న్యూఢిల్లీ: ఆరోగ్య రంగంపై ప్రభుత్వ వ్యయాలు పెరగాల్సిన అవసరం ఉందని 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్‌కే సింగ్ బుధవారం స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఈ విలువ కేవలం 0.95 శాతం ఉందని పేర్కొన్న ఆయన, 2024నాటికి ఇది 2.5 శాతానికి చేరాలని సూచించారు. దురదృష్టవశాత్తూ, ఆరోగ్య రంగానికి సంబంధించి దేశంలో మౌలిక సదుపాయాలు దారుణంగా ఉన్నాయని ఆయన అన్నారు.
ఆసియా హెల్త్ 2020 అనే అంశంపై పారిశ్రామిక వేదిక సీఐఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో సింగ్ మాట్లాడారు. ఆరోగ్య రంగంలో సవాళ్లను ఏ ఒక్కరో ఎదుర్కొనలేరనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ... ఈ రంగంపై కేటాయింపులను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ మేరకు ప్రభుత్వాల నుంచి చర్యలు ఉంటాయని తాను విశ్వసిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఎంబీబీఎస్ కోర్సు పరిధి పెంచడం వంటి రెగ్యులేటరీ మార్పులను కూడా పరిశీలనలోకి తీసుకున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం...
ఆరోగ్య సేవల రంగంలో ప్రైవేటు రంగం భాగస్వామ్యం కూడా కీలకమని సింగ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. వినూత్న నైపుణ్యలతో ప్రైవేటు రంగం చక్కటి సేవలను అందించగలుగుతుందన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో మంచి ఫలితాలను సాధించవచ్చని అన్నారు. కోవిడ్–19ను ఎదుర్కొనడంలో ఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్స్ కీలకపాత్ర పోషించారని పేర్కొన్న సింగ్, ఆరోగ్య సేవల విషయంలో మరింత గుర్తింపు లభించడానికి వారు అర్హులని అన్నారు.
‘ఆల్ ఇండియా మెడికల్ సర్వీస్’ ప్రస్తావన
‘‘ఆల్ ఇండియా మెడికల్ సర్వీస్ ఏర్పాటవుతుందని 1951 సివిల్ సర్వీసెస్ యాక్ట్ పేర్కొంది. ఆశ్చర్యకమైన విషయం ఏమిటంటే, అప్పటి నుంచీ ఈ తరహా సర్వీస్ ఏదీ ఏర్పాటు కాలేదు’’ అని సందర్భంగా పేర్కొన్న సింగ్, అంతర్జాతీయ ప్రమాణాలు, ఇప్పటికే చోటుచేసుకున్న పరిణా మాలు, ఉదాహరణల ప్రాతిపదికన ఈ సర్వీసు ఏర్పాటుకావాల్సిన అవసరం ఉందని సూచించారు. ఆరోగ్యం రంగం పలు సమస్యలు, సవాళ్ల వలయంలో చిక్కుకుందనీ వ్యాఖ్యానించారు.
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ తరహాలో ఇండియన్ మెడికల్ సర్వీస్ (ఐఎంఎస్)ను ఏర్పాటు చేయాలని ఇండియన్ మెడికన్ అసోసియేషన్ (ఐఎంఏ) గత కొంత కాలంలో డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 2021–22 నుంచి 2025–26 మధ్య దేశ ఆర్థిక రంగంలో తీసుకోవాల్సిన చర్యలపై సింగ్ నేతృత్వంలోని 15వ ఫైనాన్స్ కమిషన్ ఇప్పటికే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీలకు తన సిఫారసులను సమర్పించిన సంగతి తెలిసిందే. పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత నివేదికాంశాలు వెల్లడవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment