
గవర్నర్లకు కాల పరిమితి విధించడం తప్పేమీ కాదు
సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితిని గవర్నర్లు కల్పించారు
ఇటీవలి కాలంలో ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారు
న్యాయ నిపుణుల స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: శాసనసభ ఆమోదించిన బిల్లులపై తమ నిర్ణయం వెలువరించే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్‌లకు కాల పరిమితిని ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును న్యాయ నిపుణులు స్వాగతిస్తున్నారు. రాష్ట్రపతికి, గవర్నర్లకు కాలపరిమితి విధించడం తప్పేమీ కాదని స్పష్టంచేస్తున్నారు.
ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిందేనని, ఇందుకు రాష్ట్రపతి, గవర్నర్లు అతీతులు కాదంటున్నారు. బిల్లుల విషయంలో గవర్నర్లు చేస్తున్న అసాధారణ, రాజకీయ జాప్యం వల్ల ప్రజాస్వామ్య మనుగడ ప్రమాదంలో పడకుండా సుప్రీంకోర్టు తీర్పు రక్షిస్తుందని పేర్కొంటున్నారు. ఇది చారిత్రక తీర్పుగా అభివర్ణిస్తున్నారు.
ప్రజా తీర్పును గవర్నర్లు అడ్డుకోలేరు
చట్టసభలు ఆమోదించిన బిల్లుల విషయంలో నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని గవర్నర్లను, మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతిని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా సమర్థిస్తున్నా. చట్టసభల నిర్ణయాల్లో ప్రజల ప్రయోజనాలే ప్రతిబింబిస్తుంటాయి. చట్టసభలు తీసుకునే నిర్ణయాలను రాష్ట్రపతి చేత నామినేట్ అయ్యే ఓ గవర్నర్ తన ఇష్టానుసారం అడ్డుకోవడం సబబు కాదు. ఇది రాజ్యాంగ విరుద్ధం. సుప్రీంకోర్టు తీర్పు చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. – సీవీ నాగార్జునరెడ్డి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది
ఇది సరైన తీర్పే
సుప్రీంకోర్టు సరైన తీర్పే ఇచ్చింది. గవర్నర్లు రాజ్యాంగబద్ధంగా నడుచుకోకపోవడం, ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నచోట ఆ ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం చేస్తున్నారు. ఇటీవల గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలను రాజకీయంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. పరిధులు దాటుతున్నారు. రాజ్యాంగ విలువలకు, సంప్రదాయాలకు తిలోదకాలిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలను పట్టించుకోవడం లేదు. గవర్నర్ల తీరుతో సుప్రీంకోర్టు విధిలేని పరిస్థితుల్లో ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా తాజా తీర్పునిచ్చింది. – సీవీ మోహన్‌రెడ్డి, సీనియర్ న్యాయవాది
న్యాయ సమీక్ష తప్పేమీ కాదు
చట్టసభల ఆమోదం పొందిన బిల్లుల విషయంలో నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రపతికి నిర్దిష్ట గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేక కోణంలో చూడాల్సిన అవసరం లేదు. రాజ్యాంగానికి లోబడే సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. తన వద్దకు వచ్చే బిల్లుల విషయంలో నిర్ణయానికి సంబంధించి రాష్ట్రపతికి ఇప్పటివరకు నిర్దిష్ట గడువు అంటూ లేదు. గడువు లేదన్న నెపంతో ఏళ్ల తరబడి ఆ బిల్లులను అలా పెండింగ్‌లో పెట్టుకుంటామంటే ఎలా? ప్రజల ఆకాంక్షలు ఏం కావాలి? శాసనసభ చేసిన బిల్లులు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే అందులో రాష్ట్రపతి, గవర్నర్లు జోక్యం చేసుకోవచ్చు.
అలాగే ఆ బిల్లులు ఏకపక్షంగా, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే కోర్టులు జోక్యం చేసుకుంటాయి. గవర్నర్ల తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నప్పుడు, వారి నిర్ణయాలు రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కోర్టులు న్యాయ సమీక్ష చేయడం తప్పేమీ లేదు. సుప్రీంకోర్టు అదే చేసింది.– చిత్తరవు నాగేశ్వరరావు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది