
- జనసేన ఎమ్మెల్యేల అంతర్మథనం
- విజయవాడలో రహస్య సమావేశం
కూటమి విజయానికి మనమే కారణం అయ్యాం... మనం లేకుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు అయ్యేనా.. ఆయన సీఎం అయ్యేనా.. కాపులంతా గంపగుత్తగా ఓట్లేయకపోతే కూటమికి ఇంత మెజారిటీ ఎలా వస్తుంది.. ఇన్ని సీట్లు ఎలా వస్తాయి..ఈ కూటమి ప్రభుత్వ రథానికి మనమే చక్రాలం..మనమే ఇరుసు..మనమే ఇంధనం కానీ ఇప్పుడు మనం కరివేపాకులం అయిపోయాం. పులుసులో ముక్కలం అయిపోయాం .. మనకు ఎక్కడ విలువ గౌరవం దక్కడం లేదు.
దేనికోసం ఇంత త్యాగాలు చేయాలి అంటూ జనసేన ఎమ్మెల్యేలు మదన పడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన కీలక భాగస్వామి.. అందులో 21 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. వారిలో పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ ఈ ముగ్గురికి క్యాబినెట్లో స్థానం దక్కింది.. మిగతా 18 మంది వట్టి ఎమ్మెల్యేలు గానే ఉన్నారు. అయితే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పోతుందని జనసేన బాధపడుతుంది.
జనసేన ఎమ్మెల్యే కన్నా టిడిపి ఇంచార్జీ మిన్న
తాము ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీని ఆ నియోజకవర్గాల్లో టిడిపి ఇన్చార్జిలకే అధికారులు గౌరవిస్తున్నారని వారి మాట వింటున్నారని తమకు ఏమాత్రం విలువ లేకుండా పోయిందని జనసేన ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతూ కాసేపటి క్రితం విజయవాడలోని హోటల్లో సమావేశం అయ్యారు. దీనికి నాదెండ్ల మనోహర్ కొందరు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మనోహర్ తో ఎమ్మెల్యేలంతా ఈ విషయాన్ని మొరపెట్టుకున్నట్లు తెలిసింది. స్థానికంగా తమ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీని తమ మాటను పోలీసులు రెవెన్యూ పంచాయతీ అధికారులు ఎవరూ వినడం లేదని తెలుగుదేశం వారు చెబితేనే అక్కడ మాట చెల్లుబాటు అవుతుందని మనోహర్ ఎదుట వాపోయారు.
మంత్రులుగా ఉన్న ఆ ముగ్గురికి నియోజకవర్గంలో కాస్త గౌరవం ఉన్నప్పటికీ మిగతా ఎమ్మెల్యేలు ఎవరికి ఇండిపెండెంట్గా పని చేసే అవకాశం దక్కడం లేదు. నియోజకవర్గాల పెద్ద పని ఏదైనా ఉంటే ఆ జిల్లా మంత్రి వద్దకు వెళ్లాల్సి వస్తుంది. పైగా ఆ మంత్రి కూడా లోకేష్ కంట్రోల్లో పనిచేస్తున్నారు. లోకేష్ కూడా జనసేన ను పెద్దగా పట్టించుకోకుండా జిల్లాల తన సొంత టీం ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతున్నారు. దీంతో అనివార్యంగా జనసేన నాయకులకు ప్రాధాన్యం తగ్గిపోతుంది. పలుచోట్ల వ్యాపారాల్లోనూ అక్రమ ఆదాయం తెలుగుదేశం జనసేన మధ్య పోటీ నెలకొన్న తరుణంలో తెలుగుదేశం వారు పలువురు జనసేన కార్యకర్తలను వెంటాడి కొట్టిన ఘటనలు ఉన్నాయి.
ఇంత బతుకు బతికి ఇంటి వెనక చచ్చినట్లు తెలుగుదేశానికి ఊడిగించేయడం కోసమే తమ పార్టీ ఉందా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని తెలుగుదేశం ఇన్చార్జిలకు అధికారులు గౌరవం ఇవ్వడం దానికి ఎంత అవమానం అన్నది ఈ సమావేశంలో వారంతా నాదెండ్ల మనోహర్ కు మొరపెట్టుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని తెలుగుదేశం పెద్దలతో మాట్లాడి సెటిల్ చేస్తే జిల్లాలో తమ గౌరవం నిలబడుతుందని అంతిమంగా పార్టీ కూడా బలపడే అవకాశం ఉంటుందని వారు చెప్పుకున్నారు.
కానీ జనసేన బలపడాలని తెలుగుదేశం ఏ కోశానా కోరుకోదు. జనసేన బలం తమకు బలం కావాలని తెలుగుదేశం భావిస్తుంది తప్పితే జనసేన సొంతంగా తన కాళ్లపై తన నిలబడి పోటీ చేసే పరిస్థితి వస్తే తెలుగుదేశానికి ఎంత ఇబ్బంది అన్నది చంద్రబాబు లోకేష్ లకు తెలుసు. అందుకే ఎక్కడికి అక్కడ జనసేన నాయకులను కార్యకర్తలను తమ కాళ్ళ కింద పెట్టి ఉంచుతూ ఆయా ప్రాంతాల్లో తెలుగుదేశం క్యాడర్ను మాత్రమే గుర్తిస్తూ పనులు పథకాలు పైరవీలు అని వాళ్ల ద్వారా జరిగేలా చూస్తున్నారు.
నియోజకవర్గాల్లో పనులు అంటూ జరిగితే తెలుగుదేశం వారి ద్వారానే జరగాలి లేదంటే లేదు. అంతేతప్ప జనసేన నాయకుడికి ఎక్కడా మర్యాద దక్కకూడదు అనే సింగల్ పాయింట్ ఏజెండాతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇదంతా తమకు అవమానంగా భావిస్తున్న జనసేన ఎమ్మెల్యేలు తమ గౌరవానికి భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత మీదే అంటూ మనోహర్ మీద ఒత్తిడి తెచ్చారు. మరోవైపు లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ శాఖను సైతం హైజాక్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇదంతా జనసేన మనుగడకు.. భవిష్యత్తుకు ముప్పుగా మారుతుందని వారు కలవరపడుతూ దిద్దుబాటు చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఏ స్థాయి ఫలితాలు ఇస్తుందో చూడాలి.
-సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment