సాక్షి, విజయవాడ: అంగన్వాడీల రాష్ట్రస్థాయి సదస్సుకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి డుమ్మా కొట్టారు. మంత్రి, కూటమి ప్రభుత్వ తీరుపై అంగన్వాడీ సదస్సు అసహనం వ్యక్తం చేసింది. ‘‘అంగన్వాడీలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోంది. మా సదస్సుకు మంత్రి గుమ్మడి సంధ్యారాణిని, అధికారులను ఆహ్వానించాం. సదస్సుకు కనీసం అధికారులు కూడా రాలేదు’’ అని అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షురాలు బేబిరాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘వస్తున్నామని చెప్పి మొహం చాటేశారు.. ఫోన్లు కూడా ఎత్తడం లేదు. ఎవరొచ్చినా రాకపోయినా మా ఉద్యమాలు ఆగవు. డిసెంబర్ 12వ తేదీన అంగన్వాడీల సమ్మె. అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని బేబి రాణి డిమాండ్ చేశారు.
మంత్రి రాకపోతే మాకేమీ నష్టంలేదు.. ఆవిడకే నష్టం
గతంలో అంగన్వాడీలను చంద్రబాబు గుర్రాలతో తొక్కించారని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు గుర్తు చేశారు. ‘‘2014-19 మధ్య కూడా చంద్రబాబు అంగన్వాడీలను పట్టించుకోలేదు. ఈ రోజు మంత్రి గుమ్మడి సంధ్యారాణి వస్తానన్నారు. ఆమె రాకపోతే మనకేమీ నష్టంలేదు.. ఆవిడకే నష్టం. ప్రభుత్వాలు ఏవైనా ఉద్యమాల ద్వారానే అంగన్వాడీల సమస్యలు పరిష్కారమవుతాయి. అంగన్వాడీలకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలి. శాసనమండలి సమావేశాల్లో అంగన్వాడీల సమస్యలపై ప్రస్తావిస్తాం. అంగన్వాడీల సమస్యలపై వాయిదా తీర్మానం ఇచ్చా. 42 రోజుల సమ్మె మినిట్స్ అమలు చేయాలని నిలదీస్తాం’’ అని లక్ష్మణరావు తేల్చి చెప్పారు.
మంచి చేస్తామని చెప్పి..
అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం మౌనంగా ఉండాలనుకుంటున్నట్లు అనిపిస్తోందని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి మండిపడ్డారు. ‘‘ఈ రోజు మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ సదస్సుకు రాకపోవడం అలానే అనిపిస్తోంది. అంగన్వాడీల టెంట్ల వద్దకు వచ్చి మద్దతిచ్చిన టీడీపీ.. ఒక్క హామీ ఇవ్వలేదు. మన టెంట్ల వద్దకు వచ్చి మంచి చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. మనల్ని ఎలా బంధించాలా అని ప్రభుత్వం చూస్తోంది. మీ మౌనానికి.. మీ సంఖ్యా బలానికి అంగన్వాడీలు తలొగ్గరు’’ అని రమాదేవి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: వలంటీర్ల కొనసాగింపుపై పిల్లిమొగ్గలు
ఆ హామీలేమైపోయాయి..
అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. ‘‘నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలి. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటన చేయాలి. ప్రభుత్వం ప్రకటన చేయకపోతే నవంబర్ 16న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేస్తాం. జూలైలో అంగన్వాడీలను చర్చకు పిలవాలని మినిట్స్ లో రాసుంది. ఈ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలయ్యింది...ఇంతవరకూ ఎలాంటి చర్చలకు పిలవలేదు. అంగన్వాడీల సమ్మె టెంటుల వద్దకు వచ్చి ఇచ్చిన హామీలేమైపోయాయి’’ అంటూ ఆమె ప్రశ్నించారు.
‘‘టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన అంగన్వాడీలకు గ్యాడ్యువిటీ హామీని నెరవేర్చాలి. అంగన్వాడీల సమస్యలను. పరిష్కరించకపోతే డిసెంబర్ 12న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతాం. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి.. మేం ఏ పెన్షనూ అడగం. మా ప్రభుత్వం ఇప్పుడే వచ్చిందంటున్నారు. చనిపోయిన అంగన్వాడీలకు మట్టి ఖర్చులకు జీవో ఇవ్వడానికి ఎంత టైమ్ పడుతుంది. అంగన్వాడీలకు కూడా దీపం పథకం అమలు చేయాలి. అంగన్వాడీలకు పెన్షన్ పంపిణీ డ్యూటీలు రద్దు చేయాలి‘‘ అని సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment