Health centers
-
హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో ఏపీకి రెండోస్థానం
సాక్షి, అమరావతి: గ్రామీణ, పట్టణ ప్రజానీకానికి వైద్యసేవలను మరింత చేరువ చేయడం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి జాతీయ స్థాయిలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తోంది. తాజాగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలోనూ దేశంలో ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని కేంద్రాల్లోనూ ప్రజలకు వైద్యసేవలు అందిస్తుండటం విశేషం. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ఏడాది జూలై నాటికి 1,60,480 హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు పనిచేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 21,891, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 11,855 కేంద్రాలు పని చేస్తున్నాయని వివరించింది. ఏపీ తర్వాత వరుసగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశి్చమ బెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో అత్యధిక హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు ఉన్నట్లు పేర్కొంది. గ్రామీణ, పట్టణ ప్రజానీకానికి మరింత దగ్గరగా వైద్య సేవలందించడమే లక్ష్యంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను మంజూరు చేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సెంటర్లలో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలందించడంతోపాటు నాన్ కమ్యూనికబుల్ వ్యాధుల స్క్రీనింగ్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. అదేవిధంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేసి మందులు కూడా అందిస్తున్నట్లు వెల్లడించింది. ఏపీలో ఇలా... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను అనుసంధానం చేసింది. వీటికి విలేజ్ హెల్త్ క్లినిక్స్, అర్బన్ హెల్త్ క్లినిక్స్గా పేరు పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో 2,500 జనాభాకు ఒకటి చొప్పున విలేజ్ హెల్త్ క్లినిక్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేస్తోంది. విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌తోపాటు ఏఎన్ఎం, ఆశ వర్కర్లను అందుబాటులో ఉంచింది. ఈ క్లినిక్స్‌లో 14 రకాల పరీక్షలు చేయడంతోపాటు 105 రకాల మందులు అందించేలా ఏర్పాట్లు చేసింది. -
ప్రభుత్వ వైద్యం.. పల్లెల దైన్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతా ల్లో ప్రభుత్వ వైద్యం అంతంతే అందుతోంది. జనాభా పెరుగుతున్నా ఆ మేరకు వైద్య సేవలు విస్తృతం కావట్లేదు. పల్లెల్లో అనుకున్నంత సంఖ్యలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ) అందుబాటులో లేవు. ఈ వివరాలన్నింటినీ కేంద్ర ఆరో గ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసిన దేశంలో ‘గ్రామీణ వైద్య గణాంకాలు 2020– 21’లో వెల్లడించింది. ఇందులో రాష్ట్రాల వారీగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సేవల తీరును ప్రస్తావించింది. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు పెరగాలి గ్రామీణ జనాభాకు అనుగుణంగా రాష్ట్రంలో 721 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అవసరం ఉండగా ప్రస్తుతం 636 మాత్రమే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. సామాజిక ఆరోగ్య కేంద్రాలు 180 అవసరం ఉండగా 85 మాత్రమే కొనసాగుతున్నాయంది. పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మంజూరు చేసిన పోస్టుల కంటే పనిచేస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉందని చెప్పింది. సిబ్బంది సంఖ్య కూడా మరింత పెరగాలని, గ్రామీణ వైద్య సేవలు మెరుగు పడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో 33 జిల్లాలున్నాయి. వీటి పరిధిలో 5 వేల ఆరోగ్య ఉప కేంద్రాలున్నాయి. ఇవి 863 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో కొనసాగుతున్నాయి. వీటితో పాటు 95 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 37 సబ్ డివిజినల్ ఆస్పత్రులు, 5 జిల్లా ఆస్పత్రులున్నాయి. గ్రామీణ ఆస్పత్రుల పరిస్థితి ఇలా.. ♦రాష్ట్రంలోని 5 జిల్లా ఆస్పత్రుల్లో 319 వైద్యుల పోస్టులు ప్రభుత్వం మంజూరు చేయగా 266 మంది డాక్టర్లే పని చేస్తున్నారు. సబ్ డివిజినల్ ఆస్పత్రుల్లో 1,421 వైద్యుల పోస్టులకు 681 మందే విధుల్లో ఉన్నారు. 85 గ్రామీణ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో జనరల్ సర్జన్లు, గైనకాలజిస్టులు, జనరల్ ఫిజీషియన్లు, పీడియాట్రీషియన్లు కలుపుకొని మొత్తం 625 స్పెషలిస్టు పోస్టులు మంజూరవగా 367 ఖాళీగా ఉన్నాయి. వీటిలో 53 మంది జనరల్ సర్జన్లు, 141 మంది గైనకాలజిస్టులు, 49 మంది జనరల్ ఫిజీషియన్లు, 124 మంది పిల్లల వైద్యుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయలేదు. సీహెచ్‌సీల్లో 219 అనస్థటిస్ట్ పోస్టులకు 126.. అలాగే 44 కంటి వైద్యుల పోస్టులకు 19 భర్తీ కాలేదు. ♦సీహెచ్‌సీల్లో జనరల్ డ్యూటీ వైద్యులకు సంబంధించి ఆయుష్ కేటగిరీలో 29 ఖాళీలు, అల్లోపతిలో 122 ఖాళీలు భర్తీ కావాల్సి ఉంది. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కనీసం ఒక్కొక్కరు చొప్పున స్పెషలిస్టు ఆయుష్ వైద్యులను నియమించాల్సి ఉండగా ఒక్క పోస్టు కూడా మంజూరు చేయలేదు. ♦ఆరోగ్య ఉప కేంద్రాలకు 8,996 ఏఎ¯న్ఎం పోస్టులు మంజూరు చేస్తే 1,053 ఖాళీగా ఉన్నాయి. పురుషుల కేటగిరీలో 1,911 ఆరోగ్య కార్యకర్తల పోస్టులను 689 నింపాల్సిఉంది. ♦పీహెచ్‌సీల్లో 1,254 మంది అల్లోపతి వైద్య పోస్టులకు 41 ఖాళీగా ఉన్నాయి. ఆయుష్ వైద్యుల పోస్టులు 394 మంజూరవగా 151 భర్తీ కాలేదు. ♦పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలకు 2,412 నర్సుల పో స్టులు మంజూరవగా 336 ఖాళీగా ఉన్నాయి. జిల్లా ఆస్పత్రుల్లో పారామెడికల్ పోస్టులు 869 మంజూరవగా 708 మాత్రమే భర్తీ చేశారు. ప్రాంతీయ ఆస్పత్రుల్లో 1,217 పోస్టులకు 979 మాత్రమే భర్తీ అయ్యాయి. -
చిన్నారుల్లో ‘డెంగీ’ కలవరం!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నుంచి గ్రేటర్ వాసులు ఇంకా పూర్తిగా కోలుకోకముందే తాజాగా డెంగీ, మలేరి యా, టైఫాయిడ్, చికెన్‌గున్యా జ్వరాలు వెంటాడుతున్నాయి. ఇటీవల ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు...వాతావరణంలో చోటు చేసుకుంటున్న అనూహ్య మార్పుల వల్ల అనేక మంది విషజ్వరాల బారినపడు తున్నారు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రస్తుతం ఏ ఇంట్లోకి చూసినా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతున్నట్లు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఈ జ్వరపీడితుల్లో చిన్నారులు ఎక్కువగా ఉండటం విశేషం. ప్రతి ఐదుగురు జ్వరపీడితుల్లో ఒకరికి డెంగీ పాజిటివ్ రిపోర్ట్ అవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. బస్తీ, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సరైన వైద్యసేవలు అందక పోవడంతో శివారు ప్రాంతాల్లోని బాధితులంతా మెరుగైన వైద్యం కోసం నగరంలోని బోధనాసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఫలితంగా ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ సహా నల్లకుం ట ఫీవర్ ఆస్పత్రి, కోఠి ఈఎన్టీ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేకపోవడంతో ఉస్మానియా, నిలోఫర్ ఆస్పత్రుల్లో రోగులను నేలపై పడుకోబెట్టి చికిత్సలు అందించాల్సి వస్తుంది. వెయ్యి పడకల సామర్థ్యం కలిగిన నిలోఫర్ ఆస్పత్రిలో ప్రస్తుతం 1,200 మంది చికిత్స పొందుతున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కిటకిటలాడుతున్న పెద్దాసుపత్రులు.. హైదరాబాద్ జిల్లాలో 85 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 40పైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇక మేడ్చల్ జిల్లాలో 36 ఉన్నాయి. ఈ మూడు జిల్లాల పరిధిలో 200పైగా బస్తీ దవాఖానాలతో పాటు ఏడు ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. ఆయా ఆస్పత్రుల్లో సరైన వైద్యసేవలు అందడం లేదు. సాధారణ రక్త, మూత్ర పరీక్షలకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుండటంతో అత్యవసర పరిస్థితుల్లో వారంతా ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఫీవర్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. సాధారణ రోజుల్లో ఉస్మానియా ఆస్పత్రిలో రోజు సగటు ఓపీ 1,200 ఉండగా, ప్రస్తుతం 1,800 నుంచి 2,000పైగా నమోదవుతోంది. ఇక ఫీవర్ ఆస్పత్రిలో సాధారణ రోజుల్లో సగటు ఓపీ 350 ఉండగా, ప్రస్తుతం వెయ్యి దాటింది. ఇక నిలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రిలో సాధారణ రోజుల్లో 900 ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 1,500 దాటింది. ఈఎన్టీ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆయా ఆస్పత్రుల్లో రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేకపోవడంతో వచ్చిన వారిని నేలపై పడుకోబెట్టి వైద్యసేవలు అందిం చాల్సి వస్తుంది. ఓపీకి వస్తున్న వారిలో ఎక్కువగా జ్వరపీడితులే. కరోనా భయం ఇంకా పోకముందే, డెంగీ జ్వరాలు వెంటాడుతుండటంతో నగరవాసులు కంటిమీద కునుకు లేకుండా గడపాల్సి వస్తుంది. కరోనా, డెంగీలోనూ ఒకే లక్షణాలు ఉండటంతో ఈ జ్వరాల గుర్తింపు ఆందోళన కలిగిస్తోంది. సాధారణ జ్వర పీడితులకు డెంగీ బూచీ.. ఆరోగ్య కేంద్రాల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలు చేసే అవకాశం లేకపోవడంతో అక్కడికి వచ్చిన బాధితుల నుంచి రక్తనమూనాలు సేకరించి ఐపీఎంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్‌కు పంపుతున్నారు. రిపోర్టుల జారీలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో జ్వరం తీవ్రత మరింత పెరిగి రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. విధిలేని పరిస్థితుల్లో పేదలు ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తుంది. కరోనా, డెంగీ పరీక్షల పేరుతో ఆయా కేంద్రాలు రోగుల నిలువుదోపిడీకి పాల్పడుతున్నాయి. డయాగ్నోస్టిక్ సెంటర్లపై సరైన నియంత్రణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రైవేటు ఆస్పత్రుల్లోని వైద్యులు సాధారణ జ్వరాలను కూడా డెంగీ, కరోనా జ్వరాలుగా పేర్కొంటూ అత్యవసర చికిత్సలను సిఫార్సు చేస్తున్నారు. ఐసీయూ చికిత్సల పేరుతో పేదలను దోచుకుంటుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నగరం లోని కొంత మంది వైద్యులు డెంగీ మరణాలను బూచిగా చూపించి..ప్లేట్లెట్ కౌంట్స్ చికిత్సల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. అంతేకాదు డెంగీ కేసుల వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు తెలియజేయాల్సి ఉన్నా.. అనుమానం రాకుండా సస్పెక్టెడ్ డెంగీ కేసుగా అడ్మిట్ చేసుకుని చికిత్సలు చేస్తుండటం విశేషం. డెంగీకి కారణాలివే – డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, రంగారెడ్డిజిల్లా ►ఎడిస్ ఈజిప్టే (టైగర్)దోమ కుట్టడం వల్ల డెంగీ సోకుతుంది. సాధారణంగా ఇది పగలు మాత్రమే కుడుతుంది. ►కేవలం పగలు మాత్రమే కుట్టే డెంగీ దోమలు లైట్ల వెలుగులు విరజిమ్ముతుండటంతో రాత్రి వేళలోనూ కుడుతున్నాయి. ►ఇంటి పరిసరాల్లో ఖాళీ కొబ్బరి బోండాలు, సీసాలు, డబ్బాలు, టైర్లు, ప్లాస్టిక్ గ్లాసులు లేకుండా చూసుకోవాలి. ►వర్షపు నీరు వీటిలో చేరి నిల్వ ఉండటం వల్ల దోమలకు నిలయంగా మారి వీటిలో గుడ్లు పెడుతుంటాయి. ►ఇంటి పరిసరాల్లో నీటి గుంతలు లేకుండా చూసుకోవాలి. మంచినీటి ట్యాంకులపై మూతలు పెట్టి ఉంచాలి. సీజన్ మారుతుండటం వల్లే – డాక్టర్ వెంకటి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, హైదరాబాద్ జిల్లా వాతావరణ మార్పులను శరీరం తట్టుకోలేదు. సీజన్ మారిన ప్రతిసారీ దగ్గు, జలుబు, టైఫాయిడ్ జ్వరాలు సర్వసాధారణం. భయపడాల్సిన పనిలేదు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నిల్వ ఉన్న ఆహార పదార్థాలకు బదులుగా అప్పుడే వండిన తాజా ఆహార పదార్థాలను తీసుకోవడం, గోరు వెచ్చని మంచినీరు తాగడం; తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రతి ఒక్కరూ విధిగా కోవిడ్ టీకాలు వేసుకోవాలి. -
పట్టణ పేదలకు ఆరోగ్య ధీమా
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలే కాదు.. పట్టణ పేదలకూ సర్కారు ఆరోగ్య ధీమా ఇచ్చింది. పట్టణాల్లో పేదలు, మధ్యతరగతి వారు ఆస్పత్రుల ఖర్చు భరించలేనంతగా పెరగడంతో వారి ఆరోగ్యానికి భరోసా ఇస్తూ 560 పట్టణ ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో 1.60 కోట్ల మంది పట్టణాల్లో ఉన్నారు. అందులో 37 శాతంమంది మురికివాడల్లో ఉంటున్నారు. వైద్యం అవసరమైనవారు పెద్దాస్పత్రులకు వెళ్లడం ఇబ్బందిగా ఉంది. ప్రైవేటు డాక్టరు దగ్గరికి వెళితే ఫీజు, వ్యాధి నిర్ధారణ పరీక్షల బిల్లులు భరించలేనంతగా ఉంటున్నాయి. దీంతో వారు ఆరోగ్యపరంగాను, ఆర్థికంగాను మరింత చితికిపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం.. పట్టణాల్లో ఉన్న పేదలకు వైద్యం అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో పట్టణ ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న 260 పట్టణ ఆరోగ్యకేంద్రాలను, 71 కుటుంబ ఆరోగ్యకేంద్రాలను (మొత్తం 331) ఉన్నతీకరిస్తూ, కొత్తగా 229 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. భవనాల నిర్మాణం, మరమ్మతులు, పరికరాలు, ఫర్నిచర్ కోసం రూ.416.50 కోట్లు వెచ్చిస్తున్నారు. ఈ కేంద్రాల్లో వైద్యులు, ల్యాబ్టెక్నీషియన్లు, డేటాఎంట్రీ ఆపరేటర్లు, సహాయక సిబ్బంది 560 మంది వంతున, స్టాఫ్ నర్సులు 1,120 మంది ఉంటారు. దేశంలోనే మొదటిసారిగా.. దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రమూ పట్టణాల్లో ప్రాథమిక ఆరోగ్యంపై ఇంత భారీస్థాయిలో ఏర్పాట్లు చేసిన దాఖలాలు లేవు. తొలిసారిగా 111 మున్సిపాలిటీల్లో 560 ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది మన రాష్ట్రంలోనే. స్పెషాలిటీ వైద్యానికి ఎలాగూ బోధనాస్పత్రులున్నాయి. ప్రాథమిక ఆరోగ్యం అంటే.. చిన్న జ్వరాలు, గాయాలు వంటి వాటికి ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించకుండా భారీవ్యయంతో పట్టణ ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా 8,600కుపైగా వైఎస్సార్ హెల్త్‌క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సేవలు ఇలా ► పట్టణాల్లో ఉన్న వారికి 15 నిమిషాల నడక దూరంలో ఆస్పత్రి ఉంటుంది. ► డాక్టరు, స్టాఫ్ నర్సుతో పాటు అత్యవసర వైద్యసేవలకోసం ఆరు పడకలుంటాయి. ► 63 రకాల రోగనిర్ధారణ పరీక్షలు అందుబాటులో.. ► ప్రస్తుతం 260 వరకు పట్టణ ఆరోగ్యకేంద్రాలు పీపీపీ పద్ధతిలో నడుస్తున్నాయి. ► వీటికోసం ఏటా రూ.150 కోట్లు ప్రైవేటు సంస్థలకు ఇస్తున్నారు. ► ఇదే రూ.150 కోట్లతో అంతకంటే మెరుగ్గా 560 కేంద్రాల్లో సేవలు అందిస్తారు. ► తాజా పట్టణ జనాభా ప్రకారం 26,500 మందికి ఒక ఆరోగ్యకేంద్రం ఉంటుంది. ► గతంలో పీపీపీ కింద అమలవుతున్న ఆరోగ్యకేంద్రాలు 79 పట్టణాల్లో మాత్రమే ఉండేవి. ► ఇప్పుడు 111 పట్టణాల్లోనూ ఆరోగ్యకేంద్రాల సేవలు అందుతాయి. -
ప్రభుత్వాస్పత్రుల్లో పడకల పెంపు
సాక్షి, అమరావతి: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఇప్పటికే ప్రభుత్వాస్పత్రుల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టిన వైఎస్ జగన్ సర్కార్ ఈ దిశగా మరో అడుగు ముందుకేసింది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆస్పత్రుల్లో పడకలు లేకపోవడంతో తలెత్తుతున్న ఇబ్బందులను తొలగించడానికి పడకల సంఖ్యను పెంచాలని కసరత్తు చేస్తోంది. 30 పడకలున్న సామాజిక ఆరోగ్య కేంద్రాలను 50 పడకలకు పెంచి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది. తద్వారా మాతాశిశు సంరక్షణకు, నాణ్యమైన వైద్య సేవలకు పెద్దపీట వేయనుంది. తొలుత 51 ఆస్పత్రుల్లో పడకలు పెంపు ► ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 51 ఆస్పత్రుల్లో 30 పడకల నుంచి 50 పడకలకు పెంచేందుకు కసరత్తు మొదలైంది. దీనివల్ల 1,020 పడకలు అదనంగా పెరగనున్నాయి ► ఆయా సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఆస్పత్రి సామర్థ్యానికి మించి ఔట్పేషెంట్లు, ఇన్‌పేషెంట్లు వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ► ఇండియన్ పబ్లిక్ హెల్త్ ప్రమాణాల మేరకు పడకలను పెంచుతున్నారు. ఒక్కో సామాజిక ఆరోగ్య కేంద్రంలో 20 పడకలు పెంచడానికి రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల వ్యయం అవుతుందని అంచనా ► మొత్తం 51 సీహెచ్‌సీలకు కనిష్టంగా రూ.250 కోట్ల నుంచి గరిష్టంగా రూ.300 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. పడకలు పెంచడమే కాకుండా ప్రసూతి వార్డులు, ఆపరేషన్ థియేటర్, వైద్య పరికరాలు, ఫార్మసీ వంటి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు. ► పడకల పెంపుతో ఒక్కో సీహెచ్‌సీకి సుమారు 25 మంది వైద్యులు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది అవసరం. ► ఈ 25 మంది జీతాల కోసం ఒక్కో సీహెచ్‌సీకి ప్రతినెలా రూ.4.60 ఖర్చు చేస్తారు. -
ఆర్టీసీపై ‘రెఫరల్’ భారం
సాక్షి, హైదరాబాద్ : అసలే రకరకాల సమస్యలతో కొట్టుమిట్టా డుతూ నష్టాల బాటలో పయనిస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)పై సొంత ఆసుపత్రి మరింత ఆర్థిక భారం మోపుతోంది. సరైన వసతులు లేకపోవడం, స్పెషలిస్టు వైద్యులు కరువవడం, ఆపరేషన్లు చేసే వెసులుబాటు లేకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు ఓ మోస్తరు వైద్యానికి కూడా ప్రైవేటు ఆసుపత్రులవైపు చూడాల్సి వస్తోంది. ఫలితంగా రెఫరల్ ఆసుపత్రులకు భారీగా బిల్లులు చెల్లించాల్సి రావడం ఆర్టీసీని బెంబేలెత్తిస్తోంది. వేసవిలో సిబ్బంది కోసం బస్టాండ్లలో మజ్జిగ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్న ఆర్టీసీ... ప్రతి సంవత్సరం ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 30 కోట్ల కంటే ఎక్కువ మొత్తం రెఫరల్ బిల్లులు చెల్లిస్తోంది. అందులో కనీసం ఏటా రూ. 10 కోట్లు సొంత ఆసుపత్రి అభివృద్ధికి వెచ్చించి ఉంటే ఈపాటికి అది సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తరహాలో అభివృద్ధి చెంది ఉండేదని సొంత ఉద్యోగులు వాపోతున్నారు. ఇదీ సంగతి.... ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వైద్యం కోసం హైదరాబాద్‌లోని తార్నాకలో ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులకు చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైతే చికిత్స చేసి మందులు ఇచ్చేందుకు స్థానికంగా డిస్పెన్సరీలు ఉన్నా పెద్ద సమస్యలు వస్తే తార్నాకలోని ఆసుపత్రికే వస్తుంటారు. వైద్యులు వారి సమస్యలు గుర్తించి చికిత్స చేయాల్సి ఉంటుంది. కానీ కొంతకాలంగా ఈ ఆసుపత్రి నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోంది. కొన్ని రకాల సమస్యలకు సంబంధించి ఆసుపత్రిలో స్పెషలిస్టు వైద్యులు లేరు. అలాగే ఆయా సమస్యలకు సంబంధించి నిర్వహించాల్సిన ఆపరేషన్ల కోసం వైద్య పరికరాలు కూడా అందుబాటులో లేవు. ఇటీవలి కాలంలో మందులకూ కొరత ఏర్పడ్డా ఇప్పుడిప్పుడే ఆ సమస్య పరిష్కారమవుతోంది. వెరసి చిన్నచిన్న చికిత్సలు మాత్రమే ఆసుపత్రిలో అందిస్తున్నారు. కాస్త పెద్ద సమస్యతో వచ్చే వారిని వెంటనే రెఫరల్ ఆసుపత్రులకు పంపేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సంస్థకు ఏటా ఈ రెఫరల్ ఆసుపత్రుల బిల్లు తడిసి మోపెడవుతోంది. ఆసుపత్రి అభివృద్ధికి నిధులు కేటాయించలేకపోతున్న ఆర్టీసీ... రెఫరల్ ఆసుపత్రుల బిల్లులకు మాత్రం సగటున ప్రతి సంవత్సరం రూ. 30 కోట్లకుపైగా చెల్లించాల్సి వస్తోంది. ఈ మొత్తంలో సగం కంటే తక్కువ నిధులను ఆసుపత్రి అభివృద్ధికి ఖర్చు చేస్తే ఈపాటికి ముఖ్యమైన చికిత్సలకు సంబంధించి పరికరాలు, ఇతర వసతులు సమకూరి ఉండేవన్న వాదన సొంత ఉద్యోగుల నుంచే వినిపిస్తోంది. ఒక్కో సంవత్సరం కనీసం రూ.10 కోట్లు ఖర్చు చేసినా.. అన్ని ముఖ్యమైన పరికరాలు సమకూరి ఉండేవన్నది వారి మాట. మూడేళ్ల రెఫరల్ బిల్లు రూ. 105 కోట్లు... 2015–16లో ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న రోగులకు అందించిన మందుల ఖర్చు రూ. 9.14 కోట్లు అవగా ప్రస్తుత ఉద్యోగుల రెఫరల్ వ్యయం రూ. 28.45 కోట్లు, విశ్రాంత ఉద్యోగుల రెఫరల్ వ్యయం రూ. 5 కోట్లు అయింది. గడచిన మూడేళ్లలో సొంత ఆసుపత్రిలో చికిత్స చేసి మందులు ఇచ్చినందుకు రూ. 32 కోట్లు ఖర్చవగా రెఫరల్ ఆసుపత్రులకు చెల్లించిన బిల్లు మాత్రం రూ. 105 కోట్ల వరకు అయింది. చేతిలో చాలినన్ని నిధుల్లేక కొన్నేళ్లుగా కొత్త బస్సులు కొనడాన్ని నిలిపివేసిన ఆర్టీసీ... గత్యంతరం లేని స్థితిలో ఈ బిల్లుల భారాన్ని మాత్రం మోయాల్సి వస్తోంది. ప్రభుత్వ వైద్యుల సేవలు వాడుకునే అవకాశం ఉన్నా... ఆర్టీసీలో దాదాపు 51 వేల మంది పనిచేస్తున్నారు. వారితోపాటు వారి కుటుంబ సభ్యులు కలిపి 2 లక్షల మంది కంటే ఎక్కువ ఉన్నారు. ఇంతమందికి వైద్యం అందించే ప్రధాన ఆసుపత్రి అయినందున ఇక్కడ అన్ని విభాగాలకు చెందిన వైద్యులు, చికిత్సకు అవసరమైన పరికరాలు ఉండాలి. అయితే సాధారణ వైద్యులు మాత్రమే ఉండటంతో గుండె, కిడ్నీ, ఆర్థో సహా ఇతర పెద్ద సమస్యలతో వచ్చే వారిని నేరుగా రెఫరల్ ఆసుపత్రులకు పంపుతున్నారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రిల్లో ఉన్న స్పెషలిస్టు వైద్యుల్లో కొందరిని గుర్తించి విడతలవారీగా ఈ ఆసుపత్రికి వచ్చి వైద్యం అందించేలా చేసే అవకాశం ఉన్నా అధికారులు అలా చేయడం లేదు. అలాగే కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు చెందిన వైద్యులను గౌరవ భృతిపై పిలిపించే ఒప్పందం ఉన్నా అది కూడా సరిగా అమలు కావడం లేదు. దీంతో స్కానింగ్, ఎమ్మారైలకు కూడా వేరే చోటకు వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడ వసతులు, స్పెషలిస్టు డాక్టర్లు లేనందున ఈ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడం కంటే ప్రైవేటు ఆసుపత్రులకు రెఫర్ చేయించుకొనేందుకే ఉద్యోగులు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల కొత్తగా ఆర్టీసీ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులతో రెఫరల్ జాబితాను విడుదల చేసింది. అందులో మూడు మాత్రమే పెద్ద ఆసుపత్రులు ఉండటంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘తార్నాక ఆసుపత్రిలో అన్ని విభాగాలకు పూర్తిస్థాయి వసతులు, స్పెషలిస్టు వైద్యులు లేనందున రెఫరల్ ఆసుపత్రుల జాబితాలో సన్‌షైన్, కిమ్స్, గ్లోబుల్, యశోద, అపోలో, ఉషా ముళ్లపూడి, కామినేని లాంటి ఆసుపత్రులను కూడా చేర్చాలి’అని ఆర్టీసీ బోర్డు మాజీ డైరక్టర్ నాగేశ్వరరావు ఓ ప్రకటనలో కోరారు. సొంత ఆసుపత్రిపై నమ్మకం లేక ఇలాంటి డిమాండ్లు తరచూ వినిపిస్తున్నాయి. 2015–16 2016–17 2017–18 2018–19 (అంకెలు రూ. కోట్లలో) మందుల ఖర్చు 9.14 5.91 17.15 8.95 ప్రైవేట్ రెఫరల్ వ్యయం 33.51 38.20 35.21 31.69 -
మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో శిశువు మృతి
నల్లగొండ టౌన్ : జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో బుధవారం నాలుగురోజుల శిశువు మృతిచెందాడు. పసికందు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. వివరాలు.. రా మన్నపేట మండలం ఎల్లంకి గ్రామానికి చెందిన గిరి భార్య శిరీష ఈ నెల 24న ప్రసవానికి ఆస్పత్రిలో చేరింది. అదే రోజు శిరీష మగబిడ్డను జన్మనిచ్చింది. ఆస్పత్రిలో తల్లిబిడ్డ చికిత్స పొందుతున్నారు. కాగా బుధవారం ఉదయం బాలుడు మృతిచెందినట్లు వైద్యులు తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో కోపోద్రిక్తులైన బంధువులు శిశువు మృతదేహంతో ఎంసీహెచ్ ఎధుట ఆందోళన నిర్వహించారు. వైద్యుల నిర్లక్ష్యమే తమ బాలుడిని బలితీసుకుందని తల్లిదండ్రులతో పాటు బంధువులు విలపిస్తూ తెలిపారు. పసికందు చనిపోయిన తర్వాతనే ఎన్ఐసీకి తీసుకువచ్చారని డాక్టర్ దామెర యాదయ్య సాక్షికి తెలిపారు. సీసీ పుటేజీలు కూడా ఉన్నాయి. వాటిని పరిశీలించుకోవచ్చన్నారు. బాధ్యులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని తీసుకుని వెళ్లారు. -
ఆరుబయట నరకయాతన
నల్లగొండ టౌన్ : జిల్లా కేంద్రాస్పత్రిలో రూ.20 కోట్లతో మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో నిర్మించారు. కానీ రోగులవెంట వచ్చే సహాయకుల కోసం ఎటువంటి ఏర్పాట్లూ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో మాతాశిశు మరణాల సంఖ్యను పూర్తిగా నివారించాలనే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో సకల సదుపాయాలతో 150 పడకల సామర్థ్యంగల ఎంసీహెచ్‌ను నిర్మించారు. రోజూ 300 నుంచి 500 వరకు గర్భిణులు ఓపి సేవలు పొందుతున్నారు. ప్రసవాల కోసం జిల్లా నలుమూలలనుంచి సమారు 100 నుంచి 150 మంది గర్భిణులు ఇన్‌పేషంట్లుగా చేరుతున్నారు. ఇంతటి తాకిడి ఉన్న మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి రోగులవెంట వచ్చే సహాయకులకు కనీస సౌకర్యాలు లేక నరకయాతన అనుభవిస్తున్నారు. సహాయకుల కోసం గతంలో తడకలతో షెడ్డును నిర్మించారు. ఆది కాస్త గాలికి కూలిపోవడంతో ప్రస్తుతం నిలువనీడ లేకుండా పోయింది. ఎంసీహెచ్‌లో గర్భిణుల సహాయం కోసం ఒక్కరిని మాత్రమే ఉండేందుకు అనుమతిస్తారు. మిగిలిన వారంతా ఉదయం, రాత్రి పూట ఆరుబయట ఎండకు, చలికి ఇబ్బందులు పడాల్సిందే. కనీసం పడుకోవడానికి కూడా సరైన వసతులు లేకపోవడం వలన నేలపై, బెంచీలపై నిద్రించాల్సి వస్తుందని పలువురు సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుబయటే ఎండకు కూర్చుని భోజనం చేయాల్సి వస్తుందని, కనీసం తాగడానికి తాగునీటి వసతి కూడా లేకపోవడంతో రెండు లీటర్ల నీటిని రూ.5 చెల్లించి కోనుక్కుంటున్నారు. ఆవరణలో ఏర్పాటు చేసిన నీటిట్యాంకు చిన్నది కావడంతో సహయకుల వాడకానికే సరిపోతుంది. కోట్లాది రూపాయలు వెచ్చించి ఎంసీహెచ్‌ను నిర్మించిన పాలకులకు కనీసం సహాయకుల కోసం విశ్రాంతి షెడ్డును నిర్మించాలనే ఆలోచన రాకపోవడం విడ్డూరంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వెంటనే షెడ్డును నిర్మించాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. చలికి వణికి పోతున్నాం లోపల పడుకోనివ్వకపోవడంతో ఆరుబయటే నిద్రిస్తున్నాం. చలికి వణికిపోతున్నాం,. కనీసం ఉండడానికి షెడ్డు కూడా లేకపోవడం అన్యాయం. గర్భిణులకు సహాయంగా వచ్చిన వారు ఎక్కడ ఉండాలి. – పుల్లమ్మ, నార్కట్‌పల్లి తాగునీరు కొనాల్సి వస్తుంది కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయకపోవడం దారునం. రెండు లీటర్ల నీటిని రూ.5 చెల్లించి కొనుక్కుంటున్నాం. పడుకోవడానికి, కూర్చోవడానికి ఎటువంటి ఏర్పాట్లు లేవు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. – యాదమ్మ, రాములబండ -
పేదోడి ఆరోగ్యంతో ప్రైవేటు వ్యాపారం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 7,683 ఆరోగ్య ఉప కేంద్రాల(సబ్ సెంటర్స్)ను టెలిమెడిసిన్ పేరుతో ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. అతి త్వరలో టెండర్లు ఆహ్వానించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 26 సేవలను ప్రైవేట్‌పరం చేసి ఏటా రూ.2 వేల కోట్లకు పైగా కాంట్రాక్టు సంస్థలకు పంచి పెడుతున్న సర్కారు తాజాగా సబ్సెంటర్లను సైతం అప్పగించడం ద్వారా ఏటా మరో రూ.276.58 కోట్లు వ్యయం చేసేందుకు సిద్ధమైంది. టెలిమెడిసిన్ కింద పట్టణాల్లో పేదల కోసం ఇప్పటికే 222 ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఆర్నెళ్లుగా వీటికి బిల్లులు కూడా సరిగా చెల్లించడం లేదు. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో స్పెషలిస్టులు చూడటం లేదని ఫిర్యాదులు వచ్చాయి. మౌలిక వసతులున్న చోటే ఇలా ఉంటే మారుమూల ప్రాంతాల్లోని సబ్సెంటర్లలో టెలిమెడిసిన్ ఎలా ఉంటుందో ఊహించవచ్చు. టెలిమెడిసిన్ కింద ఒక్కో ఆరోగ్య కేంద్రానికి నెలకు రూ.4.08 లక్షలు చెల్లిస్తున్నా పర్యవేక్షణ లేదు. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లే లేకపోయినా బిల్లులు చెల్లిస్తున్నారు. చంద్రన్న సంచార చికిత్స బాధ్యతలు నిర్వహిస్తున్న పిరమిల్ సంస్థ ఒక్క పేషెంట్ వచ్చినా ఆరుగురి ఆధార్ కార్డులు తీసుకుని వైద్యం చేసినట్టు చూపిస్తున్నారు. మండలానికి ఒకటి కూడా లేని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లను నియమించకుండా సబ్‌సెంటర్లకు ఎలా నిర్వహిస్తారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ ఆరోగ్యమిషన్ / ప్రపంచ బ్యాంకు నిధులను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్‌కు పందేరం చేస్తోందని పేర్కొంటున్నారు. 20 సెంటర్లకు ఇంటర్నెట్ లేదు.. ఆరోగ్య ఉపకేంద్రాల్లో టెలిమెడిసిన్, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల కింద ఒక్కో కేంద్రానికి నెలకు రూ.30 వేల వరకూ వ్యయం చేసేందుకు ప్రపంచ బ్యాంకు రుణం కోరినట్టు అధికార వర్గాలు తెలిపాయి. సబ్సెంటర్లలో డాక్టర్లు ఉండనందున టెలిమెడిసిన్ యంత్రం ద్వారా రోగికి సూచనలు, సలహాలు అందచేస్తారు. రోగి వివరాలన్నీ ఎలక్ట్రానిక్ డేటాలో రికార్డు చేస్తారు. అయితే 20 సబ్‌సెంటర్లకు ఇప్పటివరకూ ఇంటర్నెట్ కనెక్షన్లే లేకపోవడం గమనార్హం. ఏజెన్సీల్లో డాక్టర్లే లేరు.. గిరిజన ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లో డాక్టర్లు లేరు. 80% మంది కాంట్రాక్టు వైద్యులే పని చేస్తున్నారు. తమను క్రమబద్ధీకరించాలని వారు విన్నవిస్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదు. మరోవైపు సబ్‌సెంటర్లకు సొంత భవనాలే లేవు. ఈ అంశాలను పట్టించుకోకుండా టెలిమెడిసిన్ పేరుతో కోట్లు కుమ్మరించడం దుబారాకు పరాకాష్టని నిపుణులు అంటున్నారు. ఆరోగ్య ఉపకేంద్రాల్లో సేవలు ఇవీ - అంటువ్యాధులు ప్రబలినప్పుడు అవగాహన కల్పించడం - మాతాశిశు సంరక్షణపై సూచనలు ఇవ్వడం - జీవన శైలి వ్యాధులను గుర్తించి చికిత్సకు సహకరించడం - హెచ్ఐవీ బాధితులకు మందులు ఇప్పించడం - కుష్టు, అంధత్వ నివారణ లాంటి జాతీయ కార్యక్రమాల అమలు - వ్యాధి నిరోధకత, వ్యాధులపై అవగాహన కల్పించడం - సబ్‌సెంటర్ పరిధిలో గర్భిణులను గుర్తించి ప్రతినెలా పరీక్షలు చేయించడం తమిళనాడులో సర్కారు నిర్వహణలోనే.. తమిళనాడులో ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రాథమిక వైద్యం అమలు తీరు అద్భుతంగా ఉందని టీడీపీ సర్కారుకు అధికారులు పలుదఫాలు నివేదిక ఇచ్చారు. రాజస్థాన్‌లో సైతం ప్రభుత్వమే నిర్వహిస్తోందని నివేదించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని సుమారు 140 గ్రామాలకు చెందిన ప్రజలు వైద్యం కోసం తమిళనాడు పీహెచ్‌సీలకే వెళుతుండటం గమనార్హం. -
పల్లె చెంతకే వైద్యం
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు సరికొత్తగా హెల్త్–వెల్నెస్ కేంద్రాలు (హెచ్డబ్ల్యూసీలు) అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ఆరోగ్య ఉప కేంద్రాలను హెల్త్–వెల్నెస్ సెంటర్లుగా మార్చనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ చర్య లు చేపట్టింది. ఈ కేంద్రాల్లో గ్రామీణ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలతోపాటు రోగ నిర్ధారణ పరీక్షలు, మందుల పంపిణీ కూడా ఉచితంగా అందించనున్నారు. రోగ నిర్ధారణ పరీక్షల ఫలితాల ఆధారంగా.. మెరుగైన వైద్యం అవసరమైన వారిని సమీపంలోని ఏరియా, జిల్లా ఆస్పత్రులకు తీసుకెళ్లి వైద్యసేవలు అందిస్తారు. దశలవారీగా 4,797 కేంద్రాలు.. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు, ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు, మందుల పంపిణీ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం హెల్త్–వెల్నెస్ కేంద్రాల పథకాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా 1.40 లక్షల హెల్త్–వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి హెల్త్–వెల్నెస్ సెంటర్ అభివృద్ధికి రూ.ఐదు లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. దీని ప్రకారం రాష్ట్రంలోని ఆరోగ్య ఉప కేంద్రాలను హెచ్‌డబ్ల్యూసీలుగా మార్చేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 683 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు) ఉండగా.. వాటి పరిధిలో 4,797 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. వీటిని దశల వారీగా హెల్త్–వెల్నెస్ కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నారు. మొదటి దశలో 90 హెల్త్–వెల్నెస్ సెంటర్లను ప్రారంభించేందుకు వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రెండోదశ కింద మరో 500 హెల్త్–వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. స్టాఫ్ నర్సుల ఆధ్వర్యంలో.. హెల్త్–వెల్నెస్ కేంద్రాలు ‘మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ ఇన్చార్జి (మధ్యస్థాయి ఆరోగ్య సేవల ఇన్చార్జి)’గా పనిచేస్తాయి. ప్రస్తుతం స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న వారికి బ్రిడ్జి కోర్సు శిక్షణ ఇప్పించి.. మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్‌గా పదోన్నతి కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం, సంగారెడ్డి జిల్లా ఆస్పత్రులలో బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తున్నారు. ఆరు నెలలకు ఒక బ్యాచ్ చొప్పున శిక్షణ పూర్తవుతుంది. మొదటి బ్యాచ్‌లో శిక్షణ పూర్తి చేసిన 26 మందిని కొత్త హెల్త్–వెల్నెస్ కేంద్రాల్లో నియమిస్తున్నారు. ఇక ఈ కేంద్రాల్లో ఏఎన్‌ఎంతోపాటు ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒకరు చొప్పున ఆశ కార్యకర్త ఉంటారు. వారు ఆయా కేంద్రాల పరిధిలోని ప్రజలు వైద్యసేవల కోసం వచ్చేలా కృషి చేస్తారు. ఈ కేంద్రాల్లో రక్తపోటు, మధుమేహం తదితర ఏడు రకాల సాధారణ వైద్య పరీక్షలను చేస్తారు. వాటి ఫలితాల ఆధారంగా ఉచితంగా మందులు ఇస్తారు. దాంతో పాటు ఈ కేంద్రాలకు వచ్చే రోగుల వివరాలను సేకరించి.. అందరి ఆరోగ్య వివరాల (హెల్త్ ప్రొఫైల్) జాబితాను సిద్ధం చేస్తారు. ఏ జిల్లాలో ఎన్ని కేంద్రాలు మొదటిదశలో హైదరాబాద్‌లో 40 కేంద్రాలతోపాటు ఆదిలాబాద్ 6, సిద్దిపేట 5, సిరిసిల్ల 8, వరంగల్ రూరల్ 8, భూపాలపల్లి 8, మహబూబ్‌నగర్ 6, జనగామలో 9 కేంద్రాలు సిద్ధమయ్యాయి. రెండోదశ హెచ్డబ్ల్యూసీలు: మహబూబ్‌నగర్‌లో 10, గద్వాల 9, నాగర్ కర్నూలు 31, వనపర్తి 6, రంగారెడ్డి 6, వికారాబాద్ 8, మేడ్చల్ 8, హైదరాబాద్ 100, మెదక్ 8, సంగారెడ్డి 8, సిద్దిపేట 7, నిజామాబాద్ 32, కామారెడ్డి 12, ఆదిలాబాద్ 26, ఆసిఫాబాద్ 32, మంచిర్యాల 12, నిర్మల్ 10, కరీంనగర్ 16, జగిత్యాల 9, పెద్దపల్లి 10, సిరిసిల్ల 8, వరంగల్ అర్బన్ 9, వరంగల్ రూరల్ 9, భూపాలపల్లి 27, మహబూబాబాద్ 8, జనగామ 11, కొత్తగూడెం 30, ఖమ్మం 12, యాదాద్రి 9, నల్లగొండ 7, సూర్యాపేటలో 10 హెచ్డబ్ల్యూసీలు ఏర్పాటు చేస్తారు. రాజధానిలో ‘బస్తీ దవాఖానా’లు తొలిదశలో 90 హెల్త్–వెల్నెస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా.. అందులో 40 కేంద్రాలను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఏర్పాటు చేశారు. ‘బస్తీ దవాఖానా’లు అని వీటికి నామకరణం చేశారు. ఇందులో గడ్డి అన్నారం, హష్మా బాద్, బీజేఆర్ నగర్ బస్తీ దవాఖానాలను మంత్రులు కె.తారకరామారావు, సి.లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు శుక్రవారం ప్రారంభించనున్నారు. -
గాల్లో దీపం.. గ్రామీణ వైద్యం
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో పేద రోగులకు వైద్యం అందని ద్రాక్షలా మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా సామాజిక ఆరోగ్య కేంద్రాలు వైద్యుల కొరతతో అలంకారప్రాయంగా మిగిలాయి. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సామాజిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలిస్తే సుమారు వంద ఆస్పత్రుల్లో వైద్యులు లేరని తేలింది. జాతీయ ఆరోగ్య మిషన్ మన రాష్ట్రానికి ఏటా రూ.1,100 కోట్ల వరకు నిధులిస్తున్నా కూడా.. ప్రభుత్వం వైద్యులను నియమించడం లేదు. అయితే కార్పొరేటీకరణలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం వైద్యులను నియమించడం లేదని తెలిసింది. ఇప్పటికే చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రిని ప్రైవేటుకు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఏలూరు, విజయనగరం, ప్రొద్దుటూరు ఆస్పత్రులను కూడా ప్రైవేటుకు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఈవిధంగా ప్రతీ సేవను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పేరుతో కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్న రాష్ట్ర సర్కార్.. ఈ క్రమంలోనే వైద్యుల నియామకంపై తాత్సారం చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై గ్రామీణ పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నియామకానికి ససేమిరా రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో వేలాది వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో పీజీ డిప్లొమా చదివిన వారు ఉంటే సరిపోతుంది. అదే బోధనాస్పత్రుల్లో అయితే పీజీ వైద్యులు కావాలి. కానీ పీజీ డిప్లొమా చదివిన వారిని రెగ్యులర్‌గా నియమించుకునేందుకు కూడా ప్రభుత్వం వెనుకాడుతోంది. కాంట్రాక్టు పద్ధతికి మొగ్గుచూపుతుండటంతో వైద్యులు వెనుకడుగు వేస్తున్నారు. నేరుగా నియమిస్తామని కొన్నిరోజులు, ఏపీపీఎస్సీకి సూచించామని మరికొన్ని రోజులు చెప్పిన సర్కారు ఇప్పటివరకూ ఒక్క వైద్యుడినీ నియమించలేకపోయింది. పేదలకు వైద్య సేవలు అందించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని, అందుకే కొత్తగా వైద్యుల్ని నియమించడం లేదని వైద్య వర్గాలు మండిపడుతున్నాయి. ప్రసవానికి నరకయాతన గ్రామీణ ప్రాంతాల గర్భిణులకు ప్రసవం చేయడం సామాజిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం ప్రసూతి వైద్యురాలు, చిన్నపిల్లల వైద్యులు, మత్తు వైద్యులు ప్రతి కేంద్రంలోనూ ఉండాలి. రాష్ట్రవ్యాప్తంగా 190 సామాజిక ఆరోగ్య కేంద్రాలుంటే వందకుపైగా ఆస్పత్రులు వైద్యుల కొరత ఎదుర్కొంటున్నాయి. శస్త్రచికిత్స అవసరమైతే కాన్పు చేయకుండా ప్రైవేటు ఆస్పత్రులకు పంపిస్తున్నారు. -
సీఎం ఆరోగ్య కేంద్రాల అవినీతిపై విచారణ!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల ముసుగులో జరుగుతున్న అవినీతి తుట్టె కదిలింది. కార్పొరేట్ సంస్థలకు రూ.కోట్లు ౖకైంకర్యం అవుతున్న తీరుపై పలువురు ప్రైవేటు వ్యక్తులు కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ)కు ఫిర్యాదులు చేశారు. స్పందించిన సీవీసీ తాజాగా వీటిపై విచారణకు ఆదేశించింది. రాష్ట్రంలో మున్సిపాలిటీల పరిధిలో 222 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను కొద్ది నెలల కిందట ఏర్పాటు చేశారు. మొత్తం మూడు జోన్లుగా విభజించి అపోలో సంస్థకు రెండు జోన్లు, ధనుష్–ఈ వైద్య కన్సార్టియం సంస్థకు ఒక జోన్ కేటాయించారు. ఒక్కో కేంద్రానికి సగటున నెలకు రూ. 4.08 లక్షలను జాతీయ ఆరోగ్య మిషన్ నుంచి చెల్లిస్తున్నారు. కానీ వీటి సేవలు సక్రమంగా అందడం లేదు. టెండర్లలో కూడా పలు అవకతవకలు జరిగాయి. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌కు అనుచరుడిగా చెప్పుకుంటున్న ఈ–వైద్య సంస్థ ప్రతినిధి కోసం ఏకంగా మూడు దఫాలు టెండర్లు రద్దు చేసి మళ్లీ నిర్వహించినట్టు అప్పట్లో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై కొందరు వ్యక్తులు సీవీసీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీవీసీ విచారణకు ఆదేశించింది. నెలరోజుల్లోగా ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖను ఆదేశించింది. ఉపరాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆదేశాలు కేంద్ర విజిలెన్స్ కమిషన్‌తో పాటు ఉప రాష్ట్రపతి కార్యాలయానికి కూడా ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలపై ఫిర్యాదులు వెళ్లాయి. వీటిపై స్పందించిన ఉపరాష్ట్రపతి కార్యాలయం.. ఫిర్యాదుదారులకు ప్రత్యుత్తర సమాచారం పంపింది. అంతేగాకుండా దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
పేరులోనే దవాఖానా!
► ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో ఉండని మందులు ► గత్యంతరం లేక ప్రైవేటు మెడికల్ షాపుల్లో కొంటున్న రోగులు రాష్ట్రంలో ఆరోగ్య ఉప కేంద్రాలు 4,797 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 683 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు 119 జిల్లా ఆసుపత్రులు 7 సాక్షి, హైదరాబాద్: అరకొర వైద్యం, అలసత్వాన్ని వీడని సిబ్బంది, అందుబాటులో ఉండని మందులు... వీటన్నింటికీ చిరునామా మన ప్రభుత్వాసుపత్రులు. రాష్ట్రంలో దాదాపు ఎక్కువ శాతం వైద్యశాలల పరిస్థితి ఇదే. రోగం వచ్చి ఆసుపత్రికి వెళితే.. సిబ్బంది ఉండరు. ఉన్నా.. వైద్యుడు రాసిన మందు గోలీలు అక్కడ ఉండవు. ఇదేంటని అడిగితే బయట తెచ్చుకోండి.. ఇక్కడలేవు అంటూ సమాధానమే వస్తోంది. వేల రూపాయలు పోసి మెడికల్ దుకాణాల్లో కొనలేక రోగులు అవస్థలు పడుతున్నారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగానే వర్షాకాలంలో మందులను అందుబాటులో ఉంచాల్సిన టీఎస్ఎంఎస్ఐడీసీ వాటిని సరిగా పంపిణీ చేయడం లేదనే ఆరోపణలున్నాయి. మందుల సరఫరా ఏదీ... వర్షాకాలం మొదలవడంతో దోమల వ్యాప్తి వల్ల ఎక్కువ మంది ప్రజలు మలేరియా జ్వరం బారినపడి ప్రభుత్వాస్పత్రులకు క్యూ కడుతున్నారు. కానీ అక్కడ సరిపడా మందులు దొరకకపోవడంతో బయట కొనుగోలు చేస్తున్నారు. అలాగే కలుషిత నీరు తాగడం వల్ల వాంతులు, వీరేచనాల బారినపడే వారికి అవసరమయ్యే మందులకూ కొరత నెలకొనడంతో రోగులు ప్రైవేటు దుకాణాల్లో మందులు కొనలేక అవస్థలు పడుతున్నారు. ఎప్పటికప్పుడు ఆస్పత్రులవారీగా కొరత ఉన్న సూది మందులు, మాత్రల పంపిణీ కోసం క్షేత్రస్థాయి సిబ్బంది కోరుతున్నా సరఫరా చేసే యంత్రాంగం పట్టించుకోవడంలేదు. కొరత ఉన్న మందులివీ.. ♦ మలేరియా నివారణ, చికిత్సకు ఇచ్చే ప్రిమాక్విన్ (7.5/2.5) ట్యాబ్లెట్లు. ♦ చిన్నారుల్లో జ్వరాన్ని తగ్గించే పారాసిటమాల్ డ్రాప్స్. విరేచనాలతో వచ్చే జ్వరాన్ని తగించే డెక్స్ట్రోస్ ఇంజెక్షన్కూ ఇదే పరిస్థితి. ♦ పురిటి నొప్పులు అయ్యేందుకు వీలుగా గర్భిణులకు ఇచ్చే ఆక్సిటోసిన్ సూది మందు. ♦ శిశువులకు నెలన్నర, మూడున్నర నెలల వయసులో కచ్చితంగా ఇవ్వాల్సిన పోలియో నివారణ సూది మందు (ఇనాక్టివ్ పోలియో వ్యాక్సిన్). ప్రైవేటు ఆస్పత్రుల్లో దీని ధర రూ. 3 వేలు. ♦ విరేచనాలు తగ్గేందుకు ఇచ్చే జెంటామైసిన్, మెట్రోనిండజోల్ సూది మందులు. ♦ వాంతులను తగ్గించేందుకు సరఫరా చేసే ఒండన్ సెట్రోన్, ప్రొమెతజైన్ సూది మందులు. ♦ కడుపు నొప్పి తీవ్రతను తగ్గించేందుకు ఇచ్చే డైసైక్లోమైన్ హెచ్‌సీఎల్ సూది మందు. ♦ కాలిన గాయాలకు చేసే చికిత్సలో ఉపయోగించే సిల్వర్ సఫ్లాడైజిన్. సూది మందు లేదట... ఆత్మహత్య చేసుకునేందుకు నా కొడుకు గడ్డి మందు మింగడంతో ఆస్పత్రికి తీసుకొచ్చినం. కానీ ఆస్పత్రిలో మందులు లేవట. బయట కొంటే ఒక్కో ఇంజెక్షన్‌కు రూ. 200 అయింది. – రాతిపెల్లి సాంబయ్య, బోరు నర్సాపురం, మంగపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా బయట తెచ్చుకోమన్నారు.. జ్వరం మందులు ఆస్పత్రిలో లేవంటున్నారు. ఇదేంటని అడిగితే బయట తెచ్చుకోవాలని అంటున్నారు. – సిలువేరు మధు, చిప్పాయిగూడ, మంచాల మండలం, రంగారెడ్డి జిల్లా -
కాటేస్తే కాటికే!
పేరుకే ఆరోగ్య కేంద్రాలు కుక్క, పాముకాట్లకు మందుల కొరత నెల్లూరు(అర్బన్) : కాలం కలిసిరాక కాలనాగు కాటేస్తే.. లక్కు సరిగా లేక కుక్క పిక్క పీకేస్తే జిల్లావాసులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఖర్మ కాలితే కాటికి చేరాల్సి వస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పాముకాటుకు విరుగుడు ఇంజక్షన్లు లేకపోవడం, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పాముతో పాటు కుక్కకాట్లకు కూడా మందుల్లేకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో పెద్దాస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. అయితే అధికశాతం మంది ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ఖర్చు పెట్టాల్సి వస్తోంది. పేరుకే పట్టణ ఆరోగ్య కేంద్రాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్సీ)లాగా పట్టణ ఆరోగ్యకేంద్రాల(యూహెచ్‌సీ)ను తీర్చిదిద్దుతామంటూ 2000 సంవత్సరంలో ప్రభుత్వం జిల్లాలో 15 పట్టణ ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు మెరుగైన, అత్యవసరమైన సేవలను అందించేందుకు అంటూ వాటిని ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రాలుగా మార్చి నిర్వహణను అపోలో ఆస్పత్రి యాజమాన్యానికి అప్పగించింది. ఇవి పేరుకే పట్టణ ఆరోగ్య కేంద్రాలుగా ఉన్నాయి. ఈ ఆరోగ్య కేంద్రాల్లో కుక్కకాటు, పాము కాటు లాంటి ప్రమాదకరమైన వాటికి ఇంజక్షన్లు లేవు. కుక్కకాటుకి ఏఆర్వీ(యాంటీ రేబిస్ వ్యాక్సిన్), పాముకాటుకి ఏఎస్వీ (యాంటీ స్నేక్ వీనమ్) ఇవ్వాల్సి ఉంది. ఇవి పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో లేకపోవడంతో రోగులు జిల్లా కేంద్రానికి ఉరుకులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 25 రకాల పరీక్షలు చేసి రోగులకు సేవలందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పట్టణ ఆరోగ్య కేంద్రాలకు వచ్చేవారికి రోజుకి 5 మందికి మించి రక్త పరీక్షలు చేయకూడదని అపోలో యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పేట్రేగుతున్న శునకాలు జిల్లాలో ఏదో ఒక మూల ప్రతి రోజు కుక్క కాటుకి గురవుతున్న ప్రజలు కనిపిస్తూనే ఉన్నారు. వీరికి సకాలంలో ఏఆర్వీ ఇంజక్షన్లు ఇవ్వాలి. లేదంటే పిచ్చిపడుతుంది. గత పదేళ్లకు పైగా కుక్కల నియంత్రణకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఒక్క నెల్లూరు నగరంలోనే కుక్కల సంతతి 17 వేలకు పైగా పెరిగిందని అధికారులు అంచనావేశారు. చట్టం ప్రకారం కుక్కల నియంత్రణకు కార్పొరేషన్, స్థానిక సంస్థలు వాటికి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించాలి. 10 ఏళ్ల క్రితం మాత్రమే నెల్లూరు నగరంలో అరకొర ఆపరేషన్లు జరిగాయి. తరువాత ఆపరేషన్లు మాట మరిచారు. నగరంలో కుక్కల నియంత్రణకు అంటూ ఒక న్యాయవాది స్వచ్ఛందసంస్థ పేరుతో కల్లూరుపల్లి వద్ద 5 ఎకరాల స్థలాన్ని పొందారు. ఆ స్థలం విలువ కోట్లాది రూపాయలు. అయితే కుటుంబ నియంత్రణ జరగలేదు. అక్కడకు వీధి కుక్కలను తరలించలేదు. దీంతో కుక్కల సంతతి విపరీతంగా పెరిగి పోయింది. పెద్దాస్పత్రిలో రోజుకి 22 నుంచి 27 మంది వరకు కుక్కకాటుకి ఇంజక్షన్లు వేయించుకుంటున్నారు. అలాగే రెడ్‌క్రాస్ ఏఆర్వీ సెంటర్లో రోజుకి 60 నుంచి 70 మంది వరకు ఇంజక్షన్లు వేయించుకుంటున్నారు. ఒక్కో పీహెచ్సీలో సరాసరి రోజుకి ముగ్గురు నుంచి నలుగురు కుక్కకాటుకి ఇంజక్షన్లు వేయించుకుంటున్నారు. పిహెచ్సీల్లోనూ ఇబ్బందులే.. జిల్లాలో 75 పీహెచ్‌సీలున్నాయి. 14 సీహెచ్‌సీలున్నాయి. పీహెచ్‌సీల్లో కుక్కకాటుకి, పాముకాటుకి మందులున్నాయి. గత సంవవత్సరం కన్నా ఈ సంవత్సరం సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో వీటికి సంబంధించిన ఇంజక్షన్లు నిల్వ ఉన్నాయి. అయితే కొన్ని పీహెచ్‌సీల నుంచి డాక్టర్లు సకాలంలో ఇండెట్లు పెట్టనందున అలాంటి పీహెచ్‌సీలకు సకాలంలో ఈ ఇంజక్షన్లు అందడం లేదని తెలుస్తోంది. ఆస్పత్రి అభివృద్ధి నిధుల (హెచ్డీఎఫ్) నుంచి అత్యవసరమైన ఇంజక్షన్లు డాక్టర్లు కొనుగోలు చేయవచ్చు. పాము కాటుకి గురైతే విషం తీవ్రతను బట్టి ఒకటి నుంచి 20 వరకు యాంటీ స్నేక్ వీనమ్ ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంది. కొంతమంది డాక్టర్లు రెండు, మూడు డోసులు మాత్రమే ఇంజక్షన్లు ఇచ్చి రికార్డుల్లో ఏడెనిమిది ఇచ్చినట్టు రాస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తక్కువ ఇచ్చి ఎక్కువ రాసుకుని వ్యత్యాసం ఉన్న ఇంజక్షన్లుకి సంబంధించిన నగదును తమ జేబుల్లోకి వేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులో ఉంది అన్ని పీహెచ్‌సీల్లో సరిపడనంతా కుక్కకాటుకి ఏఆర్వీ, పాముకాటుకి ఏఎస్వీ వైల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇబ్బందిలేదు. కొరత ఏర్పడినట్టు మా దృష్టికి తీసుకొస్తే విచారించి చర్యలు చేపడుతాం. – డా.వరసుందరం, జిల్లా ఆరోగ్యశాఖాధికారి -
తప్పుల తడకగా మెరిట్ జాబితా
– వైద్య ఆరోగ్యశాఖలో నిర్లక్ష్యం – పీహెచ్సీ అభ్యర్థుల ఆందోళన కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో కొత్తగా మంజూరైన నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసేందుకు పలు పోస్టులకు అధికారులు వెల్లడించిన మెరిట్ జాబితా తప్పుల తడకగా మారింది. ప్రతి పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్, ఫార్మాసిస్టు, స్టాఫ్‌నర్సు, ల్యాబ్‌టెక్నీషియన్ పోస్టులకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. 12 స్టాఫ్‌నర్సు పోస్టులకు 1,406 మంది, నాలుగు ఫార్మాసిస్టు పోస్టులకు 600 మంది, నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు 600 మంది, 8 మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 100 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల దరఖాస్తుల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు మెరిట్ జాబితాను తయారు చేసి ఈ నెల 13వ తేదీన వెబ్సైట్లో, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రదర్శించారు. కాగా ఈ మెరిట్ జాబితాపై పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై డీఎంహెచ్‌వో కార్యాలయ ఏడీ కృష్ణప్రసాద్‌ను వివరణ కోరగా తక్కువ సమయంలో మెరిట్ జాబితాను తయారు చేయడం వల్ల కొన్ని తప్పులు దొర్లి ఉంటాయని, అందుకే మెరిట్ జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తున్నామన్నారు. అభ్యంతరాల ఆధారంగా జాబితాను మళ్లీ మారుస్తామని తెలిపారు. తప్పుల తడకగా మెరిట్ జాబితా 1. కర్నూలు నగరానికి చెందిన పి.హుసేన్ కుమార్తె పి.షరీఫా వాస్తవంగా బీసీ–బి అయితే మెరిట్ జాబితాలో ఆమెను బీసీ–డీగా చూపారు. అంతేగాక ఆమెను అతడుగా మార్చేశారు. 2. సీరియల్ నెంబర్ 332లోని బి.బాలరాజు డీఎంఎల్టీ చదివి ల్యాబ్‌టెక్నీషియన్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. అతను 2009 జూన్‌లో కోర్సు పూర్తి చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏడేళ్లు పూర్తయ్యింది. కానీ అధికారులు మాత్రం ఆరేళ్లుగా చూపారు. 3. సీరియల్ నెంబర్ 356లోని పుల్లూరు సుధాకర్ ఒకేషనల్‌లో ఎంఎల్టీ పూర్తి చేశారు. అతని సరాసరి మార్కులు వెయ్యి కాగా 550కి చూపారు. అది కూడా 550 మార్కులకు అతనికి 560 మార్కులు వచ్చాయని పేర్కొన్నారు. 4. సీరియల్ నెంబర్ 34 బీఎన్ఎస్ గౌరికుమారి బిఎస్సీ ఎంఎల్టీ పూర్తి చేశారు. ఆమె సరాసరి మార్కులు 1450 కాగా అధికారులు మాత్రం 1150గా చూపించారు. -
సర్కారీ వైద్యానికి కార్పొ‘రేట్’ సూది!
పట్టణ ఆరోగ్యం ప్రైవేట్‌కు ♦ 193 ఆరోగ్య కేంద్రాలు ప్రైవేట్ ఆధ్వర్యంలో నిర్వహణకు టెండర్లు ♦ వైద్య సేవల నుంచి సర్కారు తప్పించుకునే ఎత్తుగడ ♦ అత్యాధునిక సేవల పేరుతో ప్రైవేట్‌కు ఏటా రూ.కోట్లలో చెల్లింపు ♦ ఆ డబ్బుతో సర్కారీ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేరా?.. యంత్రాలు, పరికరాలు కొనలేరా? ♦ సర్కారు చర్యలపై కోర్టును ఆశ్రయించిన ఎన్జీవోలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రులను ఒకటొకటిగా కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు సర్కారు సిద్ధమైంది. గతంలో చిత్తూరు జిల్లా ఆస్పత్రిని అపోలో యాజమాన్యానికి అప్పగించిన సర్కారు ఇటీవల ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు, ఇతర సేవలకు ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టింది. తాజాగా రాష్ట్రంలోని 193 పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు టెండర్లు పిలిచింది. ఇప్పటివరకూ వివిధ ప్రభుత్వేతర సంస్థలు(ఎన్జీవో) నిర్వహిస్తున్న ఈ కేంద్రాలను ఇకపై ఇ-యూపీహెచ్సీ (ఎలక్ట్రానిక్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్) పేరిట ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తాయి. ఇందుకోసం ఏడాదికి రూ.81 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇది వైద్య సేవలనుంచి సర్కారు తప్పించుకునే ప్రయత్నాల్లో భాగమేనన్న విమర్శలు వినవస్తున్నాయి. ప్రైవేటు సంస్థలకిస్తున్న రూ.81 కోట్లతో రాష్ట్రంలోని 1072 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 32 ఏరియా ఆస్పత్రులు, ఎనిమిది జిల్లా ఆస్పత్రులు, 193 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సరైన సౌకర్యాలు కల్పిస్తే ప్రజలకు దీర్ఘకాలం సేవలు అందిస్తాయని సూచిస్తున్నారు. అయితే ఈ కేంద్రాలను ప్రైవేటు సంస్థలకు అప్పజెబితే అత్యాధునిక సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. పట్టణాల్లోని అర్బన్ హెల్త్ సెంటర్లకు మురికివాడల్లోని పేద ప్రజలు వస్తారని, వారికి వైఫై, ఇంటర్నెట్... తదితర సేవలు అవసరమా అనే ప్రశ్న తలెత్తుతోంది. మూడు జోన్లుగా విభజించి... రాష్ట్రంలోని 193 పట్టణ ఆరోగ్య కేంద్రాలను వివిధ ఎన్జీవోలు నిర్వహిస్తున్నాయి. వీటిలో పది కేంద్రాలను ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రభుత్వం మొదట టెండర్లు పిలిచింది. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రి యాజమాన్యం నేరుగా సీఎంతో మంతనాలు జరిపింది. ఫలితంగా ప్రభుత్వం ఆ టెండర్‌ను రద్దుచేసి మొత్తం 193 పట్టణ ఆరోగ్య కేంద్రాల అప్పగింతకు రెండు నెలల కిందట టెండర్లను ఆహ్వానించింది. రాష్ట్రంలోని 13 జిల్లాలను మూడు జోన్లుగా విభజించి, ఒక్కో జోన్‌కు ప్రత్యేకంగా టెండర్లు పిలిచారు. జోన్-1లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలున్నాయి. జోన్-2లో పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు, జోన్-3లో నెల్లూరు, కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలున్నాయి. ప్రస్తుతం ఎన్జీవోలకు ఒక్కో యూపీహెచ్సీకి నెలకు రూ.1.40 లక్షల వరకూ ఇస్తుండగా, ప్రైవేటు సంస్థలు వేసిన ఎల్1 రేట్ల ప్రకారం రూ.3.5 లక్షల వరకూ ఉంటుందని అధికారుల అంచనా. ఈ లెక్కన ఏడాదికి నిర్వహణ పేరిట రూ.81 కోట్లను కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వం చెల్లించనుంది. ఆర్థిక బిడ్లు కూడా ఓపెన్ చేశామని, టెండరు దక్కించుకున్న సంస్థల వివరాలు వెల్లడిస్తామని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ చెప్పారు. అయితే రాష్ట్రంలోని మొత్తం 193 పట్టణ ఆరోగ్య కేంద్రాలనూ ఒక ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యానికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం వివిధ మార్గదర్శకాలను రూపొందించిందనే అభిప్రాయాలు వైద్యవర్గాల నుంచే వ్యక్తమవుతున్నాయి. గతంలో చిత్తూరు జిల్లా ఆస్పత్రిని కూడా ఇదే విధంగా 33 సంవత్సరాలు అపోలో యాజమాన్యానికి లీజుకు ఇచ్చి, మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సహకరించడంద్వారా దాదాపు రూ.300 కోట్లు లబ్ధి చేకూర్చారని వారు గుర్తుచేస్తున్నారు. ప్రైవేటుకు దోచిపెట్టే యత్నాలే... ఆధునిక సేవల పేరిట ఆర్బన్ హెల్త్ సెంటర్లను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పే ప్రయత్నాలపై పలు విమర్శలు వస్తున్నాయి. ఈ అంశంపై ఎన్జీవోలు ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. సెంటర్లకు ప్రభుత్వమే నిర్వహించాలని లేదా తమకు అప్పజెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. టెలీ మెడిసిన్ పేరిట పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే యత్నాలను వైద్య నిపుణులు సైతం విమర్శిస్తున్నారు. ఏజెన్సీలు లేదా మారుమూల ప్రాంతాల్లో టెలీ మెడిసిన్ అవసరం ఉంటుందే తప్ప అర్బన్ ప్రాంతాల్లో దాని అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం దఫదఫలుగా వైద్య సేవలనుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే రక్తపరీక్షల నుంచి వైద్య పరికరాల నిర్వహణ వరకూ పలు సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పింది. అందుకోసం ఆయా సంస్థలకు కోట్లది రూపాయలు కట్టబెడుతోంది. ఆ సంస్థలు లాభాపేక్షతోనే పనిచేస్తున్నాయే తప్ప రోగులకు సేవలందించడంలో శ్రద్ధ చూపడంలేదన్న విమర్శలున్నాయి. అదే మొత్తాన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఎక్స్‌రే, ఈసీజీ లాంటి యంత్రాలకు వెచ్చిస్తే శాశ్వతంగా ఉంటాయి. పది కాలాలపాటు ప్రజలకు సేవలందిస్తాయి. ప్రైవేటు సంస్థలకు ఇచ్చే డబ్బుతో ప్రభుత్వాసుపత్రుల్లో స్పెషలిస్టులను నియమిస్తే ప్రజలకు విస్తృతంగా మెరుగైన వైద్య సేవలందుతాయని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. అవసరమైన మేరకు నిధులివ్వకుండా, నిపుణులను నియమించకుండా, ఆధునిక పరికరాలను సమకూర్చకుండా ప్రభుత్వ ఆస్పత్రులను నిర్వీర్యం చేసి, వాటిపై ప్రజలకు వ్యతిరేకత వచ్చేలా చేసి, ఆ తర్వాత ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పాలన్న ప్రభుత్వ పెద్దల వ్యూహంలో భాగంగానే ఈ వ్యవహారాలు నడుస్తున్నాయని వారు విమర్శిస్తున్నారు. -
భవనాలకు అమరవీరుల పేర్లు
జైపూర్: రాజస్థాన్ లోని ఓ గ్రామం అమర జవానుల గౌరవాన్ని ఇనుమడింపజేస్తూ వారి కీర్తిని పతాకస్థాయికి చేరుస్తోంది. సికర్ జిల్లాలోని దీన్వా లడ్కానీ గ్రామ ప్రజలు అమరవీరుల జ్ఞాపకార్ధంగా అక్కడి పాఠశాలలు, వైద్యశాలలు తదితర ప్రభుత్వ భవనాలకు అమరజవానుల పేర్లను పెడుతున్నారు. ఇప్పటివరకు గ్రామం నుంచి సైన్యంలోకి వెళ్లిన 9 మంది జవానులు అమరులయ్యారు. వీరిలో 8 మంది పేర్లను గ్రామంలోని ప్రభుత్వ భవనాలకు పెట్టారు. వీరి తర్వాత అమరుడైన సూరజ్ బుడానియా పేరును గ్రామ హెల్త్ కేర్ సబ్ సెంటర్ కు పెట్టాలని గ్రామస్తులు మెడికల్ ఆఫీసర్ ను కోరారు. గ్రామస్తుల కోరికపై ప్రభుత్వానికి వినతిపత్రాన్ని పంపినట్లు ఆయన తెలిపారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం అందుకు ఒప్పుకున్నట్లు వివరించారు. ప్రభుత్వ నిర్ణయంపై బుడానియా కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తంచేశారు. 2010 ఆగస్టు 18న బుడానియా అమరులైనట్లు సోదరుడు రాజేష్ బుడానియా వెల్లడించారు. అప్పటినుంచి హెల్త్ సబ్ సెంటర్ కు సూరజ్ బుడానియా పేరును పెట్టాలని డిమాండ్ చేస్తున్నట్లు వివరించారు. -
ఎన్నాళ్లీ వేతన వెతలు
నిజామాబాద్ అర్బన్ : ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఎలాంటి ప్రయోజనాలు అందక కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు తీవ్ర ఇబ్బం ది పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 377 ఉప కేంద్రాలు, 17 క్లస్టర్ల పరిధిలో కొనసాగుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒకరిద్దరు చొప్పున కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు ప్రతి ఆరోగ్య ఉప కేంద్రానికి ఒక కాంట్రాక్ట్ ఏఎన్ఎం కొనసాగుతోంది. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య కేంద్రానికి ముగ్గురు కొనసాగుతున్నారు. 487 మంది కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు కొనసాగుతున్నారు. వీరిలో కొంత మందిని యురోపియన్ స్కీం కింద మరికొందరిని నేషనల్ గ్రామీణ హెల్త్ మిషన్, మరికొందరిని ఆర్సీహెచ్-2 స్కీం కింద నియమించారు. 2001 నుంచి 2007 వరకు జిల్లా కలెక్టర్ పరిధిలో ఇంటర్వ్యూలు, రోస్టర్ రిజర్వేషన్ ప్రకారం నియామకాలు చేపట్టారు. దీనికి సంబంధించి కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు 186 మంది ఉన్నారు. 2007 తరువాత ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆస్పత్రి అభివృద్ధి సంఘం కమిటీ ఆధ్వర్యంలో మరికొందరిని నియమించారు. వీరిని అవుట్సోర్సింగ్ కింద పరిగణిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం ఐదేళ్లు కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగిన, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రొస్టర్ రిజర్వేషన్ నియమితులైన వారిని రెగ్యులర్ చేస్తామని ప్రకటించింది. దీని ప్రకారం 186 మంది కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు రెగ్యులర్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇందులో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు నిబంధనల్లో తరచు మార్పులు తీసుకురావడంతో ఏఎన్ఎంలు అయోమయం చెందుతున్నారు. కాంట్రాక్ట్ ఏఎన్ఎంలకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ గతేడాది కాంట్రాక్ట్ గడువు ఏడాది ముగిసిన తరువాత మరో ఏడాదికి బాండ్ పేపర్ ద్వారా కాంట్రాక్ట్‌ను సమర్పించాల్సి ఉంది. ఇందులో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను అవుట్సోర్సింగ్ కింద పరిగణిస్తూ రాయించుకున్నారు. దీని వల్ల ప్రస్తుత రెగ్యులరైజ్‌కు వీరిని అనర్హులుగా చూపెడుతున్నారు. జిల్లా అధికారులు చేసిన తప్పిదాలకు అర్హులైన కాంట్రాక్ట్ ఏఎన్ఎంలకు తీరని అ న్యాయం జరుగుతోంది. ఈ విషయంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కలెక్టర్ యోగితారాణా దృష్టికి తీసుకెళ్లా రు. తమను ఎలాగైన రెగ్యులర్ చేయాలని 10 రోజులుగా విధులు బహిష్కరించి నిరసనలు చేస్తున్నారు. డిమాండ్లు పదో పీఆర్సీ నుంచి వేతనాలు ఇవ్వాలి కనీస వేతనం రూ.21,300తోపాటు, డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులు కల్పించాలి. వ్యాక్సిన్ అలవెన్సు రూ.500లు, యూనిఫాం అలవెన్సుకు 1,500లు, ఎఫ్‌టీఏ రూ.550లు, 35 క్యాజువల్ లీవ్స్, 180రోజులు వేతనాలతో కూడిన మెటర్నిటీ లీవ్‌లు మంజూరు చేయాలి. సబ్ సెంటర్లకు అద్దె వెయ్యి, స్టెషనరీ, జిరాక్స్ ఖర్చులు ఇవ్వాలి, అన్ టైడ్ ఫండ్స్ పెంచాలి, ఏఎన్ ఎంలకు పర్యవేక్షణ బాధ్యత మాత్రమే ఇవ్వాలి నైట్ డ్యూటీలు, ఓపీ డ్యూటీలు రద్దు చేయాలని, బదిలీకి అవకాశం కల్పించి, విధి నిర్వహణలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ఆరోగ్య బీమా, ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం, ట్రాకింగ్ చేయుటకు ప్రతి పీహెచ్ సెంటర్‌కు ఒక డాట ఎంట్రీ ఆపరేటర్‌ను నియమించాలి. రెగ్యులరైజ్ చేయాలి రెగ్యులర్ ఏఎన్‌ఎంలతోపాటు సమానంగా విధులు నిర్వహిస్తున్నాం. మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. సంవత్సరాల తరబడి పనిచేస్తునా మాకు ఎలాంటి ప్రయోజనం లేదు. ప్రభుత్వం ఇకనైన మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. - పద్మ, కాంట్రాక్ట్ ఏఎన్ఎం హామీలు అమలు చేయాలి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు రెగ్యులర్ చేయడం లేదు. వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఏళ్ల తరబడి పనులు చేస్తున్నాము. మమ్మల్ని వెంటనే రెగ్యూలర్ చేయాలి. - స్వరూప, కాంట్రాక్ట్ ఏఎన్ఎం -
వైద్యులు మాయం
సాక్షి, గుంటూరు : గ్రామీణ ప్రాంత ప్రజలకు నిరంతరం అత్యవసర వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో జిల్లాలో 32 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 24 గంటల ఆసుపత్రులుగా మార్చారు. వీటికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారు. అయితే వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఈ ఆసుపత్రులకు వెళ్ళాలంటేనే రోగులు భయపడుతున్నారు. ఇక్కడ పనిచేసే వైద్యులు ప్రైవేటు ఆసుపత్రులు నడుపుతూ అక్కడే ఉంటున్నారు. ఎక్స్‌రే, రక్తపరీక్షా కేంద్రాలు పనిచేయని స్థితిలో ఉన్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వచ్చిన రోగులకు నర్సులే ప్రాథమిక వైద్య సేవలు అందించి పెద్దాసుపత్రులకు పంపి చేతులు దులుపుకుంటున్నారు. జనరేటర్ సౌకర్యం లేక, రాత్రి వేళల్లో కరెంటు పోతే కొవ్వొత్తుల వెలుగులో కాన్పులు చేస్తున్నారు. కొన్ని సంఘటనలను పరిశీలించండి.. ► ప్రకాశం జిల్లా మార్టురుకు చెందిన మహమ్మద్ బాషా ప్రత్యర్థుల దాడిలో తలపగలడంతో అపస్మారక స్థితికి వెళ్లాడు. బంధువులు 108వాహనంలో శనివారం రాత్రి 9గంటలకు చిలకలూరిపేటలోని ప్రభుత్వాసుత్రికి తీసుకువచ్చారు. డ్యూటీ డాక్టర్ లేకపోవటంతో సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసి ఆయనకు కబురు చేశారు. డ్యూటీ డాక్టర్ 9.40గంటలకు వచ్చి పరిస్థితి తీవ్రంగా ఉందంటూ గుంటూరు ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేసి వెళ్ళిపోయారు. ► చిలకలూరిపేట వడ్డెరపాలెంకు చెందిన మల్లెల వెంకటేశ్వర్లు(42) ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య మల్లెల కుమారి బంధువుల ట్రాలీ ఆటోలో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. పట్టించుకొనేవారు లేకపోవటంతో రాత్రి 11 గంటల వరకు మృతదేహం ఆటోలోనే ఉంది. ► కొల్లిపరలో స్టాఫ్‌నర్సు, స్వీపర్ మినహా ఒక్కరూ కూడా ఆసుపత్రిలో లేరు. ఆసుపత్రి పొలాల్లో ఉండటం, రోగులు ఎవరూ లేక ఇద్దరు మహిళలూ బిక్కుబిక్కుమంటూ కూర్చోవాల్సిన దుస్థితి. ► మాచర్ల, వినుకొండ, సత్తెనపల్లి, గురజాల ఆసుపత్రుల్లో సైతం రాత్రి వేళల్లో వైద్యులు అందుబాటులో లేరు. గుంటూరు నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో రాత్రి వేళ రోగులు ఆసుపత్రులకు వెళ్ళడమే మానుకున్నారు. ఇంత అధ్వానంగా ఉన్నా వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు మాత్రం చూసీచూడనట్లు మిన్నకుంటున్నారు. ► గురజాల మండలం మాడుగులలోని ఆసుపత్రి రాత్రి 9 గంటలకు తాళాలు వేసి కనిపించింది. -
అధర్మాసుపత్రి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇదే పరిస్థితి, ఇవే సమస్యలు. ఈ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు... రోగులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు ‘సాక్షి’ సోమవారం జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను పరిశీలించింది. ఆ వివరాలు సాక్షి పాఠకులకు ప్రత్యేకం. ప్రభుత్వ నిర్లక్ష్యం.. వైద్యుల అలసత్వం... అరకొర వసతులు రోగులపాలిట శాపంగా మారాయి. అందుకు నిదర్శనం... జిల్లాకేంద్రమైన నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రే . ఉదయం 9 గంటలకు రావాల్సిన వైద్యులు అనేకమంది తీరిగ్గా ఉదయం 10 గంటల నుంచి రావటం కనిపించింది. అలా 11.30 వరకు వస్తూనే ఉన్నారు. వచ్చిన వైద్యులు వెంటనే విధుల్లోకి వెళ్తారా? అంటే అదీ లేదు. కొంతసేపు కాలక్షేపం చేసి ఆయా వార్డులకు వెళ్లారు. పట్టుమని గంట పని చేశారు. క్యాజువాలిటీ మినహా మధ్యాహ్నం 12.30 కంతా వైద్యులు బ్యాగులు సర్దుకుని వెళ్లటం కనిపిం చింది. ఇది ఒక్క నెల్లూరులోనే కాదు.. ఒకటి రెండుచోట్ల మినహా దాదాపు అన్నిచోట్లా ఇదే పరిస్థితి కనిపించింది. నెల్లూరు ఆసుపత్రిలోని గుండెకు సంబంధించిన వార్డు 11.45కి తెరుచుకుంది. రోగులు మాత్రం ఉదయం 7.30 నుంచే ఆసుపత్రికి చేరుకోవటం కనిపించింది. ఓపీ ఫుల్.. సేవలు నిల్ వివిధ ప్రాంతాల నుంచి నెల్లూ రు ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన వారు 1,030 మంది ఉన్నారు. అయితే చాలామంది వైద్యులు హాజరుకాలేదు. వచ్చి న వారు కూడా విధుల్లో ఉండకపోవటంతో... జూనియర్ డాక్టర్లే సేవలందించటం కనిపించింది. జిల్లావ్యాప్తంగా అన్ని ఆసుపత్రులకు జనం వైద్యం కోసం పెద్దఎత్తున రావటం కనిపించింది. అయితే వైద్యసేవలు మాత్రం అంతంత మాత్రమే. ఇకపోతే వైద్యులు ఆలస్యంగా రావటం తో అనేకమంది చికిత్సలు చేయించుకోకనే వెనుదిరుగుతున్నారు.అదెలాఅంటారా... రోగు లు ఓపీ కోసం 20 నిమిషాలు వేచి ఉంటారు. అక్కడి నుంచి డాక్టర్ వద్ద కెళ్తారు. అక్కడా అరగంట వేచి ఉంటారు. ఆ డాక్టర్ పరీక్ష చేసుకురమ్మని పంపుతారు. అక్కడా మరో గంట. అన్నీ తీసుకుని వచ్చేసరికి సీట్లో డాక్టర్ ఉండరు. అదేవిధంగా ఆరోగ్య కేంద్రా ల్లో అవసరమైన డాక్టర్లు లేకపోవటం కూడా మరో కారణం. చిల్లకూరు మండలం చింతవరం, విడవలూరు మండలం రామతీర్థం పీహెచ్‌సీల్లో డాక్టర్లు లేకపోవటంతో స్టాఫ్‌నర్సులే అన్నీ తానై వ్యవహరించటం కనిపించింది. ఇలా జిల్లావ్యాప్తంగా అనేక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. పనిచేయని ల్యాబ్‌లు నెల్లూరు ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ పనిచేయటం లేదు. జిల్లావ్యాప్తంగా దాదాపు ఎక్స్‌రేలు, స్కానింగ్ సెంటర్లు, ల్యాబ్‌లు పనిచేయటం లేదు. అదేవిధంగా రక్త పరీక్ష కేంద్రాలు కూడా అనేకచోట్ల తూతూమంత్రంగా పనిచేస్తున్నాయి. ఉన్న పరికరాలు కాలం చెల్లినవి కావటంతో తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ఒకవేళ పనిచేసినా.. సిబ్బంది లేకపోవటంతో పరీక్షల కోసం రోగులకు తిప్పలుతప్పటం లేదు. ప్రైవేటు పరీక్ష కేంద్రాలను ఆశ్రయిస్తూ.. జేబులకు చిల్లుపెట్టుకుంటున్నారు. ఆసుపత్రిలో మందుల్లేవ్.. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం వెళ్లిన రోగులకు మందులు ఇవ్వకుండా చీటీలు రాసి బయటకు పంపేస్తున్నారు. కొన్ని మందులు ఉన్నా సగమే ఇచ్చి వాటితో సర్దుకోమని చెప్పి పంపటం కనిపించింది. ముఖ్యంగా బీకాంప్లెక్స్, క్రిమాఫిన్, యానోబ్లిస్ ఆయింట్మెంట్ వంటి మందులు లేకపోవటం గమనార్హం. మందులని రోగులు అడిగితే ‘లేవ్ లేవ్ పో పో.. చెప్పేది నీకే.. వినపడట్లేదా’ అంటూ కసురుకుంటున్నారు. ఆసుపత్రిలో వీల్‌చైర్, స్ట్రెక్చర్ కావాలంటే రూ.50 ఇవ్వాలి. ఇస్తేనే సిబ్బంది రోగులను తీసుకెళ్తారు. రూ.10, రూ.20 ఇస్తే మేం బిచ్చగాళ్లమా అని సిబ్బంది కేకలు వేస్తున్నారు. ప్రసూతి కేంద్రంలో స్కానింగ్ పనిచేయకపోవటంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆసుపత్రుల్లో దాహం దాహం జిల్లావ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో నీటి కొరత తీవ్రంగా ఉంది. నెల్లూరు ఆసుపత్రిలో దాతల సాయంతో ఏర్పాటు చేసిన మినరల్‌వాటర్ ప్లాంట్ నిరుపయోగంగా మారింది. దీంతో రోగులు, సిబ్బంది నీళ్లబాటిల్ కొనుగోలు చేసుకుని రావటం కనిపించింది. అదే విధంగా గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు, కావలి, సర్వేపల్లి తదితర ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో నీరులేక రోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అపరిశుభ్రంగా ఆసుపత్రులు ఆసుపత్రుల పరిసరాలన్నీ అపరిశుభ్రం గా దర్శనమిస్తున్నాయి. ఎక్కడచూసిన మురుగునీరు, పందులు, కుక్కలు, వాడిపడేసిన సిరంజిలు, మాస్క్‌లు, గ్లౌజులు, సెలైన్ బాటిల్స్ కుప్పలు కుప్పలుగా ఉండటంతో ఆ ప్రాంతం దుర్వాస న వెదజల్లుతోంది. పెద్దాసుపత్రి మొత్తం వార్డులో దుర్వాసన ఎక్కువగా ఉంది. ముఖ్యంగా బర్నింగ్ వార్డు మరీ అధ్వానంగా ఉంది. ఇలా జిల్లావ్యాప్తంగా ఆసుపత్రులకు నిర్లక్ష్యపు జబ్బు సోకటంతో వైద్యం అందని ద్రాక్షలా మారింది. -
వైద్యం... చోద్యం!
గుంటూరు మెడికల్ : జిల్లావ్యాప్తంగా 77 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ), 680 ఉప ఆరోగ్య కేంద్రాలు, 17 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 24 గంటలు వైద్యసేవలు అందించే ఆరోగ్య కేంద్రాలు 32 ఉన్నాయి. ప్రభుత్వం ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసేందుకు 177 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను మంజూరు చేయగా 43 ఖాళీలు ఉన్నాయి. పుష్కరకాలంగా వైద్యుల పోస్టులు భర్తీ కాక, ఉన్న వైద్యులు పని భారంతో అల్లాడిపోతున్నారు. స్పెషాలిటీ వైద్యుల పోస్టులను ఆరు కేటాయించగా కేవలం ఒక్క వైద్యుడు మాత్రమే పనిచేస్తున్నారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పోస్టులు 21 ఖాళీగా ఉన్నాయి. ఆస్పత్రికి వచ్చే రోగులకు మందులు ఇచ్చేందుకు ఫార్మసిస్టులు కూడా లేని ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయంటే ఎలాంటి దుస్థితి నెలకొని ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫార్మసిస్టులు 88 పోస్టులకు 52 మంది మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. రక్తపరీక్షలు చేసి జ్వరం ఉందా లేదా అని నిర్ధారించి చెప్పేందుకు ల్యాబ్ టెక్నిషియన్లు కూడా లేకపోవటంతో గ్రామీణు రోగులకు కష్టాలు తప్పటం లేదు. 35 ల్యాబ్ టె క్నిషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఏఎన్ఎం పోస్టులు ... గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ఆరోగ్య కార్యక్రమాల గురించి వివరించి రోగాల బారిన పడకుండా అవగాహన కల్పించటంలో కీలకమైన ఏఎన్ఎం పోస్టులు కూడా అధిక సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం 679 పోస్టులు కేటాయించగా 126 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 553 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏళ్లతరబడి చాలీచాలని జీతంతో నెట్టుకొస్తున్నారు. మల్టీపర్పస్‌హెల్త్ వర్కర్ పోస్టులు 447 ఖాళీగా ఉండగా, 200 మంది కాంట్రాక్ట్ పద్ధతిన పని చేస్తున్నారు. నాల్గవ తరగతి ఉద్యోగుల పోస్టులు 133, డ్రైవర్ పోస్టులు 18, అసిస్టెంట్ పారామెడికల్ ఆఫీసర్ పోస్టులు 39 ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ కేడర్లకు చెందిన 3,677 పోస్టులను ప్రభుత్వం కేటాయించగా 947 ఖాళీగా ఉన్నాయి. సమయపాలన పాటించరు... పని చేసే చోటే నివాసం ఉండాలనే నిబంధనను ఏ ఒక్కరూ పాటించడం లేదు. ఉదయం 10 గంటలకు రావాల్సిన వైద్యులు, సిబ్బంది మధ్యాహ్నం 12 గంటలకు కూడా ఆసుపత్రులకు చేరుకోవడం లేదు. తిరిగి 2 గంటలకు ఇళ్లకు పయనమవుతు న్నారు. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు నర్సులు, ఆయాలే వైద్య చికిత్సలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండటం లేదు. 24 గంటలు వైద్యసేవలు అందించే ఆరోగ్య కేంద్రాల్లో రాత్రి వేళల్లో వైద్యం అంతంత మాత్రంగానే ఉంది. పారిశుద్ధ్యం చెప్పకోతగిన రీతిలో ఉండటం లేదు. మూత్రశాలలు రోగులు వినియోగించేందుకు ఏ మాత్రం అనుకూలంగా లేవు. ఇప్పటికైనా జిల్లా అధికారులు సమ స్యలపై స్పందించి నాణ్యమైన వైద్యసేవలు అందించేలా కృషి చేయాలని రోగులు కోరుతున్నారు. -
కడుపు కోత!
జిల్లాలో పెరుగుతున్న మాతా, శిశు మరణాలు పురిటిలోనే చనిపోతున్నా పట్టించుకోని ప్రభుత్వం అధికారుల చర్యలు కాగితాలకే పరిమితం అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అంటే ఇదేనేమో! తగినన్ని మౌలిక వసతులు.. దండిగా నిధులున్నా వైద్య, ఆరోగ్య శాఖ చిత్తశుద్ధిలోపం జిల్లా వాసులకు శాపంగా పరిణమించింది. జిల్లాలో మాతా, శిశు మరణాలను నివారించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోంది. జిల్లాలో 85 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 584 సబ్‌సెంటర్లు, 15 కమ్యూనిటీ హెల్త్, న్యూట్రీషియన్ క్లష్టర్స్, 13 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 35 రౌండ్ ది క్లాక్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 17 అర్బన్ హెల్త్ సెంటర్లు, 7 బోధనాసుపత్రులు... జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ మౌలిక వసతులు ఇవీ... సాక్షి, విశాఖపట్నం మాతా, శిశు మరణాలను తగ్గిస్తామని ప్రభుత్వం, అధికారులు చెబుతున్న మాటల్లో చిత్తశుద్ధికనిపించడం లేదు. మాతా, శిశు సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా మంజూరు చేసిన నిధులన్నీ వ్యయం చేశామని అధికారులు లెక్కలు చూపుతున్నారు. కానీ ఫలితం మాత్రం కనిపించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన నిధులు రూ.1.17కోట్లు. కేంద్ర ప్రభుత్వ జననీ శిశు సురక్ష కార్యక్రమం కింద ఏపీ వైద్య విధానపరిషత్ కమిషనర్ రూ.18,36,916 నిధులు విడుదల చేశారు. జననీ సురక్ష యోజనకు రూ.98,37,798 నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. జననీ శిశు సురక్ష కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితం గా విజయవంతంగా ప్రసవాలు చేయించాలి. గర్భిణికి ఉచితంగా పౌష్టికాహారం అందించడంతోపాటు రాను పోను దారి ఖర్చులు, మందులు, రక్తం వంటివి ఉచితంగా అందించాలన్నది ఈ పథకం ఉద్దేశం. కానీ ఈ ఏడాది సగం మందికి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరలేదు. ఇన్ని నిధులు కేటాయిస్తున్నా మాతా శిశు మరణాలు పెరగడం ఆశ్చర్యం కలిగించే అంశం. కారణాలు ఇవీ.. నివారణ చర్యలేవీ? రక్త హీనత, అధిక రక్తస్రావం, సకాలంలో వైద్యం అందకపోవడం, పౌష్టికాహార లోపం, అవగాహన లేమి తదితర కారణాలతోనే ఎక్కువుగా మాతా, శిశు మరణాలు సంభ విస్తున్నాయి. గిరిజన, గ్రామీణ ప్రాం తాల్లో ఈ మరణాలు రేటు ఎక్కువుగా ఉంటోంది. ఆ ప్రాంతాల్లో కొన్ని వ్యాధులు తీవ్రంగా ఉండటం, సమీపంలోని పీహెచ్‌సీలకు సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల గిరిజనుల్లో ఈ మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి.వీరి కోసం ప్రసవానికి వారం ముందే వైద్యుల సంరక్షణలో ఉండేలా పాడేరు డివిజన్లో 4 బర్త్ వెయిటింగ్ హోమ్‌లు నెలకొల్పారు. కానీ అక్కడకు ఎవరూ వెళ్లడం లేదు. సెకండ్ ఎఎన్ఎంలు కూడా 409 మంది మాత్రమే ఉన్నారు. 111పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీని వల్ల మారుమూల ప్రాంతాల గర్భిణు లు ప్రసవ సమయంలో ఆయాలను, స్థానిక మహిళల సహకారం పొందాల్సి వస్తోంది. ఆ సమయంలో బిడ్డ అడ్డం తిరిగినా, అధిక రక్తస్రావం జరిగినా ఆస్పత్రికి తరలించే అవకాశం లేక ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. అవగాహన కల్పించాల్సిన వైద్యాధి కారులు కనీసం పట్టించుకోకుండా వదిలేయడం అనర్థాలకు కారణమవు తోంది. అంబులెన్స్ అందుబాటులో లేక..పీహెచ్‌సీల అంబులెన్సులు అందుబాటులో లేకపోవడం వల్ల కూ డా మరణాలు చోటుచేసు కుంటు న్నాయి. ఇలాంటి సంఘటనే తాజాగా పెదబయలు మండలంలో వెలుగుచూ సింది. పెదబయలు మండలం అరడ కోట పంచాయతీ బొంగదారి గ్రామా నికి చెందిన గర్భిణి (34) ఈ నెల 18న కాన్పు కష్టమై మృతి చెందింది. శిశువు కూడా కడుపులోనే చనిపోయింది. ఆమెకు ఈ నెల 15న పురిటినొప్పులు రావడంతో పెదబయలు పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యాధికారి లేక పోవడంతో పాడేరు ఏరియ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి రక్తహీతన ఉందని, కాన్పు కష్టమని చెప్పి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు వెళ్లాలని సూచించారు. అయితే వారి చేతిలో చిల్లిగవ్వ లేక తిరిగి ఇంటికి తీసుకెళ్లడంతో మూడు రోజుల పాటు నరకయాతన అను భవించి మృతి చెందింది. వైద్య సిబ్బం దే చొరవ తీసుకొని ఆమెను ప్రభుత్వ అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించి ఉంటే తల్లీ బిడ్డా ప్రాణాలు దక్కేవి. ఆందోళనకరంగా మరణాల రేటు మాతా, శిశు మరణాలను అరికట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేసినట్లుంది. జిల్లాలో మాతా, శిశు మరణాలు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది మరణాలు పెరగడం అధికారుల నిర్లక్ష్యానికి దర్పణం పడుతోంది. జిల్లాలో 2013-14లో 692 మంది శిశువులు, 60 మంది తల్లులు మృతి చెందారు. 2014-15లో ఇప్పటి వరకు 1006 మంది శిశువులు, 72 మంది మాతృమూర్తులు చనిపోయారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతి పెద్ద వైద్యాలయమైన కేజీహెచ్‌తో సహా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా ప్రసూతి విభాగాల్లో కనీస సౌకర్యాలు లేవు. గత ఆర్థిక సంవత్సరంలో 70,908 ప్రసవాలు జరిగితే, ఈ ఏడాది ఇప్పటి వరకూ 55,636 ప్రసవాలు జరిగాయి.71 వేల ప్రసవాల్లో 696 మంది శివులు మరణిస్తే, ఈ ఏడాది 55వేల ప్రసవాల్లోనే 1006 మరణాలు జరిగాయి. ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే లోపు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సగటున ప్రతి వెయ్యి మంది శిశువుల్లో పద్దెనిమిది మంది పురిటిలోనే తుది శ్వాస వీడుతున్నారు. -
దూరంగా... భారంగా...
⇒ పల్స్‌పోలియోపై వైద్యుల నిరాసక్తత ⇒ ఆరు నెలలుగా అంధకారంలో ఆరోగ్య కేంద్రాలు ⇒ పని చేయని ఫ్రిజ్‌లు ⇒ వ్యాక్సిన్ నిల్వకు ఇబ్బందులు సాక్షి, హైదరాబాద్: జాతీయ పల్స్‌పోలియో కార్యక్ర మంపై వివిధ ఆరోగ్య కేంద్రాల వైద్యులు ఆసక్తి చూపడం లేదు. ఇది తమకు భారమవుతుందని భావిస్తూ...దూరంగా ఉంటున్నారు. ఆస్పత్రుల్లో విద్యుత్ లేకపోవడంతో వ్యాక్సిన్ నిల్వ చేసే ఫ్రిజ్‌లు పని చేయడం లేదు. వారం రోజుల ముందు సరఫరా చేసే వ్యాక్సిన్‌ను బయట పెడితే పాడైపోయే ప్రమాదం ఉంది. దీంతో వీటి నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు వెనుకాడుతున్నారు. ఆరోగ్య కేంద్రాలకు విద్యుత్ సరఫరా నిలిపివేసి ఆరు నెలలవుతున్నా... ఇంతవరకూ పునరుద్ధరించకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆరు నెలలుగా అంతే... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 96 ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఒక్క హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి పరిధిలోనే 85 ఉన్నా యి. ఇందులో 40కి పైగా ఆరోగ్య కేంద్రాల భవనాలు జీహెచ్ఎంసీకి చెందినవి. వీటిలో మాదన్నపేట్, గగన్‌మహల్, డీబీఆర్ మిల్స్, చింతల్‌బస్తీ, అఫ్జల్‌సాగర్, శాంతినగర్, ఆగపురా, కార్వాన్ -2, పానిపురా, పురాణాపూల్-2, మహరాజ్‌గంజ్, దూద్‌బౌలి, భోలక్‌పూర్, మెట్టుగూడ, బోయగూడ, శ్రీరాంనగర్, వినాయక్‌నగర్, తారా మైదాన్ (జూపార్క్ ఎదురుగా), కుమ్మరివాడి, తీగల్కుంట, చందలాల్ బారాదరి ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రాలకు 2013 మార్చి నుంచి ఇప్పటి వరకు విద్యుత్ బిల్లు చెల్లించలేదు. దీంతో డిస్కం అధికారులు ఇటీవల ఈ ఆస్పత్రులకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. వైద్యులు లేకపోవడంతో... ఇదిలా ఉంటే నగరంలోని పంజాషా-1, యాకుత్‌పుర-2, మెట్టుగూడ, మలక్‌పేట్, ఆగపురా, గగన్‌మహల్, నిలోఫర్ యూనిట్ ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్లు లేకపోవడంతో రోగులకు నర్సులే పెద్ద దిక్కవుతున్నారు. ఈ నెల 18న ప్రారంభం కానున్న పల్స్‌పోలియోలో పాల్గొనేందుకు జిల్లాలో సరిపడే స్థాయిలో వైద్యాధికారులు లేకపోవడమే కాక... ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన వ్యాక్సిన్ నిల్వకు ఆస్పత్రుల్లో వసతులూ కరువవుతున్నాయి. దీంతో నిర్వహణ బాధ్యతలకు ఆరోగ్య కేంద్రాల్లోని వైద్య సిబ్బంది జంకుతున్నారు. -
దప్పిక తీర్చే జలమార్గం వాటర్‌గ్రిడ్
చెరువులు, మంచినీటి వ్యవస్థ, రోడ్లు, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల వంటి సామూహిక ప్రయోజనాలను పాలకులు నిర్లక్ష్యం చేయటం వల్లనే పల్లెలు కన్నీరు పెడుతున్నాయి. ఇంతకాలం నీళ్లొదులుకున్న మంచినీళ్ల అంశాన్ని జలమార్గం పట్టిస్తానని కేసీఆర్ ప్రకటించడం కోట్లాది మంది హర్షించే అంశం. ఎక్కడైనా నదులు లేని చోట కూడా వంతెనలు నిర్మిస్తామని రాజకీయ నేతలు హామీ ఇస్తార న్నది జనసామెతగా మా రింది. కానీ రాజకీయ నేతలు ఎలా ఉండాలో ఆచరణాత్మకంగా చూపిన దార్శనిక నాయ కులు కూడా అనేక మంది ఉన్నారు. ప్రజలకు సాగు, తాగునీరు అందించిన రాజులు కూడా మనకు చరిత్ర పుటల్లో కనిపిస్తారు. కాకతీయుల కాలంలో, నిజాం పాలనలో నీటి వనరుల విని యోగాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. కాకతీయుల కాలంలో తవ్విన చెరువులే ఇప్ప టికీ తెలంగాణలో ప్రజల దప్పిక తీర్చు తున్నాయి. వరంగల్‌లో పాకాల చెరువు, రామప్ప చెరువు, ఇబ్రహీంపట్నం చెరువు వంటి అనేక పెద్ద చెరువులకు లింకు చెరువుల వ్యవ స్థను నెలకొల్పి, చెరువులను తవ్వించి సాగు తాగునీటి వసతులు తీర్చారు. తెలంగాణకు గుండెకాయగా ఉన్న చెరువు ల వ్యవస్థ క్రమంగా ధ్వంసమయ్యింది. ఇప్పు డు తెలంగాణ సాగు, తాగునీటి విషయంలో కటకటలాడుతోంది. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో కూడా వరి పంట ఉత్పత్తిలో కరీంనగర్ జిల్లా అగ్రస్థానంలో ఉండేది. ఇప్పుడు తెలంగాణ అన్నపూర్ణ కరీంనగర్ జిల్లాలో కూడా మంచినీటి సమస్య ఉంది. మొత్తం 10 జిల్లాల్లో మంచినీటి దాహార్తిని తీర్చటం అతి ముఖ్య తక్షణ కర్తవ్యం గా భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష కిలోమీటర్ల దూరం పైపులైన్లు వేసి గడప గడపకూ మంచి నీటి సౌకర్యం కల్పిస్తాననే పనిని భుజం మీద వేసుకున్నారు. హైదరాబాద్‌లో మంచినీటి సమస్య తీర్చటానికి నిజాం ప్రభుత్వంలో నాటి ఇంజ నీర్ అలీనవాబ్జంగ్ బహుదూర్ ఎంతో కృషి చేశారు. 1908లో హైదరాబాద్‌ను వరదలు ముంచేసినప్పుడు మోక్ష గుండం విశ్వేశ్వరయ్య హైదరాబాద్ నీటి వసతిపై ప్రత్యేక ప్రణాళిక తయారు చేశాడు. అలీన వాబ్ జంగ్ కృషితో ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్, జలాశ యాలను నిర్మించారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ను నిర్మించారు. ఇప్పటికీ హైదరాబాద్ దాహార్తిని ఆ రెండు సాగరాలే తీరుస్తున్నాయి. నిజాం పాలన తర్వాత మొత్తం తెలంగాణ 10 జిల్లాలకు సంబంధించి దాహార్తి తీర్చేందుకు కేసీఆర్ మంచినీటిని అందించే వాటర్‌గ్రిడ్ పథకానికి రచన చేశారు. విప్లవ పోరాటాలకు, కమ్యూనిస్టు ఉద్య మాలకు ఎర్రగడ్డగా చరిత్రకెక్కిన పోరాటాల పోతుగడ్డ నల్లగొండ ఇప్పుడు ఫ్లోరోసిస్ పెను భూతం వల్ల వంకర్లు కొంకర్లు తిరిగింది. ఫ్లోరోసిస్‌తో మరుగుజ్జుగా మారింది. అంగ వైకల్యానికి గురైంది. లక్షలాది మంది ప్రజలు దీనావస్థ పాలయ్యారు. ఈ సమస్యపై నాటి ఉద్యమకారుడు దుశ్చర్ల సత్యనారాయణ తన జీవితాన్నే అంకితం చేసి పోరాడాడు. అయినా పాలకుల మనసు కరుగలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా పాదయాత్ర చేపట్టిన కేసీఆర్ నల్లగొండ పర్యటనల్లో ఫ్లోరో సిస్ బాధితులను చూసి చలించిపోయాడు. కలం బట్టి పాట రాశాడు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని 2014 ఎన్నికల పర్యటనల్లో గర్జించాడు. అందులో భాగంగానే తెలంగాణ డ్రింకింగ్ వాటర్‌గ్రిడ్ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. హైదరాబాద్ మినహా తెలంగాణలోని 9 జిల్లాలకు నీటి సరఫరా విభాగం ద్వారా కోట్ల మందికి నీళ్లందిస్తున్నారు. 9 జిల్లాల్లో 146 సమగ్ర నీటి పథకాలు, 15,040 రక్షిత మంచి నీటి పథకాలు, 9019 మినీవాటర్ సప్లయ్ స్కీములు 6,506 నేరుగా నీటి పంపిణీ పథకం స్కీములు, 1,59,312 చేతి పంపుల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. వేలాది గ్రామాల్లో లక్షలాది మం ది ప్రజలకు ఈ నీటి సరఫరాను నిత్యం చేస్తున్నారు. అయినా అందరికీ తాగునీరు అందటంలేదని ప్రభుత్వ లెక్కలే తేల్చి చెబుతున్నాయి. అందుకే మొత్తం తెలం గాణ రాష్ట్రానికి నీటిని అందించేందుకు 1 లక్ష కిలోమీటర్ల మేరకు వాటర్ సప్లయ్ గ్రిడ్ పథకం ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టబోతున్నారు. తెలం గాణ వాటర్ గ్రిడ్ పథకాన్ని నల్లగొండ జిల్లా నుంచే ప్రారంభించారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధించి తీరు తామన్న దానికి సిద్ధిపేటలో నీటి పారుదల ప్రాజెక్టును కేసీఆర్ 16 నెలల్లో పూర్తి చేయటమే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. 20 ఏళ్ల క్రితమే ఆనాటి సిద్ధిపేట శాసనసభ్యుడు కేసీఆర్, సిద్ధిపేటకు చెందిన ఇంజనీర్లు కలసి శ్రమించి 185 గ్రామాలకు దాహార్తి తీర్చగలిగారు. అదే స్ఫూర్తితో రాష్ట్రంలో గడపగడపకూ నీరందించే భగీరథ యత్నానికి నేడు శ్రీకారం చుట్టారు. గతంలో తాను పూర్తి చేసిన సిద్ధిపేట నీటి పారు దల ప్రాజెక్టు విషయాన్ని గుర్తు చేసి అధికార యంత్రాంగంలో స్ఫూర్తి కలిగించారు. కేసీఆర్ దార్శనికత నుంచి పుట్టుకొచ్చిన వాటర్ గ్రిడ్ పథకం నాలుగేళ్లలో రూపుదాల్చి దోసిళ్లలోకి మంచినీళ్లు రావటాన్ని ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు. వాటర్ గ్రిడ్ నిర్మాణంలో పాలు పంచుకునే ఇంజనీర్లకు, మొత్తం పాలనా యం త్రాంగానికి, తోటి శాసనసభ్యులకు తన ఆచర ణాత్మక అనుభవాన్ని సీఎం చెబుతున్నారు. ఈ సందర్భంగా దేశంలో ఎక్కడా ఏ నాయకుడూ చేయని ప్రకటనను కూడా కేసీఆర్ ప్రకటిం చారు. రాబోయే నాలుగేళ్లలో గడపగడపకూ మంచినీళ్లు అందించలేకపోతే మాకు ఓట్లెయ్య కండి అని ధైర్యంగా ప్రకటన చేశారు. ఇది సామాన్యమైన ప్రకటన కాదు. పని చేయకపోతే ఓట్లు వెయ్యకండని చెప్పిన నాయకుడిగా కూడా కేసీఆర్ చరిత్రలో మిగిలిపోతాడు. ఈ సంకల్పం నెరవేరితే ఫ్లోరోసిస్ పెనుభూతాన్ని పారదోల వచ్చును. బంగారు తెలంగాణకు ఈ వాటర్ గ్రిడ్ పథకమే తొలిబాటలు వేయాలి. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల విద్య కేసీఆర్ దగ్గరుంది. వాటర్‌గ్రిడ్ పథకం విజయవం తమైతే ప్రజల దోసిళ్లలోకి మంచినీళ్లు వస్తాయి. పథకాలు ప్రజల గొంతులో మంచినీళ్లు కావటం కంటే మించినది మరొకటి లేదు. (వ్యాసకర్త కవి, సీనియర్ జర్నలిస్టు) -
ఆస్పత్రుల్లో కానరాని వైద్య సదుపాయాలు
అవస్థలు పడుతున్న పట్టణ, పల్లె ప్రజలు ..భర్తీకి నోచుకోని వైద్య పోస్టులు.. ఆస్పత్రుల్లో ఉండని వైద్యులు.. వెరసి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం మిథ్యే అవుతోంది. ఏటా ప్రభుత్వాలు లక్షలాది రూపాయలు విడుదల చేస్తున్నా.. పదుల సంఖ్యలో ప్రాణాలు పోతూనే ఉన్నాయి. పీహెచ్‌సీలు.. యూహెచ్‌సీలు.. రౌండ్ ది క్లాక్ ఆస్పత్రులు ఉన్నా ప్రాణాలను నిలబెట్టలేక పోతున్నాయి. వైద్యులు స్థానికంగా అందు బాటులో ఉండి వైద్యం అందించాల్సింది పోయి.. తమకు అనుకూల ప్రదేశాల్లో ఉంటూ రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో రాత్రుల్లో వైద్యం అందని ద్రాక్షలా మారింది. ఫలితంగా రోగుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. జిల్లా ఆస్పత్రులపై ‘సాక్షి’ విజిట్.. ఆరోగ్య కేంద్రాలు అనారోగ్య కేంద్రాలుగా మారుతున్నాయి. రకరకాల శారీరక అవస్థలు, అనారోగ్యాలతో ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యం అందించేందుకు వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. చాలా చోట్ల అవసరానికి తగ్గట్టు వైద్యులు లేరు. ఉన్న అరకొర మంది వైద్యులతో అందీ అందని వైద్యమే ప్రజలకు దిక్కవుతోంది. అది కూడా అతి కష్టంమీద. వైద్యులతో పాటు ఇతర సిబ్బంది కొరత కూడా తీవ్రంగా ఉంది. ఏళ్లుగా చాలా పోస్టులు ఖాళీగానే ఉంటున్నాయి. ఇక.. ఆస్పత్రుల్లో సమస్యలు సరే సరి. చాలా చోట్ల కనీస సౌకర్యాలూ కరువై పోతున్నాయి. బెడ్లున్నా పరుపులుండవు. నల్లాలున్నా నీటి సౌకర్యం ఉండదు. మినరల్ వాటర్ ప్లాంట్లు మరమ్మతులకు నోచడంలేదు. ఇతర విలువైన వైద్య పరికరాలు వినియోగంలోకి రాక నిరుపయోగంగా ఉంటున్నాయి. పలుచోట్ల ఆస్పత్రులు శిథిలావస్థలో ఉన్నాయి.మంగళవారం ‘సాక్షి’ జిల్లావ్యాప్తంగా ఆస్పత్రులను విజిట్ చేయగా ఈ విషయాలు వెలుగుచూశాయి. బేల : ఆదిలాబాద్ నియోజకవర్గంలోని బేల, జైనథ్, అం కోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంగళవారం ఉదయం 9 గంటల నుంచి ‘సాక్షి’ విజిట్ చేయగా రోగులు అంతంతగానే కనిపించారు. బేల(రౌండ్ ది క్లాక్) ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం 9 గం టలకు సిబ్బంది ఎవరూ లేరు. 9 గంటల 20 నిమిషాలకు ఓపీ స్టాఫ్‌నర్సు, 10 గంటలకు ఒక మెడికల్ సూపర్వైజర్, మరో అరగంట తర్వాత వైద్యాధికారి తో పాటు మిగతా సిబ్బంది ఒక్కొక్కరుగా వచ్చారు. రోగులు సైతం వైద్యం కోసం ఉదయం 10:30 గంటల తర్వాతే వచ్చారు. ఈ ఆరోగ్య కేంద్రంలో నాలుగైదు నెలలుగా చెవిపోటు వైద్యం అందుబాటులో లేదని తెలిసింది. జైనథ్ ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో ఆశ వర్కర్ల సమావేశం ఉండడంతో వైద్యాధికారి, సిబ్బంది సమయానికే వచ్చారు. వచ్చిన రోగులకు, చికిత్సలు నిర్వహిస్తూ కనిపించారు. ఇక్కడ ఏళ్లుగా ఓపీ స్టాఫ్‌నర్సు పోస్టు ఖాళీగా ఉండడంతో, ఈ విధులను ఓపీ ఏఎన్ఏం నిర్వహిస్తున్నారు. ఈ పీహెచ్‌సీని రౌండ్ ది క్లాక్గా మార్చాలని స్థానికులు కోరుతున్నారు. అంకోలి(ఆదిలాబాద్) ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం 9.45 గంటలకు వైద్యాధికారి, సిబ్బంది అందుబాటులో ఉన్నారు. నేరడిగొండ : మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు నేరడిగొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రమే దిక్కు. ఇక్కడ ప్రజలకు వైద్యం అందిస్తున్నా అందులో పనిచేస్తున్న ఇద్దరు వైద్యాధికారుల్లో ఒకరు డిప్యుటేషన్‌పై దిలావర్పూర్ మండలం నర్సాపూర్‌కి వెళ్లగా కేంద్రానికి ఒకే వైద్యాధికారి ఉండడంతో ఆయన సెలవుపై వెళ్లినా, గ్రామాల్లో పర్యటించినా ఆ సమయంలో ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యం అందని పరిస్థితి నెలకొంది. దీంతో రోగులు దిక్కుతోచక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. రాత్రి సమయాల్లో గర్భిణుల సేవలకు స్థానిక సిబ్బంది మాత్రమే ఉండడంతో వారికి పూర్తిస్థాయిలో వైద్యం అందకుండా పోతోంది. అయితే గర్భిణుల పరిస్థితి కొన్ని సందర్భాల్లో ఆందోళనకరంగా ఉంటుందని స్థానికులు వాపోతున్నారు. మండల ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్యం అందాలంటే ఆరోగ్యకేంద్రంలో 24 గంటలు సేవలు అందించాలని స్ధానికులు కోరుతున్నారు. ఉన్న ఇద్దరు వైద్యుల్లో ఒకరు డిప్యూటేషన్‌పై వెళ్లడంతో పూర్తిస్థాయిలో వైద్యం అందడంలేదు. ఉన్నతాధికారులు స్పందించి ఆరోగ్య కేంద్రంలో నిరంతర వైద్యసేవలు అందించాలని మండల ప్రజలు కోరుతున్నారు. నిర్మల్ రూరల్ : పట్టణంలోని ప్రసూతి ఆస్పత్రిలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ కొన్ని నెలలుగా నిరుపయోగంగా ఉంటున్నా కనీస మరమ్మతులకు నోచుకోవడంలేదు. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు మంచినీరు కరువైంది. దీంతో రోగులు ఇంటి నుంచి లేదా స్థానిక దుకాణాల నుంచి మినరల్ వాటర్‌ను కొనుక్కుని తాగాల్సిన పరిస్థితి నెలకొంది. లేదంటే పక్కనే ఉన్న బోరింగ్ నీటినే తాగాల్సిన దుస్థితి ఉందని రోగులు వాపోతున్నారు. కొన్నేళ్ల క్రితం 50 పడకలతో ఈ ఆస్పత్రిని ప్రారంభించారు. నిర్మల్ పరిసర ప్రాంతాలతో పాటు ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల ప్రజలు, నేరడిగొండ మండలం, నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల నుంచి కూడా ప్రసూతి ఆస్పత్రికి వైద్యం కోసం వస్తుంటారు. రోజుకు సుమారు 200ల మంది వరకు ఔట్ పేషెంట్లు, అధిక సంఖ్యలో ఇన్‌పేషెంట్లు వైద్య సేవల కోసం ఆస్పత్రికి వస్తారు. దీంతో ఆస్పత్రి ఎప్పుడు కిటకిటలాడుతూనే ఉంటుంది. ఆస్పత్రికి వచ్చే వారి సంఖ్య అధికంగా ఉన్నా సౌకర్యాల కల్పనలో మాత్రం సంబంధిత పాలకులు విఫలమవుతున్నారన్న విమర్శలు వెల్లువె త్తుతున్నాయి. అయినా పాలకుల్లో చలనం కనిపించడం లేదు. కాగజ్‌నగర్ టౌన్ : కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సామాన్య, పేద ప్రజలకు సరైన రీతిలో సౌకర్యాలు అందడం లేదు. పీహెచ్సీ బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకోగా, పీహెచ్సీ ఆవరణలో నిర్మించిన సీమాంక్ సెంటర్లోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నడిపించాల్సిన దుస్థితి ఏర్పడింది. మందుల కొరత తీవ్రంగా ఉండటంతో రోగులు అవసరమైన మందులు దొరకక లబోదిబోమంటున్నారు. సీమాంక్ సెంటర్ నిర్వహణకు 11 స్టాఫ్ నర్సుల సేవలు అవసరం కాగా, ఈ సెంటర్లో ఒక్క పోస్ట్ కూడా భర్తీకి నోచుకోలేదు. సిబ్బంది, పరికరాలు లేక సీమాంక్ సెంటర్ గర్భిణుల పాలిట శాపంగా మారిందని ఫిర్యాదులున్నాయి. అవసరమైన మందులు లభించక ప్రజలు ప్రైవేట్ మెడికల్స్‌లో మందులు కొనుగోలు చేస్తున్నారు. 10 పడకల ఈ ఆస్పత్రిలో ఎప్పుడూ చూసిన రోగులు లేక బెడ్లు వెలవెలబోతున్నాయి. కిందిస్థాయి సిబ్బంది రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.