![KSR Comments Over Yellow Media And CM Chandrababu](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/Yellow-Media.jpg.webp?itok=ygdt1MA8)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదేమిటి ఇలా అన్నారు.. అని ఆశ్చర్యపోనవసరం లేదు. ఆయన అలా అనకపోతేనే వింత అవుతుంది. సంపద సృష్టించే మార్గం ఏదైనా ఉంటే ఒక ఐడియా ఇవ్వండి అని ప్రజలనే అడుగుతున్నారు. అది కూడా ఆయన చెవిలో చెప్పాలట. ఈ మాట వినగానే ఎల్లో మీడియా నిర్ఖాంతపోయినట్లు ఉంది. తామేదో బిల్డప్ ఇచ్చుకుంటూ వస్తుంటే చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించి కొంప ముంచారే అనుకుంటోంది. అందుకే అంత కీలకమైన వ్యాఖ్యలను ఎల్లో మీడియా దాచేసే యత్నం చేసింది.
అన్నమయ్య జిల్లా సంబేపల్లి గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఎదురైన ఒక చేదు అనుభవం రీత్యా చంద్రబాబు ఈ విషయం చెప్పేశారు. ఒక రైతు తమకు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని అడిగారు. దానికి కాస్త చికాకుపడిన చంద్రబాబు డబ్బులు వస్తే ఇస్తామని, దీనికి వర్క్ అవుట్ చేస్తున్నామని, అయినా మీకు ఇవ్వాలంటే ముందుగా డబ్బు సంపాదించాలిగా అని అన్నారు. అక్కడితో ఆగలేదు. డబ్బు సంపాదించే మార్గం ఉంటే తనకు చెవిలో చెప్పాలని చంద్రబాబు అనడంతో అక్కడ ఉన్నవారికి మతిపోయినంత పని అయింది. నిజానికి చంద్రబాబు ఇలాంటి ప్రశ్నలను ఊహించి ఉండరు. తన కుమారుడు, మంత్రి లోకేష్ ఎన్నికలకు ముందు హామీలను నెరవేర్చకపోతే చొక్కా కాలర్ పట్టుకుని నిలదీయండని అన్నారు. అయినా తాము సూపర్ సిక్స్ హామీలను, ఎన్నికల ప్రణాళికలోని మరో 175 హామీలను ఎగవేస్తే మాత్రం ఎవరు అడుగుతారులే అన్న ధీమాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు ఉంటారు.
కానీ, లోకేష్ కాలర్ డైలాగ్ బాగా వైరల్ అవుతుండటంతో ధైర్యం వచ్చిందేమో తెలియదు.. ఒక రైతు తమకు రావాల్సిన భరోసా మొత్తం రూ.20వేల గురించి ప్రశ్నించారు. దానికి ఏం చెప్పాలో అర్ధం కాని చంద్రబాబు చివరికి డబ్బులు లేవు పొమ్మంటూ, మీరే ఐడియా ఇవ్వండి అని చెప్పి చేతులెత్తేశారు. కేంద్రం గత ఏడాదికి గాను రైతు భరోసా కింద ఆరువేల రూపాయల చొప్పున మంజూరు చేసి ఉండాలి. అది పోను మిగిలిన మొత్తాన్ని ఇవ్వడానికి అయినా చంద్రబాబు ప్రభుత్వం సిద్దపడి ఉండాల్సింది. ఎన్నికల ప్రణాళిక ప్రకారం ప్రతీ రైతుకు ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ పేరుతో అందిస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అధికారం వచ్చాక అసలుకే మోసం తెచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన ఆరువేల రూపాయలను కూడా ప్రభుత్వం ఎగవేయడం విశేషం. ఈ ఏడాది నుంచి కేంద్రం పదివేల చొప్పున ఇస్తుంది. దానినైనా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? లేదా? అన్నది చూడాలి. ప్రతీ ఒక్కరూ తెలివితేటలతో ఆర్ధికంగా ఎదగాలని కూడా సలహా ఇచ్చారు.
ఇంతకాలం తన తెలివితేటలతో రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు అభివృద్ది చెందుతారని హోరెత్తించిన చంద్రబాబు ఇప్పుడు ఎవరి బతుకు వారే చూసుకోవాలని అంటున్నారు. ఆయన చెప్పేది వాస్తవమే. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని అనుకుని మోసపోకుమా అన్న శ్రీశ్రీ గేయాన్ని గుర్తు చేసుకోవాలి. ఈయనేమీ వైఎస్ జగన్ కాదు కదా!. చెప్పినవి చెప్పినట్లు చేయడానికి అని ఇప్పుడు జనం భావిస్తున్నారు. మరో ఘటన కూడా జరిగింది. కొందరు యువకులు మదనపల్లె వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయరాదని కోరుతూ నినాదాలు చేశారు. వారికి సమాధానం ఇవ్వకపోగా, ఒకరిద్దరు వచ్చి ఇలా చేస్తారని, వారు అవుట్ డేటెడ్ అని కొట్టిపడేశారు. వామపక్షాలు చంద్రబాబుతో కలిసి ఉంటే కమ్యూనిజం గొప్పదని చెబుతారు. ఆయన బీజేపీతో కలిస్తే కమ్యూనిజం కాదు.. టూరిజం ముఖ్యమని అంటారు.
వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వపరంగా చేపట్టిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం రెడీ అయినట్లే అని అర్ధం అవుతోంది. ఇప్పటికే 750 మెడికల్ సీట్లను ఈ ప్రభుత్వం వదులుకుని విద్యార్ధులకు తీవ్ర అన్యాయం చేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి రాగానే మరో మాట చెప్పడం చంద్రబాబుకు అలవాటైన విద్యే. మదనపల్లె మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయవద్దని కోరిన విద్యార్ధులను పోలీసులతో బయటకు నెట్టేయించారు. నారా లోకేష్ ఎన్నికలకు ముందు చొక్కా కాలర్ పట్టుకోమన్నారు కదా అని ఎవరైనా ప్రయత్నిస్తే, పోలీసులతో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తారని తేలిపోయింది. తల్లికి వందనంతో సహా ఆయా పథకాలను జూన్‌లో ఇస్తామని టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం తర్వాత చెప్పారు. అప్పుడు ఏం ఇస్తారో తెలియదు కానీ, ఈ సభలో మాత్రం తల్లికి వందనం పథకం కింద డబ్బులు ఒకసారి ఇవ్వాలా?రెండు దఫాలుగా ఇవ్వాలా అన్నది నిర్ణయం తీసుకుని అందిస్తామని అన్నారట. ఈ పాయింట్ ఆధారంగా ఎల్లో మీడియా మళ్లీ వెంటనే ఆ స్కీమ్ అమలు అయిపోతుంది అన్నంతగా బిల్డప్ ఇచ్చి కథనాలు వండి వార్చాయి. తాము చెప్పినదానికన్నా ఎక్కువే చేసి చూపిస్తామని చంద్రబాబు అన్నారని కూడా రాసేశారు.
హామీలు ఇచ్చినవాటికే దిక్కు లేదు కానీ.. ఎల్లో మీడియా బిల్డప్ ఏమిటా అని అంతా అనుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. తల్లికి వందనం పథకాన్ని ఒక ఏడాది ఎగవేసిన విషయాన్ని మాత్రం జనం మర్చిపోవాలన్నది చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, ఎల్లో మీడియా కోరికగా ఉంది. అధికారం రావడమే ఆలస్యం అన్నీ జరిగిపోతాయని ప్రచారం చేసిన కూటమి నేతలు ఇన్ని రకాలుగా పిల్లిమొగ్గలు వేస్తున్నారు. వలంటీర్లను కొనసాగిస్తామని గతంలో ఊదరగొట్టిన చంద్రబాబు ఇప్పుడు వాట్సాప్ పాలన లోకేష్ ఆలోచన అని కుమారుడిని ప్రమోట్ చేసేపనిలో ఉన్నారు. చంద్రబాబు తన ప్రచారం కోసం నిధులను దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రతి నెల ఇచ్చే పెన్షన్ల పంపిణీకి స్వయంగా చంద్రబాబు వెళ్లవలసిన అవసరం ఏముందని అంటున్నారు. గతంలో వైఎస్సార్‌సీపీ హయాంలో వృద్దులకు పెన్షన్‌గా మూడువేల రూపాయలు ఇచ్చేవారు. దానికి మరో వెయ్యి అదనంగా ఇస్తున్నారు. అంతవరకు ఓకే. మరోవైపు పెన్షన్లను ప్రతీ నెలా కోత పెడుతున్నారని చెబుతున్నారు. ఈ పెన్షన్‌లను గతంలో వలంటీర్లు అందచేసేవారు. ఆ వలంటీర్లకు జీతాలు పెంచుతామని చెప్పి వారి ఉద్యోగాలకే మంగళం పలికారు.
ఒక వలంటీర్ చేయగలిగిన పనిని ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రత్యేకంగా సభ పెట్టి పంపిణీ చేసి, ప్రసంగం చేసి ప్రచారం జరిగేలా చూసుకోవడం ఆశ్చర్యంగానే ఉంటుంది. కాకపోతే, ఆయన స్టైలే అది. పావలా కోడికి రూపాయి మసాలా అన్నట్లుగా ఆయన యావ ఎప్పుడూ ప్రచారంపైనే ఉంటుంది. చంద్రబాబు ఏపీలోనే కాదు.. ఢిల్లీ వెళ్లి సైతం అక్కడ జరుగుతున్న ఎన్నికలలో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తున్న సందర్భంగా కూడా పలు అసత్యాలు చెప్పి వచ్చారు. 2019లో చంద్రబాబుకు మద్దతుగా ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ విశాఖపట్నం వచ్చి ప్రచారం చేశారు. కానీ, ఇప్పుడు అదే కేజ్రీవాల్‌ను ఓడించాలని చంద్రబాబు ప్రచారానికి దిగారు. గతంలో మోదీని నానా రకాలుగా దూషించిన చంద్రబాబు ఇప్పుడు ఆయనను ఆకాశానికి ఎత్తుతూ పొగుడుతున్నారు. అలాగే 2019లో కేజ్రీవాల్ విద్యావంతుడు, నిజాయితీపరుడు, ఢిల్లీని బాగా అభివృద్ది చేశారని చంద్రబాబు ప్రశంసించారు. 2024 వచ్చేసరికి ఆయన దృష్టిలో కేజ్రీవాల్ అవినీతిపరుడయ్యారు. ఢిల్లీని నాశనం చేశారు అని చంద్రబాబు అనగలిగారంటే ఏమనుకోవాలి?. కేజ్రీవాల్‌పై వచ్చిన లిక్కర్ స్కామ్ గురించి కూడా చంద్రబాబు ప్రస్తావించారు. కానీ, అదే స్కాంలో భాగస్వామి అన్న ఆరోపణలు ఉన్న మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఎంపీ టిక్కెట్‌ను ఇదే చంద్రబాబు ఇచ్చారు.
ఏపీకి ఏడు నెలల్లో ఏడు లక్షల పెట్టుబడులు వచ్చేసినట్లు కూడా చంద్రబాబు ఆ సభలలో చెప్పుకోవడం విశేషం. దావోస్ వెళ్లి ఒక్క ఎంవోయూ కుదుర్చుకోకుండా ఖాళీ చేతులతో తిరిగి వచ్చారన్న విమర్శలను ఎదుర్కోవడానికి కొత్త గాత్రం అందుకుని ఆల్రెడీ ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయని అబద్దపు ప్రచారం ఆరంభించారు. దానిని ఢిల్లీ వరకు తీసుకువెళ్లారు. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి బడ్జెట్‌లో ప్రత్యేకంగా ఏమీ రాకపోయినా కేంద్ర బడ్జెట్‌ను మెచ్చుకోవాల్సిన నిస్సహాయ స్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఎల్లో మీడియా యథాప్రకారం విశాఖ స్టీల్, పోలవరం ప్యాకేజీలు కొత్తవి అయినట్లు, అమరావతి అప్పును కేంద్రం సాయం కింద అబద్దపు ప్రచారం చేశారు. కేంద్రం రాష్ట్రానికి దన్నుగా నిలబడిందని కూడా సర్టిఫికెట్ ఇచ్చేశారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు కూడా ఒకసారి ప్రభుత్వపరంగా ఒక ప్రకటన చేస్తూ ప్రజలు సలహాలు ఇవ్వాలని కోరారు. సరిగ్గా అదే పద్దతిలో ఇప్పుడు ఐడియాలను చెవిలో చెప్పాలని అంటున్నారు.
ఇంతకాలం చంద్రబాబు తన ఐడియాలతో స్కీములు అమలు చేస్తారనుకుంటే, జనమే ఆ ఐడియాలు ఇవ్వాలని కోరుతున్నారు. అదేదో సినిమాలో చెప్పినట్లు కొండను తాను ఒక్కడినే మోస్తానని ప్రజలందరితో నమ్మబలికి.. తీరా కొండను మోసే సమయం వచ్చేసరికి, జనం అంతా వచ్చి కొండను తన భుజాలపై పెడితే మోసి చూపిస్తానన్నారట. ఆ సినిమా సన్నివేశం హాస్యం కోసం అయితే, చంద్రబాబు ప్రకటన జనాన్ని మోసం చేయడం కోసం కాదా!.
- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment