
అన్న ఎమ్మెల్యే పక్కనే ఉంటాడు.. తెలుసుగా ?
ఓ గ్రామ అంగన్‌వాడీ కార్యకర్తకు ఫోన్‌లో అధికార పార్టీ నేత అనుచరుడి వేధింపులు
సత్తెనపల్లి: ఏం మేడం ఏం చేస్తున్నారు .. అన్న వస్తున్నాడు .. కోడి గుడ్డు కూర వండు అంటూ ఓ గ్రామ అంగన్‌వాడీ కార్యకర్తకు టీడీపీ నాయకుడి అనుచరుడు ఫోన్ చేసి వేధింపులకు గురి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణానికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్తకు అదే గ్రామానికి చెందిన మాజీ ప్రజా ప్రతినిధి పక్కన ఉండే అనుచరుడు మూడు రోజుల కిందట ఫోన్ చేసి వేధింపులకు గురి చేశాడు.
ఈ రోజు అన్న మీ ఇంట్లోనే ఉంటాడని జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడని, అన్న ఎమ్మెల్యే పక్కనే ఉంటాడు తెలుసుగా ? అంటూ ఘీంకరించాడు. దీంతో ఏం చేయాలో పాలు పోక అంగన్‌వాడీ కార్యకర్త ఫోన్‌లో మాట్లాడిన మాటలు అన్నీ ఆమె రికార్డింగ్ చేసింది. వాటిని గ్రామానికి చెందిన మరో అధికార పార్టీ నాయకుడు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆయన ఆమెను వెంటబెట్టుకొని ఎమ్మెల్యే వద్దకు తీసుకువచ్చాడు.
ఆ వీడియో వినిపించగా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసి, తక్షణమే కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయం ఎమ్మెల్యే వద్దకు వచ్చిన సంగతి తెలియడంతో గ్రామంలో ఫోన్ చేసిన వ్యక్తికి పార్టీ నేతలే స్వల్పంగా దేహశుద్ధి చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగవని ప్రాథేయపడటంతో కేసు నమోదు చేయకుండా రాజీమార్గం చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం ఉగాది పర్వదినాన ఆదివారం బయటకు రావడంతో పట్టణం, మండలంలో చర్చనీయాంశంగా మారింది.