
సెంటర్ల అద్దె మేమే చెల్లిస్తున్నాం
పని ఆధారిత ప్రోత్సాహకాల్లోనూ కోత తప్పడంలేదు
విజయవాడలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల మహాధర్నా
గాందీనగర్ (విజయవాడసెంట్రల్): ‘మా కుటుంబాలకు మూడు పూట్లా తిండిపెట్టలేకపోతున్నాం. ఆర్థిక ఇబ్బందులున్నాయి. ఆరోగ్య కేంద్రాల అద్దెలు సైతం మేమే చెల్లిస్తున్నాం. జీతాలు పెంచమని అడిగితే రూ.40 వేలు జీతం ఇస్తున్నామంటూ ప్రభుత్వం దు్రష్పచారం చేస్తోంది. పని ఆధారంగా చెల్లించే ప్రోత్సాహకాల్లోనూ కోత పెడుతున్నారు. ఇచ్చే అరకొర ప్రోత్సాహకం కూడా ఆలస్యమవుతోంది’ అంటూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ (సీహెచ్‌వో) వాపోయారు. గురువారం విజయవాడలోని ధర్నా చౌక్‌లో ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్/కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏపీఎంసీఏ) ఆధ్వర్యంలో సీహెచ్‌వోల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ మహాధర్నా జరిగింది.
రాష్ట్రం నలుమూలల నుంచి సీహెచ్‌వోలు తరలివచ్చారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా ఆందోళన చేపట్టారు. వికలాంగులు, చంటి బిడ్డల తల్లులు, గర్భిణులు ధర్నాలో పాల్గొని నిరసన తెలిపారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం సీహెచ్‌వోలను క్రమబద్దికరించాలని, నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులతో సమానంగా వేతన సవరణ చేయాలని, పని ఆధారిత ప్రోత్సాహకాలు ఇవ్వాలని, క్లినిక్ అద్దె బకాయిలు చెల్లించాలని, ఈపీఎఫ్‌వో పునరుద్ధరించాలని, జాబ్ చార్ట్ అందించాలని, హెచ్‌ఆర్ పాలసీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.
అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిళ్ల కారణంగా పలువురు సీహెచ్‌వోలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య శాఖను పటిష్టం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు. జీతాలు పెంచమని అడిగితే ఇప్పటికే రూ.40వేలు ఇస్తున్నామని ప్రభుత్వం దు్రష్పచారం చేస్తోందని మండిపడ్డారు. ఇదే ఎన్‌హెచ్‌ఎంలో పని చేస్తున్న 119 కేటగిరీల వారికి 23 శాతం వేతన సవరణ చేశారన్నారు.
ప్రోత్సాహకాల నెపంతో తమకు వేతన సవరణ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. తీవ్రమైన ఆరి్థక ఇబ్బందులతో కడుపు రగిలి రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. అసోసియేషన్ కార్యదర్శి సందీప్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 4వేల సెంటర్లు అద్దెప్రాతిపదికన నడుస్తున్నాయన్నారు. హెల్త్ సెంటర్ల అద్దెలు, కరెంట్ బిల్లులు తామే చెల్లిస్తున్నామన్నారు.
సొంత డబ్బుపెట్టుకొని సేవ చేస్తుంటే ప్రభుత్వం రూ.40 వేలు ఇస్తున్నట్టు దు్రష్పచారం చేస్తోందన్నారు. కేవలం రూ. 25వేలు ఇస్తున్నారని, ఈపీఎఫ్ బెనిఫిట్ కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సీహెచ్‌వోలు ప్రమాదవశాత్తు చనిపోతే మట్టి ఖర్చులు, ఎక్స్‌గ్రే షియా కూడా ఇవ్వడం లేదన్నారు. ధర్నాలో పెద్ద సంఖ్యలో సీహెచ్‌వోలు పాల్గొన్నారు.