భజన బ్యాచ్.. కొన్నాళ్ళు సైలెంట్‌గా ఉండండమ్మా | Janasena warns its party leaders over comments regarding the Deputy CM post | Sakshi
Sakshi News home page

భజన బ్యాచ్.. కొన్నాళ్ళు సైలెంట్‌గా ఉండండమ్మా

Published Tue, Jan 21 2025 6:05 PM | Last Updated on Tue, Jan 21 2025 6:44 PM

Janasena warns its party leaders over comments regarding the Deputy CM post

ఆగండ్రా బాబు.. అసలే అయన తిక్కలోడు.. ఏ క్షణానికి కండువా విసిరేసి వెళ్ళిపోతాడో తెలీదు.. కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండండి.. వచ్చి ఏడాది కూడా కాలేదు ఇప్పుడే మీరు చినబాబు డిప్యూటీ సీఎం .. చినబాబు డిప్యూటీ సీఎం అని కేకలు వేయకండి.. కొన్నాళ్ళు ఆగండి .. పరిస్థితులు చిన్నగా సర్దుకున్నాక అన్నీ చేద్దాం.. ముందే గాయిగాత్తర చేయకండి. అసలే తిక్కలోడికి ఢిల్లీ సపోర్ట్ ఉంది.. వాళ్ళ సపోర్ట్ టోన్ మనం గెలిచాం.. అప్పుడే అల్లరల్లరి చేస్తే లేనిపోని బాధలు. కొన్నాళ్ళు సైలెంట్ ఉండండి అని తెలుగుదేశం అధిష్టానం పార్టీ వీరవిధేయులైన ఎమ్మెల్యేలు.. ఇతర నాయకులకు సూచించింది.

వాస్తవానికి ఇది అధిష్టానానికి తెలిసి.. చంద్రబాబు కనుసన్నల్లో జరుగుతోందో..లోకేష్ పట్ల భక్తిభావం పెల్లుబికి.. దాన్ని అణచుకోలేక అంటున్నారో తెలియదు కానీ కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు అర్జంట్ గా లోకేష్ ను డిప్యూటీ చీఫ్ మినిష్టర్ గా చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. ఆఖరుకు పవన్ కళ్యాణ్ గెలుపులో కీలకపాత్ర పోషించిన పిఠాపురం వర్మ కూడా అదే రాగం ఎత్తుకున్నారు. ఇది గత రెండు నెలలుగా ఉధృతంగా సాగింది. ఐతే ఇన్నాళ్లుగా ఆ భజనను చూస్తూ ఊరుకున్న జనసైనికులు గత కొద్దిరోజులుగా నోరువిప్పుతూ సోషల్ మీడియాలో టీడీపీ మీద కౌంటర్లు వేస్తున్నారు. 

లోకేష్ కు డిప్యూటీ ఇవ్వండి ఫర్లేదు కానీ అదే టైములో పవన్‌కు సీఎంగా బాధ్యతలు ఇవ్వండి..  అప్పుడు ఎవరికీ అభ్యంతరం లేదు.. అంతేకానీ పవన్ను డిప్యూటీ సీఎంగా ఉంచుతూ మళ్ళీ లోకేష్‌కు అదే హోదా ఇస్తేమాత్రం గొడవలైపోతాయి అన్నట్లుగా పోస్టింగులు పెడుతున్నారు. ఈ జనసైనికులను పవన్ సైతం నియంత్రించలేదు. మరోవైపు బీజేపీతో పొత్తు.. జనసేనలో సీట్ల సర్దుబాటు వంటివన్నీ పవన్ దగ్గరుండి మరీ కుదిర్చారు. పవన్ లేకపోతె మొన్న తెలుగుదేశం గెలుపు అసాధ్యం అనేది అందరికి తెలిసిందే అలాంటపుడు మా పవన్ను కాదని వేరే వాళ్లకు.. అదే లోకేష్‌కు  ఎలా డిప్యూటీ ఇస్తారు అనేది జనసేన వాదన. 

దీంతోబాటు కేంద్రం సైతం పవన్ తోబాటు ఇంకో డిప్యూటీ ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. మొన్న అమిత్ షా వచ్చినపుడు సైతం లోకేష్ కు డిప్యూటీ ఇచ్చే అంశం ప్రస్తావనకు రాగా అయన తిరస్కరించినట్లు తెలిసింది. దీంతో కేంద్రం దన్ను సంపూర్ణంగా ఉన్న పవన్ తో గొడవ ఎందుకు.. అందాకా సైలెంట్ గా ఉండండి అని తెలుగుదేశం తన క్యాడరుకు ఒక మెసేజ్ పంపింది.

ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అధికారికంగా పార్టీ శ్రేణులకు ఒక సందేశం పంపింది. ఇకముందు ఎవరూ లోకేష్ డిప్యూటీ సీఎం కావాలంటూ డిమాండ్లు చేయకండి. సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టకండి అంటూ గేటు వేసింది. పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే అధికారం రుచి మరిగిన  నేపథ్యంలో ఆయన్ను ఇబ్బంది పెట్టి. ఇరిటేట్ చేసేలా ఏదీ చేయొద్దని.. అలాగైతే కూటమిలో చిచ్చు రేగుతుందని చంద్రబాబు గ్రహించి క్యాడర్ను నియంత్రించినట్లు చెబుతున్నారు. నాక్కొంచెం తిక్కుంది.. దానికి ఓ లెక్కుంది అనే పవన్ కు తిక్కరేగకుండా చంద్రబాబు  జాగ్రత్త పడుతున్నారన్నమాట. 

--సిమ్మాదిరప్పన్న

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement