
రాజధాని ప్రాంతంలో చంద్రబాబు ఇల్లు నిర్మించుకోనున్న స్థలం
అత్యంత భారీఎత్తున రూ.వందల కోట్లతో ప్యాలెస్ నిర్మాణానికి ఏపీ ముఖ్యమంత్రి శ్రీకారం
రాజధాని అమరావతి నడిబొడ్డున 5.16 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మాణం
లోకేశ్ భార్య బ్రాహ్మణి పేరుతో రూ.18.75 కోట్లకు భూమి కొనుగోలు.. అమరావతిలో గజం రూ.60 వేలన్న బాబు మాటల ప్రకారమే చూస్తే రూ.150 కోట్లు
జూబ్లీహిల్స్ ప్యాలెస్ 2014–19 మధ్య అధికారంలో ఉండగా నిర్మాణం
ఇప్పుడు అమరావతిలోనూ.. అధికారంలో ఉండగానే రాజభవన నిర్మాణం
ఈ స్థాయిలో అత్యంత ఖరీదైన నిర్మాణాలు, ఆస్తులు ఉన్నప్పటికీ గుడిసె వాసిని అనే తరహాలో చంద్రబాబు బీద అరుపులు
ప్రజలను నమ్మించేందుకు ఎప్పటికప్పుడు చంద్రబాబు కొత్త ట్రిక్కులు
మరోవైపు 2015 నుంచి లింగమనేని ఎస్టేట్ అక్రమ బంగ్లాలో చంద్రబాబు విలాస జీవితం
వైఎస్ జగన్ తాడేపల్లిలో రెండు ఎకరాల్లో పార్టీ కార్యాలయంతో పాటు ఇంటిని నిర్మించుకుంటే ‘తాడేపల్లి ప్యాలెస్’ అంటూ తీవ్ర దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: సువిశాల విస్తీర్ణంలో హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో కళ్లు జిగేల్మనేలా రూ.వందల కోట్ల విలువైన అత్యంత విలాసవంతమైన రాజభవనం..! నిజాం నవాబు తరహాలో హైదరాబాద్ నగరం నడిబొడ్డున కొండాపూర్‌లో హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఊహకు అందని రీతిలో ఐదెకరాలలో ఓ భారీ ఫాంహౌస్..! వీటికితోడు అమరావతిలో రూ.వందల కోట్లతో.. మరో ఐదు ఎకరాల్లో ఇంకో రాజభవనాన్ని నిర్మించుకుంటున్నారు సీఎం చంద్రబాబు..! అత్యాధునిక హంగులు.. కనీవిని ఎరుగని అధునాతన రీతిలో.. రాజధాని అమరావతి నడిబొడ్డున.. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం సమీపంలో చేపట్టే ఈ ప్యాలెస్ నిర్మాణ పనులను తనకు అత్యంత సన్నిహితుడికి చెందిన సంస్థకు అప్పగించారు. దీనికి ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు భూమి పూజ చేశారు.
కాగా, దీనికోసం వెలగపూడిలో సర్వే నంబర్ 111, 112, 113, 122, 150, 152, 239లలోని 5.16 ఎకరాలను (25 వేల చదరపు గజాలు) చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి పేరుతో రూ.18.75 కోట్లకు కొనుగోలు చేయడం గమనార్హం. అంటే గజం రూ.7,500 చొప్పున ఖరీదు చేశారు. కాగా, చంద్రబాబు అమరావతి ప్రాంతంలో చదరపు గజం రూ.60 వేలు పలుకుతోందని చెబుతుంటారు. ఈ ప్రకారం చూస్తే నాలుగు వైపులా రోడ్డు ఉన్న వెలగపూడిలోని స్థలం విలువ సుమారు రూ.150 కోట్ల వరకు ఉంటుంది. మరి రాజభవనం నిర్మాణానికి ఇంకెన్ని రూ.వందల కోట్లు వ్యయం చేస్తారోనని రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు.
బాబుకు ఉన్నవి అన్నీ ప్యాలెస్‌లే..
చంద్రబాబుకు ఇప్పటికే హైదరాబాద్‌లో అత్యంత సంపన్నులు ఉండే జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ సమీపంలో రూ.వందల కోట్లతో నిర్మించిన భారీ ప్యాలెస్ ఉంది. దీనిని పక్కనున్న భవనాలు, స్థలాలు కొనేసి సువిశాల విస్తీర్ణంలో నిర్మించడం గమనార్హం. 2014–19 మధ్య అధికారంలో ఉండగా దీని నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభించారు. 2019 ఎన్నికలకు ముందు గృహ ప్రవేశం చేశారు. అంతకుముందే జూబ్లీహిల్స్‌లో చంద్రబాబుకు సువిశాల విస్తీర్ణంలో ప్యాలెస్ ఉండేది. దానిని కూల్చివేసి.. అధునాతన సాంకేతికత, అత్యాధునిక హంగులతో రాజభవనం నిర్మించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి అత్యంత ఖరీదైన ఉపకరణాలను దిగుమతి చేసుకుని నిర్మాణంలో వినియోగించారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో చంద్రబాబు ఇంద్రభవనం
మదీనాగూడలో నిజాం నవాబును తలదన్నేలా..
హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతం హైటెక్ సిటీకి దగ్గరగా ఉంటుంది. చాలా ఖరీదైనదిగా పేరుగాంచింది. అక్కడికి సమీపంలోని మదీనాగూడలో చంద్రబాబుకు ఐదు ఎకరాల ఫాంహౌస్ ఉంది. దీని విలువ రూ.వందల కోట్లలోనే ఉంటుంది. నిజాం నవాబును తలపించే రీతిలో వైభోగం అన్నమాట. మరోవైపు హైదరాబాద్‌లో సంపన్న ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో రాజభవనం లాంటి నివాసం. బహుశా దేశంలో సంపన్నులు ఉండే ప్రాంతంలో రాజభవనం, ఫాంహౌస్ చంద్రబాబుకు ఒక్కరికే ఉందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.
పదేళ్లుగా అక్రమ ప్యాలెస్‌లో విలాసం
చంద్రబాబు.. పదేళ్లుగా ఉండవల్లి సమీపాన కృష్ణా నది కరకట్ట లోపల లింగమనేని రమేష్ అక్రమంగా నిర్మించిన విలాసవంతమైన బంగ్లాలో నివసిస్తున్నారు. రమేష్ అత్యాధునిక హంగులతో ఈ భారీ బంగ్లాని నిర్మించారు. కాగా, 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. ఆడియో టేపుల సాక్షిగా ఆయన బండారం బయటపడింది. అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ చర్యలు తీసుకుంటుందోనన్న భయంతో హైదరాబాద్‌ను ఉన్నపళంగా వదిలి వచ్చేశారు. లింగమనేని అక్రమ బంగ్లాను నివాసంగా ఎంచుకున్నారు. అప్పటినుంచి.. అంటే పదేళ్లుగా అందులోనే ఉంటున్నారు.
ఉండవల్లిలో కృష్ణానది కరకట్ట వెంట చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ భవనం
పార్టీ వారికీ ప్రవేశం లేదు..
చంద్రబాబు తాజాగా వెలగపూడిలో తలపెట్టిన రాజభవన నిర్మాణం భూమి పూజకు టీడీపీ నేతలను సైతం ఆహ్వానించకపోవడడం గమనార్హం. ఇక జూబ్లీహిల్స్‌లోని రాజభవనం గృహ ప్రవేశ కార్యక్రమానికి పార్టీ నేతలను ఎవరినీ ఆహ్వానించలేదని టీడీపీ సీనియర్ నేతలు చెబుతుంటారు. అందులోకి ఇప్పటికీ తమ పార్టీ నేతలకు ప్రవేశం లేదని అంటుంటారు.

కొత్త రాజభవనం.. నిర్మాణానికి ఇంకెన్ని కోట్లో..?
చంద్రబాబు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఆరేళ్ల కిందట నిర్మించుకున్న రాజ భవనానికే రూ.వందల కోట్లు వ్యయం అయినట్లు చెబుతుంటారు. ఇప్పుడు అమరావతిలో తలపెట్టిన రాజభవనం మరింకెన్ని కోట్లు ఉంటుందోనని అంటున్నారు. భూమి కొనుగోలుకే రూ.18 కోట్లకు పైగా వ్యయం చేసిన నేపథ్యాన్ని గుర్తు చేస్తున్నారు. పైగా వెలగపూడిలో ఏకంగా 5.16 ఎకరాల్లో నిర్మాణం చేపట్టనుండడాన్ని ప్రస్తావిస్తున్నారు.
అప్పుడు ఇప్పుడు అధికారంలో ఉండగానే..
చంద్రబాబు జూబ్లీహిల్స్ రాజభవనం నిర్మాణాన్ని 2019కి ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే చేపట్టి పూర్తి చేశారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉండగానే వెలగపూడిలో మరింత భారీఎత్తున రాజభవనం నిర్మాణం చేపట్టడం గమనార్హం.
అద్దాల మేడల్లో ఉంటూ అవతలి వారిపై దుష్ప్రచారం
తాను 5.16 ఎకరాల్లో రాజభవనం కట్టుకుంటూ పేదవాడిననే బిల్డప్‌లు
పార్టీ కార్యాలయం లేకుండానే భారీ విస్తీర్ణంలో నిర్మాణానికి ప్రయత్నం
వైఎస్ జగన్ 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయం, ఇల్లు నిర్మించుకుంటే నిందలు
తాడేపల్లి ప్యాలెస్ అంటూ తీవ్ర స్థాయిలో చంద్రబాబు దుష్ప్రచారం
విశాల విస్తీర్ణంలో జూబ్లీహిల్స్‌లో, మదీనాగూడలో రాజభవనాలు కలిగి.. ప్రస్తుతం అక్రమంగా కట్టిన విలాసవంతమైన భారీ బంగ్లాలో ఉంటూ.. కొత్తగా మరో భారీ రాజభవనం నిర్మాణానికి పూనుకున్న చంద్రబాబు తాను నిరుపేదను.. గుడిసె వాసిని అనే తరహాలో బీద అరుపులు అరుస్తుంటారు. అవతలివారిపై అకారణంగా నిందలు వేస్తుంటారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారు. వాటిని చూపుతూ తాడేపల్లి ప్యాలెస్ అంటూ తరచూ చంద్రబాబు, ఎల్లో మీడియా, పచ్చ దండు దుష్ప్రచారం చేస్తుంటారు. తాను ఉంటున్న ఇంద్ర భవనాలు మాత్రం పూరి గుడిసెలు అన్నట్లు ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రచారాలు తెరపైకి తెస్తుంటారు.