశ్రమలు నెలకొల్పాలని వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా జిల్లాలో పెద్ద ఎత్తున పండ్ల తోటలు ఉన్న నేపథ్యంలో ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని హరి సిమ్రత్ కౌర్‌కు విజ్ఞప్తి చేశారు. మరోవైపు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్‌తో భేటీ అయిన విజయసాయి రెడ్డి అనంతపురం జిల్లాకు పశుగ్రాసం పంపాలని వినతి పత్రం అందజేశారు. జిల్లాలో వర్షాలు లేక తీవ్ర కరువు ఏర్పడిందని, పశువులను కబేళాలకు తరలించాల్సిన పరిస్థితి వస్తోందని.. కేంద్రం సత్వరమే స్పందించి జిల్లాకు రెండు నెలలకు సరిపడ పశుగ్రాసం పంపించాలని తోమార్‌ను కోరారు. -
రుణపరిమితి పెంచండి
సాక్షి, హైదరాబాద్ : స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్డీపీ)లో 3% మించి రుణాలు స్వీకరించేందుకు ఆర్థికాభివృద్ధి ఉన్న రాష్ట్రాలను అనుమతించేలా కేంద్రానికి సిఫారసు చేయాలని సీఎం కేసీఆర్ 15వ ఆర్థిక సంఘానికి సిఫారసు చేశారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేసేం దుకు ఇది ఎంతో సహకరిస్తుందన్నారు. జీఎస్డీపీపై అదనంగా మరొకశాతం అప్పు పొందేందుకు అవకాశం కల్పించాలని కోరారు. 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్ బృందంతో.. సీఎం కేసీఆర్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బృందానికి కేసీఆర్ పలు విజ్ఞప్తులు చేశారు. వివిధ అంశాల్లో రాష్ట్రాలు సాధిస్తున్న పురోగతికి గుర్తింపుగా ప్రోత్సాహకాలను సిఫారసు చేయాలన్నారు. కేంద్ర పథకాలకే పరిమితం చేయకుండా రాష్ట్రాల కీలక పథకాలకు ఈ ప్రోత్సాహకాలను వర్తింపజేయాలన్నారు. రైతుబంధు, మధ్యాహ్న భోజనం, ఉపాధిహామీ వంటి పథకాలను తొలుత రాష్ట్రాలే అమలు చేయగా, కేంద్రం అనుసరించక తప్పలేదని, ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల రూపకల్పన బాధ్యత రాష్ట్రాలకే అప్పగించాలన్నారు. ప్రాధాన్య, అప్రాధాన్యత అంశాలను కేంద్రం కన్నా రాష్ట్రాలే బాగా గుర్తించగలవన్నారు. పన్నుల క్రమబద్ధీకరణలో భాగంగా రాష్ట్రాలు తమ స్వయంప్రతిపత్తి విషయంలో రాజీపడి జీఎస్టీకి సంపూర్ణ మద్దతునిచ్చాయని సీఎం గుర్తు చేశారు. రాష్ట్ర సొంత పన్నుల ఆదాయానికి ఆధారమైన వాణిజ్య పన్ను/వ్యాట్ జీఎస్టీలో అంతర్భాగమైందన్నారు. కేంద్రం ఆదాయ పన్ను, కార్పొరేషన్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీలను జీఎస్టీలో విలీనం చేయలేదన్నారు. 50% పైగా రాష్ట్రాలకు సొంత ఆదాయం తెచ్చే పన్నులు జీఎస్టీ పరిధిలోకి రాగా కేవలం 31% కేంద్ర పన్నులు మాత్రమే ఏకీకృత పన్ను జాబితాలో చేరాయన్నారు. దీంతో రాష్ట్రాలు ఆర్థిక స్వయంప్రతిపత్తిని కోల్పోయాయన్నారు. (రాష్ట్రాభివృద్ధిలో ఐటీ పాత్ర భేష్) దేశమంతా తెలం‘గానం’ ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలకు తగ్గట్లు నిధుల వ్యయ ప్రణాళికలు తయారు చేసి అమలు చేయగల పరిపక్వతను రాష్ట్రాలు సాధించాయని, ఈ విషయంలో కేంద్రం కంటే రాష్ట్రాలే ఆర్థిక దూరదృష్టితో వ్యవహరించగలవని సీఎం కేసీఆర్ తెలిపారు. గతంలో గుజరాత్, కేరళ రాష్ట్రాల అభివృద్ధి నమూనాల గురించి మాత్రమే చర్చ జరిగేదని, ఇప్పుడే దేశమంతా తెలంగాణ అభివృద్ధి నమూనా గురించి మాట్లాడుకుంటున్నారని ఆయన అన్నారు. దేశ నిర్మాణంలో రాష్ట్రాలకు సమ భాగస్వామ్యం లభించనుందని నీతి ఆయోగ్ ఏర్పాటుతో ఆశలు చిగురించాయని, కానీ ఈ ఆశలు ఫలించలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థికంగా వెనకబడిన రాష్ట్రాలకు అధిక నిధుల కేటాయింపునకు తాము వ్యతిరేకం కామన్నారు. ఆర్థికంగా వెనకబడిన రాష్ట్రాలకు ఫైనాన్స్ కమిషన్ కాకుండా ఇతర మార్గాల్లో సహకారం అందించాలన్నారు. రాష్ట్రాలకు పన్నుల ఆదాయం పంపిణీ పెంచాలని 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసుల వల్ల దేశ అభివృద్ధి ఎజెండా ముందుకు సాగిందని గుర్తు చేశారు. బకాయిలు ఇవ్వాలి తెలంగాణ ఏర్పడిన కొత్తలో తీవ్రమైన సంక్షోభం నెలకొని ఉందని కేసీఆర్ గుర్తు చేశారు. తీవ్ర విద్యుత్ కొరత, రైతుల ఆత్మహత్యలతోపాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి రేటు దేశ సగటుకు దిగువన ఉండేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభించామని, బంగారు తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 2002–05, 2005–11 మధ్య కాలంలో రాష్ట్రం పరిధిలోని అంశాలపై కేంద్ర నిధుల వ్యయం 14–20%కు పెరిగిందని, అలాగే ఉమ్మడి జాబితాలోని అంశాలపై 13–17%కు చేరిందని 14వ ఆర్థిక సంఘం నివేదించిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. రాష్ట్రాలకు కేంద్ర నిధుల కేటాయింపులు పెంచేందుకు పుష్కలమైన అవకాశాలున్న విషయాన్ని ఈ అంశం వెల్లడిస్తోందన్నారు. కేంద్ర నుంచి రాష్ట్రాలకు రావాల్సిన రోడ్డు సెస్, క్లీన్ ఎనర్జీ సెస్ పూర్తి స్థాయిలో రావడం లేదని, కాగ్ తప్పుబట్టినా కేంద్రం బకాయిలు చెల్లించడం లేదని సీఎం వెల్లడించారు. 2017–18 చివరినాటికి కేంద్ర రాష్ట్రాలకు రూ.72,726 కోట్ల రోడ్ సెస్, రూ.44,505 కోట్ల క్లీన్ ఎనర్జీ సెస్‌ను బకాయి పడిందన్నారు. ప్రాధామ్యాలు నిర్ణయించే హక్కు రాష్ట్రాలకే రాష్ట్రాల్లోని పరిస్థితులు, అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకుని ప్రాధామ్యాలు నిర్ణయించుకునేందుకు అవకాశాలు కల్పిస్తే బావుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాల్లోనూ లెక్కకు మించి కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉండడాన్ని ఆయన ఉదహరించారు. కేంద్ర–రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన సర్కారియా కమిషన్ చర్చల సందర్భంగా కూడా ఉమ్మడి జాబితా రద్దు చేయాలని రాష్ట్రాలు ప్రతిపాదించాయని గుర్తు చేశారు. కేంద్ర–రాష్ట్ర ఉమ్మడి జాబితాలో చేర్చిన క్రిమినల్లా, అటవీ, దివాళా, కార్మిక సంఘాలు, కార్మిక సంక్షేమం, లీగల్, మెడికల్, విద్య, విద్యుత్ వంటి అంశాలపై ఎక్కువగా పార్లమెంటే చట్టాలు చేస్తోందన్నారు. రాష్ట్రాలను సంప్రదించకుండానే కేంద్రం కొత్త పథకాలు అమలు చేస్తోందని, రాష్ట్రాల్లో అంతకంటే మంచి పథకాలు అమలవుతున్నాయన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక నదీజలాల హక్కుల నిర్ధారణకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరి ఏళ్లు గడుస్తున్నా.. ఈ అంశాన్ని ట్రిబ్యునల్‌కు నివేదించలేదన్నారు. రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి తాగునీటి సరఫరా చేయొచ్చునని మిషన్ భగీరథ ప్రాజెక్టు ద్వారా తమ ప్రభుత్వం చేసి చూపించిందని కేసీఆర్ అన్నారు. రాబోయే ఐదారేళ్లలో దేశంలోని ప్రతీ గ్రామానికి నీటిసరఫరా చేసే లక్ష్యంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం రూ.8–10లక్షల కోట్ల వ్యయం కావొచ్చన్నారు. ప్రతీఏడాది ఎమ్మెస్పీ పెంచాలి కనీస మద్దతు ధరను రూ.500 లేదా ప్రస్తుతమున్న ఎమ్మెస్పీకి మూడోవంతు పెంచడమో చేయాలని కేసీఆర్ సూచించారు. ఉద్యోగుల డీఏలో మాదిరిగా ధరల సూచీకి లింక్ చేయడం ద్వారా ఎమ్మెస్పీని ప్రతీఏడాది పెంచాలని కోరారు. వ్యవసాయరంగంలో లాభాలు, ఉత్పాదకత తక్కువగా ఉన్నందున రైతులు–వినియోగదారుల ధరల్లో భారీ వ్యత్యాసం ఉంటోందన్నారు. ఈ నేపథ్యంలో రైతుబంధు పథకం కింద ఏడాదికి ఎకరానికి రూ.10వేలు రైతులకు చెల్లించడం అనేది ఈ దిశగా ఒక ముందడుగు అని చెప్పారు. నీటిరంగంలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో ఉన్న పలు విభేదాలను సంప్రదింపులతో అధిగమించగలిగామని, కాళేశ్వరం ప్రాజెక్టు అందుకు ఒక సజీవసాక్ష్యమని కేసీఆర్ చెప్పారు. సీఎం పేర్కొన్న మరిన్ని అంశాలు – కేంద్రపన్నులో రాష్ట్రాల వాటా పెంచాల్సిన అవసరం ఉందని కేసీఆర్ సూచించారు. జీఎస్టీ విధానం అమలు వల్ల రాష్ట్రాల సొంత ఆదాయాల్లో కోత పడిందన్నారు. అందువల్ల జీఎస్టీలో రాష్ట్రాల వాటాను 50% పెంచాలని కోరారు. – ఎఫ్ఆర్బీఎంను ఇప్పుడు ఉన్నదానికంటే 1% పెంచాలని, సమానత్వం, సమర్థత విషయంలో సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వ్యయానికి బదులు రాష్ట్రాలకు పన్నుల్లో వాటాలు ఇవ్వాలని కోరారు. – రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సంఖ్య 8,368 నుంచి 12,751కు, పట్టణ స్థానిక సంస్థల సంఖ్య 74 నుంచి 142కు పెంచామని, వాటి అవరాలకు తగ్గట్లు 15వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించాలని కోరారు. – రాష్ట్రంలోని 1.24కోట్ల ఎకరాలకు నీటిపారుదల సదుపాయం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుని పలు ప్రాజెక్టులు చేపట్టాం. రూ.80 వేల కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో 13 జిల్లాల పరిధిలో 18లక్షల ఎకరాలకు సాగునీరిస్తాం. 15వ ఆర్థికసంఘం కాల పరిమితిలో ఈ ప్రాజెక్టు నిర్వహణ కోసం రూ.40,169 కోట్ల వ్యయం కానుంది. ఈ ప్రాజెక్టు నిర్వహణ వ్యయాన్ని సిఫారసు చేయాలి. – ప్రతిష్టాత్మక మిషన్ భగీరథ పథకం నిర్వహణ కోసం 2020–25 మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాలకు రూ.10,142 కోట్లు, పట్టణ ప్రాంతాలకు రూ.2,850 కోట్ల వ్యయం కానుంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.12,722 కోట్ల నిర్వహణ వ్యయాన్ని సైతం 15వ ఆర్థిక సంఘం కింద సిఫారసు చేయాలి. ఈ పథకం కింద వినియోగదారులపై యూజర్ చార్జీలు విధించాలని అనుకుంటున్నాం. కానీ కొంత సమయం పడుతుంది. ఈ విషయంలో కమిషన్ సహకారం అందించాలి. -
రాష్ట్రాభివృద్ధిలో ఐటీ పాత్ర భేష్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ(ఐటీ) రంగం కీలకపాత్ర పోషిస్తోందని 15వ ఆర్థిక సంఘం ప్రశంసించింది. దేశ ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో 10 శాతానికిపైగా వాటా రాష్ట్రానిదేనని కొనియాడింది. రాష్ట్ర పర్యటనలో భాగంగా 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్.కె సింగ్, సభ్యులు అశోక్ లహరి, అనూప్‌సింగ్, రమేశ్చంద్లతో కూడిన బృందం సోమవారం తొలిరోజు ఇక్కడ పారిశ్రామిక, కార్మిక సంఘాలు, పురపాలక, పంచాయతీరాజ్ శాఖల ప్రతినిధులు, అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ సంఘం సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ స్థూల రాష్ట్ర విలువ ఆధారితం(జీఎస్వీఏ–ప్రస్తుత ధరలు)లో ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగ పరిశ్రమల(తృతీయ రంగాని)దే సింహభాగం వాటా అని పేర్కొన్నారు. తృతీయ రంగ జీఎస్వీఏ(ప్రస్తుత ధరలు) విషయంలో కర్ణాటక(66.27) తర్వాత తెలంగాణ (63.80) రెండోస్థానంలో ఉందని తెలిపారు. ద్వితీయ రంగానికి సంబంధించిన తెలంగాణæ జీఎస్వీఏ(ప్రస్తుత ధరలు) అంకెలు దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యల్పమని అభిప్రాయపడ్డారు. తయారీ, మైనింగ్, విద్యుత్ తదితర రంగాల పరిశ్రమలు ద్వితీయ రంగం పరిధిలోకి వస్తాయి. రాష్ట్ర తయారీ రంగంలో ఔషధ, సిమెంట్, గ్రానైట్, విద్యుత్ ఉపకరణాలు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి పరిశ్రమలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని సభ్యులు అభిప్రాయపడ్డారు. ఐటీ, ఐటీ ఆధారిత రంగ పరిశ్రమలపైనే రాష్ట్రం పూర్తిగా ఆధారపడకుండా, తయారీ రంగ పరిశ్రమల వృద్ధికి సైతం కృషి చేయాలని సూచించారు. ఒకే రంగంపై పూర్తిగా ఆధారపడితే వృద్ధికి ముప్పు ఏర్పడే అవకాశాలుండడంతో ఇతర రంగాల్లో సైతం పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు. తలసరి ఆదాయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలు మాత్రమే రాష్ట్ర సగటు కంటే ముందంజలో ఉన్నాయని పేర్కొన్నారు. పరిశ్రమలు ఎక్కువ ఉండడంతో ఈ నాలుగు జిల్లాలు వృద్ధి సాధించాయని, మిగిలిన జిల్లాలు వెనకబడ్డాయని తెలిపారు. సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు సత్వర అనుమతుల జారీకి టీఎస్–ఐపాస్ చట్టం, మూతపడిన పరిశ్రమలను పునరుద్ధరించేందుకు తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్, స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు టీ–హబ్ ఇంక్యూబేటర్ ఏర్పాటు, కాకతీయ టెక్స్టైల్స్ పార్కు నిర్మాణం తదితర పారిశ్రామికాభివృద్ధి కార్యక్రమాలను ఆర్థిక సంఘం పరిగణనలోకి తీసుకుంది. యువతకు శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్యాభివృద్ధి సంస్థ(టాస్క్) ఏర్పాటు చేయడాన్ని ప్రశంసించింది. స్థానిక సంస్థలకు విస్తృతంగా నిధులివ్వాలి స్థానిక సంస్థలకు విస్తృతంగా నిధులు ఇవ్వాలని అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు 15వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. గత రెండేళ్లలో మునిసిపల్ కార్పొరేషన్లు తమ మొత్తం ఆదాయంలో 65 శాతాన్ని సొంతంగా ఆర్జించాయని, మునిసిపాలిటీల సొంత ఆదాయం 52 నుంచి 65 శాతానికి, నగర పంచాయతీల సొంత ఆదాయం 52 నుంచి 68 శాతానికి పెరిగిందని ప్రభుత్వం నివేదించింది. అయితే, జిల్లా, మండల పరిషత్‌లకు సొంత ఆదాయం అత్యల్పమని పేర్కొంది. జడ్పీలు, మండల పరిషత్‌లకు రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లే ప్రధాన వనరులని తెలిపింది. గ్రామపంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధులే ఇప్పటివరకు ప్రధాన ఆదాయవనరులని తెలిపింది. గత రెండేళ్లలో 55 శాతం ఆదాయాన్ని ఇక్కడి నుంచే పొందాయని పేర్కొంది. వినోదపన్నును జీఎస్టీ పరిధిలోకి తేవడంతో మునిసిపాలిటీల ఆదాయానికి గండి పడిందని మునిసిపల్ ప్రజాప్రతినిధులు ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత నీటిసరఫరా, ఇతర కీలక ప్రాజెక్టుల గురించి ఈ సమావేశంలో చర్చించారు. 15వ ఆర్థిక సంఘం బృందానికి ముఖ్యమంత్రి విందు రాష్ట్ర పర్యటనకు వచ్చిన 15వ ఆర్థిక సంఘం బృందానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నగరంలోని ఓ హోటల్లో సోమవారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఇక పర్యటనలో భాగంగా 15వ ఆర్థిక సంఘం బృందం మంగళవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో సమావేశం కానుంది. జీఎస్టీ పరిహారం అందడం లేదు .. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత 37.4 శాతం డీలర్లు కొత్తగా పన్నుల పరిధిలోకి వచ్చారని రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తొలినాళ్లలో మినహాయిస్తే ఆ తర్వాత రాష్ట్రానికి రావాల్సిన పరిహారం అందలేదని తెలిపింది. గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ఏపీలో జీఎస్టీ ఆదాయం 14.7 శాతం వృద్ధి చెందితే తెలంగాణలో 20 శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. ఆర్థిక సంఘానికి వినతులు ప్రాధాన్యతల వారీగా నిధులు కేటాయించండి : కాంగ్రెస్ సాక్షి, హైదరాబాద్: దేశ, రాష్ట్ర స్థాయిలో చేపడుతున్న అభివృద్ధి, సం క్షేమ పథకాలకు ప్రాధాన్యతలవారీగా నిధులు కేటాయించాలని 15వ ఆర్థిక సంఘానికి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. సోమ వారం ఇక్కడ 15వ ఆర్థిక సంఘం రాజకీయ పార్టీలతో నిర్వహించిన భేటీకి కాంగ్రెస్ తరపున సీఎల్పీనేత మల్లు భట్టివిక్రమార్క, పార్టీ మేధా వుల విభాగం చైర్మన్ కె.శ్యాంమోహన్, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే అనిల్ హాజరయ్యారు. కాం గ్రెస్ నేతలు మాట్లాడుతూ నిధులు పక్కదోవ పట్టకుండా చూడాలని, ఏ పథకానికి కేటాయించిన నిధులు దానికే ఖర్చయ్యేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ కేటాయింపులకే నిధులన్నీ ఖర్చు చేయాల్సి రావడంతో ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిలిచి పోతున్నాయని ఆర్థిక సంఘం దృష్టికి తీసుకువచ్చారు. మానవాభివృద్ధి సూచీ పెరుగుదల కోసం విద్య, వైద్యం, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యతివ్వాలని కోరారు. సమావేశానికి టీడీపీ తరపున రావుల చంద్రశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. బీజేపీ రాష్ట్రాభివృద్ధికి సహాయం అందించండి : బీజేపీ సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఇతోధిక సహాయం అందించా లని 15వ ఆర్థిక సం ఘం చైర్మన్ ఎన్కే సిం గ్‌కు భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేసింది. బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రాంచంద్రరావు, పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి, అధికార ప్రతి నిధి అనుగుల రాకేశ్రెడ్డిలతో కూడిన బృందం 20 అంశాలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని అందజేసింది. హైదరాబాద్ లాంటి నగరం అభివృద్ధిపై 15వ ఆర్థిక సంఘం ప్రత్యేక దృష్టి సారించి నిధులను కేటాయించాలని కోరారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణకు ఎక్కువ లాభం చేకూరుతుందని, దాని ప్రకారమే తెలంగాణకు నిధులను కేటాయించాలని కోరారు. అప్పులు తీసుకొని అభివృద్ధి కోసం వెచ్చించకుండా పేరుప్రతిష్టలు వచ్చే వాటికి ఖర్చు చేయకుండా చూడాలని కోరారు. ప్రజాకర్షక పథకాలపై దృష్టి సారించాలి : సీపీఐ ఎన్నికల్లో లబ్ధి పొందా లనే దృష్టితో రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీ లు ప్రజాకర్షక విధానా లు చేపడుతున్న అంశం పై 15వ ఆర్థికసంఘం సునిశిత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర సీపీఐ సూచించింది. ఇలా చేపడుతున్న ప్రజాకర్షక పథకాల వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడుతున్నందున సమీక్షించా లని కోరింది. ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్, ఇతర సభ్యులతో భేటీ సందర్భంగా ఆ పార్టీ సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, జాతీయ కార్యవర్గసభ్యుడు నరసింహా వినతిపత్రం సమర్పించారు. నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులు అందజేయడంతోపాటు ఏదైనా ఓ భారీ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా పరిగణించాలని కోరా రు. డబుల్ బెడ్రూం ఇళ్ల పథకానికి కేంద్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి చేయూతనిచ్చేలా చర్య లు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మండల, జిల్లా పరిషత్‌లకు నిధులు ఇవ్వండి : పంచాయతీరాజ్ సాక్షి, హైదరాబాద్: మండల, జిల్లా పరిషత్‌లకు కూడా కేంద్ర ఆర్థిక సంఘం నిధులు కేటాయించేలా సిఫారసు చేయాలని 15వ ఆర్థిక సంఘానికి తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి బాదే పల్లి సిద్ధార్థ, కార్యదర్శి మధుసూదన్‌గుప్తా, అధికార ప్రతినిధి ఎం.పురుషోత్తంరెడ్డి వినతిపత్రం సమర్పించారు. 13వ ఆర్థిక సంఘం వరకు గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు సమానంగా నిధులు కేటాయిస్తూ రాగా 14వ ఆర్థిక సంఘం కనీస నిధులు కూడా కేటాయించలేదని చెప్పారు. -
రైతుబంధు సూపర్!
రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని గమనించి పరిస్థితులకు అనుగుణంగానే సలహాలు, సూచనలు ఇస్తామని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్ స్పష్టం చేశారు. మూడేళ్లుగా తెలంగాణ వృద్ధిరేటు వేగంగా ముందుకెళ్తోందన్న ఆయన.. రైతుబంధు, సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణ వంటివి రైతాంగ సమస్యల పరిష్కారానికి కీలకమైన ముందడుగని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలా? వద్దా? అనే విషయంలో ఆర్థిక సంఘం చెప్పేదేమీ ఉండదని.. జాతీయాభివృద్ధి మండలిదే తుది నిర్ణయమని ఎన్కే సింగ్ స్పష్టం చేశారు. జనాభా నియంత్రణ విషయంలో ఉత్తర, దక్షిణ భారతాలంటూ వేర్వేరుగా చూడటంలో అర్థం లేదని ఆయన పేర్కొన్నారు. వచ్చే వారంలో తెలంగాణ, ఏపీల్లో 15వ ఆర్థిక సంఘం పర్యటించనున్న నేపథ్యంలో ఎన్కే సింగ్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ విశేషాలు సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఓ ఆర్థికవేత్తగా, రెవెన్యూ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు ఏడాదిగా 15వ ఆర్థిక సంఘం చైర్మన్ హోదాలో ఉన్నారు. ఈ కాలంలో మీకు సవాల్‌గా అనిపించిన అంశాలేంటి? ఎన్కే సింగ్: ఆర్థిక సంఘం చైర్మన్లు ఎవరైనా చెప్పేదొక్కటే. కఠినమైన సవాళ్లున్నాయి. అయితే చాలా పరిమితుల్లో పనిచేయాల్సిన కారణంగా.. ఈ సమస్యలను వీలైనంత త్వరగా నైపుణ్యంతో పరిష్కరించడం కష్టమవుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితిని మూడు అంశాలు మార్చేశాయి. మొదటిది.. ప్రణాళికా సంఘం పనితీరులో మార్పుతీసుకురావడం. ప్రణాళిక, ప్రణాళికేతర ఖర్చులను పక్కాగా ప్లాన్ చేయడం. ఈ ఏడాది రెవెన్యూ, మూలధనం లోటుంది. కానీ దీన్ని అధికారులు అంగీకరించరు. రెండోది.. జీఎస్టీపై ఆర్థిక సంఘానికి పూర్తి పట్టుంటుంది. ఇది ప్రభుత్వానికి స్థిరమైన ఆదాయం. సంప్రదాయంగా వస్తున్న ఆర్థిక సమాఖ్య విధానంలో ఉన్న చాలా సమస్యల్లో జీఎస్టీ ద్వారా సానుకూల మార్పులొచ్చాయి. కామన్ మార్కెట్లో భారత్‌కు భారీ ప్రయోజనాలు చేకూరేందుకు అవకాశాలు కల్పించింది. మూడోది.. రాష్ట్రాలు కోల్పోతున్న రెవెన్యూను తిరిగి పొందే సామర్థ్యాన్ని పెంపొందించడం. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఈ సమస్యలపై మరోసారి సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఇవి ఆర్థిక సంఘం ముందున్న ప్రధానమైన సవాళ్లు. ప్రశ్న: జనాభా నియంత్రణ విషయంలో చర్యలు తీసుకున్నప్పటికీ తమకు అన్యాయం జరుగుతోందంటూ దక్షిణాది రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్న ఆందోళనపై మీరేమంటారు? జవాబు: నివేదికలో ఏయే అంశాలుండాలనే దానిపై ఆర్థిక సంఘం ప్రమేయం ఉండదు. ఇది పూర్తిగా భారత రాష్ట్రపతి నిర్ణయిస్తారు. ఒకసారి నిబంధనలు రూపొందించాక వీటి ఆధారంగా పనిచేయడమే ఆర్థికసంఘం పని. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటున్నామన్నది వాస్తవం. ఈ విషయంలో మేమేమీ చేయలేం. వీటితోపాటుగా పలు ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. జనాభా నియంత్రణలో సమర్థవంతంగా పనిచేసిన రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలుంటాయి. సమానత్వం, సామర్థ్యం మధ్య సమన్వయం చేయడం అంత సులువేం కాదు. భౌగోళిక అంశాల ఆధారంగా జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్న ప్రయత్నాలను విస్మరించడం ఆర్థిక సంఘం ఉద్దేశం కాదు. ఈ విషయంలో మేం చాలా విశాల ధృక్పథంతో ఉన్నాం. అసలు జనాభా నియంత్రణ విషయంలో దక్షిణాది, ఉత్తరాది అని విభజించి చూడటం.. వాస్తవాలను తప్పుదారి పట్టించడమే. ఉత్తరాది రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్, పంజాబ్, ఒడిశాలు ఈ విషయంలో ఎంతో ప్రగతిని కనబరిచాయి. అందుకే ఆర్థిక సంఘం.. రాష్ట్రాల ఆర్థిక సామర్థ్యం, ప్రజలకోసం ఏవిధంగా నిధుల వినియోగం చేస్తున్నాయనేదాన్నే విశ్వసిస్తుంది. 14, 15వ ఆర్థిక సంఘాలు ఇంతవరకు ఏపీకి ప్రత్యేక హోదా గురించి ఏమీ మాట్లాడలేదు. ఈ దిశగా ఆర్థిక సంఘం ఏమైనా పునరాలోచన చేస్తుందా? గతేడాది మేలో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించినపుడు ఈ అంశంపై చర్చ జరిగింది. ప్రత్యేక హోదా అంశం ఆర్థిక సంఘం పరిధిలోకి రాదనే అంశాన్ని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పాను. ప్రత్యేక హోదా అనే అంశం పూర్తిగా జాతీయాభివృద్ధి మండలి పరిధిలోకి వస్తుంది. ఇది పూర్తి రాజకీయ పరమైన అంశం. ఈ విషయంలో ఆర్థిక సంఘం ఇచ్చే సూచనలేమీ ఉండవు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. కర్ణాటకతోపాటు ఇతర పొరుగు రాష్ట్రాల్లో పెట్టుబడులకు నష్టం చేస్తాయంటూ పార్లమెంటు స్టాండింగ్ కమిటీ (ఆర్థికాంశాలు) చైర్మన్ వీరప్ప మొయిలీ పేర్కొన్నారు? ఈ విషయం నాకు తెలియదు. ఆర్థికపరమైన అంశాలపై పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఈ వ్యాఖ్యలు చేసుంటే.. దీనిపై మేం స్పందించడం సరికాదు. తెలంగాణ పర్యటన విషయానికొస్తే.. ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న రాష్ట్రం.. అప్పుల్లో కూరుకుపోవడంపై మీరేమంటారు? గత మూడేళ్లలో తెలంగాణ గణనీయమైన ఆర్థిక వృద్ధిరేటు సాధించింది. గతంలో కంటే చాలా మెరుగైన ఫలితాలు సాధించింది. సాగునీటి పారుదల అంశాలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టారు. చెరువులను పునరుద్ధరిస్తోంది. సాగుకోసం భూగర్భ జలాలను పెంచేలా ప్రయత్నిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సానుకూల అభివృద్ధికి బాటలు పడ్డాయి. ఇందుకు ప్రోత్సహించాలి. దీనికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అప్పులు, ఆర్థిక లోటు, అనవసర ఖర్చులు తదితర అంశాలను పరిశీలించాల్సి ఉంది. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం నుంచి మాకు నివేదిక అందింది. హైదరాబాద్ పర్యటనలో ఆ రాష్ట్ర అకౌంట్ జనరల్‌తో మాట్లాడతాం. పూర్తి ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి తదితర అంశాలపై సూచనలు ఇస్తాం. ఇటీవలి మీ పంజాబ్ పర్యటనలో అక్కడి ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి కూడా అలాంటి సూచనలేమైనా ఇస్తారా? వీటిపై ముందుస్తు ఊహాగానాలు చేయలేం. పంజాబ్ పరిస్థితులు అక్కడి సమస్యలు వేరు. అక్కడి ప్రభుత్వం చాలా అప్పుల్లో కూరుకుపోయినందుకు సూచనలిచ్చాం. వాటర్ గ్రిడ్, చెరువుల పునరుద్ధరణ కోసం కేంద్ర నిధులివ్వాలని తెలంగాణ ప్రభుత్వం అడుగుతోంది? రుణాలను కూడా మాఫీ చేయాలని అడుగుతోంది? రాజ్యాంగ పరిధిలో నిబంధనలకు అనుగుణంగా పనిచేయడమే మా లక్ష్యం. ఒక రాష్ట్రానికి ఎక్కువ మేలు చేద్దామని ప్రయత్నిస్తే.. మిగిలిన రాష్ట్రాలకూ అది అమలవుతుంది. ఆర్టికల్ 275 కింద ఒక్కో రాష్ట్రం ద్రవ్యలోటును కూడా మేం పరిగణించాల్సి ఉంటుంది. దీంతోపాటు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులను కూడా పోల్చి చూడాలి. తెలంగాణ పూర్తి ఆర్థిక స్థితిని చూశాకే ఏమైనా సూచనలు చేయాల్సిన అవసరం ఉందా అని ఆలోచిస్తాం. వృద్ధి పథంలో ఉన్న తెలంగాణకు ఎఫ్ఆర్బీఎం కింద ఏమైనా అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశాలుంటాయా? మేం విశాల ధృక్పథంతో ఆలోచిస్తాం. ఇందులో భాగంగా పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 14వ ఆర్థిక సంఘం 3% ఆర్థిక లక్ష్యంలో 0.5% వెసులుబాటు కల్పించారు. మేం ఏం చేయాలనేది అన్ని విషయాలు క్రోడీకరించి నిర్ణయిస్తాం. ఆర్థిక సంఘం దృష్టిలో.. తమకు నిధులు కావాలంటున్న మండలాలు, జిల్లా పరిషత్‌ల పరిస్థితేంటి? ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు ఈ దిశగా మాకు ప్రతిపాదనలు పంపాయి. మేం ఇప్పటివరకు 18 రాష్ట్రాల్లో పర్యటించాం. దాదాపు ప్రతిచోటా ఈ డిమాండ్ కనిపించింది. 14వ ఆర్థిక సంఘం కేవలం పంచాయతీల నిధుల విషయంలో మాత్రమే నిర్ణయం తీసుకోవడంపై మేం అధ్యయనం చేస్తున్నాం. పంచాయతీరాజ్ వ్యవస్థలోని మూడు అంచెల వ్యవస్థకు నిధులిస్తే బాగుంటుందని భావిస్తున్నాం. రాజకీయ ప్రజాకర్షణ కోసం తెలంగాణ సహా పలు రాష్ట్రాలు రుణమాఫీకి జై కొట్టడంపై మీరేమంటారు? ఇది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వ్యక్తిగత నిర్ణయం. ఈ అంశం ఆర్థిక సంఘం పరిధిలోకి రాదు. ఆర్టికల్ 293 కింద ఆర్థిక స్థోమత అంశాన్ని మాత్రం మేం పరిశీలిస్తాం. అయితే.. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యకు రుణమాఫీ ఒక్కటే పరిష్కారం కాదని మేం బలంగా విశ్వసిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నష్టాల్లో ఉంది. 14వ ఆర్థిక సంఘం సూచనలకు అనుగుణంగా కేంద్రం ఎందుకు వారికి సహకరించడం లేదు? రెవెన్యూ లోటు నిధులు (ఆర్డీజీ) ఏ ఒక్కరి సొంత నిర్ణయం కాదు. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. నిధుల సంక్రమణ విషయంలో ఆర్థిక సంఘం స్వతంత్రంగా సమీక్ష చేస్తుంది. ఒక్కో రాష్ట్రం పరిస్థితిని గమనిస్తాం. ప్రతి రాష్ట్రం ఆర్డీజీ కావాలంటుంది. కానీ అందరికీ ఇవ్వలేం. ఈ అంశంలో కొన్ని సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్రం, రాష్ట్రాల మధ్య నిధుల సరఫరా విషయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాకు స్పష్టత వచ్చింది. కేంద్రం ఏం ఆలోచిస్తుందనేది ఇంకా తెలియాలి. దీనికోసమే వేచి చూస్తున్నాం. ఆ తర్వాతే ఆర్డీజీకి అర్హులా? కాదా? అనే అంశాన్ని పరిశీలిస్తాం. ప్రజాకర్షక పథకమైన రైతుబంధుపై విమర్శల గురించి మీరేమంటారు? రైతుసమస్యలకు కొంతమేర ఉపశమనం కలిగించేందుకు తీసుకున్న చర్యలో రైతుబంధు కీలకమైంది. ఒడిశా ప్రభుత్వం కూడా కాలియా పేరుతో ఇలాంటి పథకాన్ని ప్రారంభించింది. కేంద్రం కూడా ప్రతి రైతుకు రూ.6వేల రూపాయల ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ముందుకొచ్చింది. చాలారాష్ట్రాలు రైతు సమస్యలను పరిష్కరించేందుకు తమ ఆర్థిక స్థితికి అనుగుణంగా ప్రయత్నిస్తున్నాయి. స్థూల ఆర్థిక స్థిరత్వం విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలంగాణ పర్యటనలో ఆ ప్రభుత్వంతో చర్చిస్తాం. ఎఫ్ఆర్బీఎం (ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్) విషయంలోనూ ప్రభుత్వంతో చర్చించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక సంఘం రాష్ట్రాల సమస్యలను పట్టించుకోదంటూ కేసీఆర్ చేస్తున్న విమర్శలపై? తెలంగాణకు వీలైనంత సహాయం చేయాలనేదే నా ఉద్దేశం. ఆ రాష్ట్రం ఆర్థికంగా పరుగులు పెట్టే విషయంలో మేం చేయాల్సినవన్నీ చేస్తాం. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు తెలంగాణకు ఎక్కువ అవకాశాలు, అనుకూలతలు ఉన్నాయి. -
చంపావత్ ప్రశ్నల భవంతి
ఫైనాన్స్ కమిషన్ కేటాయింపులతో కట్టిన భవనాన్ని బహిష్టు కేంద్రంగా మార్చారంటే.. ప్రభుత్వం ఏమైనా అంటుందేమోనన్న భయం కన్నా, నెలసరి వచ్చిన మహిళలు ఎవర్నైనా అంటుకుంటారేమోనన్న భయమే చంపావత్ జిల్లా గ్రామస్తులలో, గ్రామ పంచాయతీల్లో వ్యాపించి ఉందని అనుకోవలసి వస్తోంది! మాధవ్ శింగరాజు ‘ఫైనాన్స్ కమిషన్’ అనే మాట ఎంచేతో భయంగొల్పేలా ఉంటుంది. ఇంతకన్నా పోలీస్ కమిషన్ కొంచెం స్నేహపూర్వకంగా ఉంటుందేమో. ఉంటుందేమో కానీ, భారత రాజ్యాంగంలో పోలీస్ కమిషన్ అనేది లేదు. ఉంటే అది కూడా భయమో, అభయమో గొల్పుతూ ఉండేది ఇప్పటికి.ప్రస్తుతం దేశాన్ని నడిపిస్తున్నది పద్నాల్గవ ఫైనాన్స్ కమిషన్. కమిషన్ ఐదేళ్ల కాలపరిమితిలో ఇంకా రెండేళ్లు మిగిలే ఉన్నాయి. 2020 వరకు. అయినప్పటికీ రెండేళ్ల క్రితమే 2017లో పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ కూడా రెడీ అయిపోయింది. 2020 నుంచి 25 వరకు. ఆ కమిషన్‌కు ఛైర్మన్ ఎన్.కె.సింగ్. పద్నాల్గవ ఫైనాన్స్ కమిషన్ తరఫున వచ్చిన కొంతమంది అధికారులు ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లాలో ఫైళ్లు పట్టుకుని తిరుగుతున్నారు! మొదట వాళ్లు ఆ జిల్లాలోని ఘర్చమ్ గ్రామానికి వెళ్లారు. వాళ్లకేదో ఇన్ఫర్మేషన్ అందింది.. పంచాయతీ నిధులతో అక్కడ కొత్తగా కట్టిన ఒక భవంతి లెక్కల్లో అవకతవకలు జరిగాయని. ఆ నిధులు ఫైనాన్స్ కమిషన్ కేటాయించిన నిధులే. పని సక్రమంగానే జరిగింది. అయితే ఆ భవంతిని వినియోగిస్తున్న తీరే సక్రమంగా లేదు! లేకపోవడమే కాదు, పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేదిగా కూడా ఉంది. భవంతి లోపలంతా మహిళలు ఉన్నారు! వాళ్లేమీ డ్రాక్వా మహిళలు, స్వయం సహాయ బృందాల మహిళలు కాదు. రుతుక్రమంలో ఉన్న మహిళలు! కేంద్ర నిధులతో పంచాయతీ కట్టించిన భవనంలో వీళ్లు ఉండడం ఏంటి? ఇది రెండో ప్రశ్న. ఊళ్లో రుతుక్రమంలో ఉన్న మహిళలందర్నీ ఇలా ఊరికి దూరంగా ఉంచడం ఏమిటి? ఇది మూడో ప్రశ్న. మరి మొదటి ప్రశ్న ఏమిటి? రుతుక్రమంలో ఉన్న మహిళను అసలు ఇంటి బయట ఉంచడం ఏమిటి? ప్రశ్నల క్రమం ఎలా ఉన్నా మహిళల్ని ఇలా ఇంటికి దూరంగా , ఊరికి దూరంగా, రాజ్యాంగ హక్కుకు దూరంగా ఉంచడం సక్రమం కాదు. భవన నిర్మాణంలో నిధుల దుర్వినియోగం జరిగిందని గ్రామస్తులు కొందరు జిల్లా మేజిస్ట్రేట్ రణ్‌బీర్ చౌహాన్ దృష్టికి తెచ్చినప్పుడు, ఆ భవనాన్ని ‘బహిష్టు కేంద్రం’లా వినియోగిస్తున్నట్లు బయటపడింది. చౌహాన్ నివ్వెరపోయారు. జిల్లాలో ఇంకా ఎక్కడైనా ఇలాంటి ‘పంచాయతీ నిధుల బహిష్టు కేంద్రాలు’ ఉన్నాయేమో చూడాలని అధికారులను ఆదేశించారు. ఉన్నదీ లేనిదీ ఒకటీ రెండు రోజుల్లో తెలుస్తుంది. అయితే ఉండేందుకే అవకాశం ఉందనిపిస్తోంది.చంపావత్ జిల్లా.. భారత్–నేపాల్ సరిహద్దుల్లో ఉంది. నేపాల్ గ్రామాల్లో ‘నెలసరి పాక’ల (పీరియడ్ హట్స్) ఆచారం ఉంది. రుతుక్రమం వచ్చిన మహిళల్ని ఆ ఐదు రోజులూ వాటిలో ఉంచుతారు. ఆ అనాగరిక ఆచారానికి సరిహద్దుకు ఇవతల ఉన్న మన గ్రామాలు కూడా ప్రభావితం అవుతున్నాయనేందుకు నిదర్శనమే ఇప్పుడు బయట పడిన ఘర్చమ్ గ్రామంలోని బహిష్టు కేంద్రం. ఇటీవలే నేపాల్‌లోని బజురా జిల్లాలోని ఒక గ్రామంలో అంబా బొహారా (35), పన్నెండు, తొమ్మిదేళ్ల వయసు గల ఆమె కొడుకులిద్దరు నిద్రిస్తున్నప్పుడు నెలసరి పాకకు నిప్పంటుకుని ఊపిరి ఆడక ఆ ముగ్గురూ చనిపోయినట్లు వార్తలు వ చ్చాయి. గత నవంబర్‌లో వచ్చిన గజ తుఫాన్లో తమిళనాడులో విజయలక్ష్మి అనే పన్నెండేళ్ల బాలిక నెలసరి పాకలో ఉన్నప్పుడు ఈదురుగాలులకు కొబ్బరి చెట్టు కూలిపడి చనిపోయింది. ఆమె తల్లి గాయపడింది. ఇంకా ఇలాంటి వార్తలు మిగతా రాష్ట్రాల నుంచీ తరచూ వినిపిస్తూనే ఉన్నాయి కనుక ఆడపిల్లల విషయంలో నేపాలైనా, భారత్ అయినా, ఇంకో దేశమైనా ఒకటే అనుకోవాలి. ఇంకొకటి కూడా అనుకోవాలి. ఫైనాన్స్ కమిషన్ కేటాయింపులతో కట్టిన భవనాన్ని బహిష్టు కేంద్రంగా మార్చారంటే.. ప్రభుత్వం ఏమైనా అంటుందేమోనన్న భయం కన్నా, నెలసరి వచ్చిన మహిళలు ఎవర్నైనా అంటుకుంటారేమోనన్న భయమే గ్రామస్తులలో, గ్రామ పంచాయతీల్లో వ్యాపించి ఉందని అనుకోవాలి. చంపావత్ జిల్లా మేజిస్ట్రేట్‌కు ఈ సంగతి తెలిసినప్పుడు మొదట ఆయన అన్నమాట.. ‘ఇదేంటీ!’ అని. రెండో మాట.. ‘అలా ఉంచేశారా, ప్యాడ్స్ ఏమైనా ఇచ్చారా?’ అని. మంచి మాట. అరవై ఏడేళ్లుగా ఫైనాన్స్ కమిషన్ దేశాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య డబ్బు లెక్కలు చూస్తోంది. మహిళా సంక్షేమం అన్నది కమిషన్ పరిధిలోకి రాని విషయమే అయినా, అభివృద్ధిలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించిన విధంగానే, స్త్రీల జీవితాలను దుర్భరం చేసే దురాచారాలను పాటిస్తున్న గ్రామాలకు నిధులను తగ్గిస్తాం అన్న భయం పెట్టొచ్చు. డబ్బు ఇచ్చే కాదు, డబ్బును ఇవ్వకుండా కూడా అభివృద్ధిని సాధించవచ్చు.. స్త్రీ సంక్షేమం కూడా దేశాభివృద్ధిలో ఒక భాగం అనుకుంటే. -
హోదా వద్దని ఆర్థిక సంఘం అనలేదు
-
‘హోదా వద్దని ఆర్థిక సంఘం చెప్పలేదు’
సాక్షి, న్యూఢిల్లీ : 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాను రద్దు చేయాలని సిఫార్సు చేసినట్టు ఎక్కడా వెల్లడించలేదని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తెలిపారు. అవాస్తవాన్ని నిజమని నమ్మించవచ్చని బీజేపీ విశ్వసిస్తోందని, అందుకోసమే వాళ్లు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. హోదాపై ఆర్థిక సంఘం ఎలాంటి ప్రతికూల సిఫార్సులూ చేయకపోయినా ఎవరికీ కనిపించనివి బీజేపీకి మాత్రమే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. మరోవైపు ప్రత్యేక హోదాపై ఏపీలో రోజురోజుకూ పోరు ఉధృతమవుతోందన్నారు. హోదా పోరాటం కొనసాగుతుందని, సోనియా గాంధీ సైతం ప్రయత్నాలు సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలతో సహా అప్పటి ప్రధాని మన్మోహన్ గాంధీ ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని ప్రస్తావిస్తూ రామచంద్రరావు గురువారం రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ తీర్మానం ప్రవేశపెట్టారు. కేవీపీ ప్రవేశపెట్టిన తీర్మానం శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు చర్చకు వచ్చే అవకాశం ఉంది. -
రాష్ట్రపతిని కలిసిన ఆర్థిక మంత్రులు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఐదు రాష్ట్రాల ఆర్ధికమంత్రులు కలిశారు. ఏపీ ఆర్థిక మంత్రి యనమల నేతృత్వంలో కేరళ, పంజాబ్, ఢిల్లీ, బెంగాల్ రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు రాష్ట్రపతితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 15 వ ఆర్ధిక సంఘం విధివిధానాలను మార్చాలని మంత్రులు కోరారు. అలాగే కేంద్రం విధివిధానాల విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతికి వినతి పత్రం అందజేశారు. 2011 జనాభా నిష్పత్తి ప్రకారం నిధుల పంపకాల విధానంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అమరావతిలో చేసిన తీర్మానం నివేదికను రాష్ట్రపతికి మంత్రులు అందజేశారు. కేంద్రం రాష్ట్రాలను అణిచి వేస్తోంది రాష్ట్రపతిని కలిసిన అనంతరం యనమల మీడియాతో మాట్లాడుతూ.. ‘రాజ్యాంగపరంగా ఆర్టికల్ 280 ప్రకారం ఆర్థిక సంఘం స్వతంత్ర వ్యవస్థ. 14వ ఆర్థిక సంఘం సమయంలో కూడా 1971 జనాభా ప్రతిపాదనే పరిగణనలోకి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ చెప్పింది. ఇప్పుడు కూడా 15వ ఆర్థిక సంఘంలో 1971 జనాభానే తీసుకోవాలని ఇపుడు కూడా డిమాండ్ చేస్తోంది. రాష్ట్రాల ఆర్థిక హక్కులకు కేంద్రం భంగం కలిగించరాదు. ఏపీ సర్కారు రాష్ట్రాల హక్కుల కోసం కేంద్రంపై పోరాటం చేస్తూనే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో రాష్ట్రాలకు హక్కులున్నాయి, విధానాలున్నాయి. కేంద్రం బలవంతంగా ఆర్థిక విధానాలను రాష్ట్రాలపై రుద్దరాదు. కేంద్ర ప్రభుత్వ దయదాక్షిణ్యాలపై రాష్ట్రాలు ఆధారపడేలా కేంద్రం వ్యవహరిస్తోంది. రాష్ట్రాలకు భిక్షం వేసేలా 15వ ఆర్థిక సంఘం వ్యవహరిస్తే అంగీకరించం. రాష్ట్రాలు రాజ్యాంగపరంగా హక్కులను కాపాడుకుంటాయి. రాష్ట్రాలకు ఇన్సెంటివ్స్తో ఉపయోగం ఉండదు. కేంద్రం రాష్ట్రాల హక్కులను కాలరాయరాదు.15 వ ఆర్థిక సంఘం సిఫార్సులపై జూన్‌లో జాతీయ స్థాయిలో సదస్సు ఏర్పాటు చేస్తాము. వెనుకబడిన రాష్ట్రాల పేరుతో కేంద్రం అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రాలను నాశనం చేయాలనుకుంటే చూస్తూ కూర్చోము. కేంద్రం కావాలనుకుంటే వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేకంగా కేటాయింపులు చేయాలి. కేంద్రం రాష్ట్రాలను అణచి వేసేందుకు చూస్తోందనేందుకు కర్ణాటక ఉదాహరణ.’ అన్నారు -
నేడు అమరావతిలో 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రుల భేటీ
సాక్షి, అమరావతి/కాకినాడ రూరల్: 15వ ఆర్థిక సంఘం నియమ నిబంధనలతో రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతుందన్న నేపథ్యంలో 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సోమవారం అమరావతిలో సమావేశమవుతున్నారు. సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం నియమ నిబంధనల్లో ప్రధానంగా 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకుని రాష్ట్రాలకు నిధుల కేటాయింపులను సిఫార్సు చేయాలని ఉంది. దీని వల్ల ఆంధ్ర ప్రదేశ్‌కు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గిపోతాయని, ఏటా 8000 కోట్ల రూపాయలు నష్టం వస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఇదే తరహాలో తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, ఒడిశా, పంజాబ్, పశ్చిమబెంగాల్, సిక్కిం, మేఘాలయ, మిజోరామ్ రాష్ట్రాలు నష్టపోనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాలన్నీ 2011 జనాభాకు బదులు 1971 జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే సోమవారం ఈ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక శాఖ కార్యదర్శులు, ఆర్థిక రంగ నిపుణులు సమావేశమై 15వ ఆర్థిక సంఘం నియమ నిబంధనల కారణంగా ఏ విధంగా రాష్ట్రాలను అన్యాయం జరుగుతుంతో కూలంకుషంగా చర్చించనున్నారు. అనంతరం ఈ నిబంధనలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించాలని నిర్ణయించారు. ఆ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపించాలని నిర్ణయించారు. 1971 జనాభా ప్రాతిపదికన పరిగణనలోకి తీసుకుంటే దేశంలో రాష్ట్ర జనాభా 5.05 శాతంగా ఉంటుంది. అదే 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే దేశంలో రాష్ట్ర జనాభా 4.09 శాతమే ఉంటుంది. 15వ ఆర్థిక సంఘం విధివిధానాలను మార్చాలి: యనమల రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా రూపొందించిన 15వ ఆర్థిక సంఘం విధివిధానాలను మార్చాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం విధివిధానాల కారణంగా దేశంలోని 11 రాష్ట్రాల ఆర్థిక ప్రయోజనాలు దెబ్బ తింటాయన్నారు. విభజన అనంతరం ఏపీకి రూ.16 వేల కోట్ల లోటు ఉన్నట్టు ఆర్బీఐ సహా అన్ని సంస్థలూ నివేదించాయని యనమల తెలిపారు. కేంద్రం ఇప్పటివరకూ రూ.4 వేల కోట్లు మాత్రమే రాష్ట్రానికి ఇచ్చిందన్నారు. ప్రస్తుతం కేంద్ర పథకాలు 60:40 నిష్పత్తిలో అమలు చేస్తున్నారని దీని వల్ల రాష్ట్రాలపై 30 శాతం అదనపు భారం పడుతోందని అన్నారు. -
మోదీకి మమత బెనర్జీ లేఖ
కోల్‌కతా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ లేఖ రాశారు. 15వ ఆర్థిక సంఘం కేంద్రానికి చేసిన సిఫారసులను వ్యతిరేకిస్తున్నట్లు ఆమె ఆ లేఖలో తెలిపారు. జనాభా అధారిత సంవత్సరంగా 1971 బదులు 2011 సంవత్సరంగా మార్చడం, దాని వల్ల కలిగే నష్టాల గురించి లేఖలో వివరించారు. 15వ ఆర్థిక సంఘం కొత్తగా చేసిన సిఫారసుల వల్ల రాష్ట్రాలకు నిధుల పంపకంలో తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఆర్థిక సంఘం సిఫారసులను వ్యతిరేకిస్తు మోదీకి లేఖ రాసిన మొదటి సీఎం మమతనే కావడం విశేషం. గత కొంతకాలంగా 15వ ఆర్థిక సంఘం కేంద్రానికి చేసిన సిఫారసులను రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే బహిరంగంగా ఏ రాష్ట్రం విమర్శించలేదు. కాగా జనాభా అధారిత సంవత్సరంగా 1971కి బదులుగా 2011ను ప్రతిపాదించడంతో తమ రాష్ట్రానికి 25,000 కోట్ల నుంచి 35,000 కోట్ల నష్టపోయే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. సమాఖ్య విధానంలో రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సమాఖ్య విధానానికి విరుద్ధం అని మమత విమర్శించారు. గత ఐదేళ్లుగా 1971 జనాభా ఆధారంగానే రాష్ట్రంలో అనేక సామాజిక, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ఆమె ఆ లేఖలో ప్రస్తావించారు. జనాభా ఆధారిత సంవత్సరాన్ని మార్చడంతో పశ్చిమ బెంగాల్ మాత్రమేకాక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఒడిశా లాంటి రాష్ట్రాలు అధికంగా నిధులు కోల్పోతున్నాయని లేఖలో వివరించారు. ఉత్తర భారతంలో ఉన్న రాష్ట్రాలు బిహార్, రాజస్తాన్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం అధికంగా నిధులు మంజూరుచేస్తోందని, మిగిలిన రాష్ట్రాలకు కేంద్రం నిధుల కుదించడం అన్యాయమని విమర్శించారు. -
ఫైనాన్స్ కమిషన్‌పై అనుమానాలొద్దు
సాక్షి ప్రతినిధి, చెన్నై/తిరువిడందై: 15వ ఆర్థికసంఘం నిబంధనలు కొన్ని రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ వస్తున్న ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ అంశాన్ని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. జనాభా నియంత్రణకోసం పనిచేస్తున్న రాష్ట్రాలకు ప్రోత్సాహకాలివ్వాలంటూ కేంద్రమే ఆర్థిక సంఘానికి సూచించిందని గురువారం చెన్నైలో వెల్లడించారు. ఇటీవల కేరళలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో.. కేంద్రంపై విమర్శలు చేసిన నేపథ్యంలో మోదీ ఈ వివరణనిచ్చారు. అంతకుముందు, కాంచీపురం జిల్లా మహాబలిపురం సమీపం తిరువిడందైలో డిఫెన్స్ ఎక్స్పోను మోదీ లాంఛనంగా ప్రారంభించారు. భారత సాయుధ దళాలను మరింత బలోపేతం చేసేందుకే దేశాన్ని రక్షణ రంగ తయారీ కేంద్రంగా మార్చే దిశగా కృషిచేస్తున్నట్లు తెలిపారు. శాంతి, సామరస్యాల్లో ప్రపంచ దేశాలకు భారత్ ఒక ఆదర్శమని, అలాగని సమరానికి సన్నద్ధంగా రక్షణశాఖను బలోపేతం చేసుకోవడంలో తప్పులేదన్నారు. కాగా, కావేరీ బోర్డు ఏర్పాటుపై కేంద్రం ఇంతవరకు స్పందించకపోవటంతో ఈ పర్యటనలో తమిళులు మోదీకి నల్లజెండాలతో నిరసన తెలిపారు. మరోవైపు, విపక్షాలు పార్లమెంటు కార్యక్రమాలను జరగనివ్వకపోవటానికి నిరసనగా బీజేపీ ఎంపీలు దేశవ్యాప్తంగా గురువారం ఉపవాస దీక్ష చేపట్టారు. ప్రధాని మోదీ కూడా ఈ దీక్షలో ఉంటూనే తమిళనాడులో పర్యటించారు. తమిళనాడుకు లాభమే: మోదీ కేరళలో ఇటీవల జరిగిన భేటీలో కేరళ, కర్ణాటక, ఏపీ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొని.. 15వ ఆర్థిక సంఘం నిబంధనలు సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నాయని విమర్శించారు. 1971 జనాభా లెక్కల ప్రకారం కాకుండా.. 2011 జనగణనను ప్రాతిపదికగా తీసుకోవటం వల్ల జనాభా నియంత్రణ పాటిస్తున్న రాష్ట్రాలకు కేంద్ర నిధుల్లో అన్యాయం జరుగుతోందన్నారు. అయితే.. ఈ సమావేశానికి తమిళనాడు హాజరుకాకపోయినా.. 2011 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకోవటం ద్వారా కేంద్ర పన్ను ఆదాయం కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని విమర్శించింది. అయితే ఈ నిబంధనల ద్వారా తమిళనాడు వంటి రాష్ట్రాలకు మేలే జరుగుతుందని గురువారం నాటి కార్యక్రమంలో ప్రధాని పేర్కొనటం గమనార్హం. ‘15వ ఆర్థిక సంఘాన్ని అడ్డంపెట్టుకుని ఓ ప్రాంతం, ఓ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందంటూ జరుగుతున్న దుష్ప్రచారం అర్థరహితం. సబ్కా సాథ్, సబ్కా వికాస్ మా మంత్రం. మనమంతా కలసి నవభారత నిర్మాణానికి పనిచేయాలి. స్వాతంత్య్ర సమరయోధులు గర్వపడేలా చేయాలి’ అని మోదీ పేర్కొన్నారు. యూపీఏ విధానాల వల్లే.. దేశ సరిహద్దులను కాపాడుకోవటంలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధే పొరుగుదేశాలతో శాంతి నెలకొల్పటంలోనూ ఉందని మోదీ స్పష్టం చేశారు. తమిళనాడులోని ఈ కార్యక్రమంలో పలు స్వదేశీ, విదేశీ రక్షణ రంగ తయారీ సంస్థలు పాల్గొన్నాయి. గత యూపీఏ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల దేశంలో రక్షణ రంగం చతికిలబడిందని మోదీ విమర్శించారు. దీని మూలంగా భారత మిలటరీ యుద్ధ సంసిద్ధతపై ప్రభావం పడిందన్నారు. ‘నాటి రాజకీయ అచేతనం కారణంగా దేశంలో అత్యంత కీలకమైన రక్షణ సంసిద్ధత మూలనపడింది. వారి సోమరితనం, అసమర్థత, బయటకు కనిపించని ఉద్దేశాల కారణంగా జరిగిన నష్టాన్ని మనం చూశాం. గత ప్రభుత్వం పరిష్కరించాల్సిన చాలా సమస్యలను ఇప్పుడు మేం పరిష్కరిస్తున్నాం’ అని మోదీ పేర్కొన్నారు. ‘ప్రపంచ శాంతి, ఐకమత్యం, సామరస్యం కోసం భారత్ ఎప్పుడూ త్యాగం చేస్తూనే ఉంది. 2వ ప్రపంచ యుద్ధంలో భారత సైనికుల త్యాగాలను గుర్తుచేసుకోండి. వేల ఏళ్ల భారత చరిత్రను చూసుకోండి. మా దేశం ఎప్పుడూ సామ్రాజ్యకాంక్షతో ఇతర దేశాలపై దండెత్తలేదు. రాజ్యాలను, దేశాలను గెలవటం కంటే ప్రజల మనసులు గెలవటాన్నే మేం విశ్వసిస్తాం. వైదిక కాలం నుంచి శాంతి, సోదరభావం వంటి సందేశాలను ప్రపంచానికి ఇచ్చిన పుణ్యభూమి ఇది’ అని మోదీ పేర్కొన్నారు. ఎగుమతిచేసే సామర్థ్యానికి.. ‘2014 మేలో రక్షణ రంగ ఎగుమతుల అనుమతుల సంఖ్య 118 అని.. దీని విలువ దాదాపు రూ.3,767 కోట్లు. కానీ మేమొచ్చాక నాలుగేళ్ల లోపలే 794 ఎగుమతుల అనుమతులిచ్చాం. వీటి విలువ దాదాపు రూ.84వేల కోట్లు. రక్షణ రంగ సేకరణ విధివిధానాలను కూడా ఇరువర్గాలకు మేలు చేసేలా సమీక్షించాం. స్వదేశీయంగా రక్షణ రంగ పరిశ్రమ వృద్ధి చెందాలనేదే మా లక్ష్యం’ అని ప్రధాని పేర్కొన్నారు. దేశ ఆర్థికాభివృద్ధిలో రక్షణశాఖ పరికరాల ఉత్పత్తుల పరిశ్రమలది ప్రధానపాత్ర అన్న మోదీ.. ఈ రంగంలో దిగుమతుల నుంచి ఎగుమతి చేయగల సామర్థ్యాన్ని సాధించామన్నారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంతోపాటు వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. తమిళనాట ‘గోబ్యాక్ మోదీ’ చెన్నై: ప్రధాని మోదీ ఒక రోజు పర్యటన సందర్భంగా తమిళనాడులో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. కావేరి బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌పై కేంద్ర వైఖరికి నల్లజెండాలతో నిరసన తెలిపారు. గోబ్యాక్ మోదీ అని రాసి ఉన్న బెలూన్లను ఎగురవేశారు. ప్రధాని మద్రాస్ ఐఐటీకి వెళ్లే సమయంలో కొందరు ఆయన వ్యతిరేక నినాదాలు చేశారు. డీఎంకేతోపాటు సీపీఐ, సీపీఎం, ఎండీఎంకే పార్టీల నేతలు నిరసనల్లో పాల్గొన్నారు. చెన్నైతోపాటు దిండిగల్, కరూర్, రామనాథపురం, విరుధునగర్, మదురై, కోయంబత్తూర్లలోనూ ఇదే విధంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. డీఎంకే అధినేత కరుణానిధి, స్టాలిన్, ఎంపీ కనిమొళి తదితర నేతల ఇళ్ల వద్ద నల్లజెండాలు ఎగురవేశారు. ఎప్పుడూ తెల్లని దుస్తుల్లో కనిపించే కరుణానిధితోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, కనిమొళి నల్లరంగు దుస్తులు ధరించి నిరసన తెలిపారు. చెన్నైలో మోదీ వ్యతిరేక నినాదాలిస్తున్నకనిమొళి, డీఎంకే నేతలు దేశీయంగా ఫైటర్ జెట్ల తయారీ తిరువిడందై: ఎఫ్ఏ–18 సూపర్ హార్నెట్ విమానాలను భారత్‌లోనే తయారుచేసేందుకు అమెరికా విమానయాన సంస్థ బోయింగ్ ముందుకొచ్చింది. ఈ మేరకు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్), మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్(ఎండీఎస్)లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం..మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ విమానాల తయారీకి మన దేశంలో అధునాతన రక్షణ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తారు. ఈ భాగస్వామ్యం ద్వారా భారత్‌లోనే భవిష్యత్ సాంకేతికతలను రూపొందిస్తామని బోయింగ్ వెల్లడించింది. చెన్నైలో జరుగుతున్న డిఫెన్స్ ఎక్స్‌పోలో రెండో రోజైన గురువారం ఈ నిర్ణయం వెలువడింది. భారత వాయుసేనకు 110 యుద్ధ విమానాలను సరఫరా చేసే డీల్ రేసులో లాక్‌హీడ్ మార్టిన్, సాబ్, డసాల్ట్ తదితర దిగ్గజ కంపెనీలతో పాటు బోయింగ్ కూడా ఉంది. మేకిన్ ఇండియాలో భాగంగా ఇక్కడే తయారీని ప్రారంభిస్తే సుమారు 15 బిలియన్ డాలర్ల ఆ కాంట్రాక్టు కూడా బోయింగ్‌కే దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. -
పాఠశాలల్లో ఆహారానికి జీఎస్టీ మినహాయింపు
న్యూఢిల్లీ: పాఠశాలలే నేరుగా విద్యార్థులకు సరఫరా చేసే ఆహార పదార్థాలు, పానీయాలపై జీఎస్టీ విధించబోమని ఆర్థిక శాఖ తెలిపింది. అలాగే విద్యా సంస్థల్లోని క్యాంటీన్, మెస్‌లలోని ఆహార పదార్థాలకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకుండా జీఎస్టీని 5 శాతమే వర్తింపజేస్తామని పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఆర్థిక శాఖ ఒక ప్రకటనను జారీచేసింది. ‘హైయర్ సెకండరీ స్థాయి వరకు పాఠశాలలే నేరుగా ఆహార పదార్థాలను సరఫరా చేస్తే వాటికి జీఎస్టీని మినహాయిస్తాం. విద్యా సంస్థల్లోని మెస్, క్యాంటీన్లలోని ఆహార పదార్థాలపై ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ లేకుండా పన్ను 5 శాతమే ఉంటుంది’అని అందులో పేర్కొంది. -
ప్రాజెక్టులు భేష్
సాక్షి,సిద్దిపేట/చిన్నకోడూరు/గజ్వేల్/కాళేశ్వరం (మంథని) రాష్ట్రంలో సాగు, తాగునీటి కోసం చేపట్టిన ప్రాజెక్టులు అద్భుతంగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక సంఘం కార్యదర్శి అరవింద్ మెహతా ప్రశంసించారు. దేశాభివృద్ధికి వ్యవసాయం కీలకమని, దీనికి ప్రాజెక్టులే మూలమని.. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు నిర్మిస్తోందని కితాబిచ్చారు. ఇంటింటికీ సురక్షిత మంచినీరు అందించాలన్న సంకల్పంతో చేపట్టిన మిషన్ భగీరథ దేశమంతటికీ ఆదర్శనీయమని శ్లాఘించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల పనులను ఆయన శనివారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, రాష్ట్ర ఆర్థిక సంఘం ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తదితరులతో కలసి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి ప్రాజెక్టుల వద్దకు చేరుకున్నారు. గజ్వేల్‌లోని కోమటిబండ గుట్టపై ఉన్న ‘భగీరథ’హెడ్ రెగ్యులరేటరీని, సిద్దిపేట జిల్లా చంద్లాపూర్ శివారులో నిర్మిస్తున్న రంగనాయకసాగర్ రిజర్వాయర్‌ను, ‘కాళేశ్వరం’లో భాగమైన అన్నారం బ్యారేజీని పరిశీలించారు. ఆయా ప్రాజెక్టుల పరిధిలో జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాజెక్టుల వద్దే విలేకరులతో మాట్లాడారు. ఇది ఆరోగ్య ‘మిషన్’! ‘మిషన్ భగీరథ’పథకం భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తుందని అరవింద్ మెహతా ప్రశంసించారు. సురక్షిత నీరు అందితేనే ప్రజారోగ్య పరిరక్షణ సాధ్యమవుతుందని, తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా కృషి చేయడం అభినందనీయమని చెప్పారు. దీనిని అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. మిషన్ భగీరథతో రాబోయే ఐదేళ్లలో తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు కచ్చితంగా మెరుగవుతాయని చెప్పారు. 20 ఏళ్ల కింద కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిద్దిపేటలో ప్రారంభించిన తాగునీటి పథకమే మిషన్ భగీరథకు స్ఫూర్తి కావడం, తెలంగాణ వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా చేపట్టడం బాగుందని పేర్కొన్నారు. ప్రాజెక్టులో 98 శాతం నీటి సరఫరా గ్రావిటీ ద్వారానే జరుగుతుండడం ఆశ్చర్యకరమని, తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని అద్భుతంగా వినియోగించుకున్నారని కితాబిచ్చారు. సంతృప్తికరంగా ‘కాళేశ్వరం’పనులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయని అరవింద్ మెహతా పేర్కొన్నారు. ఇంత తక్కువ వ్యవధిలో ప్రాజెక్టు పనులు పురో గతి సాధించడం బాగుందని కితాబిచ్చారు. నాలుగైదు నెలల వ్యవధిలో 15వ ఆర్థిక సంఘం సభ్యులతో కలసి మళ్లీ రాష్ట్ర ప్రాజెక్టులను పరిశీలిస్తామని చెప్పారు. ఆర్థిక సంఘం నిధుల కేటాయింపు కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దేశానికే ఆదర్శం.. సాగు, తాగునీటి కోసం తెలంగాణ ప్రభుత్వం శ్రద్ధ అభినందనీయమని, ప్రాజెక్టులు అద్భుతంగా ఉన్నాయని అరవింద్ మెహతా ప్రశంసించారు. రాష్ట్రంలో సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులకు ఇస్తున్న ప్రాధాన్యతను ఇతర రాష్ట్రాలు గుర్తించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. మంచి పథకాలను ప్రోత్సహించాలని ఆర్థిక సంఘం నిర్ణయిస్తే.. ఆ ప్రోత్సాహకాలన్నీ తెలంగాణకే దక్కుతాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న నిధులను తెలంగాణ ప్రభుత్వం సక్రమంగా వినియోగించుకుంటోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇలాంటి మంచి పనులకు 15వ ఆర్థిక సంఘం సహకారం ఉంటుందని.. మరిన్ని నిధులు కావాలంటే ప్రభుత్వం తరఫున మెమోరాండం అందించాలని సూచించారు. ఆర్థిక సహకారం అందించండి: ఎస్కే జోషి దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తెలంగాణను తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని.. ఈ మేరకు రాష్ట్రానికి ఆర్థిక సహకారం అందించాలని అరవింద్ మెహతాకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి విజ్ఞప్తి చేశారు. ప్రధాన సాగు, తాగునీటి ప్రాజెక్టులకు 15 ఆర్థిక సంఘం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కాగా.. దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్రతో కేంద్ర ఆర్థిక సంఘం సమావేశం జరిగిందని.. రాష్ట్రాలు తీసుకున్న అప్పులను ఏయే అభివృద్ధి పనులకు, ఎలా వెచ్చిస్తున్నది తెలుసుకోవడానికి అరవింద్ మెహతా పర్యటించారని రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. -
తెలంగాణ ప్రభుత్వానికి ఫైనాన్స్ కమిషన్ ప్రశంసలు
సాక్షి, హైదరాబాద్: నిధుల వినియోగం విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై 15వ ఆర్థిక సంఘం ప్రశంసల జల్లు కురిపించింది. శరవేగంగా సాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల తీరును కొనియాడింది. తెలంగాణలోని బీడు భూములకు సాగునీరు అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు పనులను తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర పర్యటనకు వచ్చిన 15వ ఆర్థిక సంఘం సభ్యులు శనివారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శి అరవింద్ మెహతా మాట్లాడుతూ.. కాళేశ్వరం పనుల వేగం దేశ చరిత్రలోనే ఒక నమూనా అని కొనియాడారు. మిషన్ భగీరథ పథకం ఇతర రాష్ట్రాలకు మోడల్ అని ఆయన అన్నారు. -
నేడు ప్రభుత్వ కార్యదర్శుల సదస్సు
సాక్షి, హైదరాబాద్ : 2017–18 ఆర్థిక సంవత్సరం త్వరలో ముగియనుండటంతో అన్ని శాఖల ఉన్నతాధికారులతో ప్రభుత్వం ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేసింది. సోమవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ అధ్వర్యంలో ఈ సమావేశం జరుగనుంది. అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సదస్సుకు హాజరుకావాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా ఏడు అంశాలకు సంబంధించిన వివరాలతో రావాలని ఎజెండాను విడుదల చేసింది. 2018–19 బడ్జెట్ రూపకల్పనకు అవసరమైన ప్రతిపాదనలు, ఆన్లైన్లో ప్రతిపాదనల సమర్పణను అత్యంత ప్రాధాన్యాంశంగా ఎజెండాలో పేర్కొన్నారు. దీంతో పాటు రాష్ట్ర ఆదాయ వ్యయాలు, ఆర్థిక పరిస్థితిపై 15వ ఆర్థిక సంఘానికి పంపించాల్సిన నిర్ణీత నమూనాలు.. అందుకు అవసరమైన సమాచారం, కొత్త జిల్లాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, శాఖలు, ఉద్యోగుల విభజనకు సంబంధించిన అంశాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల వినియోగం, పెండింగ్‌లో ఉన్న యుటిలైజేషన్ సర్టిఫికెట్లు, సెక్రటేరియట్‌లోని అన్ని శాఖల విభాగాధిపతి కార్యాలయాల్లో సిటిజన్ చార్టర్ అమలు తీరు, జోన్లపై రాష్ట్రపతి ఉత్తర్వులు, దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సులపై సమావేశంలో సమీక్ష జరుపుతారు. -
విధివిధానాలపై 15వ ఫైనాన్స్ కమిషన్ చర్చ
న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పాటయిన 15వ ఫైనాన్స్ కమిషన్ మొట్టమొదటి సమావేశం సోమవారం ఇక్కడ జరిగింది. కమిషన్ విధివిధానాలు తత్సంబంధ అంశాలపై తొలి సమావేశం చర్చించినట్లు ఆర్థికమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆదాయ పంపిణీకి సంబంధించి అనుసరించాల్సిన విధానాల నివేదిక రూపకల్పన అంశంపై కమిషన్ ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు సమాచారం. 15వ ఫైనాన్స్ కమిషన్‌కు ప్రణాళికా సంఘం మాజీ సభ్యులు ఎన్కే సింగ్ నేతృత్వం వహిస్తున్నారు. 2019 అక్టోబర్ నాటికి నివేదిక..: కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై జీఎస్టీ ప్రభావం సహా పలు అంశాలను 15వ ఫైనాన్స్ కమిషన్ సమీక్షిస్తుంది. రుణ స్థాయిలు, నగదు నిల్వలు వంటి అంశాలను కమిషన్ సమీ క్షిస్తుంది. అక్టోబర్ 2019 నాటికి కమిషన్ తన నివేదికను సమర్పిస్తుంది. -
15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్.. ఎన్కే సింగ్
న్యూఢిల్లీ: ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు ఎన్కే సింగ్ 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై జీఎస్టీ ప్రభావం సహా పలు అంశాలను 15వ ఫైనాన్స్ కమిషన్ సమీక్షిస్తుంది. రుణ స్థాయిలు, నగదు నిల్వలు, కేంద్ర, రాష్ట్రాల్లో ద్రవ్య క్రమశిక్షణ వంటి అంశాలను కమిషన్ పరిశీలించి, తగిన సిఫారసులు చేస్తుంది. అక్టోబర్ 2019 నాటికి కమిషన్ తన నివేదికను సమర్పిస్తుంది. మాజీ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్, మాజీ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అశోక్ లాహిరి, నీతీ ఆయోగ్ సభ్యులు రమేష్ చాంద్, జార్జిటౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనూప్ సింగ్‌లు కమిషన్‌లో సభ్యులుగా ఉంటారు. 15వ ఫైనాన్స్ కమిషన్ 2020 ఏప్రిల్ 1 నుంచీ ప్రారంభమయ్యే ఐదేళ్ల కాలంపై దృష్టి సారిస్తుంది. 14వ ఫైనాన్స్ కమిషన్ 2013 జనవరి 2న ఏర్పాటయ్యింది. 2015 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31వ తేదీ వరకూ సంబంధించిన కాలానికి ఈ కమిషన్ సిఫారసులు చేసింది. -
రాష్ట్రాలకు 42 శాతం వాటా
-
పన్నుల వాటా నుంచి ఏపీకి 4.3%
సాక్షి, హైదరాబాద్: రానున్న ఐదేళ్లలో కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు భారీగా ఆర్థిక ప్రయోజనం కలుగనుంది. కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రాలకు 42% ఇవ్వాలన్న 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నేపథ్యంలో వచ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి రూ.1.69,970 లక్షల కోట్లు రానున్నాయి. అంతేగాక రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్లపాటు రెవెన్యూ లోటు భర్తీ రూపంలో రూ.22,113 కోట్ల ఆర్థిక సాయాన్ని కేంద్రం అందించనుంది. దేశంలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు మొత్తం 11 రాష్ట్రాల రెవెన్యూ లోటు భర్తీకి 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. 2016, ఏప్రిల్ నుంచి వస్తు సేవల పన్ను(జీఎస్టీ)ను అమల్లోకి తేనున్న నేపథ్యంలో కేంద్రానికి పన్నుల రూపంలో భారీగా ఆదాయం వస్తుందని 14వ ఆర్థిక సంఘం అంచనా వేసింది. ఆ మేరకు ఐదేళ్లలో కేంద్రానికి పన్నుల రూపంలో రూ.39,48,187 కోట్ల ఆదాయం వస్తుందని, ఇందులో 42 శాతాన్ని రాష్ట్రాలకు బదలాయించాలని సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటా నుంచి 4.3% రానుంది. అలాగే సర్వీసు పన్నుల నుంచి 4.3% ఆదాయం రానుంది. గత ఆర్థిక సంఘాల మాదిరిగా 14వ ఆర్థిక సంఘం రంగాల వారీగా గ్రాంట్లను సిఫార్సు చేయలేదు. పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు, విపత్తుల నివారణకు మాత్రమే గ్రాంట్లను సిఫార్సు చేసింది. విద్య, వైద్య ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి ఇతర మౌలిక వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు మరింత శ్రద్ధ చూపాలని పేర్కొంది. జాతీయ ఉపాధి హామీ పథకం తప్ప మిగతా కేంద్ర ప్రాయోజిత పథకాలను ఇక కేంద్రం అమలు చేయకుండా ఆ నిధులను రాష్ట్రాలకే ఇవ్వడంలో భాగంగానే పన్నుల్లో 42% వాటాను ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ఇక ప్రణాళిక గ్రాంట్లు ఉండబోవని దీన్ని బట్టి అర్థమవుతోందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మొత్తమ్మీద ఉమ్మడి రాష్ట్రంలో 13 ఆర్థిక సంఘం సిఫార్సులు చేసినప్పటికీ... విభజన తర్వాత ఏపీకి విడిగా చూస్తే కేంద్ర పన్నుల వాటాలో ఆ సమయంలో 4.1% రాగా, ఇప్పుడు 4.3% వాటా వస్తోందని ఆ అధికారి వివరించారు. విభజనను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ఆదాయ, వ్యయాలను అంచనా వేసినట్లు సంఘం సిఫార్సుల్లో పేర్కొంది. ఈ నిధుల విడుదలకు కేంద్రం ఎలాంటి ఆంక్షలు విధించలేదు. వచ్చే ఐదేళ్లలో పట్టణ స్థానిక సంస్థలకు రూ.3,631 కోట్లు, గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.8,650 కోట్లు గ్రాంటుగా సిఫార్సు చేసింది. అలాగే విపత్తుల నిర్వహణ కింద ఐదేళ్ల కాలానికి రూ.2,429 కోట్లను మంజూరు చేసింది. గతంలో ఈ మొత్తంలో 25% రాష్ట్ర ప్రభుత్వం 75% కేంద్రం భరించేది. ఇప్పుడు రాష్ట్రం 10% మిగతా 90% కేంద్రం భరించనుంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.25% అప్పులు తెచ్చుకోవడానికి అనుమతించింది. 14వ ఆర్థిక సంఘం సమయంలో 3% కన్నా తక్కువ అప్పులు చేస్తే ఆ మరుసటి సంవత్సరంలో ఆ తక్కువ చేసిన మొత్తాన్ని తెచ్చుకునే వెసులు బాటును కల్పించారు. -
రాష్ట్రాలకు 42 శాతం వాటా
14వ ఆర్థిక సంఘం సిఫారసులకు కేంద్రం ఆమోదం 13వ ఆర్థికసంఘం సిఫారసులకన్నా ఏకంగా 10 శాతం పెంపు రాష్ట్రాల వాటా మొత్తంలో తెలంగాణకు 2.437%, ఏపీకి 4.305% తెలంగాణ గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 4,837 కోట్ల గ్రాంటు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 7,788 కోట్ల గ్రాంటు తెలంగాణ పట్టణ స్థానిక సంస్థలకు రూ. 2,711 కోట్లు ఏపీ పట్టణ స్థానిక సంస్థలకు రూ. 2,908 కోట్లు ఏపీకి రెవెన్యూ లోటు భర్తీ కోసం రూ. 22,113 కోట్లు గ్రాంటు సిఫారసుల నివేదిక పార్లమెంటుకు సమర్పణ రాష్ట్రాల వాటా పెరిగినందున కేంద్ర పథకాల పాత్ర తగ్గుతుంది: జైట్లీ సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం, రాష్ట్రాల మధ్య పంపిణీ జరగాల్సిన కేంద్ర పన్నుల వసూళ్లలో 42 శాతం వాటాను రాష్ట్రాలకు కేటాయించాలని 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. 13వ ఆర్థిక సంఘం 32 శాతం వాటాను సిఫారసు చేయగా.. తాజాగా 14వ ఆర్థిక సంఘం మరో పది శాతం పెంచుతూ 42 శాతానికి సిఫారసు చేసింది. ఈ వాటా నుంచి రాష్ట్రాల సామర్థ్యం, పనితీరు, జనాభా, వెనుకబాటుతనం తదితర అంశాల ఆధారంగా వాటికి విడివిడిగా వాటాలు నిర్ధారించింది. రాష్ట్రాలకు కేటాయించిన మొత్తంలో ఆంధ్రప్రదేశ్‌కు 4.305 శాతం, తెలంగాణకు 2.437 శాతం వాటాగా ఆర్థిక సంఘం నిర్ణయించింది. అలాగే సేవా పన్ను (సర్వీస్ ట్యాక్స్)లో ఏపీ వాటా 4.398 శాతంగా, తెలంగాణ వాటా 2.499 శాతంగా నిర్ధారించింది. వీటికి అదనంగా స్థానిక సంస్థలకు గ్రాంట్లను కూడా సిఫారసు చేసింది. అదే సమయంలో రెవెన్యూ లోటు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ సహా 11 రాష్ట్రాలకు ఐదేళ్ల పాటు రూ. 1,94,821 కోట్ల గ్రాంట్లు ఇవ్వాలని సిఫారసు చేసింది. ఇందులో ఏపీకి ఐదేళ్లకు కలపి రూ. 22,113 కోట్లు కేటాయించింది. డాక్టర్ యాగా వేణుగోపాల్‌రెడ్డి (వై.వి.రెడ్డి) చైర్మన్‌గా ఏర్పాటైన 14వ ఆర్థికసంఘం డిసెంబర్ 15న తన సిఫారసుల నివేదికను సమర్పించగా.. దీనిని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ నివేదికను కేంద్రం ఆమోదించినట్టు ఆర్థికమంత్రి సాయంత్రం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సిఫారసులు 2015 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 వరకు అమలులో ఉంటాయి. పది శాతం పెరిగిన రాష్ట్రాల వాటా... 13వ ఆర్థిక సంఘం పన్నుల రాబడిలో రాష్ట్రాలకు 32 శాతం వాటాను సిఫారసు చేయగా.. 14వ ఆర్థిక సంఘం పది శాతం పెంచుతూ 42 శాతం సిఫారసు చేసింది. గత ఆర్థిక సంఘాలు ఎప్పుడూ ఒకటి, రెండు శాతానికి మించి పెంచుతూ సిఫారసు చేయలేదని.. తొలిసారిగా 10 శాతం మేరకు పెంచుతూ 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిందని.. దీనిని ఆమోదిస్తున్నామని అరుణ్‌జైట్లీ తెలిపారు. ‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికలకు ముందు ప్రచార సభల్లో ఇదే చెప్పారు. రాష్ట్రాలకు ఎక్కువ వాటా ఉండాలని, నేరుగా రాష్ట్రాలే వాటిని వినియోగించుకునే స్వేచ్ఛ ఉండాలని చెప్పారు. దానికి అనుగుణంగానే 14వ ఆర్థిక సంఘం సిఫారసులు రావడం సంతోషకరం’’ అని పేర్కొన్నారు. ‘‘రాష్ట్రాలు కోరినట్టుగానే పన్నుల్లో వాటా పెరిగింది. అలాగే కేంద్ర పథకాల పాత్ర కూడా తగ్గుతుంది..’’ అని ఆయన వివరించారు. 1971 నాటి జనాభాను, అప్పటి నుంచి జనాభాలో వచ్చిన మార్పులను, ఆదాయ వ్యత్యాసాలను, అటవీ విస్తీర్ణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ 42 శాతం వాటా 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు కేటాయింపులు జరిపిందని మంత్రి తెలిపారు. స్థానిక సంస్థలకు నిధులిలా... పన్నుల్లో వాటాతో పాటు స్థానిక సంస్థలకు గ్రాంట్ల రూపంలో కేంద్రం ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. ఆ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ స్థానిక సంస్థలకు 2015-20 వరకు మొత్తం రూ. 7,788.68 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ. 2,908.64 కోట్లు ఇవ్వాలని సూచించింది. అదే సమయంలో తెలంగాణకు గ్రామీణ స్థానిక సంస్థలకు ఐదేళ్లకు కలపి రూ. 4,837.75 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ. 2,711.12 కోట్లు చొప్పున కేటాయించాలని సిఫారసు చేసింది. వీటితోపాటు పనితీరు ఆధారిత గ్రాంట్లను కూడా స్థానిక సంస్థలకు కేటాయించాలని చెప్పింది. ఆ ప్రకారం ఏపీలోని గ్రామీణ స్థానిక సంస్థలకు ఐదేళ్ల పాటు రూ. 865.41 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ. 727.16 కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసింది. అదేరీతిలో తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 537.53 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ. 677.78 కోట్లు ఇవ్వాలంది. లోటు భర్తీ కోసం గ్రాంట్లు... ఆంధ్రప్రదేశ్ సహా 11 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు భర్తీ కోసం ఐదేళ్ల పాటు గ్రాంట్లను 14వ ఆర్థికసంఘం సిఫారసు చేసింది. దీనిలో భాగంగా ఏపీకి మొత్తం రూ. 22,113 కోట్లు కేటాయించింది. 2015-16లో రూ. 6,609 కోట్లు, రెండో సంవత్సరంలో రూ. 4,930 కోట్లు, మూడో సంవత్సరంలో రూ. 4,431 కోట్లు, నాలుగో సంవత్సరంలో రూ. 3,644 కోట్లు, ఐదో సంవత్సరంలో రూ. 2,499 కోట్లు చొప్పున కేటాయించాలని సిఫారసు చేసింది. కొన్ని రాష్ట్రాలకు తొలి రెండు సంవత్సరాలే కేటాయించింది. తెలంగాణకు రెవెన్యూ లోటు లేనందున ఈ జాబితాలో చోటు కల్పించలేదు. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడే రెవెన్యూ లోటు భర్తీకి తగిన సిఫారసులు చేయాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం చేసిన సూచనను 14వ ఆర్థిక సంఘం పరిగణనలోకి తీసుకుందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు.. అరుణ్‌జైట్లీ సమాధానమిస్తూ పరిగణనలోకి తీసుకున్నందునే ఏపీకి రెవెన్యూ లోటు భర్తీకి గ్రాంట్లు కేటాయించిందని చెప్పారు. -
ఆర్థిక రంగంపై ప్రధాని, ఆర్థిక మంత్రి సమీక్ష
-
అందని చేయూత
మండపేట : పట్టణ ప్రాంతాల అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఏటా కేటాయించే ఆర్థిక సంఘం నిధులు నగర, పురపాలక సంస్థలకు ‘వాయిదా పడ్డ వరం’లా మిగులుతున్నాయి. 13వ ఆర్థిక సంఘం నిధుల విడుదల తీరే అందుకు అద్దం పడుతోంది. 2011-12 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో విడత నిధులుగా జిల్లాకు రూ.1.72 కోట్లు విడుదల చేస్తూ ఇటీవల కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవంగా ఈ మూడేళ్లకు రూ.68.9 కోట్లకు పైగా రావాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యాక రెండు, మూడు వాయిదాల్లో ఈ నిధులను విడుదల చేయడం పరిపాటి. 13వ ఆర్థిక సంఘం 2010-11 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభం కాగా మొదటి ఏడాది మాత్రమే పూర్తిస్థాయిలో నిధులు విడుదలయ్యాయి. 2011-12 సంవత్సరానికి మొదటి వాయిదా నిధులు విడుదల చేసిన కేంద్రం తర్వాత ఆ ఊసే మరిచింది. నాటి నుంచి ప్రతి ఆర్థిక సంవత్సరమూ వార్షిక కేటాయింపులు చేయడం, వాటితో చేపట్టే పనులకు ప్రతిపాదనలు కోరడం, నిధుల విడుదలను మరవడం రివాజుగా మారింది. ప్రతిపాదనలే తప్ప పైకం లేదు.. జిల్లాలోని నగర, పురపాలక సంస్థలకు 13వ ఆర్థిక సంఘం 2012-13 ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ.19.38 కోట్లు, 2013-14 ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ.23.89 కోట్లు కేటాయించింది. ఆ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనుల ప్రతిపాదనలను నగర, పురపాలక సంస్థలు పురపాలకశాఖ ద్వారా కేంద్రానికి పంపినా సొమ్ములు విడుదల కాలేదు. అప్పట్లో స్థానిక సంస్థల పాలకవర్గాలు లేకపోవడం, 2010-11 నిధుల వినియోగానికి సంబంధించి నివేదికల అందజేతలో జాప్యమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఎన్నికల ముందు పట్టణ ప్రజల్లో వ్యతిరేకత రాకుండా బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్), లే అవుట్ రెగ్యులేజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)ల ద్వారా నగర, పురపాలక సంస్థలకు సమకూరిన ఆదాయాన్ని అభివృద్ధి పనులకు వెచ్చించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని గతనవంబర్లో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఆ నిధుల వినియోగానికి అనుమతులు మాత్రం ఇవ్వలేదు. ఆ పనులకు కాలం చెల్లినట్టే.. రెండున్నరేళ్లుగా ఆర్థికసంఘం నిధులతో చేపట్టేందుకు ప్రతిపాదించిన తాగునీటి వసతి, రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు జరగక పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. తాజాగా జిల్లాలోని ఏడు పట్టణాలకు 2011-12 ఆర్థిక సంవత్సరపు రెండో విడత నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు అందాయి. మండపేట మున్సిపాలిటీకి రూ.24.09 లక్షలు, అమలాపురానికి రూ.26.02 లక్షలు, తునికి రూ.25.47 లక్షలు, పిఠాపురానికి రూ.25.34 లక్షలు, సామర్లకోటకు రూ.27.11 లక్షలు, రామచంద్రపురానికి రూ. 20.92 లక్షలు, పెద్దాపురానికి రూ.23.02 లక్షలు విడుదలయ్యాయి. అయితే గత రెండు ఆర్థిక సంవత్సరాలకు (2012-13, 2013-14) సంబంధించి జిల్లాలోని నగర, పురపాలక సంస్థలు, నగర పంచాయతీలకు కేటాయించిన రూ.43.27 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.25.63 కోట్లు విడుదల కానేలేదు. 2015-16 ఆర్థిక సంవత్స రం నుంచి 14వ ఆర్థిక సంఘం ప్రారంభం కానుం ది. అంటే 13వ ఆర్థిక సంఘం నిధులతో జరగాల్సిన పనులకు కాలం చెల్లినట్టేనంటున్నారు. ఇకనైనా కేంద్రం త్వరితగతిన నిధులు విడుదల చేయడం ద్వారా పట్టణాల్లో సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
సింగపూర్ తీసుకెళ్ళి.. ఆ పరీక్షలేవో చేయించండి!
-
బాబు మానసిక స్థితిని పరీక్ష చేయించండి
ఆర్థిక సంఘం ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన ప్రతిపాదనల్లో ఏమాత్రం పస లేదని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు తమ్మినేని సీతారాం మండిపడ్డారు. అసెంబ్లీ నుంచి ప్రతిచోటా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వైఎస్ జగన్ నామస్మరణే సరిపోతోందని ఆయన అన్నారు. బహుశా చంద్రబాబుకు మతిస్థిమితం తప్పిందేమోనని, అందువల్ల ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడైనా మంచి ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేయించాలని సూచించారు. తాను కూడా గతంలో ఆయన వద్ద పనిచేసినవాడినే కాబట్టి, బాబు శ్రేయోభిలాషిగా ఈ మాట చెబుతున్నానన్నారు. కాసేపు ఆంధ్రప్రదేశ్ రాజధానిని సింగపూర్ చేస్తానని, మరికాసేపు ముంబై చేస్తానని ఆయన చెబుతున్నారని.. ఇప్పటికే సింగపూర్, ముంబై ఉన్నందున ఇప్పుడు ఆయన కొత్తగా చేయాల్సింది ఏమిటని తమ్మినేని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఆర్థిక సంఘం వద్ద తమకు ఏయే అవసరాలకు ఎంతెంత నిధులు కావాలన్న విషయాలను నిర్మాణాత్మకంగా చెప్పి నిధులు తెచ్చుకోవాలని, అంతేతప్ప గత ప్రభుత్వాల మీద బురద చల్లడానికి కూడా ఈ వేదికనే ఉపయోగించుకోవడం సరికాదని తమ్మినేని అన్నారు. -
రాజధాని నిర్మాణానికి 1,00, 213 కోట్లు ఇవ్వండి
తిరుపతి : ప్రస్తుతం రాష్ట్రం సమస్యలతో సతమతం అవుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలో 14వ ఆర్థిక సంఘం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర సాధనకు స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన వివరించారు. రాష్ట్రాన్ని ఆదుకోవాలని చంద్రబాబు ఈ సందర్భంగా ఆర్థిక సంఘాన్ని కోరారు. రాజధాని నిర్మాణానికి 1,00, 213 కోట్లు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొత్త రాజధాని నిర్మాణం చేపట్టాల్సి ఉందని, అధికారుల పంపిణీ కూడా ఇంకా పూర్తి కాలేదన్నారు. సంక్షోభాన్ని అభివృద్ధికి అనుకూలంగా మార్చుకుంటామన్నారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంచుతామన్నారు. అయిదు లేదా ఏడేళ్లలో ఏపీలో పూర్తిస్థాయి అక్షరాశ్యత సాధిస్తామన్నారు. -
నేడు, రేపు తిరుపతిలో 14వ ఆర్థిక సంఘం పర్యటన
తిరుపతి: డాక్టర్ వైవీ రెడ్డి చైర్మన్‌గా ఏర్పాటైన 14వ ఆర్థిక సంఘం గురు, శుక్రవారాల్లో తిరుపతిలో పర్యటించనుంది. 11వ తేదీ గురువారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి తిరుపతికి చేరుకునే కమిషన్ సాయంత్రం 4 గంటలకు జిల్లా పాలనాధికారులు, ఆర్థిక శాఖ అధికారులతో భేటీ అవుతుంది. రాత్రి తిరుపతిలోనే బస చేసి 12న తిరుచానూరు రోడ్డులోని హోటల్ గ్రాండ్ రిడ్జ్‌లో ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్వాగతోపన్యాసంతో రెండోరోజు కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 10.35 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. 11 గంటల నుంచి ఫైనాన్స్ కమిషన్ రాష్ట్ర ప్రగతికి సంబంధించి సూచించిన కీలక అంశాలపై చర్చ అనంతరం ఫైనాన్స్ కమిషన్ తన స్పందన తెలియజేస్తుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు వాణిజ్య, పరిశ్రమల ప్రతినిధులతో అనంతరం స్థానిక సంస్థల ప్రతినిధులు, రాజకీయ పక్షాల ప్రతినిధులతో కమిషన్ విడివిడిగా సమావేశమవుతుంది. రాత్రి ఇక్కడే బస చేసి 13 ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళుతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్, తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జట్టీ బుధవారం పర్యవేక్షించారు. అధికారులంతా తిరుపతికి చిత్తూరు(సెంట్రల్): శుక్రవారం 14వ ఆర్థిక సంఘం సమావేశం తిరుపతిలోని గ్రాండ్ రిడ్జ్ హోటల్లో జరగనున్న విషయం విదితమే. ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులంతా గురువారం సాయంత్రం తిరుపతికి చేరుకోనున్న నేపథ్యంలో వారికి భోజనం, వసతి సౌకర్యాల కల్పన కోసం అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు బుధవారం మధ్యాహ్నం నుంచే తిరుపతికి బయలుదేరి వెళ్లారు. పలువురిని చైర్మన్, సభ్యులకు లైజాన్ అధికారులుగా నియమించారు. దీనికి తోడు ఆయా శాఖలకు సంబంధించిన ప్రభుత్వ కార్యదర్శులు రానున్న నేపథ్యంలో ప్రొటోకాల్ నిబంధనల మేరకు ప్రధాన అధికారులంతా వారి సేవలో ఉండాల్సి ఉంది. దీంతో ప్రతి శాఖాధికారి తప్పనిసరిగా మూడు రోజుల పాటు (గురు, శుక్ర, శని) తిరుపతిలో ఉండేందుకు సిద్ధమై వెళ్లారు. భారీ బందోబస్తు తిరుపతి క్రైం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం తిరుపతికి వస్తున్న సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్ సిద్ధార్థ జైన్, ఎస్పీ గోపీనాథ్ జట్టి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి విమానాశ్రయం నుంచి నేరుగా హోటల్ గ్రాండ్ రిడ్జ్కు చేరుకుని సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. మధ్యాహ్నం అక్కడే భోజన కార్యక్రమం అయిన తరువాత సాయంత్రం హైదరాబాద్‌కు బయలుదేరుతారని సమాచారం. పర్యటన సందర్భంగా ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్లను అణువణువునా బుధవారం తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో జారుుంట్ కలెక్టర్, ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. -
తొలి రోజే తెలంగాణకు కేంద్ర నిధులు అందాయి
న్యూఢిల్లీ: భారత దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు అందడం సోమవారం నుంచి ఆరంభమయ్యాయి. కొత్తగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైనందున కేంద్ర ప్రభుత్వం తరపున ఆ రాష్ట్రానికి అందించాల్సిన నిధులను సోమవారం నుంచి ఇవ్వడం ప్రారంభించామని ఆర్ధిక శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. 13వ ప్లానింగ్ కమిషన్ సిఫారసుల ప్రకారం కేంద్ర నిధుల నుంచి రాష్ట్రాలకు రావాల్సిన వాటా ప్రతి నెల తొలి పనిదినాన అందుబాటులోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు చట్టం 2014 ద్వారా ఏర్పడిన తెలంగాణ జూన్ 2 తేదిన అవిర్భవించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కే. చంద్రశేఖర్ రావు పదవీ బాధ్యతల్ని స్వీకరించారు. -
చిన్న చూపు తగదు..!
సాక్షి, చెన్నై : రాష్ట్రానికి నిధుల కేటాయింపుల్లో కేంద్రం చిన్న చూపు తగదని ముఖ్యమంత్రి జయలలిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల పెంపు కోసం సహకరించాలని ఫైనాన్స్ కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. వైవీ రెడ్డి నేతృత్వంలో ఫైనాన్స్ కమిషన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం చెన్నై చేరుకుంది. సాయంత్రం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఈ కమిషన్ సమావేశం అయింది. ఇందులో ముఖ్యమంత్రి జయలలిత ప్రసంగిస్తూ, రాష్ర్ట ప్రభుత్వ ప్రగతిని వివరించారు. తమ ప్రభుత్వ పథకాలను గుర్తు చేస్తూ నిధుల కేటాయింపుల్లో కేంద్రం వివక్షను ఎత్తి చూపారు. ఇక్కడి పథకాలకు సమృద్ధిగా నిధుల్ని కేటాయించాల్సిన కేంద్రం, చిన్నచూపు చూడటం తగదన్నారు. రాష్ట్రాలకు ఆర్థిక సహకారం అందించాల్సిన కేంద్రం రాజకీయ ఎత్తుగడల్ని అనుసరించడం విచారకరమని పేర్కొన్నారు. తమిళనాడుకు పారదర్శకంగా నిధుల్ని కేటాయించాలని, సకాలంలో నిధుల మంజూరుకు సహకరించాలని ఫైనాన్స్ కమిషన్‌కు ఆమె విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఆ కమిషన్ చైర్మన్ వైవీ రెడ్డి, సభ్యులు సుష్మానాథ్, గోవిందరావు, సుదీప్ మున్డేల్, అభిజిత్ సేన్, కార్యదర్శి ఏఎన్ జా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. -
పెద్దాసుపత్రి అభివృద్ధికి రూ.89కోట్లతో ప్రతిపాదనలు
కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధికి 14వ ఫైనాన్స్ కమిషన్ నిధుల నుంచి రూ.89కోట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను అకడమిక్ డీఎంఈ డాక్టర్ ఎ.వెంకటేష్ ఆదేశించారు. బుధవారం ఆయన కర్నూలు మెడికల్ కాలేజీ, ఆసుపత్రి, ప్రాంతీయ కంటి వైద్యశాలలను తనిఖీ చేశారు. ముందుగా మెడికల్ కాలేజీలోని ప్రిన్సిపాల్ చాంబర్లో కళాశాల అభివృద్ధి కమిటి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆసుపత్రిలోని ఎంసీహెచ్ భవనం, ట్రామాబ్లాక్, గైనకాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, రేడియాలజీ, లైబ్రరీ, ఆఫ్తమాలజీ, మెడాల్, మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. లైబ్రేరిపై మరో ఫ్లోర్ నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని ఇంజనీర్లకు ఆదేశించారు. దాంతో పాటు పీడియాట్రిక్ బ్లాక్‌పై మరో ఫ్లోర్‌కు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఆరోగ్యశ్రీ కేసులు పెండింగ్ లేకుండా చూడాలని చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పదోన్నతుల ద్వారా ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తామని, 350 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను, 495 ఏపీవీవీ ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టులతో పాటు బోధనాసుపత్రుల్లో ఆర్ఎంవో పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. కొన్నేళ్లుగా తాను ఒక్కడినే పని చేస్తున్నానని, అసిస్టెంట్‌ను ఇవ్వాలని యురాలజీ విభాగాధిపతి డాక్టర్ సీతారామయ్య కోరగా త్వరలో వైద్యుల పోస్టులు భర్తీ కానున్నాయని, వారిలో ఒకరిని సహాయకునిగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఆసుపత్రిలో నిర్వహణకు రూ.1.5కోట్లు మంజూరయ్యాయన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీ, ఆసుపత్రులకు రూ.1.5కోట్లు, ప్రాంతీయ కంటి ఆసుపత్రికి రూ.1.2కోట్ల నిధులతో ఆధునిక పరికరాలు మంజూరైనట్లు చెప్పారు. ఆసుపత్రిలో క్యాన్సర్, థైరాయిడ్ నిర్ధారణ పరీక్షలకు ఉపయోగించే ఆధునిక కెమిలూషన్స్ పరికరం మంజూరు చేసినట్లు తెలిపారు. దీంతో పాటు 800 ఎంఏ ఎక్స్‌రే మిషన్, ఆధునిక అల్ట్రాసౌండ్ మిషన్, శస్త్రచికిత్స సమయంలో రక్తస్రావాన్ని నిలువరించే మూడు వెజెల్సీలింగ్ కాట్రిమెషీన్లు మంజూరయ్యాయని.. ఇవన్నీ రెండు నెలల్లో ఆసుపత్రికి చేరుకుంటాయన్నారు. అలాగే పీడియాట్రిక్ విభాగంలో మానిటర్ల ఏర్పాటుకు రూ.15లక్షలను ఆయన మంజూరు చేశారు. ఆయన వెంట కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రాంప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.ఉమామహేశ్వర్, కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.సుధాకర్‌రావు, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ చంద్రశేఖర్, వివిధ విభాగాధిపతులు, వైద్యులు ఉన్నారు.