కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి
న్యూఢిల్లీ: జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలను పెద్ద ఎత్తున నిర్మిస్తున్న నేపథ్యంలో రెండేళ్లలో స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) లాజిస్టిక్స్ వ్యయాల వాటా 9%కి తగ్గుతుందని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం దేశీయంగా ఇది 14% ఉన్నట్లు చెప్పారు. అమెరికాతో పాటు యూరప్‌లోని పలు పెద్ద దేశా ల్లో ఈ వ్యయాలు 12% ఉండగా చైనాలో 8 శాతంగా ఉన్నట్లు నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వివరించారు.
2022–23 ఎకనమిక్ సర్వే ప్రకారం దేశ జీడీపీలో లాజిస్టిక్స్ వ్యయాలు 14–18%గా ఉన్నాయి. అంతర్జాతీయ సగటు 8% తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం. ప్రత్యామ్నాయ ఇంధనాలను ఎగుమతి చేసేందుకు భారత్‌కు భారీగా అవకాశాలు ఉన్నాయని గడ్కరీ చెప్పారు. తక్కువ నాణ్యత గల బొగ్గును మిథనాల్ తయారీకి ఉపయోగించవచ్చన్నారు. జీవ ఇంధనాల విభాగంలో దేశం గణనీయంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు.
రహదార్ల నిర్మాణంలో రీసైకిలింగ్ చేసిన టైర్ పౌడరు, ప్లాస్టిŠక్ మొదలైన మెటీరియల్స్‌ను వినియోగించడం వల్ల బిటుమిన్ దిగుమతులు తగ్గగలవని మంత్రి వివరించారు. మరోవైపు, దేశీ ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. గతేడాదే జపాన్‌ను దాటేసి అమెరికా, చైనా తర్వాత మూడో అతి పెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా భారత్ ఆవిర్భవించిందని గడ్కరీ చెప్పారు. 2014లో రూ. 7.5 లక్షల కోట్లుగా ఉన్న దేశీ మార్కెట్ 2024 నాటికి రూ. 18 లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment