అంగన్‌వాడీ ఆగ్రహ వేడి.. | Police prevented Anganwadis from going to the Mahadharna | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ ఆగ్రహ వేడి..

Published Tue, Mar 11 2025 4:38 AM | Last Updated on Tue, Mar 11 2025 4:40 AM

Police prevented Anganwadis from going to the Mahadharna

టీడీపీ కూటమి సర్కారు మోసాలపై మహిళల పోరుబాట

రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, టోల్‌గేట్ల వద్ద ఎక్కడికక్కడ నిర్బంధాలు

రెడ్‌బుక్‌ రాజ్యాంగం అణచివేత చర్యలు, పోలీసు ఆంక్షలను ఎదిరించి విజయవాడ 

మహాధర్నాకు భారీగా హాజరైన అంగన్‌వాడీలు

వేతనాల పెంపు, గ్రాట్యుటీపై కూటమి నేతలు నాడొక మాట.. నేడొక మాటా?

సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వంలో ఆరు జీవోలు జారీ

వైఎస్సార్‌ జిల్లా ఎర్రగుంట్ల, కొండాపురం రైల్వేస్టేషన్ల వద్ద మహాధర్నాకు వెళ్లనివ్వకుండా అంగన్‌వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. కైకలూరు, ఏలూరు రైల్వే స్టేషన్లు, చేబ్రోలు పోలీస్‌ స్టేషన్‌ వద్ద అంగన్‌వాడీలను నిర్బంధించగా, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు చెందిన అంగన్‌వాడీలను అశ్వారావుపేట బోర్డర్‌లో పోలీసులు అడ్డగించారు. కలపర్రు టోల్‌ గేట్‌ వద్ద ప్రైవేట్‌ వాహనాల్లో పెద్ద సంఖ్యలో తరలివెళుతున్న వారిని అడ్డుకుని కిందకు దించేశారు.  

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: మాట తప్పి మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై అంగన్‌వాడీలు కన్నెర్ర చేశారు. చంద్రబాబూ.. డౌన్‌డౌన్‌! కూటమి సర్కా­రుకు మా సత్తా చూపిస్తాం..! అంటూ కదం తొక్కారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, టోల్‌ గేట్ల వద్ద పోలీసు నిర్బంధాలు.. గృహ నిర్బంధాలు.. నోటీసులు.. రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో సర్కారు అణచివేతలకు వెరవకుండా తరలివచ్చి ఉప్పెనలా విరుచుకుపడ్డారు. విజ­యవాడ ధర్నా చౌక్‌లో అంగన్‌వాడీల ఆగ్రహ జ్వాలలు ఎగసిపడ్డాయి. 

ఆంక్షలు, అడ్డంకులను దాటుకుని రాష్ట్రవ్యాప్తంగా భారీగా తరలివచ్చిన అంగన్‌వాడీలతో సోమవారం విజయవాడలో నిర్వహించిన ‘మహాధర్నా’ దద్ధరిల్లింది.  కాగా, పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలో 11 ఏళ్లుగా అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తున్న ఓ మహిళను ఉద్యోగం నుంచి తొలగిస్తామని టీడీపీ –జనసేన కూటమి నేతలు బెదిరించడంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైన ఆమె పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.  

సర్కారు నిర్బంధకాండ.. 
అంగన్‌వాడీల మహాధర్నా నేపథ్యంలో కూటమి సర్కారు ఆదేశాలతో ఆదివారం రాత్రి నుంచి వారిపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసు నిర్బంధకాండ కొనసాగింది. అంగన్‌వాడీలను ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు సోమవారం రోజు శిక్షణ, రికార్డుల పరిశీలనకు హాజరు కావాలంటూ ప్రభుత్వ యంత్రాంగం హుకుం జారీ చేసింది. అయినప్పటికీ అంగన్‌వాడీలు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులను రంగంలోకి దించింది. వైఎస్సార్, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, నంద్యాల, తిరుపతి, చిత్తూరు, విజయనగరం తదితర జిల్లాల్లో అంగన్‌వాడీలను పోలీసులు హౌస్‌ అరెస్టులు చేశారు. 

విజయవాడ మహాధర్నాకు వెళ్లడానికి వీల్లేదంటూ నోటీసులు ఇచ్చారు. కైకలూరు, ఏలూరు రైల్వే స్టేషన్లు, చేబ్రోలు పోలీస్‌ స్టేషన్‌ వద్ద అంగన్‌వాడీలను నిర్బంధించారు. జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు చెందిన అంగన్‌వాడీలను అశ్వారావుపేట బోర్డర్‌లో పోలీసులు అడ్డగించారు. కలపర్రు టోల్‌ గేట్‌ వద్ద ప్రైవేట్‌ వాహనాల్లో వెళుతున్న వారిని అడ్డగించి కిందకు దించేశారు. 

నాడు న్యాయబద్ధమేనన్న లోకేశ్‌  
గతంలో ఆందోళన నిర్వహించిన సమయంలో అంగన్‌వాడీలను కలసిన నారా లోకేశ్‌ వారు అడుగుతున్నవి న్యాయబద్ధమైనవని, కూటమి ప్రభుత్వం రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ గుర్తు చేశారు. 

సమస్యల పరిష్కారం కోసం గతంలో 42 రోజులపాటు సమ్మె చేయడంతో వైఎస్సార్‌సీపీ హయాంలో ఆరు జీవోలు ఇచ్చింద­న్నారు. ఒప్పందం ప్రకారం గతేడాది జూన్‌లోనే వేతనాలు పెంచాల్సి ఉన్నా కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా అమలు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా అంగన్‌వాడీల డిమాండ్లను అమలు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

అధికారంలోకి రాగానే అన్యాయమైపోతాయా?  
గత ప్రభుత్వం అంగన్‌వాడీలకు ఇచి్చన అనేక హామీలను అమలు చేసిందని ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు తెలిపారు. అయితే మిగిలిన ఒప్పందాలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం దగా చేస్తోందని ధ్వజమెత్తారు. గ్రాట్యుటీ, మట్టి ఖర్చులు వంటి అనేక హామీలకు కోతలు పెట్టి మభ్య పెడుతోందన్నారు. 

ప్రతిపక్షంలో ఉండగా అంగన్‌­వాడీల డిమాండ్లు న్యాయమేనని అనిపించిన కూటమి నేతలకు అధికారంలోకి రాగానే అన్యాయమైపోతాయా? అని నిలదీశారు. నాడొక మాట.. నేడొక మాట కాకుండా హామీలను అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు.   

నెలాఖరులో జరిగే రివ్యూలు ఆగమేఘాలపై..
అంగన్‌వాడీలు విజయవాడలో మహాధర్నాకు హాజరుకాకుండా కుట్రలకు తెరతీసిన కూటమి ప్రభుత్వం నెలాఖరులో జరిగే సమీక్ష కార్యక్రమాలను అప్పటికప్పుడు తెరపైకి తెచ్చింది. అయినా కడప, బద్వేలులోని ఆర్డీవో కార్యాలయాల ఎదుట ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు కదం తొక్కారు. 2022లో సుప్రీం కోర్టు గ్రాట్యుటీ విషయంలో అంగన్‌వాడీలకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా అమలు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. 

మైదుకూరులోని తహసీల్దార్‌ కార్యాలయం, ప్రొద్దుటూరులోని అర్బన్‌ సీడీపీవో కార్యాలయం, జమ్మలమడుగు ఐసీడీఎస్‌ కార్యాలయం, ఎర్రగుంట్ల, కమలాపురం తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. అంగన్‌వాడీలు విజయవాడలో మహాధర్నాకు హాజరు కాకుండా ఉయ్యూరు రూరల్‌ మండలంలో ఐసీడీఎస్‌ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేశారు. అంగన్‌వాడీలకు శిక్షణ, రివ్యూ పేరుతో సోమవారం పెదవోగిరాల ఎంపీపీ పాఠశాలలో సమావేశం నిర్వహించి మమ అనిపించారు. 

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆకునూరు సెక్టర్‌ రివ్యూ నిర్వహించినట్టు  కంకిపాడు ప్రాజెక్టు సీడీపీవో బేబీ సుకన్య తెలిపారు. అంగన్‌వాడీలను అడ్డుకోవడమే లక్ష్యంగా రివ్యూ నిర్వహించారని ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు విమర్శించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసుల నిర్బంధకాండను ప్రజా సంఘాలు ఖండించాయి. అక్రమ అరెస్టులపై అంగన్‌వాడీలు విజయనగరం కలెక్టరేట్‌ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.

ఇవీ ప్రధాన డిమాండ్లు...
»  అంగన్‌వాడీలకు నెల వేతనం రూ.26 వేలకు పెంచాలి.  
»   గ్రాట్యుటీ చెల్లింపు హామీని అమలు చేయాలి.  
»   మినీ అంగన్‌వాడీలను మెయిన్‌ సెంట­ర్లుగా మారుస్తూ వెంటనే జీవో ఇవ్వాలి.  
»  రాజకీయ జోక్యాన్ని అరికట్టి హెల్పర్ల పదోన్నతులపై నిర్దిష్ట మార్గదర్శకాలు రూపొందించి అమలు చేయాలి.  
» సాధికారత సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదం తొలగించి సంక్షేమ పథకాలను అంగన్‌వాడీలకు వర్తింపచేయాలి.  
»  సర్వీసులో ఉంటూ చనిపోయిన వారికి మట్టి ఖర్చులకు రూ.20 వేలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. సమ్మెకాలంలో మృతి చెందిన వారికి కూడా ఇవి వర్తింపజేయాలి.  
»  పెండింగ్‌లో ఉన్న అంగన్‌వాడీల అద్దెలు, టీఏ బిల్లులు వెంటనే ఇవ్వాలి. అన్ని యాప్‌లను కలిపి ఒకే యాప్‌గా మార్పు చేయాలి.  
» పెండింగ్‌లో ఉన్న 164 సూపర్‌వైజర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.  
» మెనూ చార్జీలను పెంచాలి.  
» ఉచితంగా గ్యాస్‌ సరఫరా చేయాలి.  
» వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ కనీసం మూడు నెలలు ఇవ్వాలి.  
»  ప్రీ స్కూల్‌ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలి. ఐదు సంవత్సరాల పిల్లలందరూ అంగన్‌వాడీ కేంద్రాలలో ఉండేలా జీవో ఇవ్వాలి. ప్రీ స్కూల్‌ పిల్లలకు సాయంత్రం స్నాక్స్‌ ఇవ్వాలనే డిమాండ్‌ను తక్షణం అమోదించి అమలు చేయాలి.  

రెడ్‌ బుక్‌ పాలనపై కళ్లకు గంతలతో నిరసన
»  రెడ్‌బుక్‌ పాలన నశించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అంబేడ్కర్‌ సెంటర్‌లో అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. హామీలను వెంటనే అమలు చేయాలని నినదించారు.  
» అంగన్‌వాడీల అక్రమ అరెస్టులను నిరసిస్తూ.. కనీస వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌ జిల్లా రైల్వే కోడూరులో తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. 
»   తొమ్మిది నెలలుగా హామీలను అమలు చేయకపోవడం, పోలీస్‌ నిర్బంధాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏలూరు జిల్లా చింతలపూడిలో అంగన్‌వాడీలు ప్రదర్శన చేపట్టారు. బోసు బొమ్మ సెంటర్‌లో రాస్తా రోకో చేశారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement