ఇటు ఖండన.. అటు హేళన | TDP Chandrababu trolled strategically on Attack On CM Jagan | Sakshi
Sakshi News home page

ఇటు ఖండన.. అటు హేళన

Published Mon, Apr 15 2024 4:08 AM | Last Updated on Mon, Apr 15 2024 4:08 AM

TDP Chandrababu trolled strategically on Attack On CM Jagan - Sakshi

వ్యూహాత్మకంగా ట్రోల్‌ చేయించిన చంద్రబాబు.. రెచ్చిపోయిన టీడీపీ ఆస్థాన పెయిడ్‌ లీడర్స్‌

సోషల్, ఎల్లో మీడియాలో అవాకులు చవాకులు

అసెంబ్లీలో ఎవరూ ఏమీ అనకున్నా భోరున ఏడ్చిన బాబు

ఎదుటి వారిపై మాత్రం అడ్డగోలు ఆరోపణలు

టీడీపీ తీరును అసహ్యించుకుంటున్న ప్రజలు 

సాక్షి, అమరావతి: అమానుషత్వం, వక్రీకర­ణల్లో తలపండిన చంద్రబాబు పరివారం సీఎం జగన్‌పై హత్యాయత్నం ఘటనలో తన ప్రతిభనంతా రంగరించి ప్రదర్శిస్తోంది. ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే దాన్ని హేళన చేస్తూ పచ్చ మూకలు స్వైర విహారం చేయడాన్ని చూస్తుంటే ఆయనపై వారు ఎంత ఈర్ష్య, ద్వేషంతో ఉన్నారో స్పష్టమవుతోంది. ప్రధాని మోదీ నుంచి పలు రాష్ట్రాల సీఎంలు, ప్రముఖులు ఈ దాడిని ఖండిస్తుంటే టీడీపీ నేతలు మాత్రం జుగుప్సాకరంగా కామెంట్లు చేయటాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు.

తమకు రాజకీయాలు మినహా మానవత్వం అనేదే లేదని టీడీపీ నేతలు మరోసారి రుజువు చేసుకున్నారు. ఏం జరిగిందో తేల్చే పనిలో పోలీసులుంటే ఈలోపే తమకు నచ్చినట్లు ఊహించుకుని వక్రీకరించేందుకు పచ్చమూక పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు. వైఎస్‌ జగన్‌కు రాజకీయంగా ఎక్కడ లబ్ధి చేకూరుతుందోననే భయంతో ఆయనే దాడి చేయించుకున్నట్లు టీడీపీ నేతలు నీచాతినీచంగా దుష్ప్రచారం చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. 

నేను ఖండిస్తా.. మీరు హేళన చేయండి
‘ఈ ఘటనను నేను ఖండిస్తా.. మీరు, మన మీడియా, సోషల్‌ మీడియా బృందాలు మాత్రం ఈ అంశాన్ని పూర్తిగా పక్కదోవ పట్టించాలి’ అని టీడీపీ పరివారానికి చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. దాని ప్రకారం శనివారం రాత్రి 11.30 గంటల నుంచి వారంతా ఇదే పనిలో నిమగ్నమయ్యారు. నిజానికి దాడి జరిగిన రెండు గంటల వరకు టీడీపీ నేతలు, ఎల్లో మీడియా స్పందించలేదు. రాత్రి 11 గంటల తర్వాత దుష్ప్రచారాన్ని ప్రారంభించారు. అప్పటివరకు ఎల్లో మీడియా ఛానళ్లు సీఎంపై జరిగిన దాడి ఘటనను ప్రసారం చేయలేదు.

చంద్రబాబు తన ఎక్స్‌ ఖాతాలో సీఎం జగన్‌పై దాడి ఘటనను ఖండించగా అదే సమయంలో టీడీపీ ఖాతాలో మాత్రం 2019లో విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నంతో పోలుస్తూ పోస్టులు పెట్టారు. ఇక అక్కడి నుంచి వరుసగా టీడీపీ నేతలు వక్రీకరిస్తూ పత్రికా ప్రకటనలు, వాయిస్‌ వీడియోలను విడుదల చేశారు. చంద్రబాబు ఖండించిన సమయంలోనే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, లోకేష్‌ తదితరులు హేళన చేస్తూ పోస్టులు పెట్టడం చర్చనీయాంశమైంది. సీఎం జగన్‌పై దాడి తర్వాత దాన్ని ఎలా తప్పుదోవ పట్టించాలనే వ్యూహాన్ని ఖరారు చేయడానికి చంద్రబాబు రెండు గంటల పాటు తర్జనభర్జన పడినట్లు వెల్లడవుతోంది. టీడీపీ నేతలు, ఆ పార్టీ కార్యాలయ ఆస్థాన విద్వాంసులు చంద్రబాబు ఆదేశాల మేరకు తమ నైపుణ్యాన్ని రంగరించి మరీ అక్కసు వెళ్లగక్కారు. 

పచ్చ కామెర్ల రోగిలా..
సీఎంపై హత్యాయత్నం జరిగితే ఇంత దారుణంగా వక్రీకరిస్తున్న చంద్రబాబు తన విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించడాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీలో తన భార్యను అవమానించారంటూ మీడియా సమావేశం పెట్టి మరీ భోరున ఏడ్చి సానుభూతి కోసం ప్రణాళిక రచించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే నేత మీడియా ముందు ఏడవడం ద్వారా తన పరువును తానే బజారుకు ఈడ్చుకున్నారు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు అందరూ తన మాదిరిగానే డ్రామాలు ఆడతారని భావిస్తూ చంద్రబాబు కుటిల రాజనీతిని ప్రదర్శించారు.  

2019లోనూ అదే హేళన
2019లో విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్‌ జగన్‌పై దాడి జరిగిన సమయంలోనూ చంద్రబాబు, టీడీపీ ఇదే రీతిలో స్పందించాయి. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు తన హోదాను మరచిపోయి ఆ ఘటనను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేసి అభాసుపాలయ్యారు. ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా గంటల వ్యవధిలో మీడియా సమావేశం పెట్టి జగన్‌ మనుషులే ఆయనపై దాడి చేశారని హేళన చేశారు. నాటి డీజీపీ ఆర్పీ ఠాగూర్‌పై ఒత్తిడి తెచ్చి వైఎస్సార్‌సీపీ అభిమాని దాడి చేసినట్లు చెప్పించారు. ఇప్పుడు విజయవాడలో జరిగిన దాడిపైనా అదే సూత్రాన్ని అనుసరించారు. అయితే ఈసారి వ్యూహాత్మకంగా చంద్రబాబు ఖండించగా టీడీపీ, తోక పార్టీ జనసేన నేతలంతా దుష్ప్రచారానికి దిగారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement