గత్యంతరం లేకనే ‘కొత్త’ నినాదం
తమకు బలం ఉందని చెప్పుకునే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ సత్తా ఏమిటో తేలిపోయింది. అభ్యర్థులు లేకపోవడం, ఉన్న వారి మధ్య గొడవలతో పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ రెండు జిల్లాల్లోనే ఇలా ఉంటే ఇక మిగిలిన జిల్లాల్లో పరిస్థితి ఏమిటో ఊహించవచ్చు. 50కిపైగా నియోజకవర్గాల్లో టీడీపీకి అభ్యర్థులే లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులతో నెట్టుకొస్తున్నారు. ఇక గత్యంతరం లేక కొత్త వారికి అవకాశం ఇస్తామనే నినాదాన్ని ఎత్తుకున్నారు. అయినా మునిగిపోయే నావ లాంటి టీడీపీలో చేరేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. ఈ నేపథ్యంలో 175 స్థానాలకు టీడీపీ తన అభ్యర్థులను నిలబెట్టే పరిస్థితులు లేవని స్పష్టమవుతోంది.
సాక్షి, అమరావతి: ఎల్లో మీడియాలో బిల్డప్‌లు.. సోషల్ మీడియాలో హంగామా! పెదబాబు, చినబాబు మేకపోతు గాంభీర్యాలు.. !! యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ సినిమా డైలాగ్‌లను వల్లె వేస్తున్నా టీడీపీలో చాలా నియోజకవర్గాలకు అభ్యర్థులే లేకపోవడమే అసలు విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. ఉన్న నేతలు కూడా చంద్రబాబును లెక్క చేయడం లేదు. లోకేశ్‌నైతే అసలు పట్టించుకోవడమే లేదు.
ఆ పార్టీ తరఫున గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఇద్దరు యువగళం యాత్రను బహిష్కరించడమే ఇందుకు ఉదాహరణ. లోకేశ్ తమ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసినా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, విజయవాడ ఎంపీ కేశినేని నాని అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో ఎవరెవరినో బతిమాలుకుని అక్కడ పాదయాత్రను మమ అనిపించారు.
బెజవాడ టీడీపీలో గందరగోళం
టీడీపీ తనకు పట్టుందని చెప్పుకునే విజయవాడ నగరంలో లోకేష్ రెండు రోజులు పాదయాత్ర చేశారు. దీన్ని విజయవాడ ఎంపీ కేశినేని నాని బహిష్కరించారు. చాలారోజుల నుంచి ఆయన ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీ ఆఫీసులో కూర్చుని రాజకీయాలు చేసేవారికి చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారని, క్షేత్ర స్థాయిలో పనిచేసే వారిని పట్టించుకోవడం లేదని ఆయన మొదటి నుంచి బహిరంగంగానే విమర్శిస్తున్నారు. నగర నేతలు బుద్ధా వెంకన్న, బొండా ఉమా, నాగుల్ మీరాతో పడకపోవడంతో కేశినేని నానిని పక్కనపెట్టారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో చంద్రబాబు ఆయన సోదరుడు కేశినేని చిన్నికి యాత్ర బాధ్యతలు అప్పగించారు.
అభ్యర్థులు లేక హైవే రూటు!
ఉమ్మడి కృష్ణా జిల్లాలో జాతీయ రహదారి గుండా లోకేష్ యాత్ర నిర్వహించి పూర్తయిందనిపించారు. ఎన్టీఆర్ జిల్లాను (పశ్చిమ కృష్ణా) పూర్తిగా వదిలేశారు. మైలవరం, తిరువూరు, నందిగామ నియోజకవర్గాలపై స్పష్టత లేకపోవడంతో యాత్ర అటు వెళ్లలేదు. పెనమలూరు, గన్నవరం నియోజక వర్గాలను మాత్రమే కవర్ చేస్తున్నారు.
గన్నవరాన్ని తప్పించేందుకు వీలు కాకపోవడంతో వైఎస్సార్‌సీపీ ఎప్పుడో పక్కనపెట్టిన యార్లగడ్డ వెంకట్రావును అప్పటికప్పుడు చేర్చుకున్నారు. ఆయన్ను పార్టీలో చేర్చుకుని అక్కడ యాత్ర కొనసాగేలా ఏర్పాట్లు చేసుకునే దుస్థితి టీడీపీలో నెలకొంది. ఆ పక్కనే ఉన్న గుడివాడ వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా లోకేష్, చంద్రబాబు చేయడం లేదు. అక్కడ టీడీపీకి అభ్యర్థే లేరు. ఇద్దరు నేతలున్నా వారితో పని కాదని చంద్రబాబుకు బోధపడటంతో అలాగే వదిలేశారు.
గుంటూరులో దయనీయమే..
లోకేష్ పాదయాత్ర చేసినా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అటువైపు వెళ్లలేదు. సొంత పార్టీ ఎంపీ లేకుండానే నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్రను ముగించాల్సి వచ్చింది. గుంటూరు నగరంలో పాదయాత్ర ఎంటర్ కాలేదు. గుంటూరు ఈస్ట్, వెస్ట్ నియోజక వర్గాలకు సరైన అభ్యర్థులు లేకపోవడంతో వాటిని వదిలేశారు.
రాజధాని ప్రాంతమైన తాడికొండ నియోజకవర్గంలో పాదయాత్ర చేసినా అది అమరావతి కోసం చేశారు. అక్కడి పార్టీ ఇన్‌ఛార్జి శ్రావణ్‌కుమార్‌ని అవమానించి వైఎస్సార్‌సీపీ బహిష్కృత ఎమ్మెల్యే శ్రీదేవికి లోకేష్ ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో క్యాడర్‌లో గందరగోళం చెలరేగి యాత్రను పట్టించుకోలేదు. ప్రత్తిపాడు, తెనాలి నియోజకవర్గాల్లోనూ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
Comments
Please login to add a commentAdd a comment