సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నిర్మించతలపెట్టిన కొత్త యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు మార్గం సుగమమైంది. మంచిర్యాల–నుంచి విజయవాడ వరకు నాలుగు వరుసలతో నిర్మించే ఈ కొత్త జాతీయ రహదారికి అడ్డంకులు దాదాపు తొలగిపోయాయి. పర్యావరణ అభ్యంతరాలు, భూసేకరణపై నిరసనలతో ప్రజాభిప్రాయ సేకరణ సభలు పూర్తి రసాభాసగా జరగటంతో రోడ్డు నిర్మాణం చిక్కుల్లో పడింది. కానీ, పర్యావరణానికి నష్టం జరగని విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేసిన అధికారులు, భూసేకరణకు సంబంధించిన అభ్యంతరాలను తోసిపుచ్చారు. ఫలితంగా ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయినట్టుగా ప్రకటించి 3 డీ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేశారు.
ఈ నోటిఫికేషన్ల జారీతో.. సాంకేతికంగా టెండర్ల ప్రక్రియకు ఉన్న అవాంతరాలు దూరం కావటంతో టెండర్లకు శ్రీకారం చుట్టారు. తాజాగా మంచిర్యాల–వరంగల్ మధ్య 112 కి.మీ. దూరానికి సంబంధించిన నిడివిని మూడు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. వరంగల్–ఖమ్మం మధ్య 108 కి.మీ. దూరాన్ని రెండు లేదా మూడు ప్యాకేజీలుగా విభజించేందుకు కసరత్తు చేస్తున్నారు. మరో నాలుగైదు రోజుల్లో ఆ టెండర్లు కూడా పిలవబోతున్నారు. ఆ వెంటనే ఖమ్మం–విజయవాడ మధ్య కూడా ప్యాకేజీలు నిర్ధారించి టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి–మార్చి నాటికి టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి వర్క్‌ఆర్డర్ ఇవ్వనున్నారు. వచ్చే సంవత్సరం ద్వితీయార్ధంలో పనులు ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మహారాష్ట్ర–తెలంగాణ–ఏపీ
ఈ కొత్త జాతీయ రహదారి మూడు రాష్ట్రాల మీదుగా సాగనుంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మొదలై తెలంగాణలోని ఆసిఫాబాద్–మంచిర్యాల–వరంగల్–ఖమ్మంల మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ వరకు కొనసాగుతుంది. నాగ్‌పూర్ నుంచి తెలంగాణలోని ఆసిఫాబాద్ మీదుగా మంచిర్యాల వరకు ప్రస్తుతం రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ భాగంలో ఇప్పటికే ఉన్న రహదారులను విస్తరిస్తున్నారు. మంచిర్యాల నుంచి పూర్తి కొత్త రోడ్డుగా రూపుదిద్దుకుంటుంది.
నాలుగు వరుసలకే పరిమితం..
సాధారణంగా ఓ కొత్త రోడ్డును నిర్మించేప్పుడు, భవిష్యత్తులో దాన్ని మరింత విస్తరించేందుకు వీలు కలి్పంచేలా అదనంగా భూమిని సేకరిస్తారు. కానీ ఈ రోడ్డును మాత్రం నాలుగు వరుసలకే పరిమితం చేయాలని నిర్ణయించారు. దీంతో.. నాలుగు వరుసలకు సరిపడా 45 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేశారు. ఆరు వరుసలకు విస్తరించాలంటే మరో 15 మీటర్ల వెడల్పుతో భూమి అవసరమవుతుంది. కానీ అదనపు వరుసలకు ఎలాంటి భూమిని సేకరించటం లేదు.
ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే నాగ్‌పూర్‌తో పాటు పూర్వపు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ప్రాంతాలకు చెందిన వాహనాలు విజయవాడకు ఈ రోడ్డునే వినియోగిస్తాయి. ఫలితంగా ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడకు ఉన్న జాతీయ రహదారిపై భారం బాగా తగ్గుతుంది. కొత్త జాతీయ రహదారి కోసం 1,550 హెక్టార్ల భూమిని సేకరించారు. ఇందుకు రూ.1,500 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. రోడ్డు నిర్మాణానికి రూ.8,500 కోట్ల వ్యయం కానుందని తాజాగా అంచనా వేశారు.
అనుసంధానమయ్యే ప్రధాన పట్టణాలు ఇవీ..
మంచిర్యాల–వరంగల్: నిడివి 112 కి.మీ.
ప్రధాన పట్టణాలు: మంచిర్యాల, మంథని, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, వరంగల్, పరకాల, ఆత్మకూరు, శాయంపేట, దామెర
వరంగల్–ఖమ్మం: నిడివి 108 కి.మీ.
వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం ఊరుగొండ, గీసుగొండ, మచ్చాపూర్, సంగెం, నెక్కొండ, పర్వతగిరి, వెంకటయ్యపాలెం
ఖమ్మం–విజయవాడ: నిడివి 91 కి.మీ.
ఖమ్మం, కృష్ణా జిల్లా సిరిపురం, తునికిపాడు, ఆత్కూరు, రెమిడిచెర్ల, దుగ్గిరాలపాడు, జక్కంపూడి.
Comments
Please login to add a commentAdd a comment