గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సీపీఎంకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి తరచు ఒక సామెత చెబుతుండేవారు. అదేమిటంటే.. పొగడరా!పొగడరా! అంటే టంగుటూరు మిరియాలు తాటికాయంత అని పొగిడాడని. దాని అర్థం ఏమిటి? మిరియపు గింజను కూడా తాటికాయంత ఉందని చెప్పడం. దానిని ఎవరైనా నమ్మగలరా? అలాగే ప్రస్తుతం తెలుగుదేశం మాజీ ఎమ్మెల్సీ నారా లోకేష్ చెబుతున్న కబుర్లు కూడా ఉన్నాయి.
ఆయన ఒక టీడీపీ పత్రికలో పాదయాత్ర డైరీ రాస్తున్నారు. డైరీ రాయడం తప్పుకాదు. పైగా ఆయనేమీ రాయరు. ఎవరో ఆయన తరపున రాసిస్తే ఆ పత్రిక అచ్చేస్తుంది. ఏభై ఏడో రోజు డైరీలో ఏమని ఉందో చూడండి. 'ఈ రోజు రెడ్డిచెరువు కట్ట విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభించాను. యువగళానికి సంఘీభావంగా దారిపొడవునా వెల్లువలా తరలివచ్చిన జనం 1983నాటి అన్న ఎన్టీఆర్ ప్రభంజనాన్ని గుర్తుకు తెచ్చారు." అని రాశారు. ఇది చదవడానికి ఎంత ఎబ్బెట్టుగా ఉంది!. లోకేష్ తరపున రచయితలు ఎవరో కాని, మరీ అతిగా పొగుడుతున్నట్లుగా ఉంది తప్ప మరొకటి కాదు.
తన పాదయాత్ర గురించి తానే ఇంతగా పొగుడుకుంటారా?. గతంలో ఒక మిత్రుడు అంటుండేవారు. ఎవరూ పొగడకపోతే తనను తానైనా పొగుడుకోవాలని.. అలా ఉంది ఈ కథ.. లోకేష్ అప్పటికి ఇంకా పుట్టలేదనుకుంటా! ఎన్టీఆర్ ప్రజలలో తిరిగే సన్నివేశాల గురించి తెలిసినవారిని అడిగి ఉంటే ఇలా రాసుకునేవారు కాదు. ఎన్టీఆర్ ఎప్పుడూ పాదయాత్ర చేయలేదు. ఆయన చైతన్యరథం పేరుతో ఒక ప్రత్యేక వాహనంలో పర్యటించేవారు. ఆయనను చూడడానికి పల్లె, పట్టణం, పేద, ధనిక వ్యత్యాసం లేకుండా తండోపతండాలుగా వచ్చేవారు. అన్ని కులాలు, మతాలవారు ఇందులో ఉండేవారు. అది నిజంగానే ప్రభంజనంలా సాగేది.
గంటల తరబడి ఎన్టీఆర్ రాక కోసం ఎదురు చూసేవారు. జనాన్ని తరలించడం కోసం ఎన్టీఆర్ కాని, ఆయన తరపున కాని ఎవరూ రూపాయి ఖర్చు పెట్టే పని ఉండేది కాదు. దానితో లోకేష్ తన పాదయాత్రను పోల్చుకోవడం అంటే ఎన్టీఆర్‌కు ఇంతకన్నా అవమానం మరొకటి ఉండదేమో! లోకేష్ కుప్పం నుంచి యాత్ర ప్రారంభించినప్పుడు కొన్ని చోట్ల జనం లేక ఇబ్బంది పడ్డారు. జనాన్ని ఎక్కడికక్కడ తరలించాలని, పూలు చల్లే ఏర్పాట్లు హారతులు ఇవ్వడం వంటివి చేయాలని పార్టీ స్థానిక నేతలకు ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పిన ఆడియో లీక్ ఒకటి అందరికి గుర్తు ఉండే ఉంటుంది.
ఎన్టీఆర్‌కు అప్పట్లో అలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. అది వాస్తవమో కాదో, తెలియదు కాని, అందులో ఉన్న విషయం ఆసక్తికరంగా ఉంది. పచ్చచొక్కా వేసుకుని ఉన్న ఒక కార్యకర్త లోకేష్ పాదయాత్ర ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ సమయంలో ఒక వ్యక్తి ఎవరో ఆయనతో సంభాషించి దానిని రికార్డుచేశారు. ఆ కార్యకర్త ఏమి చెప్పారంటే తాము నెలకు రూ.25 వేల రూపాయల జీతానికి ఈ పాదయాత్రకు వచ్చామని, తనలా సుమారు మూడువేల మంది వచ్చారని వెల్లడించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఎప్పుడూ ఇలాంటి వాటిని ప్రోత్సహించలేదు.
టీడీపీ లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు అధీనంలోకి వచ్చాక ఇలా డబ్బులు ఇచ్చి జనాన్ని పోగుచేసే సంస్కృతి మొదలైందని చెప్పాలి. గతంలో ఎప్పుడైనా జరిగినా అది చాలా తక్కువే. కాని చంద్రబాబు మాత్రం దానిని ఒక వ్యూహంగా అమలు చేస్తుండేవారు. తద్వారా తన సభలకు జనం బాగానే వస్తున్నారన్న భావన కల్పించాలన్నది ఆయన ఉద్దేశం. అందులో కొంతవరకు ఆయన సఫలం అయ్యేవారు. సరిగ్గా లోకేష్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారేమో తెలియదు. అయితే గతానికి, ఇప్పటికీ ఒక తేడా ఉంది.
అప్పట్లో సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఇంత విస్తారంగా లేవు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు చంద్రబాబుకు అండగా ఉండేవి. ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నాయి. దానివల్ల అసలు లోగుట్టు తెలిసేది కాదు. కాని ఇప్పుడు మీడియా స్వరూపం మారిపోవడం వల్ల క్షణాలలో వాస్తవాలు బయటకు వచ్చేస్తున్నాయి. కొన్నిసార్లు అసత్యాలు కూడా ప్రచారం జరుగుతుండవచ్చు. కాని లోకేష్ పాదయాత్రకు సంబంధించి మాత్రం ఎక్కువ భాగం వాస్తవాలే వచ్చినట్లు అనిపిస్తుంది. ఆయన సరిగా తెలుగు మాట్లాడలేకపోవడం, కొన్ని చోట్ల జనాలు తక్కువగా ఉండడం వంటివి వీడియో సహితంగా వెలుగు చూడడమే ఆధారంగా కనిపిస్తాయి.
చదవండి: Fact Check: ఊహించినదే వార్తలుగా.. ‘ఈనాడు’ రామోజీ ఇక మారవా?
ఇక లోకేష్ మాటలు కూడా కోటలు దాటుతున్నాయి. మా జోలికి వస్తే ఫ్యాక్షనిస్టులవుతాం అని ఆయన అన్నారట. పసుపు జెండా ధాటికి జగన్‌కు జ్వరం వచ్చిందట. తాడేపల్లి పాలస్ పునాదులు బద్దలయ్యాయట. ఇక వైసీపీ దుకాణం బంద్ అట.. ఇలాంటి డైలాగులను ఎవరో రాసిస్తే చదవడం వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది! తనతో పాటు వచ్చే అసలు కార్యకర్తలు కొంతమందికి కొద్దిగా ఉత్సాహం రావచ్చేమో కాని, వినేవారికి మాత్రం ఇవి పిట్టలదొర మాటలు అనిపిస్తాయి.
జగన్ ప్రభుత్వం విధానాల మీద మాట్లాడడానికి సరుకు లేక ఇలాంటి పిచ్చి మాటలు ఆయన నోట వెంట వస్తున్నాయేమోననిపిస్తుంది. పాదయాత్రలో ప్రజలను కలిసేటప్పుడు వారికి ఏదో ఉపయుక్తమో దాని గురించి ఎక్కువ మాట్లాడాలి తప్ప, ఇలాంటి ఊకదంపుడు ప్రసంగాల వల్ల ఒరిగేది ఏముంటుంది? అయినా ఆయన పార్టీ, ఆయన పాదయాత్ర.. ఆయన ఇష్టం.
-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment