
టీడీపీ, జనసేన నేతల బెదిరింపులు భరించలేక..
11 ఏళ్లుగా పని చేస్తున్న ఆమెను తొలగిస్తామని వేధింపులు
తమవారిని అంగన్‌వాడీ టీచర్‌గా నియమించుకుంటామని ప్రచారం
తీవ్ర ఆందోళనతో ఆత్మహత్య... పల్నాడు జిల్లాలో ఘటన
నకరికల్లు: టీడీపీ, జనసేన నాయకుల బెదిరింపులు భరించలేక ఒక అంగన్‌వాడీ టీచర్ ఆత్మహత్య చేసుకున్నారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం పాపిశెట్టిపాలేనికి చెందిన షేక్ ఫాతిమాబేగం (35) అదే గ్రామంలో 11 ఏళ్లుగా అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమెను అంగన్‌వాడీ టీచర్ పోస్టు నుంచి తొలగించి, తమవారిని నియమించుకుంటామని గ్రామానికి చెందిన టీడీపీ, జనసేన నాయకులు బెదిరిస్తున్నారని ఫాతిమాబేగం కుటుంబ సభ్యులు తెలిపారు.
దాదాపు 9 నెలలుగా ఆమెను బెదిరిస్తూనే ఉండటంతో తీవ్ర ఒత్తిడికి గురవుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఫాతిమాబేగాన్ని అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగం నుంచి తొలగిస్తారని టీడీపీ, జనసేన నాయకులు ప్రచారం చేస్తుండటంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె ఆదివారం తమ ఇంట్లోనే గడ్డిమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. వెంటనే బంధువులు నరసరావుపేటలోని ఒక ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్లారు.
ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. ఫాతిమాబేగం భర్త సైదావలి గుంటూరులో మెకానిక్‌గా పని చేస్తున్నారు. వారికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. తన భార్య మృతిపై సైదావలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment