విజయవాడ వరదల్లో వలంటీర్ల సేవల్ని వినియోగించుకున్న కూటమి సర్కారు
వరద నష్టాల నమోదులోనూ వలంటీర్ల సేవల వినియోగం
అప్పట్లో లిఖిత పూర్వక ఆదేశాలిచి్చన రెవెన్యూ స్పెషల్ సీఎస్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్
వలంటీర్ల వ్యవస్థను కొనసాగించనివ్వకుండా గత ప్రభుత్వం మోసం చేసినట్టు తాజాగా పవన్‌కళ్యాణ్ ప్రకటన
ఎన్నికల హామీ అమలు చేయాలంటూ 5 నెలలుగా వలంటీర్ల ఆందోళనలు
పట్టించుకోని కూటమి సర్కారు
ఇలా మోసం..
‘వలంటీర్లను కొనసాగించడానికైనా.. రద్దు చేయడానికైనా అసలు వాళ్లు జీవోలోనే ఎక్కడా లేరు. గత వైఎస్సార్‌సీïపీ ప్రభుత్వమే వలంటీర్లను చాలా అన్యాయంగా మోసం చేసింది’ బుధవారం ఉపముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన పంచాయతీరాజ్ చాంబర్ ప్రతినిధుల సమావేశంలో పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలివి.
ఇదీ వాస్తవం..
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన రెండు నెలల్లోపే 2019 జూన్ 22, 23 తేదీల్లో జీవో–104, జీవో–201 ద్వారా అధికారికంగా ఏర్పడిన గ్రామ/వార్డు వలంటీర్ల వ్యవస్థ కూటమి ప్రభుత్వంలోనూ నేటికీ కొనసాగుతూనే ఉంది. దీనికి విజయవాడ వరద బాధితులకు సాయమందించేందుకు కూటమి ప్రభుత్వం అధికారికంగా వినియోగించుకుంది. వరద బాధితుల గుర్తింపు (ఎన్యుమరేషన్ ప్రక్రియ)లో వలంటీర్లను వినియోగించుకునేందుకు 2024 సెప్టెంబర్ 7న రెవెన్యూ శాఖ (డిజిస్టార్ మేనేజ్‌మెంట్) స్పెషల్ సీఎస్ జారీ చేసిన మెమో నంబర్–2544493తో పాటు 2024 సెపె్టంబర్ 9న ఎన్జీఆర్ జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులు సైతం సాక్ష్యాలు
సాక్షి, అమరావతి: అసెంబ్లీ ఎన్నికలకు ముందు వలంటీర్లకు ఇచి్చన హామీని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఆ నెపాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వంపై నెట్టేసి తప్పించుకునేందుకు కొత్త డ్రామాలు మొదలు పెట్టింది. ఏపీలో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ఈ ఏడాది జూన్ 12న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ.. వలంటీర్లు అనేవారే ప్రభుత్వం అధికారికంగా జారీ చేసిన జీవోల్లో ఎక్కడా లేరన్నట్టు.. గత ప్రభుత్వ హయాంలోనే వారు ఉద్యోగాల్లో లేరన్నట్టు ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ మాట్లాడిన మాటలను వలంటీర్ల సంఘాలు, అధికార, రాజకీయ వర్గాలు తప్పుపడుతున్నాయి.
అవసరమొచి్చనప్పుడు అలా..
విజయవాడ వరదల్లో సహాయక చర్యల సందర్భంగా కూటమి ప్రభుత్వానికి వలంటీర్ల సేవలు గుర్తొచ్చాయి. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో పాటు వలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లకు జీతాలు చెల్లింపులు నిలిచిపోయాయి. వలంటీర్లను పింఛన్ల పంపిణీ సహా అన్నిరకాల ప్రభుత్వ విధుల నుంచి దూరంగా పెట్టంది. జూలై, ఆగస్ట్, సెపె్టంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో 1వ తేదీన వలంటీర్లకు చెల్లించాల్సిన గౌరవ వేతనాలనూ చెల్లించలేదు.
విజయవాడ వరద సమయంలో వరద సహాయక కార్యక్రమాలతోపాటు వరద నష్టాల అంచనాల తయారీలో వలంటీర్ల సేవలను ప్రభుత్వం వినియోగించుకుంది. సీఎం ఆదేశాల మేరకు విజయవాడ ప్రాంత వలంటీర్లు వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా నగర పరిధిలోని వార్డు సచివాలయాల అడ్మిన్ సెక్రటరీల వద్ద రిపోర్టు చేయాలని 2024 సెపె్టంబర్ 2న గ్రామ వార్డు సచివాలయాల అధికారులు టెలీకాన్ఫరెన్స్ ద్వారా మౌఖిక ఆదేశాలు జారీ చేయగా.. వరద అంచనాల తయారీకి సచివాలయాల వారీగా ఏర్పాటు చేసిన అధికారుల బృందాల్లో వలంటీర్లను సభ్యులుగా చేరుస్తూ 2024 సెపె్టంబర్ 7న రెవెన్యూ స్పెషల్ సీఎస్ జారీ చేసిన మెమోతో పాటు 2024 సెపె్టంబర్ 9న ఎన్జీఆర్ జిల్లా కలెక్టర్ లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేశారు.
నిమ్మకు నీరెత్తినట్టి వ్యవహరిస్తున్న ప్రభుత్వం
ఐదేళ్ల పాటు ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఎలాంటి వివక్ష, రాజకీయ పక్షపాతం, పైరవీలు, అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల గడప వద్దకు చేర్చడంలో వలంటీర్లు కీలక పాత్ర పోషించారు. తమకు వేతనాలు చెల్లించాలని కోరుతూ 20 వారాలుగా వలంటీర్లు రోడ్డెక్కి నిరసనలు కొనసాగిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కొనసాగిస్తున్నా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు, నిరసన ర్యాలీలు, రిలే నిరాహారదీక్షలు చేపట్టి వినతిపత్రాలు అందజేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఎన్నికల ముందు చంద్రబాబు హామీ మేరకు వలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు, పెండింగ్ బకాయిల చెల్లింపులపై నెలల తరబడి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తూ.. ఇప్పుడు తమ వైఫల్యాలను గత ప్రభుత్వంపై నెట్టేసే చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది.
Comments
Please login to add a commentAdd a comment