Expressway projects
-
రెండేళ్లలో తగ్గనున్న లాజిస్టిక్స్ వ్యయాలు
న్యూఢిల్లీ: జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలను పెద్ద ఎత్తున నిర్మిస్తున్న నేపథ్యంలో రెండేళ్లలో స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) లాజిస్టిక్స్ వ్యయాల వాటా 9%కి తగ్గుతుందని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం దేశీయంగా ఇది 14% ఉన్నట్లు చెప్పారు. అమెరికాతో పాటు యూరప్‌లోని పలు పెద్ద దేశా ల్లో ఈ వ్యయాలు 12% ఉండగా చైనాలో 8 శాతంగా ఉన్నట్లు నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వివరించారు. 2022–23 ఎకనమిక్ సర్వే ప్రకారం దేశ జీడీపీలో లాజిస్టిక్స్ వ్యయాలు 14–18%గా ఉన్నాయి. అంతర్జాతీయ సగటు 8% తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం. ప్రత్యామ్నాయ ఇంధనాలను ఎగుమతి చేసేందుకు భారత్‌కు భారీగా అవకాశాలు ఉన్నాయని గడ్కరీ చెప్పారు. తక్కువ నాణ్యత గల బొగ్గును మిథనాల్ తయారీకి ఉపయోగించవచ్చన్నారు. జీవ ఇంధనాల విభాగంలో దేశం గణనీయంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. రహదార్ల నిర్మాణంలో రీసైకిలింగ్ చేసిన టైర్ పౌడరు, ప్లాస్టిŠక్ మొదలైన మెటీరియల్స్‌ను వినియోగించడం వల్ల బిటుమిన్ దిగుమతులు తగ్గగలవని మంత్రి వివరించారు. మరోవైపు, దేశీ ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. గతేడాదే జపాన్ను దాటేసి అమెరికా, చైనా తర్వాత మూడో అతి పెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా భారత్ ఆవిర్భవించిందని గడ్కరీ చెప్పారు. 2014లో రూ. 7.5 లక్షల కోట్లుగా ఉన్న దేశీ మార్కెట్ 2024 నాటికి రూ. 18 లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు. -
నాకు సమాధి తవ్వే పనిలో... విపక్షాలపై ప్రధాని మోదీ మండిపాటు
మండ్య/ధార్వాడ/హుబ్లీ: పేదల సంక్షేమం, దేశ అభివృద్ధి కోసం తాను అవిశ్రాంతంగా శ్రమిస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తనకు సమాధి తవ్వే పనిలో తీరిక లేకుండా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కర్ణాటకలో మండ్య వద్ద 118 కిలోమీటర్ల పొడవైన బెంగళూరు–మైసూరు 10 లేన్ల ఎక్స్‌ప్రెస్ రహదారిని ఆయన ఆదివారం అట్టహాసంగా ప్రారంభించారు. మైసూరు–కుశాలనగర 4 లేన్ల రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. తనను సమాధి చేయాలని కాంగ్రెస్ కలలు కంటోందని ఆక్షేపించారు. తనకు ఈ దేశ మాతృమూర్తులు, ఆడపిల్లలు, ప్రజలు రక్షణ కవచంగా ఉన్నారనే సంగతిని విపక్షాలు మరచిపోయినట్లు ఉందని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అభివృద్ధి పథంలో సాగుతోందన్నారు. పేదల బతుకుల్లో మార్పు దేశంలో గడిచిన 9 ఏళ్లలో వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా కోట్లాది మంది పేదల బతుకుల్లో మార్పు వచ్చిందని మోదీ అన్నారు. పేదల కనీస అవసరాలైన సొంత ఇల్లు, తాగునీరు, విద్యుత్, గ్యాస్ సరఫరా, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, ఆస్పత్రుల నిర్మాణం వంటి పనులను బీజేపీ ప్రభుత్వం చేపడుతోందన్నారు. 9 కోట్ల మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చినట్లు తెలిపారు. జలజీవన్ మిషన్ కింద 40 లక్షల ఇళ్లకు తాగునీటి సదుపాయం కల్పించినట్లు చెప్పారు. 140 కోట్ల మందిని అవమానించారు విద్యార్థులు తమ చదువులు దేశాభివృద్ధికి ఉపయోగపడేలా కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ధార్వాడలో ఐఐటీ విద్యాసంస్థ నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. లండన్‌లో బసవేశ్వరుడి విగ్రహాన్ని జాతికి అంకితం చేసే భాగ్యం తనకు కలిగిందన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా లండన్‌లో మాట్లాడారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మండిపడ్డారు. 140 కోట్ల మంది భారతీయులను అవమానించారని దుయ్యబట్టారు. ఇలాంటి వ్యక్తులను రాజకీయాలకు దూరంగా ఉంచాలన్నారు. ప్రపంచ దేశాలకు ఆశాకిరణం ప్రపంచ దేశాలకు ప్రస్తుతం భారత్ ఆశాకిరణంలా కనిపిస్తోందని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. భారత్‌లో అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అవి ఆరాటపడుతున్నాయని తెలిపారు. దేశంలో విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నట్లు చెప్పారు. కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలోనూ కర్ణాటకలో రూ.4 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వల్లే ఇది సాధ్యమైందని వివరించారు. అన్యాయంపై ప్రజాగ్రహమే దండి యాత్ర న్యూఢిల్లీ: చరిత్రాత్మక దండి యాత్ర వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ఆదివారం మహాత్మా గాంధీకి, యాత్రలో పాల్గొన్న నేతలకు నివాళులర్పించారు. బ్రిటిష్ వారిపై ప్రజల పోరాటంగా దండి యాత్ర గుర్తుండిపోతుందన్నారు. అన్యాయంపై ప్రజాగ్రహమే దండి యాత్ర అని ట్విట్టర్లో తెలిపారు. మన దేశ చరిత్రలో దండి యాత్ర కీలకమైన ఘట్టమని ఉద్ఘాటించారు. దండి యాత్రగా పేరుగాంచిన ఉప్పు సత్యాగ్రహం 1930 మార్చి 12న ప్రారంభమై ఏప్రిల్ 5న ముగిసింది. పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్ జాతికి అంకితం ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా గిన్నిస్ రికార్డుకెక్కిన కర్ణాటకలో శ్రీ సిద్ధారూఢ స్వామీజీ హుబ్బళ్లి రైల్వే స్టేషన్‌లోని 1,507 మీటర్ల పొడవైన ప్లాట్‌ఫామ్‌ను ప్రధాని ఆదివారం జాతికి అంకితం ఇచ్చారు. పలు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించారు. విద్యుదీకరించిన హోస్పేట–హుబ్బళ్లి–తినాయ్‌ఘాట్ రైల్వే సెక్షన్‌ను జాతికి అంకితమిచ్చారు. హుబ్బళ్లి–ధార్వాడ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా పలు పనులకు శంకుస్థాపన చేశారు. జయదేవ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ నిర్మాణానికి, ధార్వాడ మల్టీ విలేజ్ వాటర్ సప్లై స్కీమ్ పనులకు పునాదిరాయి వేశారు. తుప్పరిహళ్లి ఫ్లడ్ డ్యామేజ్ కంట్రోల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. మండ్య జిల్లాకేంద్రంలో ప్రధాని రోడ్డు షోలో పాల్గొన్నారు. -
ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్ వే తొలి దశ ప్రారంభం
దౌసా (రాజస్తాన్): కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణంలో మరో మైలు రాయిని అందుకుంది. దేశంలో అతి పెద్దదైన జాతీయ ఎక్స్‌ప్రెస్ హైవే ఢిల్లీ–ముంబై మహా రహదారిలో 246కి.మీ. భాగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఆవిష్కరించారు.ఢిల్లీలోని సోహ్నా నుంచి రాజస్తాన్‌లో దౌసా మధ్య నిర్మాణం జరుపుకున్న తొలిదశను దౌసా వద్ద రిమోట్ కంట్రోల్ బటన్ ద్వారా ప్రధాని ప్రారంభించారు. 8 లేన్లతో నిర్మించిన ఢిల్లీ–దౌసా–లాస్‌సాట్ రహదారి అందుబాటులోకి రావడంతో ఢిల్లీ, జైపూర్ మధ్య దూరం సగానికి సగం తగ్గిపోతుంది. ఇన్నాళ్లు 5 గంటలు పట్టే ప్రయాణం ఈ ఎక్స్‌ప్రెస్ వే మీదుగా వెళితే మూడున్నర గంటలే పడుతుంది. దీంతోపాటు రూ.5,940 కోట్ల జాతీయ హైవే ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశారు. తమ ప్రభుత్వం హైవే ప్రాజెక్టులు, పోర్టులు, రైల్వేలు, ఆప్టికల్ ఫైబర్, మెడికల్ కాలేజీల మీద అత్యధికంగా దృష్టి సారించిందని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. ఇలాంటి హైవేలతో పారిశ్రామికవేత్తలతో పాటు, వ్యాపారులు, చిరు వ్యాపారులు కూడా ఆర్థికంగా బలోపేతమవుతారని తెలిపారు. మౌలిక సదుపాయాలపై ఖర్చు చేస్తే మరిన్ని పెట్టుబడుల్ని ఆకర్షించవచ్చునని మోదీ చెప్పారు. ఢిల్లీ–ముంబై తొలిదశతో ఈ ప్రాంతం ఆర్థికంగా మరింత బలోపేతమవుతుందన్నారు. ఎక్స్‌ప్రెస్‌వే అందుబాటులోకి రావడంతో జైపూర్, అజ్మీర్‌లకు మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. సరిహద్దు ప్రాంతాలపై కాంగ్రెస్ నిర్లక్ష్యం: ప్రధాని మన దేశ సైనికుల శక్తి సామర్థ్యాలను కాంగ్రెస్ తక్కువగా అంచనా వేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్నాళ్లూ సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని, దేశంలోకి చొరబడడానికి మన శత్రువులు కొత్త మార్గాలు వెతుక్కుంటారన్న భయంతో ఏమీ చేయలేదని ధ్వజమెత్తారు. దౌసాలో ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన తర్వాత బీజేపీ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ రాజస్తాన్‌లో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కాంగ్రెస్ కాగితాలకే పరిమితం చేసిందని ఆరోపించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంటేనే రాజస్తాన్ అభివృద్ధి పథంలో దూసుకువెళుతుందని అన్నారు. దయానంద సరస్వతి 200వ జయంత్యుత్సవాలు ఆర్యసమాజ్ వ్యవస్థాపకుడు స్వామి దయానంద సరస్వతి 200వ జయంత్యుత్సవాలను మోదీ ఆదివారం ప్రారంభించారు. ఆయన చూపిన మార్గం కోట్లాది మందిలో ఆశల్ని నింపుతోందని ఈ సందర్భంగా ఆయనన్నారు. నిరుపేదలకు సేవ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అణగారిన వర్గాల అభ్యున్నతి మొట్టమొదటి యజ్ఞంగా చేపట్టామని తెలిపారు. ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్ వే విశేషాలు మొత్తం పొడవు: 1,380 కి.మీ. మొత్తం వ్యయం: దాదాపుగా రూ. లక్ష కోట్లు ఢిల్లీ ముంబై మధ్య ప్రయాణ సమయం: 12 గంటలు (ప్రస్తుతం 24 గంటలు పడుతోంది) తొలి దశ పొడవు : 246 కి.మీ. (సోహ్నా నుంచి దౌసా) వ్యయం: రూ.12,150 కోట్లు è ఢిల్లీ నుంచి జైపూర్ మధ్య సగానికి సగం తగ్గనున్న ప్రయాణ సమయం. (ఇన్నాళ్లూ 5 గంటలు పట్టేది. ఇకపై మూడున్నర గంటల్లో చేరుకోవచ్చు) . è ఆరు రాష్ట్రాల మీదుగా వెళ్లనున్న ఎక్స్‌ప్రెస్ వే 90 గంటలు, 10 సమావేశాలు, 10,800కి.మీ.. నాలుగు రోజుల వ్యవధిలో ప్రధాని నరేంద్ర మోదీ అక్షరాలా సుడిగాలి పర్యటనలు చేపట్టారు. మొత్తం 90 గంటల్లో ఏకంగా 10 బహిరంగ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయన 10,800 కి.మీ. దూరం ప్రయాణిస్తారు. ఫిబ్రవరి 10న ఢిల్లీ నుంచి యూపీకి వెళ్లి ప్రపంచ పెట్టుబడుల సదస్సుని ప్రారంభించారు. ముంబైకి వచ్చి వందేభారత్ రైళ్లకు పచ్చ జెండా ఊపారు. ఫిబ్రవరి 11న త్రిపురలో రెండు బహిరంగ సదస్సుల్లో పాల్గొన్నారు. ఆదివారం ఢిల్లీ నుంచి రాజస్తాన్ వెళ్లి దౌసాలో ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించారు. రెండు బహిరంగ సమావేశాల్లో ప్రసంగించారు. సోమవారం బెంగుళూరులో ఏరో ఇండియా 2023ను ప్రారంభిస్తారు. అక్కడ్నుంచి మళ్లీ త్రిపురకి వెళ్లి అగర్తాలా ర్యాలీలో పాల్గొని సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకుంటారు. -
మంచిర్యాల–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వేకు లైన్ క్లియర్.. రూట్ మ్యాప్ ఇలా..
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నిర్మించతలపెట్టిన కొత్త యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు మార్గం సుగమమైంది. మంచిర్యాల–నుంచి విజయవాడ వరకు నాలుగు వరుసలతో నిర్మించే ఈ కొత్త జాతీయ రహదారికి అడ్డంకులు దాదాపు తొలగిపోయాయి. పర్యావరణ అభ్యంతరాలు, భూసేకరణపై నిరసనలతో ప్రజాభిప్రాయ సేకరణ సభలు పూర్తి రసాభాసగా జరగటంతో రోడ్డు నిర్మాణం చిక్కుల్లో పడింది. కానీ, పర్యావరణానికి నష్టం జరగని విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేసిన అధికారులు, భూసేకరణకు సంబంధించిన అభ్యంతరాలను తోసిపుచ్చారు. ఫలితంగా ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయినట్టుగా ప్రకటించి 3 డీ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ల జారీతో.. సాంకేతికంగా టెండర్ల ప్రక్రియకు ఉన్న అవాంతరాలు దూరం కావటంతో టెండర్లకు శ్రీకారం చుట్టారు. తాజాగా మంచిర్యాల–వరంగల్ మధ్య 112 కి.మీ. దూరానికి సంబంధించిన నిడివిని మూడు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. వరంగల్–ఖమ్మం మధ్య 108 కి.మీ. దూరాన్ని రెండు లేదా మూడు ప్యాకేజీలుగా విభజించేందుకు కసరత్తు చేస్తున్నారు. మరో నాలుగైదు రోజుల్లో ఆ టెండర్లు కూడా పిలవబోతున్నారు. ఆ వెంటనే ఖమ్మం–విజయవాడ మధ్య కూడా ప్యాకేజీలు నిర్ధారించి టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి–మార్చి నాటికి టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి వర్క్ఆర్డర్ ఇవ్వనున్నారు. వచ్చే సంవత్సరం ద్వితీయార్ధంలో పనులు ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మహారాష్ట్ర–తెలంగాణ–ఏపీ ఈ కొత్త జాతీయ రహదారి మూడు రాష్ట్రాల మీదుగా సాగనుంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మొదలై తెలంగాణలోని ఆసిఫాబాద్–మంచిర్యాల–వరంగల్–ఖమ్మంల మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ వరకు కొనసాగుతుంది. నాగ్‌పూర్ నుంచి తెలంగాణలోని ఆసిఫాబాద్ మీదుగా మంచిర్యాల వరకు ప్రస్తుతం రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ భాగంలో ఇప్పటికే ఉన్న రహదారులను విస్తరిస్తున్నారు. మంచిర్యాల నుంచి పూర్తి కొత్త రోడ్డుగా రూపుదిద్దుకుంటుంది. నాలుగు వరుసలకే పరిమితం.. సాధారణంగా ఓ కొత్త రోడ్డును నిర్మించేప్పుడు, భవిష్యత్తులో దాన్ని మరింత విస్తరించేందుకు వీలు కలి్పంచేలా అదనంగా భూమిని సేకరిస్తారు. కానీ ఈ రోడ్డును మాత్రం నాలుగు వరుసలకే పరిమితం చేయాలని నిర్ణయించారు. దీంతో.. నాలుగు వరుసలకు సరిపడా 45 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేశారు. ఆరు వరుసలకు విస్తరించాలంటే మరో 15 మీటర్ల వెడల్పుతో భూమి అవసరమవుతుంది. కానీ అదనపు వరుసలకు ఎలాంటి భూమిని సేకరించటం లేదు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే నాగ్‌పూర్‌తో పాటు పూర్వపు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ప్రాంతాలకు చెందిన వాహనాలు విజయవాడకు ఈ రోడ్డునే వినియోగిస్తాయి. ఫలితంగా ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడకు ఉన్న జాతీయ రహదారిపై భారం బాగా తగ్గుతుంది. కొత్త జాతీయ రహదారి కోసం 1,550 హెక్టార్ల భూమిని సేకరించారు. ఇందుకు రూ.1,500 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. రోడ్డు నిర్మాణానికి రూ.8,500 కోట్ల వ్యయం కానుందని తాజాగా అంచనా వేశారు. అనుసంధానమయ్యే ప్రధాన పట్టణాలు ఇవీ.. మంచిర్యాల–వరంగల్: నిడివి 112 కి.మీ. ప్రధాన పట్టణాలు: మంచిర్యాల, మంథని, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, వరంగల్, పరకాల, ఆత్మకూరు, శాయంపేట, దామెర వరంగల్–ఖమ్మం: నిడివి 108 కి.మీ. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం ఊరుగొండ, గీసుగొండ, మచ్చాపూర్, సంగెం, నెక్కొండ, పర్వతగిరి, వెంకటయ్యపాలెం ఖమ్మం–విజయవాడ: నిడివి 91 కి.మీ. ఖమ్మం, కృష్ణా జిల్లా సిరిపురం, తునికిపాడు, ఆత్కూరు, రెమిడిచెర్ల, దుగ్గిరాలపాడు, జక్కంపూడి. -
మార్చికి రెండు హైవే కారిడార్లు పూర్తి
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది మార్చి నాటికి రాష్ట్రం మీదుగా వెళ్లే రెండు హైవే కారిడార్లు పూర్తికానున్నాయి. వీటిలో విజయవాడ–జగదల్పూర్ హైవే (ఎన్‌హెచ్–30) దాదాపు పూర్తయింది. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం నుంచి మైలవరం, తిరువూరు, భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం మీదుగా ఈ హైవే వెళుతుంది. 2015లో ప్రారంభమైన ఈ హైవే నిర్మాణంలో భూ సేకరణ ఇబ్బందులు లేకపోవడంతో త్వరితగతిన పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ భూభాగం పరిధిలో తిరువూరు వరకు సుమారు 90 కిలోమీటర్ల మేర ఈ హైవే ఉంటుంది. మొత్తం రెండు ప్యాకేజీలుగా విభజించి రూ.515 కోట్లతో ఈ కారిడార్ నిర్మాణం చేపట్టారు. ఈ హైవేలో ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత కొండపల్లి వద్ద అరకొరగా పనులు అసంపూర్తిగా ఉన్నాయి. దాదాపు మొత్తం 98 శాతం పనులు పూర్తి అయ్యాయి. అయితే కోస్తా రాస్తాగా పేరు గాంచిన కత్తిపూడి–ఒంగోలు హైవే (ఎన్‌హెచ్–216) పనులు మాత్రం మిగిలిపోయాయి. 2016లోనే ప్రారంభమైన కత్తిపూడి–ఒంగోలు హైవేలో ఒంగోలు వైపు పనులు మాత్రం పూర్తి కాలేదు. మొత్తం తొమ్మిది ప్యాకేజీలుగా విభజించి రూ.3,800 కోట్లతో పనులు చేపట్టారు. ఈ హైవేలో ఒక ప్యాకేజీ కింద మాత్రమే పనులు పూర్తి మిగిలిన 8 ప్యాకేజీల కింద పనులు సాగుతున్నాయి. మార్చి ఆఖరు నాటికి పనులు పూర్తి చేసేలా ఎన్హెచ్ఏఐ ఆదేశాలు జారీ చేసింది. కత్తిపూడి–కాకినాడ–దిగమర్రు–మచిలీపట్నం–ఒంగోలు వరకు ఈ జాతీయ రహదారిని నాలుగు, రెండు లేన్లుగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ రెండు హైవేలు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తీరడంతో పాటు పారిశ్రామికాభివృద్ధి వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. అనంత–అమరావతి ఎక్స్‌ప్రెస్ వే అలైన్మెంట్లో స్వల్ప మార్పు అనంతపురం నుంచి అమరావతి వరకు నిర్మించే ఎక్స్‌ప్రెస్ వే అలైన్మెంట్లో స్వల్ప మార్పు చేశారు. అనంతపురం నుంచి అమరావతి వరకు 385 కి.మీ. నిర్మించే ఈ ఎక్స్‌ప్రెస్ వేను గుంటూరు జిల్లా తాడికొండ మీదుగా అమరావతి రాజధాని వరకు నిర్మించేందుకు తొలుత ప్రతిపాదించారు. అయితే అనంతపురం నుంచి నేరుగా చిలకలూరిపేట బైపాస్కు అనుసంధానం చేస్తే 68 కి.మీ. మేర నిర్మాణం తగ్గుతుందన్న ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. ఏ ప్రాంతంలో అనుసంధానం చేయాలన్న విషయంలో నాలుగు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారు. -
ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుల పూర్తికి మూడేళ్ల గడువు
న్యూఢిల్లీ: జాతీయ రాజధానిలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈస్ట్రన్, వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్‌వేలపై చేపట్టిన ప్రాజెక్టుల పూర్తికి కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల గడువును నిర్ణయించింది. ఢిల్లీకి చెందిన ఏడుగురు ఎంపీలు బుధవారం కేంద్ర హైవే, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. గడ్కరీని కలిసినవారిలో ప్రజాపనుల శాఖ (పీడబ్ల్యూడీ), నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అధికారులు తదితరులు ఉన్నారు. ఢిల్లీ-మీరట్ మధ్య ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించాలని ఈ సందర్భంగా ఢిల్లీకి చెందిన ఎంపీల బృందం కేంద్రాన్ని కోరింది. ఆ తర్వాత దీనిని హరిద్వార్వరకూ పొడిగించాలని కూడా విన్నవించింది. ఈవిధంగా చేయడం వల్ల ఈ మార్గంలో ట్రాఫిక్ జాం ఇబ్బందులు తప్పుతాయన్నారు. బీఆర్టీ ప్రాజెక్టుల భవితవ్యం విషయమై ప్రశ్నించగా ఈ ప్రాజెక్టును తాత్కాలికంగా పక్కనపెట్టేశామన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల నగరవాసులు అనేక ఇబ్బందులకు గురయ్యారన్నారు. కాగా ఈశాన్య ఢిల్లీలో అదనంగా రెండు బ్యారేజీలను నిర్మించాలని సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి నగరానికి పెద్దసంఖ్యలో వాహనాలు వస్తుండడంతో వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన సమావేశంలో పాల్గొన్న బీజేపీ ఎంపీ మీనాక్షిలేఖి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈస్ట్రన్, వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్‌వేలపై చేపట్టిన ప్రాజెక్టుల పూర్తికి కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల గడువును నిర్ణయించిందన్నారు. ఆలోగా అవి పూర్తికావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. కాగా ఈ రెండు ఎక్స్‌ప్రెస్‌వేల పొడవు 135 కిలోమీటర్లు. వీటి నిర్మాణానికి 2006లోనే ప్రణాళికలను రూపొందించారు. అప్పట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కదిలిన అధికారులు ఈ ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు జాతీయ రాజధానిలోకి ప్రవేశించకుండా చేసేందుకుగాను నగరం వెలుపల ఓ రింగ్ రోడ్డును నిర్మించాలని అత్యున్నత న్యాయస్థానానికి చెందిన ధ ర్మాసనం అప్పట్లో ఆదేశించింది. ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం వల్ల ఘజియాబాద్, ఫరీదాబాద్, గౌతమ్‌బుద్ధనగర్, పల్వాల్ తదితర ప్రాంతాలు సంకేత రహితంగా మారిపోతాయి. ఇందువల్ల వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి. అదేవిధంగా వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ వే... కుంది, పల్వాల్ ప్రాంతాలను అనుసంధానం చేస్తుంది. కాగా ఈ ప్రాజెక్టుల పూర్తికి కేంద్ర ప్రభుత ్వం మూడు సంవత్సరాల గడువు ఇచ్చిన ప్పటికీ ఒకవేళ వాటిని కనుక రెండు లేదా రెండున్నర సంవత్సరాల వ్యవధిలో పూర్తిచేసినట్టయితే సదరు కాంట్రాక్టర్‌కు ఇన్సెంటివ్ను కూడా అందజేస్తుంది. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ఒకరు తెలియజేశారు.